RightClickBlocker

18, ఫిబ్రవరి 2016, గురువారం

కృష్ణ భక్తి - ఐదవ సంచిక

కృష్ణ భక్తి - ఐదవ సంచిక


కృష్ణభక్తిలో రుక్మిణికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ భక్తిలో భర్త పట్ల ప్రేమానురాగాలతో పాటు ఆయన లోకేశ్వరుడు అన్న పరిపూర్ణమైన నమ్మకం ఉంది. స్వామిని అచంచలమైన భక్తి ప్రేమలతో కొలిచే రాణి రుక్మిణి. ఆ శ్రీమహాలక్ష్మి స్వరూపిణి యొక్క భక్తి వివరాలు ఈ రోజు "కృష్ణ భక్తి - ఐదవ సంచిక" లో తెలుసుకుందాం.

విదర్భదేశానికి రాజైన భీష్మకుని ఇంట రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అన్న సోదరులకు చెల్లెలిగా రుక్మిణి జన్మించింది. ఆ రుక్మిణి యుక్తవయసుకు రాగానే శ్రీకృష్ణునికి ఆమెపై వలపుల తలపులు కలిగాయి. తన తండ్రి భవనానికి వచ్చే అతిథుల ద్వారా శ్రీకృష్ణుని రూప గుణ వైభవాలు, శక్తి పరాక్రమాలు తెలుసుకున్న రుక్మిణి ఆ మహాత్ముడే నా భర్త అని నిశ్చయించుకుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడ ఆమె సౌందర్యము మరియు సౌశీల్యము గురించి తెలుసుకొని ఆమెను తన పత్నిగా భావించాడు. ఆత్మబంధువులంతా వారిరువురికి వివాహము చేయుట మేలు అన తలచారు. కానీ, కృష్ణ విరోధి అయిన అన్న రుక్మి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అప్పుడా రుక్మిణి అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా స్వామికి విదర్భ వచ్చి తనను తీసుకు వెళ్లమని సందేశం పంపింది. శ్రీమదాంధ్ర మహాభాగవతంలో పోతన దశమ స్కంధంలో ఈ విధంగా దీన్ని వివరించారు.

ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీరిపోవు
నే నీ శుభాకారమీక్షింపఁ గన్నులకఖిలార్థంబు కలుగుచుండు
నే నీ చరణసేవలే ప్రొద్దుఁ జేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీలసన్నామమేప్రొద్దు భక్తితోఁ దడవిన బంధ సంతతులు వాయు

నట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చి యున్నది నీ యాన నాన లేదు
కరుణఁ జాడుము కంసారి ఖలవిదారి శ్రీయుతాకార మానినీ చిత్తచోర

"ఓ కంసాంతకా! నీ సుగుణాల వివరాలు చెవులకు సోకగానే దేహతాపములు తీరును. చూడముచ్చటైన నీ రూపము చూసినంతనే కన్నులకు అన్ని శుభఫలములు కలుగును. ఎల్లప్పుడూ నీ పాదసేవ చేసే వారికి సమస్త ఔన్నత్యములు కలుగును. స్త్రీల మనసును దోచుకునే స్వామీ! నిరంతరమూ నీ పవిత్రమైన నామమును భక్తితో స్మరించువారికి అన్ని బంధములు తొలగును. అటువంటి నీ పై నా మనసు ఎల్లపుడూ లగ్నమై ఉంది. నాపై కరుణ చూపుము!" అని వేడుకుంటుంది.

ఘనులాత్మీయతమోనివృత్తి కొరకై గౌరీశుమర్యాద నె
వ్వనిపాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతురేనట్టి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరుజన్మంబులన్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!

"ప్రాణనాథా! మహాత్ములు తమ అజ్ఞానము తొలగుటకై శివునిలా నీ పాదపద్మములనుండి జారిన గంగాజలములో మునుగుటను కోరుకుంటారు. అటువంటి మహనీయుడవైన నీ యొక్క కృపకు నేను పాత్రురాలిని కాకపోతే కన్యగానే మిగిలిపోతాను. ఎన్ని జన్మలైనా నిన్నే ధ్యానిస్తాను. అంతే కాదు, నా ప్రాణాలు విడవటానికైనా సిద్ధమే. ఇది ముమ్మాటికీ నిజం"...

ఇలాగ, పరి పరి విధముల వేడుకున్న రుక్మిణి సందేశాన్ని అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణునికి విన్నవించగా ఆయన ఆమె మనోభీష్టాన్ని తెలుసుకొని సంతోషించి, విదర్భపై దండెత్తి రుక్మిణిని అపహరించి పరిణయమాడాడు.

రుక్మిణి భక్తి ఒకరకంగా మధురభక్తే. స్వామియే సర్వస్వము అనుకొని ఆతనికి తన మనము, తనువు, అంతఃకరణమును సమర్పించి ఆతని కోసమై వేచిన సాధ్వి ఆమె. స్వామి మహిమను తెలిసిన పతివ్రతా శిరోమణి. నిరంతర పతి ధ్యాన నిరత.  నిర్మలమైన తన ఆత్మను స్వామికి సమర్పించిన మహాభక్తురాలు.

ఒకసారి శ్రీకృష్ణుడు రుక్మిణి ఆట పట్టించటానికి "ఓ రుక్మిణీ! ఎందరో మహా పరాక్రమవంతులైన మహారాజులుండగా ఏమీ లేని, ఎవరికీ చెందని, ఈ యాదవుడనైన నన్ను ఎందుకు పరిణయమాడావు" అని అడుగుతాడు. అపుడామె:

రూఢిమైఁ బ్రకృతి పూరుష కాలములకు నీశ్వరుఁడవై భవదీయ చారు దివ్య
లలితకళా కౌశలమున నభిరతుఁడై కడగు నీ రూపమెక్కడ మహాత్మ!
సత్త్వాది గుణ సముచ్చయ యుక్త మూఢాత్మనయిన నేనెక్కడ ఘన చరిత!
కోరి నీ మంగళ గుణభూతి దానంబు సేయంగఁబడునని చెందు భీతి
నంబునిధి మధ్యభాగమందమృత ఫేన పటల పాండుర నిభమూర్తి పన్నగేంద్ర
భోగశయ్యను బవ్వళింపుచును దనరునట్టి యున్నతలీల దివ్యంబు దలఁప

"పరమాత్మా! నీ చరితము దివ్యమైనది. ప్రకృతీపురుషులకు, కాలానికి నువ్వు ప్రభువువు. నీది దివ్యమనోహర రూపము. ఎంతో అందముగా ఉండే కళలలో నీవు నైపుణ్యం కలవాడవు. అద్భుతరూపసంపన్నుడవైన నీవెక్కడ? సత్త్వరజస్తమోగుణములతో ఉన్న మూఢురాలను నేనెక్కడ? శుభకరమైన నీ సద్గుణములను ఇతరులకు దానము చేయవలసి వస్తుందేమో అనే శంకతో నీవు ఇష్టపూర్వకముగా పాలసముద్రము మధ్యలో అమృతపు నురగల వలె తెల్లగా ఉన్న ఆదిశేషునిపై పవళించి యున్నావు. ఇవన్నీ నీ దివ్యలీలలే అని స్వామి వైభవాన్ని విశదీకరిస్తుంది. ఇంకొక ముందడుగు వేసి ఆధ్యాత్మికంగా స్వామి గొప్పతనాన్ని వివరిస్తుంది..."

శబ్దస్పర్శరూపరసగంధంబులనియెడు గుణంబులచేతఁ బరిగ్రహింపఁబడిన మంగళ సుందర విగ్రహుండవై, అజ్ఞానాంధకార నివారకంబైన రూపంబు గైకొని , భవదీయులైన సేవకులకు ననుభావ్యుండవైతివి. భవత్పాదారవింద మకరంద రసాస్వాద లోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబు గాదట్లగుటంజేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యంబగుట యేమి సెప్ప. ఇట్టి ఈశ్వరుండవైన నీకు నిచ్ఛ స్వతంత్రంబు గావున. అదియును నాకధికంబు గావున నిన్ను నేననుసరింతు. దేవా! నీవకించనుడవైతేని బలి భోక్తలైన బ్రహ్మేంద్రాదులెవ్వరి కొరకు బలి సమర్పణంబు చేసిరి. నీవు సమస్త పురుషార్థమయుండ వనియును, ఫలస్వరూపివనియును, నీ యందలి ప్రేమాతిశయంబులంజేసి, విజ్ఞాన దీపాంకురంబున నిరస్త సమస్త దోషాంధకారులై, యిహ సౌఖ్యంబులు విడిచి, సుమతులు భవదీయ దాససంగంబు కోరుచుందురట్లు సేయనేరక, నిజాదికారాంధకార మగ్నులైనవారి భవతత్త్వంబు దెలిసి, బలిప్రక్షేపణంబులు సేయంజాలక, మూఢులై, సంసారచక్రంబునంబరిభ్రమింతురదియును గాక

వరమునీంద్ర యోగివర సురకోటిచే వర్ణిత ప్రభావ వైభవంబు 
గలిగి యఖిలచేతనులకు విజ్ఞానప్రదుండవగుదవభవ! దురితదూర!

"స్వామీ! నీవు సహజముగా దివ్యమంగళ స్వరూపుడవే అయినప్పటికీ, శబ్ద స్పర్శ రూప రస గంధాది పంచతన్మాత్రలతో ప్రకాశించే మంగళకర రూపమును దాల్చినావు. నీ దివ్యరూపము అజ్ఞానాంధకారాన్ని తొలగించేది. ఆ విధముగా సగుణ రూపుడవైన నీవు ఆరాధింపదగిన వాడవు. గొప్ప యోగులు కూడా నీ పాదపద్మములలోని తేనెను రుచిచూచుటకై తహతహలాడుతారు. అట్టి వారికి కూడా నీ తత్త్వము బోధపడదు. కాబట్టి పశువులతో సమానమైన ఈ మానవులకు నీ తత్త్వము ఎలా తెలుస్తుంది? నువ్వు సర్వేశ్వరుడవు. నీ సంకల్పానికి తిరుగులేదు. అది కూడా నాకు తెలియదు. అందుకే నేను నిన్ను అనుసరిస్తున్నాను. దేవా! నీవు ఏమీ లేని వాడవు. కానీ, బ్రహ్మాది దేవతలు కూడా నీకు బలి సమర్పిస్తున్నారు. అనగా నీవు వారికన్నా గొప్పవాడివనే కదా అర్థం! కాబట్టి నీవు అన్నిటినీ మించినవాడివి. చతుర్విధ పురుషార్థములు నీ స్వరూపాలే. యజ్ఞము, యాగము, తపస్సు మొదలైన కర్మల ఫలస్వరూపము నీవే. సజ్జనులు నీపై గల ప్రేమచే విజ్ఞానము యొక్క ప్రభావముతో సమస్త దోషములను పారద్రోలుతారు. వారు ఐహిక సుఖములను వదలి నీ దాసుల సాంగత్యమును కోరుకుంటారు. మూఢులు భౌతిక సుఖములను వదులుకోలేక అధికారములనే అంధకారములో కొట్టుమిట్టడుతూ నీ తత్త్వమును తెలుసుకోలేక, నిన్ను ఆరాధించక జనన మరణములనే చక్రములో పరిభ్రమిస్తారు. స్వామీ! నీవు పాపాలను బాపే వాడవు. మునులు, యోగులు, సమస్త దేవతలు నీ ప్రభావ వైభవమును వర్ణిస్తారు. నీవు అన్ని ప్రాణులకు విజ్ఞానాన్ని ఇచ్చేవాడవు..."

జలజనాభ! సకల జగదంతరాత్మవైనట్టి దేవ! నీ పదారవింద
యుగళి సానురాగయుక్తమై నా మదిఁ గలుగునట్లు గాఁగఁ దలఁపుమనఘ!

పృథురజోగుణ ప్రవృద్ధమైనట్టి నీ దృష్టిచేత నన్నుఁ దేరుకొనఁగఁ 
జూచుటెల్లఁ బద్మలోచన నీమీఁది ఘన దయార్ద్ర దృష్టిగాఁ దలంతు

"పద్మనాభా! మహాత్మా! నీవు ఈ ప్రపంచములో సమస్త ప్రాణులకు అంతరాత్మైనట్టి స్వామివి. నా మనస్సులో నిరంతరం నీ పాదకమలముల యందు భక్తి అనురాగములు వర్ధిల్లేలా అనుగ్రహింపుము. నీ చూపుల ద్వారా అనంతమైన ప్రేమానురాగాలు నాపై ప్రసరించి నన్ను తేరుకునేలా చేసితివి. నా మీద నీకు గల గొప్ప దయాదృష్టికి ఇదే నిదర్శనం..."

అని ఎంతో ఉదాత్తమైన భక్తితో, జ్ఞానంతో రుక్మిణి స్వామి వైభవాన్ని వేనోళ్ల నుతించింది. రుక్మిణి స్వామిని తన భరతగా మాత్రమే అనుకోక పరమాత్మగా గ్రహించింది. స్వామికి ఉన్న అనేక కోట్ల భక్తులలో తాను ఒకరు అనుకుంది. అందుకే ఆమెలో ఇతర కృష్ణ పత్నుల పట్ల అసూయ లేదు. భాగవతంలో శ్రీకృష్ణ తులాభారం గురించి రాయలేదు. కానీ, ఆ తులాభార ఘట్టం అనేక చోట్ల ప్రస్తావించబడింది. సత్యభామను పరీక్షించటానికి నారదుడు ఆమేచే వ్రతము చేయించి స్వామిని తనకు వ్రతఫలముగా దానమిప్పించుకుంటాడు. స్వామి దాస్యాన్ని విడిపించి, స్వామిపై పూర్తి హక్కులు కాలంటే ఆయనకు తూగగల సంపదను ఇస్తే చాలు అంటాడు.  అజ్ఞానంలో సత్యభామ ఆ తప్పటడుగు వేస్తుంది. తన దగ్గర ఎన్ని సంపదలు తులాభారంలో వేచినా అది స్వామికి సరితూగదు. అప్పుడు ఆమె రుక్మిణి వద్దకు వెళ్లి సాయం కోరుతుంది. స్వామిపై అచంచలమైన భక్తితో స్వామికి సమర్పించే తులసీదళాన్ని తీసుకు వెళుతుంది. స్వామికి తులసీదళం అత్యంత ప్రీతికరమైనదని తెలుసు. అందుకే భక్తితో స్వామిని ప్రార్థించి ఆ దళాన్ని తులాభారంలో ఉంచుంతుంది. స్వామి దానికి బద్ధుడవుతాడు.
సముద్రాల రాఘవాచార్యుల వారు ఈ రుక్మిణి భక్తిని, విశ్వాసాన్ని ఈ పద్యంలో అద్భుతంగా పండించారు.

"ఫలమో ఘన రసంబో పత్రమో పుష్పమో కొనుచు భక్తి నిన్ను కొలుచు వారికి ఈవు వశుడవగుటయే సత్యమేని ఈ తులసి దళము నిన్ను తూచు గాక!"

భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా? పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా భక్తితో నాకు సమర్పిస్తే దానిని స్వీకరిస్తాను అని? అదే విధంగా రుక్మిణి భక్తితో సమర్పించిన ఆ తులసీదళం స్వామిని తులాభారంలో బద్ధుడిని చేస్తుంది. ఇక్కడ తులసీదళం కాదు ముఖ్యం, రుక్మిణి భక్తి. ప్రభువుపై ఆమెకు గల విశ్వాసం. దీనినే వేటూరి సుందరరామమూర్తి గారు "తులసీదళానికి తేలిపోయి తూగునటే ఆనందలీల ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెలా అంత వింత గాథల్లో ఆ నందలాలా" అని అద్భుతంగా ఆవిష్కరించారు.

కృష్ణ భక్తి సామ్రజ్యంలో రుక్మిణి స్థానం స్వామి హృదయంలోనే. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి