6, నవంబర్ 2010, శనివారం

మహాన్యాసము - అధికార పధ్ధతి


నారుద్రో రుద్రమర్చయేత్ - అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?

మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు  కలిగినది.

౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు  కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము  పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

౧. ప్రథమాంగన్యాసము

భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత,  పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.

౨. ద్వితీయాంగన్యాసము

ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి, ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః,  తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు  నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.

౩. తృతీయాంగన్యాసము

సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.

తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు   పఠించుచు ఆయ దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటం అంటారు.

తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు , ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.

తర్వాత షోడశాంగ రౌద్రీకరణము -  ఓం  అం విభూరసి  ప్రవాహణో.... అనే మంత్రముతో మొదలు పెట్టి ఓం అః  ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర 'రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్‍ం సీః' అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు  "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.

దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును, సర్వ భూతములచే అపరాజితుడగును, ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.

౪. చతుర్థాంగన్యాసము

"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.

౫. పంచమాంగన్యాసము

ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. శివ సంకల్పం గురించి ప్రత్యేక వ్యాసం తర్వాత రాస్తాను. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని  ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్‍ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగును.

తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్‍ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.

తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్‍ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.

తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.


తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.

తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే  రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః"  అని దిగ్బంధమును చూపించ వలెను.

తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).

వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను.  

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్

దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.

లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని  తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించునది).

[తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయే హృదయం మయి" మొదలు "అంత స్తిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేక ప్రారంభములో చమకములోని 'శంచమ' అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి"  అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి, శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును.]

ఇది క్లుప్తంగా మహాన్యాసం లోని అధికార అర్హతకు చేయవలసిన పధ్ధతి.

5, నవంబర్ 2010, శుక్రవారం

బిల్వాష్టకం

బిల్వ పూజ 

శివ పూజకు అత్యంత శ్రేష్ఠమైనది మారేడు ఆకు. దీనినే సంస్కృతంలో బిల్వ పత్రం అంటారు. మారేడు చెట్టుకి వచ్చే ఆకులు విశేషమైన ఆకారం లో ఉంటాయి. మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి  త్రిదళం అని పేరు పొందాయి . ఇది మూడు గుణాలకు ప్రతీకగా (సత్వ రజస్తమో గుణములు),  పరమశివుని మూడు కన్నులుగా, మూడు జన్మల పాపాన్ని హరించేదిగా చెప్పబడింది. ఈ బిల్వపత్రాలు ఎండినా కూడా పూజలో వినియోగించ వచ్చు. మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బిల్వపత్రాల మహిమ గురించి రాసిన బిల్వాష్టకం, తాత్పర్యం మీకోసం. వేర్వేరు మూలాల్లో ఈ అష్టకం సాహిత్యం కొంత తేడా ఉంది నాకు తెలిసి కిందది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. యూట్యూబ్ లంకె.


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
 
అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం
 
సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం
 
దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం
 
లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం
 
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
 
కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
 
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం


ఫలశృతి 

బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్


తాత్పర్యము: 

బిల్వ దళం

మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను. 

ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

కోటి ఏనుగుల దానం ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల ఫలం తో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

లక్ష్మీ దేవీ స్తన్యము నుండి జన్మించిన, శివునికి ఎంతో ప్రియమైన, బిల్వ వృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

దర్శనం, స్పర్శనం వలన మహా పాపాలను నాశనం చేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

కాశీ నివాసం, కాల భైరవుని దర్శనం, ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలో శివుని కలిగిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

ఫల శృతి: 

శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వలన పాపాలు తొలగి, పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది.

శ్రీ రుద్రదేవతా రూపం - శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాలు, తాత్పర్యము

 రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.

పంచాంగ రుద్ర రూపం 
తత్పురుష ముఖ ధ్యానమ్

సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం
గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం
అర్ధేందుద్యుతిలోలపింగలజటా  - భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః

తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)

అఘోర ముఖ ధ్యానమ్

కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం
కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం
సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణ సంచారగం
వందే దక్షిణమీశ్వరస్య కుటిల - భ్రూభంగ రౌద్రం ముఖం

తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)

సద్యోజాత ముఖ ధ్యానమ్

ప్రాలేయాచల చంద్రకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం
భస్మాభ్యక్తమనంగదేహ దహన - జ్వాలావళీలోచనం
బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై - రభ్యర్చితం యోగిభిః
వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం

తాత్పర్యము:  హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల పూవు - వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)

వామదేవ ముఖ ధ్యానమ్

గౌరం కుంకుమ పంకిలం సుతిలకం - వ్యాపాండు గండ స్థలం
భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం
స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం - నీలాల కాలం కృతం
వందే పూర్ణ శశాంకమండల నిభం - వక్త్రం హరస్యోత్తరం

తాత్పర్యము:  గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో నిన్దినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కళ చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని మున్గుతులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)

ఈశాన ముఖ ధ్యానమ్

వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః
వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం


తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అణు రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు, శాస్తమును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)


శ్రీరుద్రధ్యానమ్

బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం



తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!

ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్



తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి,  నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగాములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించ వలెను.

4, నవంబర్ 2010, గురువారం

ఒడిషా యాత్ర

ఇటీవలే నా సహోద్యోగి సతీష్ భువనేశ్వర్ వెళ్లి వచ్చాడు. ఆ మాట వినగానే నాకు ఉత్సాహం వచ్చి అప్పటికప్పుడు వెళ్ళటానికి నిర్ణయం చేసాము. నా సహోద్యోగి బిప్లబ్ నాయక్ ఒడిషాకు చెందిన వాడు. భువనేశ్వర్లో వాళ్ల నాన్నగారు, బావమరిది సహాయంతో మాకు మంచి ప్లాన్, హోటల్ బుకింగ్ చేసాడు.

హైదరాబాదులో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఇండిగో విమానం ద్వారా బయలు దేరి భువనేశ్వర్ కు పది గంటలకు చేరుకున్నాము. ఒడిషా రాజకీయ పితామహుడు బిజూ పట్నాయక్ విమానాశ్రయంలో దిగి బయటకి రాగానే ఎదురుగా ఆయన విగ్రహం కనబడుతుంది. కారు ఎక్కి లింగరాజ్ అనే హోటల్లో దిగాము.

లింగరాజ స్వామి గుడి:


స్నానం చేసి మా మొదటి మజిలీ పేరుపొందిన లింగరాజ స్వామి గుడి. గుడి మొదటిలోనే పండాలు మా వెంట పడ్డారు. వారిలో తెలుగు వచ్చిన ఒక పండాను మాట్లాడుకొని మా గైడ్ గా పెట్టుకున్నాము. పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ గుడి భారత దేశంలోని గుళ్లలో మాణిక్యం. అద్భుతమైన శిల్ప సంపద, ఒడిషా సాంప్రదాయంలో కట్టబడి ఉంది. గోపురం 180 అడుగుల ఎత్తు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు దీని శిఖరము కనపడుతుంది.  గుడిలోపల దాదాపు 150 చిన్న పెద్ద గుళ్ళు ఉన్నాయి.

ప్రధాన దైవం శివుడు సాలగ్రామ రూపంలో స్వయంభూ. అందుకని అక్కడ లింగాకారం బయటకు కనిపించదు. ప్రతిమరూపంలో వెండి త్రినేత్రుడు మనకు కనిపిస్తాడు. బిల్వ దళములతో   స్వామిని అర్చించి చుట్టూ ఉన్న గుళ్ళు చూడటం మొదలు పెట్టాము. గుడి ప్రాకరంలోనే వైద్యనాథుడు, కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణ, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణుడు, దుర్గ, నంది, సీతారాములు, హనుమంతుడు మొదలగు అన్ని దేవతలకు మందిరాలు ఉన్నాయి. వీటిలో విశేషమైనవి విశ్వనాథుడు, అన్నపూర్ణ. వీరినందరిని దర్శించటానికి ఒక గంటన్నర పడుతుంది. పండాకు నూటపదహార్లు చెల్లించి బయట పడ్డాము. గుడికి ఉత్తర భాగంలో గుడి మొత్తం కనిపించేలా ఒక ఎత్తైన ప్రదేశం ఉంది. అక్కడ నుంచి ఫోటోలు తీసుకోవచ్చు.

విరజాదేవి (గిరిజా దేవీ) శక్తి పీఠం - నాభి గయ క్షేత్రం


మధ్యాహ్న భోజనం వీనస్ ఇన్ అనే దక్షిణ భారత హోటల్లో చేసి ఆదిశంకరులు స్థాపించిన శక్తి పీఠంలో ఉన్న విరజాదేవి (గిరిజా దేవీ అని కూడా అంటారు) దర్శనానికి జాజ్పూర్ బయలుదేరాము.  ఈ జాజ్పూర్ భువనేశ్వర్ నుంచి 120 కిలోమీటర్ల దూరం. జాతీయ స్వర్ణ చతుర్భుజి లో భాగమైన జాతీయ రహదారి 5 మీద రెండు గంటలలో ఇక్కడికి చేరాము. ఇక్కడ అమ్మ విరజాదేవి (రజో గుణం తొలగించే శక్తి కలిగినది). ఈ ఆలయము 13వ శతాబ్దము నాటిదని ఇక్కడ చెప్పబడింది.  ఇది మూడు గయా క్షేత్రాలైన ముఖ (బీహార్లోని గయ) , నాభి, పాద గయ (ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురం) క్షేత్రాలలో  నాభి గయ. కాబట్టి ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రదానము, శ్రాద్ధము చేస్తారు.

ఈ క్షేత్రము ప్రఖ్యాత వైతరిణి నదికి సమీపంలో ఉంది. ఈ వైతరిణి ఒడ్డున బ్రహ్మ అశ్వమేధం చేసాడని ప్రతీతి. ఈ క్షేత్రంలో శివుడు విశ్వనాథుని రూపంలో పెద్ద శివలింగాకారంలో ఉన్నాడు. గర్భ గుడి వెనుక దుర్గ బగళా ముఖి రూపంలో ఒక చిన్న గుడి ఉంది. అలాగే శివలింగాల సమూహం గర్భగుడికి ఈశాన్య భాగంలో ఉంది. విరజా అమ్మవారికి పూజ చేయించుకొని రాత్రికి భువనేశ్వర్ పట్టణం చేరుకున్నాము.   అక్కడ శ్రీ రాం మందిర్ అద్భుతమైన మందిరం. ఈ మందిరంలో సీతారామలక్ష్మణులు, రాధాకృష్ణులు, పంచముఖ హనుమాన్ ప్రధాన దేవతలు. గర్భ గుడి బయట దుర్గ, లక్ష్మి, శివుడు, గణపతి ఆలయాలు ఉన్నాయి. చాలా అందంగా ఉంది ఈ మందిరం. దర్శనం చేసుకొని వీనస్ ఇన్ లో రాత్రి భోజనం చేసి పడుకున్నాము. మర్నాడు సూర్యోదయం కోణార్క్ బీచ్ లో చూడాలని నిర్ణయించుకొని పడుకున్నాము.

కోణార్క్ బీచ్:


శనివారం ఉదయం మూడున్నరకే లేచి రూం చెకౌట్ చేసి కారులో అయిదున్నరకు కోణార్క్ బీచ్ చేరుకున్నాము. తూర్పున ఉన్న బంగాళా ఖాతం తీరంలో ఉన్న కోణార్క్ బీచ్ పేరు చంద్రభాగ. అద్భుతమైన సూర్యోదయం అక్కడ చూసి, సాగర కెరటాల్లో మునిగి తేలి కుటుంబమంతా చాలా మానసిక విశ్రాంతి పొందాము. ఎర్రటి అరుణ కిరణాలు సముద్రుడి అంచులను దాటి పైకి ఎగ బాకుతూ, వాయుదేవుడు చల్లని మలయ మారుతాలను కెరటాలతో కలిసి తీరం వైపు నెడుతూ ఉంటే చెప్పలేని ఆనందం. ఈ కోణార్క్ బీచ్ సూర్యోదయం చూసి తీరాల్సిందే.  బీచ్ పక్కనే ఒడిషా పర్యాటక శాఖ వారి సులభ స్నాన గదులు చాలా సదుపాయంగా ఉన్నాయి. వీటి పక్కనే పర్యాటక శాఖ వారి భోజనశాల కూడా ఉంది. స్నానాలు, ఫలహారము చేసి సూర్య దేవాలయ సందర్శనానికి బయలుదేరాము.

కోణార్క్ సూర్య దేవాలయము:


ఈ యుగపు అధ్బుతాల్లో ఒకటిగా అనుకోవచ్చు ఈ సూర్య దేవాలయము. చంద్రభాగా తీరంనుంచి రెండు కిలోమీటర్ల దూరమలో ఉన్న ఈ దేవాలయము తెల్లవారి దోపిడీలకు గురై శిథిలావస్థలో ఉంది. పదమూడవ శతాబ్దంలో నరసింహదేవ రాజు చే నిర్మించబడిన ఈ దేవాలయం సాంకేతిక, శిల్పకళ నైపుణ్యానికి తలమానికం. ఆనాటి సామాజిక స్థితి, శృంగారం, ఆధ్యాత్మికము చక్కని శిల్పాల రూపంలో చెక్కబడింది. రథమున ఎక్కి విలసిస్తున్న సూర్యుని దేవాలయం ఇది. గర్భ గుడి గోపురం 227 అడుగుల ఎత్తు. 24 చక్రాలు గుడికి చుట్టూ అమర్చబడ్డాయి. గర్భగుడికి మూడు దిక్కులా మూడు సూర్యులు (ఉదయించే సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు, అస్తమించే సూర్యుడు - మానవుని మూడు జీవిత కాలాలకు (యవ్వనం, నడి వయస్సు, వృద్ధాప్యం) సంకేతంగా ఇవి అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. శిథిలాలలో దాదాపు సగం గర్భ గుడి లేదు. గుడి ముందు భాగంలో అద్భుతమైన నాట్య మంటపం ఉంది. ఇక్కడ ఎత్తైన స్థంభాలు, ఏక శిలా విగ్రహాలు నాలుగు వాకిళ్లతో మనోజ్ఞంగా కనిపిస్తాయి. గర్భ గుడి, జగ్మోహన మంటపం నాలుగు ద్వారాలు బ్రిటిష్ దొరలచే 1908 సంవత్సరంలో మూయబడి జాతీయ వారసత్వ సంపదగా గుర్తించబడి, తర్వాత ఏ.ఎస్.ఐ వారికి అప్పగించబడింది. సూర్యుని కిరణాలు అయస్కాంతములతో ఒక అద్భుతమైన సూర్య సమూహాన్ని భువి మీద శ్రుష్టించారు ఆ నాటి సాంకేతిక నిపుణులు, శిల్పులు. ఒక సాంకేతిక అద్భుతం ఈ మందిరం. శిథిలావస్థలో ఉండటం మన దురదృష్టం. కోణార్క్ సూర్యదేవాలయానికి వెళ్లే దారిలో ఒడిషా ప్రాంతానికి చెందిన హస్త కళలు (నార, కొమ్ములు, గవ్వలతో చేసినవి ప్రముఖంగా) అమ్మకానికి దొరుకుతాయి.  గైడ్ సహాయంతో మొత్తం గుడిని తనివి తీరా చూసి, చిత్రాలు, వీడియోలు తీసుకొని పురీకి బయలు దేరాము.

మెరీన్ డ్రైవ్ (చంద్రభాగా తీరం):

ఒడిషా పర్యాటక శాఖ ప్రభుత్వం కోణార్క్ నుంచి పురీ వెళ్ళటానికి సముద్రం వెంబట చక్కని రహదారి, దానికి ఇరుపక్కల చెట్లు వేసారు. బ్యాక్ వాటర్స్, ఈ చెట్లు, రహదారి - కోణార్క్- పురీ ప్రయాణాన్ని మనకు ఒక తీపి గుర్తుగా మిగులుస్తాయి. బంగాళా ఖాతం యొక్క ఎగిసే అలలు పచ్చని ప్రకృతి, రెండు వైపులా కలువలు ఈ సౌందర్యానికి ఆలవాలం. దాదాపు 30 కిలోమీటర్ల దూరం కోణార్క్-పురీ మధ్య.

మహా పుణ్య క్షేత్రం పురీ:



పురీ జగన్నాథ దేవాలయం నాలుగు దివ్య ధామాల్లో అగ్రగణ్యం. పురీ, రామేశ్వరం, ద్వారక, బదరీనాథ్ - ఇవి నాలుగు దివ్య ధామాలు. ఆది శంకరులచే పూజించ బడినవి ఈ దేవాలయాల ప్రధాన దేవతలైన జగన్నాథుడు, రామ లింగేశ్వరుడు, శ్రీ కృష్ణుడు, నారాయణుడు. నగరంలో అడుగు పెడుతూనే ఆ నీల మేఘ శ్యాముని సుగంధం, ఆయన భక్తుల సందోహం, పారవశ్యం, ఆధ్యాత్మిక సంపద ఒక వైపు మరొక పక్క సముద్రం వెంబడ ఉన్న హోటల్స్/రిసార్ట్స్/ఆహ్లాదము.


ఒడిషా పర్యాటక శాఖ వారి పంథనివాస్ పేరుతో వసతి గృహాలు ప్రతి పర్యాటక ప్రదేశంలో ఉన్నాయి. వాటిలో మన పున్నమి లాగ అన్ని వసతులు ఉన్నాయి. పురీలో పంథనివాస్  సీ బీచ్ రోడ్డులో (ఊరిలో స్వర్గధామం అనే వైపు) సముద్రపు ఒడ్డున కట్టారు. రూము దాటి వెళితే బంగాళా ఖాతమే. దాదాపు 4-5 కిలోమీటర్ల పొడవున ఉన్న పురీ నగర తీరం మొత్తం హోటల్స్, రిసార్ట్స్. డబ్బును బట్టి వసతులు, దగ్గర/దూరం. పంథనివాస్ లో చెక్ ఇన్ చేసి, సామాను పడేసి, స్నానం చేసి స్వామి దర్శనానికి బయలు దేరాము. పురీ గుడికి, పార్కింగ్ కి దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దూరం వెళ్ళటానికి గుడి వారి బస్సులు, రిక్షాలు, ఆటోలు ఉన్నాయి. గుడి ముఖ ద్వారం ముందు నిలిచోగానే అదొక అలౌకిక ఆనందం. ఇక్కడ పండాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎంత ఓపిక ఉన్నవారికైనా విసుగు, కోపం కలిగించే ఈ బ్రాహ్మణులు డబ్బు కోసం పీక్కుతింటారు. ప్రతి పనికి డబ్బే ఈ దేవాలయంలో. ఒక పండాను పట్టుకొని దర్శనం చేసుకున్నాం. పాద దర్శనానికి 25 రూపాయల టికెట్. ప్రధాన దేవాలయం చుట్టూ ఎన్నలేని గుళ్ళు ఉన్నాయి. గర్భగుడి ఎత్తు 214 అడుగులు. దేవాలయ ప్రాంగణం కొలతలు 650 x 650   అడుగుల చతురస్రం. చుట్టూ గోడ 20 అడుగుల ఎత్తు. నాలుగు వైపులా నాలుగు మహా ద్వారాలు.

భారత దేశంలో ఉండే ఇతర దేవాలయాల లాగ కాకుండా ఇక్కడ ప్రధాన దేవతలు సోదరీ సోదరులు - బలరాముడు, సుభద్ర, శ్రీ కృష్ణుడు. ఆలాగే, విగ్రహాలు చెక్కతో చేయబడినవి. దాదాపు 6000 మంది సేవకులతో నిత్యము 10,000 - 25,000 భక్తులకు అన్న సంతర్పణతో ఆ జగన్నాథుడు అలరారుతున్నాడు. గర్భ గుడి బయట విమలా దేవీ (అమ్మవారు), రాధా కృష్ణులు, విశ్వనాథుడు, మహాలక్ష్మి, హనుమంతుడు, సూర్యనారాయణుడు ఇతర దేవతలు ఉన్నారు. 

దేవాలయం చుట్టూ ఉన్న మంటపాలు, కూర్చునే ప్రదేశాల్లో యోగులు, యోగినిలు దినం, జపం, కీర్తనలో మునిగి తేలుతూ బాహ్య ప్రపంచం పట్టకుండా ఆ జగన్నాథుని భక్తి సామ్రాజ్యంలో ఉంటారు. వీరినే చూస్తే ఒళ్ళు పులకించి తెలియకుండా నారాయణ నామస్మరణ చేస్తుంది.

ఇక్కడ మహా ప్రసాదం గురించి కొంత చెప్పాలి.

దేవాలయంలో  భక్తులకు ప్రసాదంగా పంచ భక్ష్య పరమాన్నాలు పెడతారు. ఈ వంటలన్నీ మట్టి కుండల్లో వండుతారు. విశేషం ఏమిటంటే ప్రతి సారి వండేవి కొత్త కుండలే. అన్నము, పప్పు, కూర, సాంబారు, పాయసం వండి నైవేద్యం పెట్టి మంతపాల్లో భక్తులకు సంతర్పణ చేస్తారు. ఇవి కాకుండా, ఆలయ ప్రాకారంలో, వసారాలో ప్రతి వ్యక్తికీ అరటి ఆకు లేదా విస్తరిలో ఇవి వడ్డించి పెడతారు. మంటపాలను ఆనంద్ బజార్ అంటారు. అక్కడ ఎన్నో రకాల మిఠాయిలు అమ్ముతారు. భోజన సమయంలో ఈ దేవాలయ ప్రాంగణం క్రిక్కిరిసి ఉంటుంది. అందుకని కొంత శుభ్రం తక్కువ అనిపించొచ్చు. మహా ప్రసాదం తినకుంటే పురీ ప్రయాణం పూర్తి కానట్టే.  దర్శనము చేసి, ప్రసాదము తిని బయట పడ్డాము.

పురీ బీచ్:


పంథనివాస్ లో కాసేపు విశ్రాంతి తీసుకొని వెనకనే ఉన్న తీరానికి వెళ్ళాము. పురీ బీచ్ చాలా విశాలమైనది. అక్కడ లైఫ్ గార్డ్స్, బీచ్లో వాలీ బాల్ ఆడే వారు, వాకింగ్, జాగింగ్ చేసే వారు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. హాయిగా కాసేపు అక్కడ సేద తీరి, స్వర్గ దామము వైపు వెళ్లి ఒడిషా చేనేత వారి సంభాల్పూర్ చీరలు కొనుక్కుని నా శ్రీమతి. అక్కడ బీచ్ లో రాత్రిపూట బజార్ చాలా బాగుంది. దీపాల కాంతిలో కూర్చీలు వేసుకొని బీచ్ లో హాయిగా కూర్చో వచ్చు. అక్కడే ఉన్న విట్టల్ కామత్ హోటల్ లో భోజనం చేసి రూం కి చేరాము. హాయిగా నిద్రపోయాం. ఆదివారం ఉదయమే లేచి సూర్యోదయము సముద్రం మీద చూసి కాసేపు ఆడుకున్నాము అందరం. స్నానాలు చేసి చెక్ అవుట్ చేసి చిలికా సరస్సుకు బయలుదేరాము.

చిలికా సరస్సు:


పురీ నుంచి బర్కుల్ చిలికా వెళ్లే మార్గంలో ఒక ౩౦ కిలోమీటర్లు రోడ్డు అసలు బాగోలేదు. దాదాపు రెండు గంటలు నరక యాతనే. అది దాటితే, జాతీయ రహదారి 5 . దాదాపు మూడు గంటల ప్రయాణం తర్వాత బర్కుల్ చేరుకున్నాము. అక్కడ పంథనివాస్ చెక్ ఇన్ చేసి అక్కడే భోజనం చేసి (శాఖాహారులకు ఇక్కడ భోజనం అసలు బాలేదు కాబట్టి ఏమైనా తీసుకెళ్లటం మంచిది) బోటు విహారానికి బయలు దేరాము. పంథనివాస్ లో ఏ.సీ కాటేజీ వసతి రేటు 1700 రూపాయలు.

చిలికా సరస్సు ఆసియాలో కెల్లా పెద్దదైన సహజమైన సరస్సు. పదకొండు వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యముతో ఒక వైపు బంగాళా ఖాతంలో కలిసే ఈ సరస్సు రకరకాల పక్షులకు, జల చరాలలు ఆలవాలం. చిలికా సరస్సుకు నాలుగు మార్గాలు ఉన్నాయి కాని ఉండటానికి వసతి ఒక్క బర్కుల్ లో మాత్రమే ఉంది. ఇక్కడ నవంబర్, డిసెంబర్ నెలలో ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వలస పక్షులు వస్తాయిట. మేము వెళ్ళినప్పుడు ఇంక ఆ సీజన్ మొదలు కాలేదు. నౌక విహారం మోటర్ బోటు లో దాదాపు గంటన్నర. ఈ విహారం బర్కుల్ నుండి కాలిజై ద్వీపం వరకు వెళ్లి తిరిగి రావటం. కాలిజై ద్వీపం అతి చిన్నది. ఈ ప్రాంతం భారతీయ నౌకాదళం వారిచే నడపబడుతున్నది. అక్కడ ఒక కాళికా మందిరం ఉంది. నాలుగు వైపులా నీరు, మధ్యలో ఈ గుడి - చాలా బాగుంది. కొంత పరిశుభ్రత తక్కువే కాని ప్రకృతి మనల్ని చాలా ఆహ్లాదపరుస్తుంది ఇక్కడ.

ఒక సరస్సులా కాకుండా సముద్రంలా అనిపిస్తుంది ఈ చిలికా. నీరు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. కానీ, సముద్రం ఒక వైపు ఉండటం వలన కొంత ఉప్పగా ఉంటాయి. చిలికా బర్కుల్ పంథనివాస్ లో కుటుంబాలకు వసతిగా కాటేజీలు, రూములు ఉన్నాయి. సరస్సు మీద సూర్యోదయం చాలా బాగుంటుందిట. మేము ఉదయం టైములో అక్కడ ఉండలేదు కాబట్టి చూడలేకపోయాం. పైగా వర్షము కూడా. ఈ సరస్సులో చిన్న చిన్న ద్వీపాలు చాలా ఉన్నాయి. బోటింగ్ వసతి బర్కుల్, రంభ, బాలుగావ్, సత్పద ప్రాంతాలనుంచి ఉంది. ఈ ప్రదేశాలనుంచి చిలికను సందర్శించ వచ్చు.

చిలికా చూసుకొని మేము రాత్రికి మళ్లీ భువనేశ్వర్ చేరాము. రెండు గంటల ప్రయాణం జాతీయ రహదారి 5 మీద. హోటల్ గ్రాండ్ సెంట్రల్ లో వసతి.  ఇక్కడ సదుపాయాలు, భోజనము బాగున్నాయి. 2100 రూపాయలు రోజుకి ఈ హోటల్లో. 

భువనేశ్వర్ లోకల్:

ధౌళి:



సోమవారం ఉదయం త్వరగా తయారు అయ్యి, ఫలహారం చేసి మొట్ట మొదలు  ధౌళికి వెళ్ళాము. ఈ ధౌళి గిరి బౌద్ధ క్షేత్రం. ఇది భువనేశ్వర్ కు 8 కిలోమీటర్ల దూరం. దయానది ఒడ్డున ఉన్న పర్వతంపై అశోక చక్రవర్తి కాలం నాటి రాళ్ళకు గుర్తుగా ఈ క్షేత్రం నిర్మించ బడింది.  260 బీ.సీ నాటి రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. బౌద్ధ గురువుల సలహాతో 19వ శతాబ్దంలో రాజు ఇక్కడ శాంతి స్తూపాన్ని నిర్మించాడు.   శాంతి స్తూపం వలయాకారంలో ఉంటుంది. నాలుగు వైపులా నాలుగు బుద్ధుల విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ శాంతి స్తూపం వెనక శివుని గుడి చాలా బాగుంది. పెద్ద లింగము, మంచి అలంకరణ, బిల్వ దళములతో, తెల్లని పూలతో పూజ చాలా అందంగా ఉంది. ఈ గుడి గోడలో ఒకవైపు అమ్మ వారు ఇంకోవైపు గణపతి, వెనుక లక్ష్మీ నారాయణులు, దుర్గ ఉన్నారు.  ఈ కొండ మీద నుంచి పచ్చని ప్రకృతి, దయానది, భువనేశ్వర్ పట్టణం కనిపిస్తాయి. ఎంతో ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంది ఈ ధౌళి.

ముక్తేశ్వర్, సిద్దేశ్వర్, కేదారగౌరి దేవాలయాలు:


ధౌళి నుంచి తిరిగి వచ్చే దారిలో ముక్తేశ్వర్ మందిర సముదాయం ఉంది. ఇది ఏ.ఎస్.ఐ వారి ఆధీనంలో ఉంది. అద్భుతమైన మందిరం ఇది. ఇక్కడ శివుడు ముక్తేశ్వర్, సిద్ధేశ్వర్ పేరులతో ఆలయాలు ఉన్నాయి. అలాగే ఎన్నో దేవతల సముదాయం ఉంది. ఇది 950 సంవత్సరం నాటిది. ఇక్కడ తోరణం చాలా ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ గుడి వెనుక కొలను ఉంది. ఇందులో స్నానం చేస్తే వ్యాధులు తగ్గి సంతానము లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక నాట్య కళాకారిణి ఛాయ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ గుడికి ఇంకొక వైపు కేదార గౌరీ మందిరం ఉంది. చాలా పురాతనమైన ఈ మందిరంలో శివుడు స్వయంభూ. కాబట్టి లింగం కనిపించదు. గౌరీ అమ్మవారు చక్కని అలంకరణలో నయనానందకరం. పక్కనే హనుమంతుని గుడి, మహిమ గల కొలను ఉన్నాయి.  తప్పకుండా చూడాల్సిన వాటిల్లో ఇదొకటి.

రాజ రాణి ఆలయం:
 

ఈ దేవాలయం విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఏ.ఎస్.ఐ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకమైన ఇసుక రాయితో కట్టబడింది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. గర్భగుడిలో ఏ దేవతా లేదు కాని అష్ట దిక్పాలకులకు విగ్రహాలు గోడల పై ఉన్నాయి. ఇది అప్పటి రాజు, రాణిల స్మారకం అని కొంత మంది అభిప్రాయం. విశాలమైన లాన్, ప్రశాంతంగా ఉంది ఈ దేవాలయం. ప్రేమికులకు మంచి ప్రదేశం.

ఉదయగిరి, ఖండగిరి  గుహలు:


భువనేశ్వర్ కి ఏడు కిలోమీటర్ల దూరం లో ఈ ఉదయగిరి, ఖండగిరి గుహలు ఉన్నాయి. ఇవి ప్రముఖంగా బౌద్ధ, జైన క్షేత్రాలు. ఇవి మొదటి  బి.సి. నాటివి. ఎడమవైపు ఖండగిరి గుహలు, కుడివైపు ఉదయ గిరి గుహలు. ఖండగిరి గుహలు పదిహేను. ఈ గుహల పైన జైనుల మందిరాలు ఉన్నాయి. అప్పటి దిగంబర జైనుల విగ్రహాలు అద్భుతమైన శిలా సమపాలో దర్శనమిస్తాయి. ఉదయగిరి గుహలు పద్దెనిమిది. ఇందులో ప్రధానమైనది హాథీ (ఏనుగు) గుహలు. ఇది ఉన్నవాటిలో పెద్ద గుహ. ఇవి కాక రాణీ గుహ, గణేశ గుహ లాంటి పేర్లతో చాలా ఉన్నాయి. జైనుల ధ్యానానికి, విశ్రాంతికి అనువుగా ఈ గుహలు ఉన్నాయి. చారిత్రిక ప్రాధాన్యం, ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే ఎన్నో చెక్కడాలు ఈ గుహల పైన ఉన్నాయి. వివిధ రకాల జంతువుల ఆకారాలు, పెళ్లిళ్లు ఈ చెక్కడాల పైన మనకు కనిపిస్తాయి. గైడ్ చాలా వివరంగా మాకు అన్ని తెలియ చేసాడు. ఈ ప్రదేశం మంచి విహార యాత్ర ప్రదేశం. ఇది కూడా ఏ.ఎస్.ఐ వారి ఆధీనంలో ఉంది. ఇక్కడ కోతులు విపరీతంగా కనిపిస్తాయి. ఈ రెండు కొండల పైనుంచి భువనేశ్వర్ పట్టణం కనిపిస్తుంది. దట్టమైన చెట్ల మధ్య ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి, ఆనాటి జీవన శైలికి ఆలవాలం. ఈ రెండు గుహల సముదాయం, కొండలు ఎక్కటానికి, చూడటానికి దాదాపు 2 -3 గంటలు పడుతుంది.


ఇవి ముగించుకొని మేము ఇస్కాన్ మందిరానికి వెళ్ళాము. అక్కడ మంచి భోజనం చేసి మార్కెట్ కి వెళ్లి కొంత షాపింగ్ చేసాము.  రూం కి చేరుకుని, సర్దుకొని సాయంత్రం 6 :50 కి బిజూ పట్నాయక్ విమానాశ్రయంలో  హైదరాబాదు విమానం ఎక్కాము.  మొత్తం మీద చాలా హాయిగా, విశ్రాంతిగా, భక్తితో, ఒడిషా వారసత్వ సంపదను చూసే యాత్ర చేసాము. విహారం, వినోదం, దైవం, చారిత్రకం - అన్ని సమ పాళ్ళలో మేళవించి శరీరాన్ని కొంత పదును పెట్టి తిరిగి వచ్చాము.

ప్రదేశాలు, వసతులు, ఫోన్ నెంబర్లు - వీటికొరకు ఒడిషా పర్యాటక శాఖ వారి వెబ్ సైట్ చూడండి.

15, అక్టోబర్ 2010, శుక్రవారం

విజయ దశమి

నవ దుర్గా రూపిణి యైన ఆది పరాశక్తి

నవరాత్రులు ముగిసిన తర్వాత విజయదశమి నాటి విశిష్టత:

ఆ జగదంబ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతుల రౌద్ర, సౌమ్య రూపాలలో మనలను కరుణించి, ఆశీర్వదిస్తోంది. నవరాత్రుల తదుపరి, శుద్ధ దశమి నాడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో చెడుపై మంచి విజయానికి సంకేతం గా శ్రీ రాజ రాజేశ్వరీ రూపంలో మనకు ఆ విజయవాటిక దుర్గమ్మ కనిపిస్తుంది. ఈ విజయానికి సూచనలు ఎన్నో - రాముడు రావణుని సంహరించటం (దానికి మనము రావణ దహనం చేయటం), పాండవుల  అజ్ఞాతవాసము పూర్తయి కురుక్షేత్ర సంగ్రామ ఘట్టానికి నాంది, మహిషాసుర మర్దనం - అన్నీ ఈ విజయ దశమి రోజునే.  ఉత్తరాదిన రావణ దహనం చాలా కన్నుల పండువగా చేస్తారు. అలాగే వంగ దేశంలో ఈ మహిషాసుర మర్దిని యొక్క దుర్గా పూజా ఉత్సవాలు ముగిసి ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉంటారు.



ఈ పండుగ మన దేశంలోనే కాదు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో కూడా జరుపుకుంటారు. ఉత్తరాదిన దసరాగా ఈ పండుగకు పేరు. ఇది దశ్ హరా అనే పదాలనుండి వచ్చింది. రావణుని రాముడు సంహరించటానికి సంకేతం ఇది. విజయదశమి దుర్మార్గంపై దైవత్వం యొక్క విజయానికి ప్రతీకగా ఎంతో వేడుకగా జరుపుకునే పండుగ. దసరాతో ముగిసే పదిరోజులలో ఉత్తరాదిన రామాయణ ఘట్టాలను ప్రదర్శిస్తారు. దీనికే రాంలీలా అని పేరు. దశమినాడు రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల ఎత్తైన బొమ్మలను తయారు చేసి వాటిలో బాణాసంచా పెట్టి కాల్చి సంబరాలు చేసుకుంటారు. దక్షిణాదిన ఈ నవరాత్రులలో బొమ్మల కొలువు పెట్టటం ఆనవాయితీ. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో ఈ సాంప్రదాయం చాలా ప్రసిద్ధి. రకరకాల బొమ్మలను చక్కగా అలంకరించి నిత్య పూజ చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని తమిళనాడు దేవాలయాలలో కూడా చూడవచ్చు. రకరకాల దేవతల బొమ్మలను, గ్రామీణ ప్రాంతపు జీవనాన్ని ప్రతిబింబించేలా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. పాడ్యమితో మొదలయ్యే ఈ కొలువు విజయదశమితో ముగుస్తుంది.


తెలంగాణా ప్రాంతంలో నవరాత్రులలో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. వెదురు సిబ్బిపై పూలను అందంగా వరుసలు పేర్చి గౌరీ పూజ చేసి స్త్రీలు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. వాయనాలు ఇస్తారు. ఈ బతుకమ్మలను చివరిరోజున చెరువులో వదులుతారు.బెంగాలు, ఒడిషాలలో నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుతారు. గణేష నవరాత్రులలా అమ్మవారి విగ్రహాలను వీధి వీధులలో ఏర్పాటు చేసి నిత్యం పూజ చేసి వాటిని దశమి నాడు నిమజ్జనం చేస్తారు.




గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలలో గర్బా, డాండియా రాస్ ఇక్కడ ప్రజల దసరా ఉత్సవాలలో ప్రత్యేకత. నవరాత్రులలో ప్రజలు చక్కగా అందమైన దుస్తులు ధరించి కోలాటం ఆడుతూ నాట్యం చేస్తారు. గర్బా మన జనన మరణాల చక్రానికి ప్రతీకగా వలయాకారంలో తిరుగుతూ చేయగా డాండియా రాస్ స్త్రీ పురుషుల ఆనందకేళిగా కన్నుల పండువగా ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన వస్త్ర ధారణ ఉంటుంది. ఈ ఉత్సవాలు రాత్రిపూట జరుగుతాయి.



ఆంధ్రలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు ఈ నవరాత్రులలో జరుగుతాయి. అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో స్వామిని వేర్వేరు వాహనాలపై మాడవీధులలో ఊరేగిస్తారు. విజయదశమినాడు శ్రీదేవీ భూదేవీ సహిత స్వామి వార్ల ఉత్సవమూర్తులకు శ్రీవరాహ స్వామి సన్నిధిలో అవభృథ స్నానం చేయిస్తారు. స్వామి వారి సుదర్శన చక్రానికి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఈరోజు కోనేటిలో స్నానం చేస్తే ఆ చక్రస్నానం ఫలాన మన పాపాలన్నీ తొలగుతాయని నమ్మకం. నవరాత్రుల మొదటి రోజున బ్రహ్మోత్సవాల ఆరంభానికి ప్రతీకగా అధిరోహించబడిన గరుడ ధ్వజాన్ని నేడు అవరహోణం చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

శ్రీశైలంలో భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవస్థనంలో నవరాత్రులలో అమ్మవారు వేర్వేరు నవదుర్గల అలంకారాలలో దర్శనమిస్తుంది. విజయదశమి నాడు చండీహోమము, రుద్రహోమములకు పూర్ణాహుతి చేస్తారు. 

శమీ పూజ:

పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తాము ఇంద్రాది దేవతల వద్ద తపస్సు చేసి పొందిన ఆయుధాలను మూట గట్టి శమీ వృక్షము మీద ఉంచుతారు. ఈ అజ్ఞాత వాసాము ముగిసేంత వరకు ఈ శమీ వృక్షము వాళ్ల ఆయుధాలను కాపాడి పాండవులకు తప్ప మిగతా ఎవ్వరికీ అవి కనపడకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. తమ అజ్ఞాతవాసము ముగియగానే అర్జునాదులు వచ్చి శమీ పూజ చేసి ఆయుధాలను తీసుకొని తిరిగి తమ పూర్వ వైభవము, రాజసము, విజయ లక్ష్మిని పొందుతారు.

శమీ వృక్షము

దీనికి ప్రతీకగా ప్రతియేటా విజయదశమి నాడు భారతీయులు శమీ వృక్షానికి పూజ చేసి, ఈ క్రింది శ్లోకము పఠించి, కాగితము మీద కుటుంబ సభ్యుల గోత్ర నామములు, ఈ శ్లోకము రాసి ఆ వృక్షము వద్ద ఉంచి, పూజించి ఇంటికి తెచ్చుకుంటారు. తెలంగాణా ప్రాంతంలో ఈ చెట్టును జమ్మి అని, ఉత్తరాదిన ఝండ్, తమిళంలో జంబు మారం అని పిలుస్తారు . ఈ శమీ ఆకులను బంగారముగా భావించి అందరికి పంచి తమ సోదర, సంఘీభావాన్ని తెలుపుతారు.

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం |
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ||

సమర్థ సద్గురు సాయినాథుల సమాధి:



కుగ్రామంలో ఉంటూ, మతాలకు, కులాలకు అతీతంగా, యద్భావం తద్భవతి అన్నది గురువు పట్ల ఎలా ఉండాలో, శ్రద్ధ, సాబురీలతో (సంతోషము,నిష్ఠలతో కూడిన ఓరిమి) ఎలా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్ష మార్గులము కాగలమో అతి సామాన్యునికి అర్థం అయ్యేలా జీవించి ఉదాహరణగా నిలిచిన దత్తావతారుడు ఆ సాయినాథుడు.  సిరిసంపదలకు దూరంగా, మనుషులకు వారి వారి వ్యక్తిత్వాలను, పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఆధ్యాత్మిక మార్గాలను బోధ చేసిన సద్గురువు సాయినాథుడు. మతవైషమ్యాలతో అట్టుడుకుతున్న దక్కన్ పీఠభూమి మరాఠా ప్రాంతాలలో హిందూ-ముస్లిం ప్రజల ఐక్యతకు ప్రతీక సాయినాథుడు. ఎన్నో లీలలను, అద్భుతాలను చేసిన అవతార పురుషుడు సాయినాథుడు. 1918 సంవత్సరములో విజయదశమి నాడు సమర్థ సద్గురు సాయి బాబా షిర్డీ గ్రామంలో సమాధి చెందారు. అక్కడ ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ రోజు సాయినాథుని సచ్చరిత్ర పారాయణకు చాలా విశేషమైన రోజు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

ఇలా విజయదశమి భారత దేశంలో ఎంతో ప్రాశస్త్యమున్న పండుగ. ప్రజలు ఎంతో వేడుకగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునేపండుగ. పండుగలు ప్రజలను ఆఇకమత్యంతో ఉంచటంతో పాటు వారిలో భగవద్భక్తి, ఆనందానురాగాలు నింపుతాయి. అదే మన సనాతనధర్మం యొక్క గొప్పతనం. 

14, అక్టోబర్ 2010, గురువారం

మహిషాసుర మర్దిని

శరన్నవరాత్రుల తొమ్మిదవ నాడు (మహా నవమి), నవ రాత్రులలో ఆఖరి రోజు -   బెజవాడ దుర్గమ్మ మహిషాసుర మర్దిని రూపంలో కనిపిస్తుంది. దుష్ట శిక్షణకు త్రిమూర్తుల శక్తితో సహస్ర బాహువులతో, సకల ఆయుధాలతో, రౌద్ర రూపం దాల్చి మహిషాసురుణ్ణి చంపిన ఆ జగజ్జనని జగద్రక్షకియై వెలసిల్లింది. ఆదిశంకరులు రచించిన మహిషాసురమర్దిని స్తోత్రం మీకోసం. శ్రవణం యూట్యూబ్ లంకెలో


అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజ నిరోషిణి దితిసుత రోషిణి దుర్మద శోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబ వనప్రియ వాసిని హాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే
మధు మధురే మధు కైటభ భంజిని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే
రిపు గజ గండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే
నిజ భుజ దండ నిపాతిత ఖండ విపాతిత ముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి రణ దుర్మద శత్రు వధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే
చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శరణాగత వైరి వధూవర వీర వరాభయ దాయకరే
త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే
దుమిదుమి తామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్ర శతే
సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజ లతే
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

ధనురను సంగ రణక్షణసంగ పరిస్ఫుర దంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భట శృంగ హతావటుకే
కృత చతురంగ బలక్షితి రంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

జయ జయ జప్య జయేజయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే
ఝణ ఝణ ఝింజిమి ఝింకృత నూపుర సింజిత మోహిత భూతపతే
నటిత నటార్ధ నటీనట నాయక నాటిత నాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక ఝిల్లిక భిల్లిక వర్గ వృతే
సితకృత పుల్లసముల్ల సితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అవిరళ గండ గళన్మద మేదుర మత్త మతంగజ రాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే
అయి సుద తీజన లాలసమానస మోహన మన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కమల దళామల కోమల కాంతి కళాకలితామల భాలలతే
సకల విలాస కళానిలయక్రమ కేళి చలత్కల హంస కులే
అలికుల సంకుల కువలయ మండల మౌళిమిలద్భకులాలి కులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కర మురళీ రవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే
మిళిత పుళింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే
నిజగుణ భూత మహాశబరీగణ సద్గుణ సంభృత కేలితలే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కటితట పీత దుకూల విచిత్ర మయూఖతిరస్కృత చంద్ర రుచే
ప్రణత సురాసుర మౌలిమణిస్ఫుర దంశుల సన్నఖ చంద్ర రుచే
జిత కనకాచల మౌళిపదోర్జిత నిర్భర కుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే
సురథ సమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్
తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కనకలసత్కల సింధు జలైరను సించినుతేగుణ రంగభువం
భజతి స కిం న శచీకుచ కుంభ తటీ పరిరంభ సుఖానుభవమ్
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసిరతే
యదుచితమత్ర భవత్యురరీ కురుతాదురుతాపమపాకురుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

దుర్గా సూక్తం, తాత్పర్యము

శరన్నవరాత్రుల ఎనిమిదవ నాడు (అష్టమి) ఆ అది పరాశక్తి దుర్గ గా అలంకరించబడుతుంది. ఈ రోజునే దుర్గాష్టమిగా మనము జరుపుకుంటాము. ఋగ్వేదంలో అనేక చోట్ల కనబడే స్తుతులను తైత్తిరీయ అరణ్యకంలో సంకలనం చేయబడి దుర్గా సూక్తం పేరుతో ఈ మహిమాన్విత శ్లోకాలు ప్రచారంలో ఉన్నాయి. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఈ సూక్త పారాయణము వలన  అధిగమించ వచ్చని విశ్వాసం. దుర్గా సూక్తం అని పేరు వచ్చినా, ఈ స్తుతిలో ఎక్కువ అగ్నిదేవుని స్తుతించేవి గా ఉన్నాయి.  యూట్యూబ్ లంకె.


ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతే నిదహాతి వేదః |
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః || ౧||
తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం
కర్మఫలేషు జుష్టామ్ | దుర్గాం దేవిగ్ం శరణమహం
ప్రపద్యే సుతరసి తరసే నమః || ౨||
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా |
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః || ౩||
విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితాతిపర్‍షి |
అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనామ్ || ౪||
పృతనా  జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం  హువేమ పరమాథ్సధస్థాత్ |
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్నిః || ౫||
ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి |
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ || ౬||
గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ |
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం || ౭||
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

|| ఇతి దుర్గా సూక్తమ్ ||



తాత్పర్యము:

అగ్నిదేవా!  సోమాన్ని పిండి రసాన్ని నీకు సమర్పిస్తాము. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అగ్ని దేవుడు దగ్ధము చేయు గాక! పడవ ద్వారా సముద్రము దాటే విధంగా మమ్మల్ని సమస్త బాధలనుండి, తప్పులనుండి అగ్నిదేవుడు కాపాడు గాక!

అగ్నివర్ణం కలదీ, తపస్సు ద్వారా ప్రకాశించునదీ, భగవంతునికి చెందినదీ, కర్మ యొక్క ప్రతిఫలాలలో శక్తిగా నెలకొన్నదీ అయిన దుర్గాదేవిని నేను శరణు జొచ్చుచున్నాను. దుఃఖసాగరం నుండి మమ్మలను తీరానికి చేర్చే దేవీ! మమ్ము కాపాడు. నీకు నమస్కారము. 

ఓ అగ్నిదేవా! నీవు కీర్తింప తగినవాడవు. సంతోషకర మార్గాల ద్వారా మమ్మ్ములను సమస్త దుఃఖాలనుండి దూరంగా తీసుకెళ్ళు, మా ఊరు, దేశము, ప్రపంచము, సుభిక్షముగా ఉండు గాక! మా పిల్లలకు, వారి పిల్లలకు సంతోషాన్ని ఇచ్చే వాడిగా నువ్వు ఉంటావు గాక!

అగ్నిదేవా! సమస్త దుఃఖాలను హరించేవాడా! సముద్రంలో పడి తల్లడిల్లే వ్యక్తిని పడవ కాపాడిన రీతిలో ఈ దుఃఖాల బారినుండి మమ్ము రక్షించు. మా శరీరాలను కాపాడే వాడా! 'యావన్మందీ సంతోషంగా ఉండుగాక' అంటూ మనసులో పదే పదే  చెపుతున్న అత్రి మహర్షిలా మా శ్రేయస్సు మనస్సునందు జ్ఞప్తి యందు ఉంచుకో. 

శత్రు సైన్యాన్ని ముట్టడించేవాడు, వాటిని నాశనం చేసే వాడు, ఉగ్రమైన వాడు అయిన అగ్ని దేవుడుని సభయొక్క అత్యున్నత స్థానం నుండి ఇక్కడకు వేంచేయమని ఆహ్వానిస్తున్నాము. ఆయన మమ్ములను సమస్త క్లేశాలకు, నశించేవాటికి, తప్పిదాల ఆవలకు తీసుకు వెళ్ళు గాక! మమ్ము కాపాడు గాక!

అగ్నిదేవా! యాగాలలో కీర్తించబడుతున్న నువ్వు మా ఆనందాన్ని ఇనుమడింప చేస్తున్నావు. యాగం చేసే వారిలో సనాతనుడిగాను, కొత్త వాడి గాను నువ్వు వెలుగుతున్నావు. నీ రూపంగా ఉంటున్న మాకు సంతోషం ప్రసాదించాలి. మాకు సర్వతోముఖ శ్రేయస్సు తీసుకురావాలి. 

భగవంతుడా! నీవు పాపము అంటని వాడవు, సకలవ్యాపివి. అసంఖ్యాకమైన పశువులతో కూడిన సంపదను పొంద పరమానందము అనుభవింప మేము నిన్ను వెన్నంటుతాము. విష్ణు స్వరూపమైన దుర్గా దేవీ పట్ల మాకున్న భక్తి వలన ఉన్నత దేవలోకంలో నివసించే దేవతలు ఈ ప్రపంచంలో నాకు సంతోషాన్ని ప్రసాదించు గాక! 

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక!

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...