నిండు పున్నమి పండు వెన్నెలలో
నిను చేరగ నేనెటుల రాగలనో
నీలి నీలి ఆకసము నీడ నే కాలి సవ్వడి లేక రాబోతే
దొంగ తారలు తొంగిచూచెను చందమామ దారికాచెను
తెల్లతెల్లని బొండు మల్లెలతో తనువెల్లా చల్లగా దాచుకుంటేను
నల్ల నల్లని గండు తుమ్మెదలు నా వెంట పడి గల్లంతు చేసెనో
మనసు నీకై పరుగు తీసెనో నా తనువు నీకై వేచెను
- దాశరథి కృష్ణమాచార్యులు
రాధ మనసును ఎంత అందంగా ఆవిష్కరించారో కవి! పున్నమి రేతిరి స్వామికై వేచి యున్న రాధ తన మనోగతాన్ని స్వామికి ఈ గీతం ద్వారా విన్నవించుకుంది. నీలి ఆకాశపు నీడలో చప్పుడు లేకుండా స్వామి వద్దకు రాధ రాబోగా తారలు దొంగతనంగా తొంగి చూచాయట, చందమామ దారి కాచాడట. తెల్లని మల్లెలు ధరించి తన తనువును దాచుకోగా నల్లని గండు తుమ్మెదలు ఆ మల్లెలకోసం వచ్చి ఆమె వెంటపడ్డాయట. తన మానసము ఆ స్వామికై పరుగు తీసిందట, తనువు స్వామికి వేచి ఉన్నదట. మధురభక్తికి రాధ దర్పణమైతే తెలుగుదనంతో దాశరథి గారు ఆ రాధ ఆరాధనను హృద్యంగా ఈ లలిత గీతం ద్వారా ఆవిష్కరించారు. ఇక రావు బాలసరస్వతి గారంటేనే లలిత సంగీతం గుర్తుకు వస్తుంది. వారు తమ అమృత గానంతో ఈ రాధ గీతికకు శాశ్వతత్వాన్ని ఆపాదించారు.
తెలుగుదనానికి లలితగీతాలు అసలైన నీరాజనాలు. అటువంటి గీతమే ఈ నిండు పున్నమి పండు వెన్నెలలో అనే గీతం. లలిత గీతాలకు ప్రాణప్రతిష్ఠ చేసి తారాస్థాయికి తీసుకువెళ్లింది ఆకాశవాణి మరియు ఆ సంస్థలో పని చేసిన కళాకారులు. ఆకాశవాణిలో ప్రసారమైన వందలాది గీతాలు ప్రజల మనసులు దోచుకొని లలిత భావనలను సామాజంలో పెంపొందించేలా చేశాయి. పౌర్ణమి వచ్చేసింది, నిండు పున్నమిలో రాధ మానస మాలికను రావు బాలసరస్వతీదేవి గారి గళంలో జాలువారగా విని ఆస్వాదించండి. ఇది ఆకాశవాణి ప్రసారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి