దయానంద సరస్వతి స్వామి |
ఎందరో మహానుభావులు శీర్షికన ఇదివరకే కొన్ని సాహిత్య, సంగీత ప్రధానమైన వ్యాసాలు నా బ్లాగ్ లో రాశాను. గత రెండు దశాబ్దాలలో నా స్మృతిపథంలో ప్రత్యేక స్థానాన్ని ఒక సత్పురుషులు కోయంబత్తూర్ ఆర్షవిద్యాగురుకులాన్ని స్థాపించిన స్వామి దయానంద సరస్వతి (ఆర్య సమాజ్ స్థాపకులు కాదు). ఆయన వేదవేదాంగాలు, ఉపనిషత్తులలో విజ్ఞానాన్నే కాకుండా సంగీత సాహిత్యాభిలాషను, పాండిత్యాన్ని మనకు అందించారు . వారి జీవిత విశేషాలు:
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని మంజకూడిలో ఒక సాంప్రదాయ కుటుంబంలో, గోపాల్ ఐయ్యరు, బాలాంబాళ్ దంపతులకు 1930 సంవత్సరంలో జన్మించారు. నటరాజన్ గా నామకరణం చేయబడ్డారు. చిద్యాభ్యాసం తరువాత, భారతదేశం గర్వించగిన ఆధ్యాత్మిక సంస్థ చిన్మయ మిషను వ్యవస్థాపకులు స్వామి చిన్మయానంద వారి ప్రసంగాలచే ప్రభావితులైనారు. వారి వద్ద ఆరేళ్ల శిష్యరికం తరువాత 1962 లో సన్యాసం స్వీకరించి దయానంద సరస్వతిగా పేరు పొందారు. తరువాత గురువుల నిర్దేశంతో గుడివాడలో స్వామి ప్రణవానంద వద్ద వేదాంతంలో నిగూఢాలను అభ్యసించారు. చిన్మయ మిషన్ వారి సాందీపనీ సాధనాలయ ద్వారా ఎంతో సేవ చేశారు. అటు తరువాత స్వామి తారానంద గిరి వద్ద బ్రహ్మసూత్రాలను నేర్చారు. విద్యార్థులు వేదాంతము, సంస్కృతము అభ్యసించటానికి ప్రపంచవ్యాప్తంగా మూడు ఆర్షవిద్యా గురుకులాలను అమెరికాలోని పెన్సిల్వేనియా, హృషీకేశ్, కోయంబత్తూర్లలో ఏర్పాటు చేశారు. మూడున్నర ఏళ్ల పాటు ఉండే ఈ శిక్షణా కాలంలో సంస్కృతి మీద దృష్టితో అభ్యాసన జరుగుతుంది. 1990 మొదలు ఇప్పటివరకు ఆరు శిక్షణా కాలాలను పూర్తి చేసి దాదాపు 670కి పైగా సుశిక్షిత వేదాంతాధ్యాపకులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ సారాన్ని పంచారు . నవీన అభ్యాసపద్ధతికి, ప్రాచీన సిద్ధాంతాలకు మధ్య వారధిలా ఈ తరగతులను ఏర్పరచి కొత్త ఒరవడిని సృష్టించారు దయానంద సరస్వతి. తన ప్రవచనాలు, తరగతుల ద్వారా ఎన్నో లక్షలమంది జీవితాలను ప్రభావితం చేశారు. ఈ తరగతులను ఎన్నో కార్పొరేట్ సంస్థలలో యిచ్చి అక్కడ అనూహ్యమైన మార్పులను తీసుకువచ్చారు. ఇప్పటి భక్తి మరియు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెళ్లలో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు మనకు అందజేస్తున్న స్వామి పరిపూర్ణానంద సరస్వతి వీరి శిష్యులే. కాకినాడలో పరిపూర్ణానంద సరస్వతివారు శ్రీ పీఠం పేరిట సమాజసేవలో ఉన్నారు. ఆర్షవిద్యా గురుకలంలా అందించబడే దీర్ఘకాలిక శిక్షణలో భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాంత ప్రకరణాలైన తత్త్వబోధ, ఆత్మబోధ, పంచదశీ, బ్రహ్మసూత్రాలు, పాణినీ వ్యాకరణమనే అంశాలపై 3-1/2ఏళ్ల పాటు శిక్షణ ఉంటుంది. ఇవేకాక, 1 నుండి 24 వారాల స్వల్పకాలిక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.
యునెస్కోవారి సమావేశాల్లో, యూఎన్వో వారి ప్రపంచ శాంతి సమ్మేళనంలోను స్వామి దయానంద సరస్వతి ప్రసంగించారు. స్వామి వారు అఖిల భారత సేవా ఉద్యమం పేరిట గ్రామాల్లో విద్య, వైద్యము, పోషకాహారము, మౌలిక వసతులుపై ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి వారి సుయత్నాలతో భారతీయ ఆధ్యాత్మిక గురువులు, సంస్థలన్నీ కలసి ఆచార్య సభగా ఏర్పడి ఈ ఉద్యమాన్ని నడిపారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో స్వామి వారు పాల్గొని తన ఆధ్యాత్మిక సందేశాన్ని మరియు మార్గాన్ని ప్రపంచం ముందుంచి నడిపిస్తున్నారు. ఆర్షవిద్యాగురుకులం ఎన్నో హిందూ మత అంశాలపై స్వామి వారి భాషణలను పుస్తకాల రూపంలో ప్రచురిస్తోంది.
సుదీర్ఘమైన సనాతన ధర్మ సేవ తరువాత స్వామి వారు 2015 సెప్టెంబరు 23న హృషీకేశ్ దగ్గరి ఆశ్రమమంలో పరమపదించారు. మరణశయ్యపై కూడా పరమాత్మ నామాన్ని నిరంతరం స్మరించిన మహనీయులు దయానంద సరస్వతి.
సంగీతం మోక్షానికి సోపానంగా భావించే స్వామి వారు శాస్త్రీయ సంగీత వికాసానికై ఆర్ష కళారంగం అనే వేదిక ద్వారా ఏటా రెండు మార్లు శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులైన వారికి ఆర్ష కళా భూషణం అనే అవార్డును ప్రదానం చేశారు. సంగీతం ద్వారా శ్రోతలు, కళాకారులు ఈ ప్రాపంచిక విషయాలను దాటి ముక్తి వైపు చూసే అపురూపమైన అవకాశాన్ని పొందుతారని స్వామి వారి ప్రగాఢ విశ్వాసం. సంగీతం ద్వారా భారతీయులు సనాతన ధర్మంతో నిరంతర సాంగత్యం ఏర్పరచుకోగలరని స్వామి వారి నమ్మకం. స్వామి వారు ఏడు అపూర్వమైన కీర్తనలను రచించారు. వాటిని మహారాజపురం సంతానం గారు మొట్టమొదట గానంచేసి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. వాటిలో ఒకటి మీ కోసం.
ఇటీవలి కాలంలో దక్షిణభారత నృత్య సాంప్రదాయమైన భరతనాట్యంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆంశం - భో శంభో శివ శంభో. నృత్యానికి తల్లి వంటిది అయిన శివతాండవములో ఉండే లయ, స్తుతి, శివతత్త్వము ఈ రచనలో ఉన్నాయి. చిదంబరలయుడై ఆ పరమశివుడు నర్తించే విధానాన్ని ఈ కృతి మనకు క్షణం క్షణం గుర్తు చేస్తుంది. రేవతి రాగం, ఆది తాళంలో స్వరపరచబడి, సంస్కృత భాషలో ఈ గీతం వ్రాయబడింది. ఈ కృతిని సంగీత కళానిధి మహారాజపురం సంతానం గారు అద్భుతంగా ఆలాపించారు.వారి గళంలో ఈ కీర్తన వినండి.
సాహిత్యం:
భో శంభో శివశంభో స్వయంభో
గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక |భో శంభో శివశంభో స్వయంభో|
నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ అగమ భూత ప్రపంచ రహిత
నిజగుహనిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ |భో శంభో శివశంభో స్వయంభో|
ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం
తోం తోం తరికిట తరికిట కిటతో
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంబర వేష్టిత వేషా
నిత్య నిరంజన నిత్య నటేశా ఈశా సభేశా సర్వేశా |భో శంభో శివశంభో స్వయంభో|
భావం:ఓ శివా! స్వయంభూ అయిన శంభో! గంగను ధరించిన శంకరా! కరుణాకరా! మా సంసార సాగరాన్ని దాటించే ప్రభో! గుణములు లేని, పరబ్రహ్మ స్వరూపా! పోవుట, వచ్చుట (జనన మరణములు) మొదలైన ప్రాపంచిక విషయాలకు అతీతమైన శంభో! లక్షణాలకు అతీతమైన, ఆంత్యము కలిగిన వాటికి అతీతమైన ఆనంద స్వరూపా! అతిశయా! క్షయము లేని లింగ స్వరూపా! ధిమి ధిమి లయ ధ్వానములతో నర్తించే, మతంగ మునిచే పూజించబడిన ఈశా! దిక్కులు, ఆకాశమే వస్త్రములుగా కల, సత్య రూపములో అగుపించని, ఎల్లప్పుడూ మచ్చలేకుండా శుద్ధ స్ఫటికంలా ఉండే, ఎల్లప్పుడూ నటిస్తూ ఉండే శంకరా! సభకు ఈశ్వరా! అందరికీ ఈశ్వరా!
పరిశీలన:
శివతత్త్వంలో ముఖ్యలక్షణాలు - కాలాతీతమైన శివుడు, లయకారకుడు, భక్త వశంకరుడు, శుద్ధచైతన్య స్వరూపమైన వాడు. వీటిని ఆధారం చేసుకొని ఎన్నో స్తోత్రాలు వేల సంవత్సరాలుగా ఆది శంకరుల నుండి నేటి సమకాలిక భక్తి గీతాలు, కృతుల వరకు వస్తూనే ఉన్నాయి. కానీ, ప్రతి ఒక్క రచన అనుపమానంగా నిలిచాయి. దయానంద సరస్వతుల వారు ఈ కృతిలో శుభంకర తత్త్వ లక్షణాలతో మొదలుకొని, సచ్చిదానంద తత్త్వ వర్ణనలైన గుణరాహిత్యము, పరబ్రహ్మము, శాశ్వతము, అనంతము, ఆనందాతిశయము అనే ఆధ్యాత్మిక నిజ లక్షణాలను మొదటి చరణంలో అక్షరమాలగా అందించారు. రెండవ చరణంలో లయకారుని మొదటి లక్షణమైన తాండవహేల, సర్వవ్యాపినమీశ్వరం అనే తత్త్వాన్ని చాటే దిగంబర లక్షణం, వెండికొండవలె మచ్చలేని శుద్ధ స్పటిక సంకాశ తత్త్వము, సర్వేశ్వర తత్త్వములను మాలికలా అందించారు.
సంతానంవారు ఈ కీర్తనను గానం చేస్తుంటే శివుడు నాట్యం చేస్తూ దర్శనమిచ్చాడని నానుడి. ఎంత హృద్యంగా గానం చేశారో విని తరించండి. తమిళనాడులోని చిదంబర నటరాజ మందిరంలో ఈ గానం చేసినప్పుడు శ్రోతలు ఆనందబాష్పాలు రాల్చారని సంగీతప్రియులు చెప్పుకుంటారు. నృత్య ప్రదర్శనలలో లోతైన అంశంగా వీక్షకులను ఆకర్షించే లక్షణాలన్నీ అత్యున్నత స్థాయిలో ఉన్న కీర్తన ఇది. అందుకే గాయకుల నోట అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇంత మంచి రచన మనకు అందించినందుకు దయానంద సరస్వతి స్వామి వారికి శత సహస్ర వందనాలు.
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం
అద్భుతం sir ఈ కీర్తన. మీ వివరణ చాలా స్పష్టంగా ఉంది. నెనర్లు sir.
రిప్లయితొలగించండిఈ కీర్తన నాకు ఎంతిష్టమో తెలుసాండీ.. నేను పదే పదే పదే పదే దీన్ని వింటుంటాను.. స్వామివారు రాశారన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది.. అప్రయత్నంగా నా హస్తాలు వారి చిత్రాన్ని చూసి ముకిళితమయ్యాయి.. మనస్సు ఆనందంతో నిండిపోయింది.. వారి గొప్పదనాన్ని గురించి చెప్పడానికి.. వారి దైవ భక్తిని గురించి చెప్పడానికి ఈ ఒక్క కీర్తన చాలదూ..
రిప్లయితొలగించండి