14, అక్టోబర్ 2010, గురువారం

దుర్గా సూక్తం, తాత్పర్యము

శరన్నవరాత్రుల ఎనిమిదవ నాడు (అష్టమి) ఆ అది పరాశక్తి దుర్గ గా అలంకరించబడుతుంది. ఈ రోజునే దుర్గాష్టమిగా మనము జరుపుకుంటాము. ఋగ్వేదంలో అనేక చోట్ల కనబడే స్తుతులను తైత్తిరీయ అరణ్యకంలో సంకలనం చేయబడి దుర్గా సూక్తం పేరుతో ఈ మహిమాన్విత శ్లోకాలు ప్రచారంలో ఉన్నాయి. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఈ సూక్త పారాయణము వలన  అధిగమించ వచ్చని విశ్వాసం. దుర్గా సూక్తం అని పేరు వచ్చినా, ఈ స్తుతిలో ఎక్కువ అగ్నిదేవుని స్తుతించేవి గా ఉన్నాయి.  యూట్యూబ్ లంకె.


ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతే నిదహాతి వేదః |
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః || ౧||
తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం
కర్మఫలేషు జుష్టామ్ | దుర్గాం దేవిగ్ం శరణమహం
ప్రపద్యే సుతరసి తరసే నమః || ౨||
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా |
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః || ౩||
విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితాతిపర్‍షి |
అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనామ్ || ౪||
పృతనా  జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం  హువేమ పరమాథ్సధస్థాత్ |
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్నిః || ౫||
ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి |
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ || ౬||
గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ |
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం || ౭||
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

|| ఇతి దుర్గా సూక్తమ్ ||



తాత్పర్యము:

అగ్నిదేవా!  సోమాన్ని పిండి రసాన్ని నీకు సమర్పిస్తాము. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అగ్ని దేవుడు దగ్ధము చేయు గాక! పడవ ద్వారా సముద్రము దాటే విధంగా మమ్మల్ని సమస్త బాధలనుండి, తప్పులనుండి అగ్నిదేవుడు కాపాడు గాక!

అగ్నివర్ణం కలదీ, తపస్సు ద్వారా ప్రకాశించునదీ, భగవంతునికి చెందినదీ, కర్మ యొక్క ప్రతిఫలాలలో శక్తిగా నెలకొన్నదీ అయిన దుర్గాదేవిని నేను శరణు జొచ్చుచున్నాను. దుఃఖసాగరం నుండి మమ్మలను తీరానికి చేర్చే దేవీ! మమ్ము కాపాడు. నీకు నమస్కారము. 

ఓ అగ్నిదేవా! నీవు కీర్తింప తగినవాడవు. సంతోషకర మార్గాల ద్వారా మమ్మ్ములను సమస్త దుఃఖాలనుండి దూరంగా తీసుకెళ్ళు, మా ఊరు, దేశము, ప్రపంచము, సుభిక్షముగా ఉండు గాక! మా పిల్లలకు, వారి పిల్లలకు సంతోషాన్ని ఇచ్చే వాడిగా నువ్వు ఉంటావు గాక!

అగ్నిదేవా! సమస్త దుఃఖాలను హరించేవాడా! సముద్రంలో పడి తల్లడిల్లే వ్యక్తిని పడవ కాపాడిన రీతిలో ఈ దుఃఖాల బారినుండి మమ్ము రక్షించు. మా శరీరాలను కాపాడే వాడా! 'యావన్మందీ సంతోషంగా ఉండుగాక' అంటూ మనసులో పదే పదే  చెపుతున్న అత్రి మహర్షిలా మా శ్రేయస్సు మనస్సునందు జ్ఞప్తి యందు ఉంచుకో. 

శత్రు సైన్యాన్ని ముట్టడించేవాడు, వాటిని నాశనం చేసే వాడు, ఉగ్రమైన వాడు అయిన అగ్ని దేవుడుని సభయొక్క అత్యున్నత స్థానం నుండి ఇక్కడకు వేంచేయమని ఆహ్వానిస్తున్నాము. ఆయన మమ్ములను సమస్త క్లేశాలకు, నశించేవాటికి, తప్పిదాల ఆవలకు తీసుకు వెళ్ళు గాక! మమ్ము కాపాడు గాక!

అగ్నిదేవా! యాగాలలో కీర్తించబడుతున్న నువ్వు మా ఆనందాన్ని ఇనుమడింప చేస్తున్నావు. యాగం చేసే వారిలో సనాతనుడిగాను, కొత్త వాడి గాను నువ్వు వెలుగుతున్నావు. నీ రూపంగా ఉంటున్న మాకు సంతోషం ప్రసాదించాలి. మాకు సర్వతోముఖ శ్రేయస్సు తీసుకురావాలి. 

భగవంతుడా! నీవు పాపము అంటని వాడవు, సకలవ్యాపివి. అసంఖ్యాకమైన పశువులతో కూడిన సంపదను పొంద పరమానందము అనుభవింప మేము నిన్ను వెన్నంటుతాము. విష్ణు స్వరూపమైన దుర్గా దేవీ పట్ల మాకున్న భక్తి వలన ఉన్నత దేవలోకంలో నివసించే దేవతలు ఈ ప్రపంచంలో నాకు సంతోషాన్ని ప్రసాదించు గాక! 

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి