నల్లని వాడా! నే గొల్ల కన్నెనోయ్! పిల్లన గ్రోవూదుమోయ్! నా యుల్లము రంజిల్లగా!
నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగ వచ్చితినే!
నా మనసు తనువు నా మనికే నీది కదా పిల్లన గ్రోవూదుమోయ్!! నల్లనివాడా!!
ఆకసాల మబ్బులనీ చీకటులే మూగెననీ!
నేనెరుంగనైతిని నీ తలపే వెలుంగాయె పిల్లన గ్రోవూదుమోయ్! నల్లనివాడా!!
మెరుపే నీ గోపికయై వలపే నా నెచ్చెలియై!
తోడి తెచ్చె నీ దరికీనాడు పండె నా నోములు పిల్లన గ్రోవూదుమోయ్!! నల్లనివాడా!!
- వింజమూరి శివరామారావు గారు
గోపిక మనో భావనలను తెలిపే ఎన్నో లలిత గీతాలు వచ్చాయి. వాటిలో శివరామారావు గారి ఈ గీతం ప్రత్యేకమైనది. కృష్ణ భక్తిలో స్వామిపై ఉండే అధికారము, స్వామికి ఆత్మ నివేదన, ప్రేమానురాగాలు అనన్యమైనవి. అవే భావనలను కవి ఈ గీతంలో అద్భుతంగా ఆవిష్కరించారు. స్వామి తీయని పాటల కోసం అర్థరాత్రి ఒంటరిగా వచ్చిన గోపిక స్వామిని తన మనసు రంజిల్ల జేసేలా పిల్లనగ్రోవి ఊది పాడమని వేడుకుంటుంది. తన మనసు, తనువు, జీవితము అన్నీ స్వామివే అని తెలుపుతుంది. చీకటి వేళలో, ఆకాశంలో మబ్బులు మూగినా వాటిని లెక్క చేయక స్వామి తలపులే వెలుగుగా చూస్తూ ఆయన కోసమై వచ్చాను అని తెలియజేస్తుంది. మేఘముల మెరుపే గోపికగా, స్వామిపై ప్రేమయే సఖిగా తోడ్కొని తనను స్వామి దరికి తెచ్చెనని, తన నోములు పండాయని, పిల్లనిగ్రోవి ఊది పాడమని ఆ నల్లనయ్యను ప్రార్థిస్తుంది. ఆత్మ నివేదన మధురభక్తికి సూచిక. నేను అన్న భావన మరచి, ధైర్యంగా స్వామి దరికి చేరుకునే గోపికల మనోభావనలను సూచించే గీతం ఇది. ఇక రావు బాలసరస్వతి గారి గానం ఈ భావానికి సాధనమైతే? అదో రసరమ్య గీతమే. కృష్ణభక్తిని అక్షర లక్షలుగా ప్రకటితం చేసిన బాలసరస్వతి గారి గానం లలిత సంగీత ప్రపంచంలో మకుటాయమానం. పట్టులాంటి మృదువైన గాత్రం వారిది. ముఖ్యంగా సాలూరి వారి గీతాలకు వారి గళం ఎంత నప్పుతుందో. ఈ గీతం ఎవరు స్వరపరచారో తెలియదు కానీ కళ్యాణి రాగంలో ఉంది కాబట్టి సాలూరి వారే అనుకుంటున్నాను. వారికి కళ్యాణి రాగమంటే ప్రాణం. గీతం వింటుంటే సాలూరి వారి ఛాయలు స్పష్టంగా తెలుసుతున్నాయి. లలిత సంగీతపు స్వర్ణయుగంలో బాలసరస్వతి గారి ఆణిముత్యపు గీతాలలో ఒకటైన నల్లని వాడా విని ఆస్వాదించండి. కృష్ణభక్తిలో తరించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి