3, ఆగస్టు 2010, మంగళవారం

అంబరీషుడు - ద్వాదశీవ్రతం - దుర్వాసుడు

అంబరీషుడు
అంబరీషుడు మహా విష్ణు భక్తుడు. రాజర్షిగా పేరు పొందాడు. ఈతడు అభాగుని కుమారుడు. సద్గుణశ్రేష్ఠుడైన ఈ అంబరీషుడు నిరంతర విష్ణు సేవా తత్పరుడై, అశ్రద్ధ, అలసత్వము లేకుండా ఈ భూమిని పాలించాడు. ఈయన సుగుణాల గురించి, భక్తి మహిమ గురించి శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలో వ్యాస భగవానులు వివరించారు. దాన్ని తేట తేనె తెలుగులో రచించారు బమ్మెర పోతరాజు గారు. ఆ పోతన విరచిత శ్రీమదాంధ్ర భాగవతంలోని అంబరీషోపాఖ్యానం నుంచి ఈ వ్యాసం రాస్తున్నాను.

అంబరీషుని భక్తి

అంబరీషుని భక్తి లక్షణాలను పోతన కమ్మని తెలుగులో ఇలా రచన చేశారు. 

చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద
కరములు విష్ణుమందిర మార్జనములంద శ్రవములు హరికథాశ్రవణమంద
చూపులు గోవిందరూపవీక్షణమంద శిరము కేశవనమస్కృతులయంద
పదములీశ్వరగేహపరిసర్పణములంద కామంబు చక్రికైంకర్యమంద

సంగమచ్యుతజనగుణసంగమంద
ఘ్రాణమసురారి భక్తాంఘ్రికమలమంద
రసన తులసీదళములంద రతులు పుణ్య
సంగతులయంద యా రాజచంద్రమునకు

ఆయన మనసు ఎప్పుడు ఆ శ్రీహరి పాదపద్మములపైనే, వాక్కు ఆ పరమాత్మ నామ సంకీర్తనలో, చేతులు విష్ణు మందిరాన్ని శుభ్రం చేయటంలో, చెవులు ఆ శ్రీహరి కథా శ్రవణంలోనే, చూపులు ఆ గోవిందుని మోహన రూపాన్ని చూడటంపైనే, శిరము కేశవునికి మొక్కటంపైనే, కోరికలు శ్రీహరి సేవకొరకే లగ్నమై ఉంటాయిట. ఆయన చెలిమి విష్ణు భక్తులతోనే, విష్ణు గుణగణాల వర్ణన, చర్చ ఉండే సత్సాంగత్యంలోనే. ఆయన నాలుక తులసీ దళం యొక్క రుచిని ఆస్వాదించటం లోనే, ముక్కులు ఆ మురారి పాదపద్మాల నుండి వెలువడే సుగంధమునందే, ప్రీతి శ్రీహరికి చెందిన పుణ్య విషయముల యందె లగ్నమై ఉన్నాయిట.  అంటే అన్ని ఇంద్రియములు వాటి వాటికి సంబంధించిన రుచులు, పనులు, ఆలోచనలు, మనస్సు పూర్తిగా ఆ శ్రీహరి మీదనే. ఎంత భాగ్యమో అలాంటి జన్మ పొందటానికి.

అంబరీషుని లక్షణాలు:

హరియని సంభావించును
హరియని దర్శించు నంటు నాఘ్రాణించున్
హరియని రుచిగానదలచును
హరిహరి ఘను నంబరీషు నలవియె పొగడెన్

అతని కీహమానె హరులందు గరులందు
ధనములందు  గేళి వనములందు
బుత్రులందు బందుమిత్రులయందు
బురమునందు నంతిపురమునందు

ఆయన 'హరి' అనుకొనుచు ఆలోచిస్తూ, 'హరి' అనుచు చూస్తూ, 'హరి' అనుచు వాసన చూస్తూ, 'హరి' అనుచు చవి చూస్తూ ఉన్నాడుట. అటువంటి ఘనుడైన అంబరీషుని పొగడ వశమా!. ఆయన జీవనంలో ప్రతి అడుగు 'హరి'మయమే అన్నమాట. ఆ మహాత్మునికి ఏనుగులు, గుర్రాలయందు (రాచరికపు హంగులు), ధనసంపదలయందు, ఉద్యానవనాలలో విహారాల యందు, పుత్రులు, బంధువులయందు, రాజధాని, అంతఃపురమందు వాంఛలు తొలగి పోయినవి.

ద్వాదశీ వ్రతము:

ఒక సంవత్సరము ఆ అంబరీషుడు భార్యతో కూడి ద్వాదశీ వ్రతము చేయ దలచాడు. వ్రతము చేసి, వ్రత సమాప్తిలో కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసముండి, కాళింది జలాలలో స్నానం చేసి, మధువనములో మహాభిషేకము చేసి, అందమైన గంధ పుష్పాక్షతలు సమర్పించి, పూజకు పనికి వచ్చే అత్యుత్తమమైన పుష్పాలతో పూజ చేశాడు.  ఈ వ్రత సమాప్తి సందర్భంగా, వేదవేత్తలైన బ్రాహ్మణులకు మంచి రుచి కరమైన భోజనము పెట్టి, అరువది కోట్ల గోవులను దానమిచ్చాడు.  ఎటువంటి గోవులు?. - ఏరులుగా ప్రవహించే అన్ని పాలిచ్చేవి, లేత వయస్సులో ఉన్నవి, సాధుస్వభావము కలవి, కొమ్ములకు, కాలి గిట్టలకు బంగారు, వెండి తొడుగులు కలవి, తమ దూడలను ప్రేమతో నాకుచున్నవి.

దుర్వాసుని ఆగమనం:

దుర్వాస మహాముని

అంబరీషుడు దానాల తర్వాత, తాను పారణ (ఉపవాస విరమణ) చేయబోతుండగా,  తేజోమయుడు, వేదాలను విశ్లేషించ గలిగినవాడు, ఉత్తమ తపశ్శక్తి సంపన్నుడు, ప్రకాశ వంతుడైన దుర్వాస (చాలా మంది దూర్వాసుడు అని పలుకుతారు. అది తప్పు) ముని ఆ అంబరీషుని ఇంటికి వచ్చాడు. అంబరీషుడు ఆ మునికి ఆసనమిచ్చి, పాదములు కడిగి, పూజించి, యోగ క్షేమములు అడిగి, భోజనము చేయుమని నమస్కరించాడు. ఆ ముని సంతోషించి, భోజనానికి అంగీకరించి, స్నానానికి కాళింది జలాలవద్దకు వెళ్ళాడు. అక్కడ ధ్యానం చేస్తూ, మునిగి లేచి రాక ఆలస్యం చేశాడు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నందున, అంబరీషుడు వ్రతభంగామౌతుందేమో అని భయపడి పండితులతో 'ద్వాదశి దాటిపో లోపల పారణ చెయ్యాలి. అతిథికి అపరాథము జరుగకుండా, వ్రతభంగము కాకుండా, ఉపాయమును ఆలోచించి చెప్పండి' అంటాడు.


అప్పుడు, పండితులు - "రాజా! శుద్ధ జలము కొంచెం సేవిస్తే ఉపవాస విరమణ చేసినట్లే. భోజనం చెయ్యకుండా అతిథి గురించి వేచి ఉన్నట్లు అవుతుంది. కాబట్టి నీరు తీసుకోవచ్చు. ఇది ధర్మ సమ్మతమే" అంటారు. అంబరీషుడు వారు చెప్పినట్లే నీరు తీసుకుని, దుర్వాసుని కొరకు ఎదురు చూశాడు.

దుర్వాసుడు వచ్చి అంబరీషుడిని -  'ధర్మభంగం చేసి దుష్కర్ముడవైతివి' అని దూషించాడు. 'నా కోపాగ్ని ప్రతాపం చూపిస్తాను. నిన్ను రక్షించే వాడెవ్వడు' అని రెట్టించాడు. పట పట పళ్లు కొరుకుతూ, కళ్లలో నిప్పులు కురిపిస్తూ, తన జటాలలోంచి ఒక శాఖను పెరికి రాక్షసిగా అంబరీషుడిపై ప్రయోగించాడు. కాలానలంలా, శూలాయుధ హస్తయై ఉన్న రాక్షసి ఆ అంబరీషుని మీదకు దుమికింది.

సుదర్శన ప్రయోగం

అప్పుడు ఆ శ్రీహరి , ఆ వెర్రి తాపసి చేసిన అహంకారపు దుశ్చర్యకు కోపగించి ఆ భక్త అంబరీషుని రక్షించటానికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం ఆ రాక్షసాన్ని దహించి, దాన్ని సృష్టించిన దుర్వాసుని వెంబడించింది.ఎలా?. పోతన గారు ఇలా వర్ణించారు.

శ్రీహరి సుదర్శనాన్ని ప్రయోగించుట

భువి దూరన్ భువి దూరు నబ్ధిజొరనబ్ధింజొచ్చు నుద్వేగియై
దివిబ్రాకన్ దివి బ్రాకు దిక్కులబో దిగ్వీథులం బోవు, జి
క్కివెసంగ్రుంగిన గ్రుంగు, నిల్వ నిలుచున్, గేడింప గేడించు, నొ
క్కవడిన్ దాపసువెంటనంటి హరిచక్రంబన్యదుర్వక్రమై

ఆ సుదర్శనము దుర్వాసుడు ఎక్కడికి పొతే అక్కడికి పోతూ, అతడు భూమిలో దూరితే చక్రమతని వెంబడించి భూమిలో దూరింది. అతడు సముద్రంలో దూరితే, అది కూడా సముద్రంలో చొచ్చింది. భయంతో అతడు ఆకాశానికి పాకితే అక్కడికి ఎగ బాకింది. అతడు ఏ దిక్కులో పోయి తలదాల్చుకున్నా ఆ చక్రం అక్కడికి వెంబడించింది. అతడు ఆగిపోతే చక్రం ఆగిపోయింది. అతడు నెమ్మదిగా నడిస్తే, చక్రం కూడా తన వేగాన్ని తగ్గించి వెంబడించింది. అలా వెంబడించి ఆ ఋషికి దిక్కు తోచకుండా చేసింది.

అప్పుడు దుర్వాసుడు బ్రహ్మదేవున్ని రక్షించమని ప్రార్థిస్తాడు. ఆ బ్రహ్మ ఆ శ్రీహరి చక్రాన్ని ఆపటానికి తాను ఆశక్తుడనని చెప్తాడు. దుర్వాసుడు శ్రీహరి శరణుకై  వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ విష్ణువు లక్ష్మీ దేవి పక్కన ఉండగా మధుర మనోహర భాషణలతో క్రీడించు చుండగా, ఆ దూర్వాసుడు ప్రార్థిస్తూ - "ఓ వరదా!, భక్త రక్షకా! ఈ చక్రాగ్ని జ్వాలలనుంది రక్షింపవా!" అని వాపోతాడు.

పోతన గారు ఆ దుర్వాసుడు నారాయణుని ప్రార్థించిన విధానాన్ని ఇలా వర్ణించారు.

నీ మహిమార్ణవంబుతుది నిక్కముగా నెరుగంగలేక నీ
ప్రేమకు వచ్చు దాసునకు గ్రించుదనంబున నెగ్గుచేసితిన్
నామరపున్ సహింపుమట నారకుడైన మనంబులో భవ
న్నామము చింతచేసిన ననంతసుఖస్థితి జెందకుండునే

"ఓ ప్రభూ! నీ అనంతమైన మహిమాసాగర తీరము తెలుసుకోలేక, నీకు చాలా ప్రేమ పాత్రుడైన నీ దాసునకు, నా నీచ గుణంతో కీడు చేయ తలచాను. నా పొరపాటును మన్నింపుము దేవా! నరకానికి పోవలసిన వాడు కూడా మనస్సులో నీ దివ్యనామము స్మరించగానే అనంతమైన సుఖములు పొందుతాడు కదా!"

అప్పుడు విష్ణువు ఇలా హితవు పలుకుతాడు. పోతన అద్భుతంగా రాసారు ఇక్కడ పద్యాలు.

తనువు మనువు విడిచి తనయుల చుట్టాల
నాలివిడిచి సంపదాలి విడిచి
నన్నెకాని యన్యమెన్నడు నెరుగని
వారి విడువనెత్తివారినైన

సాధులహృదయము నాయది
సాధులహృదయంబు నేను జగముల నెల్లన్
సాధుల నేనే ఎరుగుదు
సాధులెరుంగుదురు నాదుచరితము విప్రా!

నా తేజము సాధులలో
నాతతమైయుందు వారి నలచుజనులకున్
హేతిక్రియ భీతినిచ్చును
చేతోమోదంబు చెరుచు సిద్ధము సుమ్మీ

"ఓ దుర్వాసా! నన్ను స్తుతించువాడు నా భక్తుడగును.  నా భక్తులకు నేనే పరమగతిని. నా భక్తుడు ఎక్కడికి పోయినా, గోవు వెంట పోవు కోడె ఎద్దులా,  నేనతిని వెంటనే పోయెదను. దేహధ్యాస విడిచి, మనుగడను విడిచి, భార్యాపుత్రులను, బంధువర్గమును విడిచి, ధన సంపదలను విడిచి, నన్నే తప్ప వేరేదేది ఎరుగని వారిని, వారెట్టి వారైన సరే, నేను రక్షింప కుండా విడిచి పెట్టాను. సాధువులు తమ హృదయములను నాకు అర్పింతురు. వారి హృదయాలలో ఉండేది నేనే. వారిని నేనే ఎరుగుదును. నా చరిత్ర వారే ఎరుగుదురు. వారిలో నా తేజము విరివిగా ఉందును. వారిని పీడించే వారికి నా తేజం అగ్నిజ్వాలలా భయం కలిగిస్తుంది. అలా పీడించే వారి మనస్సులోని సంతోషాన్ని ఆ తేజస్సు చెడగొడుతుంది సుమా. కావున పోయి ఆ అంబరీషుడినే శరణు వేడు" - అంటాడు.

దుర్వాసుని శరణాగతి, అంబరీషుని దయ:

అప్పుడు, శక్తిహీనుడైన, భయముతో పరిగెత్తి అలసి  సొలసి ఉన్న దుర్వాసుడు వేగంగా పోయి కరుణాస్వరూపుడు, దోషాలు లేని వాడు, ఉదార స్వభావము కలవాడు, బుద్ధిమంతుడు, మృదుమధుర భాషి అయిన అంబరీషుడిని శరణు వేడాడు. అప్పుడు ఆ చక్రవర్తి, దయాళువై, కరుణతో ఆ సుదర్శనాన్ని ఇలా ప్రార్థించాడు.

సుదర్శన చక్రము


నీవె పావకుడవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము
నీవ నేలయునింగి నీవ సమీరంబు నీవ భూతేంద్రియనికరములును
నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవ యజ్ఞంబును నీవ ఫలము
నీవ లోకేశులు నీవ సర్వాత్మవు నీవ కాలంబును నీవ జగము

నీవ బహుయజ్ఞభోజివి నీవ నిత్య
మూల తేజంబు నీకు నే మ్రొక్కువాడ
నీరజాక్షుండు చాలమన్నించు నట్టి
శస్త్రముఖ్యమ! కావవే చాలు మునిని

విహితధర్మమందు విహరింతునేనియు
నిష్టమైన ద్రవ్యమిత్తునేని
ధరణిసురుడు మాకు దైవతంబగునేని
విప్రునకు శుభంబు వెలయుగాక

"శ్రీ మహావిష్ణువు మిక్కిలి మన్నించునట్టి ఓ అస్త్ర రాజమా! నీకు నేను మొక్కెదను . నీవే అగ్నివి, సూర్యుడవు, చంద్రుడవు, నీరు, భూమివి. నీవే ఆకాశము, గాలివి. నీవే భూత, ఇంద్రియ సమూహానివి. నీవే బ్రహ్మము, సత్యము, యజ్ఞము, యజ్ఞఫలము. నీవే లోకాధిపతివి, సర్వాత్మవు, నీవే కాలము, జగత్తువి కూడా. నీవే యజ్ఞఫలాన్ని అందుకునేది, నీవే నిత్యమైన మూల తేజము. నీకు నా నమస్కారములు. ఇక ఈ మునిని కాపాడుము, విడువుము. నేను నా విద్యుక్త ధర్మములను సక్రమంగా నిర్వహించే వాడినైతే, యోగ్యులకు కోరిన, ఇష్టమైన దానాలు ఇచ్చేవాడినైతే, ఈ బ్రాహ్మణునికి శుభము కలుగుగాక!"

ఆ ప్రార్థనను విని సుదర్శన చక్రము శాంతించి, తిరిగి తన యథా స్థానమునకు వెళ్ళెను.

అప్పుడు దుర్వాసుడు శాంతి చెంది, మెల్లని మేలిమి మాటలతో రాజుని దీవించి ఇలా అన్నాడు: "ఓ రాజా! నా తప్పు మన్నించి, నాకు చాలా మేలు చేసితివి. నీ వంటి భక్తులని కాచుటకు శ్రీహరి ఈ విధంగా వచ్చుట ఎంతో ఆశ్చర్యకరం. నేను ధన్యుడనైతిని. నీకు శుభము కలుగుగాక. అలవోకగానైన ఎవ్వని నామము ఒక్కమారు చెవులకు వినపడితే సకల పాపాలు పోతాయో, అత్యంత శుభకరుడు, మంగళకరుని,హరిని, విష్ణువుని, దేవదేవుని - నీవంటి స్వచ్చమైన భక్తులు కొలిచెదరో, వారికి ఎటువంటి అడ్డంకులు కలుగబోవు".

అప్పుడు, ఆ అంబరీషుడు ఆ ముని పాదములకు మొక్కి,  ఆయనకు ప్రీతికరమైన భోజనము పెట్టి తృప్తి పరచెను. దుర్వాసుడు ఆతని ఆతిథ్యానికి మెచ్చి, దీవించి, కీర్తించి బ్రహ్మలోకమునకు తిరిగి వెళ్ళాడు. అంతట, అంబరీషుని ద్వాదశీ వ్రతం సంపూర్ణమైనది. హరిని కొలిచేవారికి వైకుంఠము తప్ప మిగిలిన పదములన్నీ నరకతుల్యములు కావున అంబరీషుడు రాజ్యభారాన్ని పుత్రులకు అప్పగించి, కామ విజయుడై, హరి భక్తుడై అడవులకేగాడు.

'అంబరీషుని చరిత్ర వినిన వారికి, చదివిన వారికి ధైర్యం, సంపదలు కలిగి పుణ్యులు అగుదురు గాక' అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు తెలిపాడు.

4 కామెంట్‌లు:

  1. very very nice ,చాలాచాలా బావుంది.పోతనపద్యాలు అందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. శశికళ ఓలేటి.విశాఖపట్నం.22 అక్టోబర్, 2016 5:56 PMకి

    ఇంత బాగా భాగవత పద్యాలతో సహా అంబరీషుడి చరిత చదువుతుంటే హరిభక్తితో నిండని మనసుండదు.అంత బాగా రాసారు.అరవై కోట్ల ఆవులను పెంచడం,పంచడం సాధ్యమా? చక్కటి భాగవతోత్తముడి చరిత అందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి