8, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీమన్నారాయణీయం - ప్రథమ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం  ప్రథమ స్కంధము



మొదటి దశకము - భగవన్మహిమ


సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ |
అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మ తత్వమ్
తత్తావద్భాతి సాక్షాద్గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ || ౧-౧||

ఆ భగవంతుడు సచ్చిదానందుడు, జ్ఞాన స్వరూపుడు, సాటి లేని వాడు, కాలము, దేశము మొదలగు వాటికి అతీతమైన వాడు, ఎల్లప్పుడూ ముక్త స్వరూపుడు, లక్షలకొలది అనువాకముల ద్వారా వేదములు ఆ పరమ పురుషుని వర్ణించినా, ఇది కాడు ఇది కాడు అని చెప్పాయే కాని, ఇది అని చెప్పలేకపోయాయి. యోగులు కూడ వేల సంవత్సరాల కఠోర శ్రమ, సాధన తర్వాతే పర తత్త్వమును అనుభవించి మోక్షమును పొందగలరు. ఆ బ్రహ్మమే గురువాయు పురము నందు సగుణ సాకార రూపమున నారాయణుడై వెలసి యున్నాడు. వారిది ఎంతటిభాగ్యము?

ఏవం దుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్
తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్
ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః || ౧-౨||

దుర్లభుడే అయినా, జీవులపై కరుణతో చేతికి అందినంత సులభంగా గురువాయుపురంలో వెలశాడు. ఇంత సులభ లభ్యుడైనప్పటికీ, భక్తులు మనోవాక్కాయ కర్మలచే ఇతరులను సేవిస్తూ వ్యర్థ కాలక్షేపము చేస్తున్నారు.  ఇది ఎంతో శోచనీయము. కానీ, ఆత్మ స్వరూపుడైన ఈ గురువాయుపుర పట్టణపు శ్రీ కృష్ణుని మాత్రమే మన తాపత్రయముల తొలగించుటకు ఆశ్రయింతుము.
 
సత్త్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్
భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్ |
తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదితపరసుఖచిద్గర్భనిర్భాసరూపం
తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే || ౧-౩||

ఓ పరమాత్మా! నీ దివ్య శరీరము రజస్తమో గుణములు లేక మిక్కిలి నిర్మలమైనది, శుద్ధ సత్త్వ గుణములు కల  పంచ భూతాత్మకమైనది అని వేద వ్యాసులు అనేక మార్లు తెలిపాడు. అట్టి నీ రూపము యొక్క సౌందర్యమును గురించి విన్నాను, స్మరించినను, మిక్కిలి ఆనందము కలుగును. ఆ రూపమును అతి సులభముగా భక్తుడు దర్శించుకొనును. కావున అదృష్టవంతులు నీ రూపమును దర్శించుచు, స్మరించుచు ఆత్మానుభూతిని పొందుదురు

నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానందపీయూషరూపే
నిర్లీనానేకముక్తావలిసుభగతమే నిర్మలబ్రహ్మసింధౌ |
కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వమాహుస్తదాత్మా
కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్ ౧-౪

పరబ్రహ్మము అపారమైన సముద్రము వంటిది. నిశ్చలముగా, నిత్య పూర్ణమై, అంతులేని పరమానందమనే అమృతముతో నిండియున్నది. ముక్తులైన అనేక జీవములు ఆ సాగరములో ముత్యాలు, మణుల వంటి వారు. వారితో ఆ సాగరము అందముగా కనిపించును. అట్టి సాగరమున పరిశుద్ధమైన సత్త్వ గుణము అలలవలె ఉండును. ఓ పరమాత్మ! శుద్ధసత్త్వ స్వరూపుడైన నీవు వస్తుతః నిష్కలుడవుగా ప్రకాశింతువు. అయినను నీవు సకల కలాసహితుడవుగా, సాకారుడవుగా కనిపించుచున్నావు. అదే నీ గొప్పతనము.

నిర్వ్యాపారోఽపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం
తేనైవోదేతి లీనా ప్రకృతిరసతికల్పాఽపి కల్పాదికాలే |
తస్యాః సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం
స త్వం ధృత్వా దధాసి స్వమహిమవిభవాకుంఠ వైకుంఠ రూపమ్ || ౧-౫

ఓ పరమాత్మా! నీవు ఎట్టి కర్మలను ఆచరించ పని లేదు. ఆయస్కాంతము వద్ద ఇనుము ఆకర్షింప బడినట్లు, నీ కృపాకటాక్ష వీక్షణ ప్రభావమున నీ యందు విలీనమై అసత్ స్వరూపమైన ప్రకృతి సృష్టి కల్పాది యందు కనపడుతున్నది. నీవు ప్రకృతికి అతీతుడవు. సత్త్వ రూపుడవు. నీ మహిమా ప్రభావముచే వైకుంఠ రూపములో వెలసిల్లుచున్నావు. భక్తులను అనుగ్రహించుటకు ప్రకృతి రూపములో ప్రకటించు కొనుచున్నావు.

తత్తే ప్రత్యగ్రధారాధరలలితకళాయావలీకేలికారం
లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారమ్ |
లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యందసందోహమంతః
సించత్సంచింతకానాం వపురనుకలయే  మారుతాగారనాథ     ||౧-౬||   

ఓ గురువాయుపుర శ్రీ కృష్ణా! నీ రూపము క్రొత్త మేఘములా సుందరమైనది. కలువపూలవలె ఆనందాన్ని కలుగుచేస్తుంది. సౌందర్యము మూర్తీభవించిన నీ రూపము పుణ్యాత్ములకు పుణ్యఫలము వంటిది. లక్ష్మికి నివాస స్థానము. అతి మధురమైన నీ దివ్య రూపమును ఎల్లప్పుడూ ధ్యానించు వారి మనసులందు అది అమృతాన్ని కురిపిస్తుంది. నీ జగన్మోహన రూపమును నేను నిరంతరమూ ధ్యానిన్చుచున్నాను.

కష్టా తే సృష్టిచేష్టా బహుతరభవఖేదావహా జీవభాజా
మిత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవమద్యాభిజానే |
నో చేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం
నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్ || ౧-౭

ఓ దేవా! మొదట నేను నీ సృష్టి వలన సంసార బంధనములు, కష్టములు కలుగుచున్నవని భావించాను. కానీ అది నిజము కాదు. నీకు జీవులపై అనంతమైన కరుణ కలదు. నీ రూపము చాలా సుందరమైనది, మనోహరమైనది. లేకున్న, భక్తులందరూ నీ దివ్య మంగళ రూపమును భౌతికమైన కళ్ళతో చూసి, నీ లీలా వర్ణనమును వినుచు పరమానందమును ఎలా పొందుదురు?

నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యార్థితాన-
ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతిం చ |
ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే త్వం
క్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థమర్త్ హివ్రజోఽయమ్ || ౧-౮

ఓ హరీ! నీవు అందరికీ సులభముగా అందుబాటులో ఉన్నవాడవు. నీకు నమస్కరించే వారికి ఎల్లప్పుడు సాక్షాత్కారము నిచ్చెదవు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువువు. పరమానందమైన మోక్షాన్ని కూడ అనుగ్రహిస్తున్నావు. కొందరు నీ మహిమ తెలియకు ఆ ఇంద్రుని కల్పతరువును ఆశ్రయింతురు. అది వ్యర్థము. అనంతమైన ఫలములను ఇచ్చేది నీ ముందు పారిజాత వృక్షమెంతటిది, కల్పవృక్షమెంతటిది?

కారుణ్యాత్కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషా-
దైశ్వర్యాదీశతేఽన్యే జగతి పరజనే స్వాత్మనోఽపీశ్వరస్త్వమ్ |
త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యాః-
త్వం చాఽఽత్మారామ్ ఏవేత్యతులగుణగణాధార శౌరే నమస్తే || ౧-౯||

ప్రభూ! ఇతర దేవతలు మోక్షము తప్ప ఇతర ఫలములను ఇయ్యగలరు. నీవు మోక్షాన్ని కూడ ప్రసాదిస్తావు. నీవే ప్రభుడవు, సర్వేశ్వరుడవు. నిన్ను శాసించేవారు లేరు. నీ పరబ్రహ్మ రూపము ఎంతో మధురమైనది. అటువంటి నీయందు ధన్యులు సదా ఆనందించు చుందురు. నీవు ఆత్మా రాముడవు, అనంత కళ్యాణ గుణములకు ఆధారమైన వాడవు. శౌరీ! నీకు నా నమస్కారములు.

ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం విశ్వతేజోహరాణాం
తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతమ్ |
అంగాసంగా సదా శ్రీరఖిలవిదసి న క్వాపి తే సంగవార్తా
తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్ఛబ్దముఖ్యాశ్రయోఽసి ౧-౧౦

గురువాయుపుర నివాస! మురారి! ఐశ్వర్యము, సాటి లేని పరాక్రమము, నిర్మలమైన యశస్సు, సిరి సంపదలు, సర్వజ్ఞత, వైరాగ్యము - అనే ఆరు లక్షణములు కలవాడే భగవంతుడు. నీవు బ్రహ్మాది దేవతలను కూడ నియమించగల ప్రభుడవు. బ్రహ్మ, శివుడు మొదలగు దేవతలను మించిన తేజస్సు నీది. నీ యశస్సును సనకాది మునులు ఎల్లప్పుడూ కొనియాడు చుందురు. లక్ష్మీ దేవి ఎప్పుడు నిన్నే ఆశ్రయించు యుండును. నీవు అన్ని తెలిసిన వాడవు, దేనియందు ఆసక్తి లేని వాడవు. అందుకనే భగవంతుడు అనే పేరు నీకే తగును.

రెండవ దశకము - భగవద్రూప భక్తి మహత్వము


సూర్యస్పర్ధికిరీటమూర్ధ్వతిలకప్రోద్భాసిఫాలాంతరం
కారుణ్యాకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటమ్ |
గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం
త్వద్రూపం వనమాల్యహారపటలశ్రీవత్సదీప్రం భజే || ౨-౧||

శ్రీ కృష్ణా! నీ కిరీటము నందలి మణుల కాంతులు సూర్యుని తేజస్సును మించినవి. నీ నుదుట కస్తూరి తిలకము ఎంతో అందమైనది. నీ చల్లని చూపులు జీవ కోటి పై కృపను ప్రసరింప చేయును. ప్రేమతో కూడిన నీ చిరునవ్వు ఎంతో ఆహ్లాద కరమైనది. నీ నాసిక ఎంతో ముచ్చటగ ఉంది. అద్దముల వంటి నీ చెక్కిళ్ళ పై ప్రతిఫలించు మకర కుండలముల కాంతులు ఎంతో మనోహరముగా ఉన్నవి. నీ మెడలో వెలుగుతున్న కౌస్తుభమణి కాంతులు దేదీప్య మానము. నీ వక్షస్థలమున ఉన్న వనమాలలు, దివ్యమైన హారములు, శ్రీ వత్స చిహ్నము అనుపమానములు. అటువంటి నీ దివ్య రూపమును నేను ధ్యానించు చున్నాను.


కేయూరాంగదకంకణోత్తమమహారత్నాంగులీయాంకిత-
శ్రీమద్బాహుచతుష్కసంగతగదాశంఖారిపంకేరుహామ్ |
కాంచిత్కాంచినకాంచిలాంచ్ఛితలసత్పీతాంబరాలంబినీమ్
ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదమ్ || ౨-౨||

ఓ శ్రీ కృష్ణా! నీ నాలుగు బాహువులలో యున్న శంఖము, చక్రము, గద, పద్మము ఎంతో దివ్యముగా యున్నవి. నీవు ధరించిన భుజ కీర్తులు, దండము, కడియము, కంకణములు, ఉంగరములు చక్కని కాంతులను వెల్లివిరియ చేయుచున్నవి. నీ బంగారు కాంతి ఆభరణము యొక్క మిల మిలలు, పట్టు పీతాంబరముల యొక్క నిగనిగలు ఎంతో ఆహ్లాదకరములు. నీ పవిత్ర పాదములు నిర్మలమైన కమలముల కాంతులను విరజిమ్ముతున్నవి. దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులను రూపు మాపును. అట్టి నీ రూపమును నేను ఆశ్రయింతును.

యత్త్రైలోక్యమహీయసోఽపి మహితం సమ్మోహనం మోహనాత్
కాంతం కాంతినిధానతోఽపి మధురం మాధుర్యధుర్యాదపి |
సౌందర్యోత్తరతోఽపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోఽ-
ప్యాశ్చర్యం భువనే న కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో || ౨-౩||

విశ్వవ్యాప్తమైన ఓ విష్ణో! విభో! నీ రూపము మూడు లోకములందున్న గొప్ప వస్తువుల కన్నా మహత్తు కలది. మోహము కలిగించు వాటికంటే మోహనమైనది. కాంతి కలవాని కంటే గొప్ప కాంతి కలది. మధురమైన వాటికంటే మిక్కిలి మధురమైనది. సుందరమైన వస్తువలన్నిటి కంటే ఎంతో సుందరమైనది. ఆశ్చర్యము కలిగించే వస్తువుల కంటే ఆశ్చర్యమైనది. అట్టి నీ దివ్య స్వరూపమును దర్శించుటకు ఎవరు కుతుహూలపడరు?.

తత్తాదృఙ్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ
సా దేవీ పరమోత్సుకా చిరతరం నాఽస్తే స్వభక్తేష్వపి |
తేనాస్యా బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక-
ప్రేమస్థైర్యమయాదచాపలబలాచ్చాపల్యవార్తోదభూత్ || ౨-౪||

ప్రభూ! సకల సంపదలకు నిలయయైన లక్ష్మీ దేవి నీ అందచందములకు, నీ శుభ గుణ గణములకు ఆకర్షితురాలై నీ యందే స్థిరముగా నిలిచియున్నది. అందువలన ఆ దేవి తన భక్తుల దగ్గర ఎక్కువ కాలము నిలిచి యుండుట లేదు. కావున నీ మనోజ్ఞ రూప వైభవముపై గల అచంచలమైన ప్రేమానురాగాముల కారణముగా ఆమె తమ వద్ద నిలుకడగా యుండక పోవుటచే వారు ఆ దేవిని 'చపల' అని పెర్కొనుచున్నారు. ఇది ఎంత శోచనీయము స్వామీ!

లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం పరేష్వస్థిరే-
త్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే |
యే త్వద్ధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనా-
స్తేష్వేషా వసతి స్థిరైవ దయితప్రస్తావదత్తాదరా || ౨-౫||

లక్ష్మీపతీ! నీ అందమైన రూపగుణ సంపదలకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి నీ యందు స్థిరముగా ఉండుట సరే! అంతేకాదు ఆ దేవికి నీ పై కల అనురాగము వలన ఆమె తన స్వామి వైన నిన్ను నీ భక్తులు ధ్యానించుచు, నీ గుణ కీర్తనలో పరవశించి పోవుట చూసి వారి దగ్గర కూడ స్థిరముగా ఉండును. నీ భక్తులు కాని వారి వద్ద ఆ దేవి నిలిచి యున్దనుటకు ఇది మరియొక ఉదాహరణ.

ఏవంభూతమనోజ్ఞతానవసుధానిష్యందసందోహనం
త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్ |
సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం
వ్యాసించత్యపి శీతబాష్పవిసరైరానందమూర్చ్ఛోద్భవైః || ౨-౬||

ప్రభూ! నీ రూపము, లావణ్య వైభవము పరమానంద దాయకమైన అమృతమును వర్షింప జేయును. అది పరమ చిదానంద రసమునకు నిలయము. వినువారి చిత్తములను దోచుకొని, బుద్ధికి స్ఫూర్తిదాయకమై వెంటనే మత్తు కలిగించును. శరీరములకు గగుర్పాటు కలిగించును. ఆనంద పారవశ్యము వలన కలిగిన చల్లని కన్నీటిచే వరి శరీరములను తడిపి వేయును.


ఏవంభూతతయా హి భక్త్యభిహితో యోగః స యోగద్వయత్
కర్మజ్ఞానమయాద్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే |
సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమప్రకర్షాత్మికా
భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ || ౨-౭||

ఓ రమాపతీ! నీవు సౌన్దర్యానంద స్వారూపుడవు. నీ యందు అమితమైన ప్రేమతో నిండిన భక్తి, సామాన్యులకు కూడ ఈలోకములో ఎటువంటి శ్రమ లేకుండా లభించును. అందుకే, కర్మ, జ్ఞాన యోగముల కంటే భక్తి యోగం ఉత్తమమైనది అని యోగీశ్వరులు చెపుతున్నారు.

నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం
తద్దూరేత్యఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః |
తత్త్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో
త్వత్ప్రేమాత్మకభక్తిరేవ సతతం స్వాదీయసీ శ్రేయసీ || ౨-౮||

ధర్మయ శాస్త్రములందు ఆయా వర్ణముల వారికి చెప్పబడిన కర్మలను విధిగా ఆచరించుచు వాటి వల్ల కలుగు ఫలితమును ఆశించక యుండుట కర్మ యోగమనబడును. ఇట్టి కర్మ యోగము వలన ఫలితము చాలా ఆలస్యముగా లభించును. అట్లే, ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మ జ్ఞానము సామాన్యులకు తేలికగా లభించదు. అట్టి జ్ఞానమును పొందుటకై మనస్సు చాలా కష్ట పడ వలెను. స్వామీ! పై రెండిటి కంటే నిన్నే లోతుగా ప్రేమించుట అనే భక్తి మిక్కిలి సులభమైనది, రుచికరమైనది, శ్రేయస్కరమైనది.

అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలాః
బోధే భక్తిపథేఽథవాప్యుచితతామాయాంతి కిం తావతా |
క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పున-
శ్చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిధ్యంతి జన్మాంతరైః || ౨-౯

స్వామీ! నిత్య నైమిత్తిక కర్మలు నియమ బద్ధంగా చేయవలెననిచో  చాలా కష్టము కలుగును. అట్టి కష్టముతో కర్మలు చేసి పాపములకు దూరమైన వారు తమ తమ యోగ్యతలను అనుసరించి జ్ఞాన మార్గమున లేక భక్తి మార్గమున ప్రవేశించు చున్నారు. మరి కొందరు జ్ఞాన మార్గమున అనేక కష్టములను అనుభవించుచు అనేక జన్మల తర్వాత మాత్రమే పరబ్రహ్మ రూపుడవైన నిన్ను పొందుచున్నారు.

త్వద్భక్తిస్తు కథారసామృతఝరీనిర్మజ్జనేన స్వయం
సిద్ధ్యంతీ విమలప్రబోధపదవీమక్లేశతస్తన్వతీ |
సద్యః సిద్ధికరీ జయత్యయి విభో సైవాస్తు మే త్వత్పద-
ప్రేమప్రౌఢిరసార్ద్రతా ద్రుతతరం వాతాలయాధీశ్వర || ౨-౧౦||

గురువాయురప్ప! శ్రీ కృష్ణా! నీ సుమధురమైన కథారస ప్రవాహములో మునిగినచో నీ భక్తి అతి సులభముగా లభించును. సుందరమైన నీ కథలను వినుట చేత నిర్మలమైన జ్ఞానము కూడ సులభముగా లభించును. దాని వలన భక్తుడు తాను కోరుకున్న కోరికల ఫలములను కూడ వెంటనే పొందగలుగుచున్నాడు. ఓ పరమాత్మా! అందువలన నీ పాద భక్తి వలన నా మనస్సు మిక్కిలి శీఘ్రముగా ఆనందమున మునిగి పరవశించునట్లు చేయుము.

మూడవ దశకము - భక్తి స్వరూప వర్ణనము - భక్తికై ప్రార్థన

పఠంతో నామాని ప్రమదభరసింధౌ నిపతితాః
స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథాః |
చరంతో యే భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూ-
నహం ధన్యాన్మన్యే సమధిగతసర్వాభిలషితాన్ || ౩-౧||

భక్తుల కోరికలను తీర్చే కృష్ణా!  భక్తులు నీ దివ్య నాములను పఠించుచు, నీ పరమ సుందర రూపమును స్మరించు చున్నారు. అట్లే కళ్యాణ గుణములు కల నీ దివ్య కథలను గానము చేయుచు ఆనంద సముద్రమున ఓలలాడుచు ఈ భూమిపై తిరుగుచుందురు. నిన్ను ఎల్లప్పుడూ ధ్యానించే భక్తుల కోర్కెలను నీవు కరుణతో తీర్చెదవు. కావున కోరికలన్నీ తీరి పరమానందములో ఓలలాడే భక్తులు ధన్యులని భావింతును.

గదక్లిష్టం కష్టం తవ చరణసేవారసభరేఽ-
ప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయామ్ |
భవత్పాదాంభోజస్మరణరసికో నామనివహా-
నహం గాయంగాయం కుహచన వివత్స్యామి విజనే || ౩-౨||

శ్రీమన్నారాయణ! నీ పాద పద్మములను భక్తితో సేవించ దలచితిని. కాని అనారోగ్యముతో బాధపడుతున్న నా మనస్సు అందుకు విముఖముగా ఉన్నది. ఏమి చేయుదును?. అందువలన నా పై దయ చూపించినచో నీ పాద పద్మములను అనన్య భక్తితో సేవిస్తూ ఏకాంతమున నీ దివ్య నామములను అనుక్షణము ఆనందముతో గానము చేయుచు ఉందును.

కృపా తే జాతా చేత్కిమివ న హి లభ్యం తనుభృతాం
మదీయక్లేశౌఘప్రశమనదశా నామ కియతీ |
న కే కే లోకేఽస్మిన్ననిశమయి శోకాభిరహితా
భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే || ౩-౩||

స్వామీ! నీ అనుగ్రహము కలిగినచో ప్రాణులకు సిద్ధించనిది ఏముండును? అందువలన నా రోగ బాదానివారణం అనేది నీకు అత్యంత స్వల్పమైన విషయము. నీ అనుగ్రహము వలననే ఎట్టి కోరికలు లేని నీ భక్తులు ఎల్లప్పుడూ దుఃఖము ఏ మాత్రము లేక ముక్తిని పొంది శాశ్వత సుఖమును అనుభవించు చున్నారు.

మునిప్రౌఢా రూఢా జగతి ఖలు గూఢాత్మగతయో
భవత్పాదాంభోజస్మరణవిరుజో నారదముఖాః |
చరంతీశ స్వైరం సతతపరినిర్భాతపరచిత్-
సదానందాద్వైతప్రసరపరిమగ్నాః కిమపరమ్ || ౩-౪||

ప్రభూ! ఆత్మ జ్ఞాన సంపన్నులైన నారదాది మునీశ్వరులు నీ పాద పద్మములను సదా స్మరించుచున్నందు వలన ఎట్టి బాధలు లేక సచ్చిదానందములో సదా నిమగ్నులై స్వేచ్ఛగా సంచరించు చున్నారు. వారికి ఇంత కన్నా కావలసినది ఏమున్నది?.

భవద్భక్తిః స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయేత్-
అశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహకణికా |
న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచో
భవేన్మిథ్యా రథ్యాపురుషవచనప్రాయమఖిలమ్ || ౩-౫||

స్వామీ! నాకు నీ చరణారవిన్దములపై భక్తి మిక్కిలి కలుగునట్లు దయతో అనుగ్రహించుము. ఆ భక్తి నా సమస్త బాధలను తప్పక దూరము చేయును. అందులో నాకు ఎట్టి సందేహము లేదు. కానిచో భగవద్గీత మొదలగు గ్రంథములందు వేదవ్యాసుడు ప్రవచించిన మాటలు, వేదములందు చెప్పబడిన వాక్కులు అన్ని చిల్లర జనము యొక్క మాటల వలె వ్యర్థమగును.

భవద్భక్తిస్తావత్ప్రముఖమధురా త్వాద్గుణరసాత్
కిమప్యారూఢా చేదఖిలపరితాపప్రశమనీ |
పునశ్చాంతే స్వాంతే విమలపరి బోధోదయమిళన్
మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరమ్ || ౩-౬||

ప్రభూ! నీ చరణారవిందముల యందలి భక్తి నీ గుణ రసానందానుభావము వలన మధురాతి మధురమైనది. అట్టి భక్తి క్రమ క్రమముగా పెరిగినచో ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైన అన్ని తాపములు నశించును. అట్లే, చివరకు నిర్మలమైన జ్ఞానోదయము కలిగి బ్రహ్మానందమున ఓలలాడుట కూడ జరుగును. మానవునకు ఇంత కంటే కోరుకోన వలసినది ఏమి కలదు?.

విధూయ క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం
భవత్క్షేత్రప్రాప్తౌ కరమపి చ తే పూజనవిధౌ |
భవన్మూర్త్యాలోకే నయనమథ తే పాదతులసీ-
పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే || ౩-౭||

స్వామీ! నా బాధలనన్నిటినీ దూరము చేసి, నా పాదములు నీ దివ్యక్షేత్రము చేరునటులు, నా చేతులు నిన్ను పూజించునట్లు, నా నేత్రములు నీ దివ్యమైన స్వరూపమును సందర్శించునట్లు, నా ఘ్రాణేంద్రియములు నీ పాదములన్దున్న తులసిని అఘ్రాణించునట్లు, నా చెవులు మధురమైన నీ గాథలను మిక్కిలి భక్తితో వినునట్లు అనుగ్రహించుము. ఆ విధముగా నేను ఆనందానుభూతిని పొందెదను.

ప్రభూతాధివ్యాధిప్రసభచలితే మామకహృది
త్వదీయం తద్రూపం పరమసుఖచిద్రూపముదియాత్ |
ఉదంచద్రోమాంచో గలితబహుహర్షాశ్రునివహో
యథా విస్మర్యాసం దురుపశమపీడాపరిభవాన్ || ౩-౮||

స్వామీ! మిక్కుటమైన శరీరవ్యాధులతో, మానసిక బాధలచే మిక్కిలి చంచలమైన నా హృదయమునందు పరమానంద దాయకమైన నీ మనోహర రూపము ఉదయించునట్లు చేయుము. అందువలన ఆనందమున మగ్నుడనై శరీరమంతయు గగుర్పాటు చెందగా ఆనంద బాష్పములు జాలువారగా ఏ మాత్రము తగ్గని సమస్త బాధలను సైతము మరచి పోవుదును.

మరుద్గేహాధీశ త్వయి ఖలు పరాంచోఽపి సుఖినో
భవత్స్నేహీ సోఽహం సుబహు పరితప్యే చ కిమిదమ్ |
అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్
భవత్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన || ౩-౯||

గురువాయూరప్పా! కంస హరణా! నీ పట్ల ఏ మాత్రము భక్తి లేని వారు సుఖములను అనుభవించు చున్నారు. కానే నీ యందు సంపూర్ణానురాగము కల నేను మాత్రము ఈ విధముగా రోగముతో బాధ పడుతున్నాను. ఇదేమి విచిత్రము? భక్తులు కోరిన వరము లొసగు స్వామీ! దీని వలన నీకు చాలా అపకీర్తి కలుగునయ్య! అది సముచితము కాదు కదా! దయతో నా రోగ బాధను తగ్గించి వెంటనే నీ భక్తులలో శ్రేష్ఠునిగా చేయుము.

కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణా యావదుదియాత్
అహం తావద్దేవ ప్రహితవివిధార్తప్రలపితః |
పురః క్లృప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్
యథాశక్తి వ్యక్తం నతినుతినిషేవా విరచయన్ || ౩-౧౦||

భక్తులు కోరిన వరము లొసగు ఓ స్వామీ! ఇంక అతిగా నా బాధలు చెప్పుకొనుట అనవసరము. నాకు కలిగిన రోగ బాధల వలన వ్యర్థమైన ప్రలాపనలు చేయుచుంటిని. వాటిని మానుకొని నీకు దయ కలుగునంత వరకు నా శక్తి మేరకు నీ దగ్గర నమస్కారములు, స్తుతులు, సేవలు చేయుచు దినములను గడుపుటకు నిశ్చయించు కొంటిని. ఇది తథ్యము.

పాండురంగాష్టకం - తాత్పర్యము

పండరీపుర దైవమైన  పాండురంగని మహిమలు మనకు పుండరీకుని గాథ ద్వారా తెలుస్తుంది. 


పండరీపురంలో పుండరీకుడనే  వర్తకుడుండే వాడు. ముసలి వారైన అతని తల్లిదండ్రులు తన అభివృద్ధికి ఆటంకమని తలచి వారిని ఇంట్లోనుంచి గెంటి వేస్తాడు. వారు  ఒక పేద యాత్రికుల బృందములో చేరి కాలి నడకన  కాశీ ప్రయాణం బయలు దేరుతారు. పుండరీకుడు మాత్రం అశ్వాలు, రథాలతో బయలుదేరుతాడు. దారిలో తల్లిదండ్రులను దాటినా, వారిని పట్టించుకోకుండా ముందుకు సాగుతాడు.

దారిలో అతను రోహిత దాసుడనే చర్మకారుడి కుటీరం చూస్తాడు. రోహిత దాసుడు తన సుఖాలను పక్కకు పెట్టి తన తల్లిదండ్రులకు భక్తి తో సేవ చేస్తుంటాడు. అక్కడ ఆ రోజు రాత్రి పుండరీకుడు కొలనులో ముగ్గురు అందవిహీనమైన స్త్రీలు మునిగి అందమైన దేవతా స్త్రీలగా మారటం చూస్తాడు. వారిని గంగ యమునా గోదావరి నదులుగా తెలుసుకుంటాడు. ఆ నదులు తమలో మునిగిన వారి పాపముల వలన అందవిహీనంగా మారి, ఇక్కడ రోహితుని కుటీరంలో ఉన్న పవిత్రమైన నీటిలో స్నానం చేసి వాటిని ప్రక్షాళనం చేసుకుంటున్నామని చెపుతారు. అది కేవలం రోహితుడు తన తల్లిదండ్రులను సేవించటం వలన జరిగిందని తెలుసుకుంటాడు.

