25, మే 2015, సోమవారం

అంతర్యామి అలసితి సొలసితి



అన్నమయ్య రచించిన ఒక అద్భుతమైన, భాగగర్భితమైన సంకీర్తనను ఈ వ్యాసంలో పొందుపరస్తున్నాను. చలన చిత్రం ద్వారా బాగా ప్రాచుర్యం పొందిన ఈ సంకీర్తన మానవ జన్మకు ఒక దిశానిర్దేశం చేస్తుంది. అంతర్యామి అలసితి సొలసితి అనే కీర్తన యొక్క పరిశీలన.

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని

కోరిన కోర్కెలు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల పోనీవు నీవు వద్దనక

జనుల సంగముల జక్క రోగములు
నిను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక

మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
యెదుటనే శ్రీ వేంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక

కర్మలు, పాప పుణ్యాలు, మోక్షము వీటి గురించి ఈ సంకీర్తనలో పొందుపరచారు అన్నమాచార్యుల వారు. మానవ జన్మ ఎత్తినందుకు మనం చేయవలసినది ఏమిటి?

కోరికలు అనే అనంతమైన కోయని కట్లను మనం తెంచితే తప్ప అవి తెగవు. పాప పుణ్యాలు రెండూ భారములే. ఎందుకంటే అవి పునర్జన్మకు దారితీస్తాయి. పుణ్యం చేసుకుంటే  సుఖములతో కూడిన దేవ జన్మ కానీ,  మరింత ఉత్కృష్టమైన, సుఖ దుఃఖములతో కూడిన మానవ జన్మ కానీ, పాపము చేసుకుంటే మరిన్ని దుఃఖములతో కూడిన తిర్యక్ జన్మ గానీ తప్పవు. ఈ విధంగా ఎన్నాళ్లు జీవునకు శాశ్వతానందమైన, శాంతికారకమైన పరబ్రహ్మైక్యమునుండి దూరము? అందుకే పాపపుణ్యముల రెండింటినీ ఛేదించవలసినదే.

మన సాగంత్యాలే మన వాసనలు. మన వాసనలే మన దేహానికి రోగములు. చెడు సాంగత్యాలను వద్దనుకుంటే తప్ప మన వాసన ప్రేరిత రోగములు తొలగవు. దైన్యము, కర్మ ఫలములు మన ప్రయత్న పూర్వకముగా శాంతపరిస్తే తప్ప దూరం కావు. దీనికి సత్సాంగత్యము వజ్రాయుధం.

మనసులోని ఆలోచనలు, మాలిన్యాలు ఎంతో బరువైనవి. మనం ప్రయత్నం చేస్తే తప్ప అవి వదలవు. కలియుగంలో మన పాప సంచయాన్ని ముడుపు రూపంలో, అహంకారాన్ని శిరోముండనం రూపంలో, భావ కాలుష్యాన్ని నామ సంకీర్తన ద్వారా తొలగించుకోవటానికి పరమాత్మ వడ్డీ కాసులవాడుగా అవతరించి మన ఎదుట నిలిచాడు. తన అశేష గుణ విభవముల చాటే సంకీర్తనలను జనావళికి అందజేయమని తన నందకాన్ని అన్నమయ్య రూపంలో పంపించాడు.

వేల సంకీర్తనల ద్వారా వేవేల అవకాశాలు మానవుడికి తనను తాను ఉద్ధరించుకోవటానికి...ఒక్క దానిని గట్టిగా పట్టుకొని సద్వినియోగం చేసుకుంటే చాలు ఈ జన్మకు సార్థకత. ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ! మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేల నరకకూపముల వెడలించ! అన్నీ ఆయనకే వదిలేసి ఒక్కసారి హరీ అని పలికి చూడండి! మీలో మీకు వేయి ఏనుగుల బలం వస్తుంది! కానీ, అలా అనగలగాలంటే చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధికి కర్తవ్యపాలన, భగవంతుని పట్ల శరణాగతి తప్పనిసరి.

అన్నమయ్య కీర్తనలు ఎన్నో జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని, పరమావధిని సుస్పష్టంగా, మన భాషలో తెలిపాయి. అందులో ఈ అంతర్యామి అలసితి ఒకటి. భావము అర్థం చేసుకొని మన అభ్యున్నతికి సద్వినియోగం చెసుకుంటే ఒక్కొక్క కీర్తన పరమ పదము వైపు ఒక సోపానము. ఈ సంకీర్తన అన్నమయ్య చలనచిత్రం నుండి.

ఓం నమో వేంకటేశాయ!


24, మే 2015, ఆదివారం

జిల్లెళ్లమూడి. మాతృశ్రీ అనసూయమాత

జయహో మాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి!!


ఒక్కొక్క యోగికి, అవతారమూర్తికి ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణముంటుంది. నాలుగేళ్లనాడు మేము గుంటూరు జిల్లా పొన్నూరు ఆంజనేయస్వామిని, భావనారాయణస్వామిని, బాపట్ల భావనారాయణస్వామిని, స్వామి బ్రహ్మానందతీర్థుల వారి శంకర విద్యాలయమనే వేదపాఠశాలను, అక్కడి రామకృష్ణ సమాజ వ్యవస్థాపకులు స్వామి అనుభవానంద ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడినుండి గుంటూరు తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. మధ్యాహ్న సమయము, ఆకలి. ఎక్కడ భోజనము చెయ్యాలా అని ఆలోచిస్తూంటే పచ్చని వరి పొలాలు వేల ఎకరాలలో, అద్భుతమైన మబ్బులు పట్టిన వాతావరణంలో జిల్లెళ్లమూడి అనే గ్రామం పేరు కనిపించింది. అప్పటికే చిన్ననాటి విషయ సాంగత్యం వలన ఆ వూరి పేరు స్మృతిలో ఉంది కాబట్టి 'జిల్లెళ్లమూడి అమ్మ' ఆశ్రమానికి వెళదాం అని నిర్ణయించుకొని ఆ దారి పట్టాము.



కారు ఆశ్రమం వైపు వెళుతూ ఉంటే మన అమ్మ భోజనానికి రండి అని ఎంత ప్రేమగా అన్నపూర్ణలా పిలుస్తుందో అలా ఆ జిల్లెళ్లమూడి అమ్మ పిలిచినట్లు అనిపించింది. ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే సువాసినులతో కళకళలాడుతూ కోటి లలిత పారాయణ జరుగుతున్నది. ధర్మకర్తలు 'ముందు దర్శనం చేసుకొని భోజనం చేయండి' అని అప్యాయంగా పరి పరి విధాల చెప్పారు. అనసూయేశ్వరి మందిరాన్ని, హైమ మందిరాన్ని, అక్కడి విశాలమైన సభా ప్రాంగణాన్ని చూసి అలౌకికమైన అనుభూతిని పొందాము. తరువాత అక్కడ అన్నపూర్ణాలయంలో వారి అన్నదాన కార్యక్రమంలో భోజనం చేశాము. ఆ ఏర్పాట్లు అద్భుతం ఆ అనుభూతి చెప్పలేనిది. ప్రేమగా అమ్మ చేతితో అన్నం పెడితే ఎలా అనిపిస్తుందో అలాంటిదే చవిచూసాము. అక్కడి భోజనం తయారు చేసే వసతులు, అమ్మ భక్తుల భక్తి తత్పరత, సేవా నిరతి అమోఘం. అనుక్షణం దివ్యత్వాన్ని, అనురాగాన్ని అనుభూతి చెందాము.



తరువాత ఇంటికి వచ్చి అమ్మ గురించి కొంత పరిశోధన చేశాను. ఆధ్యాత్మికంగా అమ్మ ఎంతటి మహిమాన్విత ప్రకాశినో, ఎంతటి తేజోవిలాసినో, ఎంతటి కరుణామయో, ఎంతటి ప్రేమమూర్తో, యోగినో అర్థమయ్యింది. ఏ వసతులూ లేని రోజుల్లో లక్షలాది మందికి ఒకే మారు అన్నదానం చేసిన అన్నపూర్ణ ఈ అనసూయమాత. మహామహులైన యోగులు పూర్ణానంద స్వామి, కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వాములు మొదలైన వారికి గురుతుల్యులు అమ్మ.

అమ్మ మాతృశ్రీ విద్యా పరిషత్ అనే అద్బుతమైన విద్యా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా సంస్కృత భాషకు ఎనలేని సేవను అందిచే ఏర్పాట్లు చేశారు. విశ్వజననీ పరిషత్తు ద్వారా పేదలకు చుట్టుపక్క గ్రామ వాసులకు, వైద్య, విద్య మరియు ఇతర సామాజిక సేవలను అందిస్తున్నారు.

అమ్మ మహిమలు అనంతం. అమ్మ ప్రేమ అనిర్వచనీయం. అమ్మ కరుణ అసమానం. అమ్మ వాత్సల్యం అమృతతుల్యం. అమ్మ భక్తులకు ఆమె సర్వస్వం. ఎందరో మహానుభావులకు ఆమె ఆధ్యాత్మిక దర్శని. ఇప్పటికీ యోగులతో దివ్యదేహంతో అమ్మ మాట్లాడుతునే ఉంది.

అమ్మ ఎక్కడ ఉందో అక్కడ పాడిపంటలు సస్యశ్యామలము. ఆ ప్రాంతం శాంతికి నిలయం. అమ్మ వాక్కులు మార్గనిర్దేశకాలు. నిత్యం అశాంతి, స్పర్థలలో మునిగి తేలేవారికి ఈ అనసూయామాత మందిరం మరియు ఆ ఆశ్రమ పరిసరాలు సాంత్వననిచ్చే దివ్యౌషధము. అమ్మ 20వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ లో అవతరించిన అమ్మలగన్న అమ్మ. ఆ రాజరాజేశ్వరి రూపమే అమ్మ. ఆమె కరుణారసమే అమ్మ చూపులు.



నిత్యానందకరీ వరాభయకరీ అని మనం కొలిచే అన్నపూర్ణ స్వరూపిణి అయిన ఆ ఆదిపరాశక్తే ఈ అనసూయమాతగా జిల్లెళ్లమూడిలో వెలసింది. మహావైభవంగా సాగిన ఆమె భౌతిక అవతారం 1985 సంవత్సరంలో ముగిసినా, ఇప్పటికీ అమ్మ భక్తుల ద్వారా అమ్మ ఆధ్యాత్మిక సౌరభాలను, అదే ప్రేమ, వాత్సల్యం, కరుణలను అందిస్తూనే ఉంది. అమ్మ గురించి తెలుసుకోదలచిన వారు విశ్వజనని ట్రస్టు ముద్రించిన 'అమ్మ జీవిత మహోదధి' అనే గ్రంథాన్ని చదువవచ్చు. అంతర్జాలంలో కూడా చాలా వివరంగా అమ్మ గురించిన విషయాలను భక్తులు పొందుపరచారు.

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి సాధకుడు తప్పక చూడవలసిన క్షేత్రం జిల్లెళ్లమూడి. రైలులో వెళితే బాపట్ల స్టేషనులో దిగి వెళ్లవచ్చు. బాపట్ల నుండి జిల్లెళ్లమూడి 15 కిలోమీట్లర్ల దూరం. గుంటూరు నుండి 52 కి.మీ, విజయవాడ నుండి 87 కి.మీ.  మాతృశ్రీ అనసూయమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు!!

http://www.jillellamudiamma.org/svjp/
http://www.jillellamudiamma.org/svjp/images/mdc_book_annapurnalayam.pdf
www.viswajanani.org
www.motherofall.org


జయహో మాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి!

23, మే 2015, శనివారం

రామ-వాలి సంవాదం.

రామ-వాలి సంవాదం




తదేతత్ కారణమ్ పశ్య యదర్థం త్వం మయా హతః
భ్రాతుర్ వర్తసి భార్యాయామ్ న్యక్త్వా ధర్మమ్ సనాతనమ్

అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః
రుమాయామ్ వర్తసే కామాత్ స్నుషాయాం పాప కర్మకృత్

న హి ధర్మ విరుద్ధస్య లోక వృత్తాత్ అపేయుషః
దండాత్ అన్యత్ర పశ్యామి నిగ్రహమ్ హరి యూథప

ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య యః
ప్రచరేర నరః కామాత్ తస్య ధండో వధః స్మృతః

యాంతి రాజర్షయశ్చాత్ర మృగయాం ధర్మకోవిదాః
తస్మాత్ త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానరా
ఆయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాచ్ఛాఖామృగో హ్యసి


"నిన్ను నేను హతము చేయుటకు కారణము గ్రహించు - నీవు సోదరుని పత్నితో అధర్మంగా వ్యవహరించావు.

సుగ్రీవుడు బ్రతికి యుండగా, నీ నీచమైన ఆలోచనలతో, కామంతో నువ్వు నీకు కోడలి సమానమైన సుగ్రీవ పత్నియైన రుమ పట్ల అనుచితంగా వ్యవహరించావు.

సమాజ విరుద్ధంగా, ఆచారాలను కాలరాసి ప్రవర్తించే వ్యక్తులపట్ల నేను ఎటువంటి నిగ్రహమూ చూపను. వారికి శిక్ష తప్పదు.

కూతురు, సోదరి, సోదరుని భార్య - వీరియెడ కామాతురుడై ప్రవర్తించిన వానిని వధించుటయే తగిన శిక్ష అని ధర్మ శాస్త్రము పేర్కొనుచున్నది.

వానరా! బాగుగా ధర్మము తెలిసిన మహరాజులు కూడా వేటాడుచుందురు. కనుక నిన్ను యుద్ధమున బాణము వేసి వధించితిని. నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను, చేయకున్నను చాటున వధించుటలో తప్పు లేదు. ఏలననగా నీవు శాఖామృగానివి (కొమ్మలపై, చాటున ఉండే జంతువు). "

- వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణాంతర్గత కిష్కింధ కాండలో రామ-వాలి సంవాదం.

వాలి అతి బలసంపన్నుడు. రావణబ్రహ్మనే ఓడించిన మహాబలశాలి. అన్నివిద్యలు నేర్చిన పండితుడు. వానరమూకకు రాజు. కానీ, కామాంధుడై సోదరుని పత్ని పట్ల అనుచితంగా వ్యవహరించటం, దానిని సరిదిద్దుకొనక తామసంతో వ్యవహరించటం వలన ధర్మమూర్తియైన రామచంద్రుని చేత చెట్టుచాటు నుండి చంపబడ్డాడు. ఇక్కడ రాముడు ఒక ముఖ్యమైన విషయాన్ని వాలికి చెబుతాడు.

మానవునికి ముగ్గురు పితృసమానులు - తండ్రి, అన్న మరియు గురువు. ఈ విధంగా పుత్రసమానుడైన సుగ్రీవునికి అన్యాయం చేసిన వాలి శిక్షార్హుడు అన్న విషయాన్ని కుండలు బద్దలు కొట్టి చెప్పాడు రాముడు. అధర్మాన్ని సహించేది లేదని తేల్చి చెప్పాడు. అన్నీ చెప్పి, నీవంటే నాకు ద్వేషము లేదు అని మరల హితవాక్యములు పలుకుతాడు. అతను చేసిన పాపములు ఈ విధముగా శిక్షను అనుభవించుట ద్వారా పాపరహితుడైనాడని తెలుపుతాడు, తార, అంగదుల గురించి దిగులు పడిన వాలికి వారి భవిష్యత్తును గురించి సాంత్వన కలిగిస్తాడు, వాలి తన అజ్ఞానాన్ని తెలుసుకొని పశ్చాత్తాప పడి రాముని మన్నింపమని వేడుకుంటాడు. రాముడు అతనిని అనుగ్రహించి, అతనికి ఉత్తమ గతులు కలిగేలా చేస్తాడు.

రామో విగ్రహవాన్ ధర్మః. అధర్మాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఆచరించడు. వాలిని అన్యాయంగా చెట్టు చాటునుండి రాముడు చంపాడు అనే అజ్ఞానులకు ఈ పై శ్లోకాలను, అర్థాన్ని వివరించండి. రామాయణాన్ని చదువకుండా అందులోని ధర్మమూర్తులను నిందించి, మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే వారి అహంకారపు మాటలను ఎదుర్కోండి.

సోదరుల పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా వ్యవహరించే దుష్టులందరికీ ఇదే గతి తప్పదు.

22, మే 2015, శుక్రవారం

రామ నీల మేఘ శ్యామ కోదండరామ


రామ నీల మేఘ శ్యామ కోదండరామ


జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం
-  శ్రీరామకర్ణామృతం

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

తల్లితండ్రి గురువు నీవే తోడు నీడ నీవే
ధరణినెల్ల పాలన చేసే పరంజ్యోతివే
జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగ రావయ్య
తెలియ తరమా పలుక వశమా నీదు మహిమ రాఘవా

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

రాతినైన నాతిని జేసే నీ దివ్య పాదము
కోతినైన జ్ఞానిని చేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా
నీదు చరణం పాప హరణం మాకు శరణం రాఘవా

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

- శ్రీ గబ్బి వేంకటరావు గారు (రామాంజనేయ యుద్ధం చలన చిత్రానికి రాసిన పాట)


రాముని నుతి హనుమ నోట వస్తే అది భక్తి పూరితమై, శరణాగతిని పరిపూర్ణంగా కలిగిన అర్చనగా నిలుస్తుంది. రామభక్తికి సామ్రాజ్యానికి దొర హనుమంతుడు అని పాలగుమ్మి విశ్వనాథం గారు హనుమంతుని వైశిష్ట్యాన్ని మనకు నాలుగు పదాలలో చెప్పారు. ఆ హనుమంతుని నోట రామస్తుతి ఈ రామాంజనేయ చిత్రంలోని పాట. గబ్బిట వేంకటరావు గారు రచించిన ఈ గీతాన్ని కొత్త రఘురామయ్య గారు ఎంతో భక్తితో పాడారు.

పాట ముందు రామ మంత్ర మహిమను శ్లోకం ద్వారా మనకు తెలియ జేశారు. ఈ శ్లోకం  శ్రీరామకర్ణామృతం  లోనిది.

అర్థం:

జన్మకు సాఫల్యాన్ని ఇచ్చే మంత్రము, జనన మరణాల వలన కలిగే దుఃఖము, కష్టములను నాశనం చేసే మంత్రం, సమస్త వేద వాజ్ఞమయము మరియు శాస్త్రముల సారమైన ఏకైక మంత్రం రఘుపతి నిజమంత్రమైన రామ రామ అనే మంత్రం.దానికి జయము జయము.

గీతం యొక్క భావం:

రామా! నల్లని మేఘములు వంటి శరీర ఛాయ కలిగి, కోదండమును ధరించిన రామా ! రఘుకులమనే సాగరానికి చంద్రుని వంటి రామా ! పరమాత్మా! సార్వభౌమా!

రఘురామా! రామా! రామా! రఘురామా! జయరామా! రామా! రామా! జయరామా!

తల్లి, తండ్రి, గురువు నీవే! తోడు నీడ నీవే! ఈ భూమినంతిటినీ పాలించే సర్వేశ్వరుడివే! ఇంక ఆలస్యము చాలు రామయ్య! దాసులను బ్రోవటానికి రావయ్యా! నీ మహిమ పరిపూర్ణంగా తెలియుట ఎవరికి తరము? పలుకుటకు ఎవరికి వశము? ఓ రాఘవా!

చలనరహితమై రాయిగా మారిన అహల్యను చైతన్యపూరితం చేసింది నీ పవిత్రమైన పాదము. చంచలత్వం కలిగిన కోతిని కూడా జ్ఞాని చేసింది నీ తీయని నామము. నీకు సాటి దైవము లేరయ్యా! నిన్ను నేను నమ్మినాను రామయ్యా! నీ పాదాలే మా పాపములను హరిస్తాయి, అవే మాకు శరణం రాఘవా!

ఈ మంత్ర సారం, మహిమ హనుమంతుని కన్నా ఎవరికి తెలుస్తుంది? మహా జ్ఞాని, అతి బలవంతుడు, మాటల నేర్పరి, మహా భక్తుడు, వినయ సంపన్నుడు, సమయస్ఫూర్తి కలవాడు, రాజుకు నమ్మిన బంటు, ప్రభువుకు ఉత్తమ సేవకుడు...ఇలా ఎన్నో సుగుణాలు హనుమకు రామ నామము వలన కలిగాయి. హనుమంతుని నుండి నేటి సద్గురువుల వరకు తారక రామ మంత్రముతో తరించిన వారే.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకానజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం

ఎక్కడెక్కడైతే రాముని నామ సంకీర్తనం జరుగుతుందో అక్కడ శిరసువంచి అంజలి ఘటించి, ఆనంద బాష్పాలు నిండిన కనులతో నిలిచి ఉండే రాక్షాసంతకుడైన మారుతిని ధ్యానిస్తున్నాను.

ఈ శ్లోకం హనుమ ప్రగాఢమైన రామభక్తిని చక్కగా సూచిస్తుంది. రాముని నామం పలుకబడే ప్రతిచోటా హనుమ ఉంటాడట. ఆ నామస్మరణలో తనను తాను మరిచే నిజభక్తుడు హనుమ. అటువంటి హనుమ రాముని గురించి పాడితే ఎలా ఉండాలో అలాంటి గీతమే అందించారు గబ్బిత వేంకటరావు గారు.

కవి హనుమ హృదయంలోని భావనను ఎంత హృద్యంగా, వీనులకు విందుగా సర్వస్యశరణాగతితో వ్యక్తపరచారు. పరమాత్మ పాదాలు శరణు అని పరిపూర్ణంగా  భావించేవాడు  నిత్యం వచ్చే సమస్యలతో పాటు జనన మరణాలకు సంబంధించ బాధలను కూడా అవలీలగా దాటగలడు అన్నది సారాంశం. తల్లి తండ్రి గురువు నీవే అని భావించాలంటే పరమాత్మను అన్నిటా దర్శించగలిగే స్థాయికి ఎదగాలి. దానికి కఠోరమైన సాధనతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రుల విలువ, గురువల ప్రాధాన్యత తెలిసి ఉండాలి. దీనికి తదనుగుణమైన పెంపకం ఎంతో అవసరం. పరమాత్మ సర్వేశ్వరుడని భావించటానికి అన్నిటి పట్ల సమభావం కలగాలి. అజ్ఞానాన్ని తొలగించే గురువులు కావాలి. అన్నిటికీ నీవే దిక్కు అన్న భావనతో కొలిచే భక్తునికి ఆయన మహిమలు అనంతముగా, నిరంతరముగా ప్రవహిస్తాయి. అదే ఇక్కడ హనుమకు కలిగిన భావన.

భర్త శాపవశాత్తు శిలయైన అహల్య నిర్దోషి. కానీ, ఇంద్రుడు గౌతముని తపమునకు భంగము కలిగించే సంకల్పంలో అహల్య ఒక పాత్రధారియై వేల ఏళ్ల పాటు శిలగా నిలుస్తుంది. అటువంటి అహల్యను తిరిగి చైతన్యవంతమైన ఋషిపత్నిగా చేసింది రామ పాదం. అలాగే వానర సమూహంలో తన శక్తిని తెలియక ఉన్న హనుమను, ఇతర వానరములను జ్ఞానులుగా చేసింది రామ నామం. అజ్ఞాన తిమిరాంధకారములనుండి జ్ఞానసుధారసం వైపు తీసుకు వెళ్లింది ఈ రామ నామం. ఈ భావనను ఎంతో చక్కగా ప్రస్తావించారు కవి. హనుమ హృదయాన్ని మన ముందు ఆవిష్కరించారు. అందుకే ఈ గీతం అజరామరమైంది. బీ. గోపాలం గారు అదే రీతిలో సంగీతం అందించగా కొత్త రఘురామయ్య గారు శ్రావ్యంగా పాడారు. రంగస్థల కళాకారులైన వీరు తమ గొంతులోని మాధుర్యాన్ని భక్తి భావంలో మేళవించి గీతానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

ఇక్కడ ఆర్జా జనార్దనరావు గారి గురించి చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్రాలలో హనుమ అంటే ఆయనే అనేలా ఎన్నో చిత్రాలలో ఆంజనేయుడిగా నటించారు. దేహ సౌష్ఠవం కలిగిన ఆయన లవ కుశ, శ్రీకృష్ణావతారం, రామాంజనేయ యుద్ధం, వీరాంజనేయ, ఆంజనేయ చరిత్ర, సంపూర్ణ రామాయణం, త్యాగయ్య వంటి ఎన్నో చిత్రాలలో హనుమంతునిగా నటించాడు. ఆయన కనులలో భక్తి, వానర లక్షణాలు, నటనలో బుద్ధిర్బల యశోధైర్యాలు అద్భుతంగా పండించేవారు. ఆయనను చూస్తే హనుమ రూపం కళ్లకు కనబడినట్లే. ఈ గీతంలో ఆర్జా జనార్దన రావు గారు భక్తిపూరితమైన నటన అనుపమానం. అందుకే ఈ గీతం పరిపూర్ణతను పొందింది.

కొత్త రఘురామయ్య గారి గళంలో ఈ పాట వినండి.



21, మే 2015, గురువారం

హనుమత్ సేవిత నిజ పద రాం!

హనుమత్ సేవిత నిజ పద రాం!



పరిపూర్ణమైన స్వామి భక్తి, శరణాగతి మరియు ప్రభువు పట్ల ప్రగాఢ విశ్వాసమున్న హనుమంతుని వంటి భక్తుడు కలిగిన రాముడు, సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమైన రాముని వంటి దైవము యొక్క అనుగ్రహము కలిగిన హనుమంతుడు...ఈ ఇరువురి సంబంధం అనిర్వచనీయం, అపూర్వం. రోమ రోమమున రామ నామము ఆ భక్తుని లక్షణమైతే ఈ బంటు భక్తులను వెన్నంటి కాచే ప్రభుత ఆ స్వామిది....సుందరమైన ఈ బాంధవ్యం భక్తి-కరుణలకు ప్రామాణికం, తలమానికం. దాసోహం కోసలేంద్రస్య అని ఆ భక్తుడు తలచితే హనుమంతుని వంటి భక్తుడు మరొకడు లేడు అని ఆ ప్రభువు పొగడాడు. లక్ష్మణుడి ప్రాణాల కోసం సంజీవనిని తెచ్చినా, సీతమ్మ కోసం భీకరమైన లంకను దహనం చేసినా, రామ కార్యం కోసం శతయోజనాలు దాటినా, అన్నీ ప్రభు భక్తి కోసమే. రామ కార్యమే జీవనోపాధి, పరమావధి. అమ్మ సీతమ్మకు హనుమను చూస్తే అవ్యాజమైన మాతృప్రేమ. రామునికి కూడా హనుమ అంటే అమితమైన కరుణ వాత్సల్యము. అందుకే ఏకంగా ఆ భక్తుని హృదయంలో నివసించాడు.

సీతాన్వేషణ మొదలు రామపట్టాభిషేకము వరకూ హనుమంతుడు చేసిన ప్రతికార్యమూ రామనామ స్మరణతోనే. లంకలో వెదకి వెదకి అమ్మ జాడ దొరకక నిస్పృహకు గురై హనుమ విపరీతమైన ఆలోచనలోకి వెళుతుంటే రామనామ స్మరణతో  ఎక్కడ లేని మనో ధైర్యము, కార్యసిద్ధిపై ఉత్సుకత, విశ్వాసం కలిగాయి. హనుమంతునికి శుభశకునాలు కనిపించాయి. సంకల్పం గట్టిదై నోటినుండి అద్భుతమైన మంత్రాలు వెలువడ్డాయి.

నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యేచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః

"రామునికి, లక్ష్మణునికి, సీతమ్మకు, శివునికి, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునకు, సూర్యచంద్రులకు, మరుత్ గణాలకు నమస్కారము". అంతే! ఆయనకు ఆశోకవనము, సీతమ్మ జాడ తెలుస్తాయి. ఇక హనుమంతునికి ఎదురులేదు. అమ్మను కలిసి రాముని గుణగణములను, తాను వచ్చిన కార్యమును వివరించి, అమ్మకు సాంత్వన కలిగిస్తాడు. ఉత్సాహంతో ప్రమదావనాన్ని నాశనం చేసి రావణునికి హెచ్చరిక చేస్తాడు.


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః

అర్థయిత్వాం పురీం లంకాం అభివాద్య చ మైథిలీం
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం


"అతిబలుడైన రామునికి, మహాబలుడైన లక్ష్మణునికి, రామునిచే కాపాడబడిన సుగ్రీవునికి జయము జయము. వేయిమంది రావణులు వచ్చినా వారిని శిలలతోను, వృక్షములతోను ఎదుర్కొంటాను. రాక్షసులందరూ నిస్సహాయులై చూస్తుండగా, లంకను జయించి, సీతమ్మకు అభివాదం చేసిన తరువాతే ఇక్కడినుండి వెళతాను."

ఇదీ హనుమంతునికి రామునిపై గల విశ్వాసము, భక్తి, నమ్మకము. దాని ఫలితమే అతని కార్యసిద్ధి. యుధ్దంలోనూ, సంజీవని తీసుకురావటం లోనూ, రామనామమే అతనికి తారకము. రాముని పాదముల వద్ద నిలిచి, సేవించి, మనసులో ధ్యానించి, లోకవంద్యుడైనాడు హనుమ. రామభక్తి అతనిని భవిష్యత్ బ్రహ్మను చేసింది.
సీతమ్మ జాడను తీసుకొని రాముని వద్దకు వెళ్లి అమ్మ క్షేమంగా ఉన్నది అన్న వార్త తెలుపగానే రాముడు "హనుమంతుడు సీతాన్వేషణలో సాధించిన కార్యములు లోకములోనే అత్యద్భుతమైనవి, ఊహకు అందనివి, అనితర సాధ్యమైనవి. గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు తప్ప వేరేవ్వరూ ఈ సాగరాన్ని దాటలేరు. హనుమంతునితో సమానమైన తేజోబలసంపన్నుడు లేడు. మహావీరుడైన సుగ్రీవునికి నిజమైన సేవకునిగా ఆ ప్రభుకార్యము సఫలమొనర్చెను. ఈ సంతోష సమయమున ఈ మహాత్మునికి గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఇవ్వగలను. ఇది అతనికి పరమసుఖానుభవమును కలిగిస్తుంది. ప్రస్తుతము నేను ఈయగల సర్వస్వము ఇదే." అని తన ఆనందాన్ని తెలిపి హనుమకు అనుపమానమైన ఆలింగనమనే బహుమతిని ఇస్తాడు.

రామపట్టాభిషేక సమయంలో సీత హనుమంతునికి దివ్యమైన వస్త్రములను, ఆభరణములను కానుకగా ఇస్తుంది. తన మెడలోని కంఠాభరణము తీసి అక్కడ ఉన్న వానర సమూహాన్ని పదే పదే చూస్తుండగా రాముడు ఆమె అంతరంగాన్ని గ్రహించి "ఓ సీతా! అసమానమైన పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదలగు లక్షణములు కలిగి నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహుకరింపుము" అని పలుకుతాడు. అప్పుడు సీత ఆ హారమును హనుమంతునికి కానుకగా ఇస్తుంది.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం

ఎక్కడ రాముని నామ కీర్తనం జరుగుతుందో అక్కడ మారుతి తలవంచి ఆనందబాష్పములతో నిండిన కన్నులతో రాక్షసనాశకుడైన రామునికి నమస్కరించి నిలుస్తాడు. రాత్రి పగలు రామధ్యానమే ఆయనకు. శ్రీరాముడు కూడా హనుమద్భక్తులపై అత్యంత కరుణతో దృష్టి కలిగి వారిని అనుగ్రహిస్తాడు. రామభక్తులకు హనుమ బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, రోగనివారణ, ఉత్సాహం, వాక్పటిమ కలిగించి వారికి తోడుగా నిలుస్తాడు. హనుమను కొలిస్తే రాముడు సంతుష్టుడు, రామభక్తులకు హనుమ అసమానమైన అండ.

రామ-హనుమల మధ్య అనిర్వచనీయమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శప్రాయం.

సియావర్ రామచంద్ర కీ జై !!!
పవన సుత హనుమాన్ కీ జై!!!

20, మే 2015, బుధవారం

శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ - దేవులపల్లి వారి రామభక్తి

శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ - దేవులపల్లి వారి రామభక్తి


రామచరణమె త్రోవయని నామభజనమె నావయని
స్వామిని మౌని మనోహరుని కనులారగని మది పదిలపరచుకొని
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ!

తాళలేని హృదయాలదహించే తాపకీల చల్లారాలంటే
నీలమేఘ మోహనుడే కరిగి జాలివాన కురిపించాలంటే
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ!

రానై యున్నాడు శ్రీహరి రానై యున్నాడు
తానే వైకుంఠం భూమికి తేనై యున్నాడు
పిలిచే దరి హరి పదముల మదిలో మానక నిలిపి ధ్యానము సలిపి
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

రామయని గుణధామయని రాముని తీయని గాథ విని
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

బ్రతుకుల వేసారి శ్రీహరి పదముల కడ చేరి
పరమ దయానిధి శౌరి భవ హారి యని ఒకసారి
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

- దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు 'భక్త శబరి' చలన చిత్రానికి, పెండ్యాల వారి సంగీతం.

రాముని చరణాలే దారి, ఆ రాముని నామాన్ని భజించటమే మనకు నావ. ఆ స్వామిని, మునుల మనసు గెలిచిన వానిని, కనులారా చూచి, మనసులో పదిలపరచుకొని, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

కోరికల వలన కలిగే తాపమనే అగ్నిని తాళలేక బాధ పడుతున్న హృదయాల బాధలు చల్లారాలంటే, నీలి మేఘాలవంటి శరీరఛాయ కలిగిన మోహనాకారుడు రాముడే కరిగి మనపై కరుణావృష్టిని కురిపించాలంటే, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

శ్రీహరి రాబోతున్నాడు! తానే వైకుంఠాన్ని భూమికి తేనున్నాడు! మనలను పిలుస్తున్న హరి పాదములను మనసులో ఎల్లప్పుడూ నిలిపి ధ్యానము చేసి, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

రామా అని, గుణములకు నివాసమా అని, రాముని తీయనైన కథను విని, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

జీవితంలో విసిగి పోయి, శ్రీహరి పాదముల వద్దకు చేరి, పరమ దయకు నిధి, మహావీరుడు, పాపములను హరించే వాడు అని, ఒకసారి అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

ఎంత అద్భుతమైన సాహిత్యం! చరణాలు త్రోవగా, నామమె నావగా అభివర్ణించారు ఈ కవిశ్రేష్ఠులు. తెలుగుదనం, భక్తి, యతి ప్రాసలు సంపూర్ణంగా ఉట్టిపడే ఇటువంటి సాహిత్యం ఒకప్పుడు సినీజగత్తులో ప్రకాశించేది. ఈ పాట దేవులపల్లి వారి రామభక్తికి మరో ఉదాహరణ. రాముని భక్తిసాగరంలో మునిగితే కానీ ఇటువంటి సాహిత్యం కలంలో పండదు. రామభక్తి సామ్రాజ్యంలో ఒకరైతే ఇటువంటి గీతాలు మనసులో జనిస్తాయి. కవి హృదయంలో కలిగే భావనలకు ఆ దైవానుగ్రహం తోడైతే, భక్తి సోపానంలో ఆ ఆత్మ పరమాత్మతో అనుసంధానమైతే ఇటువంటి మధుర రస భావ సుమాలు వికసిస్తాయి. రాముని నామ మహిమ ఒకసారి రుచి చూస్తే ఇక వేరే ఏదీ రుచించదు.

రాముని అడుగులే మనకు త్రోవ అని కవి విశ్వాసం. ఎందుకు? రామో విగ్రహవాన్ ధర్మః. ఆయన పలికిన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు ధర్మం కోసం. ఆయన చేసిన ప్రతి పని ధర్మాన్ని కాపాడటం కోసం. అన్నీ త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు ఆ మానవావతారుడు. సమస్త గుణములలో ఉత్తముడు రాముడు. సామాన్య మానవుడు దైవంగా ఎలా మారగలడో అన్నదానికి రామావతారం మనకు అత్యుత్తమమైన ఉదాహరణ. అందుకే ఆయన నడిచే అడుగులు మనకు దారి. ఆయన నామ స్మరణ మనకు పాపహారి, తాపహారి, భవతారకము. బంధనాలతో కూడిన మానవజన్మలోని ప్రతి రోజూ ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు. మన బుద్ధి ప్రతి సారీ సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉండదు. అందుకే పెద్దలు రామాయణ, భారత భాగవతాలను మనకు సరైన మార్గదర్శకాలుగా నిర్ధారించారు.

కవిగా ఉదయించి, మునిగా తపము చేసి, యోగిగా పరమపదించారు కృష్ణశాస్త్రిగారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు!

పీబీ శ్రీనివాస్ గారు ఎంత మధురంగా పాడారో! రాముని ఎదుట నిలిపినట్లుగా ఉంటుంది ఆయన గళంలో ఈ పాట. 

19, మే 2015, మంగళవారం

శ్రీరామకర్ణామృతం - ప్రథమాశ్వాసము

శ్రీరామకర్ణామృతం - ప్రథమాశ్వాసము 


పేరులోనే ఉంది అర్థమంతా. చెవులకు అమృతంగా అనిపించే రామస్తుతి ఇది. లీలాశుకుడు శ్రీకృష్ణకర్ణామృతం రచిస్తే ఈ రామకర్ణామృతం ఎవరు రచించారో తెలియటం లేదు. సిద్ధకవి ఈ సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువదించారు. ఛందోబద్ధంగా సాగే ఈ ధార రాముని రూప గుణ మహిమల వర్ణనను మనకు ఎంతో మనోజ్ఞంగా అందిస్తుంది. రాముడంటేనే పరిపూర్ణ సులక్షణ సంపన్నుడు. ఆ ధర్మమూర్తి వైభవాన్ని ఎంత పొగిడినా, ఎందరు నుతించినా తనివితీరదు. 

రామకర్ణామృతంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, తాత్పర్యము: 

వామాంక స్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే
చక్రం చోర్ధ్వకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిం స్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం 

ఎడమతొడపై కూర్చున్న సీత సేవించుచుండగా, శోభించుచున్న ధనువునొక చేతిలో, పైచేతిలో చక్రము, కుడిచేతులలో శంఖము మరియు బాణములను ధరించియున్న, కలువరేకులవంటి కన్నులు కలిగిన, భద్రాచల శిఖరమందు వెలసిన, భుజకీర్తులు మొదలైన ఆభరణములతో అలంకరించబడిన, నల్లనైన రఘురాముని భజిస్తున్నాను.

వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః
శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయ్వాది కోణేష్వపి
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం

ఎడమవైపున సీత, ఎదుట హనుమంతుడు, వెనుక లక్ష్మణుడు, పక్కన భరతశత్రుఘ్నులు, వాయువ్యము మొదలైన దిక్కులందు సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, జాంబవంతుడు యుండగా మధ్యనందు నల్లని కలువవలె సుందరమైన కాంతి కలిగిన రాముని భజించుచున్నాను. 

వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం

కల్పవృక్షము క్రింద, బంగారుమంటపమందు, పుష్పకము నడుమ మాణిక్య పీఠమందు, సీతతో కూడి వీరాసనమందున్నట్టి, ఎదుట ఆంజనేయుడు పలుకుచుండగా, పరతత్త్వమును మునులకు చెప్పుచు, భరతుడు మొదలగువారిచే ఆచరించబడిన, నల్లని రాముని భజిస్తున్నాను.

జానక్యాః కమాలంజలిపుటే యాః పద్మరాగాయితా
న్యస్తా రాఘవ మస్తకే తు విలసత్కుంద ప్రసూనాయితాః
స్రస్తాః శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితాః
ముక్తా స్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా

ఏ ముత్యములు సీతమ్మ పద్మమువంటి నిర్మలమైన దోసిలియందు పద్మరాగ మణులవలెనున్నవో (ఆమె దోసిలు ఎరుపు గనుక ఎర్రగా యున్నవి అనుట), రాముని శిరముననుంచబడుచు మల్లెపూవువలె నున్నవో (దోసిలికి తలకు మధ్య పలువరుస వలె తెలుపుగా యుండుట), జారుచు రాముని నల్లని దేహకాంతితో కూడినవై ఇంద్రనీలము వలె నున్నవో (నల్లని దేహకాంతిచే నల్లగా నున్నవి యనుట), అట్టి రామ వివాహమందలి తలంబ్రాల ముత్యములు మనకు శుభము కలిగించు గాక!

రామయ్య నీలమేఘ శరీర చాయ, ధనుర్బాణాలు, పక్కన సీతమ్మ. వామభాగమున ఆ తల్లి, వెనుక మరియు ప్రక్కల సోదరులు, ఇతర హితులు, ముందర హనుమంతుడు. ఇదీ రామ పట్టాభిషేక సన్నివేశం. సోదరులు, హితులు, సేవకులు, దాసుల మధ్య రామయ్య సీతమ్మతో ప్రకాశించే చిత్రాన్ని మొదటి మూడు శ్లోకాలు వర్ణిస్తున్నాయి. శ్రీరామచంద్రుని కొలువుతీరిన రీతి చాలా సుందరంగా వర్ణించారు కర్త. మొదటి శ్లోకంలో భద్రాద్రి రాముని గురించి ప్రస్తావించారు. కాబట్టి ఈ రామకర్ణామృతం రచయిత భద్రాద్రి రాముని సేవించిన వారై ఉండాలి.

ఇక నాలుగవ శ్లోకం మనకు ప్రతి పెండి పిలుపుపై కనిపించేది. సీతారాముల ఆదర్శ దాంపత్యం మన భారతీయ జీవనశైలిపై ఎంత ప్రభావాన్ని చూపిందో! వివాహమనగానే సీతారాముల కళ్యాణమే గుర్తుకు వచ్చేలా మనకు పెద్దలు రామాయణాన్ని జీవితంలో పొందుపరచారు. సీతారాముల దేహకాంతులను బట్టి ముత్యాల తలంబ్రాలు ఏ విధంగా అగుపిస్తున్నాయో కవి తెలిపారు మనకు. ఈ తలంబ్రాల సాంప్రదాయం దక్షిణాది వారిదే కాబట్టి రచయిత ఇక్కడి వాడని నా అభిమతం. భాషను, శైలిని, నేపథ్యాన్ని బట్టి చూస్తే సీతారాముల కళ్యాణము మరియు పట్టాభిషేకము వంటి వేడుకల కళ్లారా కాంచి ఈ శ్లోకాలు రచించబడ్డాయి అని అర్థమవుతోంది. కవి ఎవరో కానీ, మనకు ఎప్పటికీ వివాహమహోత్సవాలలో, రాములవారి వేడుకలలో ఎప్పటికీ నిలిచిపోయే సాహిత్య వైభవాన్ని మనకు సంపదగా ఇచ్చారు. మరిన్ని శోకాలతో ముందు భాగాలలో

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...