15, ఆగస్టు 2017, మంగళవారం

కంట జూడుమి - త్యాగరాజ స్వామి కృతి


కంట జూడుమి ఒక పరి క్రీగంట జూడుమి! 

బంటుడై వెలయు బాగుగాని తప్పు 
తంటలెల్ల మానుకొన్న నన్ను క్రీగంట జూడుమి! 

అలనాడు సౌమిత్రి పాద సేవ 
చెలరేగి సేయు వేళ సీతతో 
పలికి చూచినంత పులకాంకితుడై 
పరగిన యటు త్యాగరాజుని క్రీగంట జూడుమి!

ఓ రామా! నీ బంటునైన నన్ను ఒకసారి క్రీగంట చూడుము! నా తప్పు పనులన్నీ మానుకొన్నాను. ఆ నాడు నీకు ఎంతో సేవ చేసిన లక్ష్మణుని గురించి సీతతో పొగడగా ఆ సౌమిత్రి ఎంతో సంతోషించాడు. నన్ను కూడా ఆ విధంగా కంట పెట్టుకొని చూడుము.

రామలక్ష్మణుల మధ్య ఉన్న అనుబంధాన్ని త్యాగరాజస్వామి ఎన్నో కృతులలో ప్రస్తావించారు. లక్ష్మణునికి అన్న మాటే వేదం. ఎందుకు? రాముడు అన్న పాత్రలో అలా వ్యవహరించాడు కాబట్టి. నారాయణునికి ఆదిశేషుడు శయ్యగా నిలిచి సౌఖ్యం కలిగించిన రీతి ఆ శేషుని అంశ అయిన లక్ష్మణుడు రామావతారంలో అదే శ్రీహరి రూపమైన రామునికి నిరంతరం సేవ చేసుకున్నాడు. రాముడికి లక్ష్మణుడు బహిర్ప్రాణం ఐతే లక్ష్మణునికి రాముడు తండ్రి తరువాత తండ్రి. సీతారాముల సేవలో తరించిన లక్ష్మణుని నిబద్ధతను చూసి రాముడు ఆ విషయాన్ని సీతతో ప్రస్తావించిన విషయాన్ని త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా మనకు మరల గుర్తు చేసి, లక్ష్మణుని కనిపెట్టుకుని ఉన్న రీతి తనను కూడా గమనించి బ్రోవమని వేడుకున్నాడు. భక్తునికి-భగవంతుని మధ్య సంభాషణలలో ఎన్ని రకాలో కదా? ఆ వైవిధ్యాన్నే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా తెలియజేశాడు. వాచస్పతి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెల్ వసంతకుమారి గారు గానం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి