రామ శబ్దం రం అనే ధాతువునుండి ఏర్పడింది. దీని అర్థం రమించుట, ఆనందపడుట, హాయినిచ్చుట. అయనం అనగా కదలుట, నడచుట, పయనించుట. కాబట్టి రామాయణం అంటే రాముని చలనం, గమనం, స్పందనం అని అర్థం. కాబట్టి రామాయణం అంటే కేవం రాముని కథ కాదు, రాముని నడవడికను సూచించేది అని తేలింది. రామ శబ్దంలోని రమణీయతకు ఆయన శబ్దం కమనీయమైన గమనాన్ని, వేగాన్ని జోడిస్తుంది.
రామాయణంలో ప్రపంచంలో రెండు విధాలైన భౌతిక శక్తుల సమ్మేళన మనకు స్ఫురిస్తుంది - స్థితిజ (potential), గతిజ (kinetic). తదేజతి, తన్నైజతి - అది చలిస్తుంది, చలించదు అనే ఉపనిషత్సూక్తి రామాయణంలో ధ్వనిస్తుంది. నిజానికి రాముడు పుట్టింది మొదలు పట్టాభిషేకం వరకు ఆయన జీవితంలో అయనత్వం, నిరంతర నిర్విరామ నియమనిష్ఠ కనిపిస్తుంది. రాముని జననాన్ని వర్ణించగానే వాల్మీకి మహర్షి అదే సర్గలో విశ్వామిత్రుని ఆగమనాన్ని సూచిస్తాడు. పదహారేండ్లు కూడా నిండని పసివయస్సులో క్రూర రాక్ష సంహారం, యాగ సంరక్షణ, అహల్యా శాపవిమోచనం, శివ ధనుర్భంగం, సీతా స్వయంవరం, పెండ్లి చేసుకు రాగానే అడవులకు పయనం, నానా బాధలు, మహర్షుల మన్ననలు, నెలకో నెలవు. చివరకు పర్ణశాల అంటూ ఒకటి ఏర్పడితే కలలో కూడా ఊహించని సీతాపహరణం, తదుపరి అన్వేషణం, సేతుబంధనం, రావణ సంహారం. ఇలా, ఒక్క క్షణం కూడా జీవితంలో స్థాయి, హాయి లేకుండా సత్య ధర్మాలను మాత్రం వదలకుండా సాగిన రాముని జీవన యాత్ర ఒక గొప్ప ఆయనం. అదే రామాయణం. ఇంతటి సంచలనం, సంక్షోభం జరుగుతున్న రాముడు చలించడు, హిమవత్పర్వతంలా ధైర్యంగా నిలబడి అన్నిటినీ సమర్థించుకుంటాడు. అదే రామాయణంలోని రమణీయత.
మరి రాముడి అయనం రామాయణం కదా? అయితే సీతమ్మదేమీ లేదా అని ప్రశ్నించే వారికి సమాధానం. రామాయణం అన్న దానికి రామస్య అయనం, రామాయాః అయనం అని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. రామా అనగా సీతమ్మ. ఇదే రామాయణ శబ్దంలోని చమత్కారం. వాల్మీకి తన రచనకు పెట్టుకున్న పేరులోని పరమరహస్యం కూడా ఇదే. మరి సీతమ్మను రామా అని ఎందుకు పిలవరు? అన్న ప్రశ్నకు సమాధానం, స్వయంగా వాల్మీకే రామాయణంలో అనేకమార్లు రామా అన్న శబ్దాన్ని అమ్మను సంబోధించటం ద్వారా తెలిపారు. సుమంత్రుడు దశరథునికి సీతాదేవి గురించి చెప్పిన సందర్భంలో:
బాలేవ రమతే సీతా బాలచంద్ర నిభాననా
రామా రామేహ్యదీనాత్మా విజనేऽపి వనే సతీ
బాలచంద్రునివంటి ముఖముతో శోభిల్లుతున్న సీతమ్మ పసిపిల్లలా (బాలాత్రిపురసుందరిలా) మహారణ్యంలో కూడా దైన్యత లేకుండా నిబ్బరంగా సంతోషంగా ఉంది అంటాడు. ఇంతటి శక్తి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? రామ పక్కన రాముడుండగా దిగులెందుకు అంటాడు వాక్యవిశారదుడైన వాల్మీకి. ఇక్కడ రామ శబ్దం రామా శబ్దం వెంట వెంటనే జంటగా కనిపిస్తాయి. అందులో కూడా రామ, తరువాత రాముడు. నిజానికి రామాయణానికి వివరణ రామారామయోరయనం రామాయణం (రామా రాముల అయనమే రామాయణం) అని చెప్పటమే సరైనది.
సీతాదేవికి రామచంద్రుని పేరులోనే కాదు, ,తీరులో కూడా సామ్యముంది. హనుమంతుడు లంకనంతా గాలించి చివరకు అశోకవనంలో సీతాదేవి రూపలావణ్యం చూచి నివ్వెరపోతాడు. కారణం ఆమె అతిలోక సుందరి అయినందుకు కాదు, ఆమె ముమ్మూర్తులా రామచంద్రునిలా కనిపించటం వల్ల. ప్రపంచంలో తోబుట్టువులు, తల్లీ పిల్లలు, తండ్రీ బిడ్డలు ఒకలా ఉండటం సహజం. కానీ, ఇక్కడ భార్యాభర్తలు ఒకే రూపున ఉండటం అనేది విశేషం. అక్కడ రామయ్యను చూసి ఇక్కడ సీతమ్మను చూస్తే ఆ రాముడే స్త్రీ రూపంలో ఉన్నట్లు గమనించిన ఆంజనేయుడు మనస్సులో ఇలా అనుకున్నాడు:
అస్యా దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం
రమస్య చ యథారూపం తస్యేయమసితేక్షణా!
ఆ దేవి నిజరూపం - పోలికలు, అవయవములు, వాటి సౌష్టవం అన్నీ ఆ రాముని రూపానికి ప్రతిరూపంగా అన్నట్టుగా ఉంది.
ఎంత అద్భుతం కదా? ఇది ఎలా సాధ్యమైంది? అదే రామాయణంలోని అద్వైత రససిద్ధి. సీతారాములకు రూపంలోనే కాదు, గుణగణాల్లో, ఆలోచనల్లో, ఆనందంలో, ఆవేదనలో దేనిలో కూడా వ్యత్యాసం లేదు.
అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం
ఆమె మనస్సు ఆయనలో లీనమైనట్టుగానే ఆయన మనస్సు ఆమె మనస్సులో లయించి ఉన్నదట. ఇలా ఒకరికొరికరు బింబ ప్రతిబింబంగా ఉన్న సీతారాముల ఆత్మ మనశ్శరీర సామరస్యాన్ని చూసి హనుమంతుడు స్థంభించిపోతాడు. సీతారాముల మధ్య ఉన్న ఈ అన్యోన్యతను, అభిన్నతను, అనుబంధాన్ని అక్షరరూపంలో నిరూపించటమే రామాయణ పర్మావధి. శ్రీరాముడు పరమాత్మ స్వరూపుడైతే సీతాదేవి పరమాత్మ యందలి పరమ కళ. ఈ కళ ముల్లోకాలకూ మూలాధారాన్ని ప్రసాదిస్తుంది.
రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా
త్రైలోక్య రాజ్యం సకలం సీతాయావాప్నుయాత్ కలాం!
వాల్మీకి మహర్షి యొక్క అంతర్దృష్టి, అంతరార్థం, రామాయణం మహత్తు, సీతారాముల అభేద్య తత్త్వం ఇంతకన్నా విప్పిచెప్పేదేముంది?
"వందే వాల్మీకి కోకిలం"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి