22, నవంబర్ 2010, సోమవారం

శివనామావళ్యష్టకం - తాత్పర్యము

పాహి, ఆర్తితో సాగే ఆదిశంకరుల రచన ఈ శివ నామావళ్యష్టకం. ఆ త్రినేత్రుని దివ్య నామములతో కూడిన ఈ స్తోత్రము మహిమ, వర్ణన సమపాళ్లలో కలిగి, పాలు తేనెల అభిషేకంలా సరళంగా, మృదువుగా, శాంతంగా సాగుతుంది. ఇటువంటి స్తోత్రము రాయాలంటే ఆ వ్యక్తికి ఎటువంటి మానసిక ఔన్నత్యము ఉండి, ఎట్టి పరమాత్ముని దర్శనాలు కలిగాయో ఊహించ వచ్చు. నామావళ్యష్టకం, తాత్పర్యము, యూట్యూబ్ శ్రవణం. సరళమైన పదాలు ఉన్నాయి కాబట్టి చాలా మటుకు వాటినే తాత్పర్యములో వాడుకున్నాను.

పుత్ర సమేత పార్వతీ పరమేశ్వరులు

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
భూతేశ భీతభయసూదన మమనాథం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశచాప
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

హే విశ్వనాథ శివ శంకర  దేవదేవ
గంగాధర ప్రమథనాయక నందికేశ
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష  

వారాణసీపురపతే మణికర్ణికేశ
వీరేశ దక్షమఖకాల విభో గణేశ
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో
హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ
భస్మాంగరాగ నృకపాలకలాపమాల
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

కైలాసశైలవినివాస వృషాకపే హే
మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస
నారాయణప్రియ మదాపహ శక్తినాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శివనామావళ్యష్టకం సంపూర్ణమ్ 

తాత్పర్యము: 

హే చంద్రుని ధరించిన, మన్మథుని సంహరించిన, శూలము చేతిలో కలిగిన, స్థిరముగా నున్న, పర్వతములకు నాథా! , గిరిజాపతీ! మహేశ్వర! శంభో! భూత నాథా! భీతి, భయము పోగొట్టే నా నాథా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే పార్వతి వల్లభా! చంద్ర మౌళి! భూత గణములు ప్రమథ గణములకు నాథా! పర్వతమునే ధనుస్సుగా కలవాడా! వామదేవా! భవా!  రుద్రా! పినాకమును ధరించిన వాడా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

 హే నీలకంఠా! వృషభము పతాకమందు చిహ్నముగా కలవాడా!  ఐదు ముఖములు కలవాడా! లోకేశా! సర్పము చుట్టుకొని ఉన్నవాడా! ప్రమథ గణములకు నాథా! మట్టికొని ఉన్న జుట్టు కలవాడా! పశుపతీ! గిరిజాపతీ!  సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే విశ్వనాథా! శివా! శంకరా! దేవదేవా! గంగాధరా! ప్రమథ గణములకు నాథా! నందికి అధిపతీ! బాణ, అంధకాసురులకు శత్రువైన వాడా! హరా! లోకేశ్వరా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

వారణాసీ పురానికి అధిపతీ! మణికర్ణికకు  అధిపతీ (కాశీలోని శ్మశానము పేరు)!  వీరులకు అధిపతీ! దక్షుని యజ్ఞము నాశనము చేసిన వాడా!  వీరా! గణములకు అధిపతీ! అన్నీ తెలిసిన వాడా! అందరి హృదయములలో నివసించే నాథా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే శ్రిమన్మహేశ్వరా! కృపామయా! దయాళో!  ఆకాశమే కేశములుగా కలవాడా!  నీలకంఠా!  గణాధినాథా!  భస్మము పూసుకొనిన వాడా! కపాలమాలలు ధరించిన వాడా!  సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే కైలాస వాసా! వృషభారూఢా! మృత్యుంజయా! త్రినయనా! ముల్లోకములలో నివసించేవాడా! నారాయణునికి ప్రియుడా! మదమును నాశనము చేసే వాడా! శక్తి (గౌరి)కి పతీ!    సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

విశ్వేశా! ముల్లోకములలో పరాజయం లేని వాడా! ముల్లోకములలో నివసించే వాడా! విశ్వరూపా! విశ్వమునకు ఆత్మయైన వాడా! ముల్లోకములు విస్తరించి యున్నవాడా!  విశ్వ బంధూ! కరుణామయా! దీన బంధో!  సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా! 

ఇది శ్రీమచ్ఛంకరభగవత్పాదులు రచించిన  శివనామావళ్యష్టకం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి