RightClickBlocker

1, జులై 2011, శుక్రవారం

శ్యామ శాస్త్రి సంగ్రహ చరిత్ర - కళ్యాణి రాగంలో కృతి బిరాన వరాలిచ్చి బ్రోవుము

శ్యామ శాస్త్రి 

కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధి పొందిన సమకాలీకులు కాకర్ల త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. శ్యామ శాస్త్రులు వీరి మువ్వురిలో పెద్దవారు. ఈయన సంగీతానికి పుట్టిల్లైన తంజావూరు దగ్గరి తిరువారూరులో విశ్వనాథ అయ్యరు, వేంగలక్ష్మి దంపతులకు 1762 (కొన్ని మూలాల్లో 1763గా ఉంది) జన్మించాడు. వేంకటసుబ్రహ్మణ్య అయ్యరుగా నామకరణం చేయబడినా, శ్యామకృష్ణ అన్న ముద్దు పేరుతో పిలువబడ్డాడు.వీరి కులదైవము తంజావూరులో ఉన్న బంగారు కామాక్షీ దేవి. శ్యామకృష్ణులు పసిప్రాయంలోనే తెలుగు, సంస్కృతము, తమిళ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలోనే నారదులు ఈయనపై అనుగ్రహించి సంగీతస్వామి అనే సన్యాసి రూపంలో వీరి ఇంటికి వచ్చి, ఈ బాలునిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి, శ్యామకృష్ణునికి సంగీత జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. తంజావూరు శరభోజీ మహారాజు మన్ననలు పొందినా శ్యామశాస్త్రులు పెద్దగా శిష్యవారసత్వాన్ని సమకూర్చుకునే ఆసక్తి చూపలేదు. మదురై మీనాక్షి, తంజావూరు బంగారు కామాక్షిలపై శ్యామశాస్త్రులు ఎన్నో కీర్తనలు రచించారు. త్యాగయ్య కూడా తంజావూరు ప్రాంతంలోనే ఉండటం చేత శ్యామయ్యకు,త్యాగయ్యకు సాన్నిహిత్యం ఏర్పడింది. సంగీత శాస్త్రమే కాకుండా, శ్యామశాస్త్రులు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించి తంజావూర్ సంస్థానంలో పేరుగాంచారు. శ్యామశాస్త్రులు చాలా మటుకు కృతులు తెలుగు, సంస్కృత భాషలో రచించారు.

శ్యామశాస్త్రులు మదురై మీనాక్షి అమ్మవారిపై రచించిన తొమ్మిది కృతులు నవరత్న మాలికగా  పేరు పొందాయి. వీటిలో ఆనందభైరవిలో 'మరివేరేగతి యెవ్వరమ్మా', శంకరాభరణంలో 'సరోజదళనేత్రి హిమగిరిపుత్రి' ఆ ఆదిపరాశక్తి వర్ణనలో ప్రత్యేకతను చాటుకున్నాయి. అలాగే, తిరుచిరాపల్లి సమీపంలోని జంబుకేశ్వరంలో పంచభూత లింగాలలో ఒకటైన జలలింగ స్వరూపుడైన శివుని నాయికగా ఉన్న అమ్మ అఖిలాండేశ్వరిని స్తుతిస్తూ ద్విజావంతి రాగంలో 'అఖిలాండేశ్వరి రక్షమాం' అని అద్భుతమైన రచన చేశారు. కులదైవమైన కామాక్షిపై మధ్యమావతిలో 'పాలించు కామాక్షి పావని పాపశమని', చింతామణి రాగంలో 'దేవి బ్రోవ సమయ మిదే', పున్నాగవరాళిలో 'కనకశైలవిహారిణి', తంజావూరు బృహదీశ్వరుని నాయికయైన బృహన్నాయకీ దేవిపై ఆనందభైరవిలో 'హిమాచల తనయ బ్రోచుటకిది మంచి సమయము', మధ్యమావతిలో 'బృహన్నాయకి నన్ను బ్రోవు వేగమే', నాట రాగంలో 'పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి' మొదలైన ఎన్నో కీర్తనలను రచించారు. తంజావూరు పరిసర ప్రాంతాలైన వైదీశ్వరన్ కోయిల్, పుదుక్కోటై మొదలైన క్షేత్రాలలోని ఆరాధ్య దైవాలను తన కీర్తనలలో నుతించారు శ్యామశాస్త్రులు. దాదాపు 300కు కృతులను రచించిన శ్యామ శాస్త్రి 1867 సంవత్సరములో పరమపదించారు. ఈయన కుమారుడైన సుబ్బరాయ శాస్త్రి కూడా ప్రముఖ కృతి కర్త. రీతిగౌళలో 'జననీ నినువినా' అనే కీర్తన సుబ్బరాయ శాస్త్రి రచించినదే.  కృతులలో శ్యామయ్య వారి ముద్ర 'శ్యామకృష్ణ సోదరి'.

ఈ వ్యాసంలో శ్యామశాస్త్రుల వారి కృతి ఒకటి కళ్యాణిలో 'బిరాన వరాలిచ్చి బ్రోవుము' పొందు పరుస్తున్నాను.

కళ్యాణి రాగం:

అరవై ఐదవ మేళకర్త రాగం అయిన కళ్యాణి అత్యంత ఆహ్లాదకరమైన రాగంగా పేరుపొందింది. వందకు పైగా జన్య రాగాలు కలిగిన కళ్యాణిలో ఎన్నో మధురమైన కీర్తనలు స్వరపరచబడ్డాయి. షడ్జమము(స), చతుస్రుతి రిషభం, అంతర గాంధారం (గ), ప్రతి మధ్యమం (మ), చతుస్రుతి దైవతము (ద), కాకల నిషాదము (ని) ఈ రాగానికి స్వర స్థానాలు. కల్యాణికి, శంకరాభరణానికి కేవలం మధ్యమం లోనే తేడా(శంకరాభరణంలో శుద్ధ మధ్యమం). శివునికి శంకరాభరణం ప్రీతికరమైతే కళ్యాణి ఆ పార్వతీదేవికి ఆనందదాయకమైనది. అందుకే కల్యాణిలో ఎన్నో దేవీ కృతులు స్వరకల్పన చేయబడ్డాయి. అర్థనారీశ్వర తత్త్వానికి సంకేతముగా శంకరాభరణములో అమ్మవారి కృతులు, కళ్యాణిలో దేవదేవుని కృతులు కూడా కూర్చబడ్డాయి. సర్వ స్వర గమక వారికా రక్తి రాగముగా (అన్ని స్వరములు గమకముతో ఆలాపించవచ్చు) పేరుకాంచిన మోహనము, కాంభోజి, శంకరాభరణము, సావేరి, చక్రవాకముల సరసన నిలిచిన మేళకర్త రాగం కళ్యాణి. 'నిధి చాలా సుఖమా', 'హిమాద్రిసుతే పాహిమాం', 'సుందరి నీ దివ్య రూపమును', 'బిరాన బ్రోవ సమయమిదే', 'వాసుదేవయని వెడలిన' - ఇలా ఎన్నో కీర్తనలు ఈ రాగంలో ప్రాచుర్యము పొందాయి.

తంజావూరు బంగారు కామాక్షి

కృతి సాహిత్యం:
బిరాన వరాలిచ్చి బ్రోవుము నిను నెర నమ్మితి
పురారి మనోహారిణి శ్రీ కామాక్షి (అంబ పురారి) |బిరాన|

తామసము సేయక నీవు కరుణానిధి గాదా (అంబ తామసము సేయక)
పరాముఖమికనేల విను సరోజముఖి |బిరాన వరాలిచ్చి బ్రోవుము|

కామితార్థ దాయకి దేవి నతకల్పలతిక (అంబ కామితార్థ)
పురాణి మధురవాణి శివునికి రాణి |బిరాన వరాలిచ్చి బ్రోవుము|

శ్యామకృష్ణ సోదరి గౌరి పరమేశ్వరి గిరిజా (అంబ శ్యామకృష్ణ సోదరి)
అనాథ రక్షణమ్ము సలుపగ రావే |బిరాన వరాలిచ్చి బ్రోవుము|

అర్థము:

అంబా! శివుని మనస్సును అలంకరించిన కామాక్షీ! త్వరగా వరములిచ్చి నన్ను బ్రోవుము. నిన్నే సంపూర్ణముగా నమ్మియున్నాను.  కమలము వంటి ముఖము కల అంబా! నువ్వు కరుణానిధివి కదా! ఆలస్యము చేయకు. వేరే వైపు ముఖము వద్దు. నా మనవి విని త్వరగా వరములిచ్చి నన్ను బ్రోవుము. అంబా! పురాణములలో నుతించబడి, మధురమైన వాక్కు కలిగిన ఓ శివుని రాణీ! కోరిన కోర్కెలు దీర్చే దేవీ! భక్తుల పాలిట కల్పవృక్షమైన నీవు త్వరగా వరములిచ్చి నన్ను బ్రోవుము. ఓ శ్యామకృష్ణ సోదరీ (శ్రీహరి సోదరి గౌరి కదా), పరమేశ్వరుని రాణి, హిమవంతుని కుమారీ! ఈ భువిలో అనాథుల రక్షణ చేయుటకు వేగముగా రమ్ము. త్వరగా వరములిచ్చి నన్ను బ్రోవుము.

ఈ కృతిలో మొదటి చరణం ఎక్కడా పాడగా వినలేదు. సాయంకాల రాగంగా ప్రసిద్ధి చెందిన కళ్యాణిలో వేడుకోలు, ఆర్తి, భక్తి చాలా విపులంగా వినిపించ వచ్చు. అందుకే ఈ రాగం బహుళ ప్రాచుర్యం పొందింది. బిరాన వరాలిచ్చి బ్రోవుము కృతిని డాక్టర్ బాలమురళీకృష్ణ గారి గళంలో , ఎమ్మెల్ వసంతకుమారి గారి గళంలోడీకే పట్టమ్మాళ్ గారి గళంలో వినండి (మూడు లంకెలు కూడా ఆల్బంకు తీసుకు వెళ్తాయి. అక్కడ కృతిపై క్లిక్ చేస్తే ప్లే అవుతాయి). నాకు అన్నిటికన్నా మంగళంపల్లి వారి గాత్ర శుద్ధి నచ్చింది (తెలుగు భాషను విరచనందుకు).  వసంతకుమారి గారి నెరవులు ఆహ్లాదంగా ఉన్నాయి.

శివదూతీ శివారాధ్యా శివమూర్తి శ్శివంకరీ
శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా

2 వ్యాఖ్యలు: