17, ఆగస్టు 2010, మంగళవారం

జయ కృష్ణా ముకుందా మురారీ

పాండురంగని కథ మనకు తెలిసిందే. నిత్య నూతన వనితా సాంగత్య లాలసుడై, భగవంతుణ్ణి దూషిస్తూ, తల్లిదండ్రులను అగౌరవిస్తూ, ధర్మ పత్నిని తిరస్కరించి, గృహస్థు ధర్మాన్నివిస్మరించి విటుడై సాని ఇంట సమయం గడుపుతున్న పాండురంగడు పరిస్థితులు తారుమారు అయ్యి ఆ పండరిపురం పాండురంగని చెంతకు చేరుతాడు. ఆ రంగని అనుగ్రహంతో కష్టాలను అధిగమించి తల్లిదండ్రులకు మోక్షం కలిగించి, మహా భక్తుడై తాను కూడా ఆ రంగనిలో ఐక్యం అవుతాడు. ఈ కథా సన్నివేశాన్ని 1957 లో పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వర రావు గారు ఎన్.టి.ఆర్, అంజలి, బి.సరోజ, నాగయ్యలతో చిత్రీకరించారు. చిత్రం అద్భుత విజయం సాధించి ప్రేక్షకుల మనస్సులో భక్తి భావాన్ని నింపింది. దీన్నే, ఈ మధ్య బాలకృష్ణ నటనలో రాఘవేంద్ర రావు గారు తిరిగి వెగటుగా, అసహ్యంగా  చిత్రీకరించి ఘోరంగా బోల్తా కొట్టారు. కొన్ని అందుకనే, అసలు అసలుగానే, ఒకటిగానే ఉంచితే మంచిది అన్న పాఠం సినీ నిర్మాతలు, దర్శకులు గుర్తు పెట్టుకుంటే బాగుంటుందేమో?.

పాత చిత్రంలో, పాండురంగడు ఆ శ్రీకృష్ణుని వర్ణనను తన తండ్రికి దృశ్య రూపకంగా చూపిస్తూ ఈ క్రింది పాటను మనకు అందించారు. సముద్రాల గారి రచన, టి.వి.రాజు గారి సంగీతం, ఘంటసాల వారి గళం అన్నీ కలసి అమృతంలా తయారయ్యి మనకు ఒక అద్భుతమైన భక్తి గీతం అందజేశారు. ఆ గీతం మీకోసం.  


పల్లవి
జయ కృష్ణా ముకుందా మురారీ జయ గోవింద బృందా విహారీ |జయ కృష్ణా|

చరణం 1
దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరేయి దాటితివంటా
వెలసితివంటా నందుని ఇంటా వ్రేపల్లె ఇల్లాయెనంటా  |కృష్ణా ముకుందా|

చరణం 2
నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంటా
ఊపున బోయి మాకుల గూలిచి శాపాలు బాపితివంటా  |కృష్ణా ముకుందా|

చరణం 3
అమ్మా! తమ్ముడు మన్ను తినేనూ.. చూడమ్మా! అని రామన్న తెలుపగా
అన్నా! అని చెవి నులిమి యశోద ఏదన్నా! నీ నోరు చూపుమనగా
చూపితివట నీ నోటను, బాపురే! పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాన్చెన్  |కృష్ణా ముకుందా|

చరణం 4
కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ కేళీ ఘటించిన గోపకిశోరా
కంసాది దానవ గర్వాపహార హింసా విదూర పాప విదార  |కృష్ణా ముకుందా|

చరణం 5
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం
గోప స్త్రీ పరివేష్ఠితోం విజయతే గోపాల చూడామణీ

చరణం 6
లలిత లలిత మురళీ స్వరాళీ పులకిత వనపాళీ గోపాళీ పులకిత వనపాళీ
విరళీకృత నవ రాసకేళీ వనమాలీ శిఖిపింఛమౌళీ  |కృష్ణా ముకుందా|

ముగింపు
హే! కృష్ణా! ముకుందా! మురారీ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి