11, ఆగస్టు 2017, శుక్రవారం

"పలుకు తేనెల తల్లి" వేదవతీ ప్రభాకర్ గారి విశేషాలు


నా చిన్నతనంలో ఆవిడ పాట కోసం ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలలో మా కుటుంబమంతా ఎదురు చూసే వాళ్లము. వారి వ్యక్తిత్వం ఎంత నిండైనదో వారు పాడే పద్ధతిలో, వారి నడవడికలో అర్థమవుతుంది. హుందాతనానికి వారు ప్రతిబింబం. పరిచయం లేకపోయినా వారిని చూడగానే గౌరవభావం కలుగుతుంది. లలిత సంగీతానికి, లాలిపాటలకు మారు పేరు వారు. ప్రఖ్యాత లలిత భక్తి సంగీత గాయని శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గారి విశేషాలు ఈరోజు.

కన్నడ దేశంలో పుట్టి పెరిగి, తెలుగు భాష నేర్చుకొని లలితసంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న గాయనీమణి వేదవతి ప్రభాకర్ గారు. మైసూరు-బెంగుళూరు మధ్య గల రామనగరిలో రుక్మిణి-శ్రీకంఠయ్య దంపతులకు వేదవతి గారు జన్మించారు. బెంగుళూరులో పెరిగిన వీరు అక్కడే పదేళ్ల వయసునుండి చెన్నమ్మ గారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. వీరి తరువాతి గురువు ముద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు. శ్రీకంఠయ్య గారు బెంగుళూరు గాయన సమాజంలో సభ్యునిగా ఉండటంతో పిల్లలను ప్రతి వారమూ గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల కచేరీలకు తీసుకు వెళ్లేవారు. కానీ, అప్పటి కుటుంబపు కట్టుబాట్ల వల్ల వేదికలెక్కి పాడలేకపోయారు. వివాహం ఐపీఎస్ ఆఫీసర్ అయిన రొద్దం ప్రభాకరరావు గారితో జరగటంతో తెలుగునాట ప్రవేశం జరిగింది. మారుమూల ప్రాంతాలలో ఉండవలసి రావటంతో తెలుగు నేర్చుకోవలసి వచ్చింది. అత్తమామలు కళలపట్ల ఆసక్తి కలవారు కావటంతో వారు వేదవతి గారిలోని సంగీత ప్రతిభను బాగా ప్రోత్సహించారు. అనంతపురంలో అత్తమామల దగ్గరకు వెళ్లినప్పుడల్లా వారు వేదవతి గారి కోసం సంగీత గురువును రప్పించే వారు, వారికి కొన్ని కృతులు నేర్చుకునే అవకాశం కల్పించేవారు. భర్తకు నిరంతరం బదిలీలు వచ్చే ఉద్యోగం కావటంతో వారి ఈ సంగీత సాధనకు అంతరాయాలు వచ్చాయి.

ఒకసారి అప్పటి భారత రాష్ట్రపతి, వారి సతీమణి విజయవాడ వచ్చిన సందర్భంలో రోటరీ వారి సభలో అప్పటి ప్రఖ్యాత గాయని శ్రీరంగం గోపాలరత్నం గారు  పాడవలసి ఉండగా ఆవిడ జ్వరంతో రాలేకపోవటంతో వేదవతి గారు అప్పటికప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనను పాడవలసి వచ్చింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ వారిని ఆకాశవాణిలో పాడవలసిందిగా ఆహ్వానించారు. తెలుగుభాష పూర్తిగా రాకపోవటంతో ఆవిడ శ్రీరంగం గోపాలరత్నం గారి సోదరులు శ్రీరంగం గోవిందాచార్యుల వారి వద్ద తెలుగు భాషతో పాటు 15 పాటలు నేర్చుకుని పాడారు. అతి తక్కువ సమయంలోనే ఆకాశవాణి బీ గ్రేడ్ కళాకారిణిగా గుర్తించబడ్డారు. నేదునూరి వారు స్వరపరచిన అన్నమాచార్య కీర్తనలు, బాలమురళి గారు స్వరపరచిన ఇతర గీతాలను ఆవిడ పాడారు. గొప్ప గొప్ప కళకారుల సహచర్యంలో ఆకాశవాణి ద్వారా సేవలందించారు. తరువాత వారు తెలుగు మరియు కన్నడ చిత్రాలలో సాంప్రదాయ గీతాలు పాడారు. జాతీయ స్థాయిలో వారికి అవకాశం జీవీ అయ్యరు గారి ఆదిశంకరాచార్య చిత్రంలో వచ్చింది. ఆ చిత్రంలో కనకధారా స్తోత్రం శ్లోకాలతో పాటు మరెన్నో శ్లోకాలను వేదవతి గారు ఆలపించారు. రామకృష్ణ మఠం వారి ప్రైవేట్ ఆల్బం, తితిదే వారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు, పురందరదాసుల కృతుల క్యాసెట్లు పాడారు. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ కళాకారిణిగా ఎంతో పేరొందారు. భర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీ అయినా వేదవతి గారిని ఎంతో ప్రోత్సహించారు. వీరు మంత్రాలయంలో గురు శుక్రవారాలలో నాద నమన అనే కార్యక్రమాన్ని ఆరంభించి ఔత్సాహికులైన కళాకారులకు ప్రోత్సాహం కలిగించారు. వేదవతి గారు పాలగుమ్మి విశ్వనాథం గారి వద్ద కూడా శిక్షణను పొందారు.

ఇక వేదవతి గారి గాత్ర వైశిష్ట్యానికొస్తే - శ్రావ్యమైన శాస్త్రీయ సంగీతంతో పాటు మనసును హత్తుకునే లలిత భావ గీతాలకు వారి గాత్రం పెట్టింది పేరు. భావాన్ని అద్భుతంగా ఒలికించే వారి గానం శ్రోతలను ఆనందంలో ఓలలాడిస్తుంది. పాలగుమ్మి వారి రచన, సంగీతంలో వచ్చిన "అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ" అన్న పాటను వేదవతి గారు పాడిన రీతి దశాబ్దాలైనా ఇప్పటికీ తెలుగువారి హృదయాలను తాకుతూనే ఉంది. ఓ ఆడబిడ్డ యొక్క తల్లి మనసును ఆవిష్కరించే ఈ గీతం ఆ తల్లీ-కూతుళ్ల మధ్య గల బంధంలోని భావనలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. పాలగుమ్మి వారి సాహిత్య సంగీతాలతో కలసి వేదవతి గారి గానం తెలుగువారి మనసులను హత్తుకొని హృదయాలను కరిగిస్తుంది. దేవులపల్లి వారి పూవులేరి తేవే చెలి పోవలె కొవలెకు, మధూదయంలో మంచి ముహూర్తం వంటి అద్భుతమైన లలిత గీతాలు, శివపాదమునుంచ నేను శిలనైనా కారాదా అన్న అరిపిరాల విశ్వం గారి భక్తి లలిత గీతం, జో అచ్యుతానంద జో జో ముకుందా అనే అన్నమాచార్యుల వారి కృతి మొదలైనవి వేదవతి గారి గళంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. జో జో ముకుందా అన్న ఆల్బంలో ఉన్న ప్రతి గీతమూ వారి గాత్ర సౌందర్యానికి ఉదాహరణలు. తప్పకుండా బిడ్డలు అన్నీమరచి నిద్రపోయేలా ఉంటాయి. వింజమూరి శివరామారావు గారి మధురానగరి సమీపంలో అనే గీతం కూడా వీరి గాత్ర సౌరభాన్ని ఆవిష్కరిస్తుంది. వేదవతి గారి మంగళహారతులు కూడా ఎంతో పేరు పొందాయి. శీతాద్రి శిఖరాన అన్న బేతవోలు రామబ్రహ్మం గారి హారతిని బాలమురళి గారి తరువాత వేదవతి గారు పాడిన రీతి తెలుగు నాట దేవాలయాలలో మారు మ్రోగింది. నేదునూరి వారి వద్ద నేర్చుకున్న అన్నమాచార్యుల వారి "పలుకు తేనెల తల్లి" అనే సంకీర్తన వేదవతి గారి గాత్రంలో ఎంతో ప్రాచుర్యం పొందింది.

ఆకాశవాణిలో భక్తిరంజనితో పాటు అనేక లలిత సంగీత కార్యక్రమాలలో వేదవతి గారు పాడారు. మీరాబాయి భజనలను సి. నారాయణ రెడ్డి గారు అనువదించగా పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో వేదవతి గారు పాడారు. ఈ గీతాలు ఎంతో పేరుపొందాయి. ఇవి విన్న హెచ్.ఎం.వీ కంపెనీలో పని చేసే మంగపతి గారు వేదవతి గారి చేత ఈ సినారె గారి మీరా గీతాలను పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాడించారు. తిరుప్పావై, దేవీ స్తోత్రాలు, భజనలు వీరికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. అమెరికా, కెనడా, ఇంగ్లండు దేశాలతో పాటు అనేక ప్రాంతాలలో 1000కి పైగా కచేరీలలో వేదవతి గారు పాడారు. 2012లో ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, అపురూప అవార్డు, తెలుగు కళాసమితి వారి కేవీరావు-జ్యోతి రావు అవార్డు మొదలైన పురస్కారాలను వేదవతి గారు పొందారు. సుదీర్ఘమైన సంగీత ప్రస్థానంలో వేదవతి గారు లబ్దప్రతిష్ఠులు, ఎన్నేళ్లైనా వారి గాత్రంలో మాధుర్యం అలానే నిలిచి ఉండటం వారి సాధనను, జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. వేదవతి-ప్రభాకరరావు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వేదవతి గారికి ఆ భగవంతుడు మరింత సేవా భాగ్యాన్ని, గాత్ర సౌలభ్యాన్ని ప్రసాదించాలని శుభాకాంక్షలు. 

8, ఆగస్టు 2017, మంగళవారం

కనుగొంటి కనుగొంటి- రావు బాలసరస్వతీదేవి గారు ఆలపించిన భక్తి గీతం



కనుగొంటి కనుగొంటి ఈ కంట నేడు 
సంకటహరుడైన శ్రీ వేంకటేశుని 

భక్తుల బ్రోవంగా ఏడుకొండలమీద
అవతారమొందిన అలుమేలుమంగేశుని 

విశ్వరూప దర్శనపు వేళ శ్రిత జనావళి గన
ముదమార వేచిన వేంకటాచలపతిని 

తోమాల సేవలో నానా పరిమళ సుమమాలికావృత 
నీలిదేహుని దివ్యరూపంబు గంటి
ధర్మ సంస్థాపనాసక్త నిత్యాభిషక్తుని 
శంఖ చక్రధరుని మంగళాకరుని

రావు బాలసరస్వతీదేవి గారి గాత్రంలో ఎంత మాధుర్యమున్నదో ఈ గీతం వింటే తెలుస్తుంది. భక్తి భావనతో పాటు లాలిత్యాన్ని పండించిన వారి అమృత గానం ఆ శ్రీనివాసుని పాదాల వద్దకు తప్పక చేరే ఉంటూంది. గీత రచయిత, సంగీతకారులు ఎవరో తెలియదు. సరళమైన సాహిత్యంతోనే అద్భుతమైన భావనలను పండించవచ్చు అని ఈ గీతం మరో మారు నిరూపిస్తుంది. బాలసరస్వతి గారి గీతం కళ్లు మూసుకుని వింటే ఆ వేంకటరమణుని వైభవం కళ్లెదుట నిలుస్తుంది. అన్నమాచార్యుల వారి కలగంటి కలగంటి అనే సంకీర్తన స్ఫురణకు వస్తుంది. అనుపల్లవిలో బాలసరస్వతి గారి ఆలాపనలు అద్భుతం. స్వామికి జరిగే సేవల ప్రస్తావన ఉన్న ఈ గీతంలో ఆ నీలమేఘ శరీరుని దివ్యరూపమును గాంచిన భక్తుని హృదయ కమలములోని భావనలను మనోజ్ఞంగా ఆవిష్కరించిన ఈ గీతం బాలసరస్వతి గారి గాత్రంలో మరింత ప్రకాశించింది. నిత్యాభిషిక్తుడైన ఆ స్వామి దివ్య మంగళ స్వరూపమును గాంచిన భక్తుని ఆనందాతిశయాన్ని లలితంగా కవి తమ పదాలలో ఒలికించారు. బాలసరస్వతి గారి గాత్రాన్ని గమనిస్తే సహజంగా లలితమైన గాత్ర ధర్మం వారిది. స్వరాలను పలికిస్తూనే భావ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే అద్భుతమైన గాత్ర లక్షణం వారిది. ఆనంద నిలయుడైన శ్రీనివాసుని దర్శన భాగ్యమున భక్తుని పారవశ్యాన్ని వారి గాత్రం వంద శాతం ప్రతిబింబించింది. లలిత గీతాలకు భావము అత్యంత ప్రముఖమైనది. ఆ ప్రాధాన్యతను ప్రతి ఒక్క గీతంలోనూ పలికించిన వారు బాలసరస్వతి గారు. వారికి మరో మారు వందనాలు. 

6, ఆగస్టు 2017, ఆదివారం

వేంకటాచల నిలయం వైకుంఠపురవాసం - పురందరదాసు దేవర్నామా


వేంకటాచల నిలయం వైకుంఠపురవాసం 
పంకజ నేత్రం పరమ పవిత్రం
శంఖ చక్రధర చిన్మయ రుపం

అంబుజోద్భవ వినుతం అగణితగుణ ధామం 
తుంబురు నారదగాన విలోలం

మకర కుండలధర మదన గోపాలం
భక్త పోషక శ్రీ పురందర విఠలం

శ్రీవేంకటాద్రి నివాసంగా కలిగిన, వైకుంఠ వాసుడు కలువల వంటి కన్నులు గలవాడు, పరమ పవిత్రమైన వాడు, శంఖ చక్రములు ధరించిన వాడు చిదానంద రూపుడు శ్రీవేంకటేశ్వరుడు. పంకజము నుండి జన్మించిన బ్రహ్మచే నుతించిబడిన వాడు, ఎన్నలేని గుణములకు నిలయమైన వాడు, తుంబుర నారదాదుల గానములో తేలియాడే వాడు ఆ స్వామి. మకర కుండలములు ధరించిన ఆ మదన గోపాలుడు భక్తులను పోషించే పురందర విఠలుడు.

- పురందరదాసు

శ్రీనివాస నాయకునిగా నామకరణం చేయబడిన బాలుడు మహా వాగ్గేయకారుడై కర్ణాటక శాస్త్రీ సంగీతానికి ఆద్యుడైనారు. ఆయన గురువులైన వ్యాసతీర్థుల వారు ఆయనకు పురందరదాసు అని పేరు మార్చారు. పురందర విఠల అనే ముద్రతో అద్భుతమైన దాస సాంప్రదాయ కృతులను రచించారు. ఈనాడు మనకున్న కర్ణాటక సంగీతం ఆయన చలవే. వేంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు, గణపతి, మహాలక్ష్మి మొదలైన దేవతా స్వరూపాలపై ఆయన వేల కీర్తనలను రచించి పాడారు. కనడ భాషలో వీటిని దేవర్నామా అంటారు. కన్నడ దేశంలో దాస సాంప్రదాయం ఎంతో ప్రబలం కావటానికి పురందరులు కృషి చేశారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ పటిష్టంగా దక్షిణ భారతమంతా విస్తరించి సనాతన ధర్మ ప్రచారానికి తోడ్పడుతోంది. పురందరుల వారు ఎక్కువ మటుకు కన్నడ భాషలో, కొన్ని సంస్కృతంలో రచనలు చేశారు. వాటిలో ఒకటి వేంకటాచల నిలయం అనే దేవర్నామా సింధుభైరవి రాగంలో కూర్చబడింది. పురందరుల వారి కృతులను ఎమ్మెల్ వసంతకుమారి గారు చాలా ప్రచారం చేశారు. వారి గాత్రంలో ఈ దేవర్నామాను వినండి

నిండు పున్నమి పండు వెన్నెలలో - దాశరథి లలిత గీతం


నిండు పున్నమి పండు వెన్నెలలో
నిను చేరగ నేనెటుల రాగలనో

నీలి నీలి ఆకసము నీడ నే కాలి సవ్వడి లేక రాబోతే
దొంగ తారలు తొంగిచూచెను చందమామ దారికాచెను

తెల్లతెల్లని బొండు మల్లెలతో తనువెల్లా చల్లగా దాచుకుంటేను
నల్ల నల్లని గండు తుమ్మెదలు నా వెంట పడి గల్లంతు చేసెనో
మనసు నీకై పరుగు తీసెనో నా తనువు నీకై వేచెను

- దాశరథి కృష్ణమాచార్యులు

రాధ మనసును ఎంత అందంగా ఆవిష్కరించారో కవి! పున్నమి రేతిరి స్వామికై వేచి యున్న రాధ తన మనోగతాన్ని స్వామికి ఈ గీతం ద్వారా విన్నవించుకుంది. నీలి ఆకాశపు నీడలో చప్పుడు లేకుండా స్వామి వద్దకు రాధ రాబోగా తారలు దొంగతనంగా తొంగి చూచాయట, చందమామ దారి కాచాడట. తెల్లని మల్లెలు ధరించి తన తనువును దాచుకోగా నల్లని గండు తుమ్మెదలు ఆ మల్లెలకోసం వచ్చి ఆమె వెంటపడ్డాయట. తన మానసము ఆ స్వామికై పరుగు తీసిందట, తనువు స్వామికి వేచి ఉన్నదట. మధురభక్తికి రాధ దర్పణమైతే తెలుగుదనంతో దాశరథి గారు ఆ రాధ ఆరాధనను హృద్యంగా ఈ లలిత గీతం ద్వారా ఆవిష్కరించారు. ఇక రావు బాలసరస్వతి గారంటేనే లలిత సంగీతం గుర్తుకు వస్తుంది. వారు తమ అమృత గానంతో ఈ రాధ గీతికకు శాశ్వతత్వాన్ని ఆపాదించారు.

తెలుగుదనానికి లలితగీతాలు అసలైన నీరాజనాలు. అటువంటి గీతమే ఈ నిండు పున్నమి పండు వెన్నెలలో అనే గీతం. లలిత గీతాలకు ప్రాణప్రతిష్ఠ చేసి తారాస్థాయికి తీసుకువెళ్లింది ఆకాశవాణి మరియు ఆ సంస్థలో పని చేసిన కళాకారులు. ఆకాశవాణిలో ప్రసారమైన వందలాది గీతాలు ప్రజల మనసులు దోచుకొని లలిత భావనలను సామాజంలో పెంపొందించేలా చేశాయి. పౌర్ణమి వచ్చేసింది, నిండు పున్నమిలో రాధ మానస మాలికను రావు బాలసరస్వతీదేవి గారి గళంలో జాలువారగా విని ఆస్వాదించండి. ఇది  ఆకాశవాణి ప్రసారం.


2, ఆగస్టు 2017, బుధవారం

పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను - అన్నమయ్య సంకీర్తన


పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయెనిపుడు

వెన్నలారగించబోయి వీధులలో దిరిగేనో
యెన్నరాని యమునలో యీదులాడీనో
సన్నల సాందీపనితో చదువగబోయినాడో
చిన్నవాడాకలి గొని చెలులాల యిపుడు

మగువల కాగిళ్ళ మరచి నిద్దిరించీనో
సొగిసి ఆవుల గాచే చోట నున్నాడో
ఎగువనునుట్లకెక్కి యింతులకు జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయెనిపుడు

చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె యింటనున్నాడో
అందపు శ్రీవేంకటేశుడాడివచ్చెనిదె వీడే
విందుల మా పొత్తుకు రా వేళాయెనిపుడు

ఓ గోపికలారా! కృష్ణుని పేరు పెట్టి పిలవండి! భోజనము చేసే సమయమైంది. గోపకులంలోని యిళ్లలో వెన్న ఆరగించటానికి వెళ్లాడో లేక ఘనమైన యమునలో ఈత కొడుతున్నాడో, సంజ్ఞలు చేసే సాందీపనితో చదువుకోవటానికి వెళ్లాడో, ఇపుడా చిన్నవాడు ఆకలి గొని ఉంటాడు, వాడిని పిలవండి. గోపికల కౌగిళ్లలో ఆదమరచి నిద్రించియున్నాడో, చక్కగా ఆవులను కాచే చోట ఉన్నాడో, పైనున్న ఉట్లెక్కబోయి స్త్రీలకు చిక్కాడో, సగము వేడిగా ఉన్న కూరలు చల్లబడిపోతున్నాయి, వాడిని పిలవండి చెలులారా! నెమలి పింఛాలను సిగలో సింగారించుకుంటున్నాడో, ఇంతలోనే దేవుడిలా ఇంట్లోనే ఉన్నాడో, అందమైన శ్రీవేంకటేశ్వరుడు ఇదిగో ఆడుకొని వచ్చినాడు, విందు చేయటానికి మా దగ్గరకు వచ్చే వేళైంది. వాడిని పిలవండి చెలులారా!

తాళ్లపాక అన్నమాచార్యుల వారు

అన్నమయ్య మధురభక్తిలో కాసేపు తల్లిగా, కాసేపు గోపికగా, కాసేపు భక్తునిగా వేర్వేరు పాత్రలలో లీనమై స్వామిని ఆరాధించాడు. ఇక్కడ తల్లి యశోదగా స్వామిపై ఆ అమ్మ ప్రేమను, ఆతని ఆకలి దప్పులు తీర్చే ఆతృతను మనకు అన్నమయ్య తెలియజేశారు. యశోద ఆ బాలుడు శ్రీహరి అని తెలిసినా మాయలో పడి ఆతనిని తన శిశువుగా లాలించింది, అతనికి మాతృప్రేమను పరిపూర్ణంగా అందించింది. తన బిడ్డ ఎక్కడున్నాడో, భోజనం చేసే సమయమైందని ప్రతి తల్లీ ఆతృతతో వేచియుంటుంది. ఇక్కడ ఆ బాలుడు లీలామానుష రూపుడై ఉన్నప్పటికీ ఆతనిపై అవ్యాజమైన ప్రేమతో అందరి తల్లులలాగానే ఆమె వానిని పిలువమని చెలులకు చెబుతుంది. వెన్నను దొంగిలించటం, సాందీపని మొదలైన వారితొ చదువుకోవటంలో, యమునలో జలక్రీడలలో, గోపికల కౌగిళ్లలో, గోవులను కాయటంలో, స్త్రీల బందీలో ఎక్కడ ఉన్నాడో వాడు, ఆహార పదార్థాలు చల్లబడిపోతున్నాయి అని తల్లి మనసును అద్భుతంగా ఆవిష్కరించారు అన్నమయ్య. అనేక రకములైన భావనలను స్వామికి సమర్పించి మధురభక్తిలో అన్నమయ్య తరించారు. ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా గానం చేశారు. 

31, జులై 2017, సోమవారం

మాదీ స్వతంత్ర దేశం - రజనీ దేశభక్తి గీతం



రజనీ - ఆ పేరే తెలుగునాట లలితసంగీతానికి మారుపేరు. దేశభక్తి, లలిత గీతాలకు రజనీ హృదయం పుట్టినిల్లు. స్వాతంత్య్ర పూర్వము నుండి తొంభయ్యవ దశకం వరకు తెలుగునాట ఆకాశవాణి ద్వారా మారుమ్రోగిన పేరు బాలాంత్రపు రజనీకాంతరావు గారిది. ఆయన భారతావని స్వతంత్ర జాతిగా ఆవిర్భవించినప్పుడు రచించిన దేశభక్తి గీతం మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి. సంగీతం కూడా ఆయనే కూర్చారు. ఈ గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి గారు ఆలపించారు. రజనీ గారి బహుముఖ ప్రజ్ఞ ఆయన గీతాల సాహిత్యంలో, సంగీతంలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. భరతమాతకు ఈ గీతంలోని అద్భుతమైన పదాల ద్వారా రచయిత తన నివాళులను సమర్పించారు. ఈనాటి తరాల వారికి ఇటువంటి గీతాలు, వాటి అర్థాలు తెలియజేస్తే మన ముందు తరాల వారు ఈ భారతావనికి ఎటువంటి సేవ చేశారో తెలుస్తుంది. కొంతైనా దేశభక్తి అలవడుతుంది. టంగుటూరి సూర్యకుమారి గారు ఆనాడు నటనలో, గానంలో, నృత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారు పాడిన దేశభక్తి గీతాలు ఈనాటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోయాయి. రజనీ, శంకరంబాడి సుందరాచారి, బసవరాజు అప్పారావు, గురజాడ అప్పారావు, నిడదవోలు వెంకటరావు, అడవి బాపిరాజు, రాయప్రోలు సుబ్బారావు వంటి మహనీయుల సాహిత్యం సూర్యకుమారి గారి గళంలో అద్భుతంగా జాలువారింది. రజనీ గారు చాంద్రమానం ప్రకారం శతసంవత్సరాలు పూర్తి చేసుకుని హైదరాబాదులో నివసిస్తున్నారు. ఆయన ప్రముఖ తెలుగు కవి ద్వయమైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి కుమారుడు. రజనీ కళాప్రపూర్ణ బిరుదాంకితులు. వారికి ఒక్క పద్మ అవార్డు రాకపోవటం ఎంతో శొచనీయం. సూర్యకుమారి గారంటే శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం యొక్క అద్భుతమైన గానం గుర్తుకొస్తుంది. వీరు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి సోదరుని కుమార్తె. సూర్యకుమారి గారు 1960వ దశకం నుండి లండన్‌లో స్థిరపడి 2005లో మరణించారు. రజనీ-సూర్యకుమారి గార్ల సమన్వయంలో వెలువడిన మాదీ స్వతంత్ర దేశం గీత సాహిత్యం, ఆడియో.

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి 
భారతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం 

వింధ్య హిమవత్ శ్రీనీలాద్రుల
సంధ్యారుణిత నవాశలు మావి 
గంగా గోదావరీ సహ్యజా
తుంగ తరంగిత హృదయాల్ మావి

ఆలయమ్ముల  శిల్పవిలాసం
ఆరామమ్ముల కళాప్రకాశం
మొగల్ సమాధుల రస దరహాసం  
మాకు నిత్య నూతనేతిహాసం

అహింసా పరమో ధర్మః 
సత్యంవద ధర్మంచర 
ఆదిఋషుల వేదవాక్కులు 
మా గాంధి గౌతముల సువాక్కులు

స్వతంత్రతా భ్రాత్రుత్వాలు 
సమత మా సదాశయాలు 
జననీ ఓ స్వతంత్ర దేవి   
గొనుమా నివ్వాళులు మావి 

మాది స్వతంత్ర దేశం, స్వేచ్ఛ కలిగిన జాతి. భారతదేశమే మా దేశం, భారతీయులమే మా ప్రజలం. వింధ్య, హిమాలయ, నీలగిరి పర్వతాలు మా ఆశలకు ఉదయించే కొత్త వెలుగులు. గంగా, గోదావరి, సహ్యాద్రి, తుంగ నదుల ఉప్పొంగే ప్రవాహాలతో మా హృదయాలు పరవశిస్తాయి. మా ఆలయాల అద్భుతమైన శిల్పకళ, మా ఉద్యానవనాల కళాత్మక సౌందర్యం, మొగల్ సమాధులలోని కళా వైభవం మా దేశ చరిత్రను ఎప్పటికీ కొత్తగా అనుభవింపజేస్తాయి. అహింసే అత్యున్నత ధర్మం. సత్యం మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు అని ప్రాచీన ఋషులు అందించిన వేదబోధనలు, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ వంటి మహనీయుల ఉత్తమ సందేశాలు మా మార్గదర్శకాలు. స్వాతంత్య్రం, సోదరభావం, సమానత్వం మా ఉన్నతమైన ఆదర్శాలు. ఓ స్వతంత్ర భారతమాతా, తల్లీ, నీకు మా హృదయపూర్వక నివాళులు స్వీకరించు.

నల్లని వాడా! నే గొల్ల కన్నెనోయ్! - వింజమూరి శివరామారావు గారి గీతం



నల్లని వాడా! నే గొల్ల కన్నెనోయ్! పిల్లన గ్రోవూదుమోయ్! నా యుల్లము రంజిల్లగా!

నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగ వచ్చితినే!
నా మనసు తనువు నా మనికే నీది కదా పిల్లన గ్రోవూదుమోయ్!! నల్లనివాడా!!

ఆకసాల మబ్బులనీ చీకటులే మూగెననీ!
నేనెరుంగనైతిని నీ తలపే వెలుంగాయె పిల్లన గ్రోవూదుమోయ్! నల్లనివాడా!!

మెరుపే నీ గోపికయై వలపే నా నెచ్చెలియై!
తోడి తెచ్చె నీ దరికీనాడు పండె నా నోములు పిల్లన గ్రోవూదుమోయ్!! నల్లనివాడా!!

- వింజమూరి శివరామారావు గారు

ఎంత అద్భుతమైన లలిత గీతమో! వింజమూరి శివరామారావు గారు సీత-అనసూయ సోదరీమణులతో పాటు వింజమూరి వంశంలో జన్మించిన మరో ప్రతిభామూర్తి. ఈయన ఆకాశవాణిలో ఎన్నో సంవత్సరాలు పని చేశారు. అద్భుతమైన లలితగీతాలు రచించారు. వీరు రచించిన రామాయణం గేయం అప్పట్లో ఆకాశవాణిలో మారుమ్రోగింది. సీత-అనసూయ గార్ల లాగానే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వీరికి మేనమామలు. కళాప్రపూర్ణ బిరుదాంకితులు శివరామారావు గారు. గౌతమి అనే కలం పేరుతో ఆయన రచనలు చేశారు. 600కు పైగా రేడియో నాటకాలను అందించారు.

గోపిక మనో భావనలను తెలిపే ఎన్నో లలిత గీతాలు వచ్చాయి. వాటిలో శివరామారావు గారి ఈ గీతం ప్రత్యేకమైనది. కృష్ణ భక్తిలో స్వామిపై ఉండే అధికారము, స్వామికి ఆత్మ నివేదన, ప్రేమానురాగాలు అనన్యమైనవి. అవే భావనలను కవి ఈ గీతంలో అద్భుతంగా ఆవిష్కరించారు. స్వామి తీయని పాటల కోసం అర్థరాత్రి ఒంటరిగా వచ్చిన గోపిక స్వామిని తన మనసు రంజిల్ల జేసేలా పిల్లనగ్రోవి ఊది పాడమని వేడుకుంటుంది. తన మనసు, తనువు, జీవితము అన్నీ స్వామివే అని తెలుపుతుంది. చీకటి వేళలో, ఆకాశంలో మబ్బులు మూగినా వాటిని లెక్క చేయక స్వామి తలపులే వెలుగుగా చూస్తూ ఆయన కోసమై వచ్చాను అని తెలియజేస్తుంది. మేఘముల మెరుపే గోపికగా, స్వామిపై ప్రేమయే సఖిగా తోడ్కొని తనను స్వామి దరికి తెచ్చెనని, తన నోములు పండాయని, పిల్లనిగ్రోవి ఊది పాడమని ఆ నల్లనయ్యను ప్రార్థిస్తుంది.   ఆత్మ నివేదన మధురభక్తికి సూచిక. నేను అన్న భావన మరచి, ధైర్యంగా స్వామి దరికి చేరుకునే గోపికల మనోభావనలను సూచించే గీతం ఇది. ఇక రావు బాలసరస్వతి గారి గానం ఈ భావానికి సాధనమైతే? అదో రసరమ్య గీతమే. కృష్ణభక్తిని అక్షర లక్షలుగా ప్రకటితం చేసిన బాలసరస్వతి గారి గానం లలిత సంగీత ప్రపంచంలో మకుటాయమానం. పట్టులాంటి మృదువైన గాత్రం వారిది. ముఖ్యంగా సాలూరి వారి గీతాలకు వారి గళం ఎంత నప్పుతుందో. ఈ గీతం ఎవరు స్వరపరచారో తెలియదు కానీ కళ్యాణి రాగంలో ఉంది కాబట్టి సాలూరి వారే అనుకుంటున్నాను. వారికి కళ్యాణి రాగమంటే ప్రాణం. గీతం వింటుంటే సాలూరి వారి ఛాయలు స్పష్టంగా తెలుసుతున్నాయి. లలిత సంగీతపు స్వర్ణయుగంలో బాలసరస్వతి గారి ఆణిముత్యపు గీతాలలో ఒకటైన నల్లని వాడా విని ఆస్వాదించండి. కృష్ణభక్తిలో తరించండి. 

భవనుత నా హృదయమున రమింపుము - త్యాగరాజస్వామి కృతి

భవనుత నా హృదయమున రమింపుము బడలిక దీర భవతారక నాతో బహుపల్కిన బడలిక దీర కమల సం"భవనుత" పవనసుతప్రియ తనకై తిరిగిన బడడలిక దీర భవనము చేరి న...