RightClickBlocker

30, జులై 2010, శుక్రవారం

భారత రత్న, సంగీత కళానిధి సుబ్బులక్ష్మి

మన వృత్తిలోని విశేషాన్ని మన జీవనంలో అమలు పరచటం చాలా కష్టం. అలాగే మంచి జీవన శైలిని వృత్తిలో అనుకరించటం కూడా కష్టమే. బహు కొద్ది మంది తాము చేసే పనిలోని భావాన్ని తమ జీవితంలోని ప్రతి అడుగులో నిరూపించగలరు. సంగీతం అంటే కేవలం సప్త స్వరాలు, వాటిని అటు ఇటు తిప్పి పాడటం కాదు. ఒక వాగ్గీయకారుడు అనుభూతి పొంది ఆ వాగ్దేవి అనుగ్రహంతో రాసిన సుస్వర రస ప్రవాహాన్ని తన మానసిక, శారీరిక శుద్ధితో, నిర్మలమైన నవ్వుతో ఆ పరమాత్మను తలస్తూ, పొగడుతూ, ఆ అంతర్యామి లక్షణ వర్ణనలో లీనమై, ఒక్కొక్క అక్షరాన్ని మంత్రంలా భావించి తాదాత్మ్యం చెంది, శృతి, లయ బద్ధంగా పాడితే అది శాస్త్రీయ సంగీతం.

అంతర్యామిని దర్శిస్తూ పాడుతున్న సుబ్బులక్ష్మి

అలా పాడాలంటే - ఆలోచన, జీవన శైలి దానికి అనుగుణంగా ఉండాలి. అంటే, నిరాడంబరత, శాంతము, సహనము, ప్రేమ, భక్తి, బాహ్య/అంతః శుద్ధి, శరణాగతి, నిరపేక్షం లాంటి సుగుణాలు చాలా ఉండాలి. వీటికి తోడు గా కఠోర శ్రమతో, సద్గురువు వద్ద నేర్చుకున్న విద్య ఉంటే అది పంచమ శృతిలో ప్రౌఢ కోకిల పాడినట్టుగా శ్రావ్యంగా ఉంటుంది.

ప్రపంచంలో ఉన్న అన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో చూడాలని ఉందా?. అలా ఉంటే మరి వారికి ఆ సరస్వతి ఏమిటి?. ముల్లోకాలు వశమే. తన గానం, జీవనం, భక్తి, చిరునవ్వు, నిరాడంబరత, అందం, నిశ్చలమైన వ్యక్తిత్వము - ఇంక ఎన్నో ఎనో సుగుణాల రాశి ఆవిడ. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (ఎం.ఎస్. సుబ్బులక్ష్మి). ఏమి చెప్పగలం ఆమె గానమాధుర్యం గురించి?. ఆ గానంలో ఉన్న భక్తి, శాస్త్రం గురించి?.

ఎన్ని సంపదలు, విద్యలు ఉన్నా స్వచ్చతను చిందించే సుబ్బులక్ష్మి

తెల్లవారకముందే దక్షిణ భారత దేశంలో లక్షలాది గుళ్లలో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని వినిపిస్తే అది ఆమె గొంతులో వెలువడిందే. 'భజ గోవిందం భజ గోవిందం' అని వినిపించే శ్రావ్యమైన గానం ఆమెదే. 'శుక్లాంబర ధరం విష్ణుం' తో మొదలయ్యి, 'విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః' అన్న వేయి నామాలతో అరగంటపాటు మీకు ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతించే విష్ణు సహస్ర నామం ఆమె పాడిందే.  రేడియోలో, రికార్డుల్లో, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈమె గొంతు దక్షిణాదిన మారుమ్రోగుతూనే ఉంటుంది.

పొద్దునే లేచి ఏ చప్పుడూ లేకుండా, స్నానం చేసి, కుర్చీలో కూర్చొని ఆమె పాడిన 'భావయామి గోపాల బాలం' అన్న యమన్ కళ్యాణి రాగంలో అన్నమాచార్యుల కృతి వింటే భక్తి పారవశ్యం మనలో రాక మానదు. జో అచ్యుతానంద జో జో ముకుంద అని ఆ వెంకటేశ్వరునికి జోల ఆమె అంత లాలిత్యం, ప్రేమతో ఎవ్వరు పాడలేరు, పాడబోరు. 'డోలాయాం చల డోలాయాం' అనే కృతి పాడుతుంటే ఆ తిరుమలేశుడు నిజంగానే ఊయలలో ఊగుతూ మందహాసంతో ఈ సరస్వతిని ఆశేర్వదించిన ఉండవచ్చు. ఎం.ఎస్. 30 ఏళ్ల క్రిందట పాడిన పాట ఇది.  అలాగే, 'ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన'  అనే కీర్తనలోని  ఆధ్యాత్మిక తత్త్వాన్ని అద్భుతంగా వినిపించారు సుబ్బులక్ష్మి. తిరుమల స్వామి వారి ఆస్థాన గాయనిగా ఆవిడ అన్నమాచార్యుని కీర్తనలు చాలా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఒక సంగీతజ్ఞురాలిగా ఆమె అన్ని శిఖరాలను అధిరోహించి అక్కడే నిలిచిపోయింది. ఆవిడను దాటి వెళ్లే వారు ఇంత వరకు పుట్టలేదేమో.

శాస్త్రమంటే సుబ్బులక్ష్మే

సెప్టెంబర్ 16, 1916 న మదురై లో పుట్టింది సుబ్బులక్ష్మి. 13 ఏళ్ల  ప్రాయంలో కచేరీలు మొదలు పెట్టింది సుబ్బులక్ష్మి. అప్పటినుంచి తన భర్త మరణించేంతవరకు ఆరు దశాబ్దాలు భారత శాస్త్రీయ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి సుబ్బులక్ష్మి. నటిగా  హిందీ, తమిళ చితాల్లో తన ప్రతిభను చూపించింది ఆవిడ. మీరాబాయిగా ఆమె నటన, ఆమె పాడిన మీరా భజనలు ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ప్రజల మనస్సుల్లో ఉంది. పాత్రికేయుడైన సదాశివాన్ని పెళ్ళిచేసుకొని నిజమైన ధర్మపత్నిగా జీవించి, సహకరించింది. ఆ దంపతులు చేసిన సమాజ సేవ, దాన ధర్మాలు వారి నిర్మలత్వానికి ప్రతీక.

భారత దేశంలో అత్యున్నత పురస్కారం - భారత రత్న - పొందిన ఏకైక సంగీత కళాకారిణి ఆవిడ.  మెగసెసే, పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత కళానిధి, కలైమామణి, తాన్సేన్ లాంటివి చెప్పక్కర్లేదు. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, లండన్, ఫ్రాన్సు, మాస్కో లలో అంతర్జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు పొందిన కచేరీలు ఎన్నో.

చెదరని అరవ కట్టులో దేవతలను గుర్తు చేసే రంగులో కంచి పట్టు చీర, సిగన తెల్లని మల్లెపూలు, నుదుట పెద్ద తిలకపు బొట్టు, ముక్కున మెరిసే రవ్వల పుడకలు, చెవులకు మెరిసే రవ్వల దిద్దులు,  మెడలో మెరిసే ఒక ఆభరణం, పెదవులపై మందాకినీ జలంలాంటి స్వచ్చమైన చిరునవ్వు, కళ్ళలో ఆ భగవంతుని చూస్తున్న చిదానందం, పారవశ్యం  - చేతిలో తంబురా పట్టి శ్రుతిలోఆవిడ పాడుతుంటే ఆ సరస్వతి మన కళ్ళ ఎదుట ఉన్నదా అనిపిస్తుంది. భారతీయ స్త్రీలో ఉండే అందం, అణకువ, సిగ్గు, భక్తి, మానసిక సౌందర్యం - వీటికి తోడు తమిళ సాంప్రదాయాన్ని పాటించే ఉత్తమ ఇల్లాలి లక్షణాలన్నీ ఉన్న మహా కళాకారిణి సుబ్బులక్ష్మి. ఏ భాషలో పాడినా ఆ భాష యొక్క సహజ లక్షణాలు పోకుండా, స్పష్టమైన ఉచ్చారణతో, భక్తితో అబ్బ ఎంత బాగుంది అని అనిపించేలా పాడారు ఆవిడ.

భక్తిలోతాదాత్మ్యం చెంది శ్రోతలను పారవశ్యంలో ముంచుతున్న సుబ్బులక్ష్మి

అప్పటి భారత ప్రధాని ఈవిడ గురించి మాట్లాడుతూ - "నేను ఈ దేశానికి మాత్రమే ప్రధానిని. సుబ్బులక్ష్మి అనంతమైన సంగీత సామ్రాజ్యానికి మహారాణి' అని అన్నారుట. మహాత్మా గాంధి ఈవిడ పాడే మీరా భజనల కోసం ఆవిడను పిలిపించుకునే వారుట.

డెబ్భై ఎనిమిదేళ్ళ వయసులో కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి సమక్షంలో ఆయన రచించిన 'మైత్రీం భజత' అని, ఆది శంకరులు రచించిన 'నాగేంద్ర హారాయ త్రిలోచనాయ' అని పాడి ఆయన ఆశీస్సులు, మన్ననలు పొందారు ఆవిడ. అంతకన్నా గొప్ప గౌరవం ఒక భారతీయ కళాకారుడి జీవితంలో ఉండదేమో.

ఎన్నో స్తోత్రాలకు ఆవిడ జీవం పోశారు - భజగోవిందం, అన్నపూర్ణాష్టకం,  నామ రామాయణం, హనుమాన్ చాలీసా, గోవిందాష్టకం, గణేశ పంచరత్నం, మీనాక్షీ స్తోత్రం, కనకధారా స్తోత్రం, రామనాధ స్తోత్రం, దుర్గా పంచరత్న స్తోత్రం, కాశీ విశ్వనాథ సుప్రభాతం, కామాక్షీ సుప్రభాతం, లక్ష్మీ అష్టోత్తరం - ఇలా దాదాపు ప్రతి మహిమాన్విత స్తోత్రం ఆమె గళంలో అమృతంగా మరి మనకు జాలువారింది. సామాన్యునికి తన గొంతును స్తోత్రాల రూపంలో అందించి శాశ్వతమైయ్యింది సుబ్బులక్ష్మి.  'అధరం మధురం, వదనం మధురం' అని మధురాష్టకం పాడుతుంటే ఆ శ్రీ కృష్ణుని మనోహరమైన రూపము మన కళ్ళ ఎదుట నిలుస్తుంది. న భూతో న భవిష్యతి అన్నట్టుగా పాడారు ఈ స్తోత్రాలన్నీ ఆవిడ.

నాయనమ్మ, అమ్మమ్మ అంటే ఇలా ఉండాలి అని అనిపించే వ్యక్తిత్వము, రూపము ఆమెది. పోటీ ప్రపంచమైన శాస్త్రీయ సంగీత ప్రపంచంలో శత్రువులు, విమర్శకులు లేకుండా అందరి చేత అమ్మ అని పిలిపించుకున్నారు ఆవిడ. ఆవిడ వినయం, నడవడిక, కవళికలు మనకందరికీ ఆదర్శ ప్రాయం. ఆదర్శ పత్ని గా సదాశివం గారిని కంటికి రెప్పల చూసుకుంటూ, అనుగమిస్తూ ధర్మపత్నిఅనే పదానికి ఉత్తమ ఉదాహరణ ఆవిడ అయ్యారు. సవతి బిడ్డలైనా తన బిడ్డలకన్న మిన్నగా సదాశివం మొదటి భార్య కూతుళ్ళని పెంచింది. ఆయన పెద్ద కూతురు రాధా విశ్వనాథన్ ఆవిడతో కొలిసి కొన్ని వందల కచేరిలలో పాడారు. వారి జీవితంలో వీడలేని బంధమై, ప్రేమ మూర్తిగా, సత్సాంప్రదాయాలకు పుట్టిల్లుగా తన గృహాన్ని పెంపొందించింది. ఆ తల్లి మరణించినప్పుడు ఈ బిడ్డలు పొందిన ఆవేదన వర్ణనాతీతం.

కంచు లాంటి కంఠం, శాస్త్రం పై పూర్తి పట్టు, చెదరని చిరునవ్వు, అనన్యమైన భక్తి ఆమె సంగీత సోపానానికి పునాది రాళ్ళు. వయసుతో భక్తి, శాస్త్రంలో పండి, ఎదిగిన కొద్దీ ఒదిగి, జీవితంలో ప్రతి కోణం లోను తన ఉన్నత విలువల్ని చూపించి, ఆచరించి, వాటి ఫలితాలను పొంది, తాను సంపాయించింది పేదలకు, పరమేశ్వరుడి సేవకు ధారా పోసి, 88 ఏళ్ల పండు వయసులో సుబ్బులక్ష్మి చెన్నైలోని స్వగృహంలో డిసెంబర్ 11, 2004 నాడు కన్ను మూశారు. ఆమె ఎప్పటికీ సంగీత రసజ్ఞుల గుండెల్లో ఉన్నతమైన స్థాయిలో నిలిచి పోతుంది.

1 వ్యాఖ్య:

  1. MS SUBBALAKSHMI ANTE VOKA KALAKARINE KADU MANA DESANIKI CHALA GARVAKARANAM IPPATI MARIGUGJJU RAJAKEEYA NAYAKULNI CHUUSTE EEMAHA TALLI MALLI PUTTI DESANNI AADHYATMIKA SAKTHI TO PUNARJEEVANAM POYALI
    A.RANGA RAO

    ప్రత్యుత్తరంతొలగించు