20, ఫిబ్రవరి 2016, శనివారం

తొలిరేయి గీతాలు - ఎంత హాయి ఈ రేయి (గుండమ్మ కథ)

తొలిరేయి గీతాలు - ఎంత హాయి ఈ రేయి (గుండమ్మ కథ)


పెళ్లైన జంటకు తొలిరేయి మరపురానిది. ఇద్దరు ఒకటయ్యే వేళ మధురభావనలన్నీ పండే వేళ. ఆ భావనలను అలనాటి చిత్రాలలో అశ్లీలం లేకుండా ఎంతో అందంగా చిత్రకీరించే వారు. అప్పటి దర్శకులు, గేయ రచయితలు తొలి కలయికకు సూచికగా ఎంతో భావయుక్తమైన గీతాలను అందించారు. తొలిరేయి చిత్రీకరణలో నటీనటుల ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. సున్నితమైన శృంగారాన్ని, ప్రేమానురాగాలను, కొంటెతనాన్ని, పవిత్రమైన బంధాన్ని నటనలో ప్రదర్శించవచ్చు. అలా చేసిన నటులు ఆ గీతాలను అజరామరం చేశారు. ఒక స్త్రీకి తన భర్తపై గల అనురాగం, ఒక పురుషుడికి తన పత్నిపై గల అధికారం కలబోసిన ఎన్నో గీతాలు తెలుగు సినీ స్వర్ణయుగంలోని చిత్రాలలో వచ్చాయి. అవి బహుళాదరణ పొందాయి. అటువంటి గీతాలలో మొట్టమొదటగా నాకు గుర్తుకు వచ్చేది గుండమ్మ కథ చిత్రంలో "ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి" అనే యుగళ గీతం. తొలిరేయి గీతాలు శీర్షికన మొట్ట మొదట ఈ గీతం వివరాలు మీకు అందిస్తున్నాను.

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి 
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా
చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా

ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయించగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశించగా

కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోలపాడగా
మధుర భావలాహిరిలో మనము తూలిపోవగా
మధుర భావలహరిలో మనము తేలిపోవగా

విజయా ప్రొడక్షన్స్ పతాకంలో కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో 1962లో విడుదలైన గుండమ్మ కథ చిత్రంలోనిది ఈ గీతం. పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యాన్ని అందించగా ఘంటసాల మాష్టారు సంగీతం కూర్చారు. మాష్టారు, సుశీలమ్మ యుగళగీతాన్ని అక్కినేని, జమునల జంటపై చిత్రీకరించారు.

కలలతోటలే విహరించే ఓ స్త్రీ మనోభావాలను, ఆమె భర్త మనోభావాలను దాదాపుగా ఒకే రకమైన పదాలైనా, వైవిధ్యాన్ని విలక్షణంగా అందించారు పింగళి వారు. ఘంటసాల మాష్టారి సంగీతానికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. మాధుర్యానికి, రాగ లక్షణాలకు ఆయన పెద్ద పీట వేసేవారు. అదే శైలి ఈ పాటలో కనబడుతుంది. ఒకింత శృంగారము, ఒకింత మైమరపు, ఒకింత పులకింత, ఒకింత ఎదురుచూపు...అన్ని మధుర భావనలూ పింగళి ఈ గీతంలో ఒలికించారు. భార్యాభర్తల మధ్య శృంగారానికి పవిత్రమైన మధుర భావనలే నాంది. దాన్ని కవి ఈ గీతంలో చాలా స్పష్టంగా ఆవిష్కరించారు.

స్త్రీకి పురుషుడికి ఉన్న భావనలలో తేడాను కవి ఎంత సునిశితంగా ప్రతిపాదించారో చూడండి. నాయకుడు చందమామ చల్లగా మత్తు మందు జల్లగా అన్నాడు. కొంత శృంగార భావనలో మత్తు, మైకము మగవారికి చల్లని వాతావరణంలో కలిగే మాట నిజమే. దానినే ఆ స్త్రీ పన్నీటి జల్లు చల్లగా అని మార్చి పాడింది. స్త్రీ భావనలో చందమామ చల్లదనం పన్నీటి జల్లుగా అనిపించటం స్త్రీత్వానికి ప్రతీక. ఇంద అందంగా మొదలైన గీతం చరణాల్లో మరింత భావగర్భితమైంది.

శృంగారానికి అధిదేవత మన్మథుడి సృష్టి అయిన పూలబాణాలు చూపులతో విసురుకున్నట్లు నాయకుడు భావించటం ఆయనలో మన్మథుడు రేపిన వలపుల తలపులు అంత వాడిగా ఉన్నాయి అనే దానికి ప్రతీక. అదే ఆ స్త్రీ ఆ చూపులను పూల సుగంధాలుగా భావించింది. స్త్రీ సున్నితత్వానికి రతీదేవి ప్రతీక. పింగళి వారు ఎంత అందంగా, విరితూపులు-విరితావులు అన్న పదాలలో భేదాన్ని మనకు అందించారో? మరి మన్మథుడి బాణాలు తగిలితే జరిగేది మైమరపులో తూలిపోవటమే కదా? దానినే నాయకుని తదుపరి భావనగా తెలిపారు. పూల సుగంధాలు తాకితే? మగవారికి విరహాతిశయమే కదా? అదే స్త్రీకి? ఆ ఘుమఘుమలతో శరీరం పరవశించిందిట. ఇదీ మొదటి చరణంలో పింగళి వారి శృంగార రసధార.

ఇక రెండవ చరణంలో - కనిపించని కోయిలలు పాడి ఆ నాయకునిలో కోరికలను మేలుకొలిపితే నాయిక ఆ కోయిల పాటను జోలపాటగా భావించింది. మళ్లీ స్త్రీ పురుషుల భావనలో ప్రకృతీ పురుషుల విలక్షణతను ఆవిష్కరించారు కవి. మరి కోయిల పాటతో మేల్కొన్న పురుషుడికి స్త్రీపై కలిగిన మధుర భావనల వలన జరిగేది మైమరపులో తూలిపోవటమే కదా? దానినే నాయకుని తదుపరి భావనగా తెలిపారు. కోయిల గానం జోలపాటగా భావించిన స్త్రీకి మధురమైన ఆ భావనలో మనసు తేలిపోతాయి కదా? దానిని నాయకి భావంగా ప్రతిపాదించారు. ఇదీ రెండవ చరణంలో పింగళివారి శృంగార రసావిష్కరణ.

పింగళి వారి సాహిత్యానికి ఘంటసాల  మాష్టారి సంగీతం తలమానికమైంది. అప్పటికే అగ్రశ్రేణి నేపథ్యగాయకులుగా ఉన్న మాష్టారు, సుశీలమ్మ ఈ పాటలోని భావానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మధురమైన లలిత శృంగార గీతానికి మోహన రాగాన్ని మించినదేముంది? సమ్మోహనం చేసే సంగీతాన్ని మాష్టారు ఈ రాగంలో ఈ గీతానికి అందించారు. సౌందర్యానికి, ఒకింత పొగరుకు, హావభావాలకు, పెంకితనానికి జమునగారు పెట్టిన పేరు అయితే, ధీరుడైన, పరిణతి చెందిన యువకునిగా నటించటం నాగేశ్వరరావు గారికి కొట్టిన పిండి. ఆనాటి సాంఘిక చిత్రాలలో వీరి నటనకు ప్రజలు జేజేలు పలికారు. వారిలో గొప్పతనం ఏమిటంటే శృంగార సన్నివేశాలలో కూడా అంతే అద్భుతంగా నటించారు. దానికి ఈ గీతం చక్కని ఉదాహరణ. సంగీతం, సాహిత్యం, గాత్రం, నటన కలయికే ఈ అజరామరమైన తొలిరేయి గీతం. ఇప్పటికీ దీని సుగంధం మనకు అందుతూనే ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి