13, ఆగస్టు 2010, శుక్రవారం

రాజకీయ ముఖ చిత్రం



ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారుతోంది, స్పష్టమవుతోంది. మన రాష్ట్ర రాజకీయ చతుర్ముఖ పారాయణం ఎలా ఉందంటే:
  1. కాంగ్రెస్: అంతర్గతంగా, జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని అణచివేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం దాదాపు నిర్ణయించినట్టే.  వారిని అన్ని విధాల పరీక్షించి, ముప్పతిప్పలు పెట్టి, అవినీతి, అక్రమాల కేసులు త్రవ్వి వాటి ద్వారా వారిని చెక్ లో పెట్టాలన్నది వారి వ్యూహం. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ తో పది-పదిహేను కన్నా ఎమ్మెల్యేలు వెళితే గొప్ప అని రాజకీయ వర్గాల ఉవాచ. ఒక వేళ జగన్ ఓర్పు నశించి పార్టీ నుంచి బయటకు వెళ్లినా రోశయ్య ప్రభుత్వానికి ముప్పు లేకుండా ప్రజారాజ్యం పార్టీని తమవైపు తిప్పుకోవటంలో సఫలమయ్యారు కాంగ్రెస్ అధినేతలు.  ఇక రెండోవైపు,  ప్రతిపక్షమైన తెలుగుదేశాన్ని బలహీన పరచటానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని వైపులనుంచి వ్యూహం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. తెలంగాణా రావటం దాదాపు ఖాయం కాబట్టి ఆ విషయంలో పైపైన తప్ప పెద్దగా  తాము మాట్లాడటం అనవసరం అనే ధోరణిలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్లు. ఇక రోశయ్యగారి పాలన ఉప్పు వెయ్యని ముద్ద పప్పులా చప్పగా ఉంది. ప్రజల వ్యతిరేకం ఇప్పుడు లేకపోయినా నాలుగేళ్లలో గట్టి నాయకత్వం లేకపొతే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవటం కష్టమే. 
  2. తెలుగుదేశం: దిక్కుతోచని, అయోమయం పరిస్థితిలో ఈ పార్టీ ఉంది. ఒకపక్క చంద్రబాబుగారు తెలంగాణా మీద ఏమి మాట్లాడలేక, పార్టీలో చీలిక రాకుండా త్రాసును అటు ఇటు  బ్యాలెన్స్ చెయ్యటంలో సతమతమవుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ + ప్రజారాజ్యం లోపాయకారి ఒప్పందంతో దెబ్బతిన్న తర్వాత ఆ పార్టీ ఆ ఓటమి నుంచి ఇంకా బయటకు రానట్టే. బాబ్లీ గోల, బాబు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. పార్టీలో ఆత్మ విశ్వాసం దెబ్బ తిని మళ్లీ వలస మొదలవ్వకుండా బాబు ఎన్నాళ్లు ఆపగలరో సమయమే చెప్పాలి.
  3. టీ.ఆర్.ఎస్: తెలంగాణ ఉపఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చూసిన తెలుగుదేశం పార్టీని ఇంకా దెబ్బతీయటానికి టీ.ఆర్.ఎస్ మాటల తూటాలు పేల్చి టీ.డీ.పీ నాయకుల్లో నిరాశ నిస్పృహలు సృష్టించి వారిని ఆ పార్టీ లోనుంచి బయటకు లాగాలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఉపఎన్నికల విజయాలతో తన వ్యూహరచన ఫలించినట్టే అని కే.సి.ఆర్ భావన. టీ.డీ.పీ, కాంగ్రెస్ నాయకుల మీద పదునైన మాటల దాడి ప్రయత్నంలో ఉన్నారు ఆయన. మొత్తానికి ఉద్వేగ పూరిత పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనం టీ.ఆర్.ఎస్ పునరుత్థానానికి కారణమయ్యాయి.
  4. ప్రజారాజ్యం: టీ.డీ.పీ వోటుబ్యాంకును చీల్చి తన ఉనికిని నిలుపుకోవాలని తహ తహలాడుతున్న ప్రజారాజ్యం పార్టీ దీని కోసం కాంగ్రెస్ జట్టు కట్టి వారి సాయంతో ఈ కార్యంలో ముందుకు సాగాలని ఆశ.   విమర్శలే కాదు ప్రభుత్వం చేసే మంచి పనులను మెచ్చుకొని ప్రతిపక్షమనే పదానికి కొత్త అర్థం ఇస్తున్నాము అని చిరంజీవి గారు ఎంత చెప్పినా, ఆయనకు రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతపు ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను ఉంది, దాని కోసం కాంగ్రెస్ నాయకత్వంతో అపవిత్రమైన లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు అన్నది గట్టి ఊహాగానం. అది నిజం అయ్యే అవకాశాలు ఎక్కువే.

మొత్తం మీద:

కాంగ్రెస్: ఎక్కడి గొంగళి అక్కడే, వర్గాలు, కుమ్ములాటలు;
టీ.డీ.పీ: అయోమయం, నిరాశ;
ప్రజారాజ్యం: కలల ఊహల్లో ఆశావహం;
టీ.ఆర్.ఎస్: సమరోత్సాహం, ప్రత్యేకరాష్ట్ర దిశలో స్పష్టమైన అడుగు.

3, ఆగస్టు 2010, మంగళవారం

అంబరీషుడు - ద్వాదశీవ్రతం - దుర్వాసుడు

అంబరీషుడు
అంబరీషుడు మహా విష్ణు భక్తుడు. రాజర్షిగా పేరు పొందాడు. ఈతడు అభాగుని కుమారుడు. సద్గుణశ్రేష్ఠుడైన ఈ అంబరీషుడు నిరంతర విష్ణు సేవా తత్పరుడై, అశ్రద్ధ, అలసత్వము లేకుండా ఈ భూమిని పాలించాడు. ఈయన సుగుణాల గురించి, భక్తి మహిమ గురించి శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలో వ్యాస భగవానులు వివరించారు. దాన్ని తేట తేనె తెలుగులో రచించారు బమ్మెర పోతరాజు గారు. ఆ పోతన విరచిత శ్రీమదాంధ్ర భాగవతంలోని అంబరీషోపాఖ్యానం నుంచి ఈ వ్యాసం రాస్తున్నాను.

అంబరీషుని భక్తి

అంబరీషుని భక్తి లక్షణాలను పోతన కమ్మని తెలుగులో ఇలా రచన చేశారు. 

చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద
కరములు విష్ణుమందిర మార్జనములంద శ్రవములు హరికథాశ్రవణమంద
చూపులు గోవిందరూపవీక్షణమంద శిరము కేశవనమస్కృతులయంద
పదములీశ్వరగేహపరిసర్పణములంద కామంబు చక్రికైంకర్యమంద

సంగమచ్యుతజనగుణసంగమంద
ఘ్రాణమసురారి భక్తాంఘ్రికమలమంద
రసన తులసీదళములంద రతులు పుణ్య
సంగతులయంద యా రాజచంద్రమునకు

ఆయన మనసు ఎప్పుడు ఆ శ్రీహరి పాదపద్మములపైనే, వాక్కు ఆ పరమాత్మ నామ సంకీర్తనలో, చేతులు విష్ణు మందిరాన్ని శుభ్రం చేయటంలో, చెవులు ఆ శ్రీహరి కథా శ్రవణంలోనే, చూపులు ఆ గోవిందుని మోహన రూపాన్ని చూడటంపైనే, శిరము కేశవునికి మొక్కటంపైనే, కోరికలు శ్రీహరి సేవకొరకే లగ్నమై ఉంటాయిట. ఆయన చెలిమి విష్ణు భక్తులతోనే, విష్ణు గుణగణాల వర్ణన, చర్చ ఉండే సత్సాంగత్యంలోనే. ఆయన నాలుక తులసీ దళం యొక్క రుచిని ఆస్వాదించటం లోనే, ముక్కులు ఆ మురారి పాదపద్మాల నుండి వెలువడే సుగంధమునందే, ప్రీతి శ్రీహరికి చెందిన పుణ్య విషయముల యందె లగ్నమై ఉన్నాయిట.  అంటే అన్ని ఇంద్రియములు వాటి వాటికి సంబంధించిన రుచులు, పనులు, ఆలోచనలు, మనస్సు పూర్తిగా ఆ శ్రీహరి మీదనే. ఎంత భాగ్యమో అలాంటి జన్మ పొందటానికి.

అంబరీషుని లక్షణాలు:

హరియని సంభావించును
హరియని దర్శించు నంటు నాఘ్రాణించున్
హరియని రుచిగానదలచును
హరిహరి ఘను నంబరీషు నలవియె పొగడెన్

అతని కీహమానె హరులందు గరులందు
ధనములందు  గేళి వనములందు
బుత్రులందు బందుమిత్రులయందు
బురమునందు నంతిపురమునందు

ఆయన 'హరి' అనుకొనుచు ఆలోచిస్తూ, 'హరి' అనుచు చూస్తూ, 'హరి' అనుచు వాసన చూస్తూ, 'హరి' అనుచు చవి చూస్తూ ఉన్నాడుట. అటువంటి ఘనుడైన అంబరీషుని పొగడ వశమా!. ఆయన జీవనంలో ప్రతి అడుగు 'హరి'మయమే అన్నమాట. ఆ మహాత్మునికి ఏనుగులు, గుర్రాలయందు (రాచరికపు హంగులు), ధనసంపదలయందు, ఉద్యానవనాలలో విహారాల యందు, పుత్రులు, బంధువులయందు, రాజధాని, అంతఃపురమందు వాంఛలు తొలగి పోయినవి.

ద్వాదశీ వ్రతము:

ఒక సంవత్సరము ఆ అంబరీషుడు భార్యతో కూడి ద్వాదశీ వ్రతము చేయ దలచాడు. వ్రతము చేసి, వ్రత సమాప్తిలో కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసముండి, కాళింది జలాలలో స్నానం చేసి, మధువనములో మహాభిషేకము చేసి, అందమైన గంధ పుష్పాక్షతలు సమర్పించి, పూజకు పనికి వచ్చే అత్యుత్తమమైన పుష్పాలతో పూజ చేశాడు.  ఈ వ్రత సమాప్తి సందర్భంగా, వేదవేత్తలైన బ్రాహ్మణులకు మంచి రుచి కరమైన భోజనము పెట్టి, అరువది కోట్ల గోవులను దానమిచ్చాడు.  ఎటువంటి గోవులు?. - ఏరులుగా ప్రవహించే అన్ని పాలిచ్చేవి, లేత వయస్సులో ఉన్నవి, సాధుస్వభావము కలవి, కొమ్ములకు, కాలి గిట్టలకు బంగారు, వెండి తొడుగులు కలవి, తమ దూడలను ప్రేమతో నాకుచున్నవి.

దుర్వాసుని ఆగమనం:

దుర్వాస మహాముని

అంబరీషుడు దానాల తర్వాత, తాను పారణ (ఉపవాస విరమణ) చేయబోతుండగా,  తేజోమయుడు, వేదాలను విశ్లేషించ గలిగినవాడు, ఉత్తమ తపశ్శక్తి సంపన్నుడు, ప్రకాశ వంతుడైన దుర్వాస (చాలా మంది దూర్వాసుడు అని పలుకుతారు. అది తప్పు) ముని ఆ అంబరీషుని ఇంటికి వచ్చాడు. అంబరీషుడు ఆ మునికి ఆసనమిచ్చి, పాదములు కడిగి, పూజించి, యోగ క్షేమములు అడిగి, భోజనము చేయుమని నమస్కరించాడు. ఆ ముని సంతోషించి, భోజనానికి అంగీకరించి, స్నానానికి కాళింది జలాలవద్దకు వెళ్ళాడు. అక్కడ ధ్యానం చేస్తూ, మునిగి లేచి రాక ఆలస్యం చేశాడు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నందున, అంబరీషుడు వ్రతభంగామౌతుందేమో అని భయపడి పండితులతో 'ద్వాదశి దాటిపో లోపల పారణ చెయ్యాలి. అతిథికి అపరాథము జరుగకుండా, వ్రతభంగము కాకుండా, ఉపాయమును ఆలోచించి చెప్పండి' అంటాడు.


అప్పుడు, పండితులు - "రాజా! శుద్ధ జలము కొంచెం సేవిస్తే ఉపవాస విరమణ చేసినట్లే. భోజనం చెయ్యకుండా అతిథి గురించి వేచి ఉన్నట్లు అవుతుంది. కాబట్టి నీరు తీసుకోవచ్చు. ఇది ధర్మ సమ్మతమే" అంటారు. అంబరీషుడు వారు చెప్పినట్లే నీరు తీసుకుని, దుర్వాసుని కొరకు ఎదురు చూశాడు.

దుర్వాసుడు వచ్చి అంబరీషుడిని -  'ధర్మభంగం చేసి దుష్కర్ముడవైతివి' అని దూషించాడు. 'నా కోపాగ్ని ప్రతాపం చూపిస్తాను. నిన్ను రక్షించే వాడెవ్వడు' అని రెట్టించాడు. పట పట పళ్లు కొరుకుతూ, కళ్లలో నిప్పులు కురిపిస్తూ, తన జటాలలోంచి ఒక శాఖను పెరికి రాక్షసిగా అంబరీషుడిపై ప్రయోగించాడు. కాలానలంలా, శూలాయుధ హస్తయై ఉన్న రాక్షసి ఆ అంబరీషుని మీదకు దుమికింది.

సుదర్శన ప్రయోగం

అప్పుడు ఆ శ్రీహరి , ఆ వెర్రి తాపసి చేసిన అహంకారపు దుశ్చర్యకు కోపగించి ఆ భక్త అంబరీషుని రక్షించటానికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం ఆ రాక్షసాన్ని దహించి, దాన్ని సృష్టించిన దుర్వాసుని వెంబడించింది.ఎలా?. పోతన గారు ఇలా వర్ణించారు.

శ్రీహరి సుదర్శనాన్ని ప్రయోగించుట

భువి దూరన్ భువి దూరు నబ్ధిజొరనబ్ధింజొచ్చు నుద్వేగియై
దివిబ్రాకన్ దివి బ్రాకు దిక్కులబో దిగ్వీథులం బోవు, జి
క్కివెసంగ్రుంగిన గ్రుంగు, నిల్వ నిలుచున్, గేడింప గేడించు, నొ
క్కవడిన్ దాపసువెంటనంటి హరిచక్రంబన్యదుర్వక్రమై

ఆ సుదర్శనము దుర్వాసుడు ఎక్కడికి పొతే అక్కడికి పోతూ, అతడు భూమిలో దూరితే చక్రమతని వెంబడించి భూమిలో దూరింది. అతడు సముద్రంలో దూరితే, అది కూడా సముద్రంలో చొచ్చింది. భయంతో అతడు ఆకాశానికి పాకితే అక్కడికి ఎగ బాకింది. అతడు ఏ దిక్కులో పోయి తలదాల్చుకున్నా ఆ చక్రం అక్కడికి వెంబడించింది. అతడు ఆగిపోతే చక్రం ఆగిపోయింది. అతడు నెమ్మదిగా నడిస్తే, చక్రం కూడా తన వేగాన్ని తగ్గించి వెంబడించింది. అలా వెంబడించి ఆ ఋషికి దిక్కు తోచకుండా చేసింది.

అప్పుడు దుర్వాసుడు బ్రహ్మదేవున్ని రక్షించమని ప్రార్థిస్తాడు. ఆ బ్రహ్మ ఆ శ్రీహరి చక్రాన్ని ఆపటానికి తాను ఆశక్తుడనని చెప్తాడు. దుర్వాసుడు శ్రీహరి శరణుకై  వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ విష్ణువు లక్ష్మీ దేవి పక్కన ఉండగా మధుర మనోహర భాషణలతో క్రీడించు చుండగా, ఆ దూర్వాసుడు ప్రార్థిస్తూ - "ఓ వరదా!, భక్త రక్షకా! ఈ చక్రాగ్ని జ్వాలలనుంది రక్షింపవా!" అని వాపోతాడు.

పోతన గారు ఆ దుర్వాసుడు నారాయణుని ప్రార్థించిన విధానాన్ని ఇలా వర్ణించారు.

నీ మహిమార్ణవంబుతుది నిక్కముగా నెరుగంగలేక నీ
ప్రేమకు వచ్చు దాసునకు గ్రించుదనంబున నెగ్గుచేసితిన్
నామరపున్ సహింపుమట నారకుడైన మనంబులో భవ
న్నామము చింతచేసిన ననంతసుఖస్థితి జెందకుండునే

"ఓ ప్రభూ! నీ అనంతమైన మహిమాసాగర తీరము తెలుసుకోలేక, నీకు చాలా ప్రేమ పాత్రుడైన నీ దాసునకు, నా నీచ గుణంతో కీడు చేయ తలచాను. నా పొరపాటును మన్నింపుము దేవా! నరకానికి పోవలసిన వాడు కూడా మనస్సులో నీ దివ్యనామము స్మరించగానే అనంతమైన సుఖములు పొందుతాడు కదా!"

అప్పుడు విష్ణువు ఇలా హితవు పలుకుతాడు. పోతన అద్భుతంగా రాసారు ఇక్కడ పద్యాలు.

తనువు మనువు విడిచి తనయుల చుట్టాల
నాలివిడిచి సంపదాలి విడిచి
నన్నెకాని యన్యమెన్నడు నెరుగని
వారి విడువనెత్తివారినైన

సాధులహృదయము నాయది
సాధులహృదయంబు నేను జగముల నెల్లన్
సాధుల నేనే ఎరుగుదు
సాధులెరుంగుదురు నాదుచరితము విప్రా!

నా తేజము సాధులలో
నాతతమైయుందు వారి నలచుజనులకున్
హేతిక్రియ భీతినిచ్చును
చేతోమోదంబు చెరుచు సిద్ధము సుమ్మీ

"ఓ దుర్వాసా! నన్ను స్తుతించువాడు నా భక్తుడగును.  నా భక్తులకు నేనే పరమగతిని. నా భక్తుడు ఎక్కడికి పోయినా, గోవు వెంట పోవు కోడె ఎద్దులా,  నేనతిని వెంటనే పోయెదను. దేహధ్యాస విడిచి, మనుగడను విడిచి, భార్యాపుత్రులను, బంధువర్గమును విడిచి, ధన సంపదలను విడిచి, నన్నే తప్ప వేరేదేది ఎరుగని వారిని, వారెట్టి వారైన సరే, నేను రక్షింప కుండా విడిచి పెట్టాను. సాధువులు తమ హృదయములను నాకు అర్పింతురు. వారి హృదయాలలో ఉండేది నేనే. వారిని నేనే ఎరుగుదును. నా చరిత్ర వారే ఎరుగుదురు. వారిలో నా తేజము విరివిగా ఉందును. వారిని పీడించే వారికి నా తేజం అగ్నిజ్వాలలా భయం కలిగిస్తుంది. అలా పీడించే వారి మనస్సులోని సంతోషాన్ని ఆ తేజస్సు చెడగొడుతుంది సుమా. కావున పోయి ఆ అంబరీషుడినే శరణు వేడు" - అంటాడు.

దుర్వాసుని శరణాగతి, అంబరీషుని దయ:

అప్పుడు, శక్తిహీనుడైన, భయముతో పరిగెత్తి అలసి  సొలసి ఉన్న దుర్వాసుడు వేగంగా పోయి కరుణాస్వరూపుడు, దోషాలు లేని వాడు, ఉదార స్వభావము కలవాడు, బుద్ధిమంతుడు, మృదుమధుర భాషి అయిన అంబరీషుడిని శరణు వేడాడు. అప్పుడు ఆ చక్రవర్తి, దయాళువై, కరుణతో ఆ సుదర్శనాన్ని ఇలా ప్రార్థించాడు.

సుదర్శన చక్రము


నీవె పావకుడవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము
నీవ నేలయునింగి నీవ సమీరంబు నీవ భూతేంద్రియనికరములును
నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవ యజ్ఞంబును నీవ ఫలము
నీవ లోకేశులు నీవ సర్వాత్మవు నీవ కాలంబును నీవ జగము

నీవ బహుయజ్ఞభోజివి నీవ నిత్య
మూల తేజంబు నీకు నే మ్రొక్కువాడ
నీరజాక్షుండు చాలమన్నించు నట్టి
శస్త్రముఖ్యమ! కావవే చాలు మునిని

విహితధర్మమందు విహరింతునేనియు
నిష్టమైన ద్రవ్యమిత్తునేని
ధరణిసురుడు మాకు దైవతంబగునేని
విప్రునకు శుభంబు వెలయుగాక

"శ్రీ మహావిష్ణువు మిక్కిలి మన్నించునట్టి ఓ అస్త్ర రాజమా! నీకు నేను మొక్కెదను . నీవే అగ్నివి, సూర్యుడవు, చంద్రుడవు, నీరు, భూమివి. నీవే ఆకాశము, గాలివి. నీవే భూత, ఇంద్రియ సమూహానివి. నీవే బ్రహ్మము, సత్యము, యజ్ఞము, యజ్ఞఫలము. నీవే లోకాధిపతివి, సర్వాత్మవు, నీవే కాలము, జగత్తువి కూడా. నీవే యజ్ఞఫలాన్ని అందుకునేది, నీవే నిత్యమైన మూల తేజము. నీకు నా నమస్కారములు. ఇక ఈ మునిని కాపాడుము, విడువుము. నేను నా విద్యుక్త ధర్మములను సక్రమంగా నిర్వహించే వాడినైతే, యోగ్యులకు కోరిన, ఇష్టమైన దానాలు ఇచ్చేవాడినైతే, ఈ బ్రాహ్మణునికి శుభము కలుగుగాక!"

ఆ ప్రార్థనను విని సుదర్శన చక్రము శాంతించి, తిరిగి తన యథా స్థానమునకు వెళ్ళెను.

అప్పుడు దుర్వాసుడు శాంతి చెంది, మెల్లని మేలిమి మాటలతో రాజుని దీవించి ఇలా అన్నాడు: "ఓ రాజా! నా తప్పు మన్నించి, నాకు చాలా మేలు చేసితివి. నీ వంటి భక్తులని కాచుటకు శ్రీహరి ఈ విధంగా వచ్చుట ఎంతో ఆశ్చర్యకరం. నేను ధన్యుడనైతిని. నీకు శుభము కలుగుగాక. అలవోకగానైన ఎవ్వని నామము ఒక్కమారు చెవులకు వినపడితే సకల పాపాలు పోతాయో, అత్యంత శుభకరుడు, మంగళకరుని,హరిని, విష్ణువుని, దేవదేవుని - నీవంటి స్వచ్చమైన భక్తులు కొలిచెదరో, వారికి ఎటువంటి అడ్డంకులు కలుగబోవు".

అప్పుడు, ఆ అంబరీషుడు ఆ ముని పాదములకు మొక్కి,  ఆయనకు ప్రీతికరమైన భోజనము పెట్టి తృప్తి పరచెను. దుర్వాసుడు ఆతని ఆతిథ్యానికి మెచ్చి, దీవించి, కీర్తించి బ్రహ్మలోకమునకు తిరిగి వెళ్ళాడు. అంతట, అంబరీషుని ద్వాదశీ వ్రతం సంపూర్ణమైనది. హరిని కొలిచేవారికి వైకుంఠము తప్ప మిగిలిన పదములన్నీ నరకతుల్యములు కావున అంబరీషుడు రాజ్యభారాన్ని పుత్రులకు అప్పగించి, కామ విజయుడై, హరి భక్తుడై అడవులకేగాడు.

'అంబరీషుని చరిత్ర వినిన వారికి, చదివిన వారికి ధైర్యం, సంపదలు కలిగి పుణ్యులు అగుదురు గాక' అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు తెలిపాడు.

30, జులై 2010, శుక్రవారం

భారత రత్న, సంగీత కళానిధి సుబ్బులక్ష్మి

మన వృత్తిలోని విశేషాన్ని మన జీవనంలో అమలు పరచటం చాలా కష్టం. అలాగే మంచి జీవన శైలిని వృత్తిలో అనుకరించటం కూడా కష్టమే. బహు కొద్ది మంది తాము చేసే పనిలోని భావాన్ని తమ జీవితంలోని ప్రతి అడుగులో నిరూపించగలరు. సంగీతం అంటే కేవలం సప్త స్వరాలు, వాటిని అటు ఇటు తిప్పి పాడటం కాదు. ఒక వాగ్గీయకారుడు అనుభూతి పొంది ఆ వాగ్దేవి అనుగ్రహంతో రాసిన సుస్వర రస ప్రవాహాన్ని తన మానసిక, శారీరిక శుద్ధితో, నిర్మలమైన నవ్వుతో ఆ పరమాత్మను తలస్తూ, పొగడుతూ, ఆ అంతర్యామి లక్షణ వర్ణనలో లీనమై, ఒక్కొక్క అక్షరాన్ని మంత్రంలా భావించి తాదాత్మ్యం చెంది, శృతి, లయ బద్ధంగా పాడితే అది శాస్త్రీయ సంగీతం.

అంతర్యామిని దర్శిస్తూ పాడుతున్న సుబ్బులక్ష్మి

అలా పాడాలంటే - ఆలోచన, జీవన శైలి దానికి అనుగుణంగా ఉండాలి. అంటే, నిరాడంబరత, శాంతము, సహనము, ప్రేమ, భక్తి, బాహ్య/అంతః శుద్ధి, శరణాగతి, నిరపేక్షం లాంటి సుగుణాలు చాలా ఉండాలి. వీటికి తోడు గా కఠోర శ్రమతో, సద్గురువు వద్ద నేర్చుకున్న విద్య ఉంటే అది పంచమ శృతిలో ప్రౌఢ కోకిల పాడినట్టుగా శ్రావ్యంగా ఉంటుంది.

ప్రపంచంలో ఉన్న అన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో చూడాలని ఉందా?. అలా ఉంటే మరి వారికి ఆ సరస్వతి ఏమిటి?. ముల్లోకాలు వశమే. తన గానం, జీవనం, భక్తి, చిరునవ్వు, నిరాడంబరత, అందం, నిశ్చలమైన వ్యక్తిత్వము - ఇంక ఎన్నో ఎనో సుగుణాల రాశి ఆవిడ. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (ఎం.ఎస్. సుబ్బులక్ష్మి). ఏమి చెప్పగలం ఆమె గానమాధుర్యం గురించి?. ఆ గానంలో ఉన్న భక్తి, శాస్త్రం గురించి?.

ఎన్ని సంపదలు, విద్యలు ఉన్నా స్వచ్చతను చిందించే సుబ్బులక్ష్మి

తెల్లవారకముందే దక్షిణ భారత దేశంలో లక్షలాది గుళ్లలో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని వినిపిస్తే అది ఆమె గొంతులో వెలువడిందే. 'భజ గోవిందం భజ గోవిందం' అని వినిపించే శ్రావ్యమైన గానం ఆమెదే. 'శుక్లాంబర ధరం విష్ణుం' తో మొదలయ్యి, 'విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః' అన్న వేయి నామాలతో అరగంటపాటు మీకు ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతించే విష్ణు సహస్ర నామం ఆమె పాడిందే.  రేడియోలో, రికార్డుల్లో, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈమె గొంతు దక్షిణాదిన మారుమ్రోగుతూనే ఉంటుంది.

పొద్దునే లేచి ఏ చప్పుడూ లేకుండా, స్నానం చేసి, కుర్చీలో కూర్చొని ఆమె పాడిన 'భావయామి గోపాల బాలం' అన్న యమన్ కళ్యాణి రాగంలో అన్నమాచార్యుల కృతి వింటే భక్తి పారవశ్యం మనలో రాక మానదు. జో అచ్యుతానంద జో జో ముకుంద అని ఆ వెంకటేశ్వరునికి జోల ఆమె అంత లాలిత్యం, ప్రేమతో ఎవ్వరు పాడలేరు, పాడబోరు. 'డోలాయాం చల డోలాయాం' అనే కృతి పాడుతుంటే ఆ తిరుమలేశుడు నిజంగానే ఊయలలో ఊగుతూ మందహాసంతో ఈ సరస్వతిని ఆశేర్వదించిన ఉండవచ్చు. ఎం.ఎస్. 30 ఏళ్ల క్రిందట పాడిన పాట ఇది.  అలాగే, 'ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన'  అనే కీర్తనలోని  ఆధ్యాత్మిక తత్త్వాన్ని అద్భుతంగా వినిపించారు సుబ్బులక్ష్మి. తిరుమల స్వామి వారి ఆస్థాన గాయనిగా ఆవిడ అన్నమాచార్యుని కీర్తనలు చాలా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఒక సంగీతజ్ఞురాలిగా ఆమె అన్ని శిఖరాలను అధిరోహించి అక్కడే నిలిచిపోయింది. ఆవిడను దాటి వెళ్లే వారు ఇంత వరకు పుట్టలేదేమో.

శాస్త్రమంటే సుబ్బులక్ష్మే

సెప్టెంబర్ 16, 1916 న మదురై లో పుట్టింది సుబ్బులక్ష్మి. 13 ఏళ్ల  ప్రాయంలో కచేరీలు మొదలు పెట్టింది సుబ్బులక్ష్మి. అప్పటినుంచి తన భర్త మరణించేంతవరకు ఆరు దశాబ్దాలు భారత శాస్త్రీయ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి సుబ్బులక్ష్మి. నటిగా  హిందీ, తమిళ చితాల్లో తన ప్రతిభను చూపించింది ఆవిడ. మీరాబాయిగా ఆమె నటన, ఆమె పాడిన మీరా భజనలు ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ప్రజల మనస్సుల్లో ఉంది. పాత్రికేయుడైన సదాశివాన్ని పెళ్ళిచేసుకొని నిజమైన ధర్మపత్నిగా జీవించి, సహకరించింది. ఆ దంపతులు చేసిన సమాజ సేవ, దాన ధర్మాలు వారి నిర్మలత్వానికి ప్రతీక.

భారత దేశంలో అత్యున్నత పురస్కారం - భారత రత్న - పొందిన ఏకైక సంగీత కళాకారిణి ఆవిడ.  మెగసెసే, పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత కళానిధి, కలైమామణి, తాన్సేన్ లాంటివి చెప్పక్కర్లేదు. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, లండన్, ఫ్రాన్సు, మాస్కో లలో అంతర్జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు పొందిన కచేరీలు ఎన్నో.

చెదరని అరవ కట్టులో దేవతలను గుర్తు చేసే రంగులో కంచి పట్టు చీర, సిగన తెల్లని మల్లెపూలు, నుదుట పెద్ద తిలకపు బొట్టు, ముక్కున మెరిసే రవ్వల పుడకలు, చెవులకు మెరిసే రవ్వల దిద్దులు,  మెడలో మెరిసే ఒక ఆభరణం, పెదవులపై మందాకినీ జలంలాంటి స్వచ్చమైన చిరునవ్వు, కళ్ళలో ఆ భగవంతుని చూస్తున్న చిదానందం, పారవశ్యం  - చేతిలో తంబురా పట్టి శ్రుతిలోఆవిడ పాడుతుంటే ఆ సరస్వతి మన కళ్ళ ఎదుట ఉన్నదా అనిపిస్తుంది. భారతీయ స్త్రీలో ఉండే అందం, అణకువ, సిగ్గు, భక్తి, మానసిక సౌందర్యం - వీటికి తోడు తమిళ సాంప్రదాయాన్ని పాటించే ఉత్తమ ఇల్లాలి లక్షణాలన్నీ ఉన్న మహా కళాకారిణి సుబ్బులక్ష్మి. ఏ భాషలో పాడినా ఆ భాష యొక్క సహజ లక్షణాలు పోకుండా, స్పష్టమైన ఉచ్చారణతో, భక్తితో అబ్బ ఎంత బాగుంది అని అనిపించేలా పాడారు ఆవిడ.

భక్తిలోతాదాత్మ్యం చెంది శ్రోతలను పారవశ్యంలో ముంచుతున్న సుబ్బులక్ష్మి

అప్పటి భారత ప్రధాని ఈవిడ గురించి మాట్లాడుతూ - "నేను ఈ దేశానికి మాత్రమే ప్రధానిని. సుబ్బులక్ష్మి అనంతమైన సంగీత సామ్రాజ్యానికి మహారాణి' అని అన్నారుట. మహాత్మా గాంధి ఈవిడ పాడే మీరా భజనల కోసం ఆవిడను పిలిపించుకునే వారుట.

డెబ్భై ఎనిమిదేళ్ళ వయసులో కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి సమక్షంలో ఆయన రచించిన 'మైత్రీం భజత' అని, ఆది శంకరులు రచించిన 'నాగేంద్ర హారాయ త్రిలోచనాయ' అని పాడి ఆయన ఆశీస్సులు, మన్ననలు పొందారు ఆవిడ. అంతకన్నా గొప్ప గౌరవం ఒక భారతీయ కళాకారుడి జీవితంలో ఉండదేమో.

ఎన్నో స్తోత్రాలకు ఆవిడ జీవం పోశారు - భజగోవిందం, అన్నపూర్ణాష్టకం,  నామ రామాయణం, హనుమాన్ చాలీసా, గోవిందాష్టకం, గణేశ పంచరత్నం, మీనాక్షీ స్తోత్రం, కనకధారా స్తోత్రం, రామనాధ స్తోత్రం, దుర్గా పంచరత్న స్తోత్రం, కాశీ విశ్వనాథ సుప్రభాతం, కామాక్షీ సుప్రభాతం, లక్ష్మీ అష్టోత్తరం - ఇలా దాదాపు ప్రతి మహిమాన్విత స్తోత్రం ఆమె గళంలో అమృతంగా మరి మనకు జాలువారింది. సామాన్యునికి తన గొంతును స్తోత్రాల రూపంలో అందించి శాశ్వతమైయ్యింది సుబ్బులక్ష్మి.  'అధరం మధురం, వదనం మధురం' అని మధురాష్టకం పాడుతుంటే ఆ శ్రీ కృష్ణుని మనోహరమైన రూపము మన కళ్ళ ఎదుట నిలుస్తుంది. న భూతో న భవిష్యతి అన్నట్టుగా పాడారు ఈ స్తోత్రాలన్నీ ఆవిడ.

నాయనమ్మ, అమ్మమ్మ అంటే ఇలా ఉండాలి అని అనిపించే వ్యక్తిత్వము, రూపము ఆమెది. పోటీ ప్రపంచమైన శాస్త్రీయ సంగీత ప్రపంచంలో శత్రువులు, విమర్శకులు లేకుండా అందరి చేత అమ్మ అని పిలిపించుకున్నారు ఆవిడ. ఆవిడ వినయం, నడవడిక, కవళికలు మనకందరికీ ఆదర్శ ప్రాయం. ఆదర్శ పత్ని గా సదాశివం గారిని కంటికి రెప్పల చూసుకుంటూ, అనుగమిస్తూ ధర్మపత్నిఅనే పదానికి ఉత్తమ ఉదాహరణ ఆవిడ అయ్యారు. సవతి బిడ్డలైనా తన బిడ్డలకన్న మిన్నగా సదాశివం మొదటి భార్య కూతుళ్ళని పెంచింది. ఆయన పెద్ద కూతురు రాధా విశ్వనాథన్ ఆవిడతో కొలిసి కొన్ని వందల కచేరిలలో పాడారు. వారి జీవితంలో వీడలేని బంధమై, ప్రేమ మూర్తిగా, సత్సాంప్రదాయాలకు పుట్టిల్లుగా తన గృహాన్ని పెంపొందించింది. ఆ తల్లి మరణించినప్పుడు ఈ బిడ్డలు పొందిన ఆవేదన వర్ణనాతీతం.

కంచు లాంటి కంఠం, శాస్త్రం పై పూర్తి పట్టు, చెదరని చిరునవ్వు, అనన్యమైన భక్తి ఆమె సంగీత సోపానానికి పునాది రాళ్ళు. వయసుతో భక్తి, శాస్త్రంలో పండి, ఎదిగిన కొద్దీ ఒదిగి, జీవితంలో ప్రతి కోణం లోను తన ఉన్నత విలువల్ని చూపించి, ఆచరించి, వాటి ఫలితాలను పొంది, తాను సంపాయించింది పేదలకు, పరమేశ్వరుడి సేవకు ధారా పోసి, 88 ఏళ్ల పండు వయసులో సుబ్బులక్ష్మి చెన్నైలోని స్వగృహంలో డిసెంబర్ 11, 2004 నాడు కన్ను మూశారు. ఆమె ఎప్పటికీ సంగీత రసజ్ఞుల గుండెల్లో ఉన్నతమైన స్థాయిలో నిలిచి పోతుంది.

శివుడు - హాలాహల భక్షణం

దేవతలు, రాక్షసులు పాల కడలిని అమృతం కోసం చిలకటంలో భాగంగా మందర పర్వతం, వాసుకి, కూర్మావతరమైన విష్ణువు - ఇవి చాలా సార్లు చదివే ఉంటాము.

కూర్మావతారము


ఈ క్షీర సాగర మథనంలో అమృతం కన్నా ముందు కాలకూట విషం బయట పడింది. దాన్ని హాలహాలంగా వర్ణించారు. ఈ కథను శ్రీమదాంధ్ర మహాభాగవతంలో పోతన మనోజ్ఞంగా వర్ణించాడు. అష్టమ స్కంధములో వీటి వివరాలు ఉన్నాయి. 

జలధిన్ కడవ సేయ శైలంబు కవ్వంబు
సేయ భోగిన్ త్రాడు సేయన్ తరువ
సిరియుసుధయున్ బడయ శ్రీవల్లభుడు దక్క
నొరుడు శక్తిమంతుడొకడు గలదే

సిరి సంపదలకు, అమృతమును పొందటానికి క్షీర సాగరమును కడవగా చేసి, పర్వత రాజమైన మందరగిరిని కవ్వముగా చేసి, సర్పరాజమైన వాసుకిని తాడుగా చేసి, సముద్రమును చిలుకే కార్యమును ఆ శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకొక శక్తిమంతుడు ఎవ్వడైనా చేయ గలడా?.

ఆలోల జలధిలోపలన్
ఆలోనహి విడిచి సురలు నసురులు బరవం
గీలా కోలాహలమై
హాలాహలవిషము పుట్టె నవనీనాథ!

ఆ కల్లోలితమైన సముద్రము లోపల విషజ్వాలలు పుట్టుటచే, కోలాహలముతో ఆ వాసుకిని విడిచి దేవ దానవులు చెల్లాచెదరుగా పారిపోయారు.

అప్పుడు దేవతలు ఆ శివుని హాలహలమునుండి రక్షించమని స్తుతించారు. ఏమని?.

కొందరు కలడందురు నినున్
కొందరు లేదండు రతడు గుణిగాడనుచున్
కొందరు కలడని లేడని
కొందలమందుదురు నిన్నుగూర్చి మహేశా!

మూడుమూర్తులకును మూడులోకములకు
మూడుకాలములకు మూలమగుచు
భేదామగుచు దుదినభేదమై యొప్పారు
బ్రహ్మ మనః నీవ ఫాలనయన! 

సదసత్తత్త్వచరాచర
సదనంబగు నిన్ను బొగడ జలజభవాదుల్
పెదవులు గదలుప వెరతురు
వదలక నిను బొగడ నెంతవారము దేవా! 

నీకంటె నొండెరుగము
నీకంటెం బరులు గావనేరరు జగముల్
నీకంటె నొడయడెవ్వడు
లోకంబులకెల్ల నిఖిలలోకస్తుత్యా!

దేవ దేవా! నీవే మాకు శరణ్యము. కొందరు నీవు ఉన్నావు అంటారు, కొందరు నీవు సాకారుడవై లేవని అంటారు, మరి కొందరు నీవు కలవో లేవో అని తికమక పడతారు. నీయొక్క నిజతత్వము ఎవ్వరికి తెలియదు కదా పరమశివా! . ఓ త్రినేత్రా! త్రిమూర్తులకు, మూడు లోకాలకు, మూడు కాలాలకు మూలమై ఉంటూ బాహ్యమైన భేదాలు కనిపించినను, నిజానికి ఏకైక పరబ్రహ్మ అభేద తత్త్వమై నీవు ఉన్నావు. సత్యము, అసత్యములతో కూడియున్న ఈ చరాచర సృష్టికి ఆశ్రయమై యున్న నిన్ను పొగడుటకు బ్రహ్మాది దేవతలు కూడా పెదవులను కదుపుటకు సాహసింపలేరు. ఇక మేమెంత?. ఓ సర్వలోక పూజ్యా! మేము నిన్ను తప్ప ఇంకెవరినీ ఎరుగము. నీవు తప్ప ఇంకెవ్వరు ఈ లోకములను ఈ హాలాహలాన్నుండి కాపాడలేరు. ఈలోకములన్నిటా నీకన్నా గొప్పవాడు ఇంకెవ్వడూ లేడు.

అప్పుడు శివుడు ప్రసన్నుడై, వారిపై జాలి కలిగి, పార్వతితో ఇలా అన్నాడు.

ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన
ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లన్
ప్రాణులకిత్తురు సాధులు
ప్రాణంబులు నిమిషభంగురములని మగువా!

పరహితము సేయునెవ్వడు
పరమహితుండగును భూతపంచకమునకున్
పరహితమె పరమధర్మము
పరహితునకు నెదురులేదు సర్వేందుముఖీ!

హరి మది నానందించిన
హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్
హరియును జగములు మెచ్చగ
గరళము వారింపుటొప్పు కమలదళాక్షీ!

ఓ పార్వతీ! ప్రాణములను రక్షించుకొను కోరికతో వచ్చి, శరణు జొచ్చిన ప్రాణులను ప్రభువులందరూ రక్షింపవలెను. సాధువులు, మహాత్ములు ఇతరులకు తమ ప్రాణములను, అవి క్షణంలో పోగలవని తెలిసి ఇచ్చెదరు కదా!. ఇతరులకు ఉపకారము చేసే వాడు పంచభూతములకు, సమస్త జీవరాశికి పరమ హితుడగును. పరోపకారమే పరమ ధర్మము. ఇతరుల మంచి కోరేవాడికి ఎందులోనూ ఎదురులేదు కదా. ఇతరులకు మంచి చేస్తే ఆ విష్ణువు కూడా సంతోషించును. విష్ణువు సంతోషిస్తే లోకాలన్నీ ఆనందిస్తాయి. శ్రీహరిని, సర్వ లోకములను ఆనందింప చేయటానికి విషాన్ని నివారించటం మంచిదికదా!.

అప్పుడు ఆ లోకమాత ఐన పార్వతి ఎలా ఆ శంకరుడు హాలాహలాన్ని తన కంఠంలో ఉంచుకోటానికి ఒప్పుకుందో పోతన గారు ఇలా వర్ణించారు.

మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిది గరళమని మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!

మూడు లోకాలను దహించనున్న హాలాహాల జ్వాలలను తానే స్వీకరించదలుచుకున్న శివునకు శివాని లోకకల్యాణార్థమై అనుమతి ఇచ్చింది.  మింగ వలసినది ఘోరమైన విషమని తెలిసి, మింగేవాడు తన పతి దేవుడైనా,  జీవరాసులను రక్షించవలసి ఉన్నందున సర్వమంగళయైన ఆ పార్వతి, గరళమును మింగుమని పతి దేవునికి అనుమతినిచ్చెను. మరి ఆ సర్వలోక జనని తన మాంగల్య బలమును ఎంతగా నమ్మినదో కదా!. అప్పుడు శివుడు,

హాలాహాల భక్షణము

తన చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
ఘన గంభీరరవంబుతో శివుడు లోకద్రోహి! హుం! పోకు ర
మ్మని కెంగేల దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
బన సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్

ఉదరము లోకంబులకును
సదనంబగుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్
గుదురుకొన గంఠ బిలమున
బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్

హరుడు గళమునందు హాలాహలము వెట్ట
గప్పుగలిగి తొడవుకరణినొప్పె
సాధురక్షణంబు సజ్జనునకు నెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర!


తన చుట్టూ దేవతా సమూహములు జయ జయ ధ్వనులతో కేకలు వేస్తుండగా, గంభీర స్వరముతో ఆ విషమేఘమును ఆజ్ఞాపించుచు, 'ఓ లోకద్రోహీ! ఎక్కడికీ పోకుండా నా దగ్గరకు రమ్ము' అని చెప్పి చెయ్యి చాచి ఆ మహావిషాన్ని అంతటా ఒకచోట చేర్చి ఒక్క ముద్దగా నేరేడు పండు లాగ విలాసముగా ఆరగించాడు. తన పొట్ట లోకములన్నిటికి నిలయమని తెలిసియున్న మహేశ్వరుడు చెదిరి ఉన్న విషాగ్నిని ఒకచోట కుదురుకునేలా కంఠంలో పదిలముగా, చిన్న ఫలరసమా అన్నట్లు నిలుపుకొన్నాడు. ఆ కంఠంలో విషము నలుపు పట్టిన ఆభరణంలా అలరారింది. సాధురక్షణ కూడా సజ్జనునకు ఒక ఆభరణమే కదా!.  అప్పుడు,

గరళంబు గంఠబిలమున
హరుడు ధరించుటకు మెచ్చి యౌనౌ ననుచున్
హరియు విరించియు నుమయున్
సురనాథుడు బొగడిరంత సుస్థిరమతితోన్


శివుడు గొంతుకలో గరళము ఉంచుకోవటం చూసి భళిభళి అంటూ శ్రీహరి, బ్రహ్మ, పార్వతి, ఇంద్రుడు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.

అలా ఆ పరమశివుడు నీలకంఠుడై ప్రపంచాన్ని ఆ విషాగ్ని నుంచి కాపాడాడు. ఈ క్షీర సాగర మథనం, హాలాహాల భక్షణం, జగన్మోహిని అవతారం (వివరాలు ఇంకొక వ్యాసంలో) అన్నీ మన ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలో గోదావరి జిల్లాల్లో జరిగింది అని ప్రజల నమ్మకం. పురాణాలు కూడా వీటిని సమర్థిస్తున్నాయి. ఇవి అంతర్వేది, ర్యాలి ప్రాంతంలో జరిగి ఉండవచ్చు. చారిత్రిక ఆధారాలుగా ఇక్కడ పుణ్యక్షేత్రాలు వెలశాయి.  అంతర్వేది వివరాలు.

ఓం నమః శివాయః


మహా మృత్యుంజయ మంత్రం:
 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

అత్యాశ, అవకాశవాదం

2009 శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయినా పీ.సి.సి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ గారు తన గుణపాఠం నేర్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తనవంతు తను తెలంగాణా ఏర్పాటుకు ఇసుమంత కృషి కూడా చెయ్యలేదు. ఏడాది నుంచి ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో ఉంటే ఆయన తన పదవిని, ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణపై స్పష్టతకు ఏమీ చెయ్యలేదు. కానీ, ఎప్పుడైతే చిదంబరంగారు రాత్రికి రాత్రి ప్రకటన చేశారో, అప్పటినుంచి తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని గ్రహించి, దానికి అధిష్ఠానం ఆశీర్వాదం ఉందని తెలిసి, తన పావులు తను కదిల్పారు. అంటే?. తనకు తన నియోజకవర్గంలోనే గతి లేదు కాని రాష్ట్రాన్ని పాలించాలన్న అత్యాశా?. ఎంత అన్యాయమండీ శ్రీనివాస్ గారు?. పోయిన సారి మీరు మైనార్టీల మీద చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఓడిస్తే, ఈ 2010 ఉపఎన్నికల్లో పచ్చి తెలంగాణా వాదం మిమ్మల్ని, మీ ఆశలని ముంచింది. మైనార్టీ వోటర్లు చాలా మంది ఉన్న ఆ వోటు బ్యాంకు మిమ్మల్ని గెలిపించ లేకపోయింది.

అయ్యా. ఎప్పుడూ మీ గురించే కాదు. కొంచెం ప్రజల గురించి, వాళ్లు ఏమి అనుకుంటున్నారో తెలుసుకోండి. ఢిల్లీ చుట్టూ తిరిగి, అమ్మగారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటే చాలదు. కాస్త ప్రజల నాడి కూడా గమనించండి. మీరు తెలంగాణలో మంచి ధనికమైన జిల్లాలో ఉన్నారు. దాన్ని మీ ప్రాంతపు ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే, మేడం తెలంగాణాకు ఒకే చెప్పారు అని ప్రచారంలో మాట్లాడారు కదా మరి దాన్ని కార్యరూపంలో చూపించండి. ఇప్పటినుంచి ఒక సంవత్సరంలోపు తెలంగాణా రాష్ట్రాన్ని తేవటానికి ముఖ్యమంత్రి, శాసనసభ్యుల ద్వారా చెయ్యాల్సిన పని చేయించి, అలాగే పీ.సి.సి. అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్లి ఒత్తిడి పెట్టి, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టించండి. ఇంక చాలు మన నాటకాలు, దోబూచులాటలు, కాలాయాపానలు.

ప్రజలు మూడు సార్ల నుంచి, ముప్ఫై ఏళ్ళ నుంచి తెలంగాణా విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వాటిని గౌరవించి, ఢిల్లీకి, వ్యాపారులకు అమ్ముడుపోకుండా తెలంగాణా ఏర్పాటుకు సహకరించండి. ప్రజలు మంచి ఉద్దేశాలను, పనులను ఎప్పటికైనా గౌరవిస్తారు. అలా చేస్తే, మిమ్మలిని, మీ పార్టీని ఆదరిస్తారు కూడా.

జై తెలంగాణ


తెలంగాణా ప్రజలు తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీల అవకాశవాద రాజకీయాలు, గత ఏడాదిగా నడుస్తున్న మోసాలకు తెరపడే సమయం వచ్చింది. మీకు తెలంగాణా కావాలా?. మీరు తెలంగాణా ఇస్తారా? అన్న ప్రశ్నలకు ధైర్యంగా, నిజాయితీగా సమాధానం చెప్పలేక కుప్పిగంతులు, పిల్లిమొగ్గలు వేసిన ఈ రెండు పార్టీలు తెలంగాణా వాదం ముందు తల వంచక తప్పలేదు. రాజీనామాలు చేసిన 12 మంది తెలంగాణా ప్రాంతపు టీ.ఆర్.ఎస్, బీ.జే.పీ ఎమ్మెల్యేలు తిరిగి భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. 95 వేల వోట్ల మెజారిటీతో హరీష్ రావు గారు సిద్ధిపేట నుంచి గెలిచారు. ఇది వై.ఎస్.ఆర్ పులివెందుల నుంచి గెలిచిన రికార్డును బద్దలు కొట్టి శాసన సభ చరిత్రలో కనీ వినీ ఎరుగని ఆధిక్యత. ఎవరు ఇచ్చారు దీన్ని?. విసిగి, వేసారి, కోపంతో ఉన్న తెలంగాణ ప్రజలు. 
  1. తెచ్చేది, ఇచ్చేది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజంగా తెలంగాణా తెస్తారా?.  రోజుకో మాట, నోటికో మాట మాట్లేడే మీ పార్టీ నాయకులు ఇప్పటికైనా ప్రజల నాడి గ్రహించి ముందుకు అడుగు నిజాయితీగా వేస్తారా?.
  2. తెలంగాణా, ఆంధ్ర రెండు కళ్ళు అన్న బాబు తెలుగు దేశం పార్టీకి చాలా చోట్ల డిపాజిట్ దక్కే అవకాశం కూడా లేదుట. మరి ఏమంటారు బాబు గారు?. మీ రెండు కళ్ళ భావనని మేము కాదనము కానీ, ఈ ఎన్నికలు తెలంగాణా గురించి. దాని గురించి 10 నెలలుగా మీరు మౌనం పాటించారు. ఇకనైనా నోరు తెరిచి, నిజాన్ని తెలుసుకొని మాట్లాడతారా?. మీ పార్టీకి ధరావతు కూడా దక్కట్లేదు అంటే ఏంటి తెలంగాణా లో టీ.డీ.పీ పరిస్థితి?.
  3. ఇప్పటికైనా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు షెడ్యూలు ప్రకటించి దాన్ని అమలు పరుస్తారా సోనియా, మన్మోహన్?.
ఇక మాకు చాలు ఈ నాటకాలు, ఈ మోసాలు, ఈ అవకాశవాద రాజకీయాలు అని చెప్పుతో కొట్టి చెప్పలేక, వోటు అనే బ్రహ్మాస్త్రం ప్రయోగించారు తెలంగాణా ప్రజలు. వారి మనోభావాల్ని గౌరవించండి. వారి ఆకాంక్షల్ని నెరవేర్చండి.  ఇకనైనా, తమ మనస్సాక్షిని అనుసరించి, ప్రజల తీర్పును గౌరవించి కాంగ్రెస్, టీ.డీ.పీ పార్టీలు తెలంగాణా ఏర్పాటుకు తాము చేయ్యాల్సింది చేస్తే ప్రజలు వారిని మన్నిస్తారు. లేకుంటే వారికి రాజకీయ అధోగతే. మీరు ముందు చూపుతో వ్యవహరించకపోతే, ఈ రాష్ట్రంలో ముందున్నది ప్రత్యక్ష,ప్రచ్ఛన్న పోరాటమే. అందులో గెలుపు తెలంగాణా ప్రాంతపు ప్రజలదే.

జై తెలంగాణా తల్లి
జై తెలంగాణా

29, జులై 2010, గురువారం

ముద్ద బంతి పూలు పెట్టి

ముద్ద బంతి, మొగలి రేకులు, చిట్టెమ్మ, కిట్టయ్య, అరణాలు, కట్నాలు, అభిమానము, అవిటితనంలోని విచారము, పేదరికంలోని స్వాభిమానం - ఇవన్నీ కలిపి ఒక గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు మహా నటీ నటులను పెట్టి చిత్రం తీసి, అందులో ఒక అందమైన, సందేశమున్న పాట చిత్రీకరిస్తే?. అదే 'కలసి ఉంటే కలదు సుఖం' చిత్రం లోని 'ముద్ద బంతి పూలు పెట్టి' అనే పాట. చలనచిత్రంలో సందేశముంటే అది కలకాలం నిలుస్తుంది అన్నదానికి మరో చక్కని ఉదాహరణ కలసిఉంటే కలదు సుఖం చిత్రం.






 కలసి ఉంటే కలదు సుఖం (1961)






కొసరాజు రాఘవయ్య చౌదరి గారు తమ కవితా పాటవాన్ని సులభమైన వాడుక తెలుగు పదాలలో ఈ పాటలో చూపించారు. మాస్టర్ వేణు సంగీతం ఈ రచనకు కలికితురాయి. ఒక అవిటి వాడు, అతని అంతః సౌందర్యం చూసి అతనంటే ముచ్చట పడిన ఒక అందమైన పిల్ల - వారిద్దరి మీద కథలో బాగా నప్పే విధంగా ఈ పాట చిత్రీకరించబడింది. వర్ష, శరదృతువులలో పూసే ముద్ద బంతిలో ఉండే స్వచ్ఛత, నిండుతనం, అందము ఇంకే పుష్పంలో ఉండదు. అచ్చం అలానే ఉంటుంది మహానటి సావిత్రి ఈ చిత్ర సన్నివేశాల్లో. ముద్ద బంతి స్త్రీ రూపములో మూర్తీభవించిందేమో అనిపించేంత అందము, నిర్మలత్వము, స్వాభిమానమున్న పాత్రలో మహానటి జీవించారు. వర్ష ఋతువులో వచ్చే మొగలి పూవు గుబాళింపు గుప్పుమని, మత్తు ఎక్కించి మైమరపిస్తుంది. యుక్త వయసులో ఉన్న స్త్రీకి, మొగలి రేకుల అందానికి, సువాసనకు అవినాభావ సంబంధం ఉంది. అందుకనే కొసరాజు వారు ఈ పాటలో మొగలిరేకును వాడి పాటకు, పాత్రకు అందాన్ని తెచ్చారు. ఇది నాయికానాయకుల వయసులోని ముచ్చట గురించి రాసిన భాగం.


ఇక సందేశానికి వస్తే:

అద్దమంటి మనసు, అందమైన వయసు కన్నా ఉండేది ఏంది అన్న వాక్యంలో ఎంత గూఢార్థముందో గమనించండి. మనసు స్వచ్ఛంగా ఉంటే - శరీర సౌందర్యము, ఆత్మ విశ్వాసము అదే ఉంటుంది అని చాల సున్నితంగా చెప్పారు రచయిత. అభిమానము, ఆప్యాయత ముందు కట్నాలు, కానుకలు ఎందుకు పనికి రావని ఈ గీతం మనకు మంచి సందేశాన్ని ఇస్తుంది. 'అభిమానమాభరణం మరియాదే భూషణం' అని భర్తృహరి నీతిని గేయం రూపంలో సులభమైన తెలుగులో చెప్పారు కవి. మంచి గుణమున్న పేదవాడి మనసుకన్న విలువైనది ఏమి లేదని మనసుకు హత్తుకునేలా చెప్పారు గేయకర్త. కాలు, చెయ్యి లేని అవిటివాడిని అయినవారు ఎలా ఎగతాళి చేస్తారో, తనకు పెళ్లి అవుతుందో కాదో అని దిగులు పడుతున్న నాయకుణ్ణి, నాయిక 'ఎవరేమి అన్ననేమి, ఎగతాళి చేయనేమి, , నవ్విన నాప చేనే పండదా' అని అతనిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. స్త్రీ లో ఉండే ధైర్యం, స్థైర్యం ఈ పాటలో అణువణువునా చూపించారు కొసరాజు వారు. అవే లక్షణాలను అద్భుతంగా నటనలో చూపించారు సావిత్రి. అవిటి వాడి రూపంలో నిర్మలమైన మనసుతో, అమాయకమైన పాత్రలో  ఎన్టీ రామారావు గారు ప్రేక్షకులను మురిపించి కంట తడి పెట్టించారు. 

అంతఃసౌందర్యానికి ఈ పాటలోని చరణాలలో ఎంత అందంగా కవి ప్రాధాన్యమిచ్చారో వారి వ్యక్తిత్వానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. స్త్రీపురుషుల మధ్య గల భేదము, వారు ఒకరికొకరు ఏవిధంగా పరిపూర్ణతను కలిగిస్తారో కూడా ఈ గీతంలో మనకు అర్థమవుతుంది. ఆత్మస్థైర్యమున్న పల్లెటూరి పిల్ల-వికలాంగుడైన అమాయకపు పల్లెటూరి అబ్బాయి కలిస్తే, ఆమె ఆత్మసౌందర్యం, విశ్వాసం, పరిపక్వత అతని అవిటితనానికి, అమాయకత్వానికి ఆసరగా నిలిస్తే? అదే ఈ చిత్రం, ఈ గీతం. ఇటువంటి కళాకారులు, రచయితలు, దర్శకులు న భూతో న భవిష్యతి. ఈ భావాన్ని అద్భుతంగా పండించినందుకు కొసరాజు గారికి, ఎన్‌టీఆర్ గారికి, సావిత్రి గారికి శిరసు వంచి నమస్కారములు చేయాలి.

మంచి సామాజిక విలువలతో, ఒక అవిటివాడిని ప్రోత్సహించి, ప్రేమించి అతన్ని ఆత్మవిశ్వాసంతో నింపే ఒక శక్తివంతమైన పేద మహిళగా కథానాయిక, తన మంచి మనస్సుతో కుటుంబాలను కలిపి పేరు తెచ్చుకునే కథానాయకుడు, సున్నితమైన శృంగారము, మంచి సంభాషణలు, సంగీతము, ఆహ్లాదమైన చిత్రీకరణ - ఇదీ 1961 లో విడుదలైన 'కలసి ఉంటే కలదు సుఖం' చిత్రం.

మంచె, చేలు, తాటి చేతులు, గొర్రెలు, మేకలు, కాపరి, బుట్ట తలపై ఉన్న స్త్రీ, అమాయకంగా చిందు వేసే మనిషి, పల్లెటూరి తందానే తానేననే ఆలాపనలు ఈ 'ముద్దబంతి పూలు పెట్టి' పాటకు రంగం.

ఈ పాట మీకోసం. యూట్యూబ్లో పాట చూసి ఆనందించండి.

ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మ మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేది ఏంది కిట్టయ్యా  ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా

1. పుట్టింటి అరణాలూ ఘనమైన కట్నాలూ అత్తవారింటి నిండా వేచినా అవి అభిమానమంతా విలువ జేతునా |ముద్ద|
అభిమానమాభరణం మరియాదే భూషణం గుణము మంచిదైతే చాలయా మన గొప్పతనము చెప్పుకోను వీలయ్యా |అద్దమంటి|

2. కాలు చెయ్యి లోపమనీ కొక్కరాయి రూపమనీ వదినలు నన్ను గేలి చేతురా పిల్లను దెచ్చి పెళ్లి జేతురా
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయ్యనేమి నవ్విన నాప చేనే పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా |అద్దమంటి| |ముద్ద|

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...