అప్పుడు పుండరీకుని జ్ఞానోదయం కలిగి తల్లీ దండ్రులను కలుసుకొని వారిని, క్షమించమని అడిగి,  తన వద్దకు తీసుకువెళ్ళి మిగిలిన జీవితమంతా వారి సేవ చేస్తాడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఒక గొల్లకాపరి రూపంలో పుండరీకుని నివాసానికి వెళ్తాడు. పుండరీకుడు తాను తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడనై ఉన్నానని, వేచి ఉండమని చెప్తాడు. విష్ణుమూర్తి తాను ఎవరు అన్నది తెలుపుతాడు. అయినా, పుండరీకుడు తాను తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, తాను వచ్చేంత వరకు ఇటుకపై కుఉర్చోని ఉండమని చెప్తాడు. అతని మాతృ, పితృ భక్తికి మెచ్చి విష్ణువు ఆ ఇటుకపైనే కూర్చుని అక్కడ శిలారూపంలో వెలుస్తాడు. అదే పండరిపురంలోని దివ్యక్షేత్రము. అటు తర్వాత, పుండరీకుడు ఆ  విఠలుని  (కదలని ఇటుకపై ఉన్నవాడు) సేవలో తరించి ఐక్యమవుతాడు.

ఆ పండరీ పుర వాసుని స్తుతిస్తూ జగద్గురువులు రచించిన పాండురంగాష్టకము, తాత్పర్యము మీకోసం.   శ్రవణం ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పీ.బీ. శ్రీనివాస్ గారు) గారి గళంలో



మహాయోగపీఠే తటే భీమరథ్యా
వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః
సమాగత్య తిష్ఠంతమానందకందం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

తటిద్వాససం నీలమేఘావభాసం
రమామందిరం సుందరం చిత్ప్రకాశం
వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం
నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే
శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసం
శివం శాంతమీడ్యం వరం లోకపాలం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

శరచ్చంద్రబింబాననం చారుహాసం
లసత్కుండలాక్రాంతగండస్థలాంతం
జపారాగబింబాధరం కంజనేత్రం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

కిరీటోజ్వలత్సర్వదిక్ప్రాంతభాగం
సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః
త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

విభుం వేణునాదం చరంతం దురంతం
స్వయం లీలయా గోపవేషం దధానం
గవాం బృందకానందదం చారుహాసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

అజం రుక్మిణీప్రాణసంజీవనం తం
పరంధామ కైవల్యమేకం తురీయం
ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం

స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే
పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యం
భవాంభోనిధిం తే వితీర్త్వాంతకాలే
హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి

ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ పాండురంగాష్టకం సంపూర్ణం

తాత్పర్యము: 

మహాయోగ పీఠం అయిన పండరీపురంలో, భీమ రథీ తీరంలో, మునీన్ద్రులతో కూడి పుండరీకునికి వరములిచ్చిన, అనంతమైన ఆనందమునకు మూలమైన, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

తన పాదపద్మములను ఇటుకలో స్థిరముగా ఉంచిన వాడు (విఠలుడు), మెరుపు తీగవలె అలంకరించబడిన వాడు, నీల మేఘ శ్యాముడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, సుందరమైన వాడు, ప్రకాశించే అంతరంగము కలవాడు,  పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

చేతులను వంచి నడుముపై ఉంచుకొని ఈ మిథ్యా ప్రపంచమంతా నడుములోతు వరకే అని సందేశాన్ని ఇచ్చే, తన నాభి నుండి కమలమును సృష్టించి అందులో బ్రహ్మకు నివాసము ఏర్పరచిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

కౌస్తుభ మణిని మెడలో ధరించిన వాడు, అందమైన భుజకీర్తులు కలవాడు, అందంగా అలంకరించబడిన కురులు కలవాడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, శాంతమైన వాడు, శుభకరుడు, జగత్తును కాపాడే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

శరత్కాలములోని చంద్రుని వంటి ముఖము కలవాడు, సమ్మోహనము కలిగించే చిరునవ్వు కలవాడు, మెరిసే కర్ణ కుండలములు  చెంపలపై వరకు కలవాడు, ఎర్రని మందారము రంగులో, దొండపండు వంటి పెదవి కలవాడు, కలువ పూల వంటి కళ్ళు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

నలుదిక్కుల ప్రసరించే ప్రకాశము గల కిరీటమును ధరించిన వాడు, దేవతలచే అమూల్యమైన రత్నములతో పూజించబడే వాడు, మూడు వంపుల ఆహర్యములో నిలబడిన వాడు, వన మాలలు, శిఖి పించము ధరించిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

సర్వ వ్యాప్తమైన వాడు, వేణువును వాయించే వాడు, దుష్టుల పాలిటి చరమ గీతమైన వాడు, ఆటగా గోపాలుని వేషములో ఉండేవాడు, గోవులకు ఆనందము కలిగించే వాడు, వికసించిన కలువ వంటి చిరు నవ్వు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

జననము లేని వాడు, రుక్మిణీ వల్లభుడు, అనంతమైన ప్రకాశకుడు, ఏకైక మోక్ష కారకుడు, నాలుగవ స్థితి (తురీయం) అయిన వాడు,  ప్రసన్నుడు, దేవ దేవుడు, శరణాగతుల ఆర్తిని పోగొట్టే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 

పాండురంగని నుతించే ఈ స్తోత్రాన్ని భక్తి మరియు శ్రద్ధతో పఠించే వారు సులభముగా సంసార సాగరాన్ని దాటి, విష్ణు లోక నివాసము పొందుతారు.

శ్రీమన్నారాయణీయం - ఉపోద్ఘాతము


భక్తాగ్రేసరుడు అయిన నారాయణ భట్టతిరి ముఖమునుండి సంస్కృతమున వెలువడిన మధురమైన రచన శ్రీమన్నారాయణీయం. ఇది వ్యాస భాగవతమునకు సంగ్రహ రూపము. దైవ స్తుతి రూపములో కొనసాగే ఈ గ్రంథము కేరళలోని గురువాయూరు క్షేత్రమున వెలసిన శ్రీ మహావిష్ణువును సంబోధిస్తూ రచించబడినది.

కేరళలోని నంబూద్రి వంశమున జన్మించిన నారాయణ భట్టతిరి మంచి పండితుడు. వేద వేదాంగములను అభ్యసించి, వ్యాకరణాది శాస్త్రములలో ఆరితేరి సంస్కృతములో ఎన్నో గ్రంథాలు రచించాడు. వీటిలో శ్రీ పాద స్తుతి, గురువాయుపుర స్తోత్రము, నారాయణీయము ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.

భట్టతిరి రోగగ్రస్తుడై ఎన్ని ఔషధములు సేవించినా కూడ స్వస్థత చేకూరక, గురువాయుపురం వచ్చి అక్కడ ఆరాధ్యదైవమైన శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. ఆ స్వామి సమక్షంలో మహాకవి యొక్క ముఖము నుండి వెలువడిన స్తుతి పరంపరయే నారాయణీయం. ఇందులో వంద దశకములుగా వేయికి పైగా శ్లోకములున్నవి. భక్తి జ్ఞాన వైరాగ్యములు పెన వేసికొని సాగిన అద్భుత రచన ఇది. ఈ నారాయణీయము నందలి శ్లోక రూపమున ఉన్న స్తుతులతో ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో భట్ట తిరి సంపూర్ణమైన ఆరోగ్యమును తిరిగి పొందాడు. 

గురువాయూర్ క్షేత్ర పురాణం: 


ఇక్కడ అర్చనా మూర్తి అయిన శ్రీ మహావిష్ణువు తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇచ్చాడని ప్రతీతి. ఆ బ్రహ్మ దానిని సుతపుడనే మహర్షికి ప్రసాదించాడు. ఆ ముని దానిని కశ్యప ప్రజాపతికి సమర్పించగా ఆయన నుండి అది శ్రీ కృష్ణుని జనకుడైన వసుదేవుని వద్దకు చేరింది. శ్రీ కృష్ణుడు దానిని ద్వారకలో స్థాపించి పూజించాడు. ద్వాపర యుగాంతమున ద్వారక సముద్రములో మునిగి పోవునప్పుడు ఆ దివ్యమూర్తి కొట్టుకొని పోకుండుటకై "దేవతల గురువైన బృహస్పతి ద్వారా దానిని ఒక పవిత్రమైన క్షేత్రములో ప్రతిష్ఠింప చేయుము" అని శ్రీ కృష్ణుడు తన భక్తుడైన ఉద్దవుని ఆదేశిస్తాడు. శ్రీ కృష్ణుని ఆజ్ఞ మేరకు బృహస్పతి వాయుదేవునితో కూడి పవిత్రమైన క్షేత్రము కొరకు వెతుకుతాడు. చివరకు పరమేశ్వరుని సూచన మేరకు గురువు, వాయువు ఆ దివ్య తేజోమూర్తిని పశ్చిమ సముద్ర ప్రాంతమున అంబాపురం అను గ్రామములో ప్రతిష్ఠింప చేస్తారు. గురువు మరియు వాయువు కలిసి ప్రతిష్ఠించుటచే ఆ క్షేత్రానికి గురువాయూరు అని పేరు వచ్చిందిట.

కలియుగ ప్రారంభంలో నిర్మించబడిన ఈ మందిరాన్ని ఒక పాండ్య రాజు పునర్నిర్మించాడు.  ఆ మహారాజు సభలో ఒకరోజు జ్యోతిష్యవేత్తలు "ఓ రాజ! నీవు పది  మాసములలో పాముకాటు వలన మరణిస్తావు" అని తెలుపుతారు. రాజు పవిత్రమైన జీవితము గడుపుతూ ఆ పది మాసములలో దివ్యక్షేత్రాలను దర్శిస్తూ గురువాయూరునకు వచ్చి స్వామిని సేవిస్తాడు. పది మాసముల తర్వాత రాజు క్షేమముగా రాజ్యమునకు తిరిగి వచ్చి జ్యోతిష్కుల మాటలు వమ్ము అయినవని ప్రకటిస్తాడు. దానికి సమాధానముగా వారు రాజు పాము కాటుకు గురియైన విషయము నిజమేనని, కాని ఆ సమయమున రాజు గురువాయూరు క్షేత్రమున ఆదిశేషునితో కూడియున్న శ్రీ మహావిష్ణువును సేవించు చుండటం వలన ఆయనకు మృత్యు ప్రమాదము తప్పినదని తెలిపుతారు. ఆయన శరీరముపై పాముకాటు గుర్తులు ఉండుట చూసి జ్యోతిష్కుల మాట సత్యమే అని అందరు నమ్ముతారు. అప్పుడు రాజు గురువాయూరు మందిరాన్ని పునరుద్ధరించినట్లు ప్రతీతి. నేటికి మహా వ్యాధులకు గురైన వారు ఆ స్వామిని దర్శించి సేవించటం వలన సంపూర్ణారోగ్యముతో వర్ధిల్లుతున్నారు. క్షేత్రాన్ని దర్శించటానికి ఆశక్తులైన వారు ఈ నారాయణీయమును పారాయణము చేసినచో వారికి అట్టి సత్ఫలితాలే ప్రాప్తించునని నమ్మకం.

కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ నారాయణీయమును భక్తిప్రపత్తులతో పారాయణము చేస్తారు. నేను ప్రచురించ బోయే ఈ పది స్కందాల ధారావాహికానికి మూలం sanskritdocuments.org.

ఈ మార్గశిర మాసం శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనది (మాసాణాం మార్గశీర్షోహం - మాసములలో నేను మార్గశిరాన్ని అని ఆయన అన్నాడు). అలాగే, సూర్యుడు ధను రాశిలో ప్రవేశించే మాసము ధనుర్మాసంగా పిలవబడుతుంది. గోదా, రంగ నాథుల వైభవాన్ని చాటే తిరుప్పావై ప్రవచనం, అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువునకు సేవలు, రక రకాల నివేదనలు - వీటితో సాగిపోతుంది మార్గశిరము మరియు పుష్య మాసం లోని సగ భాగం. ఈ సందర్భంగా మీకోసం నారాయణీయంతో వస్తున్నాను.  

ఓం నమో నారాయణాయ.

2, డిసెంబర్ 2010, గురువారం

ప్రేమ - సాఫల్యము - ప్రేయసి భావన

ప్రేయసి ప్రియుని సేద తీరుస్తూ ఒక భావ యుక్తమైన ఆరాధనా భావమున్న గీతం ఆలపిస్తే ఏమవుతుంది?. ప్రియుని ఒంట్లో, మనసులో ఉన్న అలసట, అలజడి మాటు మాయమై గాఢమైన నిద్ర, ప్రశాంతమైన మనోభావము కలుగుతుంది. అది ప్రేమలో ఉన్న శక్తి. అద్భుతమే మరి ఈ ప్రేమ అనే రెండక్షరాల మంత్ర ఫలము.
 
మరి ఆ ప్రేమలో సాఫల్యానికి కావలసింది ఏమిటి? - ధైర్యము, స్థైర్యము, త్యాగము, నిరాడంబరముతో కూడిన పరిపూర్ణ వ్యక్తిత్వము. తనను తాను పూర్తిగా సమర్పించుకోవటం.  ప్రేమలో సమర్పించుకోవటం అంటే దాసోహం అని కాదు. తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ, భాగస్వామి ఆనందం కోసం ఎంత కష్టమైనా చిరునవ్వుతో ఎదుర్కోవటం. ఇది చెప్పినంత సులువు కాదు. తన అహాన్ని, ఇష్టాయిష్టాలను పక్కకు బెట్టగలిగితేనే ఇది సాధ్యమవుతుంది.

నిజమైన ప్రేమ భాగస్వామిలోని మంచి లక్షణాలను గుర్తించి వాటిని ఆరాధించటంతో మొదలు పెడితే అది మంచి పునాది అవుతుంది. దేహ సౌందర్యానికి, అంతస్తుకు ప్రాధాన్యత ఇస్తే అది నిలవదు. ఎందుకంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించినప్పుడు జరిగేది నిజ వ్యక్తిత్వ వ్యక్తీకరణ, నిజ స్పందన. ఈ నిజాలు బయట పడుతున్నప్పుడు అవతలి వ్యక్తి సౌందర్యము, అంతస్తు తెరపైన, మనసులో కూడ ఉండవు. అందుకని, నిజ వ్యక్తిత్వాన్ని దాచుకోకుండా ప్రేమ మొదలు పెడితే, అది దాంపత్యముగా, ప్రణయ వైవాహిక జీవితంగా మారుతుంది. మరి భాగస్వామిలో సుగుణాలను గుర్తించటం అంటే?. మొదలు అతని/ఆమె వ్యక్తిత్వాన్ని యథాతథంగా గౌరవించ గలగటం. నీలో నాకు ఇది నచ్చ లేదు అని చెప్పే ముందు మనలో అవతలి వ్యక్తికి ఏమి నచ్చవో ఆలోచించ గలిగితే, గౌరవం మొలకెత్తుతుంది. ఎప్పుడు మన వైపు నుంచే ఆలోచిస్తే, పూర్తిగా అది స్వార్థంతో కూడిన సంబంధంగా నలిగి నశిస్తుంది.

జీవితంలో ఎక్కువ శాతం మన అహాన్ని నిలుపుకోవటం లోనే సరిపోతుంది. నేనే ఎందుకు చేయాలి, నేనే ఎందుకు మరలి, నాకోసం ఇది చేయాలి, నాకు ఎప్పుడు జేజేలు కొట్టాలి - ఈ భావాలన్నీ అహం యొక్క పిలకలే. ప్రేమలో అహం ఉంటే, అది నిత్య రామాయణానికి దారి తీస్తుంది. ఈ భావాన్ని వీడ గలిగితే, ప్రణయం ఎంతో మధురంగా ఉంటుంది. అందుకనే, ప్రేమలో వ్యక్తిత్వ వికాసము, త్యాగము, దృఢ సంకల్పము, మానసిక పరిణతి ఎంతో ముఖ్యం. ఇది 16 - 19 ఏళ్ల వయసులో చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకనే ఆ వయసులోని ప్రేమ సఫలమవ్వటం చాలా కష్టం. 22 -25 ఏళ్ల వయసులో మొదలయ్యే ప్రేమ చిన్న పిల్లల చేష్టలకు, అహానికి, కోపతాపాలకు కొంత దూరంగా ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి, వ్యక్తిత్వాని అభివృద్ధి పరచుకొని, అప్పుడు జీవిత భాగ స్వామిని ఎన్నుకునే పనిలో పడితే, అది స్వర్ణ జయంతి వివాహంగా నిలిచే అవకాశం ఎక్కువ.

గుడ్డివాడైన ప్రియుని కోసం ఒక ప్రేయసి ఎంత మధురంగా ఉండగలిగిందో ఊహించ గలరా?.

వెన్నెల లోని అభివృద్ధి అంతా నీ కళ్లలో వెలిగిస్తాను, బాధ మరచి పోయి హాయిగా నిద్రపో అనే పల్లవిలో సాగేది ఈ గీతం.

మొదటి చరణంలో - అందమైన ప్రపంచం వర్ణన చేయాలి అంటే వసంతకాలంలోని ప్రకృతి అందాలు మంచి ఉపమానం. చిగురించి నిండుగా పచ్చగా ఉండే కాలం ఉత్సాహకరమైన భావనను, మంచి ఆలోచనలను రేకెత్తిస్తుంది. అందుకనే కవి, వాడని పూవులతో ఉన్న చెట్లను ఈ గీతంలో ఉపమానంగా ఉపయోగించారు. అటువంటి వసంతకాలంలో చెలి వినోద రాగాలను జోలగా పాడుతుంటే, కలల సుఖాలలో తేలుతూ హాయిత నిదురించు అని ప్రేయసి ఆలపిస్తుంది. ప్రకృతి, వసంతకాలము, మంచి రాగము, జోల పాట పాడే చెలి ఉంటే నిద్దుర రాకుండా  ఎలా ఉంటుంది? అందమైన కల కలిగి తీరాల్సిందే.

రెండవ చరణంలో - సూర్యుని వీడని నీడలా (ఆయన పత్ని ఛాయ) నీ భావములో నీ తరిస్తాను అని చెలి తన పరి పూర్ణ వ్యక్తిత్వాన్ని, గాఢ మైన ప్రేమను వ్యక్త పరుస్తుంది. అంటే, అతని భావములో తాను జీవించి, ఆస్వాదించి, అతనితో కలసి తరిస్తుంది అని అర్థం. మరి దానికి దేన్ని ఎదుర్కోటానికైన ఆమె సిద్ధమే. నీ సేవలోనే తరిస్తాను, నీ హృదయములో నివశిస్తాను అని ప్రేయసి అతనికి ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. సేవ అంటే కేవలం శారీరకంగా కాదు, దానికి మానసిక భావన, నిజాయితీ మెట్టుగా వేసుకొని ముందడగు వేయటం. అటువంటి సేవ చేస్తే మరి హృదయంలో స్థానం ఏర్పడి తీరాల్సిందే. 


మనసు కవి, మన సుకవి, ఆచార్య ఆత్రేయ రచించిన ఇంత అందమైన ప్రేమ భావానికి నాయిక నాయకులు గా మహానటి సావిత్రి, అక్కినేని కూడితే? దానికి రసరాజు సాలూరి రాజేశ్వర రావు గారు మంచి మాధుర్య భరితమైన సంగీతాని కూరిస్తే? అదే ఆరాధన చిత్రంలోని వెన్నెల లోని వికాసమే వెలిగించెద నీ కనులా అనీ ఈ రమణీయ గీతం. వింటే ప్రేమ పుష్పాలు వికసించి మనసు పులకించాల్సిందే. విని ప్రేమ రసాస్వాదన పొందుతారని ఆశిస్తూ, మీ కోసం ఈ గీతం సాహిత్యం, యూట్యూబ్ దృశ్య శ్రవణం.

వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయీ నిదురించుము ఈ రేయీ |వెన్నెల|


వాడని పూవుల తావితో కదలాడే సుందర వసంతమీ కాలము కదలాడే సుందర వసంతమీ కాలము
చెలి జోలగ పాడే వినోద రాగాలలో చెలి జోలగ పాడే వినోద రాగాలలో తేలెడి కలల సుఖాలలో నిదురించుము ఈ రేయి |వెన్నెల|


భానుని వీడని ఛాయగా నీ భావములో నే తరింతునోయి సఖా నీ భావములో నే తరింతునోయి సఖా
నీ సేవలలోనే తరింతునోయీ సదా నీ సేవలలోనే తరింతునోయీ సదా 
నీ ఎదలోనే వసింతులే నిదురించుము ఈ రేయీ నిదురించుము ఈ రేయీ |వెన్నెల|

29, నవంబర్ 2010, సోమవారం

బిలహరి రాగం - కనుగొంటిని శ్రీరాముని



అన్నగారు తన ఇలవేల్పుయైన సీతారాముల విగ్రహాన్ని ఈర్ష్యతో కావేటిలో పడవేస్తే, మన త్యాగ బ్రహ్మంగారు రాముడు లేని ఇంట నేను ఉండనని ఆయనను వెదుకుతూ బయలు దేరుతాడు. అలా తిరుగుతూ, ఎన్నో క్షేత్రాలు తిరిగి అక్కడి వేల్పులను స్తుతించి అద్భుతమైన కీర్తనలు రచిస్తాడు. అటు పిమ్మట కావేరిలో స్నానం చేస్తుండగా ఆ సీతారాముల ప్రతిమ త్యాగరాజుకి లభ్యమవుతుంది. ఆ ఆనందానుభూతిలో త్యాగరాజు రచించిన కీర్తన బిలహరి రాగంలో కనుగొంటిని శ్రీరాముని. ఇదే రాగంలో రుద్రవీణ చలన చిత్రంలో నీతోనే ఆగేనా బిలహరి అని ఏసుదాస్ గారు శ్రావ్యమైన శాస్త్రీయ గీతం ఆలాపించారు. బిలహరి రాగానికి ధన్యత చేకూర్చారు ఏసుదాస్ గారు. 

