RightClickBlocker

4, నవంబర్ 2010, గురువారం

ఒడిషా యాత్ర

ఇటీవలే నా సహోద్యోగి సతీష్ భువనేశ్వర్ వెళ్లి వచ్చాడు. ఆ మాట వినగానే నాకు ఉత్సాహం వచ్చి అప్పటికప్పుడు వెళ్ళటానికి నిర్ణయం చేసాము. నా సహోద్యోగి బిప్లబ్ నాయక్ ఒడిషాకు చెందిన వాడు. భువనేశ్వర్లో వాళ్ల నాన్నగారు, బావమరిది సహాయంతో మాకు మంచి ప్లాన్, హోటల్ బుకింగ్ చేసాడు.

హైదరాబాదులో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఇండిగో విమానం ద్వారా బయలు దేరి భువనేశ్వర్ కు పది గంటలకు చేరుకున్నాము. ఒడిషా రాజకీయ పితామహుడు బిజూ పట్నాయక్ విమానాశ్రయంలో దిగి బయటకి రాగానే ఎదురుగా ఆయన విగ్రహం కనబడుతుంది. కారు ఎక్కి లింగరాజ్ అనే హోటల్లో దిగాము.

లింగరాజ స్వామి గుడి:


స్నానం చేసి మా మొదటి మజిలీ పేరుపొందిన లింగరాజ స్వామి గుడి. గుడి మొదటిలోనే పండాలు మా వెంట పడ్డారు. వారిలో తెలుగు వచ్చిన ఒక పండాను మాట్లాడుకొని మా గైడ్ గా పెట్టుకున్నాము. పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ గుడి భారత దేశంలోని గుళ్లలో మాణిక్యం. అద్భుతమైన శిల్ప సంపద, ఒడిషా సాంప్రదాయంలో కట్టబడి ఉంది. గోపురం 180 అడుగుల ఎత్తు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు దీని శిఖరము కనపడుతుంది.  గుడిలోపల దాదాపు 150 చిన్న పెద్ద గుళ్ళు ఉన్నాయి.

ప్రధాన దైవం శివుడు సాలగ్రామ రూపంలో స్వయంభూ. అందుకని అక్కడ లింగాకారం బయటకు కనిపించదు. ప్రతిమరూపంలో వెండి త్రినేత్రుడు మనకు కనిపిస్తాడు. బిల్వ దళములతో   స్వామిని అర్చించి చుట్టూ ఉన్న గుళ్ళు చూడటం మొదలు పెట్టాము. గుడి ప్రాకరంలోనే వైద్యనాథుడు, కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణ, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణుడు, దుర్గ, నంది, సీతారాములు, హనుమంతుడు మొదలగు అన్ని దేవతలకు మందిరాలు ఉన్నాయి. వీటిలో విశేషమైనవి విశ్వనాథుడు, అన్నపూర్ణ. వీరినందరిని దర్శించటానికి ఒక గంటన్నర పడుతుంది. పండాకు నూటపదహార్లు చెల్లించి బయట పడ్డాము. గుడికి ఉత్తర భాగంలో గుడి మొత్తం కనిపించేలా ఒక ఎత్తైన ప్రదేశం ఉంది. అక్కడ నుంచి ఫోటోలు తీసుకోవచ్చు.

విరజాదేవి (గిరిజా దేవీ) శక్తి పీఠం - నాభి గయ క్షేత్రం


మధ్యాహ్న భోజనం వీనస్ ఇన్ అనే దక్షిణ భారత హోటల్లో చేసి ఆదిశంకరులు స్థాపించిన శక్తి పీఠంలో ఉన్న విరజాదేవి (గిరిజా దేవీ అని కూడా అంటారు) దర్శనానికి జాజ్పూర్ బయలుదేరాము.  ఈ జాజ్పూర్ భువనేశ్వర్ నుంచి 120 కిలోమీటర్ల దూరం. జాతీయ స్వర్ణ చతుర్భుజి లో భాగమైన జాతీయ రహదారి 5 మీద రెండు గంటలలో ఇక్కడికి చేరాము. ఇక్కడ అమ్మ విరజాదేవి (రజో గుణం తొలగించే శక్తి కలిగినది). ఈ ఆలయము 13వ శతాబ్దము నాటిదని ఇక్కడ చెప్పబడింది.  ఇది మూడు గయా క్షేత్రాలైన ముఖ (బీహార్లోని గయ) , నాభి, పాద గయ (ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురం) క్షేత్రాలలో  నాభి గయ. కాబట్టి ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రదానము, శ్రాద్ధము చేస్తారు.

ఈ క్షేత్రము ప్రఖ్యాత వైతరిణి నదికి సమీపంలో ఉంది. ఈ వైతరిణి ఒడ్డున బ్రహ్మ అశ్వమేధం చేసాడని ప్రతీతి. ఈ క్షేత్రంలో శివుడు విశ్వనాథుని రూపంలో పెద్ద శివలింగాకారంలో ఉన్నాడు. గర్భ గుడి వెనుక దుర్గ బగళా ముఖి రూపంలో ఒక చిన్న గుడి ఉంది. అలాగే శివలింగాల సమూహం గర్భగుడికి ఈశాన్య భాగంలో ఉంది. విరజా అమ్మవారికి పూజ చేయించుకొని రాత్రికి భువనేశ్వర్ పట్టణం చేరుకున్నాము.   అక్కడ శ్రీ రాం మందిర్ అద్భుతమైన మందిరం. ఈ మందిరంలో సీతారామలక్ష్మణులు, రాధాకృష్ణులు, పంచముఖ హనుమాన్ ప్రధాన దేవతలు. గర్భ గుడి బయట దుర్గ, లక్ష్మి, శివుడు, గణపతి ఆలయాలు ఉన్నాయి. చాలా అందంగా ఉంది ఈ మందిరం. దర్శనం చేసుకొని వీనస్ ఇన్ లో రాత్రి భోజనం చేసి పడుకున్నాము. మర్నాడు సూర్యోదయం కోణార్క్ బీచ్ లో చూడాలని నిర్ణయించుకొని పడుకున్నాము.

కోణార్క్ బీచ్:


శనివారం ఉదయం మూడున్నరకే లేచి రూం చెకౌట్ చేసి కారులో అయిదున్నరకు కోణార్క్ బీచ్ చేరుకున్నాము. తూర్పున ఉన్న బంగాళా ఖాతం తీరంలో ఉన్న కోణార్క్ బీచ్ పేరు చంద్రభాగ. అద్భుతమైన సూర్యోదయం అక్కడ చూసి, సాగర కెరటాల్లో మునిగి తేలి కుటుంబమంతా చాలా మానసిక విశ్రాంతి పొందాము. ఎర్రటి అరుణ కిరణాలు సముద్రుడి అంచులను దాటి పైకి ఎగ బాకుతూ, వాయుదేవుడు చల్లని మలయ మారుతాలను కెరటాలతో కలిసి తీరం వైపు నెడుతూ ఉంటే చెప్పలేని ఆనందం. ఈ కోణార్క్ బీచ్ సూర్యోదయం చూసి తీరాల్సిందే.  బీచ్ పక్కనే ఒడిషా పర్యాటక శాఖ వారి సులభ స్నాన గదులు చాలా సదుపాయంగా ఉన్నాయి. వీటి పక్కనే పర్యాటక శాఖ వారి భోజనశాల కూడా ఉంది. స్నానాలు, ఫలహారము చేసి సూర్య దేవాలయ సందర్శనానికి బయలుదేరాము.

కోణార్క్ సూర్య దేవాలయము:


ఈ యుగపు అధ్బుతాల్లో ఒకటిగా అనుకోవచ్చు ఈ సూర్య దేవాలయము. చంద్రభాగా తీరంనుంచి రెండు కిలోమీటర్ల దూరమలో ఉన్న ఈ దేవాలయము తెల్లవారి దోపిడీలకు గురై శిథిలావస్థలో ఉంది. పదమూడవ శతాబ్దంలో నరసింహదేవ రాజు చే నిర్మించబడిన ఈ దేవాలయం సాంకేతిక, శిల్పకళ నైపుణ్యానికి తలమానికం. ఆనాటి సామాజిక స్థితి, శృంగారం, ఆధ్యాత్మికము చక్కని శిల్పాల రూపంలో చెక్కబడింది. రథమున ఎక్కి విలసిస్తున్న సూర్యుని దేవాలయం ఇది. గర్భ గుడి గోపురం 227 అడుగుల ఎత్తు. 24 చక్రాలు గుడికి చుట్టూ అమర్చబడ్డాయి. గర్భగుడికి మూడు దిక్కులా మూడు సూర్యులు (ఉదయించే సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు, అస్తమించే సూర్యుడు - మానవుని మూడు జీవిత కాలాలకు (యవ్వనం, నడి వయస్సు, వృద్ధాప్యం) సంకేతంగా ఇవి అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. శిథిలాలలో దాదాపు సగం గర్భ గుడి లేదు. గుడి ముందు భాగంలో అద్భుతమైన నాట్య మంటపం ఉంది. ఇక్కడ ఎత్తైన స్థంభాలు, ఏక శిలా విగ్రహాలు నాలుగు వాకిళ్లతో మనోజ్ఞంగా కనిపిస్తాయి. గర్భ గుడి, జగ్మోహన మంటపం నాలుగు ద్వారాలు బ్రిటిష్ దొరలచే 1908 సంవత్సరంలో మూయబడి జాతీయ వారసత్వ సంపదగా గుర్తించబడి, తర్వాత ఏ.ఎస్.ఐ వారికి అప్పగించబడింది. సూర్యుని కిరణాలు అయస్కాంతములతో ఒక అద్భుతమైన సూర్య సమూహాన్ని భువి మీద శ్రుష్టించారు ఆ నాటి సాంకేతిక నిపుణులు, శిల్పులు. ఒక సాంకేతిక అద్భుతం ఈ మందిరం. శిథిలావస్థలో ఉండటం మన దురదృష్టం. కోణార్క్ సూర్యదేవాలయానికి వెళ్లే దారిలో ఒడిషా ప్రాంతానికి చెందిన హస్త కళలు (నార, కొమ్ములు, గవ్వలతో చేసినవి ప్రముఖంగా) అమ్మకానికి దొరుకుతాయి.  గైడ్ సహాయంతో మొత్తం గుడిని తనివి తీరా చూసి, చిత్రాలు, వీడియోలు తీసుకొని పురీకి బయలు దేరాము.

మెరీన్ డ్రైవ్ (చంద్రభాగా తీరం):

ఒడిషా పర్యాటక శాఖ ప్రభుత్వం కోణార్క్ నుంచి పురీ వెళ్ళటానికి సముద్రం వెంబట చక్కని రహదారి, దానికి ఇరుపక్కల చెట్లు వేసారు. బ్యాక్ వాటర్స్, ఈ చెట్లు, రహదారి - కోణార్క్- పురీ ప్రయాణాన్ని మనకు ఒక తీపి గుర్తుగా మిగులుస్తాయి. బంగాళా ఖాతం యొక్క ఎగిసే అలలు పచ్చని ప్రకృతి, రెండు వైపులా కలువలు ఈ సౌందర్యానికి ఆలవాలం. దాదాపు 30 కిలోమీటర్ల దూరం కోణార్క్-పురీ మధ్య.

మహా పుణ్య క్షేత్రం పురీ:పురీ జగన్నాథ దేవాలయం నాలుగు దివ్య ధామాల్లో అగ్రగణ్యం. పురీ, రామేశ్వరం, ద్వారక, బదరీనాథ్ - ఇవి నాలుగు దివ్య ధామాలు. ఆది శంకరులచే పూజించ బడినవి ఈ దేవాలయాల ప్రధాన దేవతలైన జగన్నాథుడు, రామ లింగేశ్వరుడు, శ్రీ కృష్ణుడు, నారాయణుడు. నగరంలో అడుగు పెడుతూనే ఆ నీల మేఘ శ్యాముని సుగంధం, ఆయన భక్తుల సందోహం, పారవశ్యం, ఆధ్యాత్మిక సంపద ఒక వైపు మరొక పక్క సముద్రం వెంబడ ఉన్న హోటల్స్/రిసార్ట్స్/ఆహ్లాదము.


ఒడిషా పర్యాటక శాఖ వారి పంథనివాస్ పేరుతో వసతి గృహాలు ప్రతి పర్యాటక ప్రదేశంలో ఉన్నాయి. వాటిలో మన పున్నమి లాగ అన్ని వసతులు ఉన్నాయి. పురీలో పంథనివాస్  సీ బీచ్ రోడ్డులో (ఊరిలో స్వర్గధామం అనే వైపు) సముద్రపు ఒడ్డున కట్టారు. రూము దాటి వెళితే బంగాళా ఖాతమే. దాదాపు 4-5 కిలోమీటర్ల పొడవున ఉన్న పురీ నగర తీరం మొత్తం హోటల్స్, రిసార్ట్స్. డబ్బును బట్టి వసతులు, దగ్గర/దూరం. పంథనివాస్ లో చెక్ ఇన్ చేసి, సామాను పడేసి, స్నానం చేసి స్వామి దర్శనానికి బయలు దేరాము. పురీ గుడికి, పార్కింగ్ కి దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దూరం వెళ్ళటానికి గుడి వారి బస్సులు, రిక్షాలు, ఆటోలు ఉన్నాయి. గుడి ముఖ ద్వారం ముందు నిలిచోగానే అదొక అలౌకిక ఆనందం. ఇక్కడ పండాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎంత ఓపిక ఉన్నవారికైనా విసుగు, కోపం కలిగించే ఈ బ్రాహ్మణులు డబ్బు కోసం పీక్కుతింటారు. ప్రతి పనికి డబ్బే ఈ దేవాలయంలో. ఒక పండాను పట్టుకొని దర్శనం చేసుకున్నాం. పాద దర్శనానికి 25 రూపాయల టికెట్. ప్రధాన దేవాలయం చుట్టూ ఎన్నలేని గుళ్ళు ఉన్నాయి. గర్భగుడి ఎత్తు 214 అడుగులు. దేవాలయ ప్రాంగణం కొలతలు 650 x 650   అడుగుల చతురస్రం. చుట్టూ గోడ 20 అడుగుల ఎత్తు. నాలుగు వైపులా నాలుగు మహా ద్వారాలు.

భారత దేశంలో ఉండే ఇతర దేవాలయాల లాగ కాకుండా ఇక్కడ ప్రధాన దేవతలు సోదరీ సోదరులు - బలరాముడు, సుభద్ర, శ్రీ కృష్ణుడు. ఆలాగే, విగ్రహాలు చెక్కతో చేయబడినవి. దాదాపు 6000 మంది సేవకులతో నిత్యము 10,000 - 25,000 భక్తులకు అన్న సంతర్పణతో ఆ జగన్నాథుడు అలరారుతున్నాడు. గర్భ గుడి బయట విమలా దేవీ (అమ్మవారు), రాధా కృష్ణులు, విశ్వనాథుడు, మహాలక్ష్మి, హనుమంతుడు, సూర్యనారాయణుడు ఇతర దేవతలు ఉన్నారు. 

దేవాలయం చుట్టూ ఉన్న మంటపాలు, కూర్చునే ప్రదేశాల్లో యోగులు, యోగినిలు దినం, జపం, కీర్తనలో మునిగి తేలుతూ బాహ్య ప్రపంచం పట్టకుండా ఆ జగన్నాథుని భక్తి సామ్రాజ్యంలో ఉంటారు. వీరినే చూస్తే ఒళ్ళు పులకించి తెలియకుండా నారాయణ నామస్మరణ చేస్తుంది.

ఇక్కడ మహా ప్రసాదం గురించి కొంత చెప్పాలి.

దేవాలయంలో  భక్తులకు ప్రసాదంగా పంచ భక్ష్య పరమాన్నాలు పెడతారు. ఈ వంటలన్నీ మట్టి కుండల్లో వండుతారు. విశేషం ఏమిటంటే ప్రతి సారి వండేవి కొత్త కుండలే. అన్నము, పప్పు, కూర, సాంబారు, పాయసం వండి నైవేద్యం పెట్టి మంతపాల్లో భక్తులకు సంతర్పణ చేస్తారు. ఇవి కాకుండా, ఆలయ ప్రాకారంలో, వసారాలో ప్రతి వ్యక్తికీ అరటి ఆకు లేదా విస్తరిలో ఇవి వడ్డించి పెడతారు. మంటపాలను ఆనంద్ బజార్ అంటారు. అక్కడ ఎన్నో రకాల మిఠాయిలు అమ్ముతారు. భోజన సమయంలో ఈ దేవాలయ ప్రాంగణం క్రిక్కిరిసి ఉంటుంది. అందుకని కొంత శుభ్రం తక్కువ అనిపించొచ్చు. మహా ప్రసాదం తినకుంటే పురీ ప్రయాణం పూర్తి కానట్టే.  దర్శనము చేసి, ప్రసాదము తిని బయట పడ్డాము.

పురీ బీచ్:


పంథనివాస్ లో కాసేపు విశ్రాంతి తీసుకొని వెనకనే ఉన్న తీరానికి వెళ్ళాము. పురీ బీచ్ చాలా విశాలమైనది. అక్కడ లైఫ్ గార్డ్స్, బీచ్లో వాలీ బాల్ ఆడే వారు, వాకింగ్, జాగింగ్ చేసే వారు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. హాయిగా కాసేపు అక్కడ సేద తీరి, స్వర్గ దామము వైపు వెళ్లి ఒడిషా చేనేత వారి సంభాల్పూర్ చీరలు కొనుక్కుని నా శ్రీమతి. అక్కడ బీచ్ లో రాత్రిపూట బజార్ చాలా బాగుంది. దీపాల కాంతిలో కూర్చీలు వేసుకొని బీచ్ లో హాయిగా కూర్చో వచ్చు. అక్కడే ఉన్న విట్టల్ కామత్ హోటల్ లో భోజనం చేసి రూం కి చేరాము. హాయిగా నిద్రపోయాం. ఆదివారం ఉదయమే లేచి సూర్యోదయము సముద్రం మీద చూసి కాసేపు ఆడుకున్నాము అందరం. స్నానాలు చేసి చెక్ అవుట్ చేసి చిలికా సరస్సుకు బయలుదేరాము.

చిలికా సరస్సు:


పురీ నుంచి బర్కుల్ చిలికా వెళ్లే మార్గంలో ఒక ౩౦ కిలోమీటర్లు రోడ్డు అసలు బాగోలేదు. దాదాపు రెండు గంటలు నరక యాతనే. అది దాటితే, జాతీయ రహదారి 5 . దాదాపు మూడు గంటల ప్రయాణం తర్వాత బర్కుల్ చేరుకున్నాము. అక్కడ పంథనివాస్ చెక్ ఇన్ చేసి అక్కడే భోజనం చేసి (శాఖాహారులకు ఇక్కడ భోజనం అసలు బాలేదు కాబట్టి ఏమైనా తీసుకెళ్లటం మంచిది) బోటు విహారానికి బయలు దేరాము. పంథనివాస్ లో ఏ.సీ కాటేజీ వసతి రేటు 1700 రూపాయలు.

చిలికా సరస్సు ఆసియాలో కెల్లా పెద్దదైన సహజమైన సరస్సు. పదకొండు వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యముతో ఒక వైపు బంగాళా ఖాతంలో కలిసే ఈ సరస్సు రకరకాల పక్షులకు, జల చరాలలు ఆలవాలం. చిలికా సరస్సుకు నాలుగు మార్గాలు ఉన్నాయి కాని ఉండటానికి వసతి ఒక్క బర్కుల్ లో మాత్రమే ఉంది. ఇక్కడ నవంబర్, డిసెంబర్ నెలలో ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వలస పక్షులు వస్తాయిట. మేము వెళ్ళినప్పుడు ఇంక ఆ సీజన్ మొదలు కాలేదు. నౌక విహారం మోటర్ బోటు లో దాదాపు గంటన్నర. ఈ విహారం బర్కుల్ నుండి కాలిజై ద్వీపం వరకు వెళ్లి తిరిగి రావటం. కాలిజై ద్వీపం అతి చిన్నది. ఈ ప్రాంతం భారతీయ నౌకాదళం వారిచే నడపబడుతున్నది. అక్కడ ఒక కాళికా మందిరం ఉంది. నాలుగు వైపులా నీరు, మధ్యలో ఈ గుడి - చాలా బాగుంది. కొంత పరిశుభ్రత తక్కువే కాని ప్రకృతి మనల్ని చాలా ఆహ్లాదపరుస్తుంది ఇక్కడ.

ఒక సరస్సులా కాకుండా సముద్రంలా అనిపిస్తుంది ఈ చిలికా. నీరు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. కానీ, సముద్రం ఒక వైపు ఉండటం వలన కొంత ఉప్పగా ఉంటాయి. చిలికా బర్కుల్ పంథనివాస్ లో కుటుంబాలకు వసతిగా కాటేజీలు, రూములు ఉన్నాయి. సరస్సు మీద సూర్యోదయం చాలా బాగుంటుందిట. మేము ఉదయం టైములో అక్కడ ఉండలేదు కాబట్టి చూడలేకపోయాం. పైగా వర్షము కూడా. ఈ సరస్సులో చిన్న చిన్న ద్వీపాలు చాలా ఉన్నాయి. బోటింగ్ వసతి బర్కుల్, రంభ, బాలుగావ్, సత్పద ప్రాంతాలనుంచి ఉంది. ఈ ప్రదేశాలనుంచి చిలికను సందర్శించ వచ్చు.

చిలికా చూసుకొని మేము రాత్రికి మళ్లీ భువనేశ్వర్ చేరాము. రెండు గంటల ప్రయాణం జాతీయ రహదారి 5 మీద. హోటల్ గ్రాండ్ సెంట్రల్ లో వసతి.  ఇక్కడ సదుపాయాలు, భోజనము బాగున్నాయి. 2100 రూపాయలు రోజుకి ఈ హోటల్లో. 

భువనేశ్వర్ లోకల్:

ధౌళి:సోమవారం ఉదయం త్వరగా తయారు అయ్యి, ఫలహారం చేసి మొట్ట మొదలు  ధౌళికి వెళ్ళాము. ఈ ధౌళి గిరి బౌద్ధ క్షేత్రం. ఇది భువనేశ్వర్ కు 8 కిలోమీటర్ల దూరం. దయానది ఒడ్డున ఉన్న పర్వతంపై అశోక చక్రవర్తి కాలం నాటి రాళ్ళకు గుర్తుగా ఈ క్షేత్రం నిర్మించ బడింది.  260 బీ.సీ నాటి రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. బౌద్ధ గురువుల సలహాతో 19వ శతాబ్దంలో రాజు ఇక్కడ శాంతి స్తూపాన్ని నిర్మించాడు.   శాంతి స్తూపం వలయాకారంలో ఉంటుంది. నాలుగు వైపులా నాలుగు బుద్ధుల విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ శాంతి స్తూపం వెనక శివుని గుడి చాలా బాగుంది. పెద్ద లింగము, మంచి అలంకరణ, బిల్వ దళములతో, తెల్లని పూలతో పూజ చాలా అందంగా ఉంది. ఈ గుడి గోడలో ఒకవైపు అమ్మ వారు ఇంకోవైపు గణపతి, వెనుక లక్ష్మీ నారాయణులు, దుర్గ ఉన్నారు.  ఈ కొండ మీద నుంచి పచ్చని ప్రకృతి, దయానది, భువనేశ్వర్ పట్టణం కనిపిస్తాయి. ఎంతో ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంది ఈ ధౌళి.

ముక్తేశ్వర్, సిద్దేశ్వర్, కేదారగౌరి దేవాలయాలు:


ధౌళి నుంచి తిరిగి వచ్చే దారిలో ముక్తేశ్వర్ మందిర సముదాయం ఉంది. ఇది ఏ.ఎస్.ఐ వారి ఆధీనంలో ఉంది. అద్భుతమైన మందిరం ఇది. ఇక్కడ శివుడు ముక్తేశ్వర్, సిద్ధేశ్వర్ పేరులతో ఆలయాలు ఉన్నాయి. అలాగే ఎన్నో దేవతల సముదాయం ఉంది. ఇది 950 సంవత్సరం నాటిది. ఇక్కడ తోరణం చాలా ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ గుడి వెనుక కొలను ఉంది. ఇందులో స్నానం చేస్తే వ్యాధులు తగ్గి సంతానము లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక నాట్య కళాకారిణి ఛాయ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ గుడికి ఇంకొక వైపు కేదార గౌరీ మందిరం ఉంది. చాలా పురాతనమైన ఈ మందిరంలో శివుడు స్వయంభూ. కాబట్టి లింగం కనిపించదు. గౌరీ అమ్మవారు చక్కని అలంకరణలో నయనానందకరం. పక్కనే హనుమంతుని గుడి, మహిమ గల కొలను ఉన్నాయి.  తప్పకుండా చూడాల్సిన వాటిల్లో ఇదొకటి.

రాజ రాణి ఆలయం:
 

ఈ దేవాలయం విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఏ.ఎస్.ఐ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకమైన ఇసుక రాయితో కట్టబడింది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. గర్భగుడిలో ఏ దేవతా లేదు కాని అష్ట దిక్పాలకులకు విగ్రహాలు గోడల పై ఉన్నాయి. ఇది అప్పటి రాజు, రాణిల స్మారకం అని కొంత మంది అభిప్రాయం. విశాలమైన లాన్, ప్రశాంతంగా ఉంది ఈ దేవాలయం. ప్రేమికులకు మంచి ప్రదేశం.

ఉదయగిరి, ఖండగిరి  గుహలు:


భువనేశ్వర్ కి ఏడు కిలోమీటర్ల దూరం లో ఈ ఉదయగిరి, ఖండగిరి గుహలు ఉన్నాయి. ఇవి ప్రముఖంగా బౌద్ధ, జైన క్షేత్రాలు. ఇవి మొదటి  బి.సి. నాటివి. ఎడమవైపు ఖండగిరి గుహలు, కుడివైపు ఉదయ గిరి గుహలు. ఖండగిరి గుహలు పదిహేను. ఈ గుహల పైన జైనుల మందిరాలు ఉన్నాయి. అప్పటి దిగంబర జైనుల విగ్రహాలు అద్భుతమైన శిలా సమపాలో దర్శనమిస్తాయి. ఉదయగిరి గుహలు పద్దెనిమిది. ఇందులో ప్రధానమైనది హాథీ (ఏనుగు) గుహలు. ఇది ఉన్నవాటిలో పెద్ద గుహ. ఇవి కాక రాణీ గుహ, గణేశ గుహ లాంటి పేర్లతో చాలా ఉన్నాయి. జైనుల ధ్యానానికి, విశ్రాంతికి అనువుగా ఈ గుహలు ఉన్నాయి. చారిత్రిక ప్రాధాన్యం, ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే ఎన్నో చెక్కడాలు ఈ గుహల పైన ఉన్నాయి. వివిధ రకాల జంతువుల ఆకారాలు, పెళ్లిళ్లు ఈ చెక్కడాల పైన మనకు కనిపిస్తాయి. గైడ్ చాలా వివరంగా మాకు అన్ని తెలియ చేసాడు. ఈ ప్రదేశం మంచి విహార యాత్ర ప్రదేశం. ఇది కూడా ఏ.ఎస్.ఐ వారి ఆధీనంలో ఉంది. ఇక్కడ కోతులు విపరీతంగా కనిపిస్తాయి. ఈ రెండు కొండల పైనుంచి భువనేశ్వర్ పట్టణం కనిపిస్తుంది. దట్టమైన చెట్ల మధ్య ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి, ఆనాటి జీవన శైలికి ఆలవాలం. ఈ రెండు గుహల సముదాయం, కొండలు ఎక్కటానికి, చూడటానికి దాదాపు 2 -3 గంటలు పడుతుంది.


ఇవి ముగించుకొని మేము ఇస్కాన్ మందిరానికి వెళ్ళాము. అక్కడ మంచి భోజనం చేసి మార్కెట్ కి వెళ్లి కొంత షాపింగ్ చేసాము.  రూం కి చేరుకుని, సర్దుకొని సాయంత్రం 6 :50 కి బిజూ పట్నాయక్ విమానాశ్రయంలో  హైదరాబాదు విమానం ఎక్కాము.  మొత్తం మీద చాలా హాయిగా, విశ్రాంతిగా, భక్తితో, ఒడిషా వారసత్వ సంపదను చూసే యాత్ర చేసాము. విహారం, వినోదం, దైవం, చారిత్రకం - అన్ని సమ పాళ్ళలో మేళవించి శరీరాన్ని కొంత పదును పెట్టి తిరిగి వచ్చాము.

ప్రదేశాలు, వసతులు, ఫోన్ నెంబర్లు - వీటికొరకు ఒడిషా పర్యాటక శాఖ వారి వెబ్ సైట్ చూడండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి