నా చిన్నతనంలో ఆవిడ పాట కోసం ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలలో మా కుటుంబమంతా ఎదురు చూసే వాళ్లము. వారి వ్యక్తిత్వం ఎంత నిండైనదో వారు పాడే పద్ధతిలో, వారి నడవడికలో అర్థమవుతుంది. హుందాతనానికి వారు ప్రతిబింబం. పరిచయం లేకపోయినా వారిని చూడగానే గౌరవభావం కలుగుతుంది. లలిత సంగీతానికి, లాలిపాటలకు మారు పేరు వారు. ప్రఖ్యాత లలిత భక్తి సంగీత గాయని శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గారి విశేషాలు ఈరోజు.
కన్నడ దేశంలో పుట్టి పెరిగి, తెలుగు భాష నేర్చుకొని లలితసంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న గాయనీమణి వేదవతి ప్రభాకర్ గారు. మైసూరు-బెంగుళూరు మధ్య గల రామనగరిలో రుక్మిణి-శ్రీకంఠయ్య దంపతులకు వేదవతి గారు జన్మించారు. బెంగుళూరులో పెరిగిన వీరు అక్కడే పదేళ్ల వయసునుండి చెన్నమ్మ గారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. వీరి తరువాతి గురువు ముద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు. శ్రీకంఠయ్య గారు బెంగుళూరు గాయన సమాజంలో సభ్యునిగా ఉండటంతో పిల్లలను ప్రతి వారమూ గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల కచేరీలకు తీసుకు వెళ్లేవారు. కానీ, అప్పటి కుటుంబపు కట్టుబాట్ల వల్ల వేదికలెక్కి పాడలేకపోయారు. వివాహం ఐపీఎస్ ఆఫీసర్ అయిన రొద్దం ప్రభాకరరావు గారితో జరగటంతో తెలుగునాట ప్రవేశం జరిగింది. మారుమూల ప్రాంతాలలో ఉండవలసి రావటంతో తెలుగు నేర్చుకోవలసి వచ్చింది. అత్తమామలు కళలపట్ల ఆసక్తి కలవారు కావటంతో వారు వేదవతి గారిలోని సంగీత ప్రతిభను బాగా ప్రోత్సహించారు. అనంతపురంలో అత్తమామల దగ్గరకు వెళ్లినప్పుడల్లా వారు వేదవతి గారి కోసం సంగీత గురువును రప్పించే వారు, వారికి కొన్ని కృతులు నేర్చుకునే అవకాశం కల్పించేవారు. భర్తకు నిరంతరం బదిలీలు వచ్చే ఉద్యోగం కావటంతో వారి ఈ సంగీత సాధనకు అంతరాయాలు వచ్చాయి.
ఒకసారి అప్పటి భారత రాష్ట్రపతి, వారి సతీమణి విజయవాడ వచ్చిన సందర్భంలో రోటరీ వారి సభలో అప్పటి ప్రఖ్యాత గాయని శ్రీరంగం గోపాలరత్నం గారు పాడవలసి ఉండగా ఆవిడ జ్వరంతో రాలేకపోవటంతో వేదవతి గారు అప్పటికప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనను పాడవలసి వచ్చింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ వారిని ఆకాశవాణిలో పాడవలసిందిగా ఆహ్వానించారు. తెలుగుభాష పూర్తిగా రాకపోవటంతో ఆవిడ శ్రీరంగం గోపాలరత్నం గారి సోదరులు శ్రీరంగం గోవిందాచార్యుల వారి వద్ద తెలుగు భాషతో పాటు 15 పాటలు నేర్చుకుని పాడారు. అతి తక్కువ సమయంలోనే ఆకాశవాణి బీ గ్రేడ్ కళాకారిణిగా గుర్తించబడ్డారు. నేదునూరి వారు స్వరపరచిన అన్నమాచార్య కీర్తనలు, బాలమురళి గారు స్వరపరచిన ఇతర గీతాలను ఆవిడ పాడారు. గొప్ప గొప్ప కళకారుల సహచర్యంలో ఆకాశవాణి ద్వారా సేవలందించారు. తరువాత వారు తెలుగు మరియు కన్నడ చిత్రాలలో సాంప్రదాయ గీతాలు పాడారు. జాతీయ స్థాయిలో వారికి అవకాశం జీవీ అయ్యరు గారి ఆదిశంకరాచార్య చిత్రంలో వచ్చింది. ఆ చిత్రంలో కనకధారా స్తోత్రం శ్లోకాలతో పాటు మరెన్నో శ్లోకాలను వేదవతి గారు ఆలపించారు. రామకృష్ణ మఠం వారి ప్రైవేట్ ఆల్బం, తితిదే వారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు, పురందరదాసుల కృతుల క్యాసెట్లు పాడారు. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ కళాకారిణిగా ఎంతో పేరొందారు. భర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీ అయినా వేదవతి గారిని ఎంతో ప్రోత్సహించారు. వీరు మంత్రాలయంలో గురు శుక్రవారాలలో నాద నమన అనే కార్యక్రమాన్ని ఆరంభించి ఔత్సాహికులైన కళాకారులకు ప్రోత్సాహం కలిగించారు. వేదవతి గారు పాలగుమ్మి విశ్వనాథం గారి వద్ద కూడా శిక్షణను పొందారు.
ఇక వేదవతి గారి గాత్ర వైశిష్ట్యానికొస్తే - శ్రావ్యమైన శాస్త్రీయ సంగీతంతో పాటు మనసును హత్తుకునే లలిత భావ గీతాలకు వారి గాత్రం పెట్టింది పేరు. భావాన్ని అద్భుతంగా ఒలికించే వారి గానం శ్రోతలను ఆనందంలో ఓలలాడిస్తుంది. పాలగుమ్మి వారి రచన, సంగీతంలో వచ్చిన "అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ" అన్న పాటను వేదవతి గారు పాడిన రీతి దశాబ్దాలైనా ఇప్పటికీ తెలుగువారి హృదయాలను తాకుతూనే ఉంది. ఓ ఆడబిడ్డ యొక్క తల్లి మనసును ఆవిష్కరించే ఈ గీతం ఆ తల్లీ-కూతుళ్ల మధ్య గల బంధంలోని భావనలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. పాలగుమ్మి వారి సాహిత్య సంగీతాలతో కలసి వేదవతి గారి గానం తెలుగువారి మనసులను హత్తుకొని హృదయాలను కరిగిస్తుంది. దేవులపల్లి వారి పూవులేరి తేవే చెలి పోవలె కొవలెకు, మధూదయంలో మంచి ముహూర్తం వంటి అద్భుతమైన లలిత గీతాలు, శివపాదమునుంచ నేను శిలనైనా కారాదా అన్న అరిపిరాల విశ్వం గారి భక్తి లలిత గీతం, జో అచ్యుతానంద జో జో ముకుందా అనే అన్నమాచార్యుల వారి కృతి మొదలైనవి వేదవతి గారి గళంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. జో జో ముకుందా అన్న ఆల్బంలో ఉన్న ప్రతి గీతమూ వారి గాత్ర సౌందర్యానికి ఉదాహరణలు. తప్పకుండా బిడ్డలు అన్నీమరచి నిద్రపోయేలా ఉంటాయి. వింజమూరి శివరామారావు గారి మధురానగరి సమీపంలో అనే గీతం కూడా వీరి గాత్ర సౌరభాన్ని ఆవిష్కరిస్తుంది. వేదవతి గారి మంగళహారతులు కూడా ఎంతో పేరు పొందాయి. శీతాద్రి శిఖరాన అన్న బేతవోలు రామబ్రహ్మం గారి హారతిని బాలమురళి గారి తరువాత వేదవతి గారు పాడిన రీతి తెలుగు నాట దేవాలయాలలో మారు మ్రోగింది. నేదునూరి వారి వద్ద నేర్చుకున్న అన్నమాచార్యుల వారి "పలుకు తేనెల తల్లి" అనే సంకీర్తన వేదవతి గారి గాత్రంలో ఎంతో ప్రాచుర్యం పొందింది.
ఆకాశవాణిలో భక్తిరంజనితో పాటు అనేక లలిత సంగీత కార్యక్రమాలలో వేదవతి గారు పాడారు. మీరాబాయి భజనలను సి. నారాయణ రెడ్డి గారు అనువదించగా పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో వేదవతి గారు పాడారు. ఈ గీతాలు ఎంతో పేరుపొందాయి. ఇవి విన్న హెచ్.ఎం.వీ కంపెనీలో పని చేసే మంగపతి గారు వేదవతి గారి చేత ఈ సినారె గారి మీరా గీతాలను పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాడించారు. తిరుప్పావై, దేవీ స్తోత్రాలు, భజనలు వీరికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. అమెరికా, కెనడా, ఇంగ్లండు దేశాలతో పాటు అనేక ప్రాంతాలలో 1000కి పైగా కచేరీలలో వేదవతి గారు పాడారు. 2012లో ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, అపురూప అవార్డు, తెలుగు కళాసమితి వారి కేవీరావు-జ్యోతి రావు అవార్డు మొదలైన పురస్కారాలను వేదవతి గారు పొందారు. సుదీర్ఘమైన సంగీత ప్రస్థానంలో వేదవతి గారు లబ్దప్రతిష్ఠులు, ఎన్నేళ్లైనా వారి గాత్రంలో మాధుర్యం అలానే నిలిచి ఉండటం వారి సాధనను, జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. వేదవతి-ప్రభాకరరావు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వేదవతి గారికి ఆ భగవంతుడు మరింత సేవా భాగ్యాన్ని, గాత్ర సౌలభ్యాన్ని ప్రసాదించాలని శుభాకాంక్షలు.
సర్, చక్కటి వ్యాసం అందించారు. నెనరులు _/\_.
రిప్లయితొలగించండి