రాముడు పరంధాముడు. అనగా సర్వాంతర్యామి లేదా పరమాత్మ. పొత్తూరి వేంకటేశ్వరరావు గారి పారమార్థిక పదకోశం ప్రకారం పరమాత్మ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో కొన్ని
1. స్వయం ప్రకాశం కలిగి, జ్ఞానరూపమైన ఆత్మ.
2. కార్యకారణాలకంటే భిన్నమై, క్షరాక్షరాల కంటే కూడావేరుదై, స్వాభావికంగా నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, ముక్తమైన పదార్థం.
3. అవిద్య వల్ల ఆత్మగా తలచిన దేహం మొదలు బుద్ధివరకు ఉన్న తత్త్వాలకు అతీతమైనది. సర్వోత్కృష్టమైనదీ, ఉపద్రష్టృత్వాది విశేషణ విశిష్టమై ప్రకాశించే ఆత్మ.
4. ఆత్మగా కల్పితాలైన పంచ కోశాలకు, విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత తత్త్వాలకు అతీతమై, బ్రహ్మకు పూర్వం నుంచి ఉన్న పదార్థం.
5. సమస్త భూతాలలోని ప్రత్యక్చేతనం.
6. మాయాశక్తికి ఆశ్రయం.
7. సర్వానికి అధిష్ఠానమైనది.
8. పర దేవత.
9. దైవం / పరబ్రహ్మం.
వీటన్నిటి ద్వారా మనకు తెలిసేది ఏమిటి? శాశ్వతమైన గుణాతీతమై, అక్షరమై సమస్త జీవరాశులయందు ఉన్న చైతన్యమే పరమాత్మ.
రామావతారంలో ఉన్న గొప్పతనం ఆయన సామాన్య మానవునిగా, ప్రభువుగా ధర్మబద్ధతతో నడచుకొని పరంధాముడైనాడు. ఆయన అవతారం ప్రతి మానవునికీ ఒక పాఠం, ఆదర్శం మరియు ఆధ్యాత్మిక సోపానానికి స్ఫూర్తిదాయకం. ఏ విధంగా మసలుకుంటే మానవుడు దివ్యత్వాన్ని పొందుతాడో రాముడు తన నడవడికతో తెలిపాడు. పరంధాముడైన ఆ రాముని నుతించే ఏ గీతమైనా మధురమే. రామ నామంలోని శక్తి అది. రాముని జీవనశైలిలోని మహత్తు అది. ఓం నమో నారాయణాయ అనే మంత్రంలోని రా అనే బీజాక్షరం, ఓం నమశ్శివాయ అనే శివ పంచాక్షరీ మంత్రంలోని మ అనే బీజాక్షరం కలిసి రామ నామ ఆవిర్భవించిందని ఒక అభిప్రాయం. పద్మపురాణం ప్రకారం యోగులను సచ్చిదానందంలో రమింపజేసేది రామ అని అర్థం. తారకమనే ఘనత రామనామానికి మాత్రమే. రామ అనే బీజాక్షరాలను ఉచ్చరించటం వలన పాపాలు పటాపంచలై పోతాయని సనాతన ధర్మం ఘోషిస్తుంది. సంసార సాగరాన్ని దాటించేది కాబట్టి భవతారకమై ఈ తారక నామము భక్తులను ఉద్ధరిస్తోంది. వహ్నిగర్భమైన ఈ నామం పాపనాశనం చేసి ముక్తిని ప్రసాదించేది.
రాముని వైభవాన్ని తెలిపే గీతాలు చలన చిత్రాలలో ఎన్నో వచ్చాయి. 1963లో విడుదలైన లవకుశ చలనచిత్రం ఒక్క తెలుగు భాషలోనే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆణిముత్యం. ఆధ్యాత్మికతను, పవిత్రతను ప్రతి అడుగులోనూ చాటే ఈ చిత్రంలో సముద్రాల రాఘవాచార్యుల వారు ఎన్నో గీతాలను రచించారు. వాటిలో ఒకటి శ్రీరాముడు-లవకుశుల సంగ్రామ ఘట్టంలో హనుమతో పాటు వాల్మీకి మహర్షి శిష్య బృందం పాడే గీతం శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ. సాహిత్యం:
శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ
రఘురామ రామ రణరంగ భీమ జగదేక సార్వభౌమ
సూర్యాన్వయాబ్ధి సోమ సుగుణాభిరామ శుభనామ
కారుణ్యధామ దశకంఠ విరామ రాఘవ రాజలలామ
సాకేతపురాధిప రామ సీతామనోహర శ్రీరామ
అరవిందలోచన సుందర సురుచిర ఇందీవర శ్యామ
శ్రీరాముని పరమాత్మగా నుతిస్తూ ఆయనకు జయము పలికారు రాఘవాచార్యుల వారు. రఘువంశంలో జన్మించిన వానిగా, యుద్ధరంగంలో అరివీర భయంకరునిగా, ఈ విశ్వంలో ఏకైక సార్వభౌమునిగా కొలిచారు. సూర్యవంశమనే సముద్రానికి చంద్రుని వంటి వానిగా, సుగుణాలతో శోభిల్లే వానిగా, శుభమైన నామము కాలిగి, కరుణకు నెలవై, రావణుని సంహరించిన రాజశ్రేష్ఠునిగా రాముని స్తుతించారు. సాకేతపురానికి రాజుగా, సీత మనసు దోచుకున్న వానిగా, కలువలవంటి కన్నులు కలవానిగా, సుందరమైన, మనోజ్ఞమైన రూపముగల లక్ష్మీపతి అయిన నీలమేఘ శ్యామునిగా అభివర్ణించారు.
రామభక్తి సామ్రాజ్యంలో ఆ పరంధాముని కీర్తించే భావ సుమాలు ఎన్నో! వాగ్గేయకారుల సంకీర్తనలు, భావ కవుల భక్తి రసఝరులు, పల్లె పదాలు...ఇలా ప్రతి కళారూపంలోనూ స్వామిని అద్భుతంగా వర్ణించబడిన వాడు ఆ రాముడు. లవకుశ చిత్ర దర్శకులు ఈ గీతాన్ని దాదాపుగా భజన రూపంలో తన్మయత్వంతో భక్త సమూహంపై చిత్రీకరించారు. ఘంటసాల మాష్టారు సంగీతంలో అత్యంత భక్తిపూరితంగా ఉండే ఈ సముద్రాల వారి గీతాన్ని సుశీలమ్మ, లీల గారు, జమునారాణి గారు కలిసి అద్భుతంగా, శ్రవణ మనోహరంగా గానం చేశారు. ఈ పాట వింటే హనుమద్భక్తి కళ్ల ముందు నిలుస్తుంది. రోమాంచమవుతుంది. శరీరం పులకితమై మనసు రామనామ రసామృతంలో ఓలలాడుతుంది. రామభక్తి యొక్క గొప్పతనం అదే. రూపంలోను, గుణాలలోనూ, ప్రవర్తనలోనూ, యుద్ధపటిమలోనూ మహా సంపన్నుడు రాముడు. అందుకే లోకాభిరాముడైనాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి