24, జులై 2020, శుక్రవారం

భారమైన వేపమాను పాలువోసి పెంచినాను - అన్నమాచార్యుల వారు


భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదే గాక తీయనుండీనా

పాయదీసి కుక్క తోక బద్దలు వెట్టి బిగిసి నాను
చాయకెంత గట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా

ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యీనా
పంచ మహా పాతకాల బారిబడ్డ చిత్తమిది
దంచి దంచి చెప్పినాను దాగి వంగీనా

కూరిమితో తేలుదెచ్చి కోకలోన బెట్టుకున్నా
సారె సారె కుట్టుగాక చక్కనుండీనా
వేరు లేని మహిమల శ్రీ వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుగోర సోకీనా

తాత్పర్యం:

ఎంతో పెద్దదైన వేపమాను తెచ్చి పాలు పోసి పెంచినా కూడా అది తీర్చలేని చేదు రుచే ఉంటుంది కానీ తీయగా మారుతుందా? పాయలుగా తీసి చెక్కబద్దలు పెట్టి బిగించి కొయ్యకు ఎంత కాలం కట్టినా వంకర పోయి చక్కగా ఉండునా? నీటిలో మరింత ముంచి మడుగున ఎంత నాన బెట్టినా పెద్ద గొడ్డలి ఏనాటికైనా మెత్తబడుతుందా? పంచమహాపాతకాల (బంగారాన్ని దొంగిలించటం, కల్లు తాగటం, గురుపత్నితో సంగమం, బ్రాహ్మణ హత్య, ఇలాంటివి చేసిన వానితో స్నేహం చేయటం) బారిన పడ్డ మనసిది, ఎంత గట్టిగా చెప్పినా మారి తన గుణాన్ని మార్చుకుంటుందా? ఎంతో ప్రేమగా తేలును తీసుకు వచ్చి చీరలో పెట్టుకుంటే మళ్లీ మళ్లీ కుడుతుందే కాని హానిచేయకుండా ఉంటుందా? ఘోరమైన ఆశలు కలిగిన మనసు లోతు తెలియని మహిమలు గల శ్రీవేంకటేశ్వరుని కృపను కోరనిస్తుందా?

వివరణ:

మాయావశమైన చిత్త ప్రవృత్తిని సద్గురువులు ఈ కృతి ద్వారా అన్నమాచార్యుల వారు అద్భుతంగా ఆవిష్కరించారు. వేప సహజ గుణం చేదు. దానికి నీళ్ల బదులు పాలు పోసి పెంచినా ఆ చేదు పోదు. దీనికి సారూప్యం ఏమిటి? మన మనస్సు. దాని సహజ గుణం చేదైనా విషయాలలో మునిగి యుండటం. ఇక్కడ చేదు అంటే రుచి అని కాదు, మనకు శ్రేయస్కరమైనవి కానివి అని. ఏది మనకు శ్రేయస్కరం? పరమాత్మయందు ధ్యాసే. కానీ, అలా నిలువదే మనసు? నిరంతరం పాప విషయ లంపటములలో మునిగి తేలుతూ ఉంటుంది. ఈ విషయాన్నే అన్నమయ్య పల్లవిలో ఆవిష్కరించారు. సహజంగా చెడు గుణాలలో పడే మనసు శ్రేయస్కరమైన వాటి పట్ల దృష్టి కలిగి ఉండదు అనేది ఆయన భావన. దీనిని మూడు చరణాలలో ఉదాహరణల ద్వారా మరింత వివరించారు అన్నమయ్య. వంకరగా ఉన్న కుక్క తోకను ఎంతో ప్రయత్నం చేసి గుంజకు కట్టి సరి చేయాలని చూసినా ఆ వంకర పోదు. అలాగే ఈ మనసు శరీరం వల్ల కలిగే అనేక వికారాల వల్ల స్వాధీనమైనట్లే ఉండి పట్టు విడవగానే మళ్లీ పక్క దారులు తొక్కుతుంది. ఎందుకు అలా? అదే మాయ. ఆ మాయకు ఆ దేహం వశపడుతుంది. తద్వారా మనసు ఆధీనము తప్పి వివిధ నీచ ప్రవృత్తులలో కొట్టుమిట్టాడుతుంది. అలాగే, కఠినమైన లోహముతో చేయబడ్డ గొడ్డలిని ఎన్ని మార్లు ఎంత కాలం నీటిలో ఉంచినా అది మెత్తబడదు. పాషాణమైన దాని గుణాన్ని మనసుతో పోల్చారు అన్నమయ్య. తేలు లక్షణం కుట్టటం. దాన్ని తీసుకు వచ్చి ప్రేమగా అందమైన చీరలో చుడితే అది కుట్టకుండా ఉంటుందా? మనసు కూడా అంతే. ఎన్ని అనుకూల పరిస్థితులు కల్పించినా తన సహజ స్వభావం నుండి మారదు. ఇక్కడ తేలును ప్రస్తావించటానికి రెండు కారణాలు 1. అది బాధ కలిగించేది 2. విషపూరితమైనది. రెండూ కూడా మనకు నిజజీవితంలో విషయలోలత్వం, దుర్జన సాంగత్యం వల్ల కలిగేవి. వీటివల్ల భగవత్కృప అనే అమూల్యమైన వరం పక్కనే ఉన్నా మనసు దానివైపు వెళ్లదు. ఈ సంకీర్తన మనకు అన్నమయ్య మనసు గురించి వాపోతున్నట్లు అనిపించినా, మార్గం పరమాత్మ సాన్నిధ్యమే అని కూడా సందేశం ఇచ్చారు.

సరే. చిత్త చాంచల్యం లేని వారెవరు? అర్జునుడంతటి యోధునికే తప్పలేదు. ఆ వీరుడు పరమాత్మను ఇలా ప్రశ్నించాడు:

యోऽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం
తస్యాహి నిగ్రహం మన్యే వాయోరివ దుష్కరం

ఓ మధుసూదనా! నీవు చెప్పిన యోగము ద్వారా స్థిరత్వము, సమభావమనే స్థితిని నా చంచలత్వం వలన తెలుసుకోలేకున్నాను. ఈ మనసు చాలా చంచలమైనది. బాగా విషయ లోలత్వం చెందేది. మనసు యొక్క ఈ పోకడ చాలా దృఢమైనది, బలీయమైనది. దానిని ఆపటం గాలిని ఆపటంవలె అత్యంత కఠినమైనది.

అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు:

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే

నిజమే మహాబాహువువైన కుంతీపుత్రా! నీవు చెప్పిన దానిలో ఏ మాత్రం సంశయం లేదు. మనస్సు చంచలమైనదే, దానిని నిగ్రహించటం చాలా కష్టం. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యముతో మనస్సును స్వాధీనపరచుకోవచ్చు.

మరి ఏమిటా అభ్యాసం, వైరాగ్యం?

అభ్యాసమనగా నిరంతర సాధన. జ్ఞాన కర్మ భక్తి యోగములలో దేనిలోనైనా, కలిపైనా అభ్యాసము చేయటం. ఇది నిరంతరం అచంచలమైన విశ్వాసంతో జరగాలి. మొదట్లో యాంత్రికమనిపించినా కొన్నళ్ల తరువాత మనసు ఆ పరమాత్మ తత్త్వాన్ని కొద్ది కొద్దిగా గ్రహించి ఆ మార్గంపై విశ్వాసం కలుగుతుంది. ఇది ఒంటరి ప్రయాణం కాకూడదు. తప్పకుండా సద్గురువుల సాంగత్యంలోనే జరగాలి. అహంకారం మనిషి సహజ లక్షణం. దాని నియంత్రణకు స్వశిక్షణ సరైన మార్గం కాదు. గురువు మార్గదర్శకంలో అలవడే శిక్షణ వల్ల అహంకారము తొలగుతుంది. అందుకే మనకు సనాతన ధర్మం గురుతత్త్వాన్ని అనేక విధాల బోధించి ఆ గురు సుశ్రూషలో అభ్యసించమని శ్రుతి స్మృతి పురాణాలలో ఉట్టకించింది.

వైరాగ్యమనగా?

ఏ విషయమైనా కూడా రాగద్వేషరహితుడై ఉండటం. అనగా, మమకారము, ద్వేషము లేకుండా ఉండటం. ఇది ఎలా సాధ్యం? జీవితంలో అనేక మార్లు మనకు తాత్కాలిక వైరాగ్యం కలుగుతుంది. అందులో ముఖ్యమైనవి ప్రసూతి మరియు స్మశాన వైరాగ్యం. జనన మరణాల సమయంలో మనుషులకు తప్పకుండా వైరాగ్యం కలుగుతుంది. ఒకటేమో ప్రసవ సమయంలో ఆ తల్లి పడే ఆవేదన చూసి, మరొకటేమో మనకు ప్రియమైన మరో జీవి దేహాన్ని వీడి వెళ్లటం జీర్ణించుకోలేని విరాగం. రెండూ తాత్కాలికమే. ఇక్కడ పరమాత్మ చెప్పింది నిరంతర వైరాగ్యం. దీనికి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవటం చాలా ముఖ్యం. శాశ్వతమైన ఆత్మ, పరమాత్మల జ్ఞానం, అశాశ్వతమైన దేహము, ప్రపంచము యొక్క అవగాహన కలగాలంటే జీవన ధర్మాలను పాటిస్తూ, గురు సుశ్రూష చేస్తూ అనుభూతులను గమనించి తద్వారా కలిగిన జ్ఞానాన్ని ఆచరించటం చాలా ముఖ్యం. అభ్యాస వైరాగ్యాలు రెండిటికీ క్రమశిక్షణ చాలా అవసరం. ఇవి శమదమాది షడ్గుణాల ద్వారా సఫలమవుతాయి.

అన్నమాచార్యుల వారు పంచమహాపాతకాల గురించి ప్రస్తావించటం ఈ సంకీర్తనలో ఓ ముఖ్యమైన అంశం. అరిషడ్వర్గాల ప్రకోపం వల్ల మనిషి మనసు సంతులన కోల్పోయి చేసేవీ పాతకాలు. ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించే వానికి వీటితో పనిలేదు. ఇవే కాకుండా మనకు తెలిసీ తెలియక అనేక జీవులకు మనం హాని కలిగిస్తూనే ఉంటాము. వీటికి ప్రాయశ్చిత్తంగా మనకు ధర్మం అనేక కర్మలను ప్రస్తావించింది. జీవకారుణ్యం, నిష్ఠగా కర్మానుష్ఠానం, గురు ముఖత జ్ఞానసముపార్జన, నవ విధ భక్తి మార్గాలు మనలను అరిషడ్వర్గాలను నియంత్రించి షడ్గుణ సంపదను పెంపొందించుకునేలా చేస్తాయి. అటువంటి మనోస్థితిని కలిగించమని, తద్వారా పరమాత్మ కృపకు పాత్రులమయ్యేలా చేయమని ఈ కృతి ద్వారా అన్నమయ్య తెలియజేశారు.

శ్రీగురుభ్యోనమః.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి