6, నవంబర్ 2010, శనివారం

మహాన్యాసము - అధికార పధ్ధతి


నారుద్రో రుద్రమర్చయేత్ - అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?

మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు  కలిగినది.

౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు  కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము  పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

౧. ప్రథమాంగన్యాసము

భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత,  పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.

౨. ద్వితీయాంగన్యాసము

ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి, ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః,  తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు  నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.

౩. తృతీయాంగన్యాసము

సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.

తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు   పఠించుచు ఆయ దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటం అంటారు.

తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు , ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.

తర్వాత షోడశాంగ రౌద్రీకరణము -  ఓం  అం విభూరసి  ప్రవాహణో.... అనే మంత్రముతో మొదలు పెట్టి ఓం అః  ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర 'రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్‍ం సీః' అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు  "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.

దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును, సర్వ భూతములచే అపరాజితుడగును, ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.

౪. చతుర్థాంగన్యాసము

"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.

౫. పంచమాంగన్యాసము

ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. శివ సంకల్పం గురించి ప్రత్యేక వ్యాసం తర్వాత రాస్తాను. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని  ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్‍ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగును.

తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్‍ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.

తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్‍ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.

తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.


తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.

తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే  రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః"  అని దిగ్బంధమును చూపించ వలెను.

తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).

వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను.  

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్

దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.

లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని  తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించునది).

[తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయే హృదయం మయి" మొదలు "అంత స్తిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేక ప్రారంభములో చమకములోని 'శంచమ' అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి"  అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి, శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును.]

ఇది క్లుప్తంగా మహాన్యాసం లోని అధికార అర్హతకు చేయవలసిన పధ్ధతి.

4 కామెంట్‌లు:

  1. అయ్యాిబాగా వివరించారు.... అయితే .... అంతా ఒకే సారి చెయ్యలా? విడి విడిగా చేసుకోవచ్చా?... మన స్వంతంగా చదువుకుంటు చేసుకోవచ్చా??

    రిప్లయితొలగించండి
  2. అంతా కలిపి ఒకసారే చేయాలి. మీకు మంత్రోచ్ఛారణ తెలిస్తే స్వయంగా చేసుకోవటం ఉత్తమం.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారు నమస్తే , GulF లో శివాలయం వుంది పూజారి లేడు . పూజాది కార్యక్రమాలు , అభిషేకాలు ఏలా చేయాలి ఏది మొదట చేయాలి ఏదేది చదవాలి ? రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చదవాలి కాస్త వివరంగా తెలియజేయ వలసినదిగా ప్రార్థన . ఇట్లు శివభక్తుడు

    రిప్లయితొలగించండి