29, నవంబర్ 2010, సోమవారం

బిలహరి రాగం - కనుగొంటినీ శ్రీరాముని

అన్నగారు తన ఇలవేల్పుయైన సీతారాముల విగ్రహాన్ని ఈర్ష్యతో కావేటిలో పడవేస్తే, మన త్యాగ బ్రహ్మంగారు రాముడు లేని ఇంట నేను ఉండనని ఆయనను వెదుకుతూ బయలు దేరుతాడు. అలా తిరుగుతూ, ఎన్నో క్షేత్రాలు తిరిగి అక్కడి వేల్పులను స్తుతించి అద్భుతమైన కీర్తనలు రచిస్తాడు. అటు పిమ్మట కావేరిలో స్నానం చేస్తుండగా ఆ సీతారాముల ప్రతిమ త్యాగరాజుకి లభ్యమవుతుంది. ఆ ఆనందానుభూతిలో త్యాగరాజు రచించిన కీర్తన బిలహరి రాగంలో కనుగొంటినీ శ్రీరాముని.

బిలహరి రాగంలో ప్రత్యేకము మార్దవము, తన్మయత్వం, తాదాత్మ్యము, నృత్యం చేయాలన్న భావన కలిగించే స్వరాలు ఉండటం. భక్తిని మరొక మెట్టు పైకి తీసుకెళ్ళే స్థాయి ఈ రాగానికి ఉంది. చాలా మార్దవంగా, శాంతముగా ఉంటుంది. మరి తను పోగొట్టుకున్న సర్వస్వం తిరిగి దొరికితే, త్యాగరాజు ఇలాంటి రాగంలో కీర్తన రాయక తప్పదు కదా!. మన తెలుగు బిడ్డలు మల్లాది సోదరులు అద్భుతంగా పాడిన కనుగొంటిని కీర్తన. సాహిత్యం క్రింద. శంకర్ మీనన్ గారి బిలహరి వయోలా/సంతూర్ సమ్మేళన  రాగాలాపన కూడ చాలా బాగుంది.

ఇదే రాగంలో రుద్రవీణ చలన చిత్రంలో నీతోనే ఆగేనా బిలహరి అని ఏసుదాస్ గారు శ్రావ్యమైన శాస్త్రీయ గీతం ఆలాపించారు. బిలహరి రాగానికి ధన్యత చేకూర్చారు ఏసుదాస్ గారు. 


పట్టాభిషిక్త సీతారాములు

కనుగొంటినీ శ్రీరాముని నేడు కనులార నా కామితము తీర

ఇనకులమందు ఇంపుగాను వెలయు ఇలలోన సీతా నాయకుని నేడు |కనుగొంటినీ|

భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ పవమాన సుతుడు పాదములు బట్ట
వీరులైన సుగ్రీవ ప్రముఖులచే వినుతి సేయ త్యాగరాజ నుతుని నేడు |కనుగొంటినీ|

1 కామెంట్‌: