RightClickBlocker

19, ఫిబ్రవరి 2017, ఆదివారం

నాదోపాసన - త్యాగరాజస్వామి వారి శోభిల్లు సప్తస్వరశోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా

నాభి హృత్కంఠ రసన నాసాదులయందు 

ధర ఋక్సామాదులలో వర గాయత్రి హృదయమున 
సురభూసుర మానసమున శుభ త్యాగరాజాదులలో

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః - నాదోపాసనా రసామృతాన్ని సమస్త జీవరాశులు ఆనందిస్తాయన్నది ఆర్యోక్తి.

శృతిలయలతో కూడిన సంగీతం దివ్యత్వానికి ఆలవాలం. ఓంకారం నుండి ఆవిర్భవించిన సప్తస్వరాలతో కూడిన సంగీతంలో రమించేవారు దేవతలు. నాదంతో సృష్టిస్థితిలయములు అనుసంధానమై ఉన్నాయి. నిరంతరం అనంతమైన వాహినిలా ప్రవహించే విశ్వజనీనశక్తి నాదరూపమై ఉంది. పొత్తూరి వేంకటేశ్వరరావు గారి పారమార్థిక పదకోశంలో నాదం అనే పదం అద్భుతంగా నిర్వచించబడింది. దాని ప్రకారం -  శరీరంలోని ఆత్మ మనస్సును, మనస్సు వహ్నిని, వహ్ని వాయువును ప్రేరేపించినప్పుడు వాయువు బ్రహ్మ గ్రంధియగు మూలాధారం నుంచి ఊర్ధ్వ ముఖంగా నాభి, హృదయం, కంఠం, శిరస్సు, ముఖం చేరి కలిగించే ధ్వని ‘నాదం’. బ్రహ్మ స్వరూపమైనది నాదం. నాభికి పైన హృదయ స్థానం నుంచి బ్రహ్మ రంధ్రం వరకు ధ్వనించే ప్రాణ వాయువు. ఆకాశం, వాయువు, అగ్ని అనే మూడు భూతాల నుంచి పుట్టి నాభికి పైన ధ్వనిస్తూ, ముఖంలో అతి స్పష్టంగా వ్యక్తమయ్యే వాయువు ఈ నాదం. ఇది అక్షర సత్యం.

త్యాగరాజ స్వామి ఈ నాదోపాసనలోని మహత్తును ఎన్నో కృతుల ద్వారా తెలిపారు. వాటిలో నాదతనుమనిశం శంకరం, నాదసుధారసంబిలను మరియు శోభిల్లు సప్తస్వర ఈ సందేశాన్ని సుస్పష్టం చేశాయి. ప్రణవము నుండి జన్మించిన నాదమనే అమృత రసము ఈ భువిపై నరాకృతిగా రాముడై వెలసినట్లు త్యాగయ్య తెలిపారు. వేదశాస్త్రపురాణాలకు నాదం ఆధారమని నొక్కి వక్కాణించారు. ఎందు వలన? వేదాలు ఒకరిచే రాయబడినవి కాదు. విశ్వజనీనమైన శక్తి ఆయా ఋషుల నోట శబ్దరూపమున వెలువడినవి. శబ్దమునకు మూలం ఓంకారం. అందుకే ప్రణవానికి మన సనాతన ధర్మంలో అంత ప్రాధాన్యత ఉంది. త్యాగరాజ స్వామి రాముని అవతారాన్ని నాదంతో అనుసంధానం చేశారు. ఆయన కోదండమే సప్తస్వరాలను పలికించే సాధనంగా, రాగములు బాణములుగా, నెరవులు మరియు సంగతులు స్వామి పలుకులుగా నుతించారు. అలాగే, నిరంతరం తనువంతా నాదముతో నిండిన వానిగా శివుని స్తుతించారు. శివుని సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనబడే పంచముఖములనుండి సప్తస్వరములు జనించినట్లు తెలిపారు. ఇలా ఈ విశ్వమంతా నాదపూరితమై ఉన్నట్లు స్పష్టంగా మనకు అనే కృతుల ద్వారా నిరూపించారు. అటువంటి కృతే శోభిల్లు సప్తస్వర.

ఈ కృతిలో త్యాగరాజ స్వామి సప్తస్వరాలతో శోభిల్లే సుందరమైన దేవతలను నుతించాలని మనసుకు చెబుతున్నారు. ఈ సప్తస్వరాలు నాభి మొదలు, హృదయము, కంఠము, నాలుక మరియు నాసిక యందు శోభిల్లుతాయి. పైన పొత్తూరి వేంకటేశ్వర రావు గారు చెప్పిన నాదం యొక్క నిర్వచనం త్యాగరాజస్వామి వారి భావనతో ఏకీభవించినట్లే కదా? అలాగే, ఈ భూమిలో ఋగ్, సామ మొదలైన వేదములలో, గాయత్రీ మంత్ర మధ్యమున, దేవతల, ఉత్తములైన మానవుల మనస్సులలో ఈ సప్తస్వరాలు శోభిల్లుతాయని త్యాగరాజస్వామి పలికారు.

గాయకుడు భావాన్ని ఆకళింపు చేసుకొని, ఆయా దేవతా స్వరూపాన్ని సగుణ ధ్యానం చేసి, భావానికి సొంపైన రాగయుక్తంగా సప్తస్వరమేళనంగా శాస్త్రీయ సంగీత ఆలాపన చేస్తే ఆయా దేవతా రూపాలు తప్పకుండా ఆ కళాకారుని దేహంలో వసిస్తారు. అలా నిత్యం సాధన చేసిన కళాకారులు దివ్యత్వన్ని పొందుతారు. అందుకే శాస్త్రీయ సంగీతమే జీవితంగా భావించిన ఎందరో మహా కళాకారులు జీవబ్రహ్మైక్యాన్ని పొందారు. దేహాత్మ స్ఫురణల విచక్షణా జ్ఞానాన్ని నిరంతరం కలిగి స్థితప్రజ్ఞులైనారు. నాదోపాసన అంత మహత్తరమైనది. ఓంకార జనితమైన షడ్జమాది నాదములు అమృతమాలికలుగా అల్లబడి పదములకు మంత్ర సిద్ధి వంటి శక్తిని కలిగించి ఒక్కొక్క కృతి ఆధ్యాత్మిక సోపానంలో ఒక్కో మెట్టుగా ఉపకరిస్తున్నాయి. అందుకే శాస్త్రీయ సంగీత కీర్తనలు స్వర రాగ లయ భావములకు సమానమైన స్థానం ఉండి భక్తి సుగంధాన్ని అలదుకొని శాశ్వత సాఫల్యాన్ని పొందాయి. ఈ నాదోపసన యొక్క ఔన్నత్యాన్ని ఎందరో వాగ్గేయకారులు మనకు తరతరాలుగా అందిస్తున్నారు. అందరిలోకీ, త్యాగరాజస్వామి దాని మహాత్మ్యాన్ని అద్భుతంగా ఇటువంటి కీర్తనల ద్వారా మనకు వెలలేని వారసత్వ సంపదగా అందించారు.

శోభిల్లు సప్తస్వర అనే కృతి జగన్మోహిని రాగంలో కూర్చబడింది. రాగం ఈ కృతిలోని భావాన్ని చక్కగా ప్రకటితం చేస్తుంది. అలాగే, సందేశానికి ఔన్నత్యాన్ని కలుగజేస్తుంది. నాదం యొక్క గొప్పతనాన్ని తెలిపే భావానికి జగన్మోహిని వంటి గంభీరమైన రాగం చాలా సముచితం. మాయామాళవగౌళ రాగం ఈ జగన్మోహినికి జన్య రాగం. ఈ త్యాగరాజస్వామి కీర్తనను భారతరత్న బిరుదాంకిత శ్రీమతి మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి గారి గాత్రంలో వినండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి