8, డిసెంబర్ 2010, బుధవారం
శ్రీమన్నారాయణీయం - ఉపోద్ఘాతము
భక్తాగ్రేసరుడు అయిన నారాయణ భట్టతిరి ముఖమునుండి సంస్కృతమున వెలువడిన మధురమైన రచన శ్రీమన్నారాయణీయం. ఇది వ్యాస భాగవతమునకు సంగ్రహ రూపము. దైవ స్తుతి రూపములో కొనసాగే ఈ గ్రంథము కేరళలోని గురువాయూరు క్షేత్రమున వెలసిన శ్రీ మహావిష్ణువును సంబోధిస్తూ రచించబడినది.
కేరళలోని నంబూద్రి వంశమున జన్మించిన నారాయణ భట్టతిరి మంచి పండితుడు. వేద వేదాంగములను అభ్యసించి, వ్యాకరణాది శాస్త్రములలో ఆరితేరి సంస్కృతములో ఎన్నో గ్రంథాలు రచించాడు. వీటిలో శ్రీ పాద స్తుతి, గురువాయుపుర స్తోత్రము, నారాయణీయము ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.
భట్టతిరి రోగగ్రస్తుడై ఎన్ని ఔషధములు సేవించినా కూడ స్వస్థత చేకూరక, గురువాయుపురం వచ్చి అక్కడ ఆరాధ్యదైవమైన శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. ఆ స్వామి సమక్షంలో మహాకవి యొక్క ముఖము నుండి వెలువడిన స్తుతి పరంపరయే నారాయణీయం. ఇందులో వంద దశకములుగా వేయికి పైగా శ్లోకములున్నవి. భక్తి జ్ఞాన వైరాగ్యములు పెన వేసికొని సాగిన అద్భుత రచన ఇది. ఈ నారాయణీయము నందలి శ్లోక రూపమున ఉన్న స్తుతులతో ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో భట్ట తిరి సంపూర్ణమైన ఆరోగ్యమును తిరిగి పొందాడు.
గురువాయూర్ క్షేత్ర పురాణం:
ఇక్కడ అర్చనా మూర్తి అయిన శ్రీ మహావిష్ణువు తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇచ్చాడని ప్రతీతి. ఆ బ్రహ్మ దానిని సుతపుడనే మహర్షికి ప్రసాదించాడు. ఆ ముని దానిని కశ్యప ప్రజాపతికి సమర్పించగా ఆయన నుండి అది శ్రీ కృష్ణుని జనకుడైన వసుదేవుని వద్దకు చేరింది. శ్రీ కృష్ణుడు దానిని ద్వారకలో స్థాపించి పూజించాడు. ద్వాపర యుగాంతమున ద్వారక సముద్రములో మునిగి పోవునప్పుడు ఆ దివ్యమూర్తి కొట్టుకొని పోకుండుటకై "దేవతల గురువైన బృహస్పతి ద్వారా దానిని ఒక పవిత్రమైన క్షేత్రములో ప్రతిష్ఠింప చేయుము" అని శ్రీ కృష్ణుడు తన భక్తుడైన ఉద్దవుని ఆదేశిస్తాడు. శ్రీ కృష్ణుని ఆజ్ఞ మేరకు బృహస్పతి వాయుదేవునితో కూడి పవిత్రమైన క్షేత్రము కొరకు వెతుకుతాడు. చివరకు పరమేశ్వరుని సూచన మేరకు గురువు, వాయువు ఆ దివ్య తేజోమూర్తిని పశ్చిమ సముద్ర ప్రాంతమున అంబాపురం అను గ్రామములో ప్రతిష్ఠింప చేస్తారు. గురువు మరియు వాయువు కలిసి ప్రతిష్ఠించుటచే ఆ క్షేత్రానికి గురువాయూరు అని పేరు వచ్చిందిట.
కలియుగ ప్రారంభంలో నిర్మించబడిన ఈ మందిరాన్ని ఒక పాండ్య రాజు పునర్నిర్మించాడు. ఆ మహారాజు సభలో ఒకరోజు జ్యోతిష్యవేత్తలు "ఓ రాజ! నీవు పది మాసములలో పాముకాటు వలన మరణిస్తావు" అని తెలుపుతారు. రాజు పవిత్రమైన జీవితము గడుపుతూ ఆ పది మాసములలో దివ్యక్షేత్రాలను దర్శిస్తూ గురువాయూరునకు వచ్చి స్వామిని సేవిస్తాడు. పది మాసముల తర్వాత రాజు క్షేమముగా రాజ్యమునకు తిరిగి వచ్చి జ్యోతిష్కుల మాటలు వమ్ము అయినవని ప్రకటిస్తాడు. దానికి సమాధానముగా వారు రాజు పాము కాటుకు గురియైన విషయము నిజమేనని, కాని ఆ సమయమున రాజు గురువాయూరు క్షేత్రమున ఆదిశేషునితో కూడియున్న శ్రీ మహావిష్ణువును సేవించు చుండటం వలన ఆయనకు మృత్యు ప్రమాదము తప్పినదని తెలిపుతారు. ఆయన శరీరముపై పాముకాటు గుర్తులు ఉండుట చూసి జ్యోతిష్కుల మాట సత్యమే అని అందరు నమ్ముతారు. అప్పుడు రాజు గురువాయూరు మందిరాన్ని పునరుద్ధరించినట్లు ప్రతీతి. నేటికి మహా వ్యాధులకు గురైన వారు ఆ స్వామిని దర్శించి సేవించటం వలన సంపూర్ణారోగ్యముతో వర్ధిల్లుతున్నారు. క్షేత్రాన్ని దర్శించటానికి ఆశక్తులైన వారు ఈ నారాయణీయమును పారాయణము చేసినచో వారికి అట్టి సత్ఫలితాలే ప్రాప్తించునని నమ్మకం.
కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ నారాయణీయమును భక్తిప్రపత్తులతో పారాయణము చేస్తారు. నేను ప్రచురించ బోయే ఈ పది స్కందాల ధారావాహికానికి మూలం sanskritdocuments.org.
ఈ మార్గశిర మాసం శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనది (మాసాణాం మార్గశీర్షోహం - మాసములలో నేను మార్గశిరాన్ని అని ఆయన అన్నాడు). అలాగే, సూర్యుడు ధను రాశిలో ప్రవేశించే మాసము ధనుర్మాసంగా పిలవబడుతుంది. గోదా, రంగ నాథుల వైభవాన్ని చాటే తిరుప్పావై ప్రవచనం, అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువునకు సేవలు, రక రకాల నివేదనలు - వీటితో సాగిపోతుంది మార్గశిరము మరియు పుష్య మాసం లోని సగ భాగం. ఈ సందర్భంగా మీకోసం నారాయణీయంతో వస్తున్నాను.
ఓం నమో నారాయణాయ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
its good history
రిప్లయితొలగించండి