రజనీ - ఆ పేరే తెలుగునాట లలితసంగీతానికి మారుపేరు. దేశభక్తి, లలిత గీతాలకు రజనీ హృదయం పుట్టినిల్లు. స్వాతంత్య్ర పూర్వము నుండి తొంభయ్యవ దశకం వరకు తెలుగునాట ఆకాశవాణి ద్వారా మారుమ్రోగిన పేరు బాలాంత్రపు రజనీకాంతరావు గారిది. ఆయన భారతావని స్వతంత్ర జాతిగా ఆవిర్భవించినప్పుడు రచించిన దేశభక్తి గీతం మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి. సంగీతం కూడా ఆయనే కూర్చారు. ఈ గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి గారు ఆలపించారు. రజనీ గారి బహుముఖ ప్రజ్ఞ ఆయన గీతాల సాహిత్యంలో, సంగీతంలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. భరతమాతకు ఈ గీతంలోని అద్భుతమైన పదాల ద్వారా రచయిత తన నివాళులను సమర్పించారు. ఈనాటి తరాల వారికి ఇటువంటి గీతాలు, వాటి అర్థాలు తెలియజేస్తే మన ముందు తరాల వారు ఈ భారతావనికి ఎటువంటి సేవ చేశారో తెలుస్తుంది. కొంతైనా దేశభక్తి అలవడుతుంది. టంగుటూరి సూర్యకుమారి గారు ఆనాడు నటనలో, గానంలో, నృత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారు పాడిన దేశభక్తి గీతాలు ఈనాటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోయాయి. రజనీ, శంకరంబాడి సుందరాచారి, బసవరాజు అప్పారావు, గురజాడ అప్పారావు, నిడదవోలు వెంకటరావు, అడవి బాపిరాజు, రాయప్రోలు సుబ్బారావు వంటి మహనీయుల సాహిత్యం సూర్యకుమారి గారి గళంలో అద్భుతంగా జాలువారింది. రజనీ గారు చాంద్రమానం ప్రకారం శతసంవత్సరాలు పూర్తి చేసుకుని హైదరాబాదులో నివసిస్తున్నారు. ఆయన ప్రముఖ తెలుగు కవి ద్వయమైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి కుమారుడు. రజనీ కళాప్రపూర్ణ బిరుదాంకితులు. వారికి ఒక్క పద్మ అవార్డు రాకపోవటం ఎంతో శొచనీయం. సూర్యకుమారి గారంటే శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం యొక్క అద్భుతమైన గానం గుర్తుకొస్తుంది. వీరు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి సోదరుని కుమార్తె. సూర్యకుమారి గారు 1960వ దశకం నుండి లండన్‌లో స్థిరపడి 2005లో మరణించారు. రజనీ-సూర్యకుమారి గార్ల సమన్వయంలో వెలువడిన మాదీ స్వతంత్ర దేశం గీత సాహిత్యం, ఆడియో.
మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి
భారతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం
వింధ్య హిమవత్ శ్రీనీలాద్రుల
సంధ్యారుణిత నవాశలు మావి
గంగా గోదావరీ సహ్యజా
తుంగ తరంగిత హృదయాల్ మావి
ఆలయమ్ముల శిల్పవిలాసం
ఆరామమ్ముల కళాప్రకాశం
మొగల్ సమాధుల రస దరహాసం
మాకు నిత్య నూతనేతిహాసం
అహింసా పరమో ధర్మః
సత్యంవద ధర్మంచర
ఆదిఋషుల వేదవాక్కులు
మా గాంధి గౌతముల సువాక్కులు
స్వతంత్రతా భ్రాత్రుత్వాలు
సమత మా సదాశయాలు
జననీ ఓ స్వతంత్ర దేవి
గొనుమా నివ్వాళులు మావి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి