27, ఆగస్టు 2010, శుక్రవారం

మైత్రీం భజత - పరమాచార్యుల రచన

కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి రచన. చూడండి.

నడిచే దైవం పరమాచార్యులు

మైత్రీం భజత అఖిల హ్రుజ్జేత్రీం
ఆత్మవదేవ పరానపి పశ్యత
యుద్ధం త్యజత స్పర్ధా త్యజత
త్యజత పరేష్వ క్రమమాక్రమణం
జననీ ప్రుథివీ కామదుఘాస్తే
జనకో దేవః సకలదయాళుః
దామ్యత దత్త దయధ్వం జనతాః
శ్రేయో భూయాత్ సకలజనానాం

తాత్పర్యం:
అందరి హృదయాలను జయించే మైత్రిని పెంపొందించు. ఇతరులను నీవలెనే చూచుకొనుము. యుద్ధం, పోరు (స్పర్ధ) త్యజించు. ఇతరుల మీద నీ తామస పరాక్రమాన్ని చూపించకు. ఈ జన్మభూమి మన కోర్కెలను తీర్చటానికి సిద్ధంగా ఉంది. అత్యంత దయాళువైన ప్రభువు మనకు తండ్రిగా ఉన్నాడు. ప్రజలారా! దయతో, కరుణతో మీకు చేతనైన సాయం ఇతరులకు చేయండి. మీరందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి.

26, ఆగస్టు 2010, గురువారం

ఉప్పెనంత ఈ ప్రేమకీ - ఆర్య-౨

ప్రేమలో కసి, సున్నితత్వం ఒకే చోట ఉండి, కొంత భావోద్వేగం దారితప్పిన ప్రేమికుడి ప్రేమగీతం ఇది. బాగా ప్రాచుర్యం పొందింది. ఆర్య-2 చిత్రంనుంచి. బాలాజీ సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం, కేకే పాడారు. అల్లు అర్జున్ పాత్రకు బాగా సరిపోయే సాహిత్యం ఈ పాటలో ఉంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు ఈ చిత్రానికి. ప్రతిపాట సూపర్ హిట్. ఆర్య-2 తర్వాత పూర్తిగా వైవిధ్యమైన పాత్రలో వేదంలో బాగా నటించాడుట అర్జున్ (నేను వేదం చిత్రం చూడలేదు).గంగ నుంచి వేదం వరకు చాలా పరిణతి చెందాడు అని చాలా మంది అన్నారు. కొంత షారుఖ్ ఖాన్ ని అనుసరించినట్టు అనిపిస్తుంది నాకు. కానీ, తెలుగులో ఇలాంటి నటన చేసే వాళ్ళు లేరు ఇప్పుడున్న యువతరంలో.

ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె యేమిటో..
చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో..
తియ్యనైన ఈ బాధకి..ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే..విరహం ఎందుకో..
నిన్ను చూసే ఈ కళ్ళకి..లోకమంత ఇంక ఎందుకో..
రెండు అక్షరాల ప్రేమకి..ఇన్ని శిక్షలెందుకో..

ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..
ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..

ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె యేమిటో..
చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో..

కనులలోకొస్తావు..కలలు నరికేస్తావు..
సెకనుకోసారైనా చంపేస్తావు..
మంచులా ఉంటావు..మంట పెడుతుంటావు..
వెంట పడి నా మనసు మసి చేస్తావు..
తీసుకుంటే నువ్వు ఊపిరి..పోసుకుంటా ఆయువే చెలి
గుచ్చుకోకే ముల్లులా మరి..గుండెల్లో సరా సరి

ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..
ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..

ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె యేమిటో..
చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో..

చినుకులే నిను తాకి మెరిసిపోతానందే..
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకు..తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే..నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తూ ఉన్నచోటనే..తోడేస్తా ఆ కళ్లనే..

ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..
ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..
ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..

ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె యేమిటో..
చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో..

21, ఆగస్టు 2010, శనివారం

గాయత్రి మరియు మహా మృత్యుంజయ మంత్ర సారము

గాయత్రీ మంత్రం:

ఓం భూర్భువస్సువః |
తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ |

తాత్పర్యం: ప్రణవ మంత్రంగా, భూః భువః సువః అనే మూడు వ్యాహృతులుగా ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో, సమస్తాన్ని సృష్టించే ఆ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం.


గాయత్రి మంత్రంలో ఉన్న మూడు భాగాలు:

1. మొదటి భాగం ప్రణవ మంత్రమైన ఓం.
2. రెండవ భాగం ప్రణవ మంత్రాన్ని విప్పి చెప్పే భూః, భువః, సువః అనే మూడు వ్యాహృతాలు. ఇవి స్థూల స్థితిలో భూమి, పితృలోకం, దేవలోకాన్ని సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులు - మనసు, శరీరం, ప్రాణం అనే మూడు స్థితులలోను పనిచేసి మన జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.
3. ఇక మూడో భాగం తత్...ప్రచోదయాత్ అనేది సావిత్రీ మంత్రంగా చెప్పబడింది.

మొత్తం మీద, ప్రణవం, వ్యాహృతి, సావిత్రి - ఈ మూడు కలిసిందే గాయత్రి. గాయాతం త్రాయతే ఇతి గాయత్రి - అంటే, జపించేవారిని తరింపజేస్తుంది కాబట్టి ఇది గాయత్రీ అని పేరు పొందింది. ఋగ్వేదంలో చెప్పబడింది.

మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||

తాత్పర్యం: సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!


మరణాన్ని జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండటం అని అర్థం కాదు. శరీరం నుండి ప్రాణం విడివడడం మరణం, దీన్ని బుద్ధిపూర్వకంగా, అంటే, జీవిస్తున్నప్పుడే శరీరాన్ని తనకు భిన్నమైనదని అనుభూతి మూలంగా తెలుసు కోవటమే మరణాన్ని జయించటం.  తాను శరీరం కాదు, దాన్లో నెలకొని ఉన్న నాశనం లేని ఆత్మ అని వైరాగ్య భావనతో జీవిస్తున్న వ్యక్తి తెలుసుకుంటాడు. అతడు మరణాన్ని జయిస్తాడు. అటువంటి స్థితి కోసం ఈ మంత్ర ప్రార్థన.  దోసపండు బాగా పండి ఇక కోయటానికి తయారుగా ఉన్నప్పుడు కాడనుండి చాలా తేలికగా, బాధ లేకుండా విడిపోతుంది. అటువంటి మానసిక స్థితికోసమే ఈ మంత్ర పఠనం. శుక్ల యజుర్వేదంలో చెప్పబడింది.

18, ఆగస్టు 2010, బుధవారం

సామాజిక స్పృహ - మన ఆరోగ్యం

ఇదేమైన మీ ఆట స్థలమా?
రోడ్డు ఏమైనా మీ బాత్రూమా?
మీ ఇల్లు ఇలా ఉంటే మీరు బతుకుతారా?
మనమేమైన ఆటవికులమా?


















మన దైనందిన చర్యలో మనం చేసే కొన్ని తప్పులు మన సమాజాన్ని ఎలా పీడిస్తున్నాయో రాస్తున్నాను:
  1. బహిరంగ ప్రదేశాల్లో (రోడ్లు, ఫుట్ పాత్లు వగైరా వగైరా)  ఉమ్మివేయటం, మూత్ర విసర్జన చెయ్యటం - ఉమ్మి ద్వారా ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమైనవి క్షయ (టీ.బీ), కాలేయ వ్యాధి (హెపటైటిస్). ఇవి భారత దేశ జనాన్ని పట్టి ధనికుడు, పేడ అని లేకుండా పీడిస్తూనే ఉన్నాయి.  మూత్రం ద్వారా కూడా హెపటైటిస్ లాంటి ఎన్నో వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అంతే కాదు, ఈ రెండూ, అతి అపరిశుభ్రతను సూచిస్తాయి. మూత్రం మీద నివసించి, పెరిగే దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్ గన్యా వంటి ఎన్నో విష జ్వరాలు రావచ్చు. ఉమ్మటం, మూత్ర విసర్జన -  ఏ షాపులో ఉన్న బాత్రూం లోనైనా  పూర్తి చేసుకోవచ్చు కదా?. లేకపొతే బయలు దేరేటప్పుడు పూర్తిచేసుకోవచ్చు కదా?. ఉమ్మటానికి రుమాలు వాడుకోవచ్చు కదా?. రుమాలులో  ఉమ్మటం మీకు అపరిశుభ్రం,అసహ్యమైతే, మరి రోడ్డు మీద ఉమ్మితే అది వేరే వాళ్లకు ఎంత అసహ్యం, నీచం కావాలి?.
  2. మన చెత్తను చెత్తకుండీలో కాకుండా బయట రోడ్డు మీద వెయ్యటం - చెత్తలో నానా రకాల సూక్ష్మ క్రిములు ఉంటాయి. వీటివల్ల అన్ని రకాల జబ్బులు (విష జ్వరాలు, రక్త, చర్మ సంబంధమైన వ్యాధులు, డయేరియ, కలరా లాంటివి ఎన్నో) రావచ్చు. చెత్త పారెయ్యటానికి చెత్త కుండీలు, ఇంటి ముందుకు వచ్చి చెత్త తీసుకువెళ్ళే ప్రైవేట్ సర్వీసులు చాలా వచ్చాయి ఇప్పుడు. అవి ఎందుకు వాడరు?. మీ శుభ్రత,ఆరోగ్యం కోసం నెలకు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టలేరా?.
  3.  ఇంటిని, పరిసరాలను పట్టించుకోక పోవటం - ఇంట్లో పాత డబ్బాలు, అవసరానికి మించి నీళ్ళు నిల్వ చేసుకోవటం, మొక్కలున్న ప్రదేశాలను శుభ్రం చెయ్యక పోవటం - వీటి వల్ల మలేరియా, డెంగ్యూ, చికన్ గన్యా వంటి జ్వరాలు ఎన్నో. ఇంట్లో ఎక్కువగా దుమ్ము, ధూళి పెరుకోవటం వలన ఎలర్జీలు, జలుబులు, దగ్గులు, ఆయాసాలు. అవి ముదిరితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు. మీ ఇంటి లోపల, బయట శుభ్రంగా ఉంచుతున్నారా?. రెండు మూడు నెలలకొకసారి ఇంట్లో అవసరం లేని వస్తువులు, చెత్త పారేస్తున్నారా?.
  4. పరిమితులకు మించి శబ్ద కాలుష్యం - మన ఇంట్లో జరిగే పెళ్లిళ్లు వగైరా శుభకార్యాలకు, పూజలకు, ఉత్సవాలకు (వినాయక చవితి, అయ్యప్ప పడి పూజ, క్రిస్మస్ లాంటివి) హోరెత్తించే లౌడ్ స్పీకర్లు పెట్టటం వలన కర్ణభేరి, మెదడులోని కణాలు, కళ్ళలోని కణాలు, నాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. వీటన్నిటికి ప్రభుత్వ అనుమతి, శబ్ద స్థాయికి పరిమితి ఉన్నాయి. అవి పాటిస్తున్నారా?. మీ ఆనందం కోసం మీ పక్కవాళ్ళకు అసౌకర్యం కలిగిస్తారా?.
  5. మన చుట్టూ ఉన్న నీటి వనరులను పూర్తిగా డంప్ యార్డ్స్, మురుగు నీటి నిల్వలుగా మార్చటం, లేకపొతే ఆ స్థలాలను ఆక్రమించటం. ఒకప్పుడు హైదరాబాదులో యాభైకి పైగా మంచినీటి చెరువులు ఉండేవిట. అవి చాలా మటుకు ఆక్రమించి లేక డ్రైనేజీ గా మార్చి ఈ నగరం మంచినీటి కొరకు కృష్ణా,గోదావరి దాక వెళ్ళాల్సిన పరిస్థితి. అంతేకాదు, భూగర్భ జల నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోయింది. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, షామీర్ పేట చెరువు, మియాపూర్ చెరువులు, గండిపేట చెరువు - ఇవన్ని ఈ సమస్య బారిన పాడినవే. 
  6. వాహనాలు నడిపే వాళ్లు - మీ లాగే ప్రతి ఒక్కరు గమ్యానికి ముందు చేరాల్సిన వాళ్లే. మరి వాళ్లకు మీరు ఆ అవకాశం ఇస్తున్నారా?. మీ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నారా?. జామ్ అయినప్పుడు ముందుకు దూరకుండా, దాన్ని పరిష్కరించటానికి సహకరిస్తున్నారా?. రోడ్డు దాటే వారికోసం ఆగుతున్నారా?. అటువైపునుంచి వచ్చే ట్రాఫిక్ కోసం ఉన్న రోడ్డును మీకోసం వాడకుండా వేచి ఉంటున్నారా?. 
 ప్రతిదానికి ప్రభుత్వంపై బాధ్యత మోపటం మనకు బాగా అలవాటు అయ్యింది. పైన చెప్పిన అయిదు పాయింట్లలో పౌరుల బాధ్యతే ఎక్కువ ఉంది. డెబ్భై లక్షల జనాభాకు ప్రభుత్వం ఎంత చెయ్యగలదు?. పౌరులుగా మీ హక్కులతో పాటు బాధ్యతను కూడా నిర్వర్తించాలి కదా?. పైన చెప్పిన విషయాలలో ఒక్కటి కొన్నాళ్ల పాటు పాటించి మీ పక్కన వాళ్ల చేత పాటింప చేయించండి. మన నగరం తప్పకుండా బాగుపడుతుంది. ఇది మన నగరం. దీన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత అందరిదీ.

17, ఆగస్టు 2010, మంగళవారం

క్రీడా స్ఫూర్తి - విజయం - ఏమి చెయ్యాలి?

"అబ్బ, మన వాళ్లు ఇంతే. ఏదో ఒక మ్యాచ్ గెలిచి పది ఓడిపోతారు...". "అసలు మనవాళ్ళు అయిదు రోజుల ఆట ఆడుతున్నారా లేక వన్డే నా?. బ్యాట్ నిలిపి క్రీజ్ లో ఉండలేరు ఎందుకని?. టప టప పడిపోవటమే పేక ముక్కల్లా వికెట్లు".."అబ్బ మనవాళ్ళ ఫీల్డింగ్ ఘోరం..వంగితే నిన్చోలేరు, నించుంటే వంగలేరు".."వాడి సెంచరీ కోసమే కాని మ్యాచ్ గెలిపిద్దాము/కాపాడుదాము అని కాదు"... "అంతా ఆరంభ శూరత్వం సార్. మొదట్లో పేరు రావాలని బాగా ఆడతారు. తర్వాత డబ్బు, పేరు, గుర్తింపు వచ్చేసరికి ఆట మీద శ్రద్ధ పోతుంది"... "ఆ పాకిస్తాన్ వాళ్లు చూడు ఎంత పోరాట పటిమ చూపించారో?. ఎందుకు మనవాళ్ళు ఆ తామసం చూపించరు క్రీడల్లో?"... "అవార్డులు/అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటారు కానీ, ఆటకొస్తే సున్నా"... - ఇదండీ మనం రోజు వినే భారతీయ క్రీడాకారుల మీద ఆరోపణలు.  క్రికెట్ ఒక్కటే కాదు - టెన్నిస్, హాకీ, ఇలా ప్రజాదరణ కలిగిన ప్రతి క్రీడలోను విమర్శ తప్పట్లేదు. ఎందుకని?.
  1. క్రీడాకారులకు శారీరిక, మానసిక దారుఢ్యం తక్కువ - పెరిగే వయస్సులో శరీర సౌష్టవం మీద శ్రద్ధ లేకుండా, నెట్టుకు వచ్చి ఆటలో ఆటుపోట్లు తిని గాయాలకు తల ఒంచుతున్నారు మన క్రీడాకారులు. దీనికి కారణం - వారి వృత్తి అయిన క్రీడకు కావలిసిన శారీరిక శక్తి మీద అవగాహన లేకపోవటం, ఉన్నా, దాన్ని పెంపొందించు కోవటానికి ఇంట్లో వసతులు, జీవన శైలి, బయట వసతులు లేకపోవటం. అంటే - సరైన తిండి, అవగాహన, ప్రేరణ ఉన్న సరైన గురువు, వ్యాయామం చేసే సదుపాయాలు - వ్యాయామశాలలు మరియు వాటికి కావలసిన పరికరాలు. ఇవేవీ పెరిగే వయసులో సరిగ్గా లేక పోవటం శరీరం ఫిట్ గా ఉండకపోవటానికి కారణం.
  2. క్రీడ అనేది జాతీయ జీవన శైలిలో ముఖ్యమైన భాగము కాదు. మనకు ఎంత సేపూ పిల్లలు ఐ.ఐ.టి లో ఎలా చేరాలి, లేక డాక్టర్ ఎలా చెయ్యాలి అనే రంధి తప్ప వారి శారీరిక మానసిక వికాసం పై అవగాహన లేదు, దాని వల్ల ఎంత ఉపయోగమో అంత కన్నా తెలీదు. ట్యాలెంట్ అంటే కేవలం పరీక్షల్లో మార్కులు అన్నది మన నిఘంటువు లో ఉన్న అర్థం. ట్యాలెంట్ లో శారీరిక, మానసిక వికాసం (వాటికి కావలిసిన దారుఢ్యం) లేవు. పిల్లలకు ఆటమీద కన్నా టీవీలో వచ్చే టాం అండ్ జెర్రీ చాలా కిక్కుని ఇస్తుంది. బయటకి వెళ్లి ఆడాలంటే మన పిల్లలకు మహా బాధ. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి వాళ్లు అడిగింది ఇచ్చారు కదా?. జీవితం అంటే శ్రమ అని నేర్పలేదు కదా?
  3. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, నలుగురిలో పరీక్షించబడి, గుర్తించబడి, ప్రోత్సహించబడి ముందుకు వెళ్లి క్రీడను ఒక వృత్తిగా ఎంచుకునే విద్యా వ్యవస్థ, సామాజిక స్పృహ, దృక్పథం లేదు. ఉన్న సదుపాయాలను వాడుకునే జిజ్జ్ఞాస, కుతూహలం, ఉత్సాహం తల్లిదండ్రుల్లో, బాలల్లో, యువతీయువకుల్లో చాలా తక్కువ. మూస చదువులు, మూస ఆలోచనలు.ఒత్తిడిని తట్టుకునే మానసిక శక్తి చిన్న వయసునుంచే రావాలి. అది చాలా తక్కువమంది తల్లిదండ్రులు ఇస్తున్నారు పిల్లలకు. ఇంతకు ముందు తరంలో అసలు లేదు. ఇప్పుడు క్రీడల్లో ఒత్తిడి చాలా ఎక్కువ. దానికి సరిపడే మానసిక ప్రశాంతత, పరిపక్వత క్రీడాకారుల్లో ఉండాలంటే ఎన్నో ఏళ్ళు వారిని కఠోరమైన పరీక్షలకు గురిచేసి, ప్రోత్సాహం ఇచ్చి, వెన్నుదన్నుగా నిలిచే తల్లిదండ్రులు, గురువులు, సమాజం మన దగ్గర లేదు. మనం వికాసం కన్నా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. 
  4. క్రీడాకారుల్లో, అధికారులలో అవినీతి - ఎడారిలో ఆముదం చెట్టులా, మనకున్న గుంపులోంచి ఎన్నుకున్నవాళ్లకు పూర్తి క్రీడా సామర్థ్యం, తమ వృత్తి పట్ల అంకిత  భావం ఉండవు.  దేశలాభం కన్నా స్వలాభం ముఖ్యమనుకునే వ్యాపార ధోరణి. విపరీతమైన డబ్బు కొన్ని క్రీడలకు ఉండటం, మిగతా వాటికి లేకపోవటం. సమతుల్యత లోపించటం వలన చాలా క్రీడల మీద ఉత్సాహం కూడా తగ్గిపోయింది. క్రీడ వ్యవహారాలు చూసుకునే అధికారులు అంతా రాజకీయ నిరుద్యోగులే. దీనితో అవి పూర్తిగా అవినీతి మయం. మన బీ.సి.సి.ఐ, ఐ.పీ.ఎల్, ఐ.హెచ్.ఎఫ్, ఏ.సి.ఏ కుంభకోణాలు వీటికి ఉదాహరణలు. ఇవి కాకపొతే క్రీడాకారుల మ్యాచ్ ఫిక్సింగ్. ఇది అత్యంత దారుణమైనది. ఒక ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో మన సారథి ప్రత్యర్ధి విజయం కోసం డబ్బుకు కక్కుర్తి పడి ఆటను వదులుకున్నాడు అనే ఆరోపణ ఎంత ఘోరమైనది?
  5. విజయం వచ్చినప్పుడు మునగ చెట్టు మనం ఊహించనంత ఎక్కించి, ఒక్క పరాజయం రాగానే కింద పడేసి ఘోరమైన వ్యాసాలు రాసి, టీవీ చానెళ్ళలో భయంకరంగా విమర్శించి చితకబాడే సంస్కృతి. వాళ్లు కూడా మనలాగే మనుషులు, ఓటమి జీవితంలో ఒక సహజమైన భాగమే అన్న భావన లేకపోవటం, పనీ పాటలేని మీడియా చానల్స్ రంధ్రాన్వేషణ చెయ్యటం. క్రీడాకారులకు సరైన సమీక్ష చేసి, వారి లోపాలను సరిదిద్దే వ్యవస్థ, ప్రజలు, మీడియా లేవు. విపరీతమైన వ్యక్తి పూజా, ఆరాధన. ఇది కొంత అవసరమే, కానీ, వాళ్లు కూడా మనుషులే కదా?. సచిన్ చాలా గొప్ప క్రీడా కారుడే. కానీ, అతడిని దేవుడి లాగ పూజించటం వలన అతడు సరిగా ఆడనప్పుడు అతని మీద తీవ్ర విమర్శలు. అతనికి తట్టుకునే పరిపక్వత ఉంది కాబట్టి ఇన్నాళ్ళు నిలిచాడు. సానియా మిర్జా లాంటి వాడు అయితే రెండేళ్లలో క్రికెట్ వాడికి పారిపోయే వాడు.
 మన సానియా మిర్జా సంగతే చూడండి?. - ఆ అమ్మాయికి ఆట కొంత వచ్చు. కాని, ఆట మీద పట్టు, అవగాహన, అనుభవం, విజయాలు రాక ముందే మనం మునగ చెట్టు ఎక్కించి ఎక్కడో కూర్చోబెట్టాము. ఆ అమ్మాయికి మనం ఇచ్చిన గౌరవం, గుర్తింపు చాలా మటుకు ఆ అమ్మాయి సౌన్దర్యానికే తప్ప ఆటకు కాదు.  ఏ ఒక్క ముఖ్యమైన ట్రోఫి గెలవకుండా, ఎటువంటి గుర్తింపును ఇచ్చే విజయాలు లేకుండా, ఆ అమ్మాయిని మీడియాలో తెగ చూపించి, చివరికి మనం పద్మశ్రీ అవార్డ్ కూడా ఇచ్చేశాము. ఏమయ్యింది ఇప్పుడు?. 35 ర్యాంకు నుంచి 150 ర్యాంకుకి దిగజారింది. కామన్వెల్త్ క్రీడల్లో మనదేశం తరపున ఆ అమ్మాయి ఆడే సామర్థ్యం లేకుండా పోయింది. అలాగే, ఎంతో మంది కను మరుగు అయిపోయ్యారు పైన చెప్పిన ఏదో ఒక కారణం వల్ల.

క్రీడాకారులు మారాలంటే, మనం మారాలి. తల్లిదండ్రులు మారాలి, క్రీడా వ్యవస్థలో రాజకీయనాయకులకు స్థానం లేకుండా చెయ్యాలి. క్రీడాకారులను సరైన మోతాదులో విమర్శించాలి, ప్రోత్సహించాలి. అన్ని క్రీడలను గౌరవించాలి, ఆదరించాలి. క్రీడను జీవన విధానంలో ముఖ్యమైన భాగం చెయ్యాలి. చదువుల్లో క్రీడను, దానిలో ప్రతిభను తప్పనిసరి చెయ్యాలి.

జయ కృష్ణా ముకుందా మురారీ

పాండురంగని కథ మనకు తెలిసిందే. నిత్య నూతన వనితా సాంగత్య లాలసుడై, భగవంతుణ్ణి దూషిస్తూ, తల్లిదండ్రులను అగౌరవిస్తూ, ధర్మ పత్నిని తిరస్కరించి, గృహస్థు ధర్మాన్నివిస్మరించి విటుడై సాని ఇంట సమయం గడుపుతున్న పాండురంగడు పరిస్థితులు తారుమారు అయ్యి ఆ పండరిపురం పాండురంగని చెంతకు చేరుతాడు. ఆ రంగని అనుగ్రహంతో కష్టాలను అధిగమించి తల్లిదండ్రులకు మోక్షం కలిగించి, మహా భక్తుడై తాను కూడా ఆ రంగనిలో ఐక్యం అవుతాడు. ఈ కథా సన్నివేశాన్ని 1957 లో పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వర రావు గారు ఎన్.టి.ఆర్, అంజలి, బి.సరోజ, నాగయ్యలతో చిత్రీకరించారు. చిత్రం అద్భుత విజయం సాధించి ప్రేక్షకుల మనస్సులో భక్తి భావాన్ని నింపింది. దీన్నే, ఈ మధ్య బాలకృష్ణ నటనలో రాఘవేంద్ర రావు గారు తిరిగి వెగటుగా, అసహ్యంగా  చిత్రీకరించి ఘోరంగా బోల్తా కొట్టారు. కొన్ని అందుకనే, అసలు అసలుగానే, ఒకటిగానే ఉంచితే మంచిది అన్న పాఠం సినీ నిర్మాతలు, దర్శకులు గుర్తు పెట్టుకుంటే బాగుంటుందేమో?.

పాత చిత్రంలో, పాండురంగడు ఆ శ్రీకృష్ణుని వర్ణనను తన తండ్రికి దృశ్య రూపకంగా చూపిస్తూ ఈ క్రింది పాటను మనకు అందించారు. సముద్రాల గారి రచన, టి.వి.రాజు గారి సంగీతం, ఘంటసాల వారి గళం అన్నీ కలసి అమృతంలా తయారయ్యి మనకు ఒక అద్భుతమైన భక్తి గీతం అందజేశారు. ఆ గీతం మీకోసం.  


పల్లవి
జయ కృష్ణా ముకుందా మురారీ జయ గోవింద బృందా విహారీ |జయ కృష్ణా|

చరణం 1
దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరేయి దాటితివంటా
వెలసితివంటా నందుని ఇంటా వ్రేపల్లె ఇల్లాయెనంటా  |కృష్ణా ముకుందా|

చరణం 2
నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంటా
ఊపున బోయి మాకుల గూలిచి శాపాలు బాపితివంటా  |కృష్ణా ముకుందా|

చరణం 3
అమ్మా! తమ్ముడు మన్ను తినేనూ.. చూడమ్మా! అని రామన్న తెలుపగా
అన్నా! అని చెవి నులిమి యశోద ఏదన్నా! నీ నోరు చూపుమనగా
చూపితివట నీ నోటను, బాపురే! పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాన్చెన్  |కృష్ణా ముకుందా|

చరణం 4
కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ కేళీ ఘటించిన గోపకిశోరా
కంసాది దానవ గర్వాపహార హింసా విదూర పాప విదార  |కృష్ణా ముకుందా|

చరణం 5
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం
గోప స్త్రీ పరివేష్ఠితోం విజయతే గోపాల చూడామణీ

చరణం 6
లలిత లలిత మురళీ స్వరాళీ పులకిత వనపాళీ గోపాళీ పులకిత వనపాళీ
విరళీకృత నవ రాసకేళీ వనమాలీ శిఖిపింఛమౌళీ  |కృష్ణా ముకుందా|

ముగింపు
హే! కృష్ణా! ముకుందా! మురారీ!

14, ఆగస్టు 2010, శనివారం

శ్రీలు పొంగిన జీవగడ్డయి

జయజయజయ జన్మభూమి జయజయోస్తు మాతృభూమి

నా  ఉన్నత పాఠశాల విద్యలో తెలుగు మొదటి భాషగా చదువుకున్నప్పుడు ఈ రాయప్రోలు సుబ్బారావు గారి గేయం చాలా ఆకట్టుకుంది. మా తెలుగు అధ్యాపకురాలు రెంటాల పార్వతీ దేవి గారు చాలా బాగా ఈ గేయం వివరించారు మాకు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే లీడర్ చిత్రంలో ఈ గేయాన్ని మనకు వినిపించారు శేఖర్ కమ్ముల గారు. భారతమాత గొప్పతనాన్ని అచ్చ తేట తెలుగులో రాయప్రోలు వారు మనకు అందించారు.  ఆధునిక నన్నయగా పేరొందిన సుబ్బారావు గారు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించి 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా' లాంటి రోమరోమాలను ఉత్తేజపరిచే దేశభక్తి గీతాలను రచించారు. అందులో ఒకటి ఈ శ్రీలు పొంగిన జీవగడ్డయి. అరవై మూడవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నా తెలుగు సోదరసోదరీమణుల కోసం.

శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!

వేదశాఖలు వెలసెనిచ్చట
ఆది కావ్యంబలరె నిచ్చట
బాదరాయణ పరమఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా!

విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధువొలికెనిచ్చట
విపుల తత్వము విస్తరించగ
విమల తలమిది తమ్ముడా!

పాండవేయుల పదనుకత్తుల
మండి మెరసిన మహితరణకథ
పండగల చిక్కని తెలుంగుల
కలిపి పాడవె చెల్లెలా!

దేశగర్వము దీప్తి చెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!

లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడవె చెల్లెలా!

తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని బొడిచి త్రిళ్ళీ
భంగపడని తెలుంగునాథుల
పాటపాడర తమ్ముడా!

మేలి కిన్నెర మేళవించి
రాళ్లు కరగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత
పథము పాడవె చెల్లెలా!

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...