24, నవంబర్ 2010, బుధవారం

వందే శివం శంకరం స్తోత్రము, తాత్పర్యము

శివుని పరి పరి విధాల స్తుతించే ఈ వందే శివం శంకరం స్తోత్రము శివ వందనముగా కూడా పేరొందింది. దీని రచయిత వివరాలు ఎక్కడ దొరకలేదు. శ్రవణం కూడ దొరకలేదు. మీకు ఎక్కడైనా దొరికితే నాకు తెలియ చేయండి. ఈ స్తోత్రములోని శ్లోకాలు శివోపాసన మరియు నిత్య పూజలో విస్తృతమైన ప్రాచుర్యం పొందాయి. స్తోత్రము, తాత్పర్యము మీకోసం.

జ్ఞాన ప్రసూనా సమేత శ్రీ కాళహస్తీశ్వరుడు


వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే సర్వజగద్విహారమతులం వందేఽంధకధ్వంసినం
వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం
వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే దివ్యమచింత్యమద్వయమహం వందేఽర్కదర్పాపహం
వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం
వందే సత్యమనంతమాద్యమభయం వందేఽతి శాంతాకృతిం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం
వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకం
వందే పద్మాజసారథిం పురహరం వందే మహాభైరవం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే పంచముఖాంబుజం త్రియనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధగంగాధరం
వందే భస్మకృతత్రిపుండ నిటలం వందేఽష్ట మూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం
వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే మంగళరాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం
వందే శంకరమప్రమేయమతులం వందే యమద్వేషిణం
వందే కుండలిరాజకుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే హంసమతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూతగణేశమవ్యయమహం వందేఽర్థ రాజ్యప్రదం
వందే సుందరసౌరభేయ గమనం వందే త్రిశూలాయుధం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే సూక్ష్మమనంతమాద్యమభయం వందేఽంధకారాపహం
వందే రావణనందిభృంగివినతం వందే సుపర్ణావృతం
వందే శైలసుతార్ధభాగవపుషం వందేఽభయం త్ర్యంబకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే పావనమంబరాత్మవిభవం వందే మహేంద్రేశ్వరం
వందే భక్తజనాశ్రయామరతరుం వందే నతాభీష్టదం
వందే జహ్నుసుతాఽంబికేశమనిశం వందే గణాధీశ్వరం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

తాత్పర్యము:  

ఆనందానికి మూలము (శంభు), ఉమాపతి, దేవతలకు అధిపతి, జగత్తుకు కారణమైన వాడు, సర్పములు ఆభరణములుగా కలవాడు, జింకను చేత కలవాడు, జీవ గణములకు అధిపతి (పశుపతి), సూర్య చంద్రులు, అగ్ని మూడు నేత్రములుగా కలవాడు, విష్ణువునకు ప్రియుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

జగత్తు అంతా విహరించే వాడు, సాటి లేని వాడు, అంధకాసురుని నాశనము చేసిన వాడు, దేవతలలో ఉత్తమమైన వాడు, చంద్రుని ధరించిన వాడు, విష్ణువునకు ప్రియుడు, సర్పములు, నాగరాజు ఆభరణములుగా కలవాడు, చిదానందుడు, శుద్ధ ప్రకాశుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

దివ్యమైన వాడు, అచింత్యుడు (మన ఆలోచనకు అందని వాడు), రెండవ సాటి లేని వాడు,   సూర్యుని దర్పమును నాశనము చేసిన వాడు, మచ్చలేని వాడు, ఆరంభమునకు మూలమైన వాడు, నాశనములేని వాడు, దక్షుని యజ్ఞమును నాశనము చేసే వాడు, సత్యమైన వాడు, అనంతమైన వాడు, మూలమైన వాడు, భయము లేని వాడు, శాంత స్వరూపుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

భూమిని రథముగా, విష్ణువును బాణముగా, వేదములను కీటకముగా, మేరు పర్వతమును ధనుస్సుగా, నాగరాజును తీగగా,   బ్రహ్మను సారథిగా కలిగి త్రిపురములను నాశనము చేసిన వాడు, మహా భైరవుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

ఐదు అందమైన ముఖములు, మూడు కన్నులు  కలవాడు,  నుదుట మూడవ కన్ను కలవాడు, అమ్బరమును దాటి వ్యాపించిన వాడు, ముడులు వేసిన జటా ఝూటములలో గంగ, చంద్రుడు కలవాడు, భస్మము నుదుట త్రిపుండ్రములు గా (మూడు విభూతి రేఖలు) కలవాడు, నిటలమైన వాడు, అష్ట మూర్త్యాత్మకమైన వాడు (శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, ఈశాన, మహాదేవ రూపములు),  భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

యముని హరించే వాడు, హరుడు, విషాన్ని ధరించే వాడు, దయామయుడు, పెద్ద ముళ్ళు వేయబడిన ఝూటములు కలవాడు, అంతటా వెళ్ళినవాడు, దయ అనే అమృతానికి నిధియైన వాడు, నరసింహ స్వామిని వశం చేసుకొన్నవాడు,  బ్రాహ్మణుల, దేవతలచే పూజించబడిన పాదపద్ములు కలవాడు,  భగుని కన్ను నాశనము చేసినవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

వెండికొండపై వెలసి యున్నవాడు, దేవతలకు అధిపతి, శుభకరుడు, కొలతకు అందని వాడు, సాటిలేని వాడు, యమునిచే ద్వేషించ బడేవాడు, మెలికలు తిరిగిన సర్పములు కర్ణ కుండలములుగా కలవాడు, వేయి తలలు కలవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.


హంస వంటివాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, మన్మథుని నాశనం చేసిన వాడు, బేసి సంఖ్య కన్నులు కలవాడు (మూడు), భూత గణములకు అధిపతి, మార్పు లేని వాడు, రాజ్యము, సంపద ఇచ్చేవాడు, అందమైన నందీశ్వరుని వాహనముగా కలవాడు, త్రిశూలము ధరించు వాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

సూక్ష్మమైనవాడు, అనంతమైన వాడు, మొదటి వాడు, భయము లేని వాడు, అంధకాసురుని చంపిన వాడు, రావణుడు, నంది, భ్రుంగి చే వందితుడు, స్వర్ణ పుష్పముల రేకులు చుట్టూ కలవాడు, పార్వతిని అర్ధ భాగముగా కలవాడు, త్ర్యంబకుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

శుద్ధమైన, అంబరములను మించిన  ఆత్మ శక్తి కలవాడు, ఇంద్రునికి అధిపతి, భక్తులపాలిటి కలవృక్షము వంటి వాడు, మ్రొక్కే వారి కోరికలు తీర్చే వాడు, జహ్ను మహర్షి కుమార్తె అయిన గంగకు, పార్వతికి పతియైన వాడు, నాశనము లేని వాడు, గణములకు అధిపతి అయిన వాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.


23, నవంబర్ 2010, మంగళవారం

శ్రీ శంకరాచార్య కృత శివ సువర్ణమాలా స్తుతి

యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు,  భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే ఈ సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు తప్ప ఎవరు రచించ గలరు?.  సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు.  ఈ స్తోత్రము వ్యాకరణ అర్థం తెలుసు కోవటం కన్నా భక్తితో పాడి పరమశివుని కనటం ముఖ్యమని భావించి తాత్పర్యానికి సాహసం చేయలేదు. పార్వతీ సమేతుడవైన  శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి,  అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు.

యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది. ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గారువులకు శాత సహస్ర పాదాభివందనములు.

శివ సువర్ణమాల స్తోత్రము, తాత్పర్యము, శ్రవణం రంగనాథన్ గారి గాత్రం.  ఈ లంకె ప్రాక్సీ ఉంటే సరిగా పనిచెయ్యదు. కాబట్టి ఇంట్లోనుంచి వినండి. (కుదించబడిన స్తుతికియూట్యూబ్  శ్రవణం (జస్రాజ్),  శ్రవణం  (సేక్రేడ్ చాన్ట్స్ సిరీస్) ).


అపీతకుచలాంబా సమేత అరుణాచలేశ్వరుడు

శివ సువర్ణమాలాస్తుతి

అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

అఖండమదఖండన పండిత తండు ప్రియ చండీశ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఇభచర్మాంబర శంబరరిపువపురపహరణోజ్జ్వలనయన విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయ భూషణ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఉమయా దివ్య సుమంగళ విగ్రహ యాలింగిత వామాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఊరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఋషివర మానస హంస చరాచర జనన స్థితి లయ కారణ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఋక్షాధీశకిరీటమహోక్షారూఢ విధృత రుద్రాక్ష విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

లువర్ణ ద్వంద్వమవృంతకుసుమమివాంఘ్రౌ తవార్పయామి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఏకం సదితిశ్రుత్యా త్వమేవ సదసీత్యుపాస్మహే మృడభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఐక్యంనిజభక్తేభ్యో వితరసి విశ్వంభరోఽత్ర సాక్షి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఓమితి తవ నిర్దేష్ట్రీ మాయాస్మాకం మృడోపకర్త్రీ భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఔదాసీన్యం స్ఫుటయతి విషయేషు దిగంబరత్వం తవైవ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

అంతఃకరణ విశుద్దిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

అస్తోపాధి సమస్తవ్యస్తై రూపై జగన్మయోఽసి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

కరుణా వరుణాలయ మయిదాస ఉదాసస్తవోచితో న హి భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఖలసహవాసం విఘటయ ఘటయ సతామేవసంగ మనిశం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

గరళం జగదుపకృతయే గిళితం భవతాసమోఽస్తికోఽత్ర విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఘనసారగౌరగాత్ర ప్రచుర జటాజూటబద్ధగంగ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

జ్ఞప్తి స్సర్వశరీరే ష్వఖండితా యా విభాతి సా త్వం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

చపలం మమహృదయకపిం విషయద్రుచరం దృఢంబధాన విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||
ఛాయా స్థాణోరపి తవతాపం నమతాం హర త్వహో శివభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

జయ కైలాశ నివాస ప్రమథ గణాధీశ భూ సురార్చిత భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఝనుతక జంకిణు ఝనుతత్కిట తక శబ్దైర్నటసి మహానట భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

జ్ఞానం విక్షేపావృతిరహితం కురు మే గురు స్త్వమేవ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

టంకార స్తవధనుషో దళయతి హృది ద్విషామశనిరివభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఠాకృతిరివ తవమాయా బహిరంతశ్శూన్యరూపిణీ ఖలు భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

డంబరమంబురుహామపి దళయ త్యఘానాం త్వదంఘ్రియుగం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఢక్కాక్షసూత్రశూలద్రుహిణకరోటీసముల్లసత్కరభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ణాకారగర్భిణీచే చ్ఛుభదాతేశరగతి ర్నృణామిహ భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

తవ మనుమితిసంజపత స్సద్యస్తరంతిమనుజా భవాబ్ధిం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

థూత్కార స్తస్యముఖే భవన్నామ యత్ర నాస్తి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

దయనీయశ్చ దయాళుః కోఽస్తిమదన్య స్త్వదన్య ఇహవదభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ధర్మస్థాపన దక్ష త్ర్యక్ష గురో దక్ష యజ్ఞశిక్షక భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ననుతాడితోఽసి ధనుషా లుబ్ధతయాత్వం పురా నరేణా విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

పరిమాతుం తవమూర్తింనాలమజ స్తత్పరాత్పరోఽసి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఫలమిహ నృతయా జనుష స్త్వత్పదసేవా సనాతనేశ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

బలమారోగ్యం చాయుస్త్వద్గుణ రుచితాం చిరం ప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

భగవన్ భర్గ భయాపహ భూత పతే భూతిభూషితాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

మహిమా తవ నహి మాతి శ్రుతిషు హిమానీధరాత్మజాధవ భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

యమనియమాదిరభిరంగై ర్యమినో హృది యం భజంతి స త్వం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

రజ్జావహిరివ శుక్తౌ రజతమివ త్వయి జగంతి భాంతి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

లబ్ధ్వా భవత్ప్రసాదా చ్చక్రమఖిలం విధురవతి లోకమఖిలం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

వసుధా తద్ధరతచ్చయరథమౌర్వీశరపరాకృతాసుర భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

శర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్త గర్వహరణ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

షడ్రిపు షడూర్మి షడ్వికార హర సన్ముఖ షణ్ముఖ జనక విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మే త్యేతల్లక్షణ లక్షిత భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

హాఽహాఽహూఽహూ ముఖ సురగాయక గీతా పదాన పద్య విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ళాదిర్నహిప్రయోగ స్తదంతమిహ మంగళం సదాస్తు విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

క్షణమివదివసాన్నేష్యతి త్వత్పదసేవాక్షణోత్సుకశ్శివవిభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఈశాయ వాసుదేవాయ శ్రీపాదైరర్పితా సువర్ణమయీ
మాలేయం కంఠే విధృతా దదాతి పురుషార్థాన్

  || ఇతి శ్రీ శంకరాచార్య కృత సువర్ణమాలాస్తుతిః ||

22, నవంబర్ 2010, సోమవారం

శివనామావళ్యష్టకం - తాత్పర్యము

పాహి, ఆర్తితో సాగే ఆదిశంకరుల రచన ఈ శివ నామావళ్యష్టకం. ఆ త్రినేత్రుని దివ్య నామములతో కూడిన ఈ స్తోత్రము మహిమ, వర్ణన సమపాళ్లలో కలిగి, పాలు తేనెల అభిషేకంలా సరళంగా, మృదువుగా, శాంతంగా సాగుతుంది. ఇటువంటి స్తోత్రము రాయాలంటే ఆ వ్యక్తికి ఎటువంటి మానసిక ఔన్నత్యము ఉండి, ఎట్టి పరమాత్ముని దర్శనాలు కలిగాయో ఊహించ వచ్చు. నామావళ్యష్టకం, తాత్పర్యము, యూట్యూబ్ శ్రవణం. సరళమైన పదాలు ఉన్నాయి కాబట్టి చాలా మటుకు వాటినే తాత్పర్యములో వాడుకున్నాను.

పుత్ర సమేత పార్వతీ పరమేశ్వరులు

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
భూతేశ భీతభయసూదన మమనాథం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశచాప
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

హే విశ్వనాథ శివ శంకర  దేవదేవ
గంగాధర ప్రమథనాయక నందికేశ
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష  

వారాణసీపురపతే మణికర్ణికేశ
వీరేశ దక్షమఖకాల విభో గణేశ
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో
హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ
భస్మాంగరాగ నృకపాలకలాపమాల
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

కైలాసశైలవినివాస వృషాకపే హే
మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస
నారాయణప్రియ మదాపహ శక్తినాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శివనామావళ్యష్టకం సంపూర్ణమ్ 

తాత్పర్యము: 

హే చంద్రుని ధరించిన, మన్మథుని సంహరించిన, శూలము చేతిలో కలిగిన, స్థిరముగా నున్న, పర్వతములకు నాథా! , గిరిజాపతీ! మహేశ్వర! శంభో! భూత నాథా! భీతి, భయము పోగొట్టే నా నాథా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే పార్వతి వల్లభా! చంద్ర మౌళి! భూత గణములు ప్రమథ గణములకు నాథా! పర్వతమునే ధనుస్సుగా కలవాడా! వామదేవా! భవా!  రుద్రా! పినాకమును ధరించిన వాడా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

 హే నీలకంఠా! వృషభము పతాకమందు చిహ్నముగా కలవాడా!  ఐదు ముఖములు కలవాడా! లోకేశా! సర్పము చుట్టుకొని ఉన్నవాడా! ప్రమథ గణములకు నాథా! మట్టికొని ఉన్న జుట్టు కలవాడా! పశుపతీ! గిరిజాపతీ!  సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే విశ్వనాథా! శివా! శంకరా! దేవదేవా! గంగాధరా! ప్రమథ గణములకు నాథా! నందికి అధిపతీ! బాణ, అంధకాసురులకు శత్రువైన వాడా! హరా! లోకేశ్వరా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

వారణాసీ పురానికి అధిపతీ! మణికర్ణికకు  అధిపతీ (కాశీలోని శ్మశానము పేరు)!  వీరులకు అధిపతీ! దక్షుని యజ్ఞము నాశనము చేసిన వాడా!  వీరా! గణములకు అధిపతీ! అన్నీ తెలిసిన వాడా! అందరి హృదయములలో నివసించే నాథా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే శ్రిమన్మహేశ్వరా! కృపామయా! దయాళో!  ఆకాశమే కేశములుగా కలవాడా!  నీలకంఠా!  గణాధినాథా!  భస్మము పూసుకొనిన వాడా! కపాలమాలలు ధరించిన వాడా!  సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే కైలాస వాసా! వృషభారూఢా! మృత్యుంజయా! త్రినయనా! ముల్లోకములలో నివసించేవాడా! నారాయణునికి ప్రియుడా! మదమును నాశనము చేసే వాడా! శక్తి (గౌరి)కి పతీ!    సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

విశ్వేశా! ముల్లోకములలో పరాజయం లేని వాడా! ముల్లోకములలో నివసించే వాడా! విశ్వరూపా! విశ్వమునకు ఆత్మయైన వాడా! ముల్లోకములు విస్తరించి యున్నవాడా!  విశ్వ బంధూ! కరుణామయా! దీన బంధో!  సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా! 

ఇది శ్రీమచ్ఛంకరభగవత్పాదులు రచించిన  శివనామావళ్యష్టకం

21, నవంబర్ 2010, ఆదివారం

శివ అక్షరమాలా స్తోత్రము - తాత్పర్యము

సదా శివుని "సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ" అనే అక్షరమాలలో నుతించే అద్బుతమైన స్తోత్రం ఈ శివ అక్షరమాల. ఆ పరమశివుని లీలలు, మహిమలు వేనోళ్ళ కీర్తించే ఈ స్తుతి భజన సాంప్రదాయంలో, నాట్య సాంప్రదాయంలో, గుళ్లలో చాలా ప్రాచుర్యం పొందింది. మంచి లయలో సాగే ఈ స్తోత్రము తన్మయంలో పాడుతూ, ఆడుతూ ఉంటే ఆ సదాశివుడు దిగి వచ్చాడా అన్న ఆవేశం కలుగుతుంది, కనిపిస్తుంది. దీని రచయిత ఎవరో నాకు తెలియలేదు. స్తుతిలో కనిపించే పదాలను బట్టి ఇది దక్షిణాదిన రాయబడిన స్తోత్రముగా అనిపిస్తుంది (చిదంబరము లో నటరాజు, మదురైలో సుందరేశుడు ప్రస్తావన ఉంది కాబట్టి తమిళనాట రాసిందిగా భావించవచ్చు).

శివ కామసుందరీ సమేత చిదంబర నటరాజుడు

ఈ స్తోత్రములో ఇంకొక ప్రత్యేకము. ళు అక్షర ప్రయోగం. ఈ ళ అక్షరము తమిళంలో చాలా ఎక్కువగా వాడుతారు. తెలుగులో కూడ ఈ అక్షరం ఉంది. నవీన తెలుగు భాషలో వాడుకలో లేదు కాని, ఇరవైయ్యవ శతాబ్దపు మధ్య వరకు చాలా సరైన పద్ధతిలో ల, ళ వాడే వారు. ఇప్పుడు తెలుగు వాచకంలో, అక్షరమాలలో, బాలశిక్షలో కూడా ళ కనుమరుగు అయ్యింది. ళు కారము ఈ స్తోత్రంలో వినియోగించ బడింది. బారః మరియు బ్లాగర్ వారికి ఇంక ఈ అక్షరమును ఉంచినందుకు నా ధన్యవాదములు. స్తోత్రము, తాత్పర్యము, శ్రవణం గూగుల్ వీడియో. కొన్ని పదాల అర్థం నాకు తెలియలేదు కాబట్టి వాటిని వదిలి వేసాను. తప్పు అర్థం రాయటం కన్నా రాయకపోవటం మంచిందని నా ఉద్దేశం.


అర్థనారీశ్వర రూపంలో మదురై మీనాక్షీ సుందరేశులు


అథ శ్రీ సాంబ సదాశివ అక్షరమాలాస్తవః

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ||
అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ |సాంబ|
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ |సాంబ|
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ |సాంబ|
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ |సాంబ|
ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ |సాంబ|
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ |సాంబ|
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్నిత్రినేత్ర శివ |సాంబ|
ఋపనామాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ|
ళుల్లిస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
ళూతాధీశ్వర రూపప్రియ హర వేదాంతప్రియ వేద్య శివ |సాంబ|
ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ |సాంబ|
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ |సాంబ|
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ |సాంబ|
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ |సాంబ|
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ |సాంబ|
ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగిహృది ప్రియవాస శివ |సాంబ|
కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ |సాంబ|
ఖడ్గశూల మృగ టంకధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ |సాంబ|
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ |సాంబ|
ఘాతకభంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ |సాంబ|
గాంతస్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ |సాంబ|
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ |సాంబ|
ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ |సాంబ|
జన్మజరా మృత్య్వాది వినాశన కల్మషరహిత కాశి శివ |సాంబ|
ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఓంకారేశ్వర విశ్వేశ శివ |సాంబ|
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ |సాంబ|
టంకస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
ఢక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ |సాంబ|
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేక శివ |సాంబ|
ఢంఢంఢమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ |సాంబ|
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ |సాంబ|
తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ |సాంబ|
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ|
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ |సాంబ|
ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ |సాంబ|
నళినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ |సాంబ|
పార్వతినాయక పన్నగభూషణ పరమానంద పరేశ శివ |సాంబ|
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ |సాంబ|
బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ |సాంబ|
భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ |సాంబ|
మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ |సాంబ|
యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ |సాంబ|
రామేశ్వర పుర రమణ ముఖామ్బుజ సోమేశ్వర సుకృతేశ శివ |సాంబ| 
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ |సాంబ|
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ |సాంబ|
శాంతి స్వరూపాతిప్రియ సుందర వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ |సాంబ|
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ |సాంబ|
హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపుసేవ్య మృడేశ శివ |సాంబ|
లాలిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ |సాంబ|
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ |సాంబ|
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

తాత్పర్యము:

అద్భుతమైన విగ్రహము కలవాడు, దేవతలకు అధిపతి, ఎన్న లేని గుణముల సమూహం కలవాడు, ఆశ్రితులను రక్షించి ఆనందమనే అమృతాన్ని ఇచ్చే వాడు, ఆత్మానంద స్వరూపుడు, మహేశ్వరుడు, చంద్రుని ధరించిన వాడు, ఇంద్రాది దేవతలకు ప్రియుడు, సుందరమైన రూపము కలవాడు, దేవతలకు అధిపతి, ఈశ్వరుడు, జనులకు ప్రియుడు, విష్ణువుచే  పొగడ బడిన వాడు, కీర్తి కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.

నాగ జాతికి ప్రియుడైన వాడు, సర్పములను ఆభరణములుగా కలవాడు,  నరక బాధ నాశనము చేసే వాడు, నాట్యానికి ఈశ్వరుడు, దుష్టులైన దానవులను నాశనము చేసే వాడు,  మానవులను కూడబెట్టిన పాపములను నాశనము చేసే వాడు, ఋగ్వేదములో నుతించ బడినవాడు, చంద్రుని ధరించిన వాడు, సూర్యచంద్రాగ్నులు మూడు నేత్రములుగా కలవాడు, తాపమును తొలగించే వాడు, విలక్షణమైన ప్రపంచము కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

లింగ స్వరూపుడు, సహస్ర బాహువులతో ఉత్తమమైన వాడు, వాక్కుకు అధిపతి, వరములను ఇచ్చేవాడు, భూతములకు అధిపతి, తన రూపమునందు ప్రియుడు, హరుడు, వేదాంతమనే ఇష్టపడే వాడు, వేదములచే పొగడబడిన వాడు, ఏకము, అనేకము రూపములు కలవాడు, ఎల్లప్పుడూ శుభకరుడు, భోగాములందు ప్రియము కలవాడు, పూర్ణుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

ఐశ్వర్యమునకు నిలయమైన వాడు, అనంతమైన జ్ఞానము, కీర్తి, ఆనందం  కలవాడు, ఓంకార, హ్రీంకార ప్రియుడు, గౌరీ సమేతుడు, యముని నాశనము చేసే వాడు, దిక్కులనే అంబరములుగా కలవాడు, చిదంబర క్షేత్రములో విలసిల్లిన వాడు, తుంబురు నారదాదులచే సేవించ బడే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.

ఆహార ప్రియుడు, అష్ట దిక్కులకు నాయకుడు, యోగుల హృదయాలలో నివసించేవాడు, బ్రహ్మచే పూజించ బడిన వాడు, కైలాస ప్రియుడు, కరుణా సాగరుడు, కాశీ క్షేత్రములో ఉన్నవాడు, ఖడ్గము, శూలము, టంకము, ధనుస్సు మొదలగు ఆయుధములు ధరించిన విక్రముడు, విశ్వేశ్వరుడు, గంగ మరియు పార్వతికి భర్త, శుభములు కలిగించే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

భూత గణముల హితము కోరేవాడు, సర్వ జనులకు ఈశ్వరుడు, అపాయమూ కలిగించే వారిని నాశనము చేసే వాడు, పాపములను తొలగించే వాడు, దీనజనులకు ప్రియుడు, ప్రకాశకుడు, జనులకు ఆశ్రయమిచ్చే వాడు, వేద స్వరూపుడు, చండుని నాశనము చేసిన వాడు, అందరికి ప్రియమైన వాడు, భూత గణములకు, దేవతలు అధిపతి, చట్రము, కిరీటము కుండలములు ధరించిన వాడు, పుత్రులైన గణపతి, కుమారస్వామికి ప్రియుడు,  ఈ విశ్వమునకు అధిపతి అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

జన్మము, జరా మరణములను నాశనము చేసే వాడు, కల్మషము లేని వాడు, కాశీ నివాసుడు, ఝుంకారము అంటే ఇష్ట పడే వాడు, భృంగి (నంది) నాట్య మంటే ఇష్టపడే వాడు, ఓంకారేశ్వర క్షేత్రములో వెలసిల్లిన వాడు, జ్ఞానమును కలిగించే వాడు,ఆజ్ఞానమును నాశనము చేసే వాడు, నిర్మలమైన వాడు, టంక స్వరూపుడు,  ఢక్కము మొదలగు ఆయుధములు కలిగి, దేవతా గణము చే పూజించబడి, లావణ్యముతో శోభిల్లే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

డంభాసురుని సంహరించిన వాడు, డమరుకము ధరించిన వాడు, దిక్కులన్నిట ఏకమై యున్న వాడు, ఢమరుకము తో ఢంఢం నాదము చేస్తూ ప్రపంచాన్ని నిశ్చలము చేసే వాడు, కుమారస్వామి, వినాయకునిచే పూజించ బడిన వాడు, అనేకరకమైన మణులు ఆభరణములుగా కలిగిన, గుణ విహీనుడు, స్తుతించే వారి పాలిత దయచూపే వాడు, సకల జీవులకు నాథుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

తత్త్వమసి (నేనే బ్రహ్మను) మొదలగు వాక్యములకు అర్థమైన వాడు, నిత్యమైన వాడు, సృష్టిలో చరాచరములకు మూలమై విలక్షణముగా నున్నవాడు, తాపమును నివారించే వాడు, తత్త్వ స్వరూపుడు, గజాసురుని సంహరించిన వాడు, దీనుల మనసు తెలిసిన వాడు, పాదములకు గంధము పూయబడిన వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

భూమి యందు సకల శుభములు కలిగించే వాడు,  తెల్లని మంచు కొండలపై నివసించువాడు, ధనము, దానము అంటే ఇష్టపడే వాడు, నల్లని కనులు కలవాడు, అందముగా నాట్యము చేసే వాడు, సర్పములు ఆభరణముగా కలవాడు, అమృత స్వరూపుడైన వాడు, పార్వతీ వల్లభుడు, పరమానందముగా నుండే వాడు,  అత్యున్నతమైన దైవము అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

అగ్నిని మూడవ కన్నుగా కలవాడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, విషమును గళంలో యుంచుకొనిన వాడు, అమృత రూపుడు, బంధములను తొలగించే వాడు, బృహతీవృక్షమున నివసించే వాడు, సుబ్రహ్మణ్య స్వామి మొదలగు వారికి ప్రియుడు, భస్మము శరీరమున కలిగిన వాడు, సంసారమున భయములను తొలగించే వాడు, విస్మయము కలిగించే రూపము కలవాడు, విశ్వేశ్వరుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

మన్మథుని సంహరించిన వాడు, మధురా పట్టణమున వెలసిన వాడు, మందరగిరి పై నివసించే వాడు, యతుల హృదయములో నివసించే వాడు, విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలచే పూజించబడిన వాడు, రామేశ్వరము, సోమేశ్వరము మొదలగు క్షేత్రములలో వెలసిన వాడు, రావణుడు, దేవతలచే పూజించబడిన వాడు, వరములు, అభయం ఇచ్చే వాడు, వాసుకి, వనమాల ఆభరణములుగా కలవాడు. శాంతి స్వరూపుడు, సుందరమైన రూపము కలవాడు, వాక్కుకు అధిపతి, వరములిచ్చే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

షణ్ముఖుడైన సుబ్రహ్మణ్యునికి తండ్రి,  ఇంద్రుడు, మునులకు ప్రియుడు, ఆరు గుణములు కలవాడు, సంసారమనే సాగరమును దాటించే వాడు, శాశ్వతుడు, సాదుజనులకు ప్రియుడు, వారి వద్ద ఉండే వాడు, హరుడు, పురుషోత్తముడు, అద్వైతమనే అమృతము తానైన వాడు, విష్ణువుచే పూజించ బడిన వాడు, భక్తులచే ప్రేమించబడే వాడు, జనులకు ఈశ్వరుడు, సత్యమునకు అధిపతి, పార్వతితో కలిసి నాట్యము చేసే వాడు, మన్మథుని చంపిన వాడు, సుందరేశుడు, అంబా సమేతుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.

20, నవంబర్ 2010, శనివారం

వైద్యనాథాష్టకము - తాత్పర్యము

పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది.  నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే.

జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి,  వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసం. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం, తాత్పర్యము మీకోసం. యూట్యూబ్ శ్రవణం.

పరళీ వైద్యనాథ లింగం 

శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ  భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ


ఫల శ్రుతిః

బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం

తాత్పర్యము:

శ్రీ రాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదములు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, అంగారకుడిచే పూజించబడిన, నీలకంఠము కలవాడు, దయామయుడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ప్రవహించే గంగను, చంద్రుని జటా ఝూటములో ధరించిన, మూడు కన్నులు కలవాడు, మన్మథుని, యముని సంహరించిన వాడు, దేవతలందరి చేత పూజించ బడినవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

భక్త ప్రియుడు, త్రిపురములను నాశనము చేసిన వాడు, పినాకమును (త్రిశూలమును) చేతిలో ధరించిన వాడు, నిత్యము దుష్టులను సంహరించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసే వాడు, మునులచే పూజించబడిన వాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.


వాక్కు, వినికిడి శక్తి, కాంతి చూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవ రాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించే వాడు,  కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, యోగులచే ధ్యానింపబడిన పాద పద్మములు కలిగిన వాడు, త్రిమూర్తుల రూపమైన వాడు, సహస్ర నామములు కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణీ స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన - భూత ప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు, భయములు, రోగములు తొలగించే, ఆత్మ స్వరూపుడై దేహము నందు నివసిస్తున్న,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

నీలకంఠుడు, వృషభమును (ఎద్దును) పతాకమందు చిహ్నముగా కలవాడు,  పుష్పములు, గంధము, భస్మముచే అలంకరించబడి శోభిల్లే వాడు, సుపుత్రులు, మంచి ధర్మపత్ని, సత్సంపదలు, అదృష్టములు ఇచ్చే వాడు,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ఫల శృతి: 

బాలాంబిక పతి, జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని ఈ వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి సకల రోగ నివారణ కలుగును.

19, నవంబర్ 2010, శుక్రవారం

అర్ధనారీశ్వరాష్టకం - తాత్పర్యము

అర్ధనారీశ్వర రూపమైన శివ పార్వతులను స్తుతిస్తూ ఆదిశంకరులు ఈ స్తోత్రాన్ని రచించారు. ప్రకృతీ పురుష రూపమైన ఈ దేహాకృతిలో సున్నితమైన స్త్రీ తత్త్వానికి, దృఢమైన పురుష తత్త్వానికి ఆయా లక్షణాలను ఆపాదిస్తూ, వర్ణిస్తూ ఈ స్తోత్ర రచన జరిగింది. స్తోత్రము, తాత్పర్యము మీ కోసం. యూట్యూబ్ శ్రవణం బాలు గారి గళంలో.

అర్ధనారీశ్వర తత్త్వము - మనోహర చిత్రము
చాంపేయ గౌరార్ధ శరీరికాయై
కర్పూర గౌరార్ధ శరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజహ్పుంజ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

ఝణత్ భణత్ కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విసమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

మందారమాలా కలితా లతాయై
కపాలమాలాంకిత కంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

అంబోధర శ్యామల కుంతలాయై
తటిప్రభా తామ్ర జటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమశ్శివాయై చ నమశ్శివాయ

ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

యేతత్పఠేదష్టకమిష్టదం యో
భక్త్యాఽసమాన్యో భువి దీర్ఘజీవి
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం
భూయాత్ సదా తస్య సమస్త సిద్ధిః

తాత్పర్యము: 

కరిగించిన బంగారము వంటి మేని ఛాయ, అందమైన జడగా అల్లబడిన జుట్టు కలిగిన దేవికి, వెలుగుతున్న కర్పూరం వంటి మేని ఛాయ, జటా ఝూటములు కలిగిన దేవునకు - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

చందన, కుంకుమ లేపిత శరీరము కలిగిన దేవికి, చితా భస్మలేపితమైన శరీరము కలిగిన దేవునకు, సౌందర్యముతో ప్రేమను వెదజల్లే దేవికి, మన్మథుని జంపిన దేవునకు - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

మృదు మంజీర రావము పలికే కాలి యందెలు, బంగారు ఆభరణములు కలిగిన దేవికి, సర్పములు కాలికి యందెలుగా, దేహాభారణములుగా కలిగిన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు.

నీలి కలువల వలె విశాలమైన నేత్రములు రెండు కలిగిన దేవికి, పూర్తిగా వికసించిన కలువ వంటి కనులు కలిగి త్రినేత్రుడైన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

మందారము మొదలగు దేవ పుష్పముల మాల, పట్టు వస్త్రములు ధరించిన దేవికి, కపాలమాల, దిక్కులే అంబరములు గా కలిగిన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

కారు మేఘముల వంటి కురులు, గిరిరాణి అయిన దేవికి, రాగి రంగులో మెరుపులా వంటి జటా ఝూటములు కలిగిన, అన్నిటికీ ఈశ్వరుడు అయిన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

తన నాట్యముచే ప్రపంచాన్ని సృష్టించే, జగజ్జనని అయిన దేవికి, తన నాట్యముచే ప్రపంచ నాశనము చేసే, జగత్ పితయైన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

రత్నములచే పొదగబడిన చెవి ఆభరణములు కలిగిన, శివునిలో ఏకమైన దేవికి, సర్పములే సకల ఆభరణములుగా కలిగిన, శివానిలో ఏకమైన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

ఫల శృతి:

ఈ అష్టకాన్ని పఠనం చేసిన వారికి అసామాన్యమైన జీవనం, దీర్ఘాయుష్షు, సమస్త సౌభాగ్యాలు, సంపదలు కలుగును.

కాలభైరవాష్టకం


కాశీలోని కాలభైరవ దేవాలయం

సనాతన ధర్మంలో ఒక గొప్ప విశేషం ఆగమ శాస్త్రానుసారంగా మహనీయులచే స్థాపించబడిన ప్రతి దేవాలయానికీ ఒక క్షేత్రపాలకుడిని కూడా గుర్తించి ఆలయం నిర్మించటం. పేరులో ఉన్నట్లు క్షేత్రపాలకుడు ఆ క్షేత్రానికి కాపలాదారు. అంటే ఆ దేవతా స్వరూపానికి నమ్మిన బంటు లేదా ఆ దేవతామూర్తి యొక్క మరొక రూపమే. తన శక్తిని క్షేత్రపాలకునికి ఆ దేవతామూర్తి నిరంతరం అందజేస్తూ ఉంటుంది. మీరు నిశితంగా పరిశీలించండి - కొన్ని వైష్ణవాలయాలలో హనుమంతుడు, శివ, శక్తి సంబంధితమైన ఆలయాలలో కాలభైరవుడు క్షేత్రపాలకులుగా ఉంటారు. కాలభైరవుని వృత్తాంతము శివపురాణంలో చెప్పబడింది. ఈ సారి కాశీ వెళితే తప్పకుండా కాలభైరవుని దర్శించుకోండి. అలాగే, నేపాల్ వెళ్లినప్పుడు కాఠ్మండు లోని దర్బారు స్క్వేరులో గల కాలభైరవుని దర్శించుకోగలరు.

కాఠ్మండులోని కాలభైరవ విగ్రహం

వారణాసి (కాశీ) పుణ్య క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుని ఉగ్రాంశగా భావించబడే రూపం కాలభైరవుడు. దీనికి ఒక చిన్న గాథ కూడా ఉంది. ఒకసారి బ్రహ్మ శివుని అవమానించి, తన  ముఖముతో శివుని చూసి పక పక నవ్వాడు. అప్పుడు శివుని నుండి కాల భైరవుడు జన్మించి ఆ శిరస్సును నరికేస్తాడు. విష్ణువు విన్నపముతో శివుడు బ్రహ్మను మన్నించి శాంతిస్తాడు.  కాని శిరస్సు ఖండించిన ఆ పాపము  కాలభైరవుడిని వెంటాడింది. ఆ శిరస్సు కూడా కాలభైరవుని వీడక ఉంది. ఈ పాతకము, దాని శిక్షను దూరం చేసుకోటానికి కాలభైరవుడు కాశీ క్షేత్ర ప్రవేశము చేయాలని సంకల్పిస్తాడు. ఆయన ప్రవేశించ గలుగుతాడు, ఆ పాపము ఊరి బయటనే ఉండిపోతుంది. అప్పటినుంచి ఆ కాలభైరవుడు కాశీ క్షేత్రానికి కోత్వాల్ (క్షేత్ర పాలకుడు) గా వ్యవహరించబడ్డాడు. ఈ కాల భైరవునకు వాహనము శునకము. ఈ స్వామి దర్శనము చేయనిదే కాశీ యాత్ర పూర్తి కానట్లే అని ప్రతీతి. జగద్గురువు ఆదిశంకరులు రచించిన మహిమాన్విత, ప్రాశస్త్యము పొందిన కాలభైరావాష్టకం, తాత్పర్యము. యూట్యూబ్ శ్రవణం

కాశీ క్షేత్రపాలకుడు కాల భైరవుడు 

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్
వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశనం
కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుమ్
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

           ఫల శ్రుతి

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం
శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్

తాత్పర్యము:
దేవేంద్రునిచే పూజించబడిన పాదపద్మములు కలిగిన, సర్పమును యజ్ఞోపవీతము గా కలిగిన వాడు, చంద్రుని ధరించిన వాడు, కృపాకరుడు, దిక్కులనే వస్త్రములుగా కలిగిన వాడు, నారదాది మునులచే పూజించ బడిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

కోటి సూర్యుల వలె ప్రకాశించు వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, జగదీశ్వరుడు, నీలకంఠుడు, కామ్యములను తీర్చేవాడు, మూడు నేత్రములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, అజేయమైన త్రిశూలము కలవాడు, నాశనము లేని వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించిన వాడు,  నల్లని మేను కలవాడు, సనాతనుడు, నాశనము లేని వాడు, మొదటి వాడు, రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు, విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

కోరికలు తీర్చి, మోక్షాన్ని ప్రసాదించే వాడు,  పేరుగాంచిన సౌందర్యమున్న దేహము కలవాడు, శివుని రూపమైన వాడు (స్థిరమైన వాడు), భక్త ప్రియుడు, లోకేశ్వరుడు, వేరు వేరు రూపములలో విలసించే వాడు, చిరు గజ్జెలు కలిగిన బంగారు మొలత్రాడు ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

ధర్మమనే సేతువును పాలించేవాడు, అధర్మ మార్గములను నాశనము చేసే వాడు, కర్మ బంధములనుండి తప్పించే వాడు, మనము చేసే తప్పులను తెలియచేసి మనకు సిగ్గును కలిగించే వాడు,  బంగారు రంగులో ఉన్న పాశము, సర్పములు దేహ భాగములకు ఆభరణములుగ కలిగిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

రత్నములు పొదిగిన పాదుకలచే అలరారు పాదములు కలిగిన వాడు,  అంతటాయున్న వాడు, రెండవసాటి లేని వాడు, ఇష్ట దైవమైన వాడు, కామ్యములు తీర్చేవాడు, మానవులకు మృత్యు భయమును తొలగించే వాడు, తన దంతముల ద్వారా మోక్షమును కలిగించే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

బ్రహ్మచే సృష్టించ బడిన వాటిన తన అట్టహాసముతో నాశనము చేయ గలిగిన వాడు,  సర్వ పాపహారము చేసే వీక్షణములు కలవాడు, తెలివైన వాడు, చండ శాసనుడు, అష్ట సిద్ధులను ప్రసాదించే వాడు (అణిమ, గరిమ మొదలగునవి),  కపాలముల మాల ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

భూత నాయకుడు, ఎనలేని కీర్తిని ప్రసాదించే వాడు, కాశీ పుర వాసుల మంచి చెడును విచారించే వాడు, నీతి మార్గములో నిపుణుడు, శాశ్వతుడు, జగత్పతి, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

ఫల శృతి 

అనంతమైన జ్ఞాన మూలమైన, సత్కార్యముల ఫలమును పెంచే, శోకము, మోహము, దారిద్ర్యము, కోరిక, క్రోధము నశింపచేసే ఈ మనోహరమైన కాలభైరవాష్టకం పఠించే  వారికి ఆ భైరవుని సన్నిధి ప్రాప్తించును. 

ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం.

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...