27, ఫిబ్రవరి 2017, సోమవారం

శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ


రాముడు పరంధాముడు. అనగా సర్వాంతర్యామి లేదా పరమాత్మ. పొత్తూరి వేంకటేశ్వరరావు గారి పారమార్థిక పదకోశం ప్రకారం పరమాత్మ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో కొన్ని

1. స్వయం ప్రకాశం కలిగి, జ్ఞానరూపమైన ఆత్మ.
2. కార్యకారణాలకంటే భిన్నమై, క్షరాక్షరాల కంటే కూడావేరుదై, స్వాభావికంగా నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, ముక్తమైన పదార్థం.
3. అవిద్య వల్ల ఆత్మగా తలచిన దేహం మొదలు బుద్ధివరకు ఉన్న తత్త్వాలకు అతీతమైనది. సర్వోత్కృష్టమైనదీ, ఉపద్రష్టృత్వాది విశేషణ విశిష్టమై ప్రకాశించే ఆత్మ.
4. ఆత్మగా కల్పితాలైన పంచ కోశాలకు, విరాట్‌, హిరణ్య గర్భ, అవ్యాకృత తత్త్వాలకు అతీతమై, బ్రహ్మకు పూర్వం నుంచి ఉన్న పదార్థం.
5. సమస్త భూతాలలోని ప్రత్యక్చేతనం.
6. మాయాశక్తికి ఆశ్రయం.
7. సర్వానికి అధిష్ఠానమైనది.
8. పర దేవత.
9. దైవం / పరబ్రహ్మం.

వీటన్నిటి ద్వారా మనకు తెలిసేది ఏమిటి? శాశ్వతమైన గుణాతీతమై, అక్షరమై సమస్త జీవరాశులయందు ఉన్న చైతన్యమే పరమాత్మ.

రామావతారంలో ఉన్న గొప్పతనం ఆయన సామాన్య మానవునిగా, ప్రభువుగా ధర్మబద్ధతతో నడచుకొని పరంధాముడైనాడు. ఆయన అవతారం ప్రతి మానవునికీ ఒక పాఠం, ఆదర్శం మరియు ఆధ్యాత్మిక సోపానానికి స్ఫూర్తిదాయకం. ఏ విధంగా మసలుకుంటే మానవుడు దివ్యత్వాన్ని పొందుతాడో రాముడు తన నడవడికతో  తెలిపాడు. పరంధాముడైన ఆ రాముని నుతించే ఏ గీతమైనా మధురమే. రామ నామంలోని శక్తి అది. రాముని జీవనశైలిలోని మహత్తు అది. ఓం నమో నారాయణాయ అనే మంత్రంలోని రా అనే బీజాక్షరం, ఓం నమశ్శివాయ అనే శివ పంచాక్షరీ మంత్రంలోని మ అనే బీజాక్షరం  కలిసి రామ నామ ఆవిర్భవించిందని ఒక అభిప్రాయం. పద్మపురాణం ప్రకారం యోగులను సచ్చిదానందంలో రమింపజేసేది రామ అని అర్థం. తారకమనే ఘనత రామనామానికి మాత్రమే. రామ అనే బీజాక్షరాలను ఉచ్చరించటం వలన పాపాలు పటాపంచలై పోతాయని సనాతన ధర్మం ఘోషిస్తుంది. సంసార సాగరాన్ని దాటించేది కాబట్టి భవతారకమై ఈ తారక నామము భక్తులను ఉద్ధరిస్తోంది. వహ్నిగర్భమైన ఈ నామం పాపనాశనం చేసి ముక్తిని ప్రసాదించేది.

రాముని వైభవాన్ని తెలిపే గీతాలు చలన చిత్రాలలో ఎన్నో వచ్చాయి. 1963లో విడుదలైన లవకుశ చలనచిత్రం ఒక్క తెలుగు భాషలోనే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆణిముత్యం. ఆధ్యాత్మికతను, పవిత్రతను ప్రతి అడుగులోనూ చాటే ఈ చిత్రంలో సముద్రాల రాఘవాచార్యుల వారు ఎన్నో గీతాలను రచించారు. వాటిలో ఒకటి శ్రీరాముడు-లవకుశుల సంగ్రామ ఘట్టంలో హనుమతో పాటు వాల్మీకి మహర్షి శిష్య బృందం పాడే గీతం శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ. సాహిత్యం:

శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ
రఘురామ రామ రణరంగ భీమ జగదేక సార్వభౌమ

సూర్యాన్వయాబ్ధి సోమ సుగుణాభిరామ శుభనామ
కారుణ్యధామ దశకంఠ విరామ రాఘవ రాజలలామ

సాకేతపురాధిప రామ సీతామనోహర శ్రీరామ
అరవిందలోచన సుందర సురుచిర ఇందీవర శ్యామ

శ్రీరాముని పరమాత్మగా నుతిస్తూ ఆయనకు జయము పలికారు రాఘవాచార్యుల వారు. రఘువంశంలో జన్మించిన వానిగా, యుద్ధరంగంలో అరివీర భయంకరునిగా, ఈ విశ్వంలో ఏకైక సార్వభౌమునిగా కొలిచారు. సూర్యవంశమనే సముద్రానికి చంద్రుని వంటి వానిగా, సుగుణాలతో శోభిల్లే వానిగా, శుభమైన నామము కాలిగి, కరుణకు నెలవై, రావణుని సంహరించిన రాజశ్రేష్ఠునిగా రాముని స్తుతించారు. సాకేతపురానికి రాజుగా, సీత మనసు దోచుకున్న వానిగా, కలువలవంటి కన్నులు కలవానిగా, సుందరమైన, మనోజ్ఞమైన రూపముగల లక్ష్మీపతి అయిన నీలమేఘ శ్యామునిగా అభివర్ణించారు.

రామభక్తి సామ్రాజ్యంలో ఆ పరంధాముని కీర్తించే భావ సుమాలు ఎన్నో! వాగ్గేయకారుల సంకీర్తనలు, భావ కవుల భక్తి రసఝరులు, పల్లె పదాలు...ఇలా ప్రతి కళారూపంలోనూ స్వామిని అద్భుతంగా వర్ణించబడిన వాడు ఆ రాముడు. లవకుశ చిత్ర దర్శకులు ఈ గీతాన్ని దాదాపుగా భజన రూపంలో తన్మయత్వంతో భక్త సమూహంపై చిత్రీకరించారు. ఘంటసాల మాష్టారు సంగీతంలో అత్యంత భక్తిపూరితంగా ఉండే ఈ సముద్రాల వారి గీతాన్ని సుశీలమ్మ, లీల గారు, జమునారాణి గారు కలిసి అద్భుతంగా, శ్రవణ మనోహరంగా గానం చేశారు. ఈ పాట వింటే హనుమద్భక్తి కళ్ల ముందు నిలుస్తుంది. రోమాంచమవుతుంది. శరీరం పులకితమై మనసు రామనామ రసామృతంలో ఓలలాడుతుంది. రామభక్తి యొక్క గొప్పతనం అదే. రూపంలోను, గుణాలలోనూ, ప్రవర్తనలోనూ, యుద్ధపటిమలోనూ మహా సంపన్నుడు రాముడు. అందుకే లోకాభిరాముడైనాడు.


25, ఫిబ్రవరి 2017, శనివారం

త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కీర్తన - మేలుకో దయానిధి మేలుకో దాశరథి


ఉత్సవ సాంప్రదాయ కీర్తనలలో త్యాగరాజస్వామి తన ఇష్టదైవానికి రోజూ జరిగే వేడుకల వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో మేలుకొలుపు, ఆవాహనములు, సమస్త ఉపచారములు, సీతారామ కళ్యాణోత్సవము, నివేదనలు, ఉయ్యాల సేవలు,మంగళ హారతులు, రక్షా ధారణ,  పవ్వళింపు సేవలు, లాలి పాడే  కృతులు ఉన్నాయి. ఇవి మొత్తం 26 కృతులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కీర్తనల ద్వారా ఆనాటి అర్చనా విధులను తెలుసుకునే అవకాశం త్యాగరాజస్చామి మనకు కలిగించారు. ఈ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలలో కొన్నింటిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడి చాలా ప్రచారంలోకి తీసుకు వచ్చారు. మేలుకో దయానిధీ అన్న కీర్తన వాటిలో మేలుకొలుపు కీర్తనగా పేరొందింది.

మేలుకో దయానిధి మేలుకో దాశరథి
మేలుకో దయానిధి మిత్రోదయమౌ వేళ

నారదాది మునులు సురలు వారిజభవుడిందు కళా
ధారుడు నీ సన్నిధినే కోరి కొలువ గాచినారు

వెన్న పాలు బంగారు గిన్నెలోనేనుంచినాను
తిన్నగారగించి తేట కన్నులతో నన్ను జూడ

రాజరాజాది దిగ్రజులెల్ల వచ్చినారు
రాజనీతి తెలియ త్యాగరాజ వినుత నన్ను బ్రోవ

ఈ కీర్తనలో ఆ రాముని సూర్యోదయ సమయాన మేలుకొమ్మని త్యాగరాజ స్వామి అనేక విధాల వేడుకున్నారు. "ఓ దయాసముద్రుడవైన దశరథ రామా! మేలుకో! సూర్యోదయమగుచున్నది. నారదుడు మొదలైన మునులు, దేవతలు, చతుర్ముఖ బ్రహ్మ, శివుడు మొదలైన వారు నీ సన్నిధిని కోరి నిన్ను కొలుచుటకు వేచియున్నారు.  వెన్న, పాలు బంగారు గిన్నెలలో నీ కోసం నేనుంచాను. చక్కగా వాటిని ఆరగించి తేటైన కన్నులతో నన్ను చూడుము. కుబేరుడు మొదలైన దిక్పాలకులు వచ్చారు. నీ దగ్గర రాజధర్మాన్ని నేర్చుకోవాలని వేచియున్నారు. ఓ రామా! నన్ను బ్రోచుటకు మేలుకో!" అని రాముని కోరారు.

ఏ వాగ్గేయకారుని కృతులను పరిశీలించినా వారి జీవిత గమనంతో పాటు ఆధ్యాత్మిక సోపానం వారి కృతుల ద్వారా మనకు కనబడుతుంది. త్యాగరాజస్వామి కీర్తనల్లో కూడా ఈ పురోగతి మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. సగుణోపాసనలో ఉండే మాధుర్యం, ఆ పరమాత్మను జీవాత్మకు వేరుగా చూసి ఆరాధించే భక్తి, ఆ ఉపాసనలోని సేవలలో రమించే తీరు ఆయా కృతులలో మనకు కనబడుతుంది. సగుణోపాసనలో దేవతా స్వరూపాలను మూర్తులలోకి ఆవాహనం చేసి, ఉపచారములు చేసి, నివేదనలు చేసి, స్తుతించి ఆ పరమాతను కళ్లెదుట దర్శించే భావన ఎంతో మధురమైనది. ఇది సామాన్య మానవుని హృదయంలో త్వరగా నమ్మకాన్ని విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే, ఈ సేవలు మన ఇంటికి ఎవరైనా మహానుభావులు వస్తే చేసే సేవలవంటివే. కాబట్టి వెంటనే మనసుతో అనుసంధానం కలుగుతుంది. పూర్వజన్మ సంస్కారాలు మరియు ఈ జన్మ కర్మ ఫలాలను బట్టి ఏదో ఒకనాడు సగుణోపాసన నుండి, ఇది కాదు, దీనిని మించినది పరమాత్మ తత్త్వం అని అవగతమై నిర్గుణోపాసన వైపు మానవుడు మరలుతాడు. అది ఆ జన్మలో కావచ్చు, మరు జన్మలో కావచ్చు. త్యాగరాజస్వామి వారు జీవితంలోని మలిభాగంలో రచించిన కీర్తనలలో కొంత నిర్గుణోపాసన కనబడుతుంది.

ఈ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలన్నీ సగుణోపాసనను మూలంగా చేసుకున్నవే. ఆవాహనం, అలంకరణం, ఉపచారములు, నివేదనములు..అన్నీ ఆ విగ్రహంలో దేవతామూర్తి స్థిరుడై ఉన్నాడన్న ప్రగాఢ విశ్వాసంతో కూడినవి. స్థావర జంగమాలన్నిటా పరమాత్మ ఉన్నాడన్న మన వేదవాఙ్మయ ఘోషను సగుణోపాసన తు.చ తప్పకుండా పాటిస్తుంది. దీనిలోని  మాధుర్యం అనుభవైకవేద్యం. త్యాగరాజస్వామి ఈ అనుభవాలను తన కృతులలో వివరంగా, మనోజ్ఞంగా, భక్తిభరితంగా, భావగర్భితంగా రచించారు. మేలుకొలుపు సేవ చేసి తనను బ్రోవమని ఈ కృతిద్వారా ఆయన వేడుకున్నారు. బాలమురళిగారి గానంలో ఈ కృతి వినండి.


19, ఫిబ్రవరి 2017, ఆదివారం

నాదోపాసన - త్యాగరాజస్వామి వారి శోభిల్లు సప్తస్వర



శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా

నాభి హృత్కంఠ రసన నాసాదులయందు 

ధర ఋక్సామాదులలో వర గాయత్రి హృదయమున 
సురభూసుర మానసమున శుభ త్యాగరాజాదులలో

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః - నాదోపాసనా రసామృతాన్ని సమస్త జీవరాశులు ఆనందిస్తాయన్నది ఆర్యోక్తి.

శృతిలయలతో కూడిన సంగీతం దివ్యత్వానికి ఆలవాలం. ఓంకారం నుండి ఆవిర్భవించిన సప్తస్వరాలతో కూడిన సంగీతంలో రమించేవారు దేవతలు. నాదంతో సృష్టిస్థితిలయములు అనుసంధానమై ఉన్నాయి. నిరంతరం అనంతమైన వాహినిలా ప్రవహించే విశ్వజనీనశక్తి నాదరూపమై ఉంది. పొత్తూరి వేంకటేశ్వరరావు గారి పారమార్థిక పదకోశంలో నాదం అనే పదం అద్భుతంగా నిర్వచించబడింది. దాని ప్రకారం -  శరీరంలోని ఆత్మ మనస్సును, మనస్సు వహ్నిని, వహ్ని వాయువును ప్రేరేపించినప్పుడు వాయువు బ్రహ్మ గ్రంధియగు మూలాధారం నుంచి ఊర్ధ్వ ముఖంగా నాభి, హృదయం, కంఠం, శిరస్సు, ముఖం చేరి కలిగించే ధ్వని ‘నాదం’. బ్రహ్మ స్వరూపమైనది నాదం. నాభికి పైన హృదయ స్థానం నుంచి బ్రహ్మ రంధ్రం వరకు ధ్వనించే ప్రాణ వాయువు. ఆకాశం, వాయువు, అగ్ని అనే మూడు భూతాల నుంచి పుట్టి నాభికి పైన ధ్వనిస్తూ, ముఖంలో అతి స్పష్టంగా వ్యక్తమయ్యే వాయువు ఈ నాదం. ఇది అక్షర సత్యం.

త్యాగరాజ స్వామి ఈ నాదోపాసనలోని మహత్తును ఎన్నో కృతుల ద్వారా తెలిపారు. వాటిలో నాదతనుమనిశం శంకరం, నాదసుధారసంబిలను మరియు శోభిల్లు సప్తస్వర ఈ సందేశాన్ని సుస్పష్టం చేశాయి. ప్రణవము నుండి జన్మించిన నాదమనే అమృత రసము ఈ భువిపై నరాకృతిగా రాముడై వెలసినట్లు త్యాగయ్య తెలిపారు. వేదశాస్త్రపురాణాలకు నాదం ఆధారమని నొక్కి వక్కాణించారు. ఎందు వలన? వేదాలు ఒకరిచే రాయబడినవి కాదు. విశ్వజనీనమైన శక్తి ఆయా ఋషుల నోట శబ్దరూపమున వెలువడినవి. శబ్దమునకు మూలం ఓంకారం. అందుకే ప్రణవానికి మన సనాతన ధర్మంలో అంత ప్రాధాన్యత ఉంది. త్యాగరాజ స్వామి రాముని అవతారాన్ని నాదంతో అనుసంధానం చేశారు. ఆయన కోదండమే సప్తస్వరాలను పలికించే సాధనంగా, రాగములు బాణములుగా, నెరవులు మరియు సంగతులు స్వామి పలుకులుగా నుతించారు. అలాగే, నిరంతరం తనువంతా నాదముతో నిండిన వానిగా శివుని స్తుతించారు. శివుని సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనబడే పంచముఖములనుండి సప్తస్వరములు జనించినట్లు తెలిపారు. ఇలా ఈ విశ్వమంతా నాదపూరితమై ఉన్నట్లు స్పష్టంగా మనకు అనే కృతుల ద్వారా నిరూపించారు. అటువంటి కృతే శోభిల్లు సప్తస్వర.

ఈ కృతిలో త్యాగరాజ స్వామి సప్తస్వరాలతో శోభిల్లే సుందరమైన దేవతలను నుతించాలని మనసుకు చెబుతున్నారు. ఈ సప్తస్వరాలు నాభి మొదలు, హృదయము, కంఠము, నాలుక మరియు నాసిక యందు శోభిల్లుతాయి. పైన పొత్తూరి వేంకటేశ్వర రావు గారు చెప్పిన నాదం యొక్క నిర్వచనం త్యాగరాజస్వామి వారి భావనతో ఏకీభవించినట్లే కదా? అలాగే, ఈ భూమిలో ఋగ్, సామ మొదలైన వేదములలో, గాయత్రీ మంత్ర మధ్యమున, దేవతల, ఉత్తములైన మానవుల మనస్సులలో ఈ సప్తస్వరాలు శోభిల్లుతాయని త్యాగరాజస్వామి పలికారు.

గాయకుడు భావాన్ని ఆకళింపు చేసుకొని, ఆయా దేవతా స్వరూపాన్ని సగుణ ధ్యానం చేసి, భావానికి సొంపైన రాగయుక్తంగా సప్తస్వరమేళనంగా శాస్త్రీయ సంగీత ఆలాపన చేస్తే ఆయా దేవతా రూపాలు తప్పకుండా ఆ కళాకారుని దేహంలో వసిస్తారు. అలా నిత్యం సాధన చేసిన కళాకారులు దివ్యత్వన్ని పొందుతారు. అందుకే శాస్త్రీయ సంగీతమే జీవితంగా భావించిన ఎందరో మహా కళాకారులు జీవబ్రహ్మైక్యాన్ని పొందారు. దేహాత్మ స్ఫురణల విచక్షణా జ్ఞానాన్ని నిరంతరం కలిగి స్థితప్రజ్ఞులైనారు. నాదోపాసన అంత మహత్తరమైనది. ఓంకార జనితమైన షడ్జమాది నాదములు అమృతమాలికలుగా అల్లబడి పదములకు మంత్ర సిద్ధి వంటి శక్తిని కలిగించి ఒక్కొక్క కృతి ఆధ్యాత్మిక సోపానంలో ఒక్కో మెట్టుగా ఉపకరిస్తున్నాయి. అందుకే శాస్త్రీయ సంగీత కీర్తనలు స్వర రాగ లయ భావములకు సమానమైన స్థానం ఉండి భక్తి సుగంధాన్ని అలదుకొని శాశ్వత సాఫల్యాన్ని పొందాయి. ఈ నాదోపసన యొక్క ఔన్నత్యాన్ని ఎందరో వాగ్గేయకారులు మనకు తరతరాలుగా అందిస్తున్నారు. అందరిలోకీ, త్యాగరాజస్వామి దాని మహాత్మ్యాన్ని అద్భుతంగా ఇటువంటి కీర్తనల ద్వారా మనకు వెలలేని వారసత్వ సంపదగా అందించారు.

శోభిల్లు సప్తస్వర అనే కృతి జగన్మోహిని రాగంలో కూర్చబడింది. రాగం ఈ కృతిలోని భావాన్ని చక్కగా ప్రకటితం చేస్తుంది. అలాగే, సందేశానికి ఔన్నత్యాన్ని కలుగజేస్తుంది. నాదం యొక్క గొప్పతనాన్ని తెలిపే భావానికి జగన్మోహిని వంటి గంభీరమైన రాగం చాలా సముచితం. మాయామాళవగౌళ రాగం ఈ జగన్మోహినికి జన్య రాగం. ఈ త్యాగరాజస్వామి కీర్తనను భారతరత్న బిరుదాంకిత శ్రీమతి మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి గారి గాత్రంలో వినండి.

18, ఫిబ్రవరి 2017, శనివారం

సీతా దర్శనం - చూడామణి ప్రదానం



యథా హి వానరశ్రేష్ఠ దుఃఖక్షయకరో భవేత్
త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణ హరిసత్తమ

ఓ వానర శ్రేష్ఠుడవైన హనుమంతుడా! రామలక్ష్మణులు ఈ నా దుఃఖాన్ని తొలగించే మహత్తర కార్యానికి ఉత్తమ సాధకుడవు నీవే.

రాఘవస్త్వత్సమారంభాన్ మయి యత్న పరో భవేత్
ఇదం బ్రూయాచ్చ మే నాథం శూరం రామం పునః పునః

నీవు చేసే యత్నముల ఫలము వలన రాముడు నన్ను విడిపించే కార్యానికి సమాయత్తమవుతాడు. నేను చెప్పిన మాటగా మళ్లీ మళ్లీ రాముని ఇలా తెలుపుము.

జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ
ఊర్ధ్వం మాసాన్ న జీవేయం సత్యేన అహం బ్రవీమి తే

ఓ రామా! నేను నా ప్రాణములను ఇంకొక నెల మాత్రమే నిలబెట్టుకోగలను. ఆ తరువాత ఒక్కరోజు కూడా నేను జీవించలేను. ఇది సత్యం.

రావణేన ఉపరుద్ధాం మాం నికృత్యా పాప కర్మణా
త్రాతుమర్హసి వీర త్వం పాతాలాత్ ఇవ కౌశికీం

ఓ రామ! గతంలో శ్రీమహావిష్ణువు పాతాళం నుండి ఇంద్రాదులను రక్షించినట్లు పాపాత్ముడైన రావణునిచే చెరబట్టి హింసించబడుతున్న నన్ను నీవు రక్షించాలి.

తతో వస్త్ర గతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం
ప్రదేయో రాఘవాయ ఇతి సీతా హనుమతే దదౌ

అంతట, తన చీర కొంగుముడిలో దాచుకున్న శిరోరత్నమైన చూడామణిని హనుమంతునికి అందజేసి దానిని రామునికీయవలసిందిగా కోరెను.

వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణలోని సుందరకాండ 38వ సర్గలో సీతమ్మను కాంచి ఆమెకు రాముని వృత్తాంతము తెలిపి, అంగుళీయకమిచ్చి సీతకు సాంత్వనను కలిగిస్తాడు హనుమంతుడు. ఆమె హనుమంతుని స్వామి భక్తికి, కార్యకుశలతకు ఎంతో సంతోషించి అతనిని హరిసత్తముడని (కపిశ్రేష్ఠుడు), తన దుఃఖాన్ని తొలగించే కార్య సాధకుడని ప్రశంసిస్తుంది. తరువాత తను వనవాసం మునుపు శిరస్సున ధరించే రత్నాన్ని రామునికి తన ఆనవాలుగా ఇస్తుంది. శతయోజనముల జలధిని దాటి, దుర్గమమైన లంకలో ప్రవేశించి, రావణుని కలిసి, అశోక వనంలో శింశుపా వృక్షం క్రింద రాక్షసీ సమూహం మధ్య దుఃఖితయై ఉన్న సీతకు ఆనందకారకుడైనాడు. స్వామికార్యమెంతటి దుర్గమమైనా సాధించిన వీరుడు హనుమంతుడు. రావణసంహరణానంతరం సీతారామపట్టాభిషేకం సమయమున రామయ్య సీతమ్మకు ముత్యాల హారాన్నిస్తాడు. ఆ హారాన్ని అక్కడ సభాసదులలో అత్యంత తేజోవంతుడు, ధీరుడు, దక్షుడు, బుద్ధిశాలి, వినయవంతుడు, పరాక్రమవంతుడైన వానికి బహుకరించవలసిందిగా పలుకుతాడు. అప్పుడు సీతమ్మ ఎటువంటి సంకోచం లేకుండా దానిని హనుమకు బహుకరిస్తుంది.  సీతారాములకు హనుమంతునిపై గల నమ్మకం గురి తెలుపటానికి ఒక్క సన్నివేశం చాలు. అందుకే అతను శ్రేష్ఠుడు, సత్తముడు అయినాడు. భక్త శిరోమణిగా కొలువబడుతున్నాడు.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం!
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం!!

త్యాగరాజ స్వామి కీర్తనలలో లక్ష్మణుని ప్రస్తావన



అన్న రామన్నకు నీడగా నిలచి ఆయన సేవే తన జీవితంగా భావించి, అన్నను నిరంతరము సేవించిన ఆ లక్ష్మణుడిది ఏమి భాగ్యమో కదా? రాజభోగాలను వదలి, ధర్మపత్నికి దూరంగా పదునాలుగేండ్లు వనవాసానికి వెళ్లిన ఆ సౌమిత్రికి అన్న అంటే ఎంత గౌరవమో ప్రేమో రామాయణంలో ఎన్నో సందర్భాలలో మనకు సుస్పష్టంగా అవగతమవుతుంది. వనవాస నిర్ణయం, భరతుడు-రాముడు కలిసే సన్నివేశం, మాయలేడి ఘట్టం, రామ-రావణ యుద్ధం...వీటన్నిటా లక్ష్మణుడు అన్నకు వెన్నుదన్నుగా నిలిచాడు. అందుకే రామునికి సోదరుడంటే ఎంతో ప్రేమ. ఆ అన్నకు సేవలో తరించిన లక్ష్మణుని గురించి త్యాగరాజ స్వామి ఎన్నో సంకీర్తనలలో పలికారు.

శ్రీరామ జయరామ శృంగార రామయని చింతించ రాదె ఓ మనసా అన్న కృతిలో "తమి మీర పరిచర్య సేయ సౌమిత్రి మును తప మేమి చేసెనో తెలియ" అని నుతించి ఆ లక్ష్మణుని పరిచర్యల గొప్పతనాన్ని చాటారు. కంటజూడుమీ అనే కృతిలో "అలనాడు సౌమిత్రి పాద సేవ చెలరేగి సేయు వేళ సీతతో పలికి చూచినంత పులకాంకితుడై " అని రాముడు లక్ష్మణుని సేవతో ఎంత సంతోషించాడో తెలిపాడు. అలాగే కనుగొంటిని శ్రీరాముని అనే కీర్తనలో "భరత లక్ష్మణ శతృఘ్నులు కొలువ" అని కొనియాడారు. దాచుకోవలెనా దాశరథి నీ దయ అనే కృతిలో "నేమమున బరిచర్య నేర్పున బొగడు వేళ సౌమిత్రి త్యాగరాజుని మాట బల్కితే" అని ప్రస్తావించారు. వెడలెను కోదండపాణి అనే కృతిలో "సౌమిత్రితో గూడి" అని రామలక్ష్మణుల జంటను నుతించారు. ఎన్నడు జూతునో ఇనకుల తిలకుని అనే కృతిలో "ధరణిజ సౌమిత్రి భరత రిపుఘ్న వానర యూధపతి వరుడాంజనేయుడు కరుణను ఒకరు ఒకరు వర్ణింపనాదరణను బిలిచే నిను త్యాగరాజార్చిత" అని తనను కొలిచే భరత లక్ష్మణాదులను ఆ రాముడు ఎలా ఆదరించాడో తెలిపారు. పక్కల నిలబడి అనే కీర్తనలో "సుదతి సీతమ్మ సౌమిత్రి శ్రీరామునికిరుప్రక్కల నిలబడి" అని రామ వైభవాన్ని వర్ణించారు. ఇలా ఎన్నో కీర్తనలలో లక్ష్మణుని ప్రస్తావన ఉంది. మరి ఆ లక్ష్మణుడి ఘనత ఎంత గొప్పదో ఊహించండి?

నిద్రాహారాలు మాని 14 ఏళ్ల పాటు సీతారాములను వనవాసంలో సేవించి కంటికి రెప్పలా కాపాడిన వాడు లక్ష్మణుడు. స్వయంగా ఆదిశేషువు అవతారమైన లక్ష్మణుడు రాముని సగభాగం వంటి వాడు. లక్ష్మణ రేఖను ఆ రావణాసురుడు కూడా దాటలేకపోయాడు. ఒకేమారు 500 బాణాలు వేయగల విలువిద్యా నేర్పరి. సీతా వియోగంతో దుఃఖంలో ఉన్న రాముని ఓదార్చిన వాడు లక్ష్మణుడు. రామ-రావణ సంగ్రామంలో ఇంద్రజిత్తు వంటి మహావీరుని సంహరించిన ధీరుడు లక్ష్మణుడు. పుట్టుక నుండి అవతార సమాప్తి వరకు అన్న వెనుక ఉన్న వాడు ఆ లక్ష్మణుడు.

ఈ లక్ష్మణ  ప్రస్తావన కలిగిన త్యాగరాజస్వామి కృతులలో  మరో కీర్తనను పరిశీలిద్దాం.

సౌమిత్రి భాగ్యమే భాగ్యము

చిత్ర రత్నమయ శేషతల్పమందు సీతాపతిని యూచు

బాగుగ వింత రాగముల ఆలాపన సేయగ మేను పులకరించగ
త్యాగరాజ నుతుడౌ శ్రీరాముని తత్వార్ధమును పొగడి జూచే

ఆ లక్ష్మణుడు అన్నకు చేస్తున్న సేవను త్యాగరాజ స్వామి సౌమిత్రి భాగ్యమే భాగ్యము అన్న ఈ కీర్తనలో అద్భుతంగా వర్ణించారు. రత్నమణిమయమైన శేషతల్పమైన ఊయలలో ఊగే రాముని కొలిచే లక్ష్మణుని భాగ్యమే భాగ్యము అని ప్రస్తుతించారు. చెవులకింపైన రాగములను వాద్యకళాకారులు పలికించగా ఆ లక్ష్మణుని మేను పులరించిందట. ఆ శ్రీరాముని తత్త్వములను పొగడే వర్ణనలను విని, చూచి తరించే లక్ష్మణుడి ఎంత భాగ్యమో అని త్యాగరాజస్వామి పలికారు.  ఈ  కీర్తనను హైదరాబాద్ సోదరులు ఆలపించగా వినండి.

రాముని సేవాభాగ్యం పొందిన వారిలో సీతా లక్ష్మణులు, భరతుడు, శతృఘ్నుడు, హనుమంతుడు, గుహుడు, విభీషణుడు, సుగ్రీవుడు...ఇలా ఎందరో. నిరంతర సేవా భాగ్యంలో తరించిన లక్ష్మణుడు రామావతార పరిపూర్ణతకు ఎంతగానో తోడ్పడ్డాడు.

11, ఫిబ్రవరి 2017, శనివారం

తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా


పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా! మమ్మునెడయక వయ్యా! కోనేటి రాయడా!

కోరి మమ్మునేలినట్టి కుల దైవమా! చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా!
గారవించి దప్పి దీర్చు కాల మేఘమా! మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా! 

భావింప గైవసమైన పారిజాతమా! మమ్ము చేవ దీర గాచి నట్టి చింతామణీ! 
కామించి కోరికలిచ్చే కామధేనువా! మమ్ము తావై రక్షించేటి ధరణీధరా! 

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా! రోగాలడచి రక్షించే దివ్యౌషధమా! 
బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా! మమ్ము  గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా!

తాత్పర్యం:

ఓ పురుషోత్తముడా! నీ రూపాన్ని కాంచితిమి! మమ్ములను విడిచి వెళ్లకు ఓ వేంకటేశ్వరా!

మమ్ములను కాపాడే కులదైవమా! బాగా సాధన చేసిన పెద్దలు మాకందించిన నిధివి నీవు! ఆదరించి దప్పిక తీర్చే నల్లని మేఘాలవంటి వాడవు! మాకు దగ్గరగా చిత్తములో ఉన్న శ్రీనివాసుడవు నీవు!

తలచినంతనే మాకు దక్కే పారిజాతము నీవు! మమ్ములను కాపాడి శక్తినిచ్చే చింతామణివి నీవు! కోరినంత కోరికలను తీర్చే కామధేనువు నీవు! మాకు నీడయై రక్షించేటి ధరణీపతివి నీవు!

మేము చెడిపోకుండా బ్రతికించే సిద్ధమైన మంత్రానివి నీవు! మా రోగాలను మటుమాయం చేసి కాపాడే దివ్యమైన ఔషధము నీవు! మా వెంటే ఉండే ప్రాణ బంధువు నీవు! మమ్ములను సృష్టించిన శ్రీవేంకటనాథుడవు నీవు!

భావార్థం:

తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో ఈ పొడగంటిమయ్యా ఓ ప్రత్యేకమైనది. శ్రీనివాసుని మహత్తును మూడు చరణాలలో అద్భుతంగా ఆయన వర్ణించారు. ఎందరికో కులదైవమైన ఈ శ్రీవేంకటేశ్వరుడు తన భక్తులను కాపాడుతూ కలియుగంలో మనకు రక్షగా ఉన్నాడు. ఆ భావనను ఈ సంకీర్తనలో మనకు అన్నమయ్య ఎంతో చక్కగా వివరించారు. యోగులు, సిద్ధులు, తపస్సంపన్నులు సాధనతో దర్శించిన స్వామి మన పాలిటి ఎనలేని సంపద. దాహంతో ఉన్నప్పుడు కాలమేఘంలా సమృద్ధిగా వర్షించే వానిగా శ్రీనివాసుని అన్నమయ్య మొదటి చరణంలో నుతించారు. పారిజాత వృక్షము మన పురాణాలలో చెప్పబడిన కల్పవృక్షము. అనగా మన కోరికలను తీర్చేది. భక్తితో తలచినంతనే కల్పవృక్షంలా వరములిచ్చే స్వామి ఆ శ్రీనివాసుడు. అలాగే చింతామణి కూడా. మనలను కష్టాలలో కాపాడి శక్తినిచ్చే చింతామణి ఆ వేంకటపతి. ఈ కోవకు చెందినదే కామధేనువు. స్వార్థం లేకుండా భక్తితో శరణాగతితో తలచినంతనే వాటిని సాకారం చేసే గోమాత ముక్కోటి దేవతలకు నెలవు. ఆ కామధేనువు వంటి వాడు కలియూగంలో తిరుమలలో వెలసిన స్వామి. మనలను ఎల్లవేళలా కాపాడే ఆ ధరణీపతి ఆయన. ఈ భావాన్ని ఎంతో రమ్యంగా రెండవ చరణంలో అన్నమయ్య తెలిపారు. తప్పుదారి పట్టిపోయే మానవులను సరైన మార్గంలో నడిపించి బ్రతుకు దారి చూపించే సిద్ధ మంత్రము ఆ స్వామి. మనలోని రోగాలను మాయం చేసి కాపాడే ఔషధము వంటి వాడు ఆ శ్రీనివాసుడు. ఇక్కడ రోగాలంటే దేహానికి సంబంధించినవే కాదు, మనసులోని మాలిన్యాలు కూడా. భక్తుల కోసం అలసిపోకుండా వారి వెంటే ఉండి రక్షించే ప్రాణబంధువు ఆ స్వామి. ఈ సృష్టి స్థితికి కారణమైన వాడు ఆ శ్రీవేంకటపతి. ఈ విధంగా మూడవ చరణంలో స్వామిని భవరోగ వైద్యునిగా, ప్రాణబంధువుగా, పరమాత్మగా ప్రస్తుతించారు అన్నమయ్య.

కలియుగంలో శ్రీవేంకటేశ్వరుని వైభవాన్ని, మహాత్మ్యాన్ని  అన్నమాచార్యుల వారు ఆయన వేల సంకీర్తనల ద్వారా మనకు అనుభవపూర్వకంగా దార్శనికుడై అందించాడు. అందుకే ఆయన సంకీర్తనలు ఏవో మామూలు పాటలు కావు. అవి మంత్రసమానమైనవి. వాటిలోని భావాన్ని అర్థం చేసుకుంటే మనలోని మాలిన్యాలను తొలగించుకొని మనలోనే ఉన్న స్వామిని కనుగొనేందుకు అవి అద్భుతమైన సాధనాలు. శ్రీగురుభ్యో నమః.

ఈ సంకీర్తనను అన్నమాచార్యుల వారి సంకీర్తనా సారాన్ని మనకు అందించే సేవను హైదరాబాదులోని అన్నమాచార్య భావనా వాహిని ద్వారా ముడున్నర దశాబ్దాల నుండి నిస్స్వార్థంగా అందిస్తున్న డాక్టర్ శోభారాజు గారి గాత్రంలో మోహనరాగంలో వినండి. ఈ సంకీర్తనను అన్నమయ్య చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారు చాలా భావపూరితంగా పాడారు. 

శంకరభగవత్పాద విరచిత హనుమద్ పంచరత్న స్తోత్రం


వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్

తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్

శంబరవైరిశరాతిగమంబుజదళ విపులలోచనోదారమ్
కంబుగళమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే

దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః

వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్

ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి

అన్ని కోరికలను జయించిన వాడు, ఆనందబాష్పాలతో రామభక్తి సామ్రాజ్యంలో పులకించే వాడు, అత్యంత నిర్మలమైన వాడు, రామదూత అయిన వాయుపుత్రుని నా హృదయములో ధ్యానిస్తున్నాను.

ఎర్రని సూర్యుని వంటి ముఖ కమలము కల వాడు, కరుణారసమును కన్నుల నిండా కలిగిన వాడు, సంజీవనితో ప్రాణాలను నిలిపే వాడు, మంజుల మహిమాన్వితుడైన అంజనీ వరపుత్రుని నేను తలచుచున్నాను.

మన్మథుని బాణముల కన్నా వేగవంతుడు, వికసించిన కలువల వంటి కన్నులలో కరుణ కలిగిన వాడు, శంఖము వంటి మంచి ఆకృతితో కంఠం కలవాడు, వాయుదేవునకు ప్రియుడు, ఎర్రని దొండపండు వలె ప్రకాశించే పెదవులు కలిగిన హనుమంతుని నేను శరణు కోరుచున్నాను.

సీత ఆర్తిని దూరం చేసిన వాడు, రామ వైభవానికి స్ఫూర్తికారకుడు, దశముఖ రావణుని కీర్తిని పటాపంచలు చేసిన వాడు అయిన హనుమంతుని రూపము నా ఎదుట నిలచు గాక.

వానర సమూహానికి నాయకుడు, రాక్షససమూహమనే తెల్లకలువల పాలిట సూర్యకిరణముల వంటి వాడు (తెల్ల కలువలు రాత్రి విరిసి సూర్యకిరణాలకు వాడిపోతాయి), దీనజనులను కాపాడే దీక్షలో ఉన్నవాడు, వాయుదేవుని తపః ఫల సంపన్నుడు అయిన హనుమంతుని దర్శిస్తున్నాను.

పంచరత్నమనే ఈ స్తోత్రాన్ని పఠించిన వారు ఇహములో సమస్త భోగభాగ్యములను పొంది శ్రీరామభక్తి అనే పరభాగ్యమును పొందెదరు.

శంకరభగవత్పాద విరచిత హనుమద్ పంచరత్న స్తోత్రాన్ని బొంబాయి సోదరీమణులు సరోజ-లలిత ఆలపించగా వినండి

భవనుత నా హృదయమున రమింపుము - త్యాగరాజస్వామి కృతి

భవనుత నా హృదయమున రమింపుము బడలిక దీర భవతారక నాతో బహుపల్కిన బడలిక దీర కమల సం"భవనుత" పవనసుతప్రియ తనకై తిరిగిన బడడలిక దీర భవనము చేరి న...