RightClickBlocker

14, ఆగస్టు 2010, శనివారం

శ్రీలు పొంగిన జీవగడ్డయి

జయజయజయ జన్మభూమి జయజయోస్తు మాతృభూమి

నా  ఉన్నత పాఠశాల విద్యలో తెలుగు మొదటి భాషగా చదువుకున్నప్పుడు ఈ రాయప్రోలు సుబ్బారావు గారి గేయం చాలా ఆకట్టుకుంది. మా తెలుగు అధ్యాపకురాలు రెంటాల పార్వతీ దేవి గారు చాలా బాగా ఈ గేయం వివరించారు మాకు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే లీడర్ చిత్రంలో ఈ గేయాన్ని మనకు వినిపించారు శేఖర్ కమ్ముల గారు. భారతమాత గొప్పతనాన్ని అచ్చ తేట తెలుగులో రాయప్రోలు వారు మనకు అందించారు.  ఆధునిక నన్నయగా పేరొందిన సుబ్బారావు గారు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించి 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా' లాంటి రోమరోమాలను ఉత్తేజపరిచే దేశభక్తి గీతాలను రచించారు. అందులో ఒకటి ఈ శ్రీలు పొంగిన జీవగడ్డయి. అరవై మూడవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నా తెలుగు సోదరసోదరీమణుల కోసం.

శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!

వేదశాఖలు వెలసెనిచ్చట
ఆది కావ్యంబలరె నిచ్చట
బాదరాయణ పరమఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా!

విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధువొలికెనిచ్చట
విపుల తత్వము విస్తరించగ
విమల తలమిది తమ్ముడా!

పాండవేయుల పదనుకత్తుల
మండి మెరసిన మహితరణకథ
పండగల చిక్కని తెలుంగుల
కలిపి పాడవె చెల్లెలా!

దేశగర్వము దీప్తి చెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!

లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడవె చెల్లెలా!

తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని బొడిచి త్రిళ్ళీ
భంగపడని తెలుంగునాథుల
పాటపాడర తమ్ముడా!

మేలి కిన్నెర మేళవించి
రాళ్లు కరగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత
పథము పాడవె చెల్లెలా!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి