ఉత్సవ సాంప్రదాయ కీర్తనలలో త్యాగరాజస్వామి తన ఇష్టదైవానికి రోజూ జరిగే వేడుకల వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో మేలుకొలుపు, ఆవాహనములు, సమస్త ఉపచారములు, సీతారామ కళ్యాణోత్సవము, నివేదనలు, ఉయ్యాల సేవలు,మంగళ హారతులు, రక్షా ధారణ, పవ్వళింపు సేవలు, లాలి పాడే కృతులు ఉన్నాయి. ఇవి మొత్తం 26 కృతులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కీర్తనల ద్వారా ఆనాటి అర్చనా విధులను తెలుసుకునే అవకాశం త్యాగరాజస్చామి మనకు కలిగించారు. ఈ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలలో కొన్నింటిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడి చాలా ప్రచారంలోకి తీసుకు వచ్చారు. మేలుకో దయానిధీ అన్న కీర్తన వాటిలో మేలుకొలుపు కీర్తనగా పేరొందింది.
మేలుకో దయానిధి మేలుకో దాశరథి
మేలుకో దయానిధి మిత్రోదయమౌ వేళ
నారదాది మునులు సురలు వారిజభవుడిందు కళా
ధారుడు నీ సన్నిధినే కోరి కొలువ గాచినారు
వెన్న పాలు బంగారు గిన్నెలోనేనుంచినాను
తిన్నగారగించి తేట కన్నులతో నన్ను జూడ
రాజరాజాది దిగ్రజులెల్ల వచ్చినారు
రాజనీతి తెలియ త్యాగరాజ వినుత నన్ను బ్రోవ
ఈ కీర్తనలో ఆ రాముని సూర్యోదయ సమయాన మేలుకొమ్మని త్యాగరాజ స్వామి అనేక విధాల వేడుకున్నారు. "ఓ దయాసముద్రుడవైన దశరథ రామా! మేలుకో! సూర్యోదయమగుచున్నది. నారదుడు మొదలైన మునులు, దేవతలు, చతుర్ముఖ బ్రహ్మ, శివుడు మొదలైన వారు నీ సన్నిధిని కోరి నిన్ను కొలుచుటకు వేచియున్నారు. వెన్న, పాలు బంగారు గిన్నెలలో నీ కోసం నేనుంచాను. చక్కగా వాటిని ఆరగించి తేటైన కన్నులతో నన్ను చూడుము. కుబేరుడు మొదలైన దిక్పాలకులు వచ్చారు. నీ దగ్గర రాజధర్మాన్ని నేర్చుకోవాలని వేచియున్నారు. ఓ రామా! నన్ను బ్రోచుటకు మేలుకో!" అని రాముని కోరారు.
ఏ వాగ్గేయకారుని కృతులను పరిశీలించినా వారి జీవిత గమనంతో పాటు ఆధ్యాత్మిక సోపానం వారి కృతుల ద్వారా మనకు కనబడుతుంది. త్యాగరాజస్వామి కీర్తనల్లో కూడా ఈ పురోగతి మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. సగుణోపాసనలో ఉండే మాధుర్యం, ఆ పరమాత్మను జీవాత్మకు వేరుగా చూసి ఆరాధించే భక్తి, ఆ ఉపాసనలోని సేవలలో రమించే తీరు ఆయా కృతులలో మనకు కనబడుతుంది. సగుణోపాసనలో దేవతా స్వరూపాలను మూర్తులలోకి ఆవాహనం చేసి, ఉపచారములు చేసి, నివేదనలు చేసి, స్తుతించి ఆ పరమాతను కళ్లెదుట దర్శించే భావన ఎంతో మధురమైనది. ఇది సామాన్య మానవుని హృదయంలో త్వరగా నమ్మకాన్ని విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే, ఈ సేవలు మన ఇంటికి ఎవరైనా మహానుభావులు వస్తే చేసే సేవలవంటివే. కాబట్టి వెంటనే మనసుతో అనుసంధానం కలుగుతుంది. పూర్వజన్మ సంస్కారాలు మరియు ఈ జన్మ కర్మ ఫలాలను బట్టి ఏదో ఒకనాడు సగుణోపాసన నుండి, ఇది కాదు, దీనిని మించినది పరమాత్మ తత్త్వం అని అవగతమై నిర్గుణోపాసన వైపు మానవుడు మరలుతాడు. అది ఆ జన్మలో కావచ్చు, మరు జన్మలో కావచ్చు. త్యాగరాజస్వామి వారు జీవితంలోని మలిభాగంలో రచించిన కీర్తనలలో కొంత నిర్గుణోపాసన కనబడుతుంది.
ఈ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలన్నీ సగుణోపాసనను మూలంగా చేసుకున్నవే. ఆవాహనం, అలంకరణం, ఉపచారములు, నివేదనములు..అన్నీ ఆ విగ్రహంలో దేవతామూర్తి స్థిరుడై ఉన్నాడన్న ప్రగాఢ విశ్వాసంతో కూడినవి. స్థావర జంగమాలన్నిటా పరమాత్మ ఉన్నాడన్న మన వేదవాఙ్మయ ఘోషను సగుణోపాసన తు.చ తప్పకుండా పాటిస్తుంది. దీనిలోని మాధుర్యం అనుభవైకవేద్యం. త్యాగరాజస్వామి ఈ అనుభవాలను తన కృతులలో వివరంగా, మనోజ్ఞంగా, భక్తిభరితంగా, భావగర్భితంగా రచించారు. మేలుకొలుపు సేవ చేసి తనను బ్రోవమని ఈ కృతిద్వారా ఆయన వేడుకున్నారు. బాలమురళిగారి గానంలో ఈ కృతి వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి