RightClickBlocker

20, మే 2015, బుధవారం

శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ - దేవులపల్లి వారి రామభక్తి

శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ - దేవులపల్లి వారి రామభక్తి


రామచరణమె త్రోవయని నామభజనమె నావయని
స్వామిని మౌని మనోహరుని కనులారగని మది పదిలపరచుకొని
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ!

తాళలేని హృదయాలదహించే తాపకీల చల్లారాలంటే
నీలమేఘ మోహనుడే కరిగి జాలివాన కురిపించాలంటే
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ!

రానై యున్నాడు శ్రీహరి రానై యున్నాడు
తానే వైకుంఠం భూమికి తేనై యున్నాడు
పిలిచే దరి హరి పదముల మదిలో మానక నిలిపి ధ్యానము సలిపి
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

రామయని గుణధామయని రాముని తీయని గాథ విని
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

బ్రతుకుల వేసారి శ్రీహరి పదముల కడ చేరి
పరమ దయానిధి శౌరి భవ హారి యని ఒకసారి
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

- దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు 'భక్త శబరి' చలన చిత్రానికి, పెండ్యాల వారి సంగీతం.

రాముని చరణాలే దారి, ఆ రాముని నామాన్ని భజించటమే మనకు నావ. ఆ స్వామిని, మునుల మనసు గెలిచిన వానిని, కనులారా చూచి, మనసులో పదిలపరచుకొని, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

కోరికల వలన కలిగే తాపమనే అగ్నిని తాళలేక బాధ పడుతున్న హృదయాల బాధలు చల్లారాలంటే, నీలి మేఘాలవంటి శరీరఛాయ కలిగిన మోహనాకారుడు రాముడే కరిగి మనపై కరుణావృష్టిని కురిపించాలంటే, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

శ్రీహరి రాబోతున్నాడు! తానే వైకుంఠాన్ని భూమికి తేనున్నాడు! మనలను పిలుస్తున్న హరి పాదములను మనసులో ఎల్లప్పుడూ నిలిపి ధ్యానము చేసి, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

రామా అని, గుణములకు నివాసమా అని, రాముని తీయనైన కథను విని, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

జీవితంలో విసిగి పోయి, శ్రీహరి పాదముల వద్దకు చేరి, పరమ దయకు నిధి, మహావీరుడు, పాపములను హరించే వాడు అని, ఒకసారి అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

ఎంత అద్భుతమైన సాహిత్యం! చరణాలు త్రోవగా, నామమె నావగా అభివర్ణించారు ఈ కవిశ్రేష్ఠులు. తెలుగుదనం, భక్తి, యతి ప్రాసలు సంపూర్ణంగా ఉట్టిపడే ఇటువంటి సాహిత్యం ఒకప్పుడు సినీజగత్తులో ప్రకాశించేది. ఈ పాట దేవులపల్లి వారి రామభక్తికి మరో ఉదాహరణ. రాముని భక్తిసాగరంలో మునిగితే కానీ ఇటువంటి సాహిత్యం కలంలో పండదు. రామభక్తి సామ్రాజ్యంలో ఒకరైతే ఇటువంటి గీతాలు మనసులో జనిస్తాయి. కవి హృదయంలో కలిగే భావనలకు ఆ దైవానుగ్రహం తోడైతే, భక్తి సోపానంలో ఆ ఆత్మ పరమాత్మతో అనుసంధానమైతే ఇటువంటి మధుర రస భావ సుమాలు వికసిస్తాయి. రాముని నామ మహిమ ఒకసారి రుచి చూస్తే ఇక వేరే ఏదీ రుచించదు.

రాముని అడుగులే మనకు త్రోవ అని కవి విశ్వాసం. ఎందుకు? రామో విగ్రహవాన్ ధర్మః. ఆయన పలికిన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు ధర్మం కోసం. ఆయన చేసిన ప్రతి పని ధర్మాన్ని కాపాడటం కోసం. అన్నీ త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు ఆ మానవావతారుడు. సమస్త గుణములలో ఉత్తముడు రాముడు. సామాన్య మానవుడు దైవంగా ఎలా మారగలడో అన్నదానికి రామావతారం మనకు అత్యుత్తమమైన ఉదాహరణ. అందుకే ఆయన నడిచే అడుగులు మనకు దారి. ఆయన నామ స్మరణ మనకు పాపహారి, తాపహారి, భవతారకము. బంధనాలతో కూడిన మానవజన్మలోని ప్రతి రోజూ ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు. మన బుద్ధి ప్రతి సారీ సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉండదు. అందుకే పెద్దలు రామాయణ, భారత భాగవతాలను మనకు సరైన మార్గదర్శకాలుగా నిర్ధారించారు.

కవిగా ఉదయించి, మునిగా తపము చేసి, యోగిగా పరమపదించారు కృష్ణశాస్త్రిగారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు!

పీబీ శ్రీనివాస్ గారు ఎంత మధురంగా పాడారో! రాముని ఎదుట నిలిపినట్లుగా ఉంటుంది ఆయన గళంలో ఈ పాట. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి