16, ఆగస్టు 2017, బుధవారం

గోపాలకృష్ణుడు నల్లన - రావు బాలసరస్వతీదేవి గారి లలిత గీతం

గోపాలకృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన
కాళిందిలో నీళ్లు చల్లన పాట పాడవే నా గుండె ఝల్లన

మా చిన్ని కృష్ణయ్య లీలలు మంజుల మధు మురళి ఈలలు
మా కీరసారికల గోలలు మాకు ఆనంద వారాశి ఓలలు

మా ముద్దు కృష్ణుని మాటలు మరువరాని తేనె తేటలు
మా పూర్వ పుణ్యాల మూటలు మమ్ము దరిచేర్చు తిన్నని బాటలు

ఎంత చక్కని లలిత గీతమో కదా! లలిత గీతాలలో కృష్ణభక్తికి, గోపికల మనోభావనలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ గోపస్త్రీల హృదయాలలోని భావఝరులను లలిత గీతాలు చక్కగా ఆవిష్కరిస్తాయి. నల్లనయ్య, గోకులంలోని దధి క్షీర నవనీతాలు, యమునా నది, కాళింది, కృష్ణయ్య వేణు గానం, ముద్దు ముద్దు మాటలు, గోపకులం ఆనందడోలికలు..ఇవి లలిత సంగీతంలో పండినంతగా శాస్త్రీయ సంగీతంలో పండవేమో అని నా అభిప్రాయం. ఇక ఈ గీతానికి వస్తే - 1947లో విడుదలైన రాధిక అనే చిత్రంలో వెంపటి సదాశివబ్రహ్మం గారు రచించగా సంగీతం సాలూరి హనుమంతరావు గారు అందించారు. లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతీదేవి గారు ఆలపించారు. లలితగీతాల కోసమే బాలసరస్వతి గారు జన్మించారా అన్నట్లు ఈ గీతాలు వారి గళంలో జాలువారుతాయి. సదాశివబ్రహ్మం గారు ఎంతో ప్రతిభ ఉన్న రచయిత. వారి చలనచిత్ర గీతాలు అజరామరమైనవి. ఈ గీతంలో రచయిత గోపెమ్మ మనసును అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన ఉపయోగించిన పదాలు తెలుగుదనం ఉట్టిపడుతూ భావాన్ని లలితంగా ప్రవహింపజేశాయి. మంజులు మధు మురళి ఈలలు, కీరసారికల గోలలు, ఆనంద వారాశి ఓలలు, దరిచేరు తిన్నని బాటలు...ఇవన్నీ భావంతో పాటూ తెలుగు భాషా వైభవాన్ని ఇనుమడింపజేశాయి. అంతే చక్కగా హనుమంతరావు గారు సంగీతం అందించారు. బాలసరస్వతి గారి గానం మాధుర్యభరితమైన ప్రవాహమే.

నేటి తరం వారికి ఈ ప్రముఖులు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. వారి కోసం ఈ అలనాటి ప్రజ్ఞాశాలుల విశేషాలు కొన్ని.

1.రావు బాలసరస్వతీదేవి గారు


తెలుగు సినీ పరిశ్రమలోని తొలి తరం గాయనీమణుల్లో బాలసరస్వతి గారు అగ్రగణ్యులు. లలిత గీతాల గానంతో ఆకాశవాణిలో, నేపథ్య గీతాల గానంతో చలనచిత్ర పరిశ్రమలో తొలి గాయనిగా పేరొందారు. 1928లో ఇప్పటి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో జన్మించిన వీరు చిన్నతనంలోనే చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో విడుదలైన సతీ అనసూయ, భక్త ధ్రువ చిత్రాలలో పాడారు. సంగీతం ఆలత్తూరు సుబ్బయ్య గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ప్రముఖ హిందీ గాయకులు సైగల్ గారి ప్రభావం బాలసరస్వతి గారిపై ఉండేది. సైగల్ గారి లలితమైన శైలే బాలసరస్వతి గారి గాత్ర ధర్మమైంది. బాలనటిగానే పేరొందిన వీరు తొలుత తమిళం, తరువాత తెలుగు చలనచిత్రాలలో నటించారు. మొత్తం 15 చిత్రాలకు పైగా నటించారు. నటన తగ్గించి గాయనిగా స్థిరపడ్డారు. 1940 నుండి 67 వరకు గాయనిగా 85కు పైగా చిత్రాలలో పాడారు. వారి సినీ మరియు లలిత గీతాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. హాయమ్మ హాయి, తానే మారెనా, ధరణికు గిరి భారమా, తలుపు తీయునంతలోనే, కనుగొంటి కనుగొంటి వంటి ఎన్నో గీతాలు ప్రజల మనసులను దోచుకున్నాయి. మహామహులైన తెలుగు తమిళ సంగీత దర్శకులకు తమ గానం అందించారు. అందరు మేటి గాయకులతోనూ పాడారు. ఆకాశవాణిలో 65 ఏళ్లు పాడిన ఘనత వీరిది. 90 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ వారి గాత్రంలోని లాలిత్యం ఏ మాత్రమూ తగ్గలేదు. కోలంకి రాజా వారిని వివాహం చేసుకున్న వీరు ఆయన మరణించిన తరువాత ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాజావారి భూముల వివాదంలో కోర్టుల చుట్టూ తిరగలేక బాధ పడ్డారు. ప్రస్తుతం హైదరాబాదులో వారి మనుమడి దగ్గర ఉంటున్నారు.

2. సాలూరి హనుమంతరావు గారు:


సాలూరి సన్యాసిరాజు గారి కుమారుడైన వీరు ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి అన్నగారు. వీరు 1944-78 మధ్య దక్షిణాదిన చలనచిత్రాలకు సంగీతం అందించారు. అందులో ఒకటి రాధిక చిత్రం. 1917లో విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని శివరామపురంలో వీరు జన్మించారు. వీరు ద్వారం వేంకటస్వామి నాయుడు గారి వద్ద శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. కర్ణాటక మరియు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాలలో నైపుణ్యం పొందారు. వీరు మొట్టమొదట 1947లో చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో, అంజలీదేవి నాయికగా విడుదలైన గొల్లభామ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం, చరణదాసి, ఉషా పరిణయం, దక్ష యజ్ఞం, చంద్రహాస, బాంధవ్యాలు, రైతుబిడ్డ, ఆరాధన మొదలైన 75 చిత్రాలకు సంగీతాన్ని అందించి 1980లో మరణించారు.

3. సదాశివబ్రహ్మం గారు:


వెంపటి సదాశివబ్రహ్మం గారు అలనాటి కథలు, పాటలు, సంభాషణల రచయిత. 1905లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన వీరు తొలుత 1941లో విడుదలైన చూడామణి అనే చిత్రానికి సంభాషణలు, పాటలు, కథ అందించారు. తరువాత తెనాలి రామకృష్ణ (1941,56), పల్నాటి యుద్ధం (1947), రాధిక (1947), కీలుగుర్రం, సంసారం, పక్కింటి అమ్మాయి, కన్యాశుల్కం, చరణదాసి, భలే రాముడు, సువర్ణ సుందరి, శారద, అప్పు చేసి పప్పు కూడు, చెంచులక్ష్మి, ఇల్లరికం, లవకుశ, పరమానంద శిష్యుల కథ మొదలైన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సాహిత్యాన్ని అందించారు. భలే రాముడు చిత్రంలోని ఓహో మేఘమాల, అవకుశ చిత్రంలో లేరు కుశలవుల సాటి అన్న పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. లవకుశ మరియు రహస్యం చిత్రాలలోని పద్యాలు చాలమటుకు వీరు రచించినవే. గీత రచయితగా కన్నా, సంభాషణలు, కథా రచయితగా వీరు పేరొందారు. సదాశివబ్రహ్మం గారు 1968లో చెన్నైలో మరణించారు. 

15, ఆగస్టు 2017, మంగళవారం

కంట జూడుమి - త్యాగరాజ స్వామి కృతి


కంట జూడుమి ఒక పరి క్రీగంట జూడుమి! 

బంటుడై వెలయు బాగుగాని తప్పు 
తంటలెల్ల మానుకొన్న నన్ను క్రీగంట జూడుమి! 

అలనాడు సౌమిత్రి పాద సేవ 
చెలరేగి సేయు వేళ సీతతో 
పలికి చూచినంత పులకాంకితుడై 
పరగిన యటు త్యాగరాజుని క్రీగంట జూడుమి!

ఓ రామా! నీ బంటునైన నన్ను ఒకసారి క్రీగంట చూడుము! నా తప్పు పనులన్నీ మానుకొన్నాను. ఆ నాడు నీకు ఎంతో సేవ చేసిన లక్ష్మణుని గురించి సీతతో పొగడగా ఆ సౌమిత్రి ఎంతో సంతోషించాడు. నన్ను కూడా ఆ విధంగా కంట పెట్టుకొని చూడుము.

రామలక్ష్మణుల మధ్య ఉన్న అనుబంధాన్ని త్యాగరాజస్వామి ఎన్నో కృతులలో ప్రస్తావించారు. లక్ష్మణునికి అన్న మాటే వేదం. ఎందుకు? రాముడు అన్న పాత్రలో అలా వ్యవహరించాడు కాబట్టి. నారాయణునికి ఆదిశేషుడు శయ్యగా నిలిచి సౌఖ్యం కలిగించిన రీతి ఆ శేషుని అంశ అయిన లక్ష్మణుడు రామావతారంలో అదే శ్రీహరి రూపమైన రామునికి నిరంతరం సేవ చేసుకున్నాడు. రాముడికి లక్ష్మణుడు బహిర్ప్రాణం ఐతే లక్ష్మణునికి రాముడు తండ్రి తరువాత తండ్రి. సీతారాముల సేవలో తరించిన లక్ష్మణుని నిబద్ధతను చూసి రాముడు ఆ విషయాన్ని సీతతో ప్రస్తావించిన విషయాన్ని త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా మనకు మరల గుర్తు చేసి, లక్ష్మణుని కనిపెట్టుకుని ఉన్న రీతి తనను కూడా గమనించి బ్రోవమని వేడుకున్నాడు. భక్తునికి-భగవంతుని మధ్య సంభాషణలలో ఎన్ని రకాలో కదా? ఆ వైవిధ్యాన్నే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా తెలియజేశాడు. వాచస్పతి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెల్ వసంతకుమారి గారు గానం చేశారు.

శ్రీరామపట్టాభిషేకం - శ్రీమద్రామాయణం యుద్ధకాండ 128వ సర్గ


శ్రీరామనవమి అనంతరం దశమి నాడు శ్రీరామపట్టాభిషేకం చేయటం భద్రాద్రిలో ఆనవాయితీ. శ్రీరామ పట్టాభిషేకానికై జరిగిన సన్నాహాలు, పట్టాభిషేక మహోత్సవాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం యుద్ధకాండ 128వ సర్గలో వర్ణించారు.

రామన్న తన తల్లి కైకకు తండ్రి దశరథుడిచ్చిన మాట ప్రకారం వనవాసానికి వెళ్లి, ఆ సమయంలో రావణునిచే అపహరించబడిన సీతను కాపాడటానికి అధర్మానికి ఒడిగట్టిన రావణుని సంహరించి ధర్మ స్థాపన చేస్తాడు. వనవాస సమయంలో భరతుని పాలన చేయమనగా, ఆతడు అన్న పాదుకలనుంచి 14 ఏళ్లు ఆయన దాసునిగా రాజ ధర్మాన్ని నిర్వర్తించాడు. యుద్ధం తరువాత రాముడు అయోధ్యకు తిరిగి రాగా, రామన్నను రాజ్యాన్ని స్వీకరించవలసిందిగా భరతుడు కోరాడు. రాముడు తిరిగి రాజ్యాన్ని చేపట్టడానికి అంగీకరించాడు.

వనవాసం వలన పెరిగిన జటాఝూటములమును ముడివిప్పి మంగళ స్నానం చేశాడు. అనేక రకాల సుగంధ లేపనాలను ఆయనకు అలదగా ఆయన అద్భుతంగా ప్రకాశించాడు. శతృఘ్నుడు రామలక్ష్మణులను అలంకరించారు. దశరథుని పత్నులు సీతమ్మను అలంకరించారు. కౌసల్య వానర పత్నులను అలంకరించింది. సుమంత్రుడు రథాన్ని తీసుకురాగా రాముడు దానిని అధిరోహించాడు. సుగ్రీవుడు, హనుమంతుడు కూడా మంగళ స్నానములు చేసి తమను తాము అలంకరించుకున్నారు.

భరతుడు పగ్గాలు చేపట్టగా, లక్ష్మణుడు వింజామర వీచగా, శతృఘ్నుడు ఛత్రము పట్టగా రాముడు అయోధ్య వీధులలో రధముపై విహరించాడు. సుగ్రీవుడు శత్రుంజయమను ఏనుగునెక్కాడు. వానరులందరూ మానుష రూపము ధరించారు. ప్రజలందరూ రామునికి జయ జయ ధ్వానాలు పలికారు. సంగీత వాద్యములతో నృత్యములతో ఆ రాముడు అయోధ్యాపురాన్ని కలయబెట్టాడు. తన మంత్రులతో సుగ్రీవ విభీషణాదులతో తన మైత్రిని గురించి ప్రస్తావించాడు. రాముని పలుకులతో హర్షించిన ప్రజలు తమ ఇళ్లపై పతాకాలను ఎగురవేశారు.

రాముడు రాజప్రాసాదాన్ని చేరుకొని తొలుత ముగ్గురు మాతలకు నమస్కరించాడు. సుగ్రీవాదులకు ఉచితమైన వసతులు చూడమని భరతునితో చెప్పాడు. భరతుడు సుగ్రీవుని రామ పట్టాభిషేకానికై ఏర్పాట్లను ఆరంభించవలసిందిగా కోరాడు. తదనుగుణంగా సుగ్రీవుడు జాంబవంతుని, హనుమంతుని, వేగదర్శిని, ఋషభుని నాలుగు సాగరములనుండి పవిత్ర జలాలను తీసుకు రావలసిందిగా ఆదేశించాడు. వానరులు వారి ఆదేశాల మేరకు 500 నదుల నీరు తీసుకు వచ్చారు. శతృఘ్నుడు రాజ గురువైన వశిష్ఠుల వారితో ఆ జలాల గురించి తెలిపాడు.

వశిష్ఠుడు నవరత్న ఖచితమైన సింహాసనం మీద సీతారాములను ఆసీనులు కావలసిందిగా కోరాడు. వశిష్ఠ, జాబాలి, వామదేవ,కాశ్యప,కాత్యాయన, సుయజ్ఞ, గౌతమ, విజయ మహర్షులు రాముని పవిత్రమైన సుగంధ జలాలతో అభిషిక్తుని చేశారు. మనువును అలంకరించిన నవరత్న ఖచితమైన కిరీటముతో రాముని అలంకరించి రాముని ఆశీర్వదించారు.  శతృఘ్నుడు తెల్లని ఛత్రము పట్టుకోగా, విభీషణుడు, సుగ్రీవుడు వింజామర వీచారు. వాయుదేవుడు ఇంద్రుని బహుమతిగా వంద కలువలున్న స్వర్ణమాలను బహుకరించాడు. వాయుదేవుడు ముత్యాల మరియు ఇతర రత్నాల హారాలను రామునికి సమర్పించాడు. అప్సరసలు నృత్యం చేశారు. ప్రకృతి పుష్పములతో, ఫలములతో పులకరించింది.

రాముడు తొలుత బ్రహ్మణులను, తరువాత సుగ్రీవ అంగదాదులకు కానుకలు అందజేశాడు. సీతమ్మకు ముత్యాల హారాన్ని బహుకరించాడు. రాముడు సీతతో ఆ హారాన్ని సభలో అత్యంత పరక్రమవంతుడు, బుద్ధిమంతుడు, వినయసంపన్నుడు మరియు సమస్త శుభగుణములు కల్వానికి బహుకరించమనగా సీతమ్మ ఆ హారాన్ని హనుమకు ఇచ్చింది. రాముడు మిగిలిన వానరులకు కూడా కానుకలిచ్చాడు. తరువాత సుగ్రీవాదులు కిష్కింధకు, విభీషణుడు లంకకు తిరిగి వెళ్లారు.

ఎన్నగ మనసుకు రాని - త్యాగరాజ స్వామి కృతి


ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి సొగసు
పన్నుగ గనుగొనని కన్ను లేలే? కంటి మిన్ను లేలే?

మోహముతో నీలవారివాహ కాంతిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహమేలే? ఈ గేహ మేలే?

సరసిజ మల్లె తులసి విరజాజి పారిజాత
విరులచే పూజించని కరము లేలే? ఈ కాపురము లేలే?

మాలిమితో త్యాగరాజునేలిన త్యాగరాజ మూర్తిని
లాలించి పొగడని నాలికేలే? సూత్ర మాలికేలే? 

మనసు ఎంచలేని శేషసాయి సొగసును కనుగొనలేని కన్నులెందుకు? కంటిరెప్పలెందుకు? తన్మయత్వంతో నీలమేఘ కాంతిని కలిగిన శ్రీహరి రూపమును తన యందు స్థిరము చేసుకోలేని ఈ దేహమెందుకు? ఈ గృహమెందుకు? కలువలు, మల్లెలు, తులసి, పారిజాత పుష్పములచే ఆ రాముని పూజించలేని చేతులెందుకు? గృహస్థాశ్రమమెందుకు? మక్కువతో త్యాగరాజును ఏలిన ఆ స్వామిని లాలించి పొగడని నాలుకెందుకు? హారములెందుకు?

- సద్గురు త్యాగరాజ స్వామి

త్యాగరాజస్వామి వారు ఈ కృతి నీలాంబరి రాగంలో స్వరపరచారు. నీలాంబరి జోలపాడి విశ్రాంతిని కలిగించి నిదురలోకి తీసుకు వెళ్లే అద్భుతమైన రాగం. ధీర శంకరాభరణ జన్యమైన ఈ రాగం పవిత్రతను, భక్తిని, తల్లి లాలనను చక్కగా పండిస్తుంది. త్యాగరాజస్వామి ఎన్నగా మనసుకు రాని, ఉయ్యాలలూగవయ్యా, లాలియూగవే, దీక్షితుల వారి అంబా నీలాయతాక్షి, శ్యామశాస్త్రి గారి బ్రోవవమ్మ, పొన్నయ్య పిళ్లై గారి అంబా నీలాంబరి, నారాయణ తీర్థుల వారి మాధవ మామవ దేవా, ఊతుక్కాడు వేంకటసుబ్బయ్య గారి మణినూపురధారి ఈ రాగంలోనే స్వరపరచబడ్డాయి. ప్రతి ఒక్కటి కూడా ముందు చెప్పిన లక్షణాలను చక్కగా ఆవిష్కరించాయి. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు ఈ కృతిని మనోజ్ఞంగా ఆలపించారు. 1946లో విడుదలైన త్యాగయ్య చిత్రంలో చిత్తూరు నాగయ్య గారు, గుబ్బి జయమ్మ గారు కూడా ఎంతో భావగర్భితంగా ఆలపించారు

నానాటి బతుకు నాటకము - తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన


నానాటి బతుకు నాటకము 
కానక కన్నది కైవల్యము 

పుట్టుటయు నిజము పోవుటయు నిజము 
నట్టనడిమి కాలము నాటకము 
యెట్టనెదుట గలదీ ప్రపంచము
కట్టకడపటిది కైవల్యము 

కుడిచేదన్నము కోక చుట్టేది
నడిమంత్రపు పని నాటకము 
వొడిగట్టు కొనినవుభయ కర్మములు 
గడి దాటినపుడె కైవల్యము 

తెగదు పాపము తీరదు పుణ్యము 
నగి నగి కాలము నాటకము 
ఎగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక 
గగనము మీదిది కైవల్యము

-తాళ్లపాక అన్నమాచార్యులవారు


ఇల్లు-వాకిలి-తల్లిదండ్రులు-పిల్లలు-పనివాళ్లు-కళకళలాడే ఇల్లు-తల్లిదండ్రులు కాలం చెందటం-పిల్లలు పెళ్లిళ్లై బయటకు వెళ్లిపోవటం-భార్య-భర్త/పనిమనిషి-> దంపతుల్లో ఎవరో ఒకరు ముందు పోవటం-> ఒంటరి పక్షి/పనిమనిషి->గూడు చినబోయెరా!ఒక జీవితకాలం చూస్తే ముందు ఏమీ లేదు, వెనుక ఏమీ లేదు. ఓ నాటకంలో పాత్రలు పోషించటం, దేహం శిథిలమైనప్పుడు ఆత్మ కొత్త గూడు వెతుక్కోవటం...నట్టనడుమ ఎందుకీ అహంకారం? అంతా మన చేతుల్లోనే ఉన్నట్లు, మనుషులపై ఆధిపత్యపు పోరు, మౌనయుద్ధాలు..ఉన్నన్నాళ్లూ హాయిగా మనసు తేలికగా ఉంచుకొని సమయం రాగానే కొత్తగూటికి స్వేచ్ఛగా ఎందుకు ఎగిరిపోలేకున్నాము?

మనం మోసుకొచ్చిన బరువులు కొన్నైతే, కొత్తగా వేసుకున్న బరువులు మరిన్ని - సంస్కారాలు, కర్మఫలాలు (సంచిత, ప్రారబ్ధ, ఆగామి)...అన్నీ కలిసి ఆ పక్షిని  ఈ భూమ్మీదే మోక్షం పొందని ఆత్మగా తిప్పి తిప్పి జననమరణమనే చక్రబంధంలో కట్టిపడేస్తున్నాయి. కొన్ని కర్మ ఫలాలు బ్రహ్మజ్ఞానంతో పటాపంచలైతే మరి కొన్ని అనుభవించవలసినదే. కాకపోతే ఆ అనుభవంలో దేహాత్మ స్ఫురణ కలిగిన వానికి తామరాకు మీద నీటిబొట్టులా ఆ కర్మఫలాల వల్ల కలిగే బాధ తగ్గుతుంది. దీనికి సద్గురువే శరణ్యం. కర్మఫలాలు ఎలా ఉన్నా, జీవితమనే నాటకంలో సంసారబంధాలు,అనుబంధాల వలన కలిగే దుఃఖానికి భక్తి జ్ఞాన వైరాగ్యాములలో ఏదైనా మందే. భక్తితో భారం భగవంతునిపై వేస్తే, జ్ఞానంతో అజ్ఞానం తొలగి స్థితప్రజ్ఞత కలుగుతుంది. ఎవరో కొందరు కారణ జన్ములకు తప్ప ఎక్కువ శాతం మనుషులకు వైరాగ్యము అన్ని అవస్థలు దాటిన తరువాతే పరిపక్వమవుతుంది..ఈ కర్మలు, తద్వారా పాపపుణ్యముల లెక్క ఎప్పటికీ తెగనిదే. ఆ రెండిటి లెక్కలు దాటగలిగితేనే మోక్షము. అందుకు ఉన్నది ఒక్కటే దిక్కు  పరమాత్ముడైన శ్రీవేంకటేశ్వరుడు.

ఈ అన్నమయ్య కృతిని సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు రేవతి రాగంలో స్వరపరచగా భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు తితిదే వారి ఆల్బంలో పాడి దానిని శాశ్వతం చేశారు. ఈ సంకీర్తనలోని సందేశం అర్థం చేసుకుంటే జీవితంలో దుఃఖము దూరమవుతుంది. శాశ్వతానందము కలుగుతుంది.


కడలి దరి దాక నడచెదము గాక - దేశభక్తి గీతం


కడలి దరి దాక నడచెదము గాక
చదలురుగు దాక కదలెదము గాక
ఆ కడలి ఆ చదలు ఏకమగు గాక
చేయి చేయి హాయినిడి చేరి విడిపోక

చీకటుల్ చెదరగా శృంఖలాల్ బెదర
తోడుగా నీడగా మా గాంధి నడువగా
అడుగిడిన జగమదర మా గాంధి నడువగా

మన ప్రభుత మన ఘనత కొని తెచ్చు వరకు
మన గాంధి మన తండ్రి మది నిలుపుకొనుచు
కనులలో ఒక జ్యోతి గళములో ఒక గీతి
మా మనసులో మెరయు ఒక ప్రేమహేతి

బరువులకు బాధలకు శిరసొరగనీక
బ్రతుకు చావుల మాట మది చొరగనీక
ఈ ఆశ ఈ రీతి కొనసాగు వరకు
చేయి చేయి హాయినిడి చేరి విడిపోక

అటు స్నేహమిటు స్నేహమొలికుంచుకొనుచు
అటు దివ్వె అటు దివ్వె వెలిగించుకొనుచు
అవని అంతా ప్రేమ గృహమైన వరకు
ఆ అంచు ఈ అంచు కలిపేయువరకు


(గాంధీ మహాత్ముని దండి సత్యాగ్రహం యాత్ర సందర్భంగా రచించినబడిన గీతం, పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో ఆకాశవాణి ద్వారా వెలువడిన దేశభక్తి గీతం)

14, ఆగస్టు 2017, సోమవారం

నాదయోగి నేదునూరి కృష్ణమూర్తి

(నేదునూరి  వారి  వెబ్  సైట్ మరియు ఇతర మూలాల ఆధారంగా)

శాస్త్రీయ సంగీతం మూర్తీభవిస్తే అది నేదునూరి కృష్ణమూర్తి గారవుతుందా అన్నట్లు ఆయన వ్యక్తిత్వం ప్రకాశించింది. దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘమైన కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రస్థానం నేదునూరి వారిది. తన వ్యక్తిత్వాన్ని మాటల ద్వారా కాకుండా సంగీతం ద్వారా తెలియజేసిన మహా సంగీత గురువులు నేదునూరి కృష్ణమూర్తి గారు. వారి జీవిత విశేషాలు ఈ వ్యాసంలో.

1927వ సంవత్సరం అక్టోబరు 10న రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు పిఠాపురం సమీపంలోని కొత్తపల్లి గ్రామంలో కృష్ణమూర్తి గారు జన్మించారు. రామమూర్తి పంతులు గారు పిఠాపురం మహారాజావారి కొలువులో పని చేసే వారు. తల్లి విజయలక్ష్మి గారు అష్టపదులు, తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు పాడుతూ ఉంటే విని బాలుడైన కృష్ణమూర్తిలో సంగీతం పట్ల అభిలాష పెరిగింది. వయోలిన్ విద్వాంసులు వేమన దొర గారు, అప్పారావు గారు, కల్లూరి వేణుగోపాలరావు గారు వీరి చిన్ననాటి గురువులు.  విజయనగరం రిటైర్డు తహిసిల్దార్ గారు అయిన అప్పలనరసింహం గారు తరచూ కల్లూరి వారింటికి వచ్చే వారు. వారి సహాయంతో కృష్ణమూర్తి గారు 1940వ సంవత్సరంలో విజయనగరంలోని మహారాజ కళాశాలలో సంగీతాభ్యాసం ఆరంభించారు. తొలుత ద్వారం నరసింగరావు నాయుడు గారి వద్ద వయోలిన్ మరియు గాత్ర సంగీత శిక్షణను పొందారు. ద్వారం వేంకటస్వామి నాయుడు గారు మరియు నరసింగరావు నాయుడు గార్ల సలహాతో గాత్రసంగీతం మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారు. నరసింగరావు నాయుడు గారి సలహతో లయజ్ఞానం కోసం మృదంగం విద్వాంసులు కోలంక వేంకటరాజు గారి వద్ద శిక్షణను పొందారు. 1945లో కచేరీలు ఇవ్వటం ప్రారంభించారు. తొలి కచేరీ జన్మస్థలమైన కొత్తపల్లిలోనే.

కాకినాడలోని సరస్వతీ గానసభలో ఒకసారి ప్రఖ్యాత వేణువాద్య కళాకారులు టీఆర్ మహాలింగం గారు కచేరీ చేయవలసి ఉండగా ఆయన అనుకోని కారణాల వల్ల సమయానికి రాలేకపోయారు. వారు వచ్చేంత వరకూ  నేదునూరి వారు ఆ సభలో కచేరీ చేశారు. కొద్దికాలంలోనే మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. సరస్వతీ గాన సభ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన పోటీలలో ప్రథమ బహుమతి కూడా కృష్ణమూర్తి గారు గెలుచుకున్నారు. తరువాత కొన్నాళ్లు రేడియోలో కచేరీలు విని నేర్చుకున్నారు. ప్రముఖుల కచేరీలకు వెళ్లి స్వరాలు రాసుకొని సాధన చేసి తన విద్యను పదునుపెట్టుకున్నారు. ఈ విధంగా స్వయంకృషితో ఆయన సాధన చేశారు. గురువులైన నరసింగరావు నాయుడు గారు, వేంకటరాజు గారు శిష్యునికి ప్రక్క వాయిద్య కాళాకారులుగా పని చేయటం తనకు వారి ఆశీర్వాదంగా భావించారు కృష్ణమూర్తి గారు. తన గాత్రశైలిని అప్పటికే పేరుపొందిన మహామహోపాధ్యాయులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి శిష్యుల శైలితో పోల్చి చూసుకొని పినాకపాణి గారి శైలి చాలా బాగుందని గ్రహించారు. ఆయన వద్ద శిష్యరికం చేయాలని నిర్ణయించుకున్నారు.  1949వ సంవత్సరంలో పినాకపాణి గారి అనుమతితో వారి వద్ద శిష్యరికం మొదలు పెట్టారు. పినాకపాణి గారిది అద్భుతమైన గమక సంపద మరియు సంగతులు కలిగిన శైలి. వారి శిక్షణలో కృష్ణమూర్తిగారు పూర్తి కళాకారునిగా ఎదిగారు. తనదైన బాణీని ఏర్పరచుకున్నారు. పినాకపాణి శిష్యులలో ప్రముఖ త్రయం వోలేటి వేంకటేశ్వర్లు గారు, నూకల చినసత్యనారాయణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు. కానీ, ఈ ముగ్గురి గాత్రం ధర్మము మరియు శైలి చాలా భిన్నమైనవి. జీఎన్ బాలసుబ్రహ్మణ్యం, అరైకూడి, శెమ్మంగూడి మొదలైన తమిళ సంగీత మహామహుల ప్రభావం నేదునూరిపై చాలా ఉండేది. పినాకపాణి గారికి అరైకూడి వారంటే ఎంతో గౌరవం. అందుకే ఆయన కృష్ణమూర్తి గారికి ఆ శైలిలోనే నేర్పించారు. గురువు గారికి తనమీద ఎంతో అభిమానమని, తన గాత్రధర్మానికి తగినట్లుగా శిక్షణనిచ్చారని, ఆ శిక్షణే తన సంగీతం శ్రేష్టం కావటానికి కారణమని కృతజ్ఞతా భావంతో కృష్ణమూర్తి గారు తెలిపారు. పినాకపాణి గారి వద్ద కృష్ణమూర్తి గారు ఎన్నో అరుదైన కృతులను, రాగాలను నేర్చుకున్నారు. కృష్ణమూర్తి గారు పినాకపాణి గారిని సద్గురువులుగా, గొప్ప మనిషిగా, అపారమైన వాత్సల్యమున్న పెద్దగా, మేధావిగా అత్యంత గౌరవ భావం కలిగి ఉండేవారు. కర్నూలు మెడికల్ కాలేజీలో పని చేస్తున్న పినాకపాణి గారి వద్ద తన అభ్యాసాన్ని మరపురాని జ్ఞాపకంగా ఆయన గుర్తు చేసుకునే వారు. తనను పినాకపాణి గారు స్నేహితునిగా, సోదరునిలా చూసుకునే వారని కృష్ణమూర్తిగారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీరిద్దరూ ఒక్కొక్కసారి అర్థరాత్రి వరకు సాధన చేసే వారట.

నేదునూరి గారి విద్వత్తు అనతికాలంలోనే వారిని చెన్నై తీసుకు వెళ్లింది. 1951వ సంవత్సరంలో మద్రాసు సంగీత అకాడెమీ అధ్యక్షులైన చెంబై వైద్యనాథ భాగవతార్ గారు నేదునూరి వారిని అక్కడ పాడవల్సిందిగా కోరారు. ఆ సభకు హాజరైన చెంబై, జీఎన్‌బీ నేదునూరి వారి విద్వత్తుకు ముగ్ధులైనారు. తరువాత పాల్ఘాట్ మణి, పళని సుబ్రహ్మణ్య పిళ్ళై వంటి కళాకారులు కృష్ణమూర్తి గారితో కచేరీలలో పాల్గొన్నారు. తరువాత నేదునూరి వారి ఖ్యాతి దేశ విదేశాల్లో వ్యాపించింది. ఆయన అనేక దేశాలలో కచేరీలు చేశారు. మద్రాసు సంగీత సభలలో పేరు పొందారు. తమిళ కళాకారులు మరియు ఆ రాష్ట్రంలోని శాస్త్రీయ సంగీతాభిమానుల మన్ననలు పొందిన అరుదైన తెలుగు గాయకుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందారు. నేదునూరి కృష్ణమూర్తి గారు అనేక సంగీత కళాశాలలో అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా పని చేశారు. తొలుత 1963లో విజయవాడలో, తరువాత హైదరాబాదులో, తరువాత విజయనగరంలో, చివరగా మళ్లీ విజయవాడలో పని చేసి 1985లో పదవీ విరమణ చేశారు. రెండు దశాబ్దాల సమయంలో ఆయన ఓ నాలుగేళ్లు డెప్యుటేషన్ మీద తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత కళాశలలో పని చేశారు. అక్కడ ఉన్నప్పుడే తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టు కింద 60కి పైగా అన్నమాచార్య కృతులను స్వరపరచారు. ఆయన స్వరపరచిన కొన్ని అన్నమయ్య కీర్తనలు - ఏమొకో చిగురుటధరమున (తిలంగ్), ఒకపరికొకపరి వయ్యారమై (ఖరహరప్రియ), భావములోన (శుద్ధ ధన్యాసి), చేరి యశోదకు (మోహన), నానాటి బతుకు నాటకము (రేవతి), ముద్దుగారే యశోద (కురంజి) మొదలైనవి. భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు నేదునూరి వారి వద్ద ఈ కృతులను నేర్చుకుని, వాటిని పాడి ఆయన బాణీలను శాశ్వతం చేశారు. నేదునూరి వారు ఎన్నో రామదాసు కీర్తనలను కూడా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. పండు వయసులో 108వ అన్నమాచార్య కీర్తనను స్వరపరచి తన సంగీత విద్వత్తును ప్రపంచమంతా చాటారు. ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమాలకు నేదునూరి వారు ఎంతో సేవను అందించారు. భద్రాచల రామదాసు కీర్తన్లను, తరంగాలను ప్రచారం చేశారు. ఎందరో కళాకారులకు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా పేరు వచ్చేందుకు తోడ్పడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో విసిటింగ్ ప్రొఫెసర్‌గా అయిదేళ్లు పని చేశరు. కర్ణాటక సంగీతంలో శాస్త్రీయతను కాపడేందుకు ఆయన నాద సుధా తరంగిణి అని ఒక ట్రస్టును స్థాపించారు. అన్నమయ్య పదసౌరభాలు అనే 108 కీర్తనల సాహిత్యం, భావం, స్వరాలు కలిగిన మూడు భాగాల పుస్తక సంపుటిని ఈ సంస్థ ద్వారా ప్రచురించారు. శ్రీవేంకటేశ్వర మరియు నాగార్జున విశ్వవిద్యాలయాలలో లలితకళల విభాగానికి అధిపతిగా సేవలను అందించారు.

నేదునూరి వారి సంగీత ప్రస్థానంలో ఎన్నో బిరుదులు, ఎన్నో గౌరవాలు. 1976లో చెన్నై కృష్ణ గాన సభ వారి సంగీత చూడామణి, 1980లో విశాఖ సంగీత అకాడెమీ వారి సంగీత కళాసాగర, 1981లో నాద సుధానిధి, 1982లో గాన కళానిధి మరియు గాయక చూడామణి, 1986లో కేంద్ర సంగీత నాటక అకాడెమీ వారి ఉత్తమ శాస్త్రీయ సంగీత విద్వాంసుని అవార్డు,  1989లో సంగీత విద్వన్మణి, సంగీత విద్యాభాస్కర, నాదయోగి, 1991లో శ్రీకళాపూర్ణ, కంచి కామకోటి పీఠం వారి ఆస్థాన విద్వాన్, 1992లో ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి, 2002లో రాజాలక్ష్మి అవార్డు, 2010లో తితిదే మరియు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానాల ఆస్థాన విద్వాన్, మొదలైనవి కొన్ని. రాజకీయ ప్రేరితమైన పద్మ అవార్డులు ఇటువంటి మహానుభావునికి ఒక్కటి కూడా రాకపొవటం ఆ అవార్డులకే అవమానం. అయితేనేమి, నేదునూరి నాదయోగిగా ఈ దేశానికి చేసిన సేవలు ఎనలేనివి. వారి శిష్యపరంపర గంగాప్రవాహంలో ప్రతిభతో, శాస్త్రీయతతో కొనసాగుతూనే ఉంది. కళాప్రపూర్ణ దోమాడ చిట్టబ్బాయి గారు, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు, మల్లాది సోదరులు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, సరస్వతీ విద్యార్థి గారు, డాక్టర్ శేషులత గారు నేదునూరి వారి శిష్య ప్రముఖులలో కొందరు. శాస్త్రీయత, శృతి శుద్ధతకు, గమకాలకు, స్వర ప్రస్తారాలకు నేదునూరు వారు పెట్టింది పేరు. అంచున్న తెల్లని పంచె, లాల్చీ, కండువా, నుదుటన విభూతి రేఖలు, ముఖంలో గాంభీర్యము, పవిత్రమైన జీవనంతో నాదసాధన చేసిన ఈ సంగీతయోగి 2014 డిసెంబర్ 8న ఆ నాదబ్రహ్మలో ఐక్యమైనారు. పరిపూర్ణమైన సంగీత జీవనంతో వారి ఆత్మ ఆ శంకరుని పాదాల వద్దకు చేరి దేవలోకాలను ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. నేదునూరి కృష్ణమూర్తి గారి సాధనకు, సంగీత ప్రజ్ఞకు, వారి వ్యక్తిత్వానికి శతసహస్ర వందనాలు.

నేదునూరి వారు స్వరపరచి, గానం చేసిన పలుకుతేనెల తల్లి పవళించెను అనే అన్నమాచార్యుల వారి కృతి విని ఆనందించండి. 

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...