25, మే 2015, సోమవారం

అంతర్యామి అలసితి సొలసితి



అన్నమయ్య రచించిన ఒక అద్భుతమైన, భాగగర్భితమైన సంకీర్తనను ఈ వ్యాసంలో పొందుపరస్తున్నాను. చలన చిత్రం ద్వారా బాగా ప్రాచుర్యం పొందిన ఈ సంకీర్తన మానవ జన్మకు ఒక దిశానిర్దేశం చేస్తుంది. అంతర్యామి అలసితి సొలసితి అనే కీర్తన యొక్క పరిశీలన.

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని

కోరిన కోర్కెలు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల పోనీవు నీవు వద్దనక

జనుల సంగముల జక్క రోగములు
నిను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక

మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
యెదుటనే శ్రీ వేంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక

కర్మలు, పాప పుణ్యాలు, మోక్షము వీటి గురించి ఈ సంకీర్తనలో పొందుపరచారు అన్నమాచార్యుల వారు. మానవ జన్మ ఎత్తినందుకు మనం చేయవలసినది ఏమిటి?

కోరికలు అనే అనంతమైన కోయని కట్లను మనం తెంచితే తప్ప అవి తెగవు. పాప పుణ్యాలు రెండూ భారములే. ఎందుకంటే అవి పునర్జన్మకు దారితీస్తాయి. పుణ్యం చేసుకుంటే  సుఖములతో కూడిన దేవ జన్మ కానీ,  మరింత ఉత్కృష్టమైన, సుఖ దుఃఖములతో కూడిన మానవ జన్మ కానీ, పాపము చేసుకుంటే మరిన్ని దుఃఖములతో కూడిన తిర్యక్ జన్మ గానీ తప్పవు. ఈ విధంగా ఎన్నాళ్లు జీవునకు శాశ్వతానందమైన, శాంతికారకమైన పరబ్రహ్మైక్యమునుండి దూరము? అందుకే పాపపుణ్యముల రెండింటినీ ఛేదించవలసినదే.

మన సాగంత్యాలే మన వాసనలు. మన వాసనలే మన దేహానికి రోగములు. చెడు సాంగత్యాలను వద్దనుకుంటే తప్ప మన వాసన ప్రేరిత రోగములు తొలగవు. దైన్యము, కర్మ ఫలములు మన ప్రయత్న పూర్వకముగా శాంతపరిస్తే తప్ప దూరం కావు. దీనికి సత్సాంగత్యము వజ్రాయుధం.

మనసులోని ఆలోచనలు, మాలిన్యాలు ఎంతో బరువైనవి. మనం ప్రయత్నం చేస్తే తప్ప అవి వదలవు. కలియుగంలో మన పాప సంచయాన్ని ముడుపు రూపంలో, అహంకారాన్ని శిరోముండనం రూపంలో, భావ కాలుష్యాన్ని నామ సంకీర్తన ద్వారా తొలగించుకోవటానికి పరమాత్మ వడ్డీ కాసులవాడుగా అవతరించి మన ఎదుట నిలిచాడు. తన అశేష గుణ విభవముల చాటే సంకీర్తనలను జనావళికి అందజేయమని తన నందకాన్ని అన్నమయ్య రూపంలో పంపించాడు.

వేల సంకీర్తనల ద్వారా వేవేల అవకాశాలు మానవుడికి తనను తాను ఉద్ధరించుకోవటానికి...ఒక్క దానిని గట్టిగా పట్టుకొని సద్వినియోగం చేసుకుంటే చాలు ఈ జన్మకు సార్థకత. ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ! మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేల నరకకూపముల వెడలించ! అన్నీ ఆయనకే వదిలేసి ఒక్కసారి హరీ అని పలికి చూడండి! మీలో మీకు వేయి ఏనుగుల బలం వస్తుంది! కానీ, అలా అనగలగాలంటే చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధికి కర్తవ్యపాలన, భగవంతుని పట్ల శరణాగతి తప్పనిసరి.

అన్నమయ్య కీర్తనలు ఎన్నో జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని, పరమావధిని సుస్పష్టంగా, మన భాషలో తెలిపాయి. అందులో ఈ అంతర్యామి అలసితి ఒకటి. భావము అర్థం చేసుకొని మన అభ్యున్నతికి సద్వినియోగం చెసుకుంటే ఒక్కొక్క కీర్తన పరమ పదము వైపు ఒక సోపానము. ఈ సంకీర్తన అన్నమయ్య చలనచిత్రం నుండి.

ఓం నమో వేంకటేశాయ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి