అన్న రామన్నకు నీడగా నిలచి ఆయన సేవే తన జీవితంగా భావించి, అన్నను నిరంతరము సేవించిన ఆ లక్ష్మణుడిది ఏమి భాగ్యమో కదా? రాజభోగాలను వదలి, ధర్మపత్నికి దూరంగా పదునాలుగేండ్లు వనవాసానికి వెళ్లిన ఆ సౌమిత్రికి అన్న అంటే ఎంత గౌరవమో ప్రేమో రామాయణంలో ఎన్నో సందర్భాలలో మనకు సుస్పష్టంగా అవగతమవుతుంది. వనవాస నిర్ణయం, భరతుడు-రాముడు కలిసే సన్నివేశం, మాయలేడి ఘట్టం, రామ-రావణ యుద్ధం...వీటన్నిటా లక్ష్మణుడు అన్నకు వెన్నుదన్నుగా నిలిచాడు. అందుకే రామునికి సోదరుడంటే ఎంతో ప్రేమ. ఆ అన్నకు సేవలో తరించిన లక్ష్మణుని గురించి త్యాగరాజ స్వామి ఎన్నో సంకీర్తనలలో పలికారు.
శ్రీరామ జయరామ శృంగార రామయని చింతించ రాదె ఓ మనసా అన్న కృతిలో "తమి మీర పరిచర్య సేయ సౌమిత్రి మును తప మేమి చేసెనో తెలియ" అని నుతించి ఆ లక్ష్మణుని పరిచర్యల గొప్పతనాన్ని చాటారు. కంటజూడుమీ అనే కృతిలో "అలనాడు సౌమిత్రి పాద సేవ చెలరేగి సేయు వేళ సీతతో పలికి చూచినంత పులకాంకితుడై " అని రాముడు లక్ష్మణుని సేవతో ఎంత సంతోషించాడో తెలిపాడు. అలాగే కనుగొంటిని శ్రీరాముని అనే కీర్తనలో "భరత లక్ష్మణ శతృఘ్నులు కొలువ" అని కొనియాడారు. దాచుకోవలెనా దాశరథి నీ దయ అనే కృతిలో "నేమమున బరిచర్య నేర్పున బొగడు వేళ సౌమిత్రి త్యాగరాజుని మాట బల్కితే" అని ప్రస్తావించారు. వెడలెను కోదండపాణి అనే కృతిలో "సౌమిత్రితో గూడి" అని రామలక్ష్మణుల జంటను నుతించారు. ఎన్నడు జూతునో ఇనకుల తిలకుని అనే కృతిలో "ధరణిజ సౌమిత్రి భరత రిపుఘ్న వానర యూధపతి వరుడాంజనేయుడు కరుణను ఒకరు ఒకరు వర్ణింపనాదరణను బిలిచే నిను త్యాగరాజార్చిత" అని తనను కొలిచే భరత లక్ష్మణాదులను ఆ రాముడు ఎలా ఆదరించాడో తెలిపారు. పక్కల నిలబడి అనే కీర్తనలో "సుదతి సీతమ్మ సౌమిత్రి శ్రీరామునికిరుప్రక్కల నిలబడి" అని రామ వైభవాన్ని వర్ణించారు. ఇలా ఎన్నో కీర్తనలలో లక్ష్మణుని ప్రస్తావన ఉంది. మరి ఆ లక్ష్మణుడి ఘనత ఎంత గొప్పదో ఊహించండి?
నిద్రాహారాలు మాని 14 ఏళ్ల పాటు సీతారాములను వనవాసంలో సేవించి కంటికి రెప్పలా కాపాడిన వాడు లక్ష్మణుడు. స్వయంగా ఆదిశేషువు అవతారమైన లక్ష్మణుడు రాముని సగభాగం వంటి వాడు. లక్ష్మణ రేఖను ఆ రావణాసురుడు కూడా దాటలేకపోయాడు. ఒకేమారు 500 బాణాలు వేయగల విలువిద్యా నేర్పరి. సీతా వియోగంతో దుఃఖంలో ఉన్న రాముని ఓదార్చిన వాడు లక్ష్మణుడు. రామ-రావణ సంగ్రామంలో ఇంద్రజిత్తు వంటి మహావీరుని సంహరించిన ధీరుడు లక్ష్మణుడు. పుట్టుక నుండి అవతార సమాప్తి వరకు అన్న వెనుక ఉన్న వాడు ఆ లక్ష్మణుడు.
ఈ లక్ష్మణ ప్రస్తావన కలిగిన త్యాగరాజస్వామి కృతులలో మరో కీర్తనను పరిశీలిద్దాం.
సౌమిత్రి భాగ్యమే భాగ్యము
చిత్ర రత్నమయ శేషతల్పమందు సీతాపతిని యూచు
బాగుగ వింత రాగముల ఆలాపన సేయగ మేను పులకరించగ
త్యాగరాజ నుతుడౌ శ్రీరాముని తత్వార్ధమును పొగడి జూచే
ఆ లక్ష్మణుడు అన్నకు చేస్తున్న సేవను త్యాగరాజ స్వామి సౌమిత్రి భాగ్యమే భాగ్యము అన్న ఈ కీర్తనలో అద్భుతంగా వర్ణించారు. రత్నమణిమయమైన శేషతల్పమైన ఊయలలో ఊగే రాముని కొలిచే లక్ష్మణుని భాగ్యమే భాగ్యము అని ప్రస్తుతించారు. చెవులకింపైన రాగములను వాద్యకళాకారులు పలికించగా ఆ లక్ష్మణుని మేను పులరించిందట. ఆ శ్రీరాముని తత్త్వములను పొగడే వర్ణనలను విని, చూచి తరించే లక్ష్మణుడి ఎంత భాగ్యమో అని త్యాగరాజస్వామి పలికారు. ఈ కీర్తనను హైదరాబాద్ సోదరులు ఆలపించగా వినండి.
రాముని సేవాభాగ్యం పొందిన వారిలో సీతా లక్ష్మణులు, భరతుడు, శతృఘ్నుడు, హనుమంతుడు, గుహుడు, విభీషణుడు, సుగ్రీవుడు...ఇలా ఎందరో. నిరంతర సేవా భాగ్యంలో తరించిన లక్ష్మణుడు రామావతార పరిపూర్ణతకు ఎంతగానో తోడ్పడ్డాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి