11, ఫిబ్రవరి 2017, శనివారం

తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా


పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా! మమ్మునెడయక వయ్యా! కోనేటి రాయడా!

కోరి మమ్మునేలినట్టి కుల దైవమా! చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా!
గారవించి దప్పి దీర్చు కాల మేఘమా! మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా! 

భావింప గైవసమైన పారిజాతమా! మమ్ము చేవ దీర గాచి నట్టి చింతామణీ! 
కామించి కోరికలిచ్చే కామధేనువా! మమ్ము తావై రక్షించేటి ధరణీధరా! 

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా! రోగాలడచి రక్షించే దివ్యౌషధమా! 
బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా! మమ్ము  గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా!

తాత్పర్యం:

ఓ పురుషోత్తముడా! నీ రూపాన్ని కాంచితిమి! మమ్ములను విడిచి వెళ్లకు ఓ వేంకటేశ్వరా!

మమ్ములను కాపాడే కులదైవమా! బాగా సాధన చేసిన పెద్దలు మాకందించిన నిధివి నీవు! ఆదరించి దప్పిక తీర్చే నల్లని మేఘాలవంటి వాడవు! మాకు దగ్గరగా చిత్తములో ఉన్న శ్రీనివాసుడవు నీవు!

తలచినంతనే మాకు దక్కే పారిజాతము నీవు! మమ్ములను కాపాడి శక్తినిచ్చే చింతామణివి నీవు! కోరినంత కోరికలను తీర్చే కామధేనువు నీవు! మాకు నీడయై రక్షించేటి ధరణీపతివి నీవు!

మేము చెడిపోకుండా బ్రతికించే సిద్ధమైన మంత్రానివి నీవు! మా రోగాలను మటుమాయం చేసి కాపాడే దివ్యమైన ఔషధము నీవు! మా వెంటే ఉండే ప్రాణ బంధువు నీవు! మమ్ములను సృష్టించిన శ్రీవేంకటనాథుడవు నీవు!

భావార్థం:

తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో ఈ పొడగంటిమయ్యా ఓ ప్రత్యేకమైనది. శ్రీనివాసుని మహత్తును మూడు చరణాలలో అద్భుతంగా ఆయన వర్ణించారు. ఎందరికో కులదైవమైన ఈ శ్రీవేంకటేశ్వరుడు తన భక్తులను కాపాడుతూ కలియుగంలో మనకు రక్షగా ఉన్నాడు. ఆ భావనను ఈ సంకీర్తనలో మనకు అన్నమయ్య ఎంతో చక్కగా వివరించారు. యోగులు, సిద్ధులు, తపస్సంపన్నులు సాధనతో దర్శించిన స్వామి మన పాలిటి ఎనలేని సంపద. దాహంతో ఉన్నప్పుడు కాలమేఘంలా సమృద్ధిగా వర్షించే వానిగా శ్రీనివాసుని అన్నమయ్య మొదటి చరణంలో నుతించారు. పారిజాత వృక్షము మన పురాణాలలో చెప్పబడిన కల్పవృక్షము. అనగా మన కోరికలను తీర్చేది. భక్తితో తలచినంతనే కల్పవృక్షంలా వరములిచ్చే స్వామి ఆ శ్రీనివాసుడు. అలాగే చింతామణి కూడా. మనలను కష్టాలలో కాపాడి శక్తినిచ్చే చింతామణి ఆ వేంకటపతి. ఈ కోవకు చెందినదే కామధేనువు. స్వార్థం లేకుండా భక్తితో శరణాగతితో తలచినంతనే వాటిని సాకారం చేసే గోమాత ముక్కోటి దేవతలకు నెలవు. ఆ కామధేనువు వంటి వాడు కలియూగంలో తిరుమలలో వెలసిన స్వామి. మనలను ఎల్లవేళలా కాపాడే ఆ ధరణీపతి ఆయన. ఈ భావాన్ని ఎంతో రమ్యంగా రెండవ చరణంలో అన్నమయ్య తెలిపారు. తప్పుదారి పట్టిపోయే మానవులను సరైన మార్గంలో నడిపించి బ్రతుకు దారి చూపించే సిద్ధ మంత్రము ఆ స్వామి. మనలోని రోగాలను మాయం చేసి కాపాడే ఔషధము వంటి వాడు ఆ శ్రీనివాసుడు. ఇక్కడ రోగాలంటే దేహానికి సంబంధించినవే కాదు, మనసులోని మాలిన్యాలు కూడా. భక్తుల కోసం అలసిపోకుండా వారి వెంటే ఉండి రక్షించే ప్రాణబంధువు ఆ స్వామి. ఈ సృష్టి స్థితికి కారణమైన వాడు ఆ శ్రీవేంకటపతి. ఈ విధంగా మూడవ చరణంలో స్వామిని భవరోగ వైద్యునిగా, ప్రాణబంధువుగా, పరమాత్మగా ప్రస్తుతించారు అన్నమయ్య.

కలియుగంలో శ్రీవేంకటేశ్వరుని వైభవాన్ని, మహాత్మ్యాన్ని  అన్నమాచార్యుల వారు ఆయన వేల సంకీర్తనల ద్వారా మనకు అనుభవపూర్వకంగా దార్శనికుడై అందించాడు. అందుకే ఆయన సంకీర్తనలు ఏవో మామూలు పాటలు కావు. అవి మంత్రసమానమైనవి. వాటిలోని భావాన్ని అర్థం చేసుకుంటే మనలోని మాలిన్యాలను తొలగించుకొని మనలోనే ఉన్న స్వామిని కనుగొనేందుకు అవి అద్భుతమైన సాధనాలు. శ్రీగురుభ్యో నమః.

ఈ సంకీర్తనను అన్నమాచార్యుల వారి సంకీర్తనా సారాన్ని మనకు అందించే సేవను హైదరాబాదులోని అన్నమాచార్య భావనా వాహిని ద్వారా ముడున్నర దశాబ్దాల నుండి నిస్స్వార్థంగా అందిస్తున్న డాక్టర్ శోభారాజు గారి గాత్రంలో మోహనరాగంలో వినండి. ఈ సంకీర్తనను అన్నమయ్య చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారు చాలా భావపూరితంగా పాడారు. 

1 కామెంట్‌: