21, ఫిబ్రవరి 2016, ఆదివారం

తొలిరేయి గీతాలు - నన్ను దోచుకుందువటే (గులేబకావళి కథ)


తొలిరేయిన భార్యలో ఆరాధనా భావం కలిగితే మగవానిలో అనుబంధం శాశ్వతమైనది అనే పవిత్రమైన భావం కలుగుతుంది. భర్తలో భార్య పట్ల ప్రేమానురాగాలతో పాటు బాధ్యత అనే మొక్క చిగురిస్తుంది. భార్యకు అన్నీ భర్తే అన్న ఉదాత్తమైన భావన మొలకెత్తుతుంది. ఒకరి మనసు ఒకరి దోచుకోవటంతో నేను అన్న భావన తొలగి మేము అన్న భావన వికసిస్తుంది. ఇద్దరు మనుషులైనా ఒకే నావలో ప్రయాణించే సమయం ఆసన్నమవుతుంది. 1962లో విడుదలైన గులేబకావళి కథ చిత్రంలో "నన్ను దోచుకుందువటే" అనే గీతం తొలిరేయికి సంబంధించినదే. జానపద ఇతివృత్తంతో ఎన్‌టీరామారావు గారు, కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఈ గీతాన్ని రచించారు, జోసెఫ్-కృష్ణమూర్తిగార్లు సంగీతాన్ని అందించారు. తొలిరేయి గీతాల శీర్షికన రెండో సంచికల "నన్ను దోచుకుందువటే" పాట వివరాలు అందిస్తున్నాను.

నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ నిన్నే నా స్వామీ

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలే కర్పూరకళికవోలే కర్పూరకళికవోలే
ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం

తెలుగు చలన చిత్ర సీమలో డాక్టర్ సి.నారాయణరెడ్డిగారి సాహిత్యం సహజత్వానికి ప్రయోగాలకు పుట్టినిల్లు. అంతకు మునుపు ఎక్కువగా వాడని పదాలను సాహితీ స్రవంతిలోకి తీసుకు వచ్చి, వాటితో సాహిత్యానికి ఎంతో వన్నె తెచ్చినవారు సినారె గారు. దొరసాని, నెరజాణ వంటి పదాలు అప్పట్లో తెలుగు సినీ సాహిత్యంలో చాలా అరుదుగా ఉపయోగించే వారు. నారాయణ రెడ్డి గారు అటువంటి పదాలను తన సాహిత్యంలో పొందు పరచి తెలుగు భాష అందాన్ని పెంచారు.

గీతాన్ని పరిశీలిస్తే, మనసు దోచుకున్న వనిత తనను ఒక పోటీ తరువాత భర్తగా స్వీకరించిన సన్నివేశం తరువాత ఈ పాట చిత్రంలో వస్తుంది. వన్నెలున్న రాణి తన మనసు దోచుకుందని ఆమెకు తెలుపుతాడు భర్త. దాని సమాధానంగా ఆయనను కన్నులలో దాచుకుని ఆరాధిస్తానని పలుకుతుంది ఆ భార్య. భర్త చరణాల నీడలో తరిస్తానని ఆ భార్య సంకల్పం. ఎలా? పూల దండలా, కర్పూరంలా అట. అతని వ్యక్తిత్వానికి సుగంధము, వెలుగు ఆమే కదా? అంతటి పవిత్రమైన భావన ఆ భార్యది. ఆ భార్య తెలివిని మెచ్చుకుంటూ తన అంతరంగంతో వీడిన సంకెళ్లు వేశావు అని ఆ భర్త భావించాడు. తన మసును ఒక మందిరంగా చేసుకుంది ఆ భార్య. అంటే, ఎంతో పవిత్రంగా చేసుకొని, దానిలో తన భర్తను దేవతగా భావించింది. హృదయంలో నిలిచిన భర్తతో తాను ఏకమై పోతాను అంది. జీవాత్మ-పర్మాత్మల అనుసంధానానికి భార్యా-భర్తల సంబంధానికి ఎలా సారూప్యత ఉందో చూడండి. మరి దానికి భర్త చేయాల్సింది ఏమిటి? ఆమెను అతిచరించకుండా, ఆ అనుబంధాన్ని మరపురానిగా చేయటం. నాయకుడు అలానే భావించి ఏనాటిదో ఈ బంధం, దాన్ని తెలుసుకోలేము, అది ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధం లాంటిది అన్నాడు. చూశారా? నారాయణ రెడ్డి గారు నాయకుడి మనోగతం ద్వారా భార్యా భర్తల మధ్య సంబంధానికి శాశ్వతత్వం ఎలా ఆపాదించారో? అందుకీ ఈ గీతం యాభై ఏళ్ల తరువాత కూడా సుగంధాలు విరజిమ్ముతూనే ఉంది.

అన్న ఎన్‌టీఆర్, జమున గారు ఈ పాటలోని భావ వ్యక్తీకరణలో జీవించారు. అందానికి మారుపేరైన ఇద్దరూ ఒక పవిత్రబంధాన్ని మరింత అందంగా ఆవిష్కరించారు. చందమామ అంత అందంగా, చల్లగా, ప్రశాంతంగా ఎన్‌టీఆర్ నటించగా, ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆరాధనా భావం మనోజ్ఞంగా ఒలికించారు జమున గారు. ఘంటసాల మాష్టారు-సుశీలమ్మ ఈ గీతానికి అమృతత్వం ఆపాదించారు. ఈ చిత్రం ఎన్‌టీఆర్ గారు స్వీయ బ్యానర్ అయిన ఎన్ఏటీ ద్వారా నిర్మించారు. 

20, ఫిబ్రవరి 2016, శనివారం

తొలిరేయి గీతాలు - ఎంత హాయి ఈ రేయి (గుండమ్మ కథ)

తొలిరేయి గీతాలు - ఎంత హాయి ఈ రేయి (గుండమ్మ కథ)


పెళ్లైన జంటకు తొలిరేయి మరపురానిది. ఇద్దరు ఒకటయ్యే వేళ మధురభావనలన్నీ పండే వేళ. ఆ భావనలను అలనాటి చిత్రాలలో అశ్లీలం లేకుండా ఎంతో అందంగా చిత్రకీరించే వారు. అప్పటి దర్శకులు, గేయ రచయితలు తొలి కలయికకు సూచికగా ఎంతో భావయుక్తమైన గీతాలను అందించారు. తొలిరేయి చిత్రీకరణలో నటీనటుల ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. సున్నితమైన శృంగారాన్ని, ప్రేమానురాగాలను, కొంటెతనాన్ని, పవిత్రమైన బంధాన్ని నటనలో ప్రదర్శించవచ్చు. అలా చేసిన నటులు ఆ గీతాలను అజరామరం చేశారు. ఒక స్త్రీకి తన భర్తపై గల అనురాగం, ఒక పురుషుడికి తన పత్నిపై గల అధికారం కలబోసిన ఎన్నో గీతాలు తెలుగు సినీ స్వర్ణయుగంలోని చిత్రాలలో వచ్చాయి. అవి బహుళాదరణ పొందాయి. అటువంటి గీతాలలో మొట్టమొదటగా నాకు గుర్తుకు వచ్చేది గుండమ్మ కథ చిత్రంలో "ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి" అనే యుగళ గీతం. తొలిరేయి గీతాలు శీర్షికన మొట్ట మొదట ఈ గీతం వివరాలు మీకు అందిస్తున్నాను.

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి 
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా
చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా

ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయించగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశించగా

కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోలపాడగా
మధుర భావలాహిరిలో మనము తూలిపోవగా
మధుర భావలహరిలో మనము తేలిపోవగా

విజయా ప్రొడక్షన్స్ పతాకంలో కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో 1962లో విడుదలైన గుండమ్మ కథ చిత్రంలోనిది ఈ గీతం. పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యాన్ని అందించగా ఘంటసాల మాష్టారు సంగీతం కూర్చారు. మాష్టారు, సుశీలమ్మ యుగళగీతాన్ని అక్కినేని, జమునల జంటపై చిత్రీకరించారు.

కలలతోటలే విహరించే ఓ స్త్రీ మనోభావాలను, ఆమె భర్త మనోభావాలను దాదాపుగా ఒకే రకమైన పదాలైనా, వైవిధ్యాన్ని విలక్షణంగా అందించారు పింగళి వారు. ఘంటసాల మాష్టారి సంగీతానికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. మాధుర్యానికి, రాగ లక్షణాలకు ఆయన పెద్ద పీట వేసేవారు. అదే శైలి ఈ పాటలో కనబడుతుంది. ఒకింత శృంగారము, ఒకింత మైమరపు, ఒకింత పులకింత, ఒకింత ఎదురుచూపు...అన్ని మధుర భావనలూ పింగళి ఈ గీతంలో ఒలికించారు. భార్యాభర్తల మధ్య శృంగారానికి పవిత్రమైన మధుర భావనలే నాంది. దాన్ని కవి ఈ గీతంలో చాలా స్పష్టంగా ఆవిష్కరించారు.

స్త్రీకి పురుషుడికి ఉన్న భావనలలో తేడాను కవి ఎంత సునిశితంగా ప్రతిపాదించారో చూడండి. నాయకుడు చందమామ చల్లగా మత్తు మందు జల్లగా అన్నాడు. కొంత శృంగార భావనలో మత్తు, మైకము మగవారికి చల్లని వాతావరణంలో కలిగే మాట నిజమే. దానినే ఆ స్త్రీ పన్నీటి జల్లు చల్లగా అని మార్చి పాడింది. స్త్రీ భావనలో చందమామ చల్లదనం పన్నీటి జల్లుగా అనిపించటం స్త్రీత్వానికి ప్రతీక. ఇంద అందంగా మొదలైన గీతం చరణాల్లో మరింత భావగర్భితమైంది.

శృంగారానికి అధిదేవత మన్మథుడి సృష్టి అయిన పూలబాణాలు చూపులతో విసురుకున్నట్లు నాయకుడు భావించటం ఆయనలో మన్మథుడు రేపిన వలపుల తలపులు అంత వాడిగా ఉన్నాయి అనే దానికి ప్రతీక. అదే ఆ స్త్రీ ఆ చూపులను పూల సుగంధాలుగా భావించింది. స్త్రీ సున్నితత్వానికి రతీదేవి ప్రతీక. పింగళి వారు ఎంత అందంగా, విరితూపులు-విరితావులు అన్న పదాలలో భేదాన్ని మనకు అందించారో? మరి మన్మథుడి బాణాలు తగిలితే జరిగేది మైమరపులో తూలిపోవటమే కదా? దానినే నాయకుని తదుపరి భావనగా తెలిపారు. పూల సుగంధాలు తాకితే? మగవారికి విరహాతిశయమే కదా? అదే స్త్రీకి? ఆ ఘుమఘుమలతో శరీరం పరవశించిందిట. ఇదీ మొదటి చరణంలో పింగళి వారి శృంగార రసధార.

ఇక రెండవ చరణంలో - కనిపించని కోయిలలు పాడి ఆ నాయకునిలో కోరికలను మేలుకొలిపితే నాయిక ఆ కోయిల పాటను జోలపాటగా భావించింది. మళ్లీ స్త్రీ పురుషుల భావనలో ప్రకృతీ పురుషుల విలక్షణతను ఆవిష్కరించారు కవి. మరి కోయిల పాటతో మేల్కొన్న పురుషుడికి స్త్రీపై కలిగిన మధుర భావనల వలన జరిగేది మైమరపులో తూలిపోవటమే కదా? దానినే నాయకుని తదుపరి భావనగా తెలిపారు. కోయిల గానం జోలపాటగా భావించిన స్త్రీకి మధురమైన ఆ భావనలో మనసు తేలిపోతాయి కదా? దానిని నాయకి భావంగా ప్రతిపాదించారు. ఇదీ రెండవ చరణంలో పింగళివారి శృంగార రసావిష్కరణ.

పింగళి వారి సాహిత్యానికి ఘంటసాల  మాష్టారి సంగీతం తలమానికమైంది. అప్పటికే అగ్రశ్రేణి నేపథ్యగాయకులుగా ఉన్న మాష్టారు, సుశీలమ్మ ఈ పాటలోని భావానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మధురమైన లలిత శృంగార గీతానికి మోహన రాగాన్ని మించినదేముంది? సమ్మోహనం చేసే సంగీతాన్ని మాష్టారు ఈ రాగంలో ఈ గీతానికి అందించారు. సౌందర్యానికి, ఒకింత పొగరుకు, హావభావాలకు, పెంకితనానికి జమునగారు పెట్టిన పేరు అయితే, ధీరుడైన, పరిణతి చెందిన యువకునిగా నటించటం నాగేశ్వరరావు గారికి కొట్టిన పిండి. ఆనాటి సాంఘిక చిత్రాలలో వీరి నటనకు ప్రజలు జేజేలు పలికారు. వారిలో గొప్పతనం ఏమిటంటే శృంగార సన్నివేశాలలో కూడా అంతే అద్భుతంగా నటించారు. దానికి ఈ గీతం చక్కని ఉదాహరణ. సంగీతం, సాహిత్యం, గాత్రం, నటన కలయికే ఈ అజరామరమైన తొలిరేయి గీతం. ఇప్పటికీ దీని సుగంధం మనకు అందుతూనే ఉంది.

18, ఫిబ్రవరి 2016, గురువారం

కృష్ణ భక్తి - ఐదవ సంచిక

కృష్ణ భక్తి - ఐదవ సంచిక


కృష్ణభక్తిలో రుక్మిణికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ భక్తిలో భర్త పట్ల ప్రేమానురాగాలతో పాటు ఆయన లోకేశ్వరుడు అన్న పరిపూర్ణమైన నమ్మకం ఉంది. స్వామిని అచంచలమైన భక్తి ప్రేమలతో కొలిచే రాణి రుక్మిణి. ఆ శ్రీమహాలక్ష్మి స్వరూపిణి యొక్క భక్తి వివరాలు ఈ రోజు "కృష్ణ భక్తి - ఐదవ సంచిక" లో తెలుసుకుందాం.

విదర్భదేశానికి రాజైన భీష్మకుని ఇంట రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అన్న సోదరులకు చెల్లెలిగా రుక్మిణి జన్మించింది. ఆ రుక్మిణి యుక్తవయసుకు రాగానే శ్రీకృష్ణునికి ఆమెపై వలపుల తలపులు కలిగాయి. తన తండ్రి భవనానికి వచ్చే అతిథుల ద్వారా శ్రీకృష్ణుని రూప గుణ వైభవాలు, శక్తి పరాక్రమాలు తెలుసుకున్న రుక్మిణి ఆ మహాత్ముడే నా భర్త అని నిశ్చయించుకుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడ ఆమె సౌందర్యము మరియు సౌశీల్యము గురించి తెలుసుకొని ఆమెను తన పత్నిగా భావించాడు. ఆత్మబంధువులంతా వారిరువురికి వివాహము చేయుట మేలు అన తలచారు. కానీ, కృష్ణ విరోధి అయిన అన్న రుక్మి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అప్పుడా రుక్మిణి అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా స్వామికి విదర్భ వచ్చి తనను తీసుకు వెళ్లమని సందేశం పంపింది. శ్రీమదాంధ్ర మహాభాగవతంలో పోతన దశమ స్కంధంలో ఈ విధంగా దీన్ని వివరించారు.

ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీరిపోవు
నే నీ శుభాకారమీక్షింపఁ గన్నులకఖిలార్థంబు కలుగుచుండు
నే నీ చరణసేవలే ప్రొద్దుఁ జేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీలసన్నామమేప్రొద్దు భక్తితోఁ దడవిన బంధ సంతతులు వాయు

నట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చి యున్నది నీ యాన నాన లేదు
కరుణఁ జాడుము కంసారి ఖలవిదారి శ్రీయుతాకార మానినీ చిత్తచోర

"ఓ కంసాంతకా! నీ సుగుణాల వివరాలు చెవులకు సోకగానే దేహతాపములు తీరును. చూడముచ్చటైన నీ రూపము చూసినంతనే కన్నులకు అన్ని శుభఫలములు కలుగును. ఎల్లప్పుడూ నీ పాదసేవ చేసే వారికి సమస్త ఔన్నత్యములు కలుగును. స్త్రీల మనసును దోచుకునే స్వామీ! నిరంతరమూ నీ పవిత్రమైన నామమును భక్తితో స్మరించువారికి అన్ని బంధములు తొలగును. అటువంటి నీ పై నా మనసు ఎల్లపుడూ లగ్నమై ఉంది. నాపై కరుణ చూపుము!" అని వేడుకుంటుంది.

ఘనులాత్మీయతమోనివృత్తి కొరకై గౌరీశుమర్యాద నె
వ్వనిపాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతురేనట్టి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరుజన్మంబులన్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!

"ప్రాణనాథా! మహాత్ములు తమ అజ్ఞానము తొలగుటకై శివునిలా నీ పాదపద్మములనుండి జారిన గంగాజలములో మునుగుటను కోరుకుంటారు. అటువంటి మహనీయుడవైన నీ యొక్క కృపకు నేను పాత్రురాలిని కాకపోతే కన్యగానే మిగిలిపోతాను. ఎన్ని జన్మలైనా నిన్నే ధ్యానిస్తాను. అంతే కాదు, నా ప్రాణాలు విడవటానికైనా సిద్ధమే. ఇది ముమ్మాటికీ నిజం"...

ఇలాగ, పరి పరి విధముల వేడుకున్న రుక్మిణి సందేశాన్ని అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణునికి విన్నవించగా ఆయన ఆమె మనోభీష్టాన్ని తెలుసుకొని సంతోషించి, విదర్భపై దండెత్తి రుక్మిణిని అపహరించి పరిణయమాడాడు.

రుక్మిణి భక్తి ఒకరకంగా మధురభక్తే. స్వామియే సర్వస్వము అనుకొని ఆతనికి తన మనము, తనువు, అంతఃకరణమును సమర్పించి ఆతని కోసమై వేచిన సాధ్వి ఆమె. స్వామి మహిమను తెలిసిన పతివ్రతా శిరోమణి. నిరంతర పతి ధ్యాన నిరత.  నిర్మలమైన తన ఆత్మను స్వామికి సమర్పించిన మహాభక్తురాలు.

ఒకసారి శ్రీకృష్ణుడు రుక్మిణి ఆట పట్టించటానికి "ఓ రుక్మిణీ! ఎందరో మహా పరాక్రమవంతులైన మహారాజులుండగా ఏమీ లేని, ఎవరికీ చెందని, ఈ యాదవుడనైన నన్ను ఎందుకు పరిణయమాడావు" అని అడుగుతాడు. అపుడామె:

రూఢిమైఁ బ్రకృతి పూరుష కాలములకు నీశ్వరుఁడవై భవదీయ చారు దివ్య
లలితకళా కౌశలమున నభిరతుఁడై కడగు నీ రూపమెక్కడ మహాత్మ!
సత్త్వాది గుణ సముచ్చయ యుక్త మూఢాత్మనయిన నేనెక్కడ ఘన చరిత!
కోరి నీ మంగళ గుణభూతి దానంబు సేయంగఁబడునని చెందు భీతి
నంబునిధి మధ్యభాగమందమృత ఫేన పటల పాండుర నిభమూర్తి పన్నగేంద్ర
భోగశయ్యను బవ్వళింపుచును దనరునట్టి యున్నతలీల దివ్యంబు దలఁప

"పరమాత్మా! నీ చరితము దివ్యమైనది. ప్రకృతీపురుషులకు, కాలానికి నువ్వు ప్రభువువు. నీది దివ్యమనోహర రూపము. ఎంతో అందముగా ఉండే కళలలో నీవు నైపుణ్యం కలవాడవు. అద్భుతరూపసంపన్నుడవైన నీవెక్కడ? సత్త్వరజస్తమోగుణములతో ఉన్న మూఢురాలను నేనెక్కడ? శుభకరమైన నీ సద్గుణములను ఇతరులకు దానము చేయవలసి వస్తుందేమో అనే శంకతో నీవు ఇష్టపూర్వకముగా పాలసముద్రము మధ్యలో అమృతపు నురగల వలె తెల్లగా ఉన్న ఆదిశేషునిపై పవళించి యున్నావు. ఇవన్నీ నీ దివ్యలీలలే అని స్వామి వైభవాన్ని విశదీకరిస్తుంది. ఇంకొక ముందడుగు వేసి ఆధ్యాత్మికంగా స్వామి గొప్పతనాన్ని వివరిస్తుంది..."

శబ్దస్పర్శరూపరసగంధంబులనియెడు గుణంబులచేతఁ బరిగ్రహింపఁబడిన మంగళ సుందర విగ్రహుండవై, అజ్ఞానాంధకార నివారకంబైన రూపంబు గైకొని , భవదీయులైన సేవకులకు ననుభావ్యుండవైతివి. భవత్పాదారవింద మకరంద రసాస్వాద లోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబు గాదట్లగుటంజేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యంబగుట యేమి సెప్ప. ఇట్టి ఈశ్వరుండవైన నీకు నిచ్ఛ స్వతంత్రంబు గావున. అదియును నాకధికంబు గావున నిన్ను నేననుసరింతు. దేవా! నీవకించనుడవైతేని బలి భోక్తలైన బ్రహ్మేంద్రాదులెవ్వరి కొరకు బలి సమర్పణంబు చేసిరి. నీవు సమస్త పురుషార్థమయుండ వనియును, ఫలస్వరూపివనియును, నీ యందలి ప్రేమాతిశయంబులంజేసి, విజ్ఞాన దీపాంకురంబున నిరస్త సమస్త దోషాంధకారులై, యిహ సౌఖ్యంబులు విడిచి, సుమతులు భవదీయ దాససంగంబు కోరుచుందురట్లు సేయనేరక, నిజాదికారాంధకార మగ్నులైనవారి భవతత్త్వంబు దెలిసి, బలిప్రక్షేపణంబులు సేయంజాలక, మూఢులై, సంసారచక్రంబునంబరిభ్రమింతురదియును గాక

వరమునీంద్ర యోగివర సురకోటిచే వర్ణిత ప్రభావ వైభవంబు 
గలిగి యఖిలచేతనులకు విజ్ఞానప్రదుండవగుదవభవ! దురితదూర!

"స్వామీ! నీవు సహజముగా దివ్యమంగళ స్వరూపుడవే అయినప్పటికీ, శబ్ద స్పర్శ రూప రస గంధాది పంచతన్మాత్రలతో ప్రకాశించే మంగళకర రూపమును దాల్చినావు. నీ దివ్యరూపము అజ్ఞానాంధకారాన్ని తొలగించేది. ఆ విధముగా సగుణ రూపుడవైన నీవు ఆరాధింపదగిన వాడవు. గొప్ప యోగులు కూడా నీ పాదపద్మములలోని తేనెను రుచిచూచుటకై తహతహలాడుతారు. అట్టి వారికి కూడా నీ తత్త్వము బోధపడదు. కాబట్టి పశువులతో సమానమైన ఈ మానవులకు నీ తత్త్వము ఎలా తెలుస్తుంది? నువ్వు సర్వేశ్వరుడవు. నీ సంకల్పానికి తిరుగులేదు. అది కూడా నాకు తెలియదు. అందుకే నేను నిన్ను అనుసరిస్తున్నాను. దేవా! నీవు ఏమీ లేని వాడవు. కానీ, బ్రహ్మాది దేవతలు కూడా నీకు బలి సమర్పిస్తున్నారు. అనగా నీవు వారికన్నా గొప్పవాడివనే కదా అర్థం! కాబట్టి నీవు అన్నిటినీ మించినవాడివి. చతుర్విధ పురుషార్థములు నీ స్వరూపాలే. యజ్ఞము, యాగము, తపస్సు మొదలైన కర్మల ఫలస్వరూపము నీవే. సజ్జనులు నీపై గల ప్రేమచే విజ్ఞానము యొక్క ప్రభావముతో సమస్త దోషములను పారద్రోలుతారు. వారు ఐహిక సుఖములను వదలి నీ దాసుల సాంగత్యమును కోరుకుంటారు. మూఢులు భౌతిక సుఖములను వదులుకోలేక అధికారములనే అంధకారములో కొట్టుమిట్టడుతూ నీ తత్త్వమును తెలుసుకోలేక, నిన్ను ఆరాధించక జనన మరణములనే చక్రములో పరిభ్రమిస్తారు. స్వామీ! నీవు పాపాలను బాపే వాడవు. మునులు, యోగులు, సమస్త దేవతలు నీ ప్రభావ వైభవమును వర్ణిస్తారు. నీవు అన్ని ప్రాణులకు విజ్ఞానాన్ని ఇచ్చేవాడవు..."

జలజనాభ! సకల జగదంతరాత్మవైనట్టి దేవ! నీ పదారవింద
యుగళి సానురాగయుక్తమై నా మదిఁ గలుగునట్లు గాఁగఁ దలఁపుమనఘ!

పృథురజోగుణ ప్రవృద్ధమైనట్టి నీ దృష్టిచేత నన్నుఁ దేరుకొనఁగఁ 
జూచుటెల్లఁ బద్మలోచన నీమీఁది ఘన దయార్ద్ర దృష్టిగాఁ దలంతు

"పద్మనాభా! మహాత్మా! నీవు ఈ ప్రపంచములో సమస్త ప్రాణులకు అంతరాత్మైనట్టి స్వామివి. నా మనస్సులో నిరంతరం నీ పాదకమలముల యందు భక్తి అనురాగములు వర్ధిల్లేలా అనుగ్రహింపుము. నీ చూపుల ద్వారా అనంతమైన ప్రేమానురాగాలు నాపై ప్రసరించి నన్ను తేరుకునేలా చేసితివి. నా మీద నీకు గల గొప్ప దయాదృష్టికి ఇదే నిదర్శనం..."

అని ఎంతో ఉదాత్తమైన భక్తితో, జ్ఞానంతో రుక్మిణి స్వామి వైభవాన్ని వేనోళ్ల నుతించింది. రుక్మిణి స్వామిని తన భరతగా మాత్రమే అనుకోక పరమాత్మగా గ్రహించింది. స్వామికి ఉన్న అనేక కోట్ల భక్తులలో తాను ఒకరు అనుకుంది. అందుకే ఆమెలో ఇతర కృష్ణ పత్నుల పట్ల అసూయ లేదు. భాగవతంలో శ్రీకృష్ణ తులాభారం గురించి రాయలేదు. కానీ, ఆ తులాభార ఘట్టం అనేక చోట్ల ప్రస్తావించబడింది. సత్యభామను పరీక్షించటానికి నారదుడు ఆమేచే వ్రతము చేయించి స్వామిని తనకు వ్రతఫలముగా దానమిప్పించుకుంటాడు. స్వామి దాస్యాన్ని విడిపించి, స్వామిపై పూర్తి హక్కులు కాలంటే ఆయనకు తూగగల సంపదను ఇస్తే చాలు అంటాడు.  అజ్ఞానంలో సత్యభామ ఆ తప్పటడుగు వేస్తుంది. తన దగ్గర ఎన్ని సంపదలు తులాభారంలో వేచినా అది స్వామికి సరితూగదు. అప్పుడు ఆమె రుక్మిణి వద్దకు వెళ్లి సాయం కోరుతుంది. స్వామిపై అచంచలమైన భక్తితో స్వామికి సమర్పించే తులసీదళాన్ని తీసుకు వెళుతుంది. స్వామికి తులసీదళం అత్యంత ప్రీతికరమైనదని తెలుసు. అందుకే భక్తితో స్వామిని ప్రార్థించి ఆ దళాన్ని తులాభారంలో ఉంచుంతుంది. స్వామి దానికి బద్ధుడవుతాడు.
సముద్రాల రాఘవాచార్యుల వారు ఈ రుక్మిణి భక్తిని, విశ్వాసాన్ని ఈ పద్యంలో అద్భుతంగా పండించారు.

"ఫలమో ఘన రసంబో పత్రమో పుష్పమో కొనుచు భక్తి నిన్ను కొలుచు వారికి ఈవు వశుడవగుటయే సత్యమేని ఈ తులసి దళము నిన్ను తూచు గాక!"

భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా? పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా భక్తితో నాకు సమర్పిస్తే దానిని స్వీకరిస్తాను అని? అదే విధంగా రుక్మిణి భక్తితో సమర్పించిన ఆ తులసీదళం స్వామిని తులాభారంలో బద్ధుడిని చేస్తుంది. ఇక్కడ తులసీదళం కాదు ముఖ్యం, రుక్మిణి భక్తి. ప్రభువుపై ఆమెకు గల విశ్వాసం. దీనినే వేటూరి సుందరరామమూర్తి గారు "తులసీదళానికి తేలిపోయి తూగునటే ఆనందలీల ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెలా అంత వింత గాథల్లో ఆ నందలాలా" అని అద్భుతంగా ఆవిష్కరించారు.

కృష్ణ భక్తి సామ్రజ్యంలో రుక్మిణి స్థానం స్వామి హృదయంలోనే. 

17, ఫిబ్రవరి 2016, బుధవారం

జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక

జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక


జంధ్యాల గారి శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఉన్న ప్రత్యేకత తెలుగు భాషను పునరుద్ధరించే ప్రయత్నం చేయటం, తెలుగుదనాన్ని ఉట్టిపడే వాతావరణాన్ని సినిమాలో అడుగడుగునా చూపించటం. ఈ ఘనత మొత్తం జంధ్యాల గారిదే. అగ్రశ్రేణి నటీనటులు లేకుండా, పదునైన సంభాషణలు, సహజత్వము  రంగరించి ఆయన హాస్యం పండించారు. అందుకే చిత్రం ఘన విజయం సాధించింది. మధ్యతరగతి కుటుంబాలలో ఉండే ఆవేశకావేశాలు, సంతోషాలిచ్చే చిన్న చిన్న పనులు, మనుషుల మధ్య ఉండే ప్రత్యేకమైన బంధాలకు జంధ్యాల గారు ప్రాణం పోసి చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా కథల పిచ్చి కల శ్రీలక్ష్మి, ఆమె బాధితుల ఘోష, పరంధామయ్య ప్రాస వాగుడు, భాస్కరం పేకాట్ స్నేహితుల సంభాషణలతో ఎన్నో రసవత్తరమైన సన్నివేశాలున్నాయి. ఆ కుటుంబంలో జరిగే మరో కొన్ని అద్భుతమైన సన్నివేశాలను "జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక"గా మీకు అందిస్తున్నాను

ఊరు వచ్చి తిరిగి పట్నానికి వెళుతున్న ఆనందరావును బస్సు ఎక్కించటానికి మొత్తం కుటుంబం వెళ్లిన నేపథ్యం, తదుపరి సీన్లలో ఈ సంభాషణలు.

*************************************************

భీముడు: "మహాప్రభో"

పరంధామయ్య: వెధవను రెడీగా ఉండమను. ఇంకో సంబంధముందని రాయగానే రెక్కలు కట్టుకొని రాలమను వెధవను.."

భీముడు: "చిత్తం..." "మహాప్రభో...ఈ మాట ఇప్పుడే చెప్పొస్తున్నాను కదా"

పరంధామయ్య: "నీ పని నేను చెప్పింది చేయటమే. ఈలోపు ధర్మసందేహాలొస్తే బెజవాడ రైల్వే స్టేషనుకు పంపించు. ఆయనెవడో చెబుతుంటాడే..మా కుక్కకు గజ్జి పట్టింది ఏమి చెయ్యమంటారు అంటే బొచ్చుపీకండి గజ్జి తగ్గిపోతుంది అని..ఆయనకు రాయి సమాధానం చెబుతాడు అనుమాన పక్షి. ఆ అడ్డగాడిదతో మాట్లాదకూడదని నిర్ణయించుకున్నాను కాబట్టి కానీ లేకపోతే నేనే చెవి మెలేసి చెప్పేవాడిని వెధవకి..."

భీముడు: "చిత్తం..."

పరంధామయ్య:"చిత్తమంటూ ఇంకా ఇక్కడే తగలడ్డవేం? వెళ్లు"

భీముడు: "వెళుతున్నాను కదా మహాప్రభో..."

భీముడు ఆనందరావుతో: "బాబూ తమరు మళ్లీ త్వరలో పెళ్లి చూపులకు రావటానికి రెక్కలు అవీ కట్టుకొని సిద్ధంగా ఉండమన్నారు మహాప్రభువుల వారు"

పూర్ణ: "బస్సింకా వచ్చేలా లేదు. ఈలోపు శ్రీమంతుడు సినిమా కథ చెప్పనా"

కామాక్షి: "సరే. వేటగాడు కథ చెప్తానేం..."

భాస్కరం: "అబ్బబ్బబ్బా మళ్లీ మొదలెట్టావా. అసలు నీకిన్ని కథలు పేర్లు గుర్తున్నందుకు నీ బుర్రను మ్యూజియంలోనూ నిన్ను జూలోనూ ఉంచాలే.....అదిగో వచ్చేసింది బస్సు"

పరంధామయ్య: "రండి రండి ఏమిటా పెళ్లి నడక.." ..."ఆ ఎక్కరా"

కండక్టరు: "ఎన్ని టికెట్లండీ"

భాస్కరం: "ఒకటే"

కండక్టరు: "ఒక్కటా! ఒక్క టిక్కట్టుకు ఇంతమందొచ్చారేంటండీ? బస్సు ఖాళీగా ఉంది. అందరు ఎక్కండి సార్"

పరంధామయ్య:" నీ బస్సు ఖాళీగా ఉంటే మేమంతా ఎక్కాలా అంట్ల వెధవ"

భీముడు:"కండక్టర్ తమ కొడుకు కాదు మహాప్రాభో తమరు ఎన్ని తిట్టినా పడుండటానికి ఊరుకోండీ"

భాస్కరం: "నువ్వు పద బాబూ పద"

కామాక్షి: "ఎక్కరా చంటీ, జాగర్త"

అమ్మ:"ఆవకాయ మాగాయ జాడీల్లో పెట్టాను. ఉసిరికాయ పచ్చడికి గాలి తగలకుండా చూడు. బూజుపడుతుంది. జాడీలు జాగ్రత్త. బస్సు కుదుపుల్లో కదిలిపోకుండా చూడు.."

పరంధామయ్య: "రోజూ క్రమం తప్పుకుండా మాదీఫలరసాయనం వాడమను శుంఠని"

అమ్మ: "సామాన్లు జాగ్రత్తమ్మా.."
కామాక్షి: "ఒరేయ్ లెక్కపెట్టుకోరా చంటీ"

ఆనందరావు: "ఇక మీరు బయలుదేరండి నాన్నా!"

భాస్కరం:"నీ ఆరోగ్యం జాగ్రత్తరా చంటీ"

అమ్మ: "ఎండలో ఎక్కువగా తిరక్కు నాన్నా"

పరంధామయ్య: "ప్రతిరోజూ మొదటి ముద్ద ఉసిరికాయ పచ్చడేసుకు తినమను కుంకని. పైత్య ప్రకోపం తగ్గుతుంది..."

ఆనందరావు:"ఇక మీరు బయలుదేరండి నాన్నా...బస్సెక్కాను కదా"

కామాక్షి: "ఓసారి ఎప్పుడైనా మావూరు రారా చంటి. కొత్త కొత్త పిండి వంటలు చెసిపెడతాను తిందువు కాని"

పరంధామయ్య భీముడుతో: "ఈసారి పెళ్లిచూపులకు రానని ఇష్టం లేదని రాశాడో నీకు గుండు గీకిస్తాను ఆ విషయం చెప్పు సన్నాసికి"

భీముడు: "బాబూ! నా జుట్టుమీద దయుంచి పెళ్లి చూపులకు తప్పకుండా రండి బాబూ!"...."చెప్పాను మహాప్రభో చెప్పాను"

పరంధామయ్య: "ఆ ఆ! ఇక బస్సు బయలుదే...."

అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి పరంధామయ్య బస్సుకేసి తలబాదుకుంటాడు

భాస్కరం: "ఏమిటి ఏమయ్యింది"

పరంధామయ్య భాస్కరంతో: "అటు చూడు మీ ఆవిడని"...

పూర్ణ డ్రైవరుతో: "రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి డ్రైవర్ రాముడు సినిమా చూశావా?"

డ్రైవరు: "చూడలేదండీ"

పూర్ణ: "అందులో ఎన్‌టీ రామారావు లారీ డ్రైవరుగా ఎంత బాగ చేశాడనుకున్నావ్?"

భాస్కరం: "ఒసేయ్ ఒసేయ్ ఆపవే...అవతల మా నాన్న బస్సు బద్దలు కొడుతున్నాడు...రా"

*****************************************************

పూర్ణ: "అప్పుడేమో జయశంకర్ పిచ్చ స్పీడుతో మోటర్ సైకిల్ మీద వచ్చి ఆ రౌడీల్ని దోసకాయ పచ్చడి చేసేస్తాడు.."

భాస్కరం: "జయశంకర్‌కి దోసకాయ పచ్చడంటే బాగా ఇష్టమేమో? "
పూర్ణ: "తన కోసం ప్రాణాలు కూడ లెక్క చేయకుండా ఆ రౌడీలతో ఫైట్ చేసిన ఆ జయశంకర్‌కి సీత తన మనసిచ్చేస్తుంది"

భాస్కరం: "ఎలా ఇస్తుంది. కోసిస్తుందా లేదా దోసకాయ పచ్చడి షేపులో దంచిస్తుందా మనసు?"

పూర్ణ: "అబ్బా! అది కాదండీ! ఆ తరువాత వాళ్లిద్దరూ పార్కులో పాట పాడుకుంటారన్నమాట మనసూ ఇచ్చినా పూసా పూసా వెన్నపూస.."

భాస్కరం: "జయశంకర ఇదివరకు వెన్నపూస వ్యాపారం చేసేవాడు కాబోలు"

పూర్ణ: "కంటిలో వెలుగా పూసా పూసా"

భాస్కరం: "ఆపవే! రిక్షావాడు కథ వినలేక వాలిపోయి తొక్కుతున్నాడు చూడు"

పూర్ణ: "టాట్టడాయ్ టట్టటట్టడాయ్"

భాస్కరం: "బాబు ఆపాపు రిక్షా ఆపు"

పూర్ణ: "ఏంటండీ. ఇప్పుడే కథ బావుంటుంది"

భాస్కరం: "కథతో పాటు నా ఆరోగ్యం కూడా బావుండాలి కదా పూర్ణా!..ఆ..చూడూ...మొన్ననే కొత్త మంగళసూత్రాలు చేయించుకున్నావు. వాటి మీద ప్రేమతో అన్నా నాకప్పుడప్పుడూ కాస్త రెష్టిస్తూ ఉండు..ఇదే ఇంటర్వెల్ అనుకో"

**********************************************

భాస్కరం హార్మణీతో: "ఇక్కడున్నావేమిటిరా హార్మణీ! "

హార్మణీ: "చంపేస్తాను వెధవల్ని. వాళ్ల చర్మం ఊడబీకి అడుగున్నర మందం చెప్పు కుట్టించుకుని ఎత్తు పెరుగుతా. వాళ్ల నాలికల్ని కట్ చేసి మా అమ్మాయి జడలకి రిబ్బన్లుగా చుట్టేస్తాను..హాయ్"

భాస్కరం: "ఎవరి మీదరా ఈ కోపం"

హార్మణీ: "ఇంకెవరు? ఆ కళ్లజోడు, మరచెంబు గాళ్లు. నెల తక్కువ వెధవలనీ"

భాస్కరం: "ఏమయిందీ? నువ్వెళ్లిన దగ్గరనుంచీ మా దగ్గర డబ్బుల్లేక నిన్నల్లా పేకాళ్లేదురా. చేతులు దురదలెక్కి వాచిపోవటం మొదలెట్టాయి. ఆ వెధవలిద్దరూ నన్నిక్కడ కూర్చోబెట్టి, ఆయన దగ్గర ఓ పది రూపాయలు తీసుకొని ఓ గంటలో ఆడుకొని వస్తామని వెళ్లారు. ఇప్పటికి నాలుగ్గంటలైంది వెళ్లి. ఇంతవరకూ రాలేదు. ఆయనేమో నా పదిరూపాయలు నాకిస్తావా కిళ్లీలు కడతావా అంటాడు. నాకేమో కట్టడం రాదు రాకపోతే నేర్చుకోమంటాడాయన. నేనెప్పటికి కిళ్లీలు కట్టడం నేర్చుకొని ఆయన పదిరూపాయలిచ్చి నేనెప్పటికి రుణం తీర్చుకొని బయట పడేది? .."

భాస్కరం: "ఊ సరే సరే ఏడవకు ఉండు"..."ఇదిగో! ఈ పదిరూపాయలు తీసుకొని మా వాడిని విడిచిపెట్టవయ్యా!"

*******************************************

ఇక్కడ రిక్షావాడు మూర్ఛపోతాడు.
భాస్కరం:"ఏమిటే! ఏవయ్యింది? "
పూర్ణ: "మీరెళ్లగానే, కథ తరువాత ఏమయిందమ్మా అని అడిగాడు..."
భాస్కరం: "అడిగాడూ...అర్థాయుష్షు వెధవ...వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడన్నమాట

*******************************************



16, ఫిబ్రవరి 2016, మంగళవారం

జంధ్యాల హాస్య గుళికలు - రెండవ సంచిక

జంధ్యాల హాస్య గుళికలు - రెండవ సంచిక


జంధ్యాల గారి చిత్రాలలో అగ్రస్థానం నిస్సందేహంగా శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానిదే. పొత్తూరి విజయలక్ష్మి గారి కథ ఆధారంగా జంధ్యాల గారు 1984లో రామోజీరావు గారు నిర్మాతగా ఈ చిత్రాన్ని తీశారు. అనుక్షణం నవ్వులు పండించే ఈ చిత్రంలో సంభాషణలు జంధ్యాల గారికి ఎంతో పేరు తెచ్చాయి. తెలుగు చిత్రాలలో క్యాబరే పాటల సినిమా ఒరవడి నుండి బయటకు లాగి మధ్య తరగతి జీవితాలతో తీసే హాస్య చిత్రాలకు నాంది పలికారు జంధ్యాల గారు.

శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో జంధ్యాల గారి హాస్య సంభాషణా నైపుణ్యం పతాక స్థాయికి చేరుకున్నట్లే. పింజారీ వెధవ, కుంక, శుంఠ వంటి పద ప్రయోగాలు, బూజు పట్టిన ఆవకాయ వంటి పదసమూహాలు, అర్థవంతమైన ప్రాసలు, సినిమాల పిచ్చి-వంటల ప్రయోగాలు మొదలైనవి ఎంత హాయిగా పండించారో. ఈ మాటలతో పాత్రలు మమేకమై సినిమాని ఆద్యంతం రక్తి కట్టించాయి.

ఇందులో ప్రతి మాట, ప్రతి ముఖ కవళిక, నవ్వులు కురిపించేదే. చిత్రంలో ఆనందరావుగా నరేష్, పరంధామయ్యగా సుత్తి వీరభద్రరావు, ఆయన భార్యగా డబ్బింగ్ జానకి, భీముడిగా మిశ్రో, సూర్యంగా విద్యాసాగర్, భాస్కరంగా నూతన్ ప్రసాద్, కామాక్షిగా సంగీత, పూర్ణగా శ్రీలక్ష్మి అద్బుతంగా జీవించారు..ప్రతి కళాకారుడు కూడా మనలను కడుపుబ్బ నవ్విస్తారు. ఆ చిత్రంలో నుండి సన్నివేశాలు, సంభాషణలు ఈ జంధ్యాల హాస్య గుళికలు రెండవ సంచికలో.

**************************************************************

పరంధామయ్య భార్యతో:"అప్రాచ్యపు కుమారుడు భాస్కరానికి అర్భకపు తండ్రి పరంధామయ్య రాయునది..."

భార్య: "అయ్యో అయ్యో అదేమి రాతండీ?"

పరంధామయ్య: "నేను కొన్న కవరు, నేను కన్న కొడుకు. నా ఇష్టమొచ్చినట్టు రాసుకుంటాను నువ్వెవరు అడగటానికి. రాయి!"

"ఒరేయ్ కుంకా"..

భీముడు: "చిత్తం"

పరంధామయ్య: "నిన్ను కాదు"

భీముడు: "అలవాటైపోయింది మహాప్రభో"

పరంధామయ్య: "ఆ ఆ" "నువ్వు టింగురంగడిలా పెళ్లాం చేత సినిమా కథలు చెప్పించుకుంటూ నీ దినవారాలు గడుపుకుంటున్నావ్. నీ అంట్ల వెధవ తమ్ముడు పెళ్లి చేసుకోను గాక చేసుకోనని మొండికెత్తాడు. నువ్వు వెంటనే వాడికో ఉత్తరం రాసి వాణ్ని పెళ్ళికొప్పించు.

ఇట్లు

బుద్ధిలేక మిమ్మల్ని కన్న శుంఠ పరంధామయ్య"

భీముడు: "ఆహా! ఈ చివరి వాక్యం మాత్రం అద్భుతంగా ఉంది మహా ప్రభో!"

పరంధామయ్య: "ఏవిటి ఉత్తరం రాయమన్నదా?"

భీముడు: "ఆహా. కాదు కాదు. శుంఠ పరంధామయ్య అన్నది. ఉన్నదున్నట్టుగా తనని తాను దూషించుకోవటం మహర్షుల్ల వల్ల మాత్రమే అయ్యే పని మహాప్రభో!"

పరంధామయ్య బావమరిది సూర్యం: "హలో బావా...చేతికి కట్టేమిటి బావా"

పరంధామయ్య: "సిగ్గు లేకపోతే సరి. కన్న తండ్రి మాట కాదంటావ్. ఏళ్లొచ్చాయి ఎందుకు? పెళ్లి చూపులేర్పాటు చేశాను రమ్మని రాస్తే రానని ఠలాయిస్తావా? పింజారీ వెధవ. నేనసలు పెళ్లి చూపులైనా చూశానురా? మా నాన్న చూసి ఫలాన పిల్లను కట్టుకోమంటే ఎగిరి గంతేసి చేసుకున్నాను. పిచ్చి పిచి వేషాలు వేసావంటే నీ నవరంధ్రాల్లో మైనం కూరతాను కుంకా.."

పరంధామయ్య భార్య: "ఊరుకోండీ. మీ కొడుకు చేసిన నిర్వాకానికి మా తమ్ముడిని తిడతారేం?"

భీముడు: "అయ్యా! మహా ప్రభువుల వారి వ్యాకరణం తమకు తెలియనిదేముంది చెప్పండీ. వారికి తృతీయ తత్పురుష లేదు. నేను నువ్వు అన్నవి తప్ప అతను ఆమె అనేవే లేవు వారికి. ఇప్పుడు వారిని కరిచిన కుక్కకు పిచ్చెక్కి చచ్చిందనుకోంది. నన్ను కరిచి నువ్వు చచ్చావంటారాయన."

పరంధామయ్య: "చాల్లే ఊరుకో..నన్ను కుక్క కరిచిన విషయం దేశమంతా చెప్పాలా? వెధవ అర్థాయుష్షు కుక్క"

భీముడు: "ఇక వారికొచ్చిన కోపం.."

సూర్యం: "అర్థమైంది లేవయ్యా!"..."బావా!మన చంటి నువ్వేర్పాటు చేసిన పెళ్లి చూపులకు రానని రాశాడు. ఇప్పుడు నేను విశాఖపట్నం వెళ్లి వాడిని కోప్పడైనా తీసుకు రావాలి. అంతే కదా"

పరంధామయ్య: "ఇట్నుంచి ఇటే వెళ్లి చెవులు పట్టుకొని లాక్కురా వెధవని"

భీముడు: "అమ్మ గారు రమ్మన్నారని ఒక్క మాట చెప్పండి సూర్యం బాబు. వెంటనే బయలుదేరుతారు చిన్నబాబు గారు"

పరంధామయ్య: "ఈ ఉచిత సలహాలు వినడం వల్లే మా కొంప బూజు పట్టిన ఆవకాయ జాడీలా ఇంతందంగా తయారయ్యింది. నువ్వు నోర్ముయ్...." బామ్మర్దితో: "నువ్వు మాట్లాడవేం?"

సూర్యం: "నువ్వా ఛాన్స్ ఎక్కడిచ్చావ్ బావా? ఈ ఇంట్లో చెవులకేగా పని..."

పరంధామయ్య: "ఊ! ఊ! వెంటనే వెళ్లు. ఆ వెధవ రానంటే మా బావగారింట్లో వెండి బిందెత్తుకు పోయాడని ఆ ఊళ్లోనే కేసు పెట్టించు. పోలీసులే అరవంకాలేసుకు తీసుకొస్తారు వెధవను. ఇక వాడొచ్చి పెళ్లికొప్పుకుంటే మా భీముడిని తిరపతి పంపించి గుండు గీకిస్తానని వెంకన్నకి మొక్కుకున్నాను."

భీముడు: "మహాప్రభో! నా మీద తమరు మొక్కుకోవటమేమిటి మహాప్రభో! ఇంత దయ భరించలేను. ఈ దాసానుదాసుడికి బొచ్చు భిక్ష ప్రసాదించండి మహాప్రభో"

*************************************************************

కామాక్షి తల్లితో: "కత్తి పట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి నూనెలో వేసి.."

పూర్ణ అత్తగారితో: "డబా డబా బాదుతూ ఉంటే.."

కామాక్షి: "అవి చిటపటలాడుతూ ఉడికి..."

పూర్ణ: "కాళ్లకి బుద్ధి చెబుతారన్నమాట.."

భాస్కరం: "మామయ్యా! మన పెళ్లలు...."

సూర్యం: "అబ్బా! నీ పెళ్లాం నా పెళ్లాం అను భాస్కరం. మన పెళ్లాలు అనకు. వినటానికేం బాలెదు.."

పూర్ణ అమ్మతో: "అప్పుడు రామారావొచ్చి.."

కామాక్షి: "నువ్వుండొదినా".."అమ్మా అలా వేగిన వాటి మీద ఉప్పుకారం చల్లి దాచుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో..."

పూర్ణ అత్తగారితో: "అబ్బా! ఉండవమ్మా" "అత్తయ్యా! ఇప్పుడే కథ బాగుంటుంది. రామారావు వాణిశ్రీని చూస్తాడన్నమాట. .."

పూర్ణ భర్తతో: "ఆ వచ్చారా? మధ్యలో మాట్లాడించకండే..కథ చెప్తున్నాను."

కామాక్షి భర్తతో: "ఆ కలకత్తా భౌ భౌ వండటం గురించి చెబుతున్నాను మామయ్యా! .."

భాస్కరం భార్యతో: "నా టూరింగ్ టాకీసా! మా అమ్మే దొరికిందా నీకు వేధించుకు తినటానికి?"

సూర్యం భార్యతో: "నా కదిలే మిలటరీ భోజన హోటలా! మా అక్కయ్యే దొరికిందా వేయించుకు తినటానికి..."

పూర్ణ: "అబ్బా ఉండండీ...ఏదో చెబుదామనుకున్నా మర్చిపోయాను.."

భాస్కరం: "సింగినాదం, జీలకర్ర"

కామాక్షి తల్లితో: "ఆ భౌ భౌ మీద జీలకర్ర కూడా వేస్తే చాలా బాగుంటుందమ్మా!"

సూర్యం: "ఆ డీడీటీ వేస్తే ఇంకా బావుంతుంది!!!"

పూర్ణ: "ఉండండీ. సరే! మళ్లీ పాట దగ్గరనుంచీ మొదలుపెడతానేం...కసిగా ఉంది కసి కసిగా ఉంది కలవక కలవక కలిసినందుకు కస్సుమంటోంది...కసిగా ఉంది ఆ కసిగా ఉంది కసిగా ఉంది.."

పరంధామయ్య: "ఆపండీ. ఒక్కొక్కళ్ల గొంతు కోసి సింహద్వారానికి వేళ్లాడదీస్తాను..."

"రేయ్ భాస్కరం. నీ పెళ్లాం పాడకుండా ఉండలేకపోతే దానిని నీ గదికి తీసుకెళ్లి దాని పాటకు తాళం వేస్తూ చావు. నేను బయట తాళమేసుకు చస్తాను. అంతే కానీ ఈ చెవులకు మాత్రం కసి కసిగా ఉంది తిక్క తిక్కగా ఉంది అన్న పాటలు వినిపించాయో నేనే ఓ హత్య చేసి ఆ నేరాన్ని మీ మొగుడూ పెళ్లాల మీదికి తోస్తానూ...హు..."

"రేయ్ సూర్యం. నువ్వూ విను. నీ పెళ్లాం మధ్యాన్నం ఏదో కొత్తరకం పిండి వంట చేసి పోరి పోరి మరీ తినిపించింది. ఇప్పటికి మూడు వాంతులు ఆరు విరేచనాలు అయ్యయి. కలరా వచ్చి చచ్చిందేమో అని అనుమానంగా ఉంది.."

భాస్కరం: "ఓహో! అందుకా ఇందాకటినుంచీ దొడ్లో చెంబట్టుకు తిరుగుతున్నావు? "

పరంధామయ్య కొడుకుతో: "నువ్వు నోరు మూసుకు చావు.."

పరంధామయ్య సూర్యంతో: " పని మనిషి ఆ వంట తిని వెర్రిగా నవ్వుతూ పిచ్చి పిచ్చి వేషాలేస్తోందిట. ఇకనుంచీ నీ పెళ్లాం కొత్త రకం పిండివంటలు మొదలుపెట్టిందో...."...

పక్కనున్న స్థభానికి తలబాదుకోబోయాడు...

**************************************************************

భీముడు ఆనందరావుతో: "పోనీ ఈయన దగ్గర పని మానేసి పొదాం అంటే ఈయన దగ్గర పనిచేసిన వాళ్లకు ప్రపంచంలో ఎవరూ ఉద్యోగ్యం ఇవ్వరు. అదీ నా బాధ. సరే, నన్ను తీసేస్తే నాలాగా అణిగిమణిగి పడుండే మనిషి వారికి దొరకడు, అది ఆయన బాధ. అబ్బా...చచ్చిపోతున్ననంటే నమ్మండీ. అరే ఎవడి మీద కోపమొచ్చినా నాకు గుండు గీయిస్తానంటాడు. అడ్డమైన మొక్కులూ నా మీద మొక్కుకుంటాడు. మొన్నటికి మొన్న ఏదో పాత బాకీ జమ పడితే, అన్నవరం కొండ, తెలుసుగా బాబు ఎంతెత్తో, దాని మీదికి ఆరు సార్లు ఎక్కించి అరవైపొర్లు దండాలు పెట్టిస్తానని మొక్కుకున్నాడు..."

***************************************************************

15, ఫిబ్రవరి 2016, సోమవారం

జంధ్యాల హాస్య గుళికలు - మొదటి సంచిక


జంధ్యాల హాస్య గుళికలు - మొదటి సంచిక


జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగు సినీ చరిత్రలో హాస్యాన్ని కొత్త స్థాయికి తీసుకు వెళ్లిన మహానుభావులు. ఎటువంటి వెకిలి, ద్వంద్వార్థాలు లేకుండా తెలుగు పదాలతో అద్భుతమైన హాస్యరసాన్ని తన చిత్రాలలో పండించారు. ఆ మహానుభావుడి వల్ల ఎనభై, తొంభయ్యవ దశకాలలో తెలుగు చలన చిత్రాలలో సుత్తి వీరభద్రరావు, వేలు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి వంటి గొప్ప హాస్య కళాకారులు వెలుగొందారు. జంధ్యాల గారికి నివాళిగా ఈ హాస్య గుళికలు శీర్షికన వ్యాసాలు మీకు అందిస్తున్నాను. మొదటి సంచికలో ఆనందభైరవి చిత్రంలో ప్రాసలు మాట్లాడే వీరభద్రరావు, ఈలలు వేసే శ్రీలక్ష్మి, వీరిద్దరి బాధితునిగా సుత్తి వేలు మధ్య పొట్టలు చెక్కలయ్యే సన్నివేశం ఇది.

వీరభద్రరావు పేషెంటుతో: "మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత వాయ"

పేషెంటు: "చిత్తం. ఆహా! చేయి చూడగానే ఎలా చెప్పగలిగారో మహానుభావులు"

వీరభద్రరావు: "ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడి గల వైద్యుడికి నాడిలో తెలుస్తుంది రా బోడి..."

వీరభద్రరావు కొడుకుతో: "జంటగా వెళ్లి ఒంటిగా తగలడ్డావేం"..."కోడలేదిరా...కోడలేది అంటే గోడలకేసి నీడల కేసి చూస్తావేంటి రా గూడల జుట్టు వెధవ. ఏ అమ్మేశావా?"

కొడుకు వేలు: "నా ఖర్మ! సినిమాకి వెళ్లామా! అందులో ఓ మాంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీలను బాదుతున్నాడు. అది చూసి నీ కోడలు నీ కోడలు కయ్య్ అని అమెరికాకి వినిపించేంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒకావిడ గుండె జబ్బు వచ్చి పడిపోయింది..."

వీరభద్రరావు దిమ్మతిరిగి పడిపోతాడు...

వేలు: "నాన్నా! నాన్నా! నీకు కూడా...నాకంత అదృష్టం కూడానా"..."ఆ ఈల విని ఆపరేటర్ అదిరిపడి సినిమా ఆపేసి లైట్లేశాడు. జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగితా సినిమా కూడా చూపించమంటూ ఈలేసి గోల చేస్తోందక్కడ...."

వీరభద్రరావు: "అబ్బా! మనకా ఈలల గోల ఏల? ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటావంటా లేని విద్యే? "

వేలు: "అబ్బా! దాని ఈలతోనే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్నా తలవాచిపోతోంది..."

వేలు శ్రీలక్ష్మితో: "ఆగు! ఏమిటే? ఊ! ఏమిటి ఇందాక నువ్వక్కడ చేసిన పని?"

శ్రీలక్ష్మి: "కోప్పడకండీ! అంత శబ్దం వస్తుందని అనుకోలేదు..."

వేలు: "నిన్ను...నిన్ను ఇక జన్మలో బయటికి తీసుకెళితే నా చెవిలో ఈలేసి చంపెయ్యవే"
శ్రీలక్ష్మి: "అంత మాటనకండీ. ఈల వెయ్యటం నాకు మాత్రం ఇష్టమేనా? ఏం చేయను ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్లు వాటంతట అవే దగ్గరవుతాయి, నోటి దగ్గరికి వెళ్లిపోతాయి, లోపలనుంచి గాలి వస్తుంది, బయటకి శబ్దమొస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండీ..."

వేలు: "నా వల్ల కాదే! ఈలేసే పెళ్లాన్ని ఏలుకోలేను. ఇవాళ్లో రేపో వకీలు గారిని కలిసి నీకు విడాకులిచ్చేస్తాను"

శ్రీలక్ష్మి: "అంటే ఏంటండీ"

వేలు: "కోర్టు వారు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని కాయితం ఇస్తారు..అది.."

దుఃఖంతో శ్రీలక్ష్మి కయ్య్ అని ఈల వస్తుంది

శ్రీలక్ష్మి: "క్షమించండి ఇది బాధ ఈల"

వీరభద్రరావు: "ఓసి నీ బాధ తగలెయ్య.  అమ్మ అమ్మ...గుండిగి కింద పడ్డ అప్పడంలా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరేయ్ కుంకాక్షీ. ఇకనుంచి క్షమించమని అదీ మీ ఆవిడనడక్కు. ఆ సంబరంలో మళ్లీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి..పో అవతలకి పో"

వేలు:"నాన్న..నాన్న గుండాడుతోందా?"

వీరభద్రరావు - "ఆ ఆ"

వేలు: "అమ్మబాబోయ్...పదవే లోపలకి పద"

13, ఫిబ్రవరి 2016, శనివారం

కృష్ణభక్తి - నాలుగవ సంచిక

కృష్ణభక్తి - నాలుగవ సంచిక


కృష్ణభక్తిలో మరో ప్రత్యేకత నృత్య హేల. బృందావనంలో గోపికలతో రాసహేలలో, వసంతోత్సవంలో ఆడి పాడే కృష్ణుని వర్ణిస్తూ ఎందరో భక్తులు స్వామి వైభవాన్ని మనకు ఆవిష్కరించారు. వారిలో ప్రముఖులు నారాయణ తీర్థుల వారు. ఆంధ్రనాట తల్లావఝ్ఝుల గోవింద  శాస్త్రిగా జన్మించి తమిళనాట స్థిరపడి నారాయణ తీర్థులుగా పేరుపొందిన ఈ యోగి కృష్ణునిపై భక్తితో అనుపమానమైన, అపురూపమైన కృష్ణలీలా తరంగిణిని రచించారు. నవ రసాలను ఒలికిస్తూ సంస్కృతంలో శ్రీకృష్ణుని లీలావినోదాలను నాట్యశాస్త్రానికి అనువుగా రచించారు. కృష్ణలీలా తరంగిణిలో బాలకృష్ణుని లీలలు మొదలు రుక్మిణీకళ్యాణం చివర.

నారాయణతీర్థులవారి కృష్ణలీలా తరంగిణిలో ఒక ప్రత్యేకమైన లక్షణం బాలకృష్ణుని లీలలను వర్ణనలలో కృష్ణుని ఆకృతిని, వేషభూషలను విశేషంగా ఉట్టంకించటం. బాల గోపాల కృష్ణ పాహి పాహి అనే తరంగంలో ఆ కృష్ణుని మనోజ్ఞంగా వర్ణించారు. ఆ తరంగం విశేషాలు:


బాల గోపాల కృష్ణ పాహి పాహి 

నీల మేఘ శరీరా నిత్యానందం దేహి

కలభ సుందర గమన కస్తూరి శోభితానన 
నళిన దళాయత నయన నంద నందన 
మిళిత గోప వధూజన మీనాంక కోటి మోహన 
దళిత సంసార బంధన దారుణ వైరి నాశన 

యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ 
యజ్ఞ ఫల వితరణ యతి జన తరణ 
అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ 
విజ్ఞాన దళితావరణ వేదంత వాక్య ప్రమాణ

వ్యత్యస్త పాదారవింద విశ్వ వందిత ముకుంద 
సత్యాఖండ బోధానంద సద్గుణ బృంద 
ప్రత్యస్తామిత భేద కంద పాలిత నంద సునంద 
నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద



బాలుడైన కృష్ణుని పాహి పాహి అని నుతిస్తూ మొదలయ్యే ఈ గీతంలో నీలిమేఘాల రంగుతో శరీరం కలిగిన ఆ బలుని శాశ్వతానందం ప్రసాదించమని వేడుకుంటున్నారు.

ఏనుగులా అందంగా నడిచే, కస్తూరితో శోభించే ముఖము కల, కలువ రేకుల వంటి కన్నులు గలవాడు ఆ నందకుమారుడు. గోపవధువులతో కలిసి ఆడి పాడేవాడు, కోటి మన్మథులకు సమానమైన మోహనాకారుడు అయిన ఆ కృష్ణుడు అతిభయంకరమైన శత్రువులను జయించిన వాడు, భక్తులను సంసార బంధములనుండి విడిపించే వాడు.

లోకకళ్యాణార్థమై ఋషులు చేసే యజ్ఞాలను కాపాడే వాడు, యాదవ వంశమునకు ఆభరణమైన వాడు ఆ కన్నయ్య. యజ్ఞఫలమును స్వీకరించే వాడు, యతులను తరింపజేసేవాడు వీడే. అజ్ఞాన మేఘములను తొలగించేవాడు, సమస్త లోకములకు కారణమైన వాడు ఈ బాలుడు. విజ్ఞానమును చాటే వాడు, వేదవేదాంతములకు ప్రమాణమైన వాడు ఈ బాలకృష్ణుడు.
 
వ్యత్యస్తమైన అడుగులతో (ఒక కాలు మరో కాలును దాటుతూ వేసే అడుగులు) అందమైన పాదములు కలవాడు, అఖండమైన సత్యమును బోధిస్తూ ఆనందించేవాడు, సద్గుణముల రాశి అయినవాడు ఆ బాలకృష్ణుడు. ఎవరిలో అయితే జీవరాశులలో ఉన్న భేదములన్నీ లీనమై మటుమాయమైపోతాయో,ఆతడే ఈ నంద సునందాదులను పాలించే బాలకృష్ణుడు. ఆ గోవిందుడు నారాయణ తీర్థులకు నిత్యము నిర్మలమైన ఆనందాన్ని ప్రసాదించే వాడు.

నారాయణ తీర్థుల వారి భక్తి మార్గము ఈ తరంగంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. లీలావేష్టితమైన శ్రీకృష్ణుని బాల్యము చిలిపి చేష్టలా అనిపించినా, అందులో ఆ బాలుడు వేసిన ప్రతి అడుగూ మానవజాతి ఉద్ధరణకే. మమకారం విహీనమై, పరిపూర్ణమైన ప్రేమ తత్త్వముతో మానవాళికి భేదభావములను మరపింపజేసి, మోహపాశములనుండి విడిపించి శాశ్వతానందాన్ని ప్రసాదించినవాదు కృష్ణుడు. ఈ మార్గంలో మానవునకు శత్రువులైన అరిషడ్వర్గముల నాశనం చేసి వారిని ఉద్ధరించినవాడు. కంసాది దానవుల సంహారం దీనికి సూచిక. ధర్మ సంస్థాపనకు ఈ లీలలు ముందడుగులు. యజ్ఞములు అనగా మనము కామ్యముతో చేసే నిత్యకర్మల యొక్క ఫలాన్ని స్వీకరించి మనలను సోపానములో ముందుకు నడిపించే వాడు ఈ సారథి. సమస్త వేదముల సారము, మూలము ఈ పరమాత్మ పరిపూర్ణ స్వారూపము. అజ్ఞానమును తొలగిస్తూ జ్ఞానాన్ని పంచే జగద్గురువు ఈ కృష్ణుడు. ఈ సందేశాన్ని పరిపూర్ణంగా ఈ తరంగంలో నారాయణ తీర్థుల వారు మనకు అందించారు.

కూచిపూడి నాట్యపద్ధతిలో నారాయణ తీర్థుల ఈ తరంగానికి చాలా ముఖ్యమైన స్థానముంది. ఈ తరంగ నాట్యము లేకుండా ఏ రంగప్రవేశమూ ఉండదు, ఎంత గొప్ప కళాకారులైనా ఈ తరంగాన్ని తమ నాట్యప్రదర్శనలలో ప్రదర్శించకుండా ఉండరు. మోహనరాగంలో కూర్చబడిన ఈ తరంగంలో కళాకారులు భక్తి జ్ఞాన కర్మ యోగములకు ప్రతీకగా పళ్లెము, చెంబుతో నర్తించటం ఆనవాయితీ. సంతులన, లయజ్ఞానం, పారవశ్యం అన్నీ మేళవించి కృష్ణ భక్తిని ఆవిష్కరించే అద్భుతమైన పుష్పం ఈ నారాయణ తీర్థుల వారి తరంగం.

దేహి తవ పద భక్తిం - త్యాగరాజస్వామి కృతి

దేహి తవ పద భక్తిం! వైదేహి! పతిత పావని మే సదా! ఐహికాముష్మిక ఫల దే! కమలాసనాన్యజ వర జనని! కలశవారాశిజనితే! కనక భూషణ లసితే! కలశజ గీత ముదితే! కాకు...