RightClickBlocker

26, జూన్ 2011, ఆదివారం

అన్నమయ్య నాదోపాసన - అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

హరియవతార మీతడు అన్నమయ్య
కలియుగ దైవమైన వేంకటేశుని మంత్రాన్ని నుతిస్తూ తాళ్లపాక అన్నమాచార్యులు ఒక దివ్యమైన కీర్తన రచించారు. మంత్రాలన్నీ ఈ వేంకటేశ మంత్రములో నున్నవని దీని సారము. అమృతవర్షిణి రాగంలో అమృతాన్ని కురిపించారు అన్నమయ్య గురుదేవులు. సంకీర్తనా శైలిలో ఆనాటి వాడుక భాషలో, సుళువుగా పామరునికి కూడా అర్థమయ్యే భాషలో తన రచనలు చేసి అన్నమయ్య ఎప్పటికీ ప్రతి తెలుగువారి హృదయ కమలములోనూ సుస్థిర స్థానం ఏర్పచుకున్నారు. అవతారమంటే ఒక ముఖ్యమైన మార్పుకు నాంది వేసి దానిని సఫలీకృతం చేయటమే కదా? మరి ఆ ఏడుకొండలవాసుని వేల కీర్తనలలో నుతించి ఆ వేంకటేశ ప్రాభవాన్ని కలియుగ వాసులకు అందించారు అన్నమయ్య. అందుకే ఆయన అవతారము పూర్ణము, ధన్యము మరియు సాఫల్యము.

 సాహిత్యం:

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము


నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము


రంగగు వాసుదేవ మంత్రము ధృవుడు జపియించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము


ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము


వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి

భావము:

"చిన్నప్పుడే నాకు అందిన ఈ వేంకటేశ మంత్రములో అన్ని మంత్రాలు నిలయమై ఉన్నాయి. నారదుడు నారాయణ మంత్రము జపించగా, ప్రహ్లాదుడు నారసింహ మంత్రమును పొందాడు. సంకల్పముతో విభీషణుడు రామ మంత్రమును పొందగా, నాకు ప్రత్యేకముగా వేంకటేశ మంత్రము కలిగినది. ధ్రువుడు అందమైన వాసుదేవ మంత్రమును జపించగా, కృష్ణుని మంత్రమును అర్జునుడు భక్తితో సాధన చేసెను. చిలుక అయిన శుకుడు ముక్కుతో విష్ణు మంత్రమును పఠించగా, నాకు అనన్యమైన ఈ వేంకటేశ మంత్రము అబ్బినది. ఇన్ని మంత్రములకు శ్రీహరిని కనుటయే లక్ష్యము. ఇదియే తథ్యముగా పరబ్రహ్మ మంత్రము. నన్ను కాచుటకు నా గురువులిచ్చిన వెన్నెలవంటిది ఈ వేంకటేశు మంత్రము." - అన్నమయ్య

అంతరార్థము:

శ్రీ వేంకటేశుడే పరబ్రహ్మము. ఆయన మంత్రము మోక్షమునకు ఏకైక సాధనము. అంతకు మునుపు ఉత్తమోత్తములైన హరి భక్తులు (నారదుడు, ప్రహ్లాదుడు, విభీషణుడు, ధ్రువుడు, అర్జునుడు, శుకుడు) ఆ పరమాత్ముని వేర్వేరు అవతారముల మంత్రములతో కొలిచి మోక్షమును పొందారు. నాకు ప్రత్యేకమైన, అనన్యమైన వేంకటేశు మంత్రము చిన్నతనములోనే గురువుల అనుగ్రహము వలన వెన్నెల లాగా కలిగినది. అన్ని మంత్రములు ఈ వేంకటేశ మంత్రములో స్థిరమై ఉండుట వలన ఇదియే పరబ్రహ్మము, మోక్షకారకము అని అన్నమయ్య వేంకటేశుని మంత్ర మహిమను కొనియాడారు. కలియుగములో శ్రీనివాసుని స్మరించుట మించి మోక్షమునకు సులువైన మార్గము లేదని ఆయన నొక్కి వక్కాణించారు. అందుకే ఆయనను 'హరి అవతారమీతడు అన్నమయ్య' అని కొలిచారు శిష్యకోటి. మన పాపములను హరించే శ్రీ వేంకటేశుని పాదపద్మములకు, అన్నమయ్య గురు చరణములకు నీరాజనములు.

విద్వాంసులు, సహృదయులు, గురువులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాదు గారు ఈ సంకీర్తనను అమృతవర్షిణి రాగంలో వెన్నెలరేయి అంత చల్లగా, వేసవి మామిడి పండంత తీయగా ఆలాపించారు. వారికి శిరసు వంచి పాదాభివందనములు.

2 వ్యాఖ్యలు:

  1. ప్రసాద్ గారు, మీరు చెప్పినది అక్షరసత్యం. నేనొక అన్నమయ్య ఆరాధకుడిని, బాలకృష్ణ ప్రసాద్ గారి వీరాభిమానిని. అన్నమాచార్య కీర్తలను ఆయన గళంలో వింటే కలిగే మాధుర్యం ఇంతా అంతాకాదు. వారి ఉఛ్చారణ స్పష్టంగా ఎటువంటివారికైనా సులభంగా అర్ధమైనట్లు వుంటుంది. అన్నమయ్య వదిలి వెళ్ళిన సాయిత్య-గాన సంపద మనకు ఎన్నితరాలైనా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. ఇంత చక్కని కీర్తన అందించినందుకు ధన్యవాదాలు. అయితే చిన్న సందేహం. ఆ కీర్తనలోని రెండవ చరణంలో "వెంగడమై" అని వినిపిస్తుంది. మీరు "వింగడమై" అని ప్రస్తావించారు. ఈ పదానికి అర్ధం ఏమిటో మీకు తెలిస్తే చెప్పగలరు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. సూర్యనారాయణగారు - రెండు సాహిత్య మూలాల్లో చూశాను (శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తి గారి 500 కీర్తనలు, తి.తి.దే ప్రచురణ). వింగడమై అనే ఉంది. బాలకృష్ణప్రసాద్ గారి గానం కూడా వింగడమై అనే ఉచ్చారణ వినిపిస్తున్నది. అనన్యమైనది (ఆంగ్లంలో ఎక్సెప్షన్) అని అర్థం.

    ప్రత్యుత్తరంతొలగించు