RightClickBlocker

24, మే 2015, ఆదివారం

జిల్లెళ్లమూడి. మాతృశ్రీ అనసూయమాత

జయహో మాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి!!


ఒక్కొక్క యోగికి, అవతారమూర్తికి ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణముంటుంది. నాలుగేళ్లనాడు మేము గుంటూరు జిల్లా పొన్నూరు ఆంజనేయస్వామిని, భావనారాయణస్వామిని, బాపట్ల భావనారాయణస్వామిని, స్వామి బ్రహ్మానందతీర్థుల వారి శంకర విద్యాలయమనే వేదపాఠశాలను, అక్కడి రామకృష్ణ సమాజ వ్యవస్థాపకులు స్వామి అనుభవానంద ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడినుండి గుంటూరు తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. మధ్యాహ్న సమయము, ఆకలి. ఎక్కడ భోజనము చెయ్యాలా అని ఆలోచిస్తూంటే పచ్చని వరి పొలాలు వేల ఎకరాలలో, అద్భుతమైన మబ్బులు పట్టిన వాతావరణంలో జిల్లెళ్లమూడి అనే గ్రామం పేరు కనిపించింది. అప్పటికే చిన్ననాటి విషయ సాంగత్యం వలన ఆ వూరి పేరు స్మృతిలో ఉంది కాబట్టి 'జిల్లెళ్లమూడి అమ్మ' ఆశ్రమానికి వెళదాం అని నిర్ణయించుకొని ఆ దారి పట్టాము.కారు ఆశ్రమం వైపు వెళుతూ ఉంటే మన అమ్మ భోజనానికి రండి అని ఎంత ప్రేమగా అన్నపూర్ణలా పిలుస్తుందో అలా ఆ జిల్లెళ్లమూడి అమ్మ పిలిచినట్లు అనిపించింది. ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే సువాసినులతో కళకళలాడుతూ కోటి లలిత పారాయణ జరుగుతున్నది. ధర్మకర్తలు 'ముందు దర్శనం చేసుకొని భోజనం చేయండి' అని అప్యాయంగా పరి పరి విధాల చెప్పారు. అనసూయేశ్వరి మందిరాన్ని, హైమ మందిరాన్ని, అక్కడి విశాలమైన సభా ప్రాంగణాన్ని చూసి అలౌకికమైన అనుభూతిని పొందాము. తరువాత అక్కడ అన్నపూర్ణాలయంలో వారి అన్నదాన కార్యక్రమంలో భోజనం చేశాము. ఆ ఏర్పాట్లు అద్భుతం ఆ అనుభూతి చెప్పలేనిది. ప్రేమగా అమ్మ చేతితో అన్నం పెడితే ఎలా అనిపిస్తుందో అలాంటిదే చవిచూసాము. అక్కడి భోజనం తయారు చేసే వసతులు, అమ్మ భక్తుల భక్తి తత్పరత, సేవా నిరతి అమోఘం. అనుక్షణం దివ్యత్వాన్ని, అనురాగాన్ని అనుభూతి చెందాము.తరువాత ఇంటికి వచ్చి అమ్మ గురించి కొంత పరిశోధన చేశాను. ఆధ్యాత్మికంగా అమ్మ ఎంతటి మహిమాన్విత ప్రకాశినో, ఎంతటి తేజోవిలాసినో, ఎంతటి కరుణామయో, ఎంతటి ప్రేమమూర్తో, యోగినో అర్థమయ్యింది. ఏ వసతులూ లేని రోజుల్లో లక్షలాది మందికి ఒకే మారు అన్నదానం చేసిన అన్నపూర్ణ ఈ అనసూయమాత. మహామహులైన యోగులు పూర్ణానంద స్వామి, కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వాములు మొదలైన వారికి గురుతుల్యులు అమ్మ.

అమ్మ మాతృశ్రీ విద్యా పరిషత్ అనే అద్బుతమైన విద్యా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా సంస్కృత భాషకు ఎనలేని సేవను అందిచే ఏర్పాట్లు చేశారు. విశ్వజననీ పరిషత్తు ద్వారా పేదలకు చుట్టుపక్క గ్రామ వాసులకు, వైద్య, విద్య మరియు ఇతర సామాజిక సేవలను అందిస్తున్నారు.

అమ్మ మహిమలు అనంతం. అమ్మ ప్రేమ అనిర్వచనీయం. అమ్మ కరుణ అసమానం. అమ్మ వాత్సల్యం అమృతతుల్యం. అమ్మ భక్తులకు ఆమె సర్వస్వం. ఎందరో మహానుభావులకు ఆమె ఆధ్యాత్మిక దర్శని. ఇప్పటికీ యోగులతో దివ్యదేహంతో అమ్మ మాట్లాడుతునే ఉంది.

అమ్మ ఎక్కడ ఉందో అక్కడ పాడిపంటలు సస్యశ్యామలము. ఆ ప్రాంతం శాంతికి నిలయం. అమ్మ వాక్కులు మార్గనిర్దేశకాలు. నిత్యం అశాంతి, స్పర్థలలో మునిగి తేలేవారికి ఈ అనసూయామాత మందిరం మరియు ఆ ఆశ్రమ పరిసరాలు సాంత్వననిచ్చే దివ్యౌషధము. అమ్మ 20వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ లో అవతరించిన అమ్మలగన్న అమ్మ. ఆ రాజరాజేశ్వరి రూపమే అమ్మ. ఆమె కరుణారసమే అమ్మ చూపులు.నిత్యానందకరీ వరాభయకరీ అని మనం కొలిచే అన్నపూర్ణ స్వరూపిణి అయిన ఆ ఆదిపరాశక్తే ఈ అనసూయమాతగా జిల్లెళ్లమూడిలో వెలసింది. మహావైభవంగా సాగిన ఆమె భౌతిక అవతారం 1985 సంవత్సరంలో ముగిసినా, ఇప్పటికీ అమ్మ భక్తుల ద్వారా అమ్మ ఆధ్యాత్మిక సౌరభాలను, అదే ప్రేమ, వాత్సల్యం, కరుణలను అందిస్తూనే ఉంది. అమ్మ గురించి తెలుసుకోదలచిన వారు విశ్వజనని ట్రస్టు ముద్రించిన 'అమ్మ జీవిత మహోదధి' అనే గ్రంథాన్ని చదువవచ్చు. అంతర్జాలంలో కూడా చాలా వివరంగా అమ్మ గురించిన విషయాలను భక్తులు పొందుపరచారు.

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి సాధకుడు తప్పక చూడవలసిన క్షేత్రం జిల్లెళ్లమూడి. రైలులో వెళితే బాపట్ల స్టేషనులో దిగి వెళ్లవచ్చు. బాపట్ల నుండి జిల్లెళ్లమూడి 15 కిలోమీట్లర్ల దూరం. గుంటూరు నుండి 52 కి.మీ, విజయవాడ నుండి 87 కి.మీ.  మాతృశ్రీ అనసూయమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు!!

http://www.jillellamudiamma.org/svjp/
http://www.jillellamudiamma.org/svjp/images/mdc_book_annapurnalayam.pdf
www.viswajanani.org
www.motherofall.org


జయహో మాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి