2, ఆగస్టు 2017, బుధవారం

పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను - అన్నమయ్య సంకీర్తన


పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయెనిపుడు

వెన్నలారగించబోయి వీధులలో దిరిగేనో
యెన్నరాని యమునలో యీదులాడీనో
సన్నల సాందీపనితో చదువగబోయినాడో
చిన్నవాడాకలి గొని చెలులాల యిపుడు

మగువల కాగిళ్ళ మరచి నిద్దిరించీనో
సొగిసి ఆవుల గాచే చోట నున్నాడో
ఎగువనునుట్లకెక్కి యింతులకు జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయెనిపుడు

చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె యింటనున్నాడో
అందపు శ్రీవేంకటేశుడాడివచ్చెనిదె వీడే
విందుల మా పొత్తుకు రా వేళాయెనిపుడు

ఓ గోపికలారా! కృష్ణుని పేరు పెట్టి పిలవండి! భోజనము చేసే సమయమైంది. గోపకులంలోని యిళ్లలో వెన్న ఆరగించటానికి వెళ్లాడో లేక ఘనమైన యమునలో ఈత కొడుతున్నాడో, సంజ్ఞలు చేసే సాందీపనితో చదువుకోవటానికి వెళ్లాడో, ఇపుడా చిన్నవాడు ఆకలి గొని ఉంటాడు, వాడిని పిలవండి. గోపికల కౌగిళ్లలో ఆదమరచి నిద్రించియున్నాడో, చక్కగా ఆవులను కాచే చోట ఉన్నాడో, పైనున్న ఉట్లెక్కబోయి స్త్రీలకు చిక్కాడో, సగము వేడిగా ఉన్న కూరలు చల్లబడిపోతున్నాయి, వాడిని పిలవండి చెలులారా! నెమలి పింఛాలను సిగలో సింగారించుకుంటున్నాడో, ఇంతలోనే దేవుడిలా ఇంట్లోనే ఉన్నాడో, అందమైన శ్రీవేంకటేశ్వరుడు ఇదిగో ఆడుకొని వచ్చినాడు, విందు చేయటానికి మా దగ్గరకు వచ్చే వేళైంది. వాడిని పిలవండి చెలులారా!

తాళ్లపాక అన్నమాచార్యుల వారు

అన్నమయ్య మధురభక్తిలో కాసేపు తల్లిగా, కాసేపు గోపికగా, కాసేపు భక్తునిగా వేర్వేరు పాత్రలలో లీనమై స్వామిని ఆరాధించాడు. ఇక్కడ తల్లి యశోదగా స్వామిపై ఆ అమ్మ ప్రేమను, ఆతని ఆకలి దప్పులు తీర్చే ఆతృతను మనకు అన్నమయ్య తెలియజేశారు. యశోద ఆ బాలుడు శ్రీహరి అని తెలిసినా మాయలో పడి ఆతనిని తన శిశువుగా లాలించింది, అతనికి మాతృప్రేమను పరిపూర్ణంగా అందించింది. తన బిడ్డ ఎక్కడున్నాడో, భోజనం చేసే సమయమైందని ప్రతి తల్లీ ఆతృతతో వేచియుంటుంది. ఇక్కడ ఆ బాలుడు లీలామానుష రూపుడై ఉన్నప్పటికీ ఆతనిపై అవ్యాజమైన ప్రేమతో అందరి తల్లులలాగానే ఆమె వానిని పిలువమని చెలులకు చెబుతుంది. వెన్నను దొంగిలించటం, సాందీపని మొదలైన వారితొ చదువుకోవటంలో, యమునలో జలక్రీడలలో, గోపికల కౌగిళ్లలో, గోవులను కాయటంలో, స్త్రీల బందీలో ఎక్కడ ఉన్నాడో వాడు, ఆహార పదార్థాలు చల్లబడిపోతున్నాయి అని తల్లి మనసును అద్భుతంగా ఆవిష్కరించారు అన్నమయ్య. అనేక రకములైన భావనలను స్వామికి సమర్పించి మధురభక్తిలో అన్నమయ్య తరించారు. ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా గానం చేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి