8, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీమన్నారాయణీయం - ప్రథమ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం  ప్రథమ స్కంధము



మొదటి దశకము - భగవన్మహిమ


సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ |
అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మ తత్వమ్
తత్తావద్భాతి సాక్షాద్గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ || ౧-౧||

ఆ భగవంతుడు సచ్చిదానందుడు, జ్ఞాన స్వరూపుడు, సాటి లేని వాడు, కాలము, దేశము మొదలగు వాటికి అతీతమైన వాడు, ఎల్లప్పుడూ ముక్త స్వరూపుడు, లక్షలకొలది అనువాకముల ద్వారా వేదములు ఆ పరమ పురుషుని వర్ణించినా, ఇది కాడు ఇది కాడు అని చెప్పాయే కాని, ఇది అని చెప్పలేకపోయాయి. యోగులు కూడ వేల సంవత్సరాల కఠోర శ్రమ, సాధన తర్వాతే పర తత్త్వమును అనుభవించి మోక్షమును పొందగలరు. ఆ బ్రహ్మమే గురువాయు పురము నందు సగుణ సాకార రూపమున నారాయణుడై వెలసి యున్నాడు. వారిది ఎంతటిభాగ్యము?

ఏవం దుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్
తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్
ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః || ౧-౨||

దుర్లభుడే అయినా, జీవులపై కరుణతో చేతికి అందినంత సులభంగా గురువాయుపురంలో వెలశాడు. ఇంత సులభ లభ్యుడైనప్పటికీ, భక్తులు మనోవాక్కాయ కర్మలచే ఇతరులను సేవిస్తూ వ్యర్థ కాలక్షేపము చేస్తున్నారు.  ఇది ఎంతో శోచనీయము. కానీ, ఆత్మ స్వరూపుడైన ఈ గురువాయుపుర పట్టణపు శ్రీ కృష్ణుని మాత్రమే మన తాపత్రయముల తొలగించుటకు ఆశ్రయింతుము.
 
సత్త్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్
భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్ |
తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదితపరసుఖచిద్గర్భనిర్భాసరూపం
తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే || ౧-౩||

ఓ పరమాత్మా! నీ దివ్య శరీరము రజస్తమో గుణములు లేక మిక్కిలి నిర్మలమైనది, శుద్ధ సత్త్వ గుణములు కల  పంచ భూతాత్మకమైనది అని వేద వ్యాసులు అనేక మార్లు తెలిపాడు. అట్టి నీ రూపము యొక్క సౌందర్యమును గురించి విన్నాను, స్మరించినను, మిక్కిలి ఆనందము కలుగును. ఆ రూపమును అతి సులభముగా భక్తుడు దర్శించుకొనును. కావున అదృష్టవంతులు నీ రూపమును దర్శించుచు, స్మరించుచు ఆత్మానుభూతిని పొందుదురు

నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానందపీయూషరూపే
నిర్లీనానేకముక్తావలిసుభగతమే నిర్మలబ్రహ్మసింధౌ |
కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వమాహుస్తదాత్మా
కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్ ౧-౪

పరబ్రహ్మము అపారమైన సముద్రము వంటిది. నిశ్చలముగా, నిత్య పూర్ణమై, అంతులేని పరమానందమనే అమృతముతో నిండియున్నది. ముక్తులైన అనేక జీవములు ఆ సాగరములో ముత్యాలు, మణుల వంటి వారు. వారితో ఆ సాగరము అందముగా కనిపించును. అట్టి సాగరమున పరిశుద్ధమైన సత్త్వ గుణము అలలవలె ఉండును. ఓ పరమాత్మ! శుద్ధసత్త్వ స్వరూపుడైన నీవు వస్తుతః నిష్కలుడవుగా ప్రకాశింతువు. అయినను నీవు సకల కలాసహితుడవుగా, సాకారుడవుగా కనిపించుచున్నావు. అదే నీ గొప్పతనము.

నిర్వ్యాపారోఽపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం
తేనైవోదేతి లీనా ప్రకృతిరసతికల్పాఽపి కల్పాదికాలే |
తస్యాః సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం
స త్వం ధృత్వా దధాసి స్వమహిమవిభవాకుంఠ వైకుంఠ రూపమ్ || ౧-౫

ఓ పరమాత్మా! నీవు ఎట్టి కర్మలను ఆచరించ పని లేదు. ఆయస్కాంతము వద్ద ఇనుము ఆకర్షింప బడినట్లు, నీ కృపాకటాక్ష వీక్షణ ప్రభావమున నీ యందు విలీనమై అసత్ స్వరూపమైన ప్రకృతి సృష్టి కల్పాది యందు కనపడుతున్నది. నీవు ప్రకృతికి అతీతుడవు. సత్త్వ రూపుడవు. నీ మహిమా ప్రభావముచే వైకుంఠ రూపములో వెలసిల్లుచున్నావు. భక్తులను అనుగ్రహించుటకు ప్రకృతి రూపములో ప్రకటించు కొనుచున్నావు.

తత్తే ప్రత్యగ్రధారాధరలలితకళాయావలీకేలికారం
లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారమ్ |
లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యందసందోహమంతః
సించత్సంచింతకానాం వపురనుకలయే  మారుతాగారనాథ     ||౧-౬||   

ఓ గురువాయుపుర శ్రీ కృష్ణా! నీ రూపము క్రొత్త మేఘములా సుందరమైనది. కలువపూలవలె ఆనందాన్ని కలుగుచేస్తుంది. సౌందర్యము మూర్తీభవించిన నీ రూపము పుణ్యాత్ములకు పుణ్యఫలము వంటిది. లక్ష్మికి నివాస స్థానము. అతి మధురమైన నీ దివ్య రూపమును ఎల్లప్పుడూ ధ్యానించు వారి మనసులందు అది అమృతాన్ని కురిపిస్తుంది. నీ జగన్మోహన రూపమును నేను నిరంతరమూ ధ్యానిన్చుచున్నాను.

కష్టా తే సృష్టిచేష్టా బహుతరభవఖేదావహా జీవభాజా
మిత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవమద్యాభిజానే |
నో చేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం
నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్ || ౧-౭

ఓ దేవా! మొదట నేను నీ సృష్టి వలన సంసార బంధనములు, కష్టములు కలుగుచున్నవని భావించాను. కానీ అది నిజము కాదు. నీకు జీవులపై అనంతమైన కరుణ కలదు. నీ రూపము చాలా సుందరమైనది, మనోహరమైనది. లేకున్న, భక్తులందరూ నీ దివ్య మంగళ రూపమును భౌతికమైన కళ్ళతో చూసి, నీ లీలా వర్ణనమును వినుచు పరమానందమును ఎలా పొందుదురు?

నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యార్థితాన-
ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతిం చ |
ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే త్వం
క్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థమర్త్ హివ్రజోఽయమ్ || ౧-౮

ఓ హరీ! నీవు అందరికీ సులభముగా అందుబాటులో ఉన్నవాడవు. నీకు నమస్కరించే వారికి ఎల్లప్పుడు సాక్షాత్కారము నిచ్చెదవు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువువు. పరమానందమైన మోక్షాన్ని కూడ అనుగ్రహిస్తున్నావు. కొందరు నీ మహిమ తెలియకు ఆ ఇంద్రుని కల్పతరువును ఆశ్రయింతురు. అది వ్యర్థము. అనంతమైన ఫలములను ఇచ్చేది నీ ముందు పారిజాత వృక్షమెంతటిది, కల్పవృక్షమెంతటిది?

కారుణ్యాత్కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషా-
దైశ్వర్యాదీశతేఽన్యే జగతి పరజనే స్వాత్మనోఽపీశ్వరస్త్వమ్ |
త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యాః-
త్వం చాఽఽత్మారామ్ ఏవేత్యతులగుణగణాధార శౌరే నమస్తే || ౧-౯||

ప్రభూ! ఇతర దేవతలు మోక్షము తప్ప ఇతర ఫలములను ఇయ్యగలరు. నీవు మోక్షాన్ని కూడ ప్రసాదిస్తావు. నీవే ప్రభుడవు, సర్వేశ్వరుడవు. నిన్ను శాసించేవారు లేరు. నీ పరబ్రహ్మ రూపము ఎంతో మధురమైనది. అటువంటి నీయందు ధన్యులు సదా ఆనందించు చుందురు. నీవు ఆత్మా రాముడవు, అనంత కళ్యాణ గుణములకు ఆధారమైన వాడవు. శౌరీ! నీకు నా నమస్కారములు.

ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం విశ్వతేజోహరాణాం
తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతమ్ |
అంగాసంగా సదా శ్రీరఖిలవిదసి న క్వాపి తే సంగవార్తా
తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్ఛబ్దముఖ్యాశ్రయోఽసి ౧-౧౦

గురువాయుపుర నివాస! మురారి! ఐశ్వర్యము, సాటి లేని పరాక్రమము, నిర్మలమైన యశస్సు, సిరి సంపదలు, సర్వజ్ఞత, వైరాగ్యము - అనే ఆరు లక్షణములు కలవాడే భగవంతుడు. నీవు బ్రహ్మాది దేవతలను కూడ నియమించగల ప్రభుడవు. బ్రహ్మ, శివుడు మొదలగు దేవతలను మించిన తేజస్సు నీది. నీ యశస్సును సనకాది మునులు ఎల్లప్పుడూ కొనియాడు చుందురు. లక్ష్మీ దేవి ఎప్పుడు నిన్నే ఆశ్రయించు యుండును. నీవు అన్ని తెలిసిన వాడవు, దేనియందు ఆసక్తి లేని వాడవు. అందుకనే భగవంతుడు అనే పేరు నీకే తగును.

రెండవ దశకము - భగవద్రూప భక్తి మహత్వము


సూర్యస్పర్ధికిరీటమూర్ధ్వతిలకప్రోద్భాసిఫాలాంతరం
కారుణ్యాకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటమ్ |
గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం
త్వద్రూపం వనమాల్యహారపటలశ్రీవత్సదీప్రం భజే || ౨-౧||

శ్రీ కృష్ణా! నీ కిరీటము నందలి మణుల కాంతులు సూర్యుని తేజస్సును మించినవి. నీ నుదుట కస్తూరి తిలకము ఎంతో అందమైనది. నీ చల్లని చూపులు జీవ కోటి పై కృపను ప్రసరింప చేయును. ప్రేమతో కూడిన నీ చిరునవ్వు ఎంతో ఆహ్లాద కరమైనది. నీ నాసిక ఎంతో ముచ్చటగ ఉంది. అద్దముల వంటి నీ చెక్కిళ్ళ పై ప్రతిఫలించు మకర కుండలముల కాంతులు ఎంతో మనోహరముగా ఉన్నవి. నీ మెడలో వెలుగుతున్న కౌస్తుభమణి కాంతులు దేదీప్య మానము. నీ వక్షస్థలమున ఉన్న వనమాలలు, దివ్యమైన హారములు, శ్రీ వత్స చిహ్నము అనుపమానములు. అటువంటి నీ దివ్య రూపమును నేను ధ్యానించు చున్నాను.


కేయూరాంగదకంకణోత్తమమహారత్నాంగులీయాంకిత-
శ్రీమద్బాహుచతుష్కసంగతగదాశంఖారిపంకేరుహామ్ |
కాంచిత్కాంచినకాంచిలాంచ్ఛితలసత్పీతాంబరాలంబినీమ్
ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదమ్ || ౨-౨||

ఓ శ్రీ కృష్ణా! నీ నాలుగు బాహువులలో యున్న శంఖము, చక్రము, గద, పద్మము ఎంతో దివ్యముగా యున్నవి. నీవు ధరించిన భుజ కీర్తులు, దండము, కడియము, కంకణములు, ఉంగరములు చక్కని కాంతులను వెల్లివిరియ చేయుచున్నవి. నీ బంగారు కాంతి ఆభరణము యొక్క మిల మిలలు, పట్టు పీతాంబరముల యొక్క నిగనిగలు ఎంతో ఆహ్లాదకరములు. నీ పవిత్ర పాదములు నిర్మలమైన కమలముల కాంతులను విరజిమ్ముతున్నవి. దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులను రూపు మాపును. అట్టి నీ రూపమును నేను ఆశ్రయింతును.

యత్త్రైలోక్యమహీయసోఽపి మహితం సమ్మోహనం మోహనాత్
కాంతం కాంతినిధానతోఽపి మధురం మాధుర్యధుర్యాదపి |
సౌందర్యోత్తరతోఽపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోఽ-
ప్యాశ్చర్యం భువనే న కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో || ౨-౩||

విశ్వవ్యాప్తమైన ఓ విష్ణో! విభో! నీ రూపము మూడు లోకములందున్న గొప్ప వస్తువుల కన్నా మహత్తు కలది. మోహము కలిగించు వాటికంటే మోహనమైనది. కాంతి కలవాని కంటే గొప్ప కాంతి కలది. మధురమైన వాటికంటే మిక్కిలి మధురమైనది. సుందరమైన వస్తువలన్నిటి కంటే ఎంతో సుందరమైనది. ఆశ్చర్యము కలిగించే వస్తువుల కంటే ఆశ్చర్యమైనది. అట్టి నీ దివ్య స్వరూపమును దర్శించుటకు ఎవరు కుతుహూలపడరు?.

తత్తాదృఙ్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ
సా దేవీ పరమోత్సుకా చిరతరం నాఽస్తే స్వభక్తేష్వపి |
తేనాస్యా బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక-
ప్రేమస్థైర్యమయాదచాపలబలాచ్చాపల్యవార్తోదభూత్ || ౨-౪||

ప్రభూ! సకల సంపదలకు నిలయయైన లక్ష్మీ దేవి నీ అందచందములకు, నీ శుభ గుణ గణములకు ఆకర్షితురాలై నీ యందే స్థిరముగా నిలిచియున్నది. అందువలన ఆ దేవి తన భక్తుల దగ్గర ఎక్కువ కాలము నిలిచి యుండుట లేదు. కావున నీ మనోజ్ఞ రూప వైభవముపై గల అచంచలమైన ప్రేమానురాగాముల కారణముగా ఆమె తమ వద్ద నిలుకడగా యుండక పోవుటచే వారు ఆ దేవిని 'చపల' అని పెర్కొనుచున్నారు. ఇది ఎంత శోచనీయము స్వామీ!

లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం పరేష్వస్థిరే-
త్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే |
యే త్వద్ధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనా-
స్తేష్వేషా వసతి స్థిరైవ దయితప్రస్తావదత్తాదరా || ౨-౫||

లక్ష్మీపతీ! నీ అందమైన రూపగుణ సంపదలకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి నీ యందు స్థిరముగా ఉండుట సరే! అంతేకాదు ఆ దేవికి నీ పై కల అనురాగము వలన ఆమె తన స్వామి వైన నిన్ను నీ భక్తులు ధ్యానించుచు, నీ గుణ కీర్తనలో పరవశించి పోవుట చూసి వారి దగ్గర కూడ స్థిరముగా ఉండును. నీ భక్తులు కాని వారి వద్ద ఆ దేవి నిలిచి యున్దనుటకు ఇది మరియొక ఉదాహరణ.

ఏవంభూతమనోజ్ఞతానవసుధానిష్యందసందోహనం
త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్ |
సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం
వ్యాసించత్యపి శీతబాష్పవిసరైరానందమూర్చ్ఛోద్భవైః || ౨-౬||

ప్రభూ! నీ రూపము, లావణ్య వైభవము పరమానంద దాయకమైన అమృతమును వర్షింప జేయును. అది పరమ చిదానంద రసమునకు నిలయము. వినువారి చిత్తములను దోచుకొని, బుద్ధికి స్ఫూర్తిదాయకమై వెంటనే మత్తు కలిగించును. శరీరములకు గగుర్పాటు కలిగించును. ఆనంద పారవశ్యము వలన కలిగిన చల్లని కన్నీటిచే వరి శరీరములను తడిపి వేయును.


ఏవంభూతతయా హి భక్త్యభిహితో యోగః స యోగద్వయత్
కర్మజ్ఞానమయాద్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే |
సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమప్రకర్షాత్మికా
భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ || ౨-౭||

ఓ రమాపతీ! నీవు సౌన్దర్యానంద స్వారూపుడవు. నీ యందు అమితమైన ప్రేమతో నిండిన భక్తి, సామాన్యులకు కూడ ఈలోకములో ఎటువంటి శ్రమ లేకుండా లభించును. అందుకే, కర్మ, జ్ఞాన యోగముల కంటే భక్తి యోగం ఉత్తమమైనది అని యోగీశ్వరులు చెపుతున్నారు.

నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం
తద్దూరేత్యఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః |
తత్త్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో
త్వత్ప్రేమాత్మకభక్తిరేవ సతతం స్వాదీయసీ శ్రేయసీ || ౨-౮||

ధర్మయ శాస్త్రములందు ఆయా వర్ణముల వారికి చెప్పబడిన కర్మలను విధిగా ఆచరించుచు వాటి వల్ల కలుగు ఫలితమును ఆశించక యుండుట కర్మ యోగమనబడును. ఇట్టి కర్మ యోగము వలన ఫలితము చాలా ఆలస్యముగా లభించును. అట్లే, ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మ జ్ఞానము సామాన్యులకు తేలికగా లభించదు. అట్టి జ్ఞానమును పొందుటకై మనస్సు చాలా కష్ట పడ వలెను. స్వామీ! పై రెండిటి కంటే నిన్నే లోతుగా ప్రేమించుట అనే భక్తి మిక్కిలి సులభమైనది, రుచికరమైనది, శ్రేయస్కరమైనది.

అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలాః
బోధే భక్తిపథేఽథవాప్యుచితతామాయాంతి కిం తావతా |
క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పున-
శ్చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిధ్యంతి జన్మాంతరైః || ౨-౯

స్వామీ! నిత్య నైమిత్తిక కర్మలు నియమ బద్ధంగా చేయవలెననిచో  చాలా కష్టము కలుగును. అట్టి కష్టముతో కర్మలు చేసి పాపములకు దూరమైన వారు తమ తమ యోగ్యతలను అనుసరించి జ్ఞాన మార్గమున లేక భక్తి మార్గమున ప్రవేశించు చున్నారు. మరి కొందరు జ్ఞాన మార్గమున అనేక కష్టములను అనుభవించుచు అనేక జన్మల తర్వాత మాత్రమే పరబ్రహ్మ రూపుడవైన నిన్ను పొందుచున్నారు.

త్వద్భక్తిస్తు కథారసామృతఝరీనిర్మజ్జనేన స్వయం
సిద్ధ్యంతీ విమలప్రబోధపదవీమక్లేశతస్తన్వతీ |
సద్యః సిద్ధికరీ జయత్యయి విభో సైవాస్తు మే త్వత్పద-
ప్రేమప్రౌఢిరసార్ద్రతా ద్రుతతరం వాతాలయాధీశ్వర || ౨-౧౦||

గురువాయురప్ప! శ్రీ కృష్ణా! నీ సుమధురమైన కథారస ప్రవాహములో మునిగినచో నీ భక్తి అతి సులభముగా లభించును. సుందరమైన నీ కథలను వినుట చేత నిర్మలమైన జ్ఞానము కూడ సులభముగా లభించును. దాని వలన భక్తుడు తాను కోరుకున్న కోరికల ఫలములను కూడ వెంటనే పొందగలుగుచున్నాడు. ఓ పరమాత్మా! అందువలన నీ పాద భక్తి వలన నా మనస్సు మిక్కిలి శీఘ్రముగా ఆనందమున మునిగి పరవశించునట్లు చేయుము.

మూడవ దశకము - భక్తి స్వరూప వర్ణనము - భక్తికై ప్రార్థన

పఠంతో నామాని ప్రమదభరసింధౌ నిపతితాః
స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథాః |
చరంతో యే భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూ-
నహం ధన్యాన్మన్యే సమధిగతసర్వాభిలషితాన్ || ౩-౧||

భక్తుల కోరికలను తీర్చే కృష్ణా!  భక్తులు నీ దివ్య నాములను పఠించుచు, నీ పరమ సుందర రూపమును స్మరించు చున్నారు. అట్లే కళ్యాణ గుణములు కల నీ దివ్య కథలను గానము చేయుచు ఆనంద సముద్రమున ఓలలాడుచు ఈ భూమిపై తిరుగుచుందురు. నిన్ను ఎల్లప్పుడూ ధ్యానించే భక్తుల కోర్కెలను నీవు కరుణతో తీర్చెదవు. కావున కోరికలన్నీ తీరి పరమానందములో ఓలలాడే భక్తులు ధన్యులని భావింతును.

గదక్లిష్టం కష్టం తవ చరణసేవారసభరేఽ-
ప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయామ్ |
భవత్పాదాంభోజస్మరణరసికో నామనివహా-
నహం గాయంగాయం కుహచన వివత్స్యామి విజనే || ౩-౨||

శ్రీమన్నారాయణ! నీ పాద పద్మములను భక్తితో సేవించ దలచితిని. కాని అనారోగ్యముతో బాధపడుతున్న నా మనస్సు అందుకు విముఖముగా ఉన్నది. ఏమి చేయుదును?. అందువలన నా పై దయ చూపించినచో నీ పాద పద్మములను అనన్య భక్తితో సేవిస్తూ ఏకాంతమున నీ దివ్య నామములను అనుక్షణము ఆనందముతో గానము చేయుచు ఉందును.

కృపా తే జాతా చేత్కిమివ న హి లభ్యం తనుభృతాం
మదీయక్లేశౌఘప్రశమనదశా నామ కియతీ |
న కే కే లోకేఽస్మిన్ననిశమయి శోకాభిరహితా
భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే || ౩-౩||

స్వామీ! నీ అనుగ్రహము కలిగినచో ప్రాణులకు సిద్ధించనిది ఏముండును? అందువలన నా రోగ బాదానివారణం అనేది నీకు అత్యంత స్వల్పమైన విషయము. నీ అనుగ్రహము వలననే ఎట్టి కోరికలు లేని నీ భక్తులు ఎల్లప్పుడూ దుఃఖము ఏ మాత్రము లేక ముక్తిని పొంది శాశ్వత సుఖమును అనుభవించు చున్నారు.

మునిప్రౌఢా రూఢా జగతి ఖలు గూఢాత్మగతయో
భవత్పాదాంభోజస్మరణవిరుజో నారదముఖాః |
చరంతీశ స్వైరం సతతపరినిర్భాతపరచిత్-
సదానందాద్వైతప్రసరపరిమగ్నాః కిమపరమ్ || ౩-౪||

ప్రభూ! ఆత్మ జ్ఞాన సంపన్నులైన నారదాది మునీశ్వరులు నీ పాద పద్మములను సదా స్మరించుచున్నందు వలన ఎట్టి బాధలు లేక సచ్చిదానందములో సదా నిమగ్నులై స్వేచ్ఛగా సంచరించు చున్నారు. వారికి ఇంత కన్నా కావలసినది ఏమున్నది?.

భవద్భక్తిః స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయేత్-
అశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహకణికా |
న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచో
భవేన్మిథ్యా రథ్యాపురుషవచనప్రాయమఖిలమ్ || ౩-౫||

స్వామీ! నాకు నీ చరణారవిన్దములపై భక్తి మిక్కిలి కలుగునట్లు దయతో అనుగ్రహించుము. ఆ భక్తి నా సమస్త బాధలను తప్పక దూరము చేయును. అందులో నాకు ఎట్టి సందేహము లేదు. కానిచో భగవద్గీత మొదలగు గ్రంథములందు వేదవ్యాసుడు ప్రవచించిన మాటలు, వేదములందు చెప్పబడిన వాక్కులు అన్ని చిల్లర జనము యొక్క మాటల వలె వ్యర్థమగును.

భవద్భక్తిస్తావత్ప్రముఖమధురా త్వాద్గుణరసాత్
కిమప్యారూఢా చేదఖిలపరితాపప్రశమనీ |
పునశ్చాంతే స్వాంతే విమలపరి బోధోదయమిళన్
మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరమ్ || ౩-౬||

ప్రభూ! నీ చరణారవిందముల యందలి భక్తి నీ గుణ రసానందానుభావము వలన మధురాతి మధురమైనది. అట్టి భక్తి క్రమ క్రమముగా పెరిగినచో ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైన అన్ని తాపములు నశించును. అట్లే, చివరకు నిర్మలమైన జ్ఞానోదయము కలిగి బ్రహ్మానందమున ఓలలాడుట కూడ జరుగును. మానవునకు ఇంత కంటే కోరుకోన వలసినది ఏమి కలదు?.

విధూయ క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం
భవత్క్షేత్రప్రాప్తౌ కరమపి చ తే పూజనవిధౌ |
భవన్మూర్త్యాలోకే నయనమథ తే పాదతులసీ-
పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే || ౩-౭||

స్వామీ! నా బాధలనన్నిటినీ దూరము చేసి, నా పాదములు నీ దివ్యక్షేత్రము చేరునటులు, నా చేతులు నిన్ను పూజించునట్లు, నా నేత్రములు నీ దివ్యమైన స్వరూపమును సందర్శించునట్లు, నా ఘ్రాణేంద్రియములు నీ పాదములన్దున్న తులసిని అఘ్రాణించునట్లు, నా చెవులు మధురమైన నీ గాథలను మిక్కిలి భక్తితో వినునట్లు అనుగ్రహించుము. ఆ విధముగా నేను ఆనందానుభూతిని పొందెదను.

ప్రభూతాధివ్యాధిప్రసభచలితే మామకహృది
త్వదీయం తద్రూపం పరమసుఖచిద్రూపముదియాత్ |
ఉదంచద్రోమాంచో గలితబహుహర్షాశ్రునివహో
యథా విస్మర్యాసం దురుపశమపీడాపరిభవాన్ || ౩-౮||

స్వామీ! మిక్కుటమైన శరీరవ్యాధులతో, మానసిక బాధలచే మిక్కిలి చంచలమైన నా హృదయమునందు పరమానంద దాయకమైన నీ మనోహర రూపము ఉదయించునట్లు చేయుము. అందువలన ఆనందమున మగ్నుడనై శరీరమంతయు గగుర్పాటు చెందగా ఆనంద బాష్పములు జాలువారగా ఏ మాత్రము తగ్గని సమస్త బాధలను సైతము మరచి పోవుదును.

మరుద్గేహాధీశ త్వయి ఖలు పరాంచోఽపి సుఖినో
భవత్స్నేహీ సోఽహం సుబహు పరితప్యే చ కిమిదమ్ |
అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్
భవత్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన || ౩-౯||

గురువాయూరప్పా! కంస హరణా! నీ పట్ల ఏ మాత్రము భక్తి లేని వారు సుఖములను అనుభవించు చున్నారు. కానే నీ యందు సంపూర్ణానురాగము కల నేను మాత్రము ఈ విధముగా రోగముతో బాధ పడుతున్నాను. ఇదేమి విచిత్రము? భక్తులు కోరిన వరము లొసగు స్వామీ! దీని వలన నీకు చాలా అపకీర్తి కలుగునయ్య! అది సముచితము కాదు కదా! దయతో నా రోగ బాధను తగ్గించి వెంటనే నీ భక్తులలో శ్రేష్ఠునిగా చేయుము.

కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణా యావదుదియాత్
అహం తావద్దేవ ప్రహితవివిధార్తప్రలపితః |
పురః క్లృప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్
యథాశక్తి వ్యక్తం నతినుతినిషేవా విరచయన్ || ౩-౧౦||

భక్తులు కోరిన వరము లొసగు ఓ స్వామీ! ఇంక అతిగా నా బాధలు చెప్పుకొనుట అనవసరము. నాకు కలిగిన రోగ బాధల వలన వ్యర్థమైన ప్రలాపనలు చేయుచుంటిని. వాటిని మానుకొని నీకు దయ కలుగునంత వరకు నా శక్తి మేరకు నీ దగ్గర నమస్కారములు, స్తుతులు, సేవలు చేయుచు దినములను గడుపుటకు నిశ్చయించు కొంటిని. ఇది తథ్యము.

1 కామెంట్‌: