హనుమత్ సేవిత నిజ పద రాం!
పరిపూర్ణమైన స్వామి భక్తి, శరణాగతి మరియు ప్రభువు పట్ల ప్రగాఢ విశ్వాసమున్న హనుమంతుని వంటి భక్తుడు కలిగిన రాముడు, సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమైన రాముని వంటి దైవము యొక్క అనుగ్రహము కలిగిన హనుమంతుడు...ఈ ఇరువురి సంబంధం అనిర్వచనీయం, అపూర్వం. రోమ రోమమున రామ నామము ఆ భక్తుని లక్షణమైతే ఈ బంటు భక్తులను వెన్నంటి కాచే ప్రభుత ఆ స్వామిది....సుందరమైన ఈ బాంధవ్యం భక్తి-కరుణలకు ప్రామాణికం, తలమానికం. దాసోహం కోసలేంద్రస్య అని ఆ భక్తుడు తలచితే హనుమంతుని వంటి భక్తుడు మరొకడు లేడు అని ఆ ప్రభువు పొగడాడు. లక్ష్మణుడి ప్రాణాల కోసం సంజీవనిని తెచ్చినా, సీతమ్మ కోసం భీకరమైన లంకను దహనం చేసినా, రామ కార్యం కోసం శతయోజనాలు దాటినా, అన్నీ ప్రభు భక్తి కోసమే. రామ కార్యమే జీవనోపాధి, పరమావధి. అమ్మ సీతమ్మకు హనుమను చూస్తే అవ్యాజమైన మాతృప్రేమ. రామునికి కూడా హనుమ అంటే అమితమైన కరుణ వాత్సల్యము. అందుకే ఏకంగా ఆ భక్తుని హృదయంలో నివసించాడు.
సీతాన్వేషణ మొదలు రామపట్టాభిషేకము వరకూ హనుమంతుడు చేసిన ప్రతికార్యమూ రామనామ స్మరణతోనే. లంకలో వెదకి వెదకి అమ్మ జాడ దొరకక నిస్పృహకు గురై హనుమ విపరీతమైన ఆలోచనలోకి వెళుతుంటే రామనామ స్మరణతో ఎక్కడ లేని మనో ధైర్యము, కార్యసిద్ధిపై ఉత్సుకత, విశ్వాసం కలిగాయి. హనుమంతునికి శుభశకునాలు కనిపించాయి. సంకల్పం గట్టిదై నోటినుండి అద్భుతమైన మంత్రాలు వెలువడ్డాయి.
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యేచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
"రామునికి, లక్ష్మణునికి, సీతమ్మకు, శివునికి, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునకు, సూర్యచంద్రులకు, మరుత్ గణాలకు నమస్కారము". అంతే! ఆయనకు ఆశోకవనము, సీతమ్మ జాడ తెలుస్తాయి. ఇక హనుమంతునికి ఎదురులేదు. అమ్మను కలిసి రాముని గుణగణములను, తాను వచ్చిన కార్యమును వివరించి, అమ్మకు సాంత్వన కలిగిస్తాడు. ఉత్సాహంతో ప్రమదావనాన్ని నాశనం చేసి రావణునికి హెచ్చరిక చేస్తాడు.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్థయిత్వాం పురీం లంకాం అభివాద్య చ మైథిలీం
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం
"అతిబలుడైన రామునికి, మహాబలుడైన లక్ష్మణునికి, రామునిచే కాపాడబడిన సుగ్రీవునికి జయము జయము. వేయిమంది రావణులు వచ్చినా వారిని శిలలతోను, వృక్షములతోను ఎదుర్కొంటాను. రాక్షసులందరూ నిస్సహాయులై చూస్తుండగా, లంకను జయించి, సీతమ్మకు అభివాదం చేసిన తరువాతే ఇక్కడినుండి వెళతాను."
ఇదీ హనుమంతునికి రామునిపై గల విశ్వాసము, భక్తి, నమ్మకము. దాని ఫలితమే అతని కార్యసిద్ధి. యుధ్దంలోనూ, సంజీవని తీసుకురావటం లోనూ, రామనామమే అతనికి తారకము. రాముని పాదముల వద్ద నిలిచి, సేవించి, మనసులో ధ్యానించి, లోకవంద్యుడైనాడు హనుమ. రామభక్తి అతనిని భవిష్యత్ బ్రహ్మను చేసింది.
సీతమ్మ జాడను తీసుకొని రాముని వద్దకు వెళ్లి అమ్మ క్షేమంగా ఉన్నది అన్న వార్త తెలుపగానే రాముడు "హనుమంతుడు సీతాన్వేషణలో సాధించిన కార్యములు లోకములోనే అత్యద్భుతమైనవి, ఊహకు అందనివి, అనితర సాధ్యమైనవి. గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు తప్ప వేరేవ్వరూ ఈ సాగరాన్ని దాటలేరు. హనుమంతునితో సమానమైన తేజోబలసంపన్నుడు లేడు. మహావీరుడైన సుగ్రీవునికి నిజమైన సేవకునిగా ఆ ప్రభుకార్యము సఫలమొనర్చెను. ఈ సంతోష సమయమున ఈ మహాత్మునికి గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఇవ్వగలను. ఇది అతనికి పరమసుఖానుభవమును కలిగిస్తుంది. ప్రస్తుతము నేను ఈయగల సర్వస్వము ఇదే." అని తన ఆనందాన్ని తెలిపి హనుమకు అనుపమానమైన ఆలింగనమనే బహుమతిని ఇస్తాడు.
రామపట్టాభిషేక సమయంలో సీత హనుమంతునికి దివ్యమైన వస్త్రములను, ఆభరణములను కానుకగా ఇస్తుంది. తన మెడలోని కంఠాభరణము తీసి అక్కడ ఉన్న వానర సమూహాన్ని పదే పదే చూస్తుండగా రాముడు ఆమె అంతరంగాన్ని గ్రహించి "ఓ సీతా! అసమానమైన పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదలగు లక్షణములు కలిగి నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహుకరింపుము" అని పలుకుతాడు. అప్పుడు సీత ఆ హారమును హనుమంతునికి కానుకగా ఇస్తుంది.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం
ఎక్కడ రాముని నామ కీర్తనం జరుగుతుందో అక్కడ మారుతి తలవంచి ఆనందబాష్పములతో నిండిన కన్నులతో రాక్షసనాశకుడైన రామునికి నమస్కరించి నిలుస్తాడు. రాత్రి పగలు రామధ్యానమే ఆయనకు. శ్రీరాముడు కూడా హనుమద్భక్తులపై అత్యంత కరుణతో దృష్టి కలిగి వారిని అనుగ్రహిస్తాడు. రామభక్తులకు హనుమ బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, రోగనివారణ, ఉత్సాహం, వాక్పటిమ కలిగించి వారికి తోడుగా నిలుస్తాడు. హనుమను కొలిస్తే రాముడు సంతుష్టుడు, రామభక్తులకు హనుమ అసమానమైన అండ.
రామ-హనుమల మధ్య అనిర్వచనీయమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శప్రాయం.
సియావర్ రామచంద్ర కీ జై !!!
పవన సుత హనుమాన్ కీ జై!!!
రామ భక్త హనూమానకీ జై పవనసుత హనూమానకీ జై
రిప్లయితొలగించండిశ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 🌹🌹🌹🙏
రిప్లయితొలగించండి