RightClickBlocker

2, జులై 2011, శనివారం

మైసూరు మహారాజా జయచామరాజేంద్రుల శ్రీ మహాగణపతిం భజేహం

మైసూర్ మహారాజా జయచామరాజ వొడెయార్
 సంగీత, సాహిత్య ప్రియులైన పాలకులు ఎంతో మంది భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద ఇంకా పదిలంగా ఉండటానికి వారి వంతు కృషి చేశారు. స్వాతంత్ర్యానికి మునుపు భారత దేశపు రాచరికపు వ్యవస్థలో ఒక ముఖ్య రాజ్యం మైసూరు. 18వ శతాబ్దములో హైదర్ అలీ, టిప్పు సుల్తానుల పరిపాలనల తరువాత విశాలమైన మైసూరు రాజ్యాన్ని బ్రిటీషువారు స్వాధీనం చేసుకొని అందులో ఉత్తర భాగాన్ని దక్కన్ నిజాములకు, తీరప్రాంతాన్ని మద్రాసు ప్రెసిడెన్సీ రాష్ట్రానికి ధారాదత్తం చేసి మిగిలిన భాగాన్ని మైసూరు ప్రిన్స్లీ రాష్ట్రంగా చేసి, దానికి ఏ అధికారాలు లేని నామమాత్రపు రాజుగా వొడెయార్ వంశస్థులను నియమించారు. ఈ వొడెయార్లు మైసూరు రాజ్యాన్ని దేశ స్వాతంత్ర్యము వచ్చే వరకు పాలించారు. స్వాతంత్ర్య సమయములో భారత ప్రభుత్వము రాచరికాలను రద్దు చేసి, కొద్దికాలం తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అప్పుడు ఈ ప్రాంతం బెంగళూరు రాజధానితో కర్ణాటక రాష్ట్రంగా మారింది.

స్వాతంత్ర్యానికి పూర్వం మైసూరు రాజ్యానికి ఆఖరి మహారాజు జయచామరాజ వొడెయార్. పాశ్చాత్య, కర్ణాటక సంగీతాలలో ప్రవీణులైన వీరు గొప్ప ఆధ్యాత్మికవేత్త కూడా. మైసూరు వాసుదేవాచార్యుల వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకుని తమ ఆస్థానంలో టి. చౌడయ్య, టైగర్ వరదాచార్, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ వంటి మహామహ సంగీత విద్వాంసులను గౌరవంతో పోషించారు. జయచామరాజేంద్రులు సంగీతానికి చేసిన సేవపై ఆంగ్లంలో "కాంట్రిబ్యూషన్స్ ‍అండ్ ప్యాట్రొనేజ్ ఆఫ్ వొడెయార్స్ టు మ్యూజిక్" అనే పుస్తకం కూడా ప్రచురించబడింది. పురాణాలు, దత్తాత్రేయ తత్త్వము, కుండలినీ యోగ, అద్వైత సిద్ధాంతము, శ్రీ సురేశ్వరాచార్య మొదలైన ఎన్నో పుస్తకాలను రచించారు. రాజా వారి ఆధ్వర్యంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు కన్నడంలోకి అనువదింపబడి జయచామరాజ గ్రంథ రత్నమాలగా వెలువడ్డాయి. ఇప్పటికీ మైసూరులోని మహారాజా ప్యాలెస్ వీరి రాచరికపు వైభవాన్ని, సంపదను, కళాతృష్ణను కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింబిస్తుంది.

ఇక రాజావరి సంగీత పిపాసకు వస్తే, ఆయన తను ఉపాసించిన శ్రీవిద్యను ముద్రగా చేసుకుని కీర్తనలు రచించారు. రాజా వారిని గురువులు సిద్ధలింగస్వామి వారు శ్రీవిద్య ఉపాసనలో ప్రవేశ పెట్టారు. సిద్ధలింగస్వామి వారు నాగలింగ మఠాధిపతులు. గురువుల అనుగ్రహంతో రాజావారు శ్రీచక్రార్చనలో లోతైన జ్ఞానాన్ని సంపాదించి ఆ మార్గంలో ముందుకు వెళ్ళారు. గురువులపై గల గౌరవంతో రాజా వారు నాగలింగ ముద్రను కూడా తన కీర్తనలలో ఉపయోగించారు. రాజావారు రచించిన 94 కీర్తనలలో ఎక్కువ కీర్తనలు లలిత అమ్మవారిపై రచించినవే. 11 గణపతిపై, 13 శివునిపై, 4 విష్ణువుపై, 2 సరస్వతిపై, 1 గాయత్రిపై ఆయన రచించిన కృతులు. అన్ని కృతులు సంస్కృతంలో రచించినవే. కీర్తనలలో ఎక్కడా రాజసాన్ని కనిపించనీయకుండా సర్వోన్నతమైన ఆధ్యాత్మిక విలువలను, ఆయా దేవతల అగణిత గుణ మహిమా వైభవాలను రాజా వారు ప్రదర్శించారు. ఇటువంటి రచనలు చేయాలంటే ఆయా దేవతల అనుగ్రహము సిద్ధించనిదే అసాధ్యము. ప్రతి ఒక్క కృతి సంపూర్ణ రస సిద్ధికి తార్కాణంగా నిలిచిన రచనలను రాజా వారు చేసి సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు.

రాజా వారి రచనలలో ప్రముఖంగా ప్రాచుర్యం పొందింది అఠాన రాగంలో కూర్చబడిన శ్రీ మహా గణపతిం భజేహం. గొప్ప ఆధ్యాత్మిక భావనతో, ఉత్కృష్టమైన సాహిత్యంతో రాజావారు ఈ కీర్తన రచన చేశారు.

సాహిత్యం:

శ్రీ మహాగణపతిం భజేహం శివాత్మజం షణ్ముఖాగ్రజం

సిద్ధగణ సేవితం విఘ్న నాశకం శీఘ్ర వర ప్రసాద దాయకం
సదయం కపిలముని వరదాయకం గురుసేవాసక్తం హేరంబం | శ్రీ మహాగణపతిం భజేహం |

జ్ఞానముద్రాలంకృతం మూలాధార నివాసినం
| శ్రీ మహాగణపతిం భజేహం |

గజారణ్య వాసినం జ్యోతిర్మయం ఉపనిషద్సారం
పంచ భూతాత్మకం సింధురప్రియం పంచ మాతంగ ముఖం
| శ్రీ మహాగణపతిం భజేహం |

కామేశ నయనాహ్లాదకం నాగలింగ వరపుత్రం
శ్రీ విద్యా చిద్ప్రభానంద రాజయోగీంద్ర వందితం
| శ్రీ మహాగణపతిం భజేహం |

హేరంబ గణపతి

 భావము:

శివుని కుమారుడైన, సుబ్రహ్మణ్యునికి అగ్రజుడైన శ్రీ మహాగణపతిని భజిస్తున్నాను. సిద్ధులు, దేవ గణములచే సేవింపబడిన వాడు, విఘ్నాలను నాశనం చేసేవాడు, త్వరగా వరములు ప్రసాదించే వాడు, కపిలముని(1) ప్రార్థన విని వేగముగా వచ్చి ఆయనను బ్రోచినవాడు, గురువుల (పెద్దల) సేవయందు ఆసక్తి కలవాడు, పెద్ద తొండము కలవాడు అయిన శ్రీ మహాగణపతిని భజిస్తున్నాను. ఎల్లప్పుడు జ్ఞానముద్రలో(2) ఉన్నవాడు, మూలాధారచక్రమునందు నివసించే వాడు (3) అయిన శ్రీ మహాగణపతిని భజిస్తున్నాను. గజారణ్యమున నివసించే వాడు (4), జ్యోతిర్మయుడు, ఉపనిషత్తుల సారమైన వాడు, పంచభూతములైన పృథివ్యాపస్తేజోవాయురాకాశములే తానైన వాడు, సింధుర ప్రియుడు, పంచ మాతంగ ముఖములు కలవాడు (5) అయిన శ్రీ మహాగణపతిని భజిస్తున్నాను. శివుని కన్నులకు ఆనందం కలిగించే వాడు, ఆయన వరపుత్రుడు, ఆ లలితాదేవి రూపమైన పార్వతి మనస్సును ఆనందంగా ఉంచే వాడు (6), రాజులు, యోగులచే పూజింపబడిన వాడు అయిన శ్రీ మహాగణపతిని భజిస్తున్నాను.

పైన చెప్పిన అర్థములో 1-6 అంశాల వివరణ:
  1. మహారాష్ట్రలో చింతామణి గణపతి చాలా సుప్రసిద్ధం. ఈయనకు సంబంధించి ఒక గాథ ఉంది. పూర్వం కపిలముని వద్ద చింతామణి అనే మణి ఉండేది. అది కోరిన కోరికలను తీర్చే కల్పతరువు వంటిది. అక్కడి ప్రభువైన అభిజిత్తు, గుణవతిల కుమారుడైన గుణ రాజకుమారుడు ఒకమారు కపిలుని ఆశ్రమానికి వస్తాడు. ఆ ముని రాజకుమారునికి చింతామణి మహిమతో షడ్రసోపేతమైన భోజనము ఏర్పాటు చేస్తాడు. ఆ మణి సంగతి తెలిసి రాజకుమారుడు మణిని తనకిమ్మని కపిలుని అడుగుతాడు. కపిల ముని దానికి అంగీకరించక పోగా, రాజ కుమారుడు ఆ మణిని దొంగిలిస్తాడు. బాధతో కపిలుడు గణపతిని ప్రార్థించగా ఆ విఘ్నేశుడు రాకుమారుని యుద్ధంలో సంహరించిన పిమ్మట, అభిజిత్తు మహారాజు మణిని కపిలునికి తిరిగి ఇవ్వబోగా, కపిలుడు అది తనకు వలదంటాడు. గణేశుడు అక్కడే కదంబ వృక్షము కింద వెలస్తాడు. అప్పటినుంచి కపిలుడు ఆ గణేశుని చింతామణి గణేశునిగా కొలుస్తాడు. ఈ చింతామణి గణేశ క్షేత్రం మహారాష్త్రలోని థేవూర్ లో (పుణే దగ్గర) ఉంది. మహారాష్ట్రలోని అష్టవినాయకులలో ఒకటి ఈ చింతామణి వినాయకుడు
  2. జ్ఞాన ముద్ర - కుడి చేతి చూపుడు వేలు బొటనవేలును తాకునట్లు వృత్తాకారము చేసి మిగిలిన మూడు వేళ్లను ఆకాశము వైపు చూపుతూ చేయిని హృదయస్థానమునందుచుట - ఎల్లప్పుడు జ్ఞానమయుడై మనందరికి జ్ఞానాన్ని పంచేవానికి సంకేతం. చిద్యలో విజయానికి గణనాథుని కొలవటం హిందూమతంలో ప్రసిద్ధి పొందిన ఆచారం, నమ్మకం.
  3. కుండలినీ యోగములో శరీరములో వేర్వేరు భాగముల యందు స్థితమైన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార చక్రములలో అన్నిటికన్నా క్రిందది అయిన మూలాధార చక్రము వెన్నుపూస చివరన, రెండు విసర్జన భాగముల మధ్య ఉంటుంది. ఇది పీతాంబరమైన చతుర్భుజాకారము చుట్టూ నాలుగు ఎర్రని రేకులు కలిగిన పద్మము రూపములో ఉంటుంది. దీని మూలదేవత గణపతి.
  4. గజారణ్యము అనేది రెండు చోట్ల ఉన్నట్లు గాథలు. ఒకటి తిరుచిరాపల్లి సమీపంలోని కావేరీ తీరంలో; రెండవది కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని తలకాడ్ సమీపంలోని కావేరీ తీరాన ఉన్నది. మహారాజావారు తలకాడ్ సమీపంలో ఉన్న గజారణ్యాన్ని గురించి ప్రస్తావించారని నేను అనుకుంటున్నాను. స్కాందపురాణం ప్రకారం సిద్ధారణ్య అన్న పేరు గల ఈ ప్రాంతం చాల ఏనుగులు ఉండటం వలన గజారణ్యం అని పేరుగాంచింది. తల, కాడ అనే ఇద్దరు వేటగాళ్లు ఈ ప్రాంతంలో కొన్ని ఏనుగులు ఒక శివలింగాన్ని కలువలతో పూజించటం చూస్తారు. వారు అక్కడ ఒక చెట్టును నరుకుతుండగా కొమ్మవిరిగి లింగం మీద పడినప్పుడు ఆ లింగము నుండి రక్తము స్రవించిందట. అప్పుడు ఆకాశవాణి ఆ వేటగాళ్లిద్దరికి ఆ గాయాన్ని ఆ చెట్టు ఆకులతోనే సరిచేయమని చెబుతుంది. ఆ సేవకు సంతోషించి శివుడు ప్రత్యక్షమై ఆ వేటగాళ్లకు, అక్కడి ఏనుగులకు ముక్తి ప్రసాదిస్తాడు. ఆ వేటగాళ్ల పేరిట ఆ ప్రాంతానికి తలకాడ్ అని పేరు వచ్చింది.
  5. పంచముఖ హేరంబ గణపతి - సాధారణ గణపతి రూపాలకు కొంచెం భిన్నంగా ఈ పంచముఖ గణపతి సింహవాహనుడై నాలుగు దిక్కులా నాలుగు ముఖములు, వీటి శీర్షముపై ఆకాశ దిక్కుగా ఐదవముఖముగా ఉంటాడు. ఈ పంచముక్ష గణపతి -  మహా గణపతి, సిద్ధి గణపతి, విద్యాగణపతి, శక్తి గణపతి, మోక్ష గణపతిలకు ప్రతీకగా చెప్పబడినది. అలాగే ఈ ఐదు ముఖములు శివ, విష్ణు, బ్రహ్మ, శక్తి, సూర్య తత్త్వములుగా, పంచ భూతములు ఈ గణపతినుండి ఉద్భవించినట్లుగా, సృష్టి, స్థితి, లయ, అదృశ్య, అనుగ్రహ కారకములుగా చెప్పబడినది.
  6. కొన్ని మూలాలలో ఇది శ్రీ విద్యా చిద్భవానంద అని వ్రాయబడింది. ఆ పార్వతీదేవి మనస్సంకల్పముతో పుట్టినవాడే గదా గణపతి. కాకపోతే, చిద్ప్రభానంద అని తీసుకుని ఆ తల్లి మనస్సులోని వెలుగు, ఆనందకారకుడు అన్నా కూడా వన్నె, భావము ఏమీ తగ్గలేదు. మహారాజపురం సంతానంగారు (శ్రవణం లంకె) చిద్భవానంద అనే గానం చేశారు.

ఈ కీర్తనను సునిశితంగా పరిశీలిస్తే, జయచామరాజేంద్రులు గాణాపత్యంలో లోతైన సాధనచేసి కొంత ఉపాసనలో ఉన్నత సోపానలు అధిరోహించినట్లు అవగతమవుతున్నది. యోగములోని ముద్రలు, శరీరములోని చక్రములు వాటి ప్రాధాన్యత, అరుదైన రూపాలలోని విశిష్టత, క్షేత్ర స్థల పురాణాల ఉదహరణ రాజావారి జ్ఞాన సంపదను, స్థాయిని తెలుపుతున్నది. ఇటువంటి సంగీత సంపదను మనకు యిచ్చిన జయచామరాజ వొడెయార్ మహారాజులకు ధన్యవాదములు. సంగీతపు స్వర్ణయుగములో ఈ కళను, కళాకారులను, వెలలేని ఆధ్యాత్మిక సంపదను నిలబెట్టి, పెంచి పోషించిన వారు ధన్యజీవులు.

ఎందఱో మహానుభావులు అందరికి వందనములు

1 వ్యాఖ్య:

  1. మహారాజులు సారస్వతపోషకులు మాత్రమే కాదు, అనేకమంది చక్రవర్తులు - స్వయాన రచయితలు కూడా! ఇట్లాంటి అపురూప చారిత్రక వాస్తవం - మన భారతదేశానికే సొంతం- ఇది మనకు గర్వ కారణం -

    ప్రత్యుత్తరంతొలగించు