శ్రీరామనవమి అనంతరం దశమి నాడు శ్రీరామపట్టాభిషేకం చేయటం భద్రాద్రిలో ఆనవాయితీ. శ్రీరామ పట్టాభిషేకానికై జరిగిన సన్నాహాలు, పట్టాభిషేక మహోత్సవాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం యుద్ధకాండ 128వ సర్గలో వర్ణించారు.
రామన్న తన తల్లి కైకకు తండ్రి దశరథుడిచ్చిన మాట ప్రకారం వనవాసానికి వెళ్లి, ఆ సమయంలో రావణునిచే అపహరించబడిన సీతను కాపాడటానికి అధర్మానికి ఒడిగట్టిన రావణుని సంహరించి ధర్మ స్థాపన చేస్తాడు. వనవాస సమయంలో భరతుని పాలన చేయమనగా, ఆతడు అన్న పాదుకలనుంచి 14 ఏళ్లు ఆయన దాసునిగా రాజ ధర్మాన్ని నిర్వర్తించాడు. యుద్ధం తరువాత రాముడు అయోధ్యకు తిరిగి రాగా, రామన్నను రాజ్యాన్ని స్వీకరించవలసిందిగా భరతుడు కోరాడు. రాముడు తిరిగి రాజ్యాన్ని చేపట్టడానికి అంగీకరించాడు.
వనవాసం వలన పెరిగిన జటాఝూటములమును ముడివిప్పి మంగళ స్నానం చేశాడు. అనేక రకాల సుగంధ లేపనాలను ఆయనకు అలదగా ఆయన అద్భుతంగా ప్రకాశించాడు. శతృఘ్నుడు రామలక్ష్మణులను అలంకరించారు. దశరథుని పత్నులు సీతమ్మను అలంకరించారు. కౌసల్య వానర పత్నులను అలంకరించింది. సుమంత్రుడు రథాన్ని తీసుకురాగా రాముడు దానిని అధిరోహించాడు. సుగ్రీవుడు, హనుమంతుడు కూడా మంగళ స్నానములు చేసి తమను తాము అలంకరించుకున్నారు.
భరతుడు పగ్గాలు చేపట్టగా, లక్ష్మణుడు వింజామర వీచగా, శతృఘ్నుడు ఛత్రము పట్టగా రాముడు అయోధ్య వీధులలో రధముపై విహరించాడు. సుగ్రీవుడు శత్రుంజయమను ఏనుగునెక్కాడు. వానరులందరూ మానుష రూపము ధరించారు. ప్రజలందరూ రామునికి జయ జయ ధ్వానాలు పలికారు. సంగీత వాద్యములతో నృత్యములతో ఆ రాముడు అయోధ్యాపురాన్ని కలయబెట్టాడు. తన మంత్రులతో సుగ్రీవ విభీషణాదులతో తన మైత్రిని గురించి ప్రస్తావించాడు. రాముని పలుకులతో హర్షించిన ప్రజలు తమ ఇళ్లపై పతాకాలను ఎగురవేశారు.
రాముడు రాజప్రాసాదాన్ని చేరుకొని తొలుత ముగ్గురు మాతలకు నమస్కరించాడు. సుగ్రీవాదులకు ఉచితమైన వసతులు చూడమని భరతునితో చెప్పాడు. భరతుడు సుగ్రీవుని రామ పట్టాభిషేకానికై ఏర్పాట్లను ఆరంభించవలసిందిగా కోరాడు. తదనుగుణంగా సుగ్రీవుడు జాంబవంతుని, హనుమంతుని, వేగదర్శిని, ఋషభుని నాలుగు సాగరములనుండి పవిత్ర జలాలను తీసుకు రావలసిందిగా ఆదేశించాడు. వానరులు వారి ఆదేశాల మేరకు 500 నదుల నీరు తీసుకు వచ్చారు. శతృఘ్నుడు రాజ గురువైన వశిష్ఠుల వారితో ఆ జలాల గురించి తెలిపాడు.
వశిష్ఠుడు నవరత్న ఖచితమైన సింహాసనం మీద సీతారాములను ఆసీనులు కావలసిందిగా కోరాడు. వశిష్ఠ, జాబాలి, వామదేవ,కాశ్యప,కాత్యాయన, సుయజ్ఞ, గౌతమ, విజయ మహర్షులు రాముని పవిత్రమైన సుగంధ జలాలతో అభిషిక్తుని చేశారు. మనువును అలంకరించిన నవరత్న ఖచితమైన కిరీటముతో రాముని అలంకరించి రాముని ఆశీర్వదించారు. శతృఘ్నుడు తెల్లని ఛత్రము పట్టుకోగా, విభీషణుడు, సుగ్రీవుడు వింజామర వీచారు. వాయుదేవుడు ఇంద్రుని బహుమతిగా వంద కలువలున్న స్వర్ణమాలను బహుకరించాడు. వాయుదేవుడు ముత్యాల మరియు ఇతర రత్నాల హారాలను రామునికి సమర్పించాడు. అప్సరసలు నృత్యం చేశారు. ప్రకృతి పుష్పములతో, ఫలములతో పులకరించింది.
రాముడు తొలుత బ్రహ్మణులను, తరువాత సుగ్రీవ అంగదాదులకు కానుకలు అందజేశాడు. సీతమ్మకు ముత్యాల హారాన్ని బహుకరించాడు. రాముడు సీతతో ఆ హారాన్ని సభలో అత్యంత పరక్రమవంతుడు, బుద్ధిమంతుడు, వినయసంపన్నుడు మరియు సమస్త శుభగుణములు కల్వానికి బహుకరించమనగా సీతమ్మ ఆ హారాన్ని హనుమకు ఇచ్చింది. రాముడు మిగిలిన వానరులకు కూడా కానుకలిచ్చాడు. తరువాత సుగ్రీవాదులు కిష్కింధకు, విభీషణుడు లంకకు తిరిగి వెళ్లారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి