తెలంగాణా ప్రజలు తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీల అవకాశవాద రాజకీయాలు, గత ఏడాదిగా నడుస్తున్న మోసాలకు తెరపడే సమయం వచ్చింది. మీకు తెలంగాణా కావాలా?. మీరు తెలంగాణా ఇస్తారా? అన్న ప్రశ్నలకు ధైర్యంగా, నిజాయితీగా సమాధానం చెప్పలేక కుప్పిగంతులు, పిల్లిమొగ్గలు వేసిన ఈ రెండు పార్టీలు తెలంగాణా వాదం ముందు తల వంచక తప్పలేదు. రాజీనామాలు చేసిన 12 మంది తెలంగాణా ప్రాంతపు టీ.ఆర్.ఎస్, బీ.జే.పీ ఎమ్మెల్యేలు తిరిగి భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. 95 వేల వోట్ల మెజారిటీతో హరీష్ రావు గారు సిద్ధిపేట నుంచి గెలిచారు. ఇది వై.ఎస్.ఆర్ పులివెందుల నుంచి గెలిచిన రికార్డును బద్దలు కొట్టి శాసన సభ చరిత్రలో కనీ వినీ ఎరుగని ఆధిక్యత. ఎవరు ఇచ్చారు దీన్ని?. విసిగి, వేసారి, కోపంతో ఉన్న తెలంగాణ ప్రజలు.
- తెచ్చేది, ఇచ్చేది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజంగా తెలంగాణా తెస్తారా?. రోజుకో మాట, నోటికో మాట మాట్లేడే మీ పార్టీ నాయకులు ఇప్పటికైనా ప్రజల నాడి గ్రహించి ముందుకు అడుగు నిజాయితీగా వేస్తారా?.
- తెలంగాణా, ఆంధ్ర రెండు కళ్ళు అన్న బాబు తెలుగు దేశం పార్టీకి చాలా చోట్ల డిపాజిట్ దక్కే అవకాశం కూడా లేదుట. మరి ఏమంటారు బాబు గారు?. మీ రెండు కళ్ళ భావనని మేము కాదనము కానీ, ఈ ఎన్నికలు తెలంగాణా గురించి. దాని గురించి 10 నెలలుగా మీరు మౌనం పాటించారు. ఇకనైనా నోరు తెరిచి, నిజాన్ని తెలుసుకొని మాట్లాడతారా?. మీ పార్టీకి ధరావతు కూడా దక్కట్లేదు అంటే ఏంటి తెలంగాణా లో టీ.డీ.పీ పరిస్థితి?.
- ఇప్పటికైనా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు షెడ్యూలు ప్రకటించి దాన్ని అమలు పరుస్తారా సోనియా, మన్మోహన్?.
జై తెలంగాణా తల్లి |
జై తెలంగాణా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి