21, ఆగస్టు 2010, శనివారం

గాయత్రి మరియు మహా మృత్యుంజయ మంత్ర సారము

గాయత్రీ మంత్రం:

ఓం భూర్భువస్సువః |
తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ |

తాత్పర్యం: ప్రణవ మంత్రంగా, భూః భువః సువః అనే మూడు వ్యాహృతులుగా ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో, సమస్తాన్ని సృష్టించే ఆ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం.


గాయత్రి మంత్రంలో ఉన్న మూడు భాగాలు:

1. మొదటి భాగం ప్రణవ మంత్రమైన ఓం.
2. రెండవ భాగం ప్రణవ మంత్రాన్ని విప్పి చెప్పే భూః, భువః, సువః అనే మూడు వ్యాహృతాలు. ఇవి స్థూల స్థితిలో భూమి, పితృలోకం, దేవలోకాన్ని సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులు - మనసు, శరీరం, ప్రాణం అనే మూడు స్థితులలోను పనిచేసి మన జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.
3. ఇక మూడో భాగం తత్...ప్రచోదయాత్ అనేది సావిత్రీ మంత్రంగా చెప్పబడింది.

మొత్తం మీద, ప్రణవం, వ్యాహృతి, సావిత్రి - ఈ మూడు కలిసిందే గాయత్రి. గాయాతం త్రాయతే ఇతి గాయత్రి - అంటే, జపించేవారిని తరింపజేస్తుంది కాబట్టి ఇది గాయత్రీ అని పేరు పొందింది. ఋగ్వేదంలో చెప్పబడింది.

మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||

తాత్పర్యం: సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!


మరణాన్ని జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండటం అని అర్థం కాదు. శరీరం నుండి ప్రాణం విడివడడం మరణం, దీన్ని బుద్ధిపూర్వకంగా, అంటే, జీవిస్తున్నప్పుడే శరీరాన్ని తనకు భిన్నమైనదని అనుభూతి మూలంగా తెలుసు కోవటమే మరణాన్ని జయించటం.  తాను శరీరం కాదు, దాన్లో నెలకొని ఉన్న నాశనం లేని ఆత్మ అని వైరాగ్య భావనతో జీవిస్తున్న వ్యక్తి తెలుసుకుంటాడు. అతడు మరణాన్ని జయిస్తాడు. అటువంటి స్థితి కోసం ఈ మంత్ర ప్రార్థన.  దోసపండు బాగా పండి ఇక కోయటానికి తయారుగా ఉన్నప్పుడు కాడనుండి చాలా తేలికగా, బాధ లేకుండా విడిపోతుంది. అటువంటి మానసిక స్థితికోసమే ఈ మంత్ర పఠనం. శుక్ల యజుర్వేదంలో చెప్పబడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి