గోపాలకృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన
కాళిందిలో నీళ్లు చల్లన పాట పాడవే నా గుండె ఝల్లన
మా చిన్ని కృష్ణయ్య లీలలు మంజుల మధు మురళి ఈలలు
మా కీరసారికల గోలలు మాకు ఆనంద వారాశి ఓలలు
మా ముద్దు కృష్ణుని మాటలు మరువరాని తేనె తేటలు
మా పూర్వ పుణ్యాల మూటలు మమ్ము దరిచేర్చు తిన్నని బాటలు
ఎంత చక్కని లలిత గీతమో కదా! లలిత గీతాలలో కృష్ణభక్తికి, గోపికల మనోభావనలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ గోపస్త్రీల హృదయాలలోని భావఝరులను లలిత గీతాలు చక్కగా ఆవిష్కరిస్తాయి. నల్లనయ్య, గోకులంలోని దధి క్షీర నవనీతాలు, యమునా నది, కాళింది, కృష్ణయ్య వేణు గానం, ముద్దు ముద్దు మాటలు, గోపకులం ఆనందడోలికలు..ఇవి లలిత సంగీతంలో పండినంతగా శాస్త్రీయ సంగీతంలో పండవేమో అని నా అభిప్రాయం. ఇక ఈ గీతానికి వస్తే - 1947లో విడుదలైన రాధిక అనే చిత్రంలో వెంపటి సదాశివబ్రహ్మం గారు రచించగా సంగీతం సాలూరి హనుమంతరావు గారు అందించారు. లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతీదేవి గారు ఆలపించారు. లలితగీతాల కోసమే బాలసరస్వతి గారు జన్మించారా అన్నట్లు ఈ గీతాలు వారి గళంలో జాలువారుతాయి. సదాశివబ్రహ్మం గారు ఎంతో ప్రతిభ ఉన్న రచయిత. వారి చలనచిత్ర గీతాలు అజరామరమైనవి. ఈ గీతంలో రచయిత గోపెమ్మ మనసును అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన ఉపయోగించిన పదాలు తెలుగుదనం ఉట్టిపడుతూ భావాన్ని లలితంగా ప్రవహింపజేశాయి. మంజులు మధు మురళి ఈలలు, కీరసారికల గోలలు, ఆనంద వారాశి ఓలలు, దరిచేరు తిన్నని బాటలు...ఇవన్నీ భావంతో పాటూ తెలుగు భాషా వైభవాన్ని ఇనుమడింపజేశాయి. అంతే చక్కగా హనుమంతరావు గారు సంగీతం అందించారు. బాలసరస్వతి గారి గానం మాధుర్యభరితమైన ప్రవాహమే.
నేటి తరం వారికి ఈ ప్రముఖులు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. వారి కోసం ఈ అలనాటి ప్రజ్ఞాశాలుల విశేషాలు కొన్ని.
1.రావు బాలసరస్వతీదేవి గారు
తెలుగు సినీ పరిశ్రమలోని తొలి తరం గాయనీమణుల్లో బాలసరస్వతి గారు అగ్రగణ్యులు. లలిత గీతాల గానంతో ఆకాశవాణిలో, నేపథ్య గీతాల గానంతో చలనచిత్ర పరిశ్రమలో తొలి గాయనిగా పేరొందారు. 1928లో ఇప్పటి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో జన్మించిన వీరు చిన్నతనంలోనే చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో విడుదలైన సతీ అనసూయ, భక్త ధ్రువ చిత్రాలలో పాడారు. సంగీతం ఆలత్తూరు సుబ్బయ్య గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ప్రముఖ హిందీ గాయకులు సైగల్ గారి ప్రభావం బాలసరస్వతి గారిపై ఉండేది. సైగల్ గారి లలితమైన శైలే బాలసరస్వతి గారి గాత్ర ధర్మమైంది. బాలనటిగానే పేరొందిన వీరు తొలుత తమిళం, తరువాత తెలుగు చలనచిత్రాలలో నటించారు. మొత్తం 15 చిత్రాలకు పైగా నటించారు. నటన తగ్గించి గాయనిగా స్థిరపడ్డారు. 1940 నుండి 67 వరకు గాయనిగా 85కు పైగా చిత్రాలలో పాడారు. వారి సినీ మరియు లలిత గీతాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. హాయమ్మ హాయి, తానే మారెనా, ధరణికు గిరి భారమా, తలుపు తీయునంతలోనే, కనుగొంటి కనుగొంటి వంటి ఎన్నో గీతాలు ప్రజల మనసులను దోచుకున్నాయి. మహామహులైన తెలుగు తమిళ సంగీత దర్శకులకు తమ గానం అందించారు. అందరు మేటి గాయకులతోనూ పాడారు. ఆకాశవాణిలో 65 ఏళ్లు పాడిన ఘనత వీరిది. 90 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ వారి గాత్రంలోని లాలిత్యం ఏ మాత్రమూ తగ్గలేదు. కోలంకి రాజా వారిని వివాహం చేసుకున్న వీరు ఆయన మరణించిన తరువాత ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాజావారి భూముల వివాదంలో కోర్టుల చుట్టూ తిరగలేక బాధ పడ్డారు. ప్రస్తుతం హైదరాబాదులో వారి మనుమడి దగ్గర ఉంటున్నారు.
2. సాలూరి హనుమంతరావు గారు:
సాలూరి సన్యాసిరాజు గారి కుమారుడైన వీరు ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి అన్నగారు. వీరు 1944-78 మధ్య దక్షిణాదిన చలనచిత్రాలకు సంగీతం అందించారు. అందులో ఒకటి రాధిక చిత్రం. 1917లో విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని శివరామపురంలో వీరు జన్మించారు. వీరు ద్వారం వేంకటస్వామి నాయుడు గారి వద్ద శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. కర్ణాటక మరియు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాలలో నైపుణ్యం పొందారు. వీరు మొట్టమొదట 1947లో చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో, అంజలీదేవి నాయికగా విడుదలైన గొల్లభామ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం, చరణదాసి, ఉషా పరిణయం, దక్ష యజ్ఞం, చంద్రహాస, బాంధవ్యాలు, రైతుబిడ్డ, ఆరాధన మొదలైన 75 చిత్రాలకు సంగీతాన్ని అందించి 1980లో మరణించారు.
3. సదాశివబ్రహ్మం గారు:
వెంపటి సదాశివబ్రహ్మం గారు అలనాటి కథలు, పాటలు, సంభాషణల రచయిత. 1905లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన వీరు తొలుత 1941లో విడుదలైన చూడామణి అనే చిత్రానికి సంభాషణలు, పాటలు, కథ అందించారు. తరువాత తెనాలి రామకృష్ణ (1941,56), పల్నాటి యుద్ధం (1947), రాధిక (1947), కీలుగుర్రం, సంసారం, పక్కింటి అమ్మాయి, కన్యాశుల్కం, చరణదాసి, భలే రాముడు, సువర్ణ సుందరి, శారద, అప్పు చేసి పప్పు కూడు, చెంచులక్ష్మి, ఇల్లరికం, లవకుశ, పరమానంద శిష్యుల కథ మొదలైన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సాహిత్యాన్ని అందించారు. భలే రాముడు చిత్రంలోని ఓహో మేఘమాల, అవకుశ చిత్రంలో లేరు కుశలవుల సాటి అన్న పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. లవకుశ మరియు రహస్యం చిత్రాలలోని పద్యాలు చాలమటుకు వీరు రచించినవే. గీత రచయితగా కన్నా, సంభాషణలు, కథా రచయితగా వీరు పేరొందారు. సదాశివబ్రహ్మం గారు 1968లో చెన్నైలో మరణించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి