24, జులై 2020, శుక్రవారం

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప!
నగరాజ ధరుడా! శ్రీ నారాయణా!

దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యమునీయ
నోపక కదా నన్నునొడబరచుచు
పైపైని సంసార బంధముల గట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా!

చీకాకు పడిన నా చిత్తశాంతము సేయ
లేకనా నీవు బహులీల నన్ను
కాకు సేసెదవు బహు కర్మముల బడు వారు
నా కొలది వారలా నారాయణా!

వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను
భవ సాగరముల తడ బడ జేతువా
దివిజేంద్ర వంద్య!` శ్రీ తిరువేంకటాద్రీశ!
నవనీత చోరా! శ్రీ నారాయణా!

ఓ నారాయణా! శ్రుతి స్మృతి పురాణములలో వర్ణించబడిన మనోహరమైన రూపము కలవాడవు, మందర పర్వతమును మోసిన వాడవు! నాకు ప్రకాశించే వైరాగ్య సుఖమును ప్రసాదించక నన్ను ఒప్పించి మరీ మరీ సంసార బంధములలో కట్టివేస్తావు, నా మాటలు చెల్లునా నారాయణా! అశాంతములోనున్న నా మనసును శాంతపరచ గలిగే నీవే నన్ను అనేక లీలలతో మరింత అలజడికి గురిచేసెదవు, అనేక కర్మలలో మునిగియున్న వారితో నాకు పోలికా నారాయణా! ఇంద్రాది దేవతలకు పూజ్యుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! వెన్నను దొంగిలించిన శ్రీకృష్ణా! అనేక పాశముల నుండి నన్ను రక్షించక మరిన్ని భవ సాగరములలో కొట్టుమిట్టాడేలా చేసెదవా నారాయణా!

స్వామి వైభవాన్ని నిత్యం కనులారా గాంచి, ఆయనపై అనేక వేల ఆధ్యాత్మిక శృంగార సంకీర్తనలు రచించి, పరమాత్వ తత్త్వాన్ని అనేక విధాల అనుభూతి చెంది, జీవితంలో మలిదశలో అడుగిడే సమయంలో అన్నమాచార్యుల వారు తనకు శాశ్వత సుఖాన్ని కలిగించే వైరాగ్యాన్ని, ప్రశాంతతను, భవబంధములనుండి ముక్తిని కలిగించమని ఆ శ్రీనివాసుని ఈ సంకీర్తనలో అద్భుతంగా వేడుకున్నారు. సాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, ప్రతి ఒక్క పదం కూడా అర్థవంతమై పరిపూర్ణత్వానికి తోడ్పడేల ఉంటాయి. మానవ జన్మలో పరమాత్మ లీలలే ఈ బంధనాలన్నీ అని మనకు మూడు చరణాలలో అన్నమయ్య ఉదాత్తమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధించారు. అన్నిటికీ సూత్రధారి, అన్నీ తెలిసిన స్వామే తన అంతరంగము తెలుసుకొని ఈ బంధనాల నుండి రక్షించగలడని మనకు మార్గం చూపించారు అన్నమయ్య. అందుకే ఆయన సద్గురువు.

ఓ నమో నారాయణాయ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి