5, జులై 2011, మంగళవారం

స్వామి దయానంద సరస్వతి రచన - భో శంభో శివశంభో స్వయంభో

దయానంద సరస్వతి స్వామి

ఎందరో మహానుభావులు శీర్షికన ఇదివరకే కొన్ని సాహిత్య, సంగీత ప్రధానమైన వ్యాసాలు నా బ్లాగ్ లో రాశాను. గత రెండు దశాబ్దాలలో నా స్మృతిపథంలో ప్రత్యేక స్థానాన్ని ఒక సత్పురుషులు కోయంబత్తూర్ ఆర్షవిద్యాగురుకులాన్ని స్థాపించిన స్వామి దయానంద సరస్వతి (ఆర్య సమాజ్ స్థాపకులు కాదు). ఆయన వేదవేదాంగాలు, ఉపనిషత్తులలో విజ్ఞానాన్నే కాకుండా సంగీత సాహిత్యాభిలాషను, పాండిత్యాన్ని మనకు అందించారు . వారి జీవిత విశేషాలు:

తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని మంజకూడిలో ఒక సాంప్రదాయ కుటుంబంలో, గోపాల్ ఐయ్యరు, బాలాంబాళ్ దంపతులకు 1930 సంవత్సరంలో జన్మించారు. నటరాజన్ గా నామకరణం చేయబడ్డారు. చిద్యాభ్యాసం తరువాత, భారతదేశం గర్వించగిన ఆధ్యాత్మిక సంస్థ చిన్మయ మిషను వ్యవస్థాపకులు స్వామి చిన్మయానంద వారి ప్రసంగాలచే ప్రభావితులైనారు. వారి వద్ద ఆరేళ్ల శిష్యరికం తరువాత 1962 లో సన్యాసం స్వీకరించి దయానంద సరస్వతిగా పేరు పొందారు. తరువాత గురువుల నిర్దేశంతో గుడివాడలో స్వామి ప్రణవానంద వద్ద వేదాంతంలో నిగూఢాలను అభ్యసించారు. చిన్మయ మిషన్ వారి సాందీపనీ సాధనాలయ ద్వారా ఎంతో సేవ చేశారు. అటు తరువాత స్వామి తారానంద గిరి వద్ద బ్రహ్మసూత్రాలను నేర్చారు. విద్యార్థులు వేదాంతము, సంస్కృతము అభ్యసించటానికి ప్రపంచవ్యాప్తంగా మూడు ఆర్షవిద్యా గురుకులాలను అమెరికాలోని పెన్సిల్వేనియా, హృషీకేశ్, కోయంబత్తూర్లలో ఏర్పాటు చేశారు. మూడున్నర ఏళ్ల పాటు ఉండే ఈ శిక్షణా కాలంలో సంస్కృతి మీద దృష్టితో అభ్యాసన జరుగుతుంది. 1990 మొదలు ఇప్పటివరకు ఆరు శిక్షణా కాలాలను పూర్తి చేసి దాదాపు 670కి పైగా సుశిక్షిత వేదాంతాధ్యాపకులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ సారాన్ని పంచారు . నవీన అభ్యాసపద్ధతికి, ప్రాచీన సిద్ధాంతాలకు మధ్య వారధిలా ఈ తరగతులను ఏర్పరచి కొత్త ఒరవడిని సృష్టించారు దయానంద సరస్వతి. తన ప్రవచనాలు, తరగతుల ద్వారా ఎన్నో లక్షలమంది జీవితాలను ప్రభావితం చేశారు. ఈ తరగతులను ఎన్నో కార్పొరేట్ సంస్థలలో యిచ్చి అక్కడ అనూహ్యమైన మార్పులను తీసుకువచ్చారు. ఇప్పటి భక్తి మరియు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెళ్లలో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు మనకు అందజేస్తున్న స్వామి పరిపూర్ణానంద సరస్వతి వీరి శిష్యులే. కాకినాడలో పరిపూర్ణానంద సరస్వతివారు శ్రీ పీఠం పేరిట సమాజసేవలో ఉన్నారు. ఆర్షవిద్యా గురుకలంలా అందించబడే దీర్ఘకాలిక శిక్షణలో భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాంత ప్రకరణాలైన తత్త్వబోధ, ఆత్మబోధ, పంచదశీ, బ్రహ్మసూత్రాలు, పాణినీ వ్యాకరణమనే అంశాలపై 3-1/2ఏళ్ల పాటు శిక్షణ ఉంటుంది.  ఇవేకాక, 1 నుండి 24 వారాల స్వల్పకాలిక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.

యునెస్కోవారి సమావేశాల్లో, యూఎన్వో వారి ప్రపంచ శాంతి సమ్మేళనంలోను స్వామి దయానంద సరస్వతి ప్రసంగించారు. స్వామి వారు అఖిల భారత సేవా ఉద్యమం పేరిట గ్రామాల్లో విద్య, వైద్యము, పోషకాహారము, మౌలిక వసతులుపై ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి వారి సుయత్నాలతో భారతీయ ఆధ్యాత్మిక గురువులు, సంస్థలన్నీ కలసి ఆచార్య సభగా ఏర్పడి ఈ ఉద్యమాన్ని నడిపారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో స్వామి వారు పాల్గొని తన ఆధ్యాత్మిక సందేశాన్ని మరియు మార్గాన్ని ప్రపంచం ముందుంచి నడిపిస్తున్నారు. ఆర్షవిద్యాగురుకులం ఎన్నో హిందూ మత అంశాలపై స్వామి వారి భాషణలను పుస్తకాల రూపంలో ప్రచురిస్తోంది.

సుదీర్ఘమైన సనాతన ధర్మ సేవ తరువాత స్వామి వారు 2015 సెప్టెంబరు 23న హృషీకేశ్ దగ్గరి ఆశ్రమమంలో పరమపదించారు. మరణశయ్యపై కూడా పరమాత్మ నామాన్ని నిరంతరం స్మరించిన మహనీయులు దయానంద సరస్వతి.

సంగీతం మోక్షానికి సోపానంగా భావించే స్వామి వారు శాస్త్రీయ సంగీత వికాసానికై ఆర్ష కళారంగం అనే వేదిక ద్వారా ఏటా రెండు మార్లు శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులైన వారికి ఆర్ష కళా భూషణం అనే అవార్డును ప్రదానం చేశారు. సంగీతం ద్వారా శ్రోతలు, కళాకారులు ఈ ప్రాపంచిక విషయాలను దాటి ముక్తి వైపు చూసే అపురూపమైన అవకాశాన్ని పొందుతారని స్వామి వారి ప్రగాఢ విశ్వాసం. సంగీతం ద్వారా భారతీయులు సనాతన ధర్మంతో నిరంతర సాంగత్యం ఏర్పరచుకోగలరని స్వామి వారి నమ్మకం.  స్వామి వారు ఏడు అపూర్వమైన కీర్తనలను రచించారు. వాటిని మహారాజపురం సంతానం గారు మొట్టమొదట గానంచేసి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. వాటిలో ఒకటి మీ కోసం.

ఇటీవలి కాలంలో దక్షిణభారత నృత్య సాంప్రదాయమైన భరతనాట్యంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆంశం - భో శంభో శివ శంభో. నృత్యానికి తల్లి వంటిది అయిన శివతాండవములో ఉండే లయ, స్తుతి, శివతత్త్వము ఈ రచనలో ఉన్నాయి. చిదంబరలయుడై ఆ పరమశివుడు నర్తించే విధానాన్ని ఈ కృతి మనకు క్షణం క్షణం గుర్తు చేస్తుంది. రేవతి రాగం, ఆది తాళంలో స్వరపరచబడి, సంస్కృత భాషలో ఈ గీతం వ్రాయబడింది. ఈ కృతిని సంగీత కళానిధి మహారాజపురం సంతానం గారు అద్భుతంగా ఆలాపించారు.వారి గళంలో ఈ కీర్తన వినండి.

సాహిత్యం:

భో శంభో శివశంభో స్వయంభో

గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక |భో శంభో శివశంభో స్వయంభో|

నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ అగమ భూత ప్రపంచ రహిత
నిజగుహనిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ |భో శంభో శివశంభో స్వయంభో|

ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం
తోం తోం తరికిట తరికిట కిటతో
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంబర వేష్టిత వేషా
నిత్య నిరంజన నిత్య నటేశా ఈశా సభేశా సర్వేశా |భో శంభో శివశంభో స్వయంభో|
ఈశా సభేశా సర్వేశా

భావం:

ఓ శివా! స్వయంభూ అయిన శంభో! గంగను ధరించిన శంకరా! కరుణాకరా! మా సంసార సాగరాన్ని దాటించే ప్రభో! గుణములు లేని, పరబ్రహ్మ స్వరూపా! పోవుట, వచ్చుట (జనన మరణములు) మొదలైన ప్రాపంచిక విషయాలకు అతీతమైన శంభో! లక్షణాలకు అతీతమైన, ఆంత్యము కలిగిన వాటికి అతీతమైన ఆనంద స్వరూపా! అతిశయా! క్షయము లేని లింగ స్వరూపా! ధిమి ధిమి లయ ధ్వానములతో నర్తించే, మతంగ మునిచే పూజించబడిన ఈశా! దిక్కులు, ఆకాశమే వస్త్రములుగా కల, సత్య రూపములో అగుపించని, ఎల్లప్పుడూ మచ్చలేకుండా శుద్ధ స్ఫటికంలా ఉండే, ఎల్లప్పుడూ నటిస్తూ ఉండే శంకరా! సభకు ఈశ్వరా! అందరికీ ఈశ్వరా!

పరిశీలన:

శివతత్త్వంలో ముఖ్యలక్షణాలు - కాలాతీతమైన శివుడు, లయకారకుడు, భక్త వశంకరుడు, శుద్ధచైతన్య స్వరూపమైన వాడు. వీటిని ఆధారం చేసుకొని ఎన్నో స్తోత్రాలు వేల సంవత్సరాలుగా ఆది శంకరుల నుండి నేటి సమకాలిక భక్తి గీతాలు, కృతుల వరకు వస్తూనే ఉన్నాయి. కానీ, ప్రతి ఒక్క రచన అనుపమానంగా నిలిచాయి. దయానంద సరస్వతుల వారు ఈ కృతిలో శుభంకర తత్త్వ లక్షణాలతో మొదలుకొని, సచ్చిదానంద తత్త్వ వర్ణనలైన గుణరాహిత్యము, పరబ్రహ్మము, శాశ్వతము, అనంతము, ఆనందాతిశయము అనే ఆధ్యాత్మిక నిజ లక్షణాలను మొదటి చరణంలో అక్షరమాలగా అందించారు. రెండవ చరణంలో లయకారుని మొదటి లక్షణమైన తాండవహేల, సర్వవ్యాపినమీశ్వరం అనే తత్త్వాన్ని చాటే దిగంబర లక్షణం, వెండికొండవలె మచ్చలేని శుద్ధ స్పటిక సంకాశ తత్త్వము, సర్వేశ్వర తత్త్వములను మాలికలా అందించారు.

సంతానంవారు ఈ కీర్తనను గానం చేస్తుంటే శివుడు నాట్యం చేస్తూ దర్శనమిచ్చాడని నానుడి. ఎంత హృద్యంగా గానం చేశారో విని తరించండి. తమిళనాడులోని చిదంబర నటరాజ మందిరంలో ఈ గానం చేసినప్పుడు శ్రోతలు ఆనందబాష్పాలు రాల్చారని సంగీతప్రియులు చెప్పుకుంటారు. నృత్య ప్రదర్శనలలో లోతైన అంశంగా వీక్షకులను ఆకర్షించే లక్షణాలన్నీ అత్యున్నత స్థాయిలో ఉన్న కీర్తన ఇది. అందుకే గాయకుల నోట అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇంత మంచి రచన మనకు అందించినందుకు దయానంద సరస్వతి స్వామి వారికి శత సహస్ర వందనాలు.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం

3, జులై 2011, ఆదివారం

పురీ జగన్నాథ రథ యాత్ర

నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే
బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమః
జగదానంద కందాయ ప్రణతార్తిహరాయచ
నీలాచల నివాసాయ జగన్నాథాయతే నమః
( పురీ జగన్నాథుని ప్రార్థనా మంత్రములు)

నిత్యమైన వాడు, పరమాత్మ, బలరామ సుభద్రలతో నీలాచలమునందు నివసించి యున్న జగన్నాథునికి నమస్కారములు. జగత్తుకు ఆనందం కలిగించే వాడు, శరణు కోరిన వారు ఆర్తిని హరించే వాడు, నీలాచలమునందు నివసించి యున్న జగన్నాథునికి నమస్కారములు

జగన్నాథ రథ యాత్ర:
అంతా జగన్నాథ మయం. ఇది ఈ తొమ్మిది రోజులు పురీలో పరిస్థితి. ఆషాఢ శుద్ధ విదియ మొదలు శుద్ధ ఏకాదశి వరకు బలభద్ర, సుభధ్ర, జగన్నాథుల ఉత్సవాలు పురీలో కన్నుల పండువగా జరుగుతాయి. ఇదే సాంప్రదాయాన్ని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ మందిరాలలో, జగన్నాథ మందిరాలలో కూడా పాటిస్తూ ఆ శ్రీకృష్ణ సోదర సోదరిల రథయాత్రను జరుపుకుంటున్నారు. అసలు ఏమిటి ఈ రథయాత్ర?


పురీలో వెలసిన శ్రీకృష్ణావతరము జగన్నాథుడు. సువిశాలమైన ప్రాంగణములో కళింగ శిల్పకళాశైలిలో కట్టబడిన మనోహరమైన మందిరములో సర్వదేవతా సమూహము మధ్య ఈ జగన్నాథుడు బలరామ, సుభధ్రా సమేతుడై శోభిల్లుతున్నాడు. సామాన్య జనుల పాపహరణమునకై, దుఃఖభంజనమునకై ఆ నారాయణుడు ప్రతిఏటా ఈ సమయములో రథారూఢుడై పురీ నగరవీథుల ఊరేగుతూ గుండిచా ఉద్యానవనమందిరాన్ని చేరుకుంటాడు. అక్కడ తొమ్మిది రోజులపాటు భక్తులకు దర్శనమిస్తూ వారి పాపసంచయమును పటాపంచలు చేస్తుంటాడు.  ఈ యాత్రనే గుండిచా యాత్రగా కూడా పిలుస్తారు.

రథయాత్రలో ముగ్గురి దేవతలకూ మూడు విడి రథాలు ఉంటాయి. పీతాంబరధరుడైన జగన్నాథునికి ఎరుపుపై పసుపు వన్నెతో శోభితమైన రథము, అగ్రజుడైన బలభద్రునికి ఎరుపుపై నీలం రంగుతో మెరిసే రథము, చెల్లెలు సుభద్రకు ఎరుపుపై నలుపు వర్ణంతో భాసిల్లే రథము తయారు చేస్తారు. ప్రతి సంవత్సరము పాత రథాలను భిన్నంచేసి, కొత్తగా రథాలను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ఒడిషా వాసులకు అత్యంత శుభకరమైన రోజుగా భావించే అక్షయ తృతీయనాడు కొత్త రథాల తయారు పురీ మహారాజు ఇంటి ముంగిట మొదలు పెడతారు. ఇదే రోజు 3 వారాలపాటు జరిగే చందన యాత్ర కూడా మొదలవుతుంది.

జగన్నాథుని రథము పేరు నందిఘోష, బలభద్రుని రథము పేరు తలధ్వజ (ధ్వజముపై ఈత చెట్టు ఉంటుంది), సుభద్ర రథము పేరు దర్పదళన (గర్వాన్ని భంగము చేసేది). రథాలకు వాడే చెక్కలను దసపల్లా నుండి దుంగల్లా మహానది నీటిలో పురీకి తీసుకువస్తారు. తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ రథాలను తయారుచేసే వడ్రంగుల వంశానికి చెందినవారే ఈ రథాలను తయారు చేస్తారు. జగన్నాథుని రథం నలభై ఐదు అడుగులు, బలభద్రుని రథం నలభై నాలుగు అడుగులు, సుభధ్ర రథం నలభై మూడు అడుగుల పొడుగు ఉంటాయి. నందిఘోషకు 16 చక్రాలు, తలధ్వజకు 14 చక్రాలు, దర్పదళనకు 12 చక్రాలుంటాయి. ప్రతిరథము చుట్టూ 9 పార్శ్వదేవతల మూర్తులు (చెక్కలపై చెక్కబడిన చిత్రాలు) ఉంటాయి. బలభద్రుని రథానికి తెల్లని గుర్రాలు, జగన్నాథుని రథానికి నల్లని గుర్రాలు, సుభద్ర రథానికి ఎర్రని గుర్రాలు నాలుగు చొప్పున ఉంటాయి. రథాలకు చోదకులుగా మాతలి, దారుక, అర్జునులు ఉంటారు.

ఈ యాత్రలో పురీ రాజావారు బంగారు చీపుర్లతో వీథులను ఊడుస్తారు. సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలతో వీధులను గజపతి రాజావారు స్వయంగా పునీతం చేస్తారు. అందంగా పూలతో అలంకరించబడిన రథాలు, మేళ తాళాలతో, ఆషాఢ శుద్ధ విదియనాడు, వేలాదిమంది తాళ్లతో హరినామ స్మరణ చేస్తూ, రథాలను లాగుతూ ఉండగా జగన్నాథ మందిరంనుండి బడా దండా అనబడే ముఖ్య వీధి ద్వారా దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఉద్యానవనానికి చేరుకుంటాయి. యాత్రలో ముందు బలభద్ర సుభద్రలు తరలి వెళ్లగా, వారి వెనుకు జగన్నాథుడు యాత్ర చేస్తాడు.ఈ దారి పొడుగునా లక్షలాది జనం రథాలను తాకుతూ, లాగుతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఇలా చేయటం వలన తమ పాపాలన్నీ ఆ విశ్వంభరుడు తొలగిస్తాడని ప్రగాఢ నమ్మకం. రథయాత్రలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో పాటు సుదర్శన చక్రాన్ని కూడా ఊరేగిస్తారు.

రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే - రథములో జగన్నాథుని రూపమైన వామనుని చూసినంత పునర్జన్మ లేదని ప్రతీతి. పురీ పట్టణంలో జగన్నాథుని మహిమవలన యముని ప్రభావం చాలా తక్కువ ఉంటుందని, దాని వలన ఈ క్షేత్రానికి యమనిక తీర్థంగా పేరు వచ్చింది. ఈ రథయాత్ర సమయంలో యాత్రలో ఉండే ప్రతి వస్తువును (రథము, తాళ్లు, గుర్రాలు మొదలైనవి) జగన్నాథునిగానే భావిస్తారు. రథయాత్ర తిరుగు ప్రయాణంలో మేనత్త మౌసీ మా గుడి వద్ద ప్రత్యేక ఫలహారాన్ని దేవతలకు నివేదిస్తారు. ఏడు రోజులు గుండిచా మందిరంలో ఉన్న తరువాత మూలమూర్తులు తిరిగి జగన్నాథ దేవాలయ గర్భగుడిలో స్వస్థానాలకు చేరుకుంటాయి.  ప్రపంచంలో అతిపెద్ద మతయాత్రగా పేరుపొందిన ఈ రథయాత్ర భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు తలమానికం.

జయ జగన్నాథ! బలభద్ర! సుభద్ర!  ఓం జగన్నాథాయ నమః!

2, జులై 2011, శనివారం

మైసూరు మహారాజా జయచామరాజేంద్రుల శ్రీ మహాగణపతిం భజేహం

మైసూర్ మహారాజా జయచామరాజ వొడెయార్
 సంగీత, సాహిత్య ప్రియులైన పాలకులు ఎంతో మంది భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద ఇంకా పదిలంగా ఉండటానికి వారి వంతు కృషి చేశారు. స్వాతంత్ర్యానికి మునుపు భారత దేశపు రాచరికపు వ్యవస్థలో ఒక ముఖ్య రాజ్యం మైసూరు. 18వ శతాబ్దములో హైదర్ అలీ, టిప్పు సుల్తానుల పరిపాలనల తరువాత విశాలమైన మైసూరు రాజ్యాన్ని బ్రిటీషువారు స్వాధీనం చేసుకొని అందులో ఉత్తర భాగాన్ని దక్కన్ నిజాములకు, తీరప్రాంతాన్ని మద్రాసు ప్రెసిడెన్సీ రాష్ట్రానికి ధారాదత్తం చేసి మిగిలిన భాగాన్ని మైసూరు ప్రిన్స్లీ రాష్ట్రంగా చేసి, దానికి ఏ అధికారాలు లేని నామమాత్రపు రాజుగా వొడెయార్ వంశస్థులను నియమించారు. ఈ వొడెయార్లు మైసూరు రాజ్యాన్ని దేశ స్వాతంత్ర్యము వచ్చే వరకు పాలించారు. స్వాతంత్ర్య సమయములో భారత ప్రభుత్వము రాచరికాలను రద్దు చేసి, కొద్దికాలం తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అప్పుడు ఈ ప్రాంతం బెంగళూరు రాజధానితో కర్ణాటక రాష్ట్రంగా మారింది.

స్వాతంత్ర్యానికి పూర్వం మైసూరు రాజ్యానికి ఆఖరి మహారాజు జయచామరాజ వొడెయార్. పాశ్చాత్య, కర్ణాటక సంగీతాలలో ప్రవీణులైన వీరు గొప్ప ఆధ్యాత్మికవేత్త కూడా. మైసూరు వాసుదేవాచార్యుల వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకుని తమ ఆస్థానంలో టి. చౌడయ్య, టైగర్ వరదాచార్, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ వంటి మహామహ సంగీత విద్వాంసులను గౌరవంతో పోషించారు. జయచామరాజేంద్రులు సంగీతానికి చేసిన సేవపై ఆంగ్లంలో "కాంట్రిబ్యూషన్స్ ‍అండ్ ప్యాట్రొనేజ్ ఆఫ్ వొడెయార్స్ టు మ్యూజిక్" అనే పుస్తకం కూడా ప్రచురించబడింది. పురాణాలు, దత్తాత్రేయ తత్త్వము, కుండలినీ యోగ, అద్వైత సిద్ధాంతము, శ్రీ సురేశ్వరాచార్య మొదలైన ఎన్నో పుస్తకాలను రచించారు. రాజా వారి ఆధ్వర్యంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు కన్నడంలోకి అనువదింపబడి జయచామరాజ గ్రంథ రత్నమాలగా వెలువడ్డాయి. ఇప్పటికీ మైసూరులోని మహారాజా ప్యాలెస్ వీరి రాచరికపు వైభవాన్ని, సంపదను, కళాతృష్ణను కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింబిస్తుంది.

ఇక రాజావరి సంగీత పిపాసకు వస్తే, ఆయన తను ఉపాసించిన శ్రీవిద్యను ముద్రగా చేసుకుని కీర్తనలు రచించారు. రాజా వారిని గురువులు సిద్ధలింగస్వామి వారు శ్రీవిద్య ఉపాసనలో ప్రవేశ పెట్టారు. సిద్ధలింగస్వామి వారు నాగలింగ మఠాధిపతులు. గురువుల అనుగ్రహంతో రాజావారు శ్రీచక్రార్చనలో లోతైన జ్ఞానాన్ని సంపాదించి ఆ మార్గంలో ముందుకు వెళ్ళారు. గురువులపై గల గౌరవంతో రాజా వారు నాగలింగ ముద్రను కూడా తన కీర్తనలలో ఉపయోగించారు. రాజావారు రచించిన 94 కీర్తనలలో ఎక్కువ కీర్తనలు లలిత అమ్మవారిపై రచించినవే. 11 గణపతిపై, 13 శివునిపై, 4 విష్ణువుపై, 2 సరస్వతిపై, 1 గాయత్రిపై ఆయన రచించిన కృతులు. అన్ని కృతులు సంస్కృతంలో రచించినవే. కీర్తనలలో ఎక్కడా రాజసాన్ని కనిపించనీయకుండా సర్వోన్నతమైన ఆధ్యాత్మిక విలువలను, ఆయా దేవతల అగణిత గుణ మహిమా వైభవాలను రాజా వారు ప్రదర్శించారు. ఇటువంటి రచనలు చేయాలంటే ఆయా దేవతల అనుగ్రహము సిద్ధించనిదే అసాధ్యము. ప్రతి ఒక్క కృతి సంపూర్ణ రస సిద్ధికి తార్కాణంగా నిలిచిన రచనలను రాజా వారు చేసి సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు.

రాజా వారి రచనలలో ప్రముఖంగా ప్రాచుర్యం పొందింది అఠాన రాగంలో కూర్చబడిన శ్రీ మహా గణపతిం భజేహం. గొప్ప ఆధ్యాత్మిక భావనతో, ఉత్కృష్టమైన సాహిత్యంతో రాజావారు ఈ కీర్తన రచన చేశారు.

సాహిత్యం:

శ్రీ మహాగణపతిం భజేహం శివాత్మజం షణ్ముఖాగ్రజం

సిద్ధగణ సేవితం విఘ్న నాశకం శీఘ్ర వర ప్రసాద దాయకం
సదయం కపిలముని వరదాయకం గురుసేవాసక్తం హేరంబం | శ్రీ మహాగణపతిం భజేహం |

జ్ఞానముద్రాలంకృతం మూలాధార నివాసినం
| శ్రీ మహాగణపతిం భజేహం |

గజారణ్య వాసినం జ్యోతిర్మయం ఉపనిషద్సారం
పంచ భూతాత్మకం సింధురప్రియం పంచ మాతంగ ముఖం
| శ్రీ మహాగణపతిం భజేహం |

కామేశ నయనాహ్లాదకం నాగలింగ వరపుత్రం
శ్రీ విద్యా చిద్ప్రభానంద రాజయోగీంద్ర వందితం
| శ్రీ మహాగణపతిం భజేహం |

హేరంబ గణపతి

 భావము:

శివుని కుమారుడైన, సుబ్రహ్మణ్యునికి అగ్రజుడైన శ్రీ మహాగణపతిని భజిస్తున్నాను. సిద్ధులు, దేవ గణములచే సేవింపబడిన వాడు, విఘ్నాలను నాశనం చేసేవాడు, త్వరగా వరములు ప్రసాదించే వాడు, కపిలముని(1) ప్రార్థన విని వేగముగా వచ్చి ఆయనను బ్రోచినవాడు, గురువుల (పెద్దల) సేవయందు ఆసక్తి కలవాడు, పెద్ద తొండము కలవాడు అయిన శ్రీ మహాగణపతిని భజిస్తున్నాను. ఎల్లప్పుడు జ్ఞానముద్రలో(2) ఉన్నవాడు, మూలాధారచక్రమునందు నివసించే వాడు (3) అయిన శ్రీ మహాగణపతిని భజిస్తున్నాను. గజారణ్యమున నివసించే వాడు (4), జ్యోతిర్మయుడు, ఉపనిషత్తుల సారమైన వాడు, పంచభూతములైన పృథివ్యాపస్తేజోవాయురాకాశములే తానైన వాడు, సింధుర ప్రియుడు, పంచ మాతంగ ముఖములు కలవాడు (5) అయిన శ్రీ మహాగణపతిని భజిస్తున్నాను. శివుని కన్నులకు ఆనందం కలిగించే వాడు, ఆయన వరపుత్రుడు, ఆ లలితాదేవి రూపమైన పార్వతి మనస్సును ఆనందంగా ఉంచే వాడు (6), రాజులు, యోగులచే పూజింపబడిన వాడు అయిన శ్రీ మహాగణపతిని భజిస్తున్నాను.

పైన చెప్పిన అర్థములో 1-6 అంశాల వివరణ:
  1. మహారాష్ట్రలో చింతామణి గణపతి చాలా సుప్రసిద్ధం. ఈయనకు సంబంధించి ఒక గాథ ఉంది. పూర్వం కపిలముని వద్ద చింతామణి అనే మణి ఉండేది. అది కోరిన కోరికలను తీర్చే కల్పతరువు వంటిది. అక్కడి ప్రభువైన అభిజిత్తు, గుణవతిల కుమారుడైన గుణ రాజకుమారుడు ఒకమారు కపిలుని ఆశ్రమానికి వస్తాడు. ఆ ముని రాజకుమారునికి చింతామణి మహిమతో షడ్రసోపేతమైన భోజనము ఏర్పాటు చేస్తాడు. ఆ మణి సంగతి తెలిసి రాజకుమారుడు మణిని తనకిమ్మని కపిలుని అడుగుతాడు. కపిల ముని దానికి అంగీకరించక పోగా, రాజ కుమారుడు ఆ మణిని దొంగిలిస్తాడు. బాధతో కపిలుడు గణపతిని ప్రార్థించగా ఆ విఘ్నేశుడు రాకుమారుని యుద్ధంలో సంహరించిన పిమ్మట, అభిజిత్తు మహారాజు మణిని కపిలునికి తిరిగి ఇవ్వబోగా, కపిలుడు అది తనకు వలదంటాడు. గణేశుడు అక్కడే కదంబ వృక్షము కింద వెలస్తాడు. అప్పటినుంచి కపిలుడు ఆ గణేశుని చింతామణి గణేశునిగా కొలుస్తాడు. ఈ చింతామణి గణేశ క్షేత్రం మహారాష్త్రలోని థేవూర్ లో (పుణే దగ్గర) ఉంది. మహారాష్ట్రలోని అష్టవినాయకులలో ఒకటి ఈ చింతామణి వినాయకుడు
  2. జ్ఞాన ముద్ర - కుడి చేతి చూపుడు వేలు బొటనవేలును తాకునట్లు వృత్తాకారము చేసి మిగిలిన మూడు వేళ్లను ఆకాశము వైపు చూపుతూ చేయిని హృదయస్థానమునందుచుట - ఎల్లప్పుడు జ్ఞానమయుడై మనందరికి జ్ఞానాన్ని పంచేవానికి సంకేతం. చిద్యలో విజయానికి గణనాథుని కొలవటం హిందూమతంలో ప్రసిద్ధి పొందిన ఆచారం, నమ్మకం.
  3. కుండలినీ యోగములో శరీరములో వేర్వేరు భాగముల యందు స్థితమైన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార చక్రములలో అన్నిటికన్నా క్రిందది అయిన మూలాధార చక్రము వెన్నుపూస చివరన, రెండు విసర్జన భాగముల మధ్య ఉంటుంది. ఇది పీతాంబరమైన చతుర్భుజాకారము చుట్టూ నాలుగు ఎర్రని రేకులు కలిగిన పద్మము రూపములో ఉంటుంది. దీని మూలదేవత గణపతి.
  4. గజారణ్యము అనేది రెండు చోట్ల ఉన్నట్లు గాథలు. ఒకటి తిరుచిరాపల్లి సమీపంలోని కావేరీ తీరంలో; రెండవది కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని తలకాడ్ సమీపంలోని కావేరీ తీరాన ఉన్నది. మహారాజావారు తలకాడ్ సమీపంలో ఉన్న గజారణ్యాన్ని గురించి ప్రస్తావించారని నేను అనుకుంటున్నాను. స్కాందపురాణం ప్రకారం సిద్ధారణ్య అన్న పేరు గల ఈ ప్రాంతం చాల ఏనుగులు ఉండటం వలన గజారణ్యం అని పేరుగాంచింది. తల, కాడ అనే ఇద్దరు వేటగాళ్లు ఈ ప్రాంతంలో కొన్ని ఏనుగులు ఒక శివలింగాన్ని కలువలతో పూజించటం చూస్తారు. వారు అక్కడ ఒక చెట్టును నరుకుతుండగా కొమ్మవిరిగి లింగం మీద పడినప్పుడు ఆ లింగము నుండి రక్తము స్రవించిందట. అప్పుడు ఆకాశవాణి ఆ వేటగాళ్లిద్దరికి ఆ గాయాన్ని ఆ చెట్టు ఆకులతోనే సరిచేయమని చెబుతుంది. ఆ సేవకు సంతోషించి శివుడు ప్రత్యక్షమై ఆ వేటగాళ్లకు, అక్కడి ఏనుగులకు ముక్తి ప్రసాదిస్తాడు. ఆ వేటగాళ్ల పేరిట ఆ ప్రాంతానికి తలకాడ్ అని పేరు వచ్చింది.
  5. పంచముఖ హేరంబ గణపతి - సాధారణ గణపతి రూపాలకు కొంచెం భిన్నంగా ఈ పంచముఖ గణపతి సింహవాహనుడై నాలుగు దిక్కులా నాలుగు ముఖములు, వీటి శీర్షముపై ఆకాశ దిక్కుగా ఐదవముఖముగా ఉంటాడు. ఈ పంచముక్ష గణపతి -  మహా గణపతి, సిద్ధి గణపతి, విద్యాగణపతి, శక్తి గణపతి, మోక్ష గణపతిలకు ప్రతీకగా చెప్పబడినది. అలాగే ఈ ఐదు ముఖములు శివ, విష్ణు, బ్రహ్మ, శక్తి, సూర్య తత్త్వములుగా, పంచ భూతములు ఈ గణపతినుండి ఉద్భవించినట్లుగా, సృష్టి, స్థితి, లయ, అదృశ్య, అనుగ్రహ కారకములుగా చెప్పబడినది.
  6. కొన్ని మూలాలలో ఇది శ్రీ విద్యా చిద్భవానంద అని వ్రాయబడింది. ఆ పార్వతీదేవి మనస్సంకల్పముతో పుట్టినవాడే గదా గణపతి. కాకపోతే, చిద్ప్రభానంద అని తీసుకుని ఆ తల్లి మనస్సులోని వెలుగు, ఆనందకారకుడు అన్నా కూడా వన్నె, భావము ఏమీ తగ్గలేదు. మహారాజపురం సంతానంగారు (శ్రవణం లంకె) చిద్భవానంద అనే గానం చేశారు.

ఈ కీర్తనను సునిశితంగా పరిశీలిస్తే, జయచామరాజేంద్రులు గాణాపత్యంలో లోతైన సాధనచేసి కొంత ఉపాసనలో ఉన్నత సోపానలు అధిరోహించినట్లు అవగతమవుతున్నది. యోగములోని ముద్రలు, శరీరములోని చక్రములు వాటి ప్రాధాన్యత, అరుదైన రూపాలలోని విశిష్టత, క్షేత్ర స్థల పురాణాల ఉదహరణ రాజావారి జ్ఞాన సంపదను, స్థాయిని తెలుపుతున్నది. ఇటువంటి సంగీత సంపదను మనకు యిచ్చిన జయచామరాజ వొడెయార్ మహారాజులకు ధన్యవాదములు. సంగీతపు స్వర్ణయుగములో ఈ కళను, కళాకారులను, వెలలేని ఆధ్యాత్మిక సంపదను నిలబెట్టి, పెంచి పోషించిన వారు ధన్యజీవులు.

ఎందఱో మహానుభావులు అందరికి వందనములు

1, జులై 2011, శుక్రవారం

శ్యామ శాస్త్రి సంగ్రహ చరిత్ర - కళ్యాణి రాగంలో కృతి బిరాన వరాలిచ్చి బ్రోవుము

శ్యామ శాస్త్రి 

కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధి పొందిన సమకాలీకులు కాకర్ల త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. శ్యామ శాస్త్రులు వీరి మువ్వురిలో పెద్దవారు. ఈయన సంగీతానికి పుట్టిల్లైన తంజావూరు దగ్గరి తిరువారూరులో విశ్వనాథ అయ్యరు, వేంగలక్ష్మి దంపతులకు 1762 (కొన్ని మూలాల్లో 1763గా ఉంది) జన్మించాడు. వేంకటసుబ్రహ్మణ్య అయ్యరుగా నామకరణం చేయబడినా, శ్యామకృష్ణ అన్న ముద్దు పేరుతో పిలువబడ్డాడు.వీరి కులదైవము తంజావూరులో ఉన్న బంగారు కామాక్షీ దేవి. శ్యామకృష్ణులు పసిప్రాయంలోనే తెలుగు, సంస్కృతము, తమిళ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలోనే నారదులు ఈయనపై అనుగ్రహించి సంగీతస్వామి అనే సన్యాసి రూపంలో వీరి ఇంటికి వచ్చి, ఈ బాలునిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి, శ్యామకృష్ణునికి సంగీత జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. తంజావూరు శరభోజీ మహారాజు మన్ననలు పొందినా శ్యామశాస్త్రులు పెద్దగా శిష్యవారసత్వాన్ని సమకూర్చుకునే ఆసక్తి చూపలేదు. మదురై మీనాక్షి, తంజావూరు బంగారు కామాక్షిలపై శ్యామశాస్త్రులు ఎన్నో కీర్తనలు రచించారు. త్యాగయ్య కూడా తంజావూరు ప్రాంతంలోనే ఉండటం చేత శ్యామయ్యకు,త్యాగయ్యకు సాన్నిహిత్యం ఏర్పడింది. సంగీత శాస్త్రమే కాకుండా, శ్యామశాస్త్రులు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించి తంజావూర్ సంస్థానంలో పేరుగాంచారు. శ్యామశాస్త్రులు చాలా మటుకు కృతులు తెలుగు, సంస్కృత భాషలో రచించారు.

శ్యామశాస్త్రులు మదురై మీనాక్షి అమ్మవారిపై రచించిన తొమ్మిది కృతులు నవరత్న మాలికగా  పేరు పొందాయి. వీటిలో ఆనందభైరవిలో 'మరివేరేగతి యెవ్వరమ్మా', శంకరాభరణంలో 'సరోజదళనేత్రి హిమగిరిపుత్రి' ఆ ఆదిపరాశక్తి వర్ణనలో ప్రత్యేకతను చాటుకున్నాయి. అలాగే, తిరుచిరాపల్లి సమీపంలోని జంబుకేశ్వరంలో పంచభూత లింగాలలో ఒకటైన జలలింగ స్వరూపుడైన శివుని నాయికగా ఉన్న అమ్మ అఖిలాండేశ్వరిని స్తుతిస్తూ ద్విజావంతి రాగంలో 'అఖిలాండేశ్వరి రక్షమాం' అని అద్భుతమైన రచన చేశారు. కులదైవమైన కామాక్షిపై మధ్యమావతిలో 'పాలించు కామాక్షి పావని పాపశమని', చింతామణి రాగంలో 'దేవి బ్రోవ సమయ మిదే', పున్నాగవరాళిలో 'కనకశైలవిహారిణి', తంజావూరు బృహదీశ్వరుని నాయికయైన బృహన్నాయకీ దేవిపై ఆనందభైరవిలో 'హిమాచల తనయ బ్రోచుటకిది మంచి సమయము', మధ్యమావతిలో 'బృహన్నాయకి నన్ను బ్రోవు వేగమే', నాట రాగంలో 'పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి' మొదలైన ఎన్నో కీర్తనలను రచించారు. తంజావూరు పరిసర ప్రాంతాలైన వైదీశ్వరన్ కోయిల్, పుదుక్కోటై మొదలైన క్షేత్రాలలోని ఆరాధ్య దైవాలను తన కీర్తనలలో నుతించారు శ్యామశాస్త్రులు. దాదాపు 300కు కృతులను రచించిన శ్యామ శాస్త్రి 1867 సంవత్సరములో పరమపదించారు. ఈయన కుమారుడైన సుబ్బరాయ శాస్త్రి కూడా ప్రముఖ కృతి కర్త. రీతిగౌళలో 'జననీ నినువినా' అనే కీర్తన సుబ్బరాయ శాస్త్రి రచించినదే.  కృతులలో శ్యామయ్య వారి ముద్ర 'శ్యామకృష్ణ సోదరి'.

ఈ వ్యాసంలో శ్యామశాస్త్రుల వారి కృతి ఒకటి కళ్యాణిలో 'బిరాన వరాలిచ్చి బ్రోవుము' పొందు పరుస్తున్నాను.

కళ్యాణి రాగం:

అరవై ఐదవ మేళకర్త రాగం అయిన కళ్యాణి అత్యంత ఆహ్లాదకరమైన రాగంగా పేరుపొందింది. వందకు పైగా జన్య రాగాలు కలిగిన కళ్యాణిలో ఎన్నో మధురమైన కీర్తనలు స్వరపరచబడ్డాయి. షడ్జమము(స), చతుస్రుతి రిషభం, అంతర గాంధారం (గ), ప్రతి మధ్యమం (మ), చతుస్రుతి దైవతము (ద), కాకల నిషాదము (ని) ఈ రాగానికి స్వర స్థానాలు. కల్యాణికి, శంకరాభరణానికి కేవలం మధ్యమం లోనే తేడా(శంకరాభరణంలో శుద్ధ మధ్యమం). శివునికి శంకరాభరణం ప్రీతికరమైతే కళ్యాణి ఆ పార్వతీదేవికి ఆనందదాయకమైనది. అందుకే కల్యాణిలో ఎన్నో దేవీ కృతులు స్వరకల్పన చేయబడ్డాయి. అర్థనారీశ్వర తత్త్వానికి సంకేతముగా శంకరాభరణములో అమ్మవారి కృతులు, కళ్యాణిలో దేవదేవుని కృతులు కూడా కూర్చబడ్డాయి. సర్వ స్వర గమక వారికా రక్తి రాగముగా (అన్ని స్వరములు గమకముతో ఆలాపించవచ్చు) పేరుకాంచిన మోహనము, కాంభోజి, శంకరాభరణము, సావేరి, చక్రవాకముల సరసన నిలిచిన మేళకర్త రాగం కళ్యాణి. 'నిధి చాలా సుఖమా', 'హిమాద్రిసుతే పాహిమాం', 'సుందరి నీ దివ్య రూపమును', 'బిరాన బ్రోవ సమయమిదే', 'వాసుదేవయని వెడలిన' - ఇలా ఎన్నో కీర్తనలు ఈ రాగంలో ప్రాచుర్యము పొందాయి.

తంజావూరు బంగారు కామాక్షి

కృతి సాహిత్యం:
బిరాన వరాలిచ్చి బ్రోవుము నిను నెర నమ్మితి
పురారి మనోహారిణి శ్రీ కామాక్షి (అంబ పురారి) |బిరాన|

తామసము సేయక నీవు కరుణానిధి గాదా (అంబ తామసము సేయక)
పరాముఖమికనేల విను సరోజముఖి |బిరాన వరాలిచ్చి బ్రోవుము|

కామితార్థ దాయకి దేవి నతకల్పలతిక (అంబ కామితార్థ)
పురాణి మధురవాణి శివునికి రాణి |బిరాన వరాలిచ్చి బ్రోవుము|

శ్యామకృష్ణ సోదరి గౌరి పరమేశ్వరి గిరిజా (అంబ శ్యామకృష్ణ సోదరి)
అనాథ రక్షణమ్ము సలుపగ రావే |బిరాన వరాలిచ్చి బ్రోవుము|

అర్థము:

అంబా! శివుని మనస్సును అలంకరించిన కామాక్షీ! త్వరగా వరములిచ్చి నన్ను బ్రోవుము. నిన్నే సంపూర్ణముగా నమ్మియున్నాను.  కమలము వంటి ముఖము కల అంబా! నువ్వు కరుణానిధివి కదా! ఆలస్యము చేయకు. వేరే వైపు ముఖము వద్దు. నా మనవి విని త్వరగా వరములిచ్చి నన్ను బ్రోవుము. అంబా! పురాణములలో నుతించబడి, మధురమైన వాక్కు కలిగిన ఓ శివుని రాణీ! కోరిన కోర్కెలు దీర్చే దేవీ! భక్తుల పాలిట కల్పవృక్షమైన నీవు త్వరగా వరములిచ్చి నన్ను బ్రోవుము. ఓ శ్యామకృష్ణ సోదరీ (శ్రీహరి సోదరి గౌరి కదా), పరమేశ్వరుని రాణి, హిమవంతుని కుమారీ! ఈ భువిలో అనాథుల రక్షణ చేయుటకు వేగముగా రమ్ము. త్వరగా వరములిచ్చి నన్ను బ్రోవుము.

ఈ కృతిలో మొదటి చరణం ఎక్కడా పాడగా వినలేదు. సాయంకాల రాగంగా ప్రసిద్ధి చెందిన కళ్యాణిలో వేడుకోలు, ఆర్తి, భక్తి చాలా విపులంగా వినిపించ వచ్చు. అందుకే ఈ రాగం బహుళ ప్రాచుర్యం పొందింది. బిరాన వరాలిచ్చి బ్రోవుము కృతిని డాక్టర్ బాలమురళీకృష్ణ గారి గళంలో , ఎమ్మెల్ వసంతకుమారి గారి గళంలోడీకే పట్టమ్మాళ్ గారి గళంలో వినండి (మూడు లంకెలు కూడా ఆల్బంకు తీసుకు వెళ్తాయి. అక్కడ కృతిపై క్లిక్ చేస్తే ప్లే అవుతాయి). నాకు అన్నిటికన్నా మంగళంపల్లి వారి గాత్ర శుద్ధి నచ్చింది (తెలుగు భాషను విరచనందుకు).  వసంతకుమారి గారి నెరవులు ఆహ్లాదంగా ఉన్నాయి.

శివదూతీ శివారాధ్యా శివమూర్తి శ్శివంకరీ
శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా

27, జూన్ 2011, సోమవారం

ధర్మస్థళ మంజునాథుడు - మహా ప్రాణదీపం శివం శివం

మంజునాథుడు
శంభో! గిరీశ! సురపూజిత! కామవైరిన్!
గౌరీశ ! శంకర! మహేశ్వర! విశ్వహేతో!
ధర్మస్థలేశ! సకలేశ! దయాపయోధే!
శ్రీ మంజునాథ! నిరతాం కురు మంగళం మే!

శివతత్త్వమే అత్యంత శుభకరము, భవహరము, హృదయంగమము. అందులో సత్యక్షేత్రమైన ధర్మస్థళ మంజునాథుడు సాక్షాత్తు కలియుగంలో పిలిస్తే పలికేటి దైవముగా ప్రసిద్ధి చెందాడు. సత్యము, భిన్నత్వములో ఏకత్వము, సామ్యము, భక్తి, ధర్మ బద్దత ఈ క్షేత్రపు విశిష్టత. కర్ణాటక లోని దక్షిణ కన్నడ జిల్లాలో పశ్చిమకనుమలలో నేత్రావతి నది ఒడ్డున వెలసి అలరారుతున్నది శ్రీ క్షేత్ర ధర్మస్థళ. ఇక్కడ అణువణువు పరబ్రహ్మ మయము. అన్నదానము (ప్రపంచంలో ఇంకెక్కడా అన్నదానం ధర్మస్థళలో జరిగినట్లు జరుగదేమో), విద్యా దానము (విద్యా సంస్థల ద్వారా), ఔషధ దానము (రోగుల కొరకు ఆస్పత్రులు), అభయ దానము (వివాహములకు) మొదలైన సేవాతత్పరతకు పుట్టిల్లు ఈ ధర్మస్థళ. తీర్థంకర జైనులచే ఆరాధించబడి, వారి పరంపరలో పరిపాలన సాగిస్తూ, హిందూ మత సాంప్రదాయములో నిత్య పూజలతో, జాతి కుల మత భేదము లేకుండా సర్వధర్మ సమభావాన్ని ఈ క్షేత్రం చాటి చెబుతోంది. దక్షిణాదిన ప్రజలకు తిరుమల వేంకటేశ్వరుని రీతి మంజునాథునిపై కూడా అపారమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం విశేషం.

ఒక్కోసారి చలనచిత్రాలు అద్భుతమైన భక్తి భావనలను, పారలౌకిక వర్ణనలను, మహాద్భుతమైన పద ప్రయోగం ద్వారా మనకు అందజేస్తాయి. అందులో 2001లో విడుదలైన శ్రీమంజునాథ చిత్రంలో శ్రీవేదవ్యాస రచించిన మహా ప్రాణ దీపం శివం అనే గీతం విశిష్టమైనది. శివతత్త్వాన్ని సంపూర్ణంగా వివరిస్తూ, ఆ మంజునాథుని వైభవాన్ని, భక్తుని ఆర్తిని అసమానమైన భాషా పరిజ్ఞానంతో వేదవ్యాసగారు మనకు అందించారు. దీనికి మధురమైన సంగీతం సరస్వతీ పుత్రులు హంసలేఖ గారు అందించగా గాయకుడు శంకర్ మహదేవన్ ఆ మహాదేవ శంకరుని పూర్తిగా ప్రేక్షకుల, వీక్షకుల హృదయాలలో నిలిపారు.

వీలైనంత వరకు సాహిత్యము నిశితంగా విని పొందుపరుస్తున్నాను. ఇంకా తప్పులేమైన ఉంటే దయచేసి తెలియజేయండి.

ఓం మహా ప్రాణదీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం 
భవానీ సమేతం భజే మంజునాథం
 
ఓం...నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ భవహరాయచ
మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం
ఓం అద్వైత భాస్వరం అర్ధనారీశ్వరం త్రిదృశ హృదయంగమం చతుర్దధిసంగమం పంచ భూతాత్మకం షట్ఛత్రునాశకం సప్త స్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశా సువిమలం ఏకాదశోజ్వలం
ఏకనాథేశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవ తారకం ప్రకృతి హిత తారకం భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం వృషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరి మంత్ర మాధ్యం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ
మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం 

ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢంకా నినాద నవ తాండవాడంబరం తద్ధిమ్మి తకధిమ్మి ధిద్ధిమ్మి ధిమిధిమ్మి సంగీత సాహిత్య సుమ కమలమంబరం
ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్మ ప్రఘాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక ధూర్తం విబుద్ధం సుహిద్ధం
నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం
మహా కాల కాలం మహా నీలకంఠం మహానంద కందం మహాట్టాట్టహాసం జటా ఝూట రంగైక గంగా సుచిత్రం జ్వలన్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాసం మహా భాను లింగం
మహాబభ్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహా కాలేశ్వరం వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం 
లింగేశ్వరం రామలింగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం ఘృశ్నేశ్వరం త్య్రంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిహోమాత్మకం..

అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం

ఓం.. నమః సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయాచ.. 

ఈ గీతంలో భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలు, శివ నామావళి, గుణగణాలు, అనంత మహిమా విశేషణములు, శివుని రూపలావణ్యములు, దేహ లక్షణములు, చమక సారూప్యాలు, శివతాండవ ఉద్విగ్నాలు అన్నీ అనుపమానంగా రచించారు వేదవ్యాస్ గారు. బీజాక్షర రూపునిగా, పంచాక్షరీ వాసునిగా, పనసలో ఏకమును నుంచి ఏకాదశము వరకు ఏకామ్రేశుని సులక్షణ వర్ణన, పద ప్రయోగం దివ్యానుభూతిని కలిగిస్తాయి. ఒక పారలౌకిక స్థితిలోకి మనలను కొన్ని నిమిషాల పాటు తీసుకువెళ్లే ఈ గీతం ఎప్పటికీ శివలీలామృతాన్ని పంచే ఒక శాశ్వత సుగంధ సుమమని నా అభిప్రాయం. గీతాన్ని విని, చూసి ఆనందించండి.

26, జూన్ 2011, ఆదివారం

అన్నమయ్య నాదోపాసన - అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

హరియవతార మీతడు అన్నమయ్య
కలియుగ దైవమైన వేంకటేశుని మంత్రాన్ని నుతిస్తూ తాళ్లపాక అన్నమాచార్యులు ఒక దివ్యమైన కీర్తన రచించారు. మంత్రాలన్నీ ఈ వేంకటేశ మంత్రములో నున్నవని దీని సారము. అమృతవర్షిణి రాగంలో అమృతాన్ని కురిపించారు అన్నమయ్య గురుదేవులు. సంకీర్తనా శైలిలో ఆనాటి వాడుక భాషలో, సుళువుగా పామరునికి కూడా అర్థమయ్యే భాషలో తన రచనలు చేసి అన్నమయ్య ఎప్పటికీ ప్రతి తెలుగువారి హృదయ కమలములోనూ సుస్థిర స్థానం ఏర్పచుకున్నారు. అవతారమంటే ఒక ముఖ్యమైన మార్పుకు నాంది వేసి దానిని సఫలీకృతం చేయటమే కదా? మరి ఆ ఏడుకొండలవాసుని వేల కీర్తనలలో నుతించి ఆ వేంకటేశ ప్రాభవాన్ని కలియుగ వాసులకు అందించారు అన్నమయ్య. అందుకే ఆయన అవతారము పూర్ణము, ధన్యము మరియు సాఫల్యము.

 సాహిత్యం:

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము


నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము


రంగగు వాసుదేవ మంత్రము ధృవుడు జపియించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము


ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము


వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి

భావము:

"చిన్నప్పుడే నాకు అందిన ఈ వేంకటేశ మంత్రములో అన్ని మంత్రాలు నిలయమై ఉన్నాయి. నారదుడు నారాయణ మంత్రము జపించగా, ప్రహ్లాదుడు నారసింహ మంత్రమును పొందాడు. సంకల్పముతో విభీషణుడు రామ మంత్రమును పొందగా, నాకు ప్రత్యేకముగా వేంకటేశ మంత్రము కలిగినది. ధ్రువుడు అందమైన వాసుదేవ మంత్రమును జపించగా, కృష్ణుని మంత్రమును అర్జునుడు భక్తితో సాధన చేసెను. చిలుక అయిన శుకుడు ముక్కుతో విష్ణు మంత్రమును పఠించగా, నాకు అనన్యమైన ఈ వేంకటేశ మంత్రము అబ్బినది. ఇన్ని మంత్రములకు శ్రీహరిని కనుటయే లక్ష్యము. ఇదియే తథ్యముగా పరబ్రహ్మ మంత్రము. నన్ను కాచుటకు నా గురువులిచ్చిన వెన్నెలవంటిది ఈ వేంకటేశు మంత్రము." - అన్నమయ్య

అంతరార్థము:

శ్రీ వేంకటేశుడే పరబ్రహ్మము. ఆయన మంత్రము మోక్షమునకు ఏకైక సాధనము. అంతకు మునుపు ఉత్తమోత్తములైన హరి భక్తులు (నారదుడు, ప్రహ్లాదుడు, విభీషణుడు, ధ్రువుడు, అర్జునుడు, శుకుడు) ఆ పరమాత్ముని వేర్వేరు అవతారముల మంత్రములతో కొలిచి మోక్షమును పొందారు. నాకు ప్రత్యేకమైన, అనన్యమైన వేంకటేశు మంత్రము చిన్నతనములోనే గురువుల అనుగ్రహము వలన వెన్నెల లాగా కలిగినది. అన్ని మంత్రములు ఈ వేంకటేశ మంత్రములో స్థిరమై ఉండుట వలన ఇదియే పరబ్రహ్మము, మోక్షకారకము అని అన్నమయ్య వేంకటేశుని మంత్ర మహిమను కొనియాడారు. కలియుగములో శ్రీనివాసుని స్మరించుట మించి మోక్షమునకు సులువైన మార్గము లేదని ఆయన నొక్కి వక్కాణించారు. అందుకే ఆయనను 'హరి అవతారమీతడు అన్నమయ్య' అని కొలిచారు శిష్యకోటి. మన పాపములను హరించే శ్రీ వేంకటేశుని పాదపద్మములకు, అన్నమయ్య గురు చరణములకు నీరాజనములు.

విద్వాంసులు, సహృదయులు, గురువులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాదు గారు ఈ సంకీర్తనను అమృతవర్షిణి రాగంలో వెన్నెలరేయి అంత చల్లగా, వేసవి మామిడి పండంత తీయగా ఆలాపించారు. వారికి శిరసు వంచి పాదాభివందనములు.

8, మే 2011, ఆదివారం

శంకర జయంతి - సంగ్రహ చరిత్ర

(కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైటు, గీతా ప్రెస్సు వారి వివేక చూడామణిలోని శంకరులపై ఉపోద్ఘాతము ఆధారంగా)

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం


పరమశివుని మొదలు, ఆది శంకరుల మధ్యగా, నా గురువులు రమణరావు గారి వరకు ఉన్న గురు పరంపరకు వందనములు.

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం

ఆది శంకరుల జయంతి నేడు. శంకరశ్శంకరస్సాక్షాత్ - శంకరాచార్యులంటే సాక్షాత్తు శంకరులే అని చెబుతాము. ఆ ఆది శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. 

ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ ఛాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బమున ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్ద్ర నక్షత్రములో అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట. 

దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ఒకరోజు బాల శంకరులు నదీస్నానము చేస్తుండగా ఒక మొసలి అతని కాలిని నోట కరచుకుంటుంది. కేకలు పెడుతున్న కుమారుని చూసి ఆర్యాంబ భయపడుతుంది. ఏమి చెయ్యాలో తెలియక ఆమె దుఃఖిస్తుంది. అప్పుడు శంకరులు తల్లితో తన జీవితం ముగియబోతోందని, తల్లి తన సన్యాసానికి అంగీకరిస్తే తాను సన్యాసిగా రెండవ జీవితం ప్రారంభిస్తానని అంటాడు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడతారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు.

శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు.

ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు  వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటారు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతారు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.

బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు.

హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు.  ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడుగుతారు. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరిస్తాడు. ఆ సందర్భముగా ఆది శంకరులు ఆ నరహరిని స్తుతిస్తూ కరుణారస పూరితమైన, శరణాగతితో నిండిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు.

శంకర భగవత్పాదులు కాశీలో ఉన్న సమయంలో అక్కడ నివసించుచున్న వివిధ మతముల వారి వాదనను ఖండిస్తారు. అక్కడినుండి కురుక్షేత్రమునకు, తదుపరి బదరికాశ్రమునకు వెళ్లి ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు చాల వరకు కాశీలో, బదరికాశ్రమములో చేసినవే. తదుపరి శంకరులు ప్రయాగ, అటు తర్వాత మాహిష్మతీ పురము వెళ్తారు. అక్కడ మండన మిశ్రుల వద్ద శాస్త్రార్థ విచారము మొదలు పెడతారు. మధ్యవర్తిగా మండన మిశ్రుని భార్య అయిన భారతీదేవి వ్యవహరిస్తుంది. చివరకు మండన మిశ్రులు ఓడిపోతారు. ఆయన శంకరుల శిష్యరికము స్వీకరించి సురేశ్వరాచార్యులుగా ప్రసిద్ధి పొందారు. భర్త ఓటమి పాలు కాగా భారతీదేవి శాస్త్రార్థ విచారము కొనసాగిస్తుంది. శంకరులను కామ శాస్త్రమున ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానం చెప్పుటకు శంకరులు మరణించిన అమరుక మహారాజు శరీరమును యోగబలముతో పరకాయ విద్యచే ప్రవేశించి కామ శాస్త్రమును అభ్యసిస్తారు. భర్త సన్యాసి కాగా భారతి బ్రహ్మ ప్రాప్తికై సిద్ధపడగా శంకరులు ఆమెకు నచ్చజెప్పి శృంగేరి తీసుకువెళ్తారు. అచ్చట ఉండి అధ్యాపనము గావించమని అడిగారు. భారతీదేవి ద్వారా విద్యాభ్యాసము జరిగినందునే శృంగేరీ శారదా పీఠములలో శిష్యసాంప్రదాయములు భారతీ సాంప్రదాయములుగా ప్రసిద్ధి చెందినవి.

మధ్య భారతమున విజయము పొందిన శంకరులు దక్షిణ దేశమునకు వెళ్తారు. మహారాష్ట్రములో శైవులను, కాపాలికులను ఓడిస్తారు. ఆ తరువాత తుంగభద్రా తీరమును చేరి అచట మందిరమును నిర్మించి శారదాదేవిని ప్రతిష్ఠిస్తారు. సురేశ్వరాచార్యులను ఇచ్చట ఆచార్యులుగా నియమిస్తారు. అటు తర్వాత పురీ వెళ్లి గోవర్ధన పీఠమును స్థాపించి పద్మపాదాచార్యులను అచ్చట ఆచార్యులుగా నియమిస్తారు. దక్షిణాదిన చోళ, పాండ్య రాజుల సహాయముతో అక్కడి శాక్తేయ, గాణాపత్య కాపాలిక సాంప్రదాయములలోని అనాచారములను దూరము చేస్తారు. ఈ విధంగా దక్షిణాదిన అంతటా ధర్మధ్వజమును ప్రతిష్ఠిస్తారు. అటు తరువాత ఉత్తర భారతము వైపు దృష్టి పెట్టి ఉజ్జయినిలో భైరవుల భీషణ సాధనములను నిలిపివేస్తారు. అక్కడినుండి ద్వారక వెళ్లి అక్కడ మఠమును స్థాపించి శిష్యుడైన హస్తామలకాచార్యులను అచార్యులుగా నియమిస్తారు. తరువాత గంగానదీ పరీవాహ ప్రాంతములలో పండితులను ఓడించి, కాశ్మీరమున శారదా క్షేత్రము చేరి అక్కడి పండితులను కూడా ఓడించి స్వమతమును ప్రతిష్ఠిస్తారు. అచటినుండి కామరూపము వెళ్లి అచట శైవులను ఓడించి బదరికాశ్రమము వెళ్తారు.

తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో  మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.  ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపిస్తారు.  పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి,  ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.

తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి, తోటకాచార్యులను అక్కడ ఆచార్యులుగా నియమించి, కేదారనాథ్ క్షేత్రము వెళ్లి  32 వ ఏట ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.

ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.

గాణాపత్యము, శాక్తేయము, సౌరము, వైష్ణవము, శైవము - ఈ విధంగా విభజింపబడ్డ హిందూమత ఆరాధానా విధానాన్ని పంచాయతన విధానం ద్వారా ఏకం చేసి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ఒక అనుపమానమైన ఆధ్యాత్మిక వేదికను వెలకట్టలేని జీవనశైలిగా ఇచ్చారు శంకరులు. 

శంకరుల రచనలు:

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి - ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు.

శంకరులు మొత్తం 272 గ్రంథములు రచించారని నానుడి. వీరి కొన్ని రచనలలో బ్రహ్మ సూత్ర భాష్యము, ఉపనిషద్భాష్యము, గీతా భాష్యము, విష్ణు సహస్రనామ భాష్యము, సనత్సుజాతీయ భాష్యము, హస్తామలక భాష్యము, లలితా త్రిశతీ భాష్యము, వివేకచూడామణి, ప్రబోధసుధాకరము, ఉపదేశ సహస్రి మొదలగునవి.

ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, గణేష పంచరత్నము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.

ఇవే కాక, ఆనంద లహరి, అనాత్మ విగర్హణ ప్రకరణము, అపరోక్షానుభూతి, ఆత్మ బోధ, ఆత్మ పంచకము, భగవాన్ మానస పూజ, బ్రహ్మ జ్ఞానావళి మాల, దశ శ్లోకీ, ధన్యాష్టకము, గంగాష్టకము, గౌరి దశకము, గురు అష్టకము, గురు పాదుకా పంచకము, హనుమత్ పంచరత్నము, జ్యోతిర్లింగ స్తోత్రము, కాశీ పంచకము, కౌపీన పంచకము, మంత్ర మాతృక పుష్పమాలా స్తవము, మాయా పంచకము, నిర్గుణ మానస పూజ, నిర్వాణ మంజరి, పంచీకరణము, పాండురంగాష్టకము, ప్రశ్నోత్తర రత్న మాలిక, ప్రాతఃస్మరణ స్తోత్రము, రంగనాథాష్టకము, శత శ్లోకీ, సిద్ధాంత తత్త్వ బిందు, స్వరూపానుసంధానాష్టకము లాంటి అద్భుతాలు ఎన్నో రచించారు.
 
కొన్ని స్తోత్రాల వివరాలు.

విష్ణు షట్పది:

మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం  ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

సాధనా పంచకము:

శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము. 

శివ సువర్ణమాలా స్తుతి:

యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు,  భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు రచించారు.  సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు.  పార్వతీ సమేతుడవైన  శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి,  అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది.

ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి - తోటకాష్టకము:

ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.

శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు.  గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు.

మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు.

ముగింపు:

ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచాయి. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గురువులకు శత సహస్ర పాదాభివందనములు. 

జయ జయ శంకర! హర హర శంకర!

నా ఈ బ్లాగులో కొన్ని శంకరుల రచనలపై వ్యాసాలు:
  1. శ్రీమచ్ఛంకరాచార్య కృత కాశీ పంచకము - తాత్పర్యము
  2. శంకర విరచిత భవాన్యష్టకం, తాత్పర్యము
  3. శ్రీమచ్ఛంకరభగవత విరచిత మనీషాపంచకం - తాత్పర్యము
  4. శ్రీ శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రము తాత్పర్యము 
  5. శ్రీమచ్ఛంకరభగవతః కృత కృష్ణాష్టకం - తాత్పర్యము
  6. శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం - తాత్పర్యము
  7. శంకరాచార్యవిరచిత షట్పదీ - తాత్పర్యము
  8. పాండురంగాష్టకం - తాత్పర్యము
  9. తోటకాష్టకం - తాత్పర్యము
  10. శ్రీ శంకరాచార్య కృత శివ సువర్ణమాలా స్తుతి
  11. శివనామావళ్యష్టకం - తాత్పర్యము
  12. శివ అక్షరమాలా స్తోత్రము - తాత్పర్యము
  13. అర్ధనారీశ్వరాష్టకం - తాత్పర్యము
  14. కాలభైరవాష్టకం
  15. దక్షిణామూర్తి స్తోత్రము - తాత్పర్యము
  16. శివాష్టకం - తాత్పర్యము
  17. శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము
  18. మహిషాసుర మర్దిని
  19. శారదా భుజంగం మరియు సరస్వతీ స్తోత్రం
  20. లలితా పంచరత్న స్తోత్రం
  21. దేవీ నవరత్నమాలికా స్తోత్రం
  22. త్రిపురసుందరీ అష్టకం
  23. అన్నపూర్ణాష్టకం
  24. ఉమామహేశ్వర స్తోత్రము
  25. ప్రాతః స్మరణం
  26. నిర్వాణ షట్కము
  27. విశ్వనాథాష్టకం - తాత్పర్యం
  28. శివ మానస పూజ
  29. విఘ్నేశ స్తుతి - గణేశ పంచరత్నం                             

భవనుత నా హృదయమున రమింపుము - త్యాగరాజస్వామి కృతి

భవనుత నా హృదయమున రమింపుము బడలిక దీర భవతారక నాతో బహుపల్కిన బడలిక దీర కమల సం"భవనుత" పవనసుతప్రియ తనకై తిరిగిన బడడలిక దీర భవనము చేరి న...