త్యాగరాజస్వామి వారు కావేరీనదిలో తన ఆరాధ్యమూర్తులైన రామపరివారం తిరిగి లభించగానే వ్రాసిన కృతి కనుగొంటిని శ్రీరాముని అని ఆయన శిష్య పరంపర చెప్పుకుంటారు. తాను నిత్యము కొలిచే స్వామి దూరమైతే ఆయన మనసు ఎంత తల్లడిల్లి ఉంటుందో కదా! సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని సీతారాములను జననీజనకులుగా త్రికరణ శుద్ధిగా భావించిన ఆయన ఆ మూర్తుల తాత్కాలిక వియోగాన్ని భరించలేకపోయారు. చెట్టున పుట్టనా, తటాకాలలో, నదులలో అంతటా వెదుకుతూ చివరకు కావేరిలోనే తిరిగి పొంది ఆనందబాష్పాలు రాలుస్తూ ఈ కృతిని ఆలపించారు. మనం చిన్న వస్తువు కనిపించకపోతేనే ఎంత వెదుకుతామో, అల్లాడిపోతామో, మరి త్యాగరాజస్వామి పరిస్థితి ఊహించండి. తన సర్వసము రాముడే కదా! ఆ మూర్తి తిరిగి దొరికితే ఆయన అస్తిత్వం మొత్తం తిరిగి వచ్చినట్లే కదా! కృతి వివరాలు:

సాహిత్యం
=======

కనుగొంటిని శ్రీ రాముని నేడు

ఇనకులమున ఇంపు గాను బుట్టి 
ఇలలోన సీతా నాయకుని నేడు 

భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ 
పవమాన సుతుడు పాదముల బట్ట 
ధీరులైన సుగ్రీవ ప్రముఖులు 
వినుతి సేయ త్యాగరాజ నుతుని నేడు

భావం
=====

సూర్యవంశమున ఆనందము కలిగించగా పుట్టిన సీతాపతి అయిన రాముని నేడు కనుగొన్నాను. భరతలక్ష్మణశతృఘ్నులు కొలుచుచుండగా, వాయుపుత్రుడైన హనుమంతుడు పాదములు పట్టగా, ధీరులైన సుగ్రీవాది ప్రముఖులు ప్రస్తుతించగా, పరమశివునిచే నుతించబడిన శ్రీరాముని నేడు కనుగొన్నాను. 

శ్రవణం
=====

బిలహరి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు. 

https://youtu.be/jN1H_s8u6yc?t=1073 

శుభోదయం

శరదృతువునకు వీడ్కోలు పలుకుదామా అనే వేళ, పొద్దున్నే పై అంతస్థుకి వెళ్లి చూస్తే - అహో ఏమి సౌందర్యం ప్రకృతి కౌగిట ఒదిగిన భాగ్యనగరానిది. మబ్బుల, దట్టమైన మంచు చాటున దాగిన సూర్యుడు, విశ్వవ్యాప్తమైన ఆ పరమాత్మకు జీవరాశులన్నీ ధూపం వెలిగించాయా అన్నట్లు పొగమంచు, చరిత్రకు ప్రతిబింబమైన కులీకుతుబ్ షా సమాధుల నుండి ఆ యవనకాంతల హృదయాలు నా కౌగిలిని వీడకు ప్రభూ అనే ప్రణయ విలాపాన్ని అంబరపు వీధిల్లో ఆలపిస్తున్నాయా అన్నట్లు ఒకవైపు,

అప్పటికే లేచి గంట అయ్యి, గృహిణులు ఉరుకులు, పరుగులతో వాకిళ్లు చిమ్మి, ముగ్గు పెట్టి, ధన ధనమంటూ అంట్లు కుమ్మరించి, కడిగే మా పేదల బస్తీ, బద్ధకంగా నిద్దుర లేచి ఈ చలిలో ఇంకాసేపు పడుకుందామా అనే భర్తలు, ఉదయమే ఉద్యోగానికి వెళ్లే పురుషోత్తములు, అయిష్టంగా బడికి తయారవుతున్న పిల్లలు, ఎంత కిక్ కొట్టినా ఆరంభం కాని బైకులు, టక టక మని బయలుదేరే ఆటోలు ఇంకొకవైపు,

మాకు ఇంకా తెల్లవారలేదండీ, ఇంకా రెండు గంటలుంది లేచి తయారవటానికి అనే సాఫ్ట్ వేర్ నిపుణులు మళ్లీ దుప్పటితన్ని పడుకుంటే, ఆ హై-టెక్ సిటీ భవంతులు విస్తుపోయి చూస్తునట్టుగా ఉంది. శుభోదయం సోదర సోదరీమణులకు.

25, నవంబర్ 2010, గురువారం

తోటకాష్టకం - తాత్పర్యము


హిందూ మతం బౌద్ధ, జైన మతాల దాడికి గురయ్యి, అంతర్గత శైవ/వైష్ణవ పోరులో నలిగి నాశనము అవుతున్న దశలో దక్షిణామూర్తి అవతారముగా కేరళలోని కాలడిలో ఆర్యాంబ మరియు శివగురు దంపతులకు జన్మించారు శంకరులు. పిన్న వయసులోనే భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో  మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.  ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు.  పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి,  ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు. ఆయన తర్వాత, శిష్యులు ఈ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

శంకర భగవత్పాదులు

ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన ఈ తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.

శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు.  గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు.

మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు. తోటకాష్టకం, తాత్పర్యము, యూట్యూబ్ శ్రవణం బొంబాయి సోదరీమణులు


విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణం

కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదం
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణం

భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణం

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం

సుకృతేఽధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం

జగతీమవితుం కలితాకృతయో విచరన్తి మహామహసశ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోఽపి సుధీః
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణం

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం

తాత్పర్యము: 

శాస్త్ర సాగరమనే నిధిని తెలిసిన, ఉపనిషద్ సంపద యొక్క సారాన్ని తెలిసిన, ఓ శంకర దేశికా! నీ చరణ పద్మముల నా హృదయమున ధ్యానిస్తున్నాను. నాకు శరణు నిమ్ము.

భవ సాగరమనే దుఖముచే పీడింప బడుతున్న హృదయము కలిగిన నన్ను రక్షించుము. నీ కృపచే నాకు సకల శాస్త్రముల సారము అవగతము చేయుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

ఆత్మజ్ఞానము సంప్రాప్తి యందు ఆసక్తి యున్న వారు నీ కృప వలన ఆనందాన్ని పొందుతున్నారు. నాకు జీవాత్మ, పరమాత్మ జ్ఞానము కలిగేలా అనుగ్రహించు. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

నీవే శివుడవని తెలుసి నా మనసు అనంతమైన ఆనందముతో నిండినది. నా మోహమనే మహా సాగరమును అంతము చేయుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

ఎన్నో సుకృతములు (మంచి పనులు) చేయుట వలన నీ ద్వారా ఆత్మ జ్ఞానము పొందే వాంఛ, భాగ్యము కలుగును. నిస్సహాయుడ నైన నన్ను కాపాడుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

ఈ జగత్తును రక్షించుటకు నీ వంటి మహాత్ములు వేర్వేరు రూపములలో, మారు వేషములలో తిరుగుచుంటారు. వారిలో నీవు సూర్యుని వంటి వాడవు. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

గురువులలో శ్రేష్ఠుడా! వృషభము పతాకముపై చిహ్నముగా కలిగిన శివా! నీవు జ్ఞానులలో అసమానుడవు. శరణు కోరే వారిపాలిట దయామయుడవు. తత్వ నిధీ! ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

ఇంకా జ్ఞానములో ఒక్క ఆకును కూడ అర్థం చేసుకోలేదు నేను. నా వద్ద ఎటువంటి సంపదలు లేవు. ఓ గురు దేవా! నీ కృపను నా పై వెంటనే ప్రసరింపుